వాళ్ళు…

ప్రయాణాలంటే వింతలూ విశేషాలే కాదు.

ప్రకృతీ పరవశమూ మాత్రమే కాదు.

మనుషులు… మనుషులు… మనలాంటి మనుషులు!!


2014. మూడు నాలుగేళ్ళ క్రితం సంగతి.

ఇరవైరెండు గంటల ప్రయాణం తర్వాత బెజవాడలో రైలు దిగాను. బయటకొస్తే ఆటోలు… ఆటోలు… ఒకటీ అరా రిక్షాలు, టాక్సీలు.

“ఎంతా?” రోకళ్ళపాలెం గులాబీ తోటకు అడిగాను.

“వంద.” సూటి సమాధానం.

“మూడు కిలోమీటర్లు కూడా లేదు, వంద మరీ ఎక్కువ!” బ్యాక్‌ప్యాక్ సర్దుకుంటూ ముందుకు కదిలాను.

“ఎంతిస్తారూ…” అంటోన్న ఆటో మనిషిని వినిపించుకోకుండా సాగాను. స్టేషను ప్రాంగణం దాటి రోడ్డు మీదకు వస్తే మరో ఆటో వచ్చి పక్కన ఆగింది. అడిగాను. “ఏభై” అన్నాడు. బేరకుతూహలంతో “నలభయ్యేగదా…” అన్నాను. ‘ఎక్కండి’ అన్నట్టుగా అతని హావభావాలు. ఎక్కాను. ఎక్కడో అనుమానం- తక్కువ ఇస్తున్నానా- అని. దాన్ని కప్పిపుచ్చుకొనే ప్రయత్నమనుకొంటాను… “అంతా కలసి మూడు కిలోమీటర్లు కూడా లేదు. అసలు నలభయ్యే ఎక్కువ. ఏభై అడగడమేంటీ…” సణిగాను.

“సార్, నేను మాట్లాడకుండా ఒప్పుకున్నాగదా, మళ్ళా ఎందుకా విషయం?” మృదువుగా మందలించాడు. చాలామంది ఆటో మనుషుల గొంతులో వినపడని సంయమనం అతని మాటలో కనిపించి నన్ను ఆకర్షించింది. మందలింపులోంచి వెంటనే తేరుకొని అతన్ని మాటల్లో పెట్టాను.

“మీది ఈ ఊరేనా? ఎప్పట్నించీ ఆటో నడుపుతున్నారూ?”

“దగ్గరే, ముస్తాబాద. నాలుగేళ్ళయింది…”

నాలుగేనా? చూస్తే ముప్పై దాటిన మనిషిలా ఉన్నాడే…

“చదువుకొన్నారా? ఏమన్న ఉద్యోగం చేశారా? లేకపోతే ముందునుంచీ ఆటోయేనా?”

వెనక్కి తిరిగి చూశాడు. ఓ క్షణం ఆగి అన్నాడు. “ఇంటరు. మధ్యలో ఆపేశాను. అప్పట్లో బ్రతుకంటే తెలియదుగదా… ఫ్రెండ్సూ సినిమాలూ అల్లరిచిల్లర తిరుగుళ్ళూ. చదువాపాక మెల్లగా ఇంటి పరిస్థితి అర్థమయింది. వ్యవసాయం అంతంతమాత్రం. ఇంట్లో తిండికి కటకట. నాన్నకింకో పనిరాదు. నాకు ఏ పనీ తెలియదు…” మనసు విప్పడం మొదలెట్టాడు.

“ఆ తర్వాత…” ఒక జీవితం ఎరుకలోకి వస్తోందన్న స్పృహ, ఉద్వేగం.

