రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

నా మాట

రచన: వేలూరి వేంకటేశ్వర రావు
జనవరి 2008

గత ముప్ఫై ఏళ్ళుగా ఉత్తర అమెరికాలో తెలుగువాళ్ళు ఎవరూ ఊహించలేనంత ఎత్తు ఎదిగారు. ఉత్సాహవంతుల పనివల్లనో, ఉపకారవంతుల పోషణవల్లనో మాత్రమే కాకండా, కేవలం తెలుగువాళ్ళ సంస్కారంలో ఉన్న బలం వల్ల దేశ వ్యాప్తంగా పేరు పడ్డ సంస్థలు సుమారు పాతిక సమావేశాలు చాలా పెద్దయెత్తున జరుపుకున్నాయి. ప్రతి ఒక్క సమావేశం తరువాతిదానికి ప్రోద్బలం కలిగించింది.

దాదాపు ప్రతి పెద్ద ఊళ్ళోనూ ఒక తెలుగు సంస్థ ఉన్నది. ప్రతి స్థానిక తెలుగు సంస్థా ప్రతి ఏడాదీ ఎన్నికలు జరుపుకుంటూన్నది. పెద్ద ఎత్తున పండగలు చేసుకుంటూన్నది. తెలుగు భాష పిల్లలకి నేర్పాలని ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళు, పిల్లలకి తెలుగు పాటలు, నాట్యాలు నేర్పించాలని అహోరాత్రాలూ కృషి చేస్తున్న వాళ్ళు ప్రతి ఊళ్ళోనూ ఉన్నారు. తెలుగు చరిత్ర, తెలుగు సాహిత్యం గురించి తెలుగు వాళ్ళకే కాకుండా, ఆంధ్రేతరులకి, పాశ్చాత్యులకీ తెలియ చెప్పాలని కుతూహలం చూపించే వాళ్ళు కూడా ప్రతిఊరిలోనూ ఉన్నారు. వీళ్ళతో పాటే, ఎన్నికల రాజకీయాలలో మునిగి తేలుతున్నవాళ్ళు, రాజ్యాంగాల యంత్రాంగాలు నడిపిస్తున్నవాళ్ళూ ఉన్నారు.

ఎవరైనా కొత్తవాళ్ళు ఒక్కసారి తూర్పునుంచి పడమరదాకా, ఉత్తరం నుంచి దక్షిణందాకా ఈ దేశంలో చూస్తే ఒక్క సంగతి స్పష్టంగా బోధపడుతుంది. ఇక్కడి తెలుగు సంస్థల్లో మూడు రకాల తెలుగు వాళ్ళు ఉన్నారు.

మొదటి రకం: ఒకసారి ఎన్నికలు అయిపోగానే వచ్చే ఎన్నికలగురించి ఆలోచిస్తారు. రాజ్యాంగాలలో ప్రతీ అక్షరాన్నీ విరిచి, మలిచి, వ్యాఖ్యానించి ఏపనికైనా సరే గంటలకొద్దీ అన్ని రకాల న్యాయ శాస్త్రకోణాలనించీ చర్చించి, సిద్ధాంతాలూ, రాద్ధాంతాలూ చేస్తారు. ఆ పనులన్నీ అయేసరికి మళ్ళా ఎన్నికల కాలం వస్తుంది. మళ్ళీ వీళ్ళంతా యధాశక్తి టెలిఫోన్లమీద, విమానాలమీద, ఉత్తరాల ద్వారా, పత్రికా ప్రకటనలద్వారా, సమావేశాల ద్వారా ఈ పనుల్లో మునిగి పోతారు.

