గతచిత్రం

(విన్నకోట రవిశంకర్‌ “కుండీలో మర్రిచెట్టు” కవితాసంకలనం భావచిత్ర కవితాశాఖ మీద విరిసిన మనోహర కుసుమం. అమెరికా వచ్చాక కూడ ఈ కవితావ్యాసంగాన్ని నిర్విరామంగా సాగిస్తూ “ఈమాట” పాఠకులకు చిరపరిచితుడైన ఈ కవి మన మనస్సులోని ఊహలకి మనకు ఆశ్చర్యం కలిగించే ఆకారాలు తొడిగి చూపించగలడు ఈ కవిత లోలాగా.)

కొన్ని గుర్తుకురావు
కొన్ని మరపుకు రావు
గతాన్ని చీకటి వెలుగుల జల్లెడతో జల్లించి
మనసొక మాయాజలం కల్పిస్తుంది.

ఇనుప రజనులా చెల్లాచెదురైన ఆలోచనల్ని
గతం సూదంటురాయితో ఆకర్షించి,
అద్భుతమైన అయస్కాంత చిత్రాల్ని సృష్టిస్తుంది.

నిరుడు రాలిన ఆకులమీద ఏ చిత్రాలు గీసుకున్నదీ
చెట్టు గుర్తుంచుకోదు.
పోయిన పున్నమిరాత్రి ఎగసిన అలల్లో
ఏయేకోర్కెలు దాచుకున్నదీ
సముద్రం గుర్తుంచుకోదు.
పురుగై పాకిన నేలబారు జీవితాన్ని
జరీ రెక్కల సీతాకోకచిలుక గుర్తుంచుకోదు.

కాని, మనిషిని మాత్రం ఒక జ్ఞాపకం
తుదకంటా వెంటాడుతుంది.
పొరలు పొరలుగా రాల్చిన గత రూపాల్ని అరల్లో దాచి
మరల మరల కళ్ళెదుట చూపెడుతుంది.

కలిసి కనుమరుగైన మనుషులు,
అంది చేజారిన అవకాశాలు,
అపరిపక్వతతో, అమాయకతతో
పొంది, పోగొట్టుకొన్న విలువైన అనుభవాలు
కిక్కిరిసిన పలు శకలాలుగా తోచి
గతం మనసును ఉక్కిరి బిక్కిరి చేస్తుంది.

ఏమీ తెలియని భవిష్యత్తులోనే కాదు,
అంతా ముగిసిన గతం లో కూడా
వింతైన మార్మికత యేదో నిండిఉంటుంది.