“ఇరవై దాటేశాయి. చదువుకు పనికిరాననిపించింది. ఏమన్న ఉద్యోగం దొరుకుతుందా అని ప్రయత్నించాను. గవర్నమెంటన్న మాట ఎత్తే అర్హత లేదుగదా- ప్రైవేటుగా చిన్నచిన్న ఉద్యోగాలు… ఏదీ స్థిరమైనదిగాదు. నిలకడ ఉన్నది కాదు. అయినా ఎంతోకొంత సంపాదన. చివరికో సినిమా సీడీలు అద్దెకిచ్చే షాపులో నిలదొక్కుకున్నాను. సినిమాల బాగోగులు, ఏవి మంచి సినిమాలు అన్న వివరం అర్థమయ్యాయి. కస్టమర్లు నా మాటమీద పాత సీడీలు తీసుకోవడం, తిరిగొచ్చి థాంక్స్ చెప్పడం… నమ్మకం కుదిరింది. స్వంతంగా షాపు పెట్టాను. పెట్టుబడి కష్టమయింది. అయినా పెట్టాను. నాలుగేళ్ళు బాగానే నడిచింది. ఈలోపల విజయవాడకి ఇంటర్నెట్టు పాకింది. యూట్యూబ్ ఊపందుకొంది. సీడీలు తీసుకొనేవాళ్ళు తగ్గిపోయారు. షాపు మూసేశాను. ఈమధ్యలో పెళ్ళి విషయాలు… తాడూబొంగరం లేని నాకు పిల్లనెవరిస్తారూ? ఇచ్చినా నేను ఏ మొహం పెట్టుకొని చేసుకోగలనూ? బాబాయిలూ మామయ్యలూ వెదికితెచ్చినా ఏ అమ్మాయీ నన్ను ఒప్పుకోలేదు… చివరికి మా ఊళ్ళోనే ఓ బీదాళ్ళ సంబంధం కుదిరింది. అమ్మాయితో మాటాడాను. ‘నువ్వు గ్రాడ్యుయేటువు గదా మరి నాకు ఇంటరయినా లేదు’ అన్నాను. పర్లేదంది. ఆ మాట నిజంగానే అందనిపించింది. పెళ్ళయిపోయింది. మరి సంపాదన వుండాలిగదా… ఈ రూటు పట్టుకొన్నాను. ఫర్లేదు- ఇల్లు బాగానే గడిచిపోతోంది.”

“గ్రాడ్యుయేటన్నావు… మరి ఉద్యోగం చేస్తోందా ఆవిడా? పిల్లలా?”

“ఓ పాప. ఆవిడ ప్రైవేటుస్కూల్లో టీచరు. ఇగ్నూలో ఎమ్‌.కామ్. కూడా చేస్తోంది.”

“మీరేమో ఇంటరు. ఆవిడ ఎమ్‌.కామ్. అంటున్నారు. సంకోచంగా లేదూ?” కావాలనే అడిగాను.

“భలేవారే! తను తెలివిగలది. ఇంకా చిన్నది. ముందుకు వెళ్ళగల శక్తి ఉంది. నాకెలాగూ చదువు యోగం లేదు, నువ్వైనా చదువు అని నేనే నచ్చచెప్పి ఒప్పించాను. తన చదువుకు అడ్డం కాకుండా పాప సంగతులు నేనే ఎక్కువగా చూసుకొంటాను.”

గులాబీ తోట వచ్చేసింది. నా మనసులో గులాబీల పరిమళం…

వంద నోటు అందించాను. ఒక ఏభై మరో పది ఉన్న చెయ్యి ముందుకు సాచాడు. నాలో ఉందని నాకే తెలియని ప్రావీణ్యంతో పెద్ద నోటు మాత్రం అందుకొని చిన్న నోటును ఆ అపురూప హస్తంలోనే ఉంచేశాను. ఏదో అనబోయాడు. అర్థమయ్యి సన్నటి చిరునవ్వు. ఆటో తిప్పుకొన్నాడు.


2015. మొట్టమొదటిసారిగా అమెరికా.

చికాగోలో ఓ వారంరోజులు పాపతోపాటు డౌన్‌టౌన్ హోటల్లో. ఓ రోజు పాప ఆఫీసుకెళ్ళాక నేనూ లక్ష్మీ బయల్దేరాం. మిషిగన్ లేక్ ఒడ్డున ఉన్న ఆక్వేరియంకు వెళదామని.

“మరీ దగ్గరేంగాదు. మూడు మైళ్ళు ఉంటుంది. టాక్సీ ఎక్కి వెళ్ళండి. చాతనయితే ఉబర్ తీసుకోండి…” చెప్పి వెళ్ళింది పాప.

అప్పటికి స్మార్ట్‌ఫోన్‌లతో నాకు అంతగా స్నేహం లేదు. ఉబర్ గురించి పాప వివరించి ప్రాక్టీసు చేయించిందిగాని, కాన్ఫిడెన్సు లేదు. పైగా ఫోన్లో ఆ డ్రయివర్ల సంభాషణ తీరు, ఉచ్చారణ అర్థంచేసుకోవడం కష్టమయ్యె… అయినా ప్రయత్నించాను. లింకు దొరికింది. బుకింగ్ కన్ఫర్మ్ చేశాను. చేసి డ్రైవరుకు ఫోను చేశాను. ఆశ్చర్యం! అతగాడు ఇంగ్లీషును గడగడా ఏక్సెంటులో గాకుండా పట్టిపట్టి పలుకుతున్నాడు. సంభాషణ సులభమయింది. వచ్చాడు. ఆసియా మూలాల మనిషి.