ఇకపోతే, రెండవరకం: తెలుగు భాషపిల్లలకి ఎలా నేర్పడం, తెలుగు నాటకాలు ఎలా వేయించడం, తెలుగు పాటలు ఎలా పాడించడం, తెలుగు నృత్యాలు ఎలా చేయించడం — ఇలాంటి ప్రశ్నలతో సతమతమవుతూన్నవాళ్ళు. వాళ్ళతో ఎప్పుడు మాట్లాడినా ఈ పనులు వాళ్ళకి చేతినిండా పని కల్పిస్తున్నాయని వెంటనే తెలుస్తుంది. వీళ్ళల్లో కొందరు స్వయంగా రచయితలు, మరి కొందరు పాత పాటలు శ్రావ్యంగా పాడతారు; కొత్త పాటలు రాయించి కొత్తకొత్త బాణీలు కడతారు. కొందరికి నాట్యంలో చక్కని ప్రవేశం మంచి అభిరుచి ఉంది. మరి కొందరికి నాటకం మీద ప్రత్యేకమైన ప్రేమ ఉన్నది. ఇంకా కొందరికి సాహిత్యం, సాహిత్య చరిత్ర, అంటే ఇష్టం. వీళ్ళందరికీ ఉమ్మడిగా ఒకటే సమస్య. మన పిల్లలు తెలుగు సంస్కృతికి దూరమయి పోతున్నారు; ఆ దూరాన్ని తగ్గించి, వాళ్ళని తెలుగు వాళ్ళుగా ఎలా తీర్చి దిద్దాలీ అని.

ఈ రెండు రకాల వాళ్ళూ ఒకరికొకరు ఎంత విడిపోయి కనిపిస్తారంటే — సంస్కృతి గొడవల్లో ఉన్న వాళ్ళకి రాజకీయాలు పట్టవు. ఆ రాజకీయాల్లో మునిగి తేలుతున్నవాళ్ళకి సంస్కృతిని గురించి ధ్యాసకి టైముండదు.

ఈ రెండురకాల వాళ్ళతోనూ ఉన్నట్టు కనిపించకుండా మూడో రకం వాళ్ళున్నారు. వీళ్ళు నిశ్శబ్దంగా ఉంటారు. నిజానికి ఏం చేస్తున్నట్టు కనిపించరు. సొంతపనుల్లో మునిగిపోయిఉన్నట్టే కనిపిస్తారు. కాని, తోటి తెలుగు వాళ్ళు కనిపిస్తే మాత్రం, వీళ్ళు ఆప్యాయంగా పలకరిస్తారు. మా ఇంటికి ఒకసారి రమ్మని ఆహ్వానిస్తారు. ఇంటికి వెడితే భోజనం పెట్టి గుండెనిండా అభిమానం నింపి గుమ్మందాకా వచ్చి సాగనంపుతారు.

దేశవ్యాప్తంగా చేసే సభల్లో చూడండి; స్థానికంగా చేసే సభలు చూడండి — సరిగ్గా ఈ మూడు రకాల వాళ్ళూ ఉత్తర అమెరికా తెలుగు సమాజానికి మూడు రకాల “సేవలు” చేస్తున్నారని తేలిగ్గా బోధపడుతుంది. పైకి ఏం చేస్తున్నట్టు కనిపించని వాళ్ళున్నారే — వాళ్ళ మనసుల్లో తెలుగు వాళ్ళపట్ల ఉన్న అభిమానమే — ఈ సభలన్నీ ఇంత ఉత్సాహంగా జరగటానికి బలమైన కారణం. ఎక్కడ ఈ సభలు జరుగుతున్నా, తోటి తెలుగు వాళ్ళు కనిపిస్తారుకదా అనే ఆశతో దగ్గిరయినా దూరమయినా ఓపిగ్గా ప్రయాణాలు చేసుకొని వచ్చే వాళ్ళు వీళ్ళే. దూరపు చుట్టాలు కలుపుకోవడం, పాత స్నేహాలు నెమరు వేసుకోవడం, తమ చిన్నప్పటి ఊళ్ళల్లో తమకి తెలిసినవాళ్ళని తలచుకొని, రాత్రంతా మేలుకొని తరగని కబుర్లు చెప్పుకొని అందరి కళ్ళల్లో ఆరని ఆప్యాయత దీపాలు వెలిగేలా చేసేది వీళ్ళే. వీళ్ళు ఎవరో పోల్చుకోవడం కష్టం కాదుకానీ — వీళ్ళెవరో పేర్లు చెప్పడం కష్టం. ఇందాక చెప్పిన మూడు తరహాలలో, మూడో తరహాలో ఉన్నవాళ్ళంతా వీళ్ళే. వీళ్ళని మనం ముందు తలచుకొని సగౌరవంగా వీళ్ళకి అభినందనలు చెప్పాలి.

