పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16489

  1. నన్నెచోడుని క్రౌంచపదము గురించి పవన్ కుమార్ గరికపాటి అభిప్రాయం:

    03/13/2009 6:50 pm

    అభిప్రాయాలకు చర్చలకు మధ్య చాలా తేడా ఉంది.
    పాఠకులు వ్యక్తం చేయవలసింది వ్యాసం మీది అభిప్రాయాలను,
    అంతేగాని, ఇతరుల అభిప్రాయాల మీద అభిప్రాయాలను కాదు.
    ఖండన ముండనలు అంతకన్నా కాదు.ఇది అభిప్రాయ వేదికే కాని చర్చా వేదికని నేననుకోను.ఈ మాట సంపాదకులు రచయితకు సూచనలు లాగానే అభిప్రాయాల ప్రకటనలకు కూడా సూచనలు చేయడం వల్ల ఈ ఆరణ్యకాండ (ఒకరినొకరు వేటాడుకోవడం ) సుందరకాండగా (ఒకరితో ఒకరు మాటాడుకోవడం) మారుతుంది.

    అస్మదీయుని సూచనలు (నాకు ఏ వీరతాళ్లు అవసరం లేదు)

    1.అభిప్రాయం రచనకే పరిమితం కావాలి.

    2.ఇతరుల అభిప్రాయాల్లోకి వెళ్ళరాదు.

    3.చర్చలకు వేరొక వేదిక పెట్టుకోవచ్చు.

    (అందులో కొంత వేడి పుట్టినా ఫర్వాలేదు,ఒకరినొకరు
    సమర్థించుకోవడం,ఖండించుకోవడం గట్రా ఉండవచ్చు)

    గరికపాటి పవన్ కుమార్.

    [మీ సూచనలకు కృతజ్ఞతలు. పాఠకుల అభిప్రాయాలు ప్రకటించే విధానంపై కొంతకాలంగా ఈమాట సంపాదకులలో చర్చ జరుగుతున్నది. త్వరలోనే కొన్ని మార్పులు ప్రవేశపెట్టబోతున్నాం. – సం.]

  2. నాచన సోమన చతుర వచో విలాసం గురించి baabjeelu అభిప్రాయం:

    03/13/2009 8:41 am

    దండాలు కావేఁశ్వర్రావు గారూ, సిలక్కి సెప్పినట్టు సెప్పేరు. దండాలు.
    దండాలు “మోహన” గారూ, కవి సార్వభౌముడు ప్రశ్నార్థకము మీరు పెట్టిన జాగాలో పెట్టేడా? ఆయన ప్రకారం సింగభూపాలుడు సర్వగ్యుఁడు కదా ఈ కథా కమామీషు మీరిద్దరే విశదీకరించగలరు.
    ఈ మాట, నాలాటివాళ్ళకి చేస్తున్న వుపకారం: కడుపులోని చల్ల కదలకుండా సాహిత్య ధర్మ సందేహాలని తీర్చడం. అదీ కూడా గురుతుల్యులిద్దరితో.
    మీర్రాసినట్టే ఈ మాట పాఠకులకి సాహిత్యం, అది ప్రాచీనవైఁనా, ఆధునికవైఁనా, చాలా యిష్టం. అయితే ప్రాచీన సాహిత్యం మీద మీరిద్దరూ, మీతో బృందావనరావు గారూ అద్భుతంగా రాస్తున్నారు. మీర్రాసిన వ్యాసాలకి, రమ గారూ, లైలా గారూ మరియు నాగులపల్లి గారు లాటివారు, అప్పుడప్పుడు మిగిలిన వాళ్ళూ ఓ చెయ్యి వేస్తున్నారు. అర్థం పర్థం లేని రాతలూ వుంటాయి (నాకీ సంగతి బాగా తెలుసు). అయితే మీరిద్దరూ కలిసి మంచి పాత సాహిత్యం మీద అందరికీ “మోహాన్ని” మరియు “కామాన్ని” మరీ ఎక్కువ చేసెస్తున్నారు. “పాచ్చింతకాయ పచ్చడి రుచి” నాకు అనుభవైకవేద్యము. మరో సారి మీ యిద్దరికీ మనఃపూర్వక దండాలు. అయితే మీరిద్దరూ/ముగ్గురూ “ప్రాచీన” సాహిత్యం గురించి విమర్శనాత్మకవైఁన వ్యాసాలు ఎందుకు రాయరూ? ఎందుకు రాయకూడదు? వాటిలోని “అబ్బో అబ్బో” ల గురించే ఎందుకు రాయాలి? లేకపోతే పెద్దలను విమర్శించకూడదు అనే సంస్కారం వల్ల రాయట్లేదా? అదీ కాదు అప్పటి కావ్యాలని ఇప్పటి కొలతలతో ఎలా తూయగలం అంటే ఇప్పటి కొలతలకి తూగలేని అప్పటి కావ్యాలని ఇప్పటివాళ్ళు ఎలా ఆనందించాలో కూడా మీరే చెప్పాలి. ఇందులో “ఇగటాలేటీ లేవు” తాపత్రయం తప్ప.