“ఎప్పట్నించి చికాగోలో ఉంటున్నారూ…” నా టాక్సీ సంభాషణలన్నింటికీ అది మూల వాక్యం.

“నాలుగేళ్ళు. ముందు న్యూజెర్సీలో పదేళ్ళు ఉన్నాను. పడలేదు. ఏవో కుటుంబపు కలతలు. ప్లేసు మార్చాను. ఇక్కడ బావుంది.” మనిషి మాట్లాడే టైపన్నమాట. బావుంది.

“మీరొచ్చి ఎన్నాళ్ళయిందీ?” అతని ప్రశ్న.

“నాలుగు వారాలు. విజిట్‌కొచ్చాం. ఇండియానుంచి…”

“నాలుగు వారాల్లో ఉబర్ బుక్ చేసుకునేంత పరిజ్ఞానమా! గ్రేట్. నాకు అలాంటివి నేర్చుకోడానికి నెలలూ ఏళ్ళూ పడుతుంది…” మహా ఉదారంగా ప్రశంస అందించాడు. ప్రశంసలకు పొంగిపోనిదెవరూ?!

ఆగి ఆగి ఇంగ్లీషు మాట్లాడుతున్నాడు. చక్కగా అర్థమవుతోంది. అడిగాను. ఇండోనేషియా మూలాలట.

“పిల్లలేం చేస్తున్నారూ?” టిపికల్ ఇండియన్ ప్రశ్న. అలాంటివి అడగొద్దని పాప బెదిరించినా నేను ఆగలేను. అడుగుతూనే ఉంటాను. అందరూ సామరస్యంగానే సమాధానాలు చెపుతుంటారు.

“ఒక్కతే అమ్మాయి. పదేళ్ళు.”

“మీ ఆవిడా? ఉద్యోగం చేస్తున్నారా?”

“ఏమో… తెలియదు.”

“అదేంటీ?”

“నాలుగేళ్ళయింది విడిపోయి. మొన్ననే విడాకులు అందాయి.”

“అయ్యోపాపం. ఐయామ్ సో సారీ. అనవసరంగా అడిగి బాధపెట్టాను. ఏమనుకోక. సారీ… సారీ…”

“బాధా! భలేవాడివి బాస్… ఎంత సంతోషంగా ఉన్నానో తెలుసా? స్వేచ్ఛ. స్వేచ్ఛ. జైల్లోంచి బయటపడ్డాను. గొప్ప సంతోషంలో ఉన్నాను. సారీ గీరీ అక్కర్లేదు.”

“అదేమిటీ?” అయోమయపు అమరేంద్ర ప్రశ్న.

“బాస్… పదేళ్ళు… పదేళ్ళు… నరకం… నరకం… పెళ్ళి పుణ్యమా అని మా దేశం నుంచి ఈ దేశం వచ్చిపడ్డాను. తను ఇక్కడే పుట్టిపెరిగింది. అదో గీర్వాణం. మనిషిలో అతిశయం. అలవిమాలిన ఆత్మవిశ్వాసం. కాస్తంత శాడిజం. హమ్మబాబోయ్! ఎంత భయంకరమైన కాంబినేషనో ఊహించగలవా? లేవు. నేను అనుభవించాను. ఆ అనుభవాల మధ్యనే అమెరికా మెల్లగా అలవాటయింది. భాష కాస్తంత ఒంటబట్టింది. పద్ధతులు తెలిశాయి. విడిపోయినా బతగ్గలనన్న నమ్మకం చిక్కింది. విడిపోదామన్నాను. అది పడనివ్వలేదు. హింస పెరిగింది- ఒక్క మానసికమే కాదు. తెగించాను. న్యూజెర్సీ వదిలిపెట్టేశాను. విడాకులకి ఎన్నిరకాల అడ్డుపుల్లలు వెయ్యాలో అన్నీ వేసింది. ఓపిగ్గా నిప్పుల నదిని దాటాను. ‘పిల్ల నాకొద్దు’ అంది. ‘మహాప్రసాదం!’ అని తెచ్చేసుకున్నాను.

“పాపనెలా చూసుకొంటున్నావ్?”

“కష్టమయింది. మెల్లగా అలవాటయింది. ఇపుడు అదో సమస్య అనిపించడంలేదు. అయినా ఒంటరి తల్లులు పిల్లల్ని పెంచగా లేంది తండ్రులకేం సమస్యా? ఐయామ్ ఎంజాయింగ్ ఇట్ నౌ…”

మా ఆక్వేరియం వచ్చేసింది.

విడాకులందుకొన్నందుకు అభినందించి ఉబర్ దిగాం.


