స్మైల్ పద్యం మళ్ళీ చదివిన తరవాత

స్మైల్ చచ్చిపోయాడని పత్రికలన్నీ చెప్పాయి. స్నేహితులందరూ చెప్పారు. వ్యావహారికంగా నాకీ సంగతి తెలుసు. కానీ లోపల్లోపల నాకు ఆ మాట మీద నమ్మకం లేదు. స్మైల్ చచ్చిపోలేదు. రాజమండ్రి వెళ్ళగానే అతను నాకు కనిపిస్తాడు. లేదా నేను వొచ్చానని చెప్తే, హైదరాబాదు వొచ్చి నన్ను పలకరిస్తాడు, ఎప్పటికి మల్లే నవ్వుతూ. ఈమాట వ్యావహారికంగా నిజం కాదు, కానీ నా లోపల లోపల నిజం. స్మైల్‌ని తలుచుకున్నప్పుడల్లా అనిపించే నిజం. స్మైల్ పద్యాలు మళ్ళీ మళ్ళీ చదువుతుంటే అనిపించే నిజం.

1991లో, “రమించేసుకున్నాం కదా – ప్రపంచం కావాలిప్పుడు” రచన మొదటి సంచికలో పడింది. నేనావేళ హైదరాబాదులో వున్నాను. అది చదవగానే స్మైల్‌కి ఫోన్ చేశాను (అతనప్పుడు హైదరాబాదులో వుండేవాడు) “నువ్వు ఇంట్లో ఉంటావా? నీతో మాట్లాడాలి” అని. నిజానికి మాట్లాడవలసింది ఏవుంది? నీ పద్యం బాగుంది, చాలా చాలా బాగుంది అని చెప్పడం తప్ప. ఆ పద్యం రాసిన కవిని చూడాలనే కోరిక తప్ప.

స్మైల్‌ని కలుసుకున్నాను. మేడ మెట్లెక్కడం పూర్తి కాకముందే అతన్ని చూసి – ఉత్సాహంగా పలకరిస్తూ “నీ పద్యం బాగుంది” అని మళ్ళీ మళ్ళీ చెప్పాను. కవిపొగడ్తను ప్రోత్సహించే స్వభావం కాదు స్మైల్‌ది అని, అతని మొహం చూస్తుంటే గుర్తొచ్చింది. అతను నవ్వుతూ “అదేముంది లేండి” అని సర్దేసి మామూలు సంభాషణలోకి మాటలు మార్చేశాడు. అప్పుడు అతనితో చెప్పడానికి వీలుపడని మాటలు ఇప్పుడు రాస్తున్నాను, చదివి ఏమనుకుంటాడో.

ఒక కవి పద్యం మీద అభిప్రాయం చెప్పడానికి ఆ కవి ఎదురుగా లేకపోవడం ఒకరకంగా ఉపకారమేనేమో. శారీరకంగా, మానసికంగా, ఆ కవి పరోక్షంగా వుండడం, చెప్పే విషయం కూడా, కొంత గోప్యంగా, బహ్వర్థకంగా ఉండడం – మనసులో మాట తిన్నగా పైకి చెప్పడానికి ఉపకరిస్తుంది. భాషే నిజానికి మాటల్ని కప్పుతుంది. అంతకన్నా తేలిగ్గా కప్పుతుంది – అప్రత్యక్షత.

భవభూతి తన శ్లోకాన్ని కాళిదాసు అభిప్రాయం కోసం పంపితే, ఆ మహాకవి ఆ శ్లోకం చూసి ఏమీ అనకుండా వూరుకున్నాడట. ఆ శ్లోకం పట్టికెళ్ళిన సేవకుడు చాలాసేపు ఎదురు చూసి తిరిగి వెనక్కి వెళ్ళి, “కాళిదాసుగారు తమ శ్లోకం చదువుకున్నారు గానీ ఏమీ చెప్పలేదయ్యా” అని భవభూతితో విన్నవించుకున్నాడట.