  3. నన్నెచోడుని క్రౌంచపదము గురించి Srinivas Nagulapalli అభిప్రాయం:

    03/13/2009 7:19 am

    మోహనగారు
    అందుబాటులోలేని పద్యాలను అందించినందుకు మనసారా కృతజ్ఞతలు.

    ఇప్పుడు క్రమంలో పద్యాలను చదివినప్పుడు, “లలితగతి మెఱయు శివుడజుడు” దగ్గరకు రాగానే, మీరు లలితగతిపై చెప్పింది ఇంకా సముచితంగా అనిపిస్తుంది. మొదటిసారి చదివినప్పుడు అర్థమే అయింది, ఇప్పుడు ఆనందాన్నిచ్చింది.

    “సర్వగతు, సర్వమయు, శర్వు నుతింతున్”, “పరమపరు, పరమగురు, పరము నుతింతున్” అన్న పదబంధాలు అలలవలె లయాన్వయంగా లయకారున్ని నుతిస్తున్నట్లున్నాయి.

    ఆ. కావ్యమంత చదువ కాలంబు లేకున్న
    రసము చూపినారు రయము గాను
    ఎవరి చేతి రచనొ యెఱుగక పోయినా
    చేతులిచ్చువాడు శివుడె యెపుడు

    విధేయుడు
    -Srinivas

  4. నన్నెచోడుని క్రౌంచపదము గురించి mOhana అభిప్రాయం:

    03/13/2009 2:39 am

    కుమారసంభవము మొదటి భాగము MBPలో, రెండవ భాగము DLIలో ఉన్నది. శ్రీనివాస్ గారు వారడిగిన పద్యాలు –

    ఏ దక్షాధ్వరమును ధ్వంసము చేశాడో అదే దక్షుడు పరమేశ్వరుని సన్నుతి చేయు పద్యములు. మొదటి మూడు లయగ్రాహులు, తరువాతి రెండు లయహారిణులు, చివరిది కందము. కాలాభావమువల్ల మక్కీకి మక్కి మృత్యుంజయరావుగారి తాత్పర్యాలను అలాగే ఇస్తున్నాను.

    ఫాలతల విస్ఫురిత లోలతర భాసుర వి-
    శాల భయ దాసుర కరళ నయనాగ్ని
    జ్వాల లొకొ, పింగళ జటాళి యొకొ, నా బెరసి
    తూలి, దివి భూషణ చయాలుళిత దీర్ఘ
    వ్యాళ నికరంబొకొ, కరాళియొకొ, నాఁ దనరి
    క్రాల, వరనృత్య పరిలోలుఁ డగు శ్రీకం
    కాలధరు, నుజ్జ్వల ఫాలధరు, సన్నిశిత
    శూలధరు, నీశ్వరు, దయాళు నుతియింతున్ (2.99)

    నొసట తోచునట్టియు, చలించునట్టియు, ప్రకాశించునట్టియు, విరివియైనట్టియు, ఘోర రాక్షస భయంకరములయినట్టియు, కంటి మంట లా పింగళవర్ణముగల జడల సమూహమా యన వ్యాపించి చలించి, ఆకాశమున నలంకారములై కదలు పొడవైన పాముల మొత్తమా యన నొప్పి ప్రకాశింపగా, మేలయిన నాట్యమునందు మిక్కిలి యాసక్తిగల శ్రీకంకాలధరుడును, కపాలధరుడును, శూలధరుడును దయాస్వరూపుడును అగు
    నీశ్వరుని స్తుతింతును.