జూన్ 2017, మూడోవారం. నెలక్రితపు సంగతిది.

కొత్తగా ఏర్పడ్డ స్నేహబృందాన్ని పలకరిద్దామని అట్లాంటా నుంచి మెగా బస్సెక్కి ఓ రోజంతా ప్రయాణం చేసి సాయంత్రం ఆరుగంటలవేళ డాలస్ నగరపు గ్రాండ్ పియరీ దగ్గర దిగాను. ఉబర్ బాగా అలవాటయిందిగదా అని మా హోస్టుల్ని బస్టాపుకు రావద్దన్నాను. ‘ఒకవేళ ఉబర్ బుక్ చేసుకోడంలో ఇబ్బంది అయితే ఫోన్జేస్తాను, అపుడు వద్దురుగాని…” అని వాళ్ళను సమాధానపరిచాను.

ఉబర్ నొక్కాను. పలికింది. ఫలించింది. టాక్సీని రెణ్ణిమిషాలు ఫోన్లో ట్రాక్ చేశాను. బస్టాండ్ ఆవరణలోకి చేరినట్టు స్మార్ట్‌ఫోను చెపుతోంది- కానీ కారు కనపడదేం? ‘అమ్మరిండా’ పార్కింగ్ లాట్లోంచి శబ్దం. ఆశగా అటు చూశాను. నెంబరు టాలీ చేశాను. అవును- టాక్సీ నెంబరదే. స్టేషన్ వాగన్లోంచి దిగి ఓ కుదిమట్టపు నడివయసావిడ నా నామమే పలుకుతోంది.

‘ప్రెజెంట్ సార్!’ అన్న స్థాయిలో హాజరుపలికి అటు అడుగువేశాను. విన్‌స్టన్ చర్చిల్‌గారంత సీరియస్ మొహంతో ఆవిడ వెనక సీటు తలుపు తెరచి నా బ్యాక్‌ప్యాక్ లోపల పెట్టింది.

“నాపేరు అమరేంద్ర. ఊరు న్యూఢిల్లీ. నైస్ మీటింగ్ యూ…” కరచాలనం.

“నేను జెన్నీ. యువర్ డ్రైవర్. ఐ డ్రైవ్ అండ్ ఐ లైక్ టు టాక్…” చర్చిల్ ముసుగు తొలగించి చెప్పిందావిడ. ఆశ్చర్యమనిపించింది.

“అది సరేగానీ ఇంగ్లీషు ఇంత స్పష్టంగా మాట్లాడుతున్నారే… నాకు ఇక్కడి మాటలు ఒక పట్టాన అర్థంకావు. మీ మాట చాలా చక్కగా తెలుస్తోంది!”

“ఓ… అదా? నా ఉబ‌ర్‌లో అనేకానేక రకాల మనుషులు ఎక్కుతూ వుంటారు. మీ ఇండియా వాళ్ళూ రోజుకొకరైనా ఎక్కుతారు. చెప్పాగదా, నాకు మనుషులతో మాట్లాడటం ఇష్టం. అందుకే ఈ బాణీ మాటతీరు…”

‘భళిభళీ!’ అనిపించింది.

“ఈ ఊరేనా మీదీ? ఎప్పట్నించీ టాక్సీ…” నా పడికట్టు ప్రశ్నలు.

“పుట్టిపెరిగాను. రెండేళ్ళనుంచీ నడుపుతున్నా. అప్పుడెప్పుడో రెండేళ్ళు హోటల్లో పనిచేశాను. ఇరవై పాతికేళ్ళు పిల్లలకి డేకేర్ సెంటర్ నడిపాను. రెండేళ్ళనుంచీ ఇలా రోడ్లవెంబడి…”

“భర్త? పిల్లలు?”

“పోయారాయన. మూడేళ్ళయింది. పిల్లలు పెద్దవాళ్ళయిపోయారు. ఒక కొడుకు, కూతురు. ఇక్కడే ఉంటారు. వాళ్ళ సంసారాలు వాళ్ళవి.”

“పోయారా? ఎలా? ఏ వయసులో?”

“కేన్సరు. ఏభై ఎనిమిది. ఇరవై ఏడేళ్ళు కలిసి బతికాక హఠాత్తుగా వెళ్ళిపోయాడు. కేన్సరని తెలిశాక ఆరే ఆరు నెలలు. నేను పుట్టింది అమెరికా పుటకే అయినా సొంతంగా బతకటం అంతగా వచ్చేదిగాదు. తెల్లపిల్లనయినా ఎందుకనో చదువును పట్టించుకోలేదు. ఆయన సివిలింజినీరు. చిన్నప్పటి ఫ్రెండు. చేసుకొన్నాడు. నన్ను జాగ్రత్తగా చూసుకొన్నాడు. నాకు తోచిన ఉద్యోగం సద్యోగం నేను చేసుకొన్నాను. భద్ర జీవనం ఒక్కసారిగా ముక్కలయింది…”

“దిగులు తీరిందా… ఇంకా మనసుకు కష్టంగానే ఉందా?”