“ఏమీ అనలేదా! శ్లోకం సంగతి సరే, నువ్వు అక్కడ వున్న సమయంలో ఆయన ఏమీ మాట్లాడలేదా?” అని భవభూతి అడిగాడట – ఆత్రంగా.

“నేనక్కడ ఉన్న సమయంలో ఒక దూతి వచ్చి ఆయనగారి ప్రియురాలు పంపిన తాంబూలం ఆయనకి ఇచ్చారండి. ఆయన అది వేసుకొని, మీ పద్యం చదువుతూ ‘కొంచెం సున్నం ఎక్కువయింది’ అన్నారండీ” అని చెప్పాడు సేవకుడు.

భవభూతి పంపిన శ్లోకం ఇది:

కిమపి కిమపి మందం మందమాసక్తి యోగా
దవిరల కపోలం జల్పతో రక్రమేణ
అశిథిల పరిరంభ వ్యాపృతైకైకదోష్ణో
రవిదిత గతయామా రాత్రి రేవం వ్యరం సీత్

భవభూతికి వెంటనే భోధపడింది – తన శ్లోకంలో ఒక సున్నా ఎక్కువగా ఉందనీ, అది తీసేస్తే శ్లోకం ప్రశస్తంగా ఉంటుందనీ.

‘రాత్రి రేవం వ్యరం సీత్’ అనే శ్లోకపాదంలోంచి సున్నా తీసేస్తే ‘రాత్రి రేవ వ్యరం సీత్’ అయింది. దాంతో ఆ శ్లోకం కావ్యత్వాన్ని పొందిందని భవభూతి సంతోషించాడట.

ఇది చాలా సున్నితమైన పద్యం. ఉత్తర రామ చరిత్రలో చాలా సున్నితమైన సందర్భం లోనిది. రాముడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు అడివిలో – సీతతో ఏకాంతంగా గడిపిన అపురూప సన్నివేశాన్ని. సీతారాములు మామూలు నాయికా నాయకులు కారు. వాళ్ళ ప్రణయం మామూలు స్త్రీ పురుషుల మధ్య ప్రేమలా ఉండదు.

అసలు ప్రణయమే సున్నితమైనది. అందులోనూ శారీరకమైన కలయిక ఇంకా సున్నితమైనది. ఏ మాత్రం మాటమీరినా అది మోటుబారిపోతుంది. మోటుమాటలు మానేసినా మోటుబారిపోతుంది. మాట విలువ తెలిసి ఏ సందర్భంలో ఏ అక్షరం వాడాలో చూసి వాడే సమర్థుడైన కవికి మాత్రమే ఇంత సున్నితమైన సందర్భాన్ని మాటల్లో చెప్పడం సాధ్యం.

స్త్రీపురుషుల శరీరాల కలయిక ప్రత్యక్షంగా చెప్పకుండా, ప్రణయాన్ని చాటుచేసుకునే అలవాటు సినిమా దర్శకులకి ఉన్నట్టే, కవులకీ ఉంది. కానీ ఎట్ట ఎదురుగా వర్ణించగల వాళ్ళు కొద్ది మంది అయినా ఉన్నారు: భవభూతి, అన్నమయ్య, పెద్దన్న, స్మైల్.

స్త్రీపురుష సంయోగసమయం సకల జగత్ప్రకృతీ పరమ సమస్థితిలో వుండే సమయమని, దానికి అవాంతరం కల్పించడం దుర్మార్గమనీ భారతీయ కవుల విశ్వాసం.