ఇక రెండో తరహా వాళ్ళు ఏ సభలకైనా సరే, నెలల ముందు నించీ రాత్రనక, పగలనక నాటకాలకీ నాట్యాలకీ రిహార్సల్సు వేసి, పాటలు పాడే వాళ్ళకి తర్ఫీదులిచ్చి, వివిధ చర్చలలో తెలుగు వాళ్ళ సంస్కృతీసమస్యలు చర్చించడానికి సమాచారం పోగుచేసుకొని, వచ్చే తరంవాళ్ళ సమస్యలు తమ సమస్యలు చేసుకున్న వాళ్ళు. వీళ్ళవలన, మన సభలన్నిటికీ సాంస్కృతిక గౌరవం, సరదా, నిండుతనం వస్తున్నాయి. వీళ్ళ శక్తి సామర్ధ్యాలకి , ఉత్సాహానికి, సాంస్కృతిక నాయకత్వానికీ మనం గర్వపడాలి; ఆనందించాలి.

ఇక చివరి వాళ్ళు — ఇందాక చెప్పిన మొదటి తరహా వాళ్ళు. అంటే, ఎన్నికలవాళ్ళూ, రాజకీయాల వాళ్ళూనూ. వీళ్ళ ఉత్సాహాన్ని, ఓపికనీ, చొరవనీ మెచ్చుకోకండా ఉండలేం. కాని, వీళ్ళ సమస్యలు ఉత్తర అమెరికా తెలుగు సమాజానివి కావని చెప్పకుండా ఉండలేం. తెలుగు దేశంలో ఉండిఉంటే వీళ్ళు సమర్థులయిన రాజకీయ నాయకులయి ఉండేవాళ్ళు. నిజానికి, పాత అలవాటులు మార్చుకోలేని కారణం వల్లనే, చోటుమారినా ఆ రాజకీయాల కోటు మారని మనుషులు వీళ్ళు. వీళ్ళ ఆలోచనలకి మనం ఒక రకంగా రుణపడిఉన్నాం. వీళ్ళవల్ల దేశవ్యాప్త సంస్థలకి ఒక ఆకారం వచ్చింది. అంతేకాదు. అనేక పట్టణాలలో తెలుగు సంస్థలని తలపెట్టిన వాళ్ళు వీళ్ళల్లో ఉన్నారు. అయితే, రాజకీయ “పండితుల” ప్రాబల్యం రోజురోజుకీ పెరుతోందని మాత్రం చూసే వాళ్ళకి కచ్చితంగా తెలుస్తుంది. ఈ తరహా వ్యక్తుల శక్తిసామర్థ్యాలు చిన్నవి కావు. ఉత్సాహం తక్కువది కాదు. వీళ్ళ ఉత్సాహం, వీళ్ళ సామర్థ్యం ఉత్తర అమెరికా తెలుగు సమాజానికి చాలా అవసరం. వీళ్ళ ఆలోచనల తీరు మాత్రం — కేవలం అనవసరం.

    
   

3అభిప్రాయాలు

మీ అభిప్రాయం తెలియచేయండి
  1. 1
    JP February 16, 2008 4:40 am

    వేలూరి గారు మీ పరిశీలన బాగున్నది.