“పర్లేదు. చూశావుగా, ఆ విషయం గురించి కన్నీళ్ళు పెట్టకుండా మాట్లాడుతున్నాను గదా! ఆ దశ దాటేశాను. కానీ అతడు లేడు అన్న వాస్తవం ములుకులా పొడుస్తూనే ఉంటుంది. నా దిగులు డేకేర్ పిల్లలకు అంటించగూడదనుకొన్నాను. మూసేశాను. ఆయన గవర్నమెంట్ ఉద్యోగం చేశాడు. ఇల్లూవాకిలీ ఉన్నాయి. సోషల్ సెక్యూరిటీ నుంచి బాగానే వస్తుంది. డబ్బులకేం ఇబ్బంది లేదు. పిల్లలముందు చెయ్యిచాచక్కర్లేదు… కానీ మనుషులు కావాలిగదా… ఇది మంచి మార్గం అనిపించింది. నాకు తెలిసిన డ్రైవింగుకు కాస్త మెరుగులు దిద్దుకొన్నాను. జీపీఎస్, గూగుల్ నేర్చుకొన్నాను. చక్రం పట్టాను. ఇపుడు బావుంది. నాకు ఇష్టమున్నంతసేపు టాక్సీ నడుపుతాను. మనుషులతో మాట్లాడతాను. నీకు బోరు కొట్టించడం లేదు కదా…” గలగలా మొదలయిన కబుర్లు ఇపుడు మంద్రంగా సాగుతున్నాయి.

“అరే! అదేంలేదు. ఆరునెలల్లో పోయారన్నావుగదా… ఆ వార్తను ఎలా తీసుకున్నాడాయన? ఆ ఆరునెలలూ ఎలా గడిపాడూ…” గాయాన్ని రేపుతున్నానేమో అన్న అనుమానం కలుగుతోన్నా- అడిగాను.

“చాలా నిబ్బరంగా తీసుకొన్నాడు. ట్రీట్మెంట్ బాధను మౌనంగా భరించాడు. తన జ్ఞాపకాలు ఓ పాతిక పేజీలు రాసిపెట్టాడు. ఆయన వెళ్ళాక నేను దాన్ని ప్రచురించి కుటుంబసభ్యులకు పంచాను. చాలామంది అదిచూసి సంతోషపడ్డారు. కొంతమంది నొచ్చుకున్నారు. ఆయన ముక్కుసూటి మనిషి. తన ఆలోచనలూ అభిప్రాయాలూ పంచదార పూత పూయకుండా రాసేశాడు. కొంతమందిని నొప్పించాడు…”

ట్రాఫిక్ బాగా ఉంది. నలభై నిమిషాలు అనుకొన్న ప్రయాణం గంట పట్టేలా ఉంది.

“పుస్తకాలు చదువుతావా?”

“తక్కువ…”

“అయినా ఒక పుస్తకం చెపుతాను. చదువు. అది వీడియోగా కూడా వచ్చింది. కనీసం చూడు. రాండీపోష్ అన్న యూనివర్సిటీ ప్రొఫెసర్ ఒకాయనకు ఇలాగే హఠాత్తుగా కేన్సర్ సోకింది. నాలుగు నెలలున్నారు. కృంగిపోలేదు. ఉన్నకాస్త సమయమూ భార్యాపాపలతో గడుపుదాం అనుకోలేదు. తన జీవిత అనుభవాలను క్రోడీకరించడానికి ఆ సమయాన్ని వాడాడు. ఆ అనుభవలాను తను పనిచేస్తున్న యూనివర్సిటీలోనే ఒక అందరితోపాటు పంచుకున్నాడు. గొప్ప ఉపన్యాసం. నువ్వు వింటే బావుంటుంది.”

నా మాట శ్రద్ధగా వింది. పుస్తకం వివరాలు గబగబా నెట్లో వెదికి చూపిస్తే చూసింది. నోట్ చేసుకొంది.

పదిహేన్రోజుల క్రితం ఫోను చేసింది.

“వీడియో చూశాను. పుస్తకం చదివాను. థ్యాం…” గొంతు పూడటం వినిపించింది. కన్నీళ్ళు కనిపించాయి.

మరీ విచిత్రం గాకపోతే ఫోన్లో కన్నీళ్ళెలా కనిపిస్తాయీ?