ఎందే డెందము కందళించు రహిచే నేకాగ్రతన్‌ నిర్వృతిం
జెందుం కుంభగత ప్రదీపకళికాశ్రీ దోప నెందెందు పో
కెందే నింద్రియముల్‌ సుఖంబు గను నా యింపే పరబ్రహ్మ, “మా
నందో బ్రహ్మ” యటన్న ప్రాఁజదువు నంతర్బుద్ధి నూహింపుమా

అన్న మాటలు వరూధిని మాటలుగా పెద్దన్న గారు చెప్పిన రహస్యం ఇది. రతిసమయంలో మనసు కుండలో పెట్టిన దీపంలా – గాలి తాకిడికి నిరంతరం కదిలే దీపంలా క్షణక్షణం రకరకాల చిత్రవృత్తులకు లోను కాకుండా – సుఖం పొందుతుంది. ఆ స్థితిని సరియైన మాటల్లో చెప్పగలిగితే తప్ప – అసలు ఏమాటా వాడలేని కవీ, తప్పు మాటలు వాడే కవీ ఒక్కలాంటి అసమర్థులే.

వాల్మీకికి తీవ్రమైన విషాదం కలిగి నిషాదుణ్ణి శపించిన సంఘటన ఒక్కసారి గుర్తు చేసుకోండి. రెండు పక్షుల్లో ఒకదానిని సంయోగ సమయంలో చంపడం నిషాదుడు చేసిన ఘోరం. వాల్మీకికి అడివి కొత్త కాదు – నిషాదుడికి పక్షుల్ని చంపడం తప్పు కాదు. కానీ, ఈ పక్షిని ఆ నిషాదుడు సమయం కాని సమయంలో చంపాడు. వాల్మీకిని కలచివేసినది అది.

ఇంత సున్నితమైన సర్వ ప్రాణి సహజమైన విషయాన్ని అంత సున్నితంగానూ చెప్పిన ఇద్దరు కవుల పద్యాలని చూద్దాం. ఒకరు – అల్లసాని పెద్దన్న. రెండవ కవి – స్మైల్.

వరూధిని మోహించిన ప్రవరుడు వెళ్ళిపోయాడు. అంతకు ముందు వరూధినిని మోహించి ఆమె చేత తిరస్కరించబడిన గంధర్వుడు ఇదే అదననుకొని ప్రవరుడి వేషం వేసుకుని వచ్చాడు. ప్రవరుడే వచ్చాడనుకుంది వరూధిని. రతి సమయంలో నిజస్వరూపం వొస్తుంది. అంచేత తన మాయ నిలవదని గంధర్వునికి తెలుసు. [ఈమాట అందరికీ నిజమే. రతి సమయంలో నిజ స్వరూపం అందరికీ వొస్తుంది]. అందుకని మాయాప్రవరుడు ఒక నియమం పెట్టాడు. ఆ సమయంలో వరూధిని కళ్ళు మూసుకోవాలి అని. కానీ ఆ నియమం రతి పారవశ్యంలో వరూధిని కళ్ళు మూసుకోవడం దానంతట అదే నెరవేరిందట [ఆలాపగతిఁ జొక్కు నఱమోడ్పుఁ గనుదోయి రతిపారవశ్య విభ్రమముఁ దెలుప అని వరూధిని గురించి పెద్దన్న గారు అంతకు ముందే చెప్పారు].

వరూధిని మాయాప్రవరుల కలయికని పెద్దన్న గారు చెప్పిన పద్యం చూద్దాం:

సహసా నఖంపచ స్తనదత్త పరిరంభ
        మామూల పరిచుంబితాధరోష్ఠ
మతిశయప్రేమ కల్పిత దంత సంబాధ
        మగణితగ్లాని శయ్యానిపాత
మతివేల మణిత యాచ్ఞార్థ గల్లచపేట
        మతిదీన వాక్సూచితాత్మవిరహ
మంకుర త్పులక జాలావిద్ధ సర్వాంగ
        మానంద కృతహారవాననాబ్జ

మాక్రమక్షీణ నుతివర్ణ మానిమీలి
తాక్ష మాస్విన్న గండ మాయత్త చేష్ట
మాస్తిమిత భూషణారవ మావధూటి
ప్రథమసురతంబు గంధర్వ పతిఁ గరంచె.