    ఉర్వర చలింపఁ, గులపర్వతచయం బడరఁ,
    బర్వ భువి నంబునిధు, లౌర్వ శిఖి యాడన్,
    బూర్వసుర నాగ సుర పూర్వదిగధీశ యమ
    వార్విభు ధనేశ్వరుల గర్వము లడంగన్,
    సర్వగణముఖ్యులును, సర్వగణ భూతములు
    నార్వ, నహి భూషణము లార్వ, దిశలం గం-
    ధర్వతతి పాడఁగ, నపూర్వనటనాదిగురు,
    సర్వగతు, సర్వమయు, శర్వు నుతియింతున్ (2.100)

    భూమి చలింపగను, కులపర్వతము లేడును అదరగను, సముద్రము లేడును భూమిపై వ్యాపింపగను, బడబాగ్ని యాడగను, రాక్షసుల, నాగుల, దేవతల, ఇంద్రుని, యముని, వరుణుని, కుబేరుని గర్వము లడగగను,
    ఎల్ల గణాధీశ్వరులును,ఎల్ల భూతగణములును అర్వగను, సర్పాభరణములు ఊర్పులు పుచ్చగను, దిశల గంధర్వ సమూహము పాడగను అపూర్వ నటనము చేతకు మొదటి గురువైన వాడును, సర్వమును పొందిన వాడును, అన్నిట నిండినవాడును అగు ఈశ్వరుని స్తుతింతును.

    101వ పద్యము కవిరాజశిఖామణి వ్యాసములో ఉన్నది.

    కఱ గళము ఘనఘనము తెఱఁగనగ, నుఱికలును
    గఱడియలు ద్రిపుదలును గిఱిడియలుఁ బెల్లై
    యుఱుము లన వడిఁ జెలఁగఁ, గొఱ నెలయుఁ దనురుచులు
    మెఱుగు లన దశదిశల మెఱవఁ, దలమీఁదన్
    వఱలు సురనది దొలఁకి నెఱిఁ జినుకులనుగురియఁ
    దఱిమికొని తొలుమొగులు తఱియనగ, నృత్యం
    బొఱ నమరుఁ లలితగతి మెఱయు శివుఁ డజుఁ డమరుఁ
    డుఱుఫలము లొసఁగు నని యెఱిఁగి నుతియింతున్ (2.102)

    నల్లని కంఠము దట్టమైన మేఘ మనగను, ఉఱికలు, కఱడియలు, త్రిపుదలు, కిఱిడియలు అను వాద్యవిశేషము లధికమై ఉఱుము లనునట్లు ధ్వనింపగను, చంద్రకళయు శరీరకాంతులు మెఱుగులన పది దిక్కులందును ప్రకాశింపగను, తలమీద నున్న ఆకాశాగంగ తొనకి చినుకులను కురియగను, తొలకరి సమయమో యన నృత్య మమరు శివుడు, అజుడు అమరుడు నైనవాడు సముచితములైన ఫలము లొసగునని తెలిసి వానిని నుతింతును.

    ఈ పద్యములోని లలితగతినే వ్యాసములో లయహారిణికి నన్నెచోడుడు ఇచ్చిన పేరో అని ప్రస్తావించాను.

    కరనికర మురు వితపవరము లనఁ, గరతలము
    లరుజరుచిఁ దలిరు లనఁ, గరజములు పుష్పో
    త్కర మనఁగ, వనరుహజ హరి దనుజ ముని మనుజ
    సుర గగనచర భుజగ గరుడగణ యక్షే
    శ్వరుల కతిదయ నొసఁగు వరఫలము లనిశమును
    భరిత మయి మధుసమయ సురవర మహీజ
    స్ఫురణ కెన యనఁ, దనరు వరదు, హిత నటనరతుఁ,
    బరమపరుఁ, బరమగురుఁ, బరము నుతియింతున్ (2.103)

    చేతులమొత్తము మేలయిన గొప్ప కొమ్మలనగను, అరచేతు లెర్రని కాంతిచే చివురు లనగను, గోరులు పూల మొత్త మనగను, బ్రహ్మ విష్ణువు రాక్షసులు మునులు మనుష్యులు దేవతలు ఖేచరులు నాగులు గరుత్మంతుడు ప్రమథ గణములు కుబేరుడు నను వారి కిచ్చు వరము లనెడు ఫలములు ఎప్పుడును నిండి వసంతకాల కల్పవృక్షమును స్ఫురింపజేయు వరదుడును, నాట్యరతుడును, పరాత్పరుడును, పరమగురువును పరముడును అగు శివుని స్తుతింతును.

    సురపానలాంతకసుర
    వరుణానిల ధనద రుద్ర వందిత చరణున్
    ధరణి జల వహ్ని మరు దం-
    బర రవి సోమాత్మమూర్తిఁ బరము నుతింతున్ (2.104)

    అష్ట దిక్పాలకులచే నమస్కరింపబడు పాదములుగలవాడును, పంచభూతములు సూర్యచంద్ర యజమాను లనెడి అష్టముర్తుల స్వరూపమైనవాడును అగు పరమేశ్వరుని నుతింతును. (ఒక చిన్న ప్రశ్న – ఈశానుడు, ఈశ్వరుడు వేరు వేరా?)