నాది అత్యూహ అయివుండాలి… సందేహంలేదు!


జూన్ 2017 మొదటివారంలో.

నేను, లక్ష్మి, పాప రెండ్రోజులపాటు వాషింగ్టన్ వెళ్ళి చూశాం. నేషనల్ మాల్ వెంబడే తిరిగి తిరిగి అలసి, పాపకు తెలిసిన మంచి రెస్టారెంటుకు భోజనానికి వెళ్ళడానికి ఉబర్ పిలిచాం. వచ్చింది. నడిపేది ఓ మలివయసు మహిళ. ఆసియా రూపురేఖలు. గౌరవం కలిగించే వేషభాషలు. వెళ్ళవలసిన అడ్రసు మరోసారి అడిగి చెప్పించుకొందావిడ. నడుపుతోన్న కారు ఆధునిక బాణీది కాదు. జీపీఎస్ లేదు. స్మార్ట్‌ఫోన్ పెట్టుకొనే స్టాండులో ఈవిడ తిన్నగా ఓ చిన్నపాటి టాబ్లెట్. అడ్రసు మరోసారి ఎంటర్ చేసి మెల్లగా కారు ముందుకు నడిపారు. అయినా రోడ్ల అనుమానం వచ్చి మా పాపనడిగారు. పాపకవి పరిచయం. చెప్పింది.

“ఈ ఊరేనా? ఎన్నాళ్ళబట్టీ?”

“కాదు. నేను చాలాకాలంగా నివసించింది న్యూజెర్సీలోని ఎడిసన్ దగ్గర. అయిదారేళ్ళ క్రితం ఇక్కడికి వచ్చాం. కుటుంబమంతా తరలి వచ్చాం. ఇంకా నాకు ఈ నగరం, ఈ వేగం అలవాటవలేదు…”

“ఉబర్ ఎప్పట్నించీ?”

“ఎనిమిది నెలలయింది. జీవితంలో నేను చేస్తోన్న మొట్టమొదటి ఉద్యోగం ఇది. మావి సౌత్ కొరియా మూలాలు. నాకు పెళ్ళయి ఇద్దరు పిల్లలు పుట్టేదాకా అక్కడే ఉన్నాను. 1972లో అమెరికా వచ్చాను. ఈ నలభై అయిదేళ్ళూ ఇంటి నాలుగు గోడల మధ్యనే బతికాను. మీకూ తెలుసుగదా- కొరియాలోనూ అచ్చమైన ఆసియా సంప్రదాయాలే. మహిళ అంటే ఇంటికే పరిమితం. బయటకు వెళ్ళాలనీ, బయటకు వెళ్ళి ఏదైనా పని చెయ్యాలనీ, నా సంపాదన నాకు ఉండాలనీ ఎంతగానో కోరిక ఉండేది. వయసూ సత్తువా ఉన్న రోజుల్లో అది సాధ్యపడలేదు. పిల్లలంతా పెద్దాళ్ళయిపోయాక, నాకు కాస్త బాధ్యతలు తగ్గాక అనిపించింది – అలాంటివి సాధ్యపడటం కాదు, సాధ్యం చేసుకోవాలి – అని. మెల్లగా ఉబర్ ఆనుపానులు తెలుసుకొన్నాను. రంగంలోకి దిగాను…”

“ఇంట్లో పిల్లలు ఒప్పుకొన్నారా?”

“ఒప్పుకోవడమా?! ఆరునెలలపాటు అతిరహస్యంగా చేశానీపని. నా వయసులో ఇలాంటి పని రహస్యంగా చెయ్యడం ఎంత కష్టమో తెలుసుకదా! చివరికి విషయం బయటపడింది. ఇంట్లో ప్రపంచ యుద్ధం! పరువు ప్రతిష్టల గురించే కాకుండా నా ఆరోగ్యమూ, ప్రమాదాలు జరిగే ప్రమాదమూ గురించి కూడా పిల్లలు ఆందోళనపడ్డారు. చాలా గట్టిగా మానేయమని చెప్పారు. బతిమాలారు. బెదిరించారు. నేను లొంగలేదు. చివరికి వాళ్ళకీ అర్థమయినట్టుంది, నేను మాననని- ఊరుకొన్నారు.”

“ఎన్నాళ్ళు టాక్సీ నడుపుతారూ? మీ వయసెంతా?”