  2. 2
    gks raja April 3, 2008 12:41 pm

    వేలూరి గారూ!
    నేను ఇక్కడ ఉండేవాణ్ణి కాను. వచ్చి పోయే వాణ్ణి మాత్రమే. అదేమి చిత్రమో, ఇండియా లో ఉండగా నేనెప్పుడూ ‘ఈమాట చూసిన పాపాన పోలేదు. మీ పత్రిక చాలా బావుంది.’
    ఇక్కడి వాళ్ళగురించి మీ విశ్లేషణ చాలా బావుంది. నేనూ వింటుంటాను ఇట్లాంటివి. చాలా సంతోషం.
    ముందుకే నడవండి.
    రాజా.

  3. 3
    banda Giribabu April 28, 2008 5:43 am

    వేలూరి గారు,
    నమస్కారము!
    నిరుడు నేను లండన్ లొ వున్నప్పుడు మీ కథలు చదివాను. చాలా బావున్నయి. మళ్ళీ మళ్ళీ చదివాను.
    ఈ సారి నేను బార్సిలొన లో ఉన్నాను.మళ్ళీ మీ కథలు చదివాను.
    మీ కథల్లో శిల్పము, శైలి, అద్భుతము.
    ఛాలా చక్కని కథలు. వీలైతే, మీ కథలు అన్నిటివి లింక్స్ పంపించగలరు.
    కృతజ్ఞతలు.
    గిరి

మీ అభిప్రాయం తెలియచేయండిCancel reply

మీ అభిప్రాయం తెలియచేయండి

  

   ( సహాయం తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a

ఈమాట పాఠకులకు సూచనలు చదివాను. వాటికి కట్టుబడి ఉంటానని హామీ ఇస్తున్నాను.

ఈ రచయిత నుంచే...

  • ఒక చాటు పద్యం కవికి తెచ్చిన చేటు
  • అనాథ ప్రేత సంస్కారాత్‌…
  • రెండు బంట్లు పోయాయి: కథ నచ్చిన కారణం
  • ఎమితిని సెపితివె?
  • గుర్రాలు – గుగ్గిళ్ళు, మరో సారి…

ఇటువంటివే…

  1. నా మాట
  2. బ్లాగుల గురించి – నా మాట
  3. నా మాట
  4. నా మాట
  5. నా మాట: చాటువు – పేరడీ

జనవరి 2008 సంచికలో ...

  • Tree, My Guru కు CP బ్రౌన్ పండిత పురస్కారం
  • అనుభవం- జ్ఞాపకం
  • అబద్ధంలో నిజం
  • ఈమాట జనవరి 2008 సంచిక విడుదల
  • ఎందుకు రాయాలో అందుకే చదవాలి
  • ఔరంగజేబు తన గురువునకు వ్రాసిన యుత్తరము
  • కంప్యూటింగ్ పూర్వాపరాలు, సాధ్యాసాధ్యాలు – 1: శేష ప్రశ్న
  • కలలు కోతకొచ్చాయి
  • కోవెలలో పకపకలు
  • తెరమరుగవుతున్న తెలుగు నాటకం
  • తెలుగు జ్యోతి ఆహ్వానం
  • నడిమి వయసు యిడుములు
  • నా జ్ఞాపకం
  • నా మాట
  • నాకు నచ్చిన పద్యం: ఆముక్తమాల్యదలో చిక్కులో పడిన పల్లెపడుచులు
  • నిన్నటి కల
  • ప్లేటో ఘనస్వరూపాలు (Platonic Solids)
  • మనీప్లాంట్: అనువాద కథలు
  • మెహఫిల్
  • యాత్ర
  • రంగులు
  • వాడు
  • షరా మామూలే
  • సప్తపది
  • సర్వోత్తమ సితార్ విద్వాంసుడు ఉస్తాద్ విలాయత్‌ఖాన్
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

రచనల జాబితా

దాలిగుంటలో లీయా
Tree, My Guru కు CP బ్రౌన్ పండిత పురస్కారం

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.