ఈపద్యం మొదలు పెట్టిన తరువాత ఎక్కడా ఆగదు. ఒక సమాసం మరొక సమాసంతో విడదీయరాకుండా కలిసిపోయి ప్రతి సమాసం ‘ఆ’ తో మొదలైనా అంతకు ముందున్న సమాసపు చివరి ‘మ’ కారంతో భాగమై పోయి, సంధి విడదీయడానికి గాని, మాట విడమర్చడానికి గాని అవకాశం ఇవ్వదు. పైగా ఈ పద్యం అంతా బోలెడు బహువ్రీహి సమాసాలతో పొట్లాలు కట్టినట్టు, అరలు అరలుగా పొరలు పొరలుగా దొంతర్లు పెట్టినట్టు గాఢంగా కలిసి పోయి వుంటుంది. ఈ నిర్మాణంలో వున్న శబ్ద చాతుర్యం మీకు బోధపడిందనే అనుకుంటాను. ఇది కలయికను చెప్పే పద్యం – అందుకని ఈ వేగం.

జాగ్రత్తగా విప్పండి. ఇందులో ప్రతి సమాసాన్ని. ప్రతి సమాసమూ బహువ్రీహి కాబట్టి ఆ మాటలకి మించిన కథని గూఢంగా చెపుతుంది. అర్థం పైకి బాహాటంగా తెలిసిపోదు. అర్థాన్ని గుట్టుగా దాచుకోడంలో బహువ్రీహికి మించిన సమాసం లేదు. ఇంత చిక్కగా బహువ్రీహుల్ని అడ్డు పెట్టుకున్నట్టు కనిపిస్తున్నా – విప్పి చూస్తే ఏదీ దాచరు పెద్దన్న గారు.

ఇందులో బహువ్రీహులు మొదట్లో పొడుగ్గా వుంటాయి. సహసా నఖంపచ స్తన దత్త పరిరంభము – ఆమూల పరిచుంబితాధరోష్ఠము – అని. చివర్లో ఆనంద కృత “హా” ర వాననాబ్జము దగ్గరికి వొచ్చేసరికి – పద్యం ఇంకా వేగం పుంజుకుంటుంది. ఆ తరువాత వచ్చే బహువ్రీహులు ‘ఆక్రమక్షీణ నుతివర్ణము’ ‘ఆనిమీలితాక్షము’ ‘ఆస్విన్న గండము’ ‘ఆయత్త చేష్టము’. ఒకదానినొకటి తరుముకొస్తున్నట్టుంటాయి. చివర్లో ఈ వేగం ఎందుకో నేను వివరంగా చెప్పక్కర్లేదు.

ఇప్పుడు ఈ పద్యాన్ని ప్రతిపదం సావకాశంగా దాని అర్థాన్ని భావిస్తూ మళ్ళీ చదవండి. అది ప్రబంధ కాలం. సమాసాలకీ, వర్ణనలకీ పేరు మోసిన కాలం. ఇది పదాడంబరం అని ఆధునికులు కట్టమంచి రామలింగారెడ్డి గారి అనుయాయులు తీసిపడేసే కాలం. కొంచెం ఆ ఊహల్ని పక్కకి పెట్టి ప్రతి పదం చెప్పే విశేషం భావించండి. ఇది వర్ణనలా కనిపిస్తుంది. ప్రబంధంలో కథని వర్ణనలు మింగేస్తాయన్న మాట నిజమేననిపిస్తుంది. కాని ఇది వర్ణన కాదు. వర్ణనలా కనిపించే కథనం. బొమ్మ కట్టడానికి వీలయిన అచల వస్తువుని కళ్ళముందు నిలబెట్టే పద్యం కాదిది. నిరంతరం చలన గమ్యమైన శరీరాల కదలికల సన్నివేశాల కథ ఇది. అతి సూక్ష్మమైన, సున్నితమైన కలయికల అనుభవాల దొంతరల గమనం ఇది. ఇది నిశ్చల చిత్రం కాదు. ప్రతి క్షణం మారిపోయే అనుభవాల ప్రవాహం.