“అరవైతొమ్మిది. నడపగలిగినంతకాలం నడుపుతాను. ఒక పరిమితి అంటూ పెట్టుకోలేదు. ఇలా బయటకు వచ్చి నేనూ ఒక పనిచెయ్యడం గొప్ప సంతోషాన్ని ఇస్తోంది. సంతృప్తి కలిగిస్తోంది. శక్తి ఉన్నంతవరకూ చేస్తాను…”

ఇంతలో కారు ఓ ఎర్రలైటును కాస్తంత దాటుకొని జీబ్రా క్రాసింగ్ పైకి వెళ్ళింది. పాదచారులు అటూ ఇటూ సర్దుకొని వెళ్ళిపోయారు. అక్కడే ఉన్న పోలీసు చూసీచూడనట్టుగా ఊరుకొన్నాడు.

మా గమ్యం చేరాం. మేము నోరువిప్పి మాట్లాడుకోకపోయినా మా ముగ్గురిలోనూ ఆవిడంటే గొప్ప ఆరాధన కలిగింది. ఆమాటే ఆవిడకు చెప్పాం.


ఇదీ నెలక్రితమే…

వాషింగ్‌టన్‌లో మేం ఉన్నది నగరపు శివార్లలోని పొటొమాక్ అన్న మేరీలాండ్ రాష్ట్రపు ప్రదేశంలో. మా తదుపరి మజిలీ బాల్టిమోర్. గబగబా మ్యాపులు చూడగా వాషింగ్టన్ వెళ్ళి రైలో బస్సో ఎక్కేకన్నా పొటొమాక్ నుంచి ఉబర్ తీసుకువెళ్ళడమే అన్నివిధాలా అనుకూలం అని స్పష్టమయింది. గంటన్నర టాక్సీ ప్రయాణం. పిలిచాం. ముందే చెప్పాం బాల్టిమోర్‌ అని. మొదటి ఇద్దరూ అంత దూరానికి ఒప్పుకోలేదు. మూడో ఉబర్ ఒప్పుకొని వచ్చేసింది.

“ఆవిడ నీకు టిష్యూ పేపరు ఇస్తోంది…” లక్ష్మి హెచ్చరించింది. చూశాను. టాక్సీలో సామాన్లు పెడుతున్నపుడు నా వాటర్ బాటిల్లోని నీళ్ళు ఒలికితే అవి తుడుచుకోడానికి చురుగ్గా తన సాయం అందిస్తోందన్నమాట ఆ ఉబర్ ఆవిడ.

సన్నగా రివటలా ఎత్తుగా హుషారుగా ఉందా ఆఫ్రో వనిత. టాక్సీ హైవే అందుకొంది. మామూలే… మాటల్లో పడ్డాం.

“మీకు కారు నడపడమంటే ఇష్టమా?” ఎందుకో అలా అనిపించి అడిగాను.

“ఒకప్పుడు ఇష్టంగా నడిపేదాన్ని. ఇపుడు ఇష్టమూ లేదూ అయిష్టమూ లేదు.”

“ముందునుంచీ టాక్సీయేనా?”

“ఓ… కాదు. ఓ లాయరుగారి ఆఫీసులో పనిచేశాను. డిగ్రీ ఉంది. కొంతకాలానికి అది మరీ రొటీన్ వ్యవహారమనిపించింది. మానేశాను. మా పాప పెద్దదవుతోందిగదా, దగ్గరుండి చూసుకుందామనుకొన్నాను. నిన్ననే తన పదో పుట్టిన్రోజు. రాత్రి బాగా పొద్దుపోయేదాకా ఫ్రెండ్సంతా ఉన్నారు. ఆ హడావుడి… పగలంతా నిద్రపోయి ఇదిగో ఇపుడే ఉబర్ పిలుపులు అందుకొంటున్నాను. మీ కాల్ వచ్చింది…” గలగలా కబుర్లు.

“పాప వాళ్ళ నాన్న?”

“ఉండీ లేనట్టే. డైవోర్సయిపోయింది. అవకముందుకూడా పెద్దగా అతనివల్ల ఒరిగిందేం లేదు… బాల్టిమోర్ ఊరు చూడ్డానికి వెళ్తున్నారా?”

చెప్పాను. పాప ఉద్యోగం కోసం – మేం ఊరు చూడ్డం కోసం… ఎందుకో సరి అయిన మనిషి అనిపించి అడిగాను-

“మీ తరం వాళ్ళకు 60లనాటి మార్టిన్ లూథర్ కింగ్ తెలుసా? నూటేభైనాళ్ళనాటి అంకుల్ టామ్స్ కాబిన్ తెలుసా? రూట్స్ తెలుసా?

“అందరికీ కాకపోయినా కొంతమందికి తెలుసు. అంకుల్ టామ్స్ కాబిన్ అంటున్నావుగదా- అది అందరూ చెప్పుకునేంత స్వేచ్ఛాపతాక కాదు. జాగ్రత్తగా చూస్తే ఆయాపాత్రల్లో యాజమాన్య ధర్మాలకీ, మత ధర్మాలకీ లోబడి ఉండే ‘సద్గుణం’ స్పష్టంగా కనిపిస్తుంది…”

ఆశ్చర్యపోయాను. మరోసారి ఈ కోణంలోంచి చదవాలి… “రూట్స్?”

“మంచి పుస్తకమే. ఒకప్పుడు సంచలనం కలిగించిన మాట నిజం. మూలాలు వెదుక్కోవడం అన్నదాన్ని ఒక నవ నాగరిక ప్రక్రియగా చేసిందా పుస్తకం. కానీ నాకు కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి. అతను చాలా ఊహలూ నాటకీయతా జోడించి అదంతా వాస్తవం అన్న భ్రమ సృష్టించాడు. ఆబాలగోపాలాన్నీ ఆకట్టుకోవడానికి కొన్ని కొన్ని మార్కెట్‌కు అనుగుణంగా ఉండే అంశాలు జోడించాడు. ప్లేయింగ్ టు ది గ్యాలరీ అననుగాని- హి ప్లేడ్ టు ది రీడింగ్ మాసెస్.”

నివ్వెరపోవడమంటే ఏమిటో అర్థమయింది. ఎంత ఆలోచన ఉందీ ఈ మనిషిలో!

“ఇంత గాఢంగా ఎలా చూస్తున్నావూ విషయాలనూ…”

“డిగ్రీలో నేను లిటరరీ క్లబ్ సెక్రటరీని. మా ఆఫ్రోఅమెరికన్ విద్యార్థుల్ని సంఘటితపరిచే పనిలోనూ చురుగ్గా పాల్గొన్నాను.. ఈ మాత్రపు స్పష్టత మాలో చాలామందికి ఉంది. పెద్ద గొప్పేం కాదు…”

“మార్టిన్ లూథర్ కింగ్? నా విద్యార్థి దశలో అతని ఆరేళ్ళ కాలపు అహింసాయుత పోరాటం ఫాలో అయ్యాను…”

“నో డౌట్- అతను నల్లవారి ఆకాంక్షలకు ప్రతీకగా నిలిచాడు. ఏదో అంటారే… హి కాట్ ది ఇమాజినేషన్ ఆఫ్ ది ఎంటైర్ నేషన్. కానీ అతనికన్నా ముందే అయా ఉద్యమాలకు పునాదులు వేసిన వాళ్ళు వున్నారు. అన్నట్టు నువ్వు బాల్టిమోర్ వెళుతున్నావుగదా- థర్‌గుడ్ మార్షల్ గురించి విన్నావా?”

నేను విననే వినలేదు. వివరాలు అడిగాను.

“ఎమ్.ఎల్‌.కె. కన్నా ఇరవై ఏళ్ళు పెద్దాయన. అమెరికా సుప్రీం కోర్టుకు నియమితుడైన మొట్టమొదటి నల్లజాతి మనిషి. మానవ హక్కులకు చెందిన అనేకానేక కేసులు చేపట్టి గొప్ప విజయాలు సాధించాడు. ఎమ్.ఎల్‌.కె. నడిపిన ప్రదర్శనల్లో అతనూ పాలుపంచుకున్నా, అహింసా విధానం విషయంలో బాగా విబేధించాడు. ఈ విషయాలకు రోడ్ల మీదకన్నా కోర్టు రూముల్లో పరిష్కారం దొరికే అవకాశముందని నమ్మాడు. జనాకర్షణ లాంటి పరదాలు తొలగించి చూస్తే నల్లవారి విజయాల వెనుక మార్షల్ లాంటి అనేకానేకమంది శ్రమా త్యాగాలూ ఉన్నాయి. నోబుల్ బహుమతి వచ్చినపుడు ఎమ్.ఎల్‌.కె. ఈ మాట స్పష్టంగా చెప్పాడు. మార్షల్ గురించి చదువు. విషయాలు మరింత సమగ్రంగా అర్థమవుతాయి…”

“థాంక్స్. ఒక కొత్త వ్యక్తిని పరిచయం చేశావు. ప్లీజ్ గివ్ మి ఎ హగ్!

బాల్టిమోర్ హోటల్ వచ్చింది. ఆవిడ హగ్ ఇచ్చి వీడ్కోలు తీసుకుంది.


నిజానికి ఒకో మనిషీ ఒకో నడిచే మహాగ్రంథం…

మనం చదివే అలవాటూ బతికే అలవాటూ పోగొట్టుకోనట్టయితే!