    విధేయుడు – మోహన

  5. జ్యోతిషమూ – లోపలి సంగతులూ – 2 గురించి Ramesh Kumar Buddu అభిప్రాయం:

    03/12/2009 11:39 pm

    నాగ మురళీకృష్ణ గారు,
    మీరు వ్రాసిన వ్యాసము వలన చాలా మంచి విషయములను తెలుసుకున్నాను. చాల సరళంగా అన్ని విషయములను వివరించారు. హస్థసాముద్రిక శాస్త్రము గురించి కూడా వీలుకుదిరినన్ని విషయములను వివరించగలరని కొరుకుంటున్నాను.

    రమెష్ కుమార్, అహ్మదాబాద్ .

  6. నన్నెచోడుని క్రౌంచపదము గురించి Srinivas Nagulapalli అభిప్రాయం:

    03/12/2009 6:12 am

    వ్యాసం పైన గాక, ఇంకొకరి అభిప్రాయాలపైనే ఎక్కువగా రాయడం చూసిన తరువాత వ్యాసం చదవడానికి కొంత ధైర్యం, కాదు కొత్త కారణం దొరికింది. పదాల వాడుకను బట్టి మాత్రమే కాక, ఛందస్సును బట్టి కాలాన్ని, అనుకరణలను బేరీజువేసే పద్దతి చాలా సకారణంగా, ఆసక్తికరంగా ఉంది. ఇటువంటి యత్నం ఇంతకుపూర్వం ఎవరైనా చేసారో లేదో తెలియదు.

    మోహనగారూ, మీ వ్యాసం పుణ్యమా అని ‘కుమారసంభవం’ చదవాలనే కోరిక సంభవించింది. మళ్ళీ కృతజ్ఞతలు. ద్వా.నా.శాస్త్రి గారు నన్నెచోడుడు పది (or 12?) లయగ్రాహి, లయ* (?), మరియు ఒక కందంలో ఎంతో ఆవేశంతో శివున్ని స్తుతించాడు అన్నారు. నా దగ్గరున్న రెండవ భాగం (7 నుంచి 12 ఆశ్వాసాలవరకు) లో అది కనబడలేదు. మొదటి భాగంలో ఉందనుకుంటాను. ఆ ప్రతి నా దగ్గర లేదు, దాని వివరాలేమైనా తెలిస్తే దయ చేసి చెప్ప మనవి. దశమాశ్వాసంలోని దారిద్రావణాదశకం పద్యాలు బాగున్నాయి.

    శివ కథాపరమైన వ్యాసం గురించి మాట్లాడుకుంటున్న సందర్భంలో, చివరగా అభిప్రాయాలపై చిన్న అభిప్రాయం. శివుడు అందరిలోనూ ఉన్నాడు, కాని తెలుగువారిలో కొంచెం ఎక్కువున్నాడనిపిస్తుంది. ఎందుకంటే మనం తొందరగా శివమెత్తిపోతుంటాం కనుక. అనుగ్రహిస్తే అవధులులేవు. ఆగ్రహించినా అడ్దులేదు. నిలకడగ ఉండే శక్తి, అదే శక్తిరూపిణి, కూడా మనతోడే ఉండాలనుకుంటూ,
    విధేయుడు
    -Srinivas

  7. నన్నెచోడుని క్రౌంచపదము గురించి rama bharadwaj అభిప్రాయం:

    03/12/2009 12:28 am

    యదుకుల భూషణ్ గారి అభిప్రాయం ప్రకారం కేవలం చ్చందోవేత్తలు మాత్రమే కూర్చుని మాట్లాడుకోవాలి.మిగిలిన వారు వారి భావాలని దాచుకోవాలి. నేను గమనించినంత వరకూ కామేశ్వర్రావు గారూ, బృందావన్రావు గారూ,కృష్ణమోహన రావు గారూ మాత్రమే పాత సాహిత్యం గురించి ఈమాట లో మాట్లాడుతున్నవారు. మిగిలిన వారంతా వాటిని చదివి మెచ్చుకుంటూనో లేదా తమకి వచ్చిన సందేహాల్నీ సూచనల్నీ చెప్పేవారే. తెలుగు సాహిత్యంలో నిష్ణాతులు కొద్దిమందే కాబోలు. అలాంటప్పుడు ఎవరి పరిమితుల్లోంచే వారు మాట్లాడటం సహజం. అందుకోసమే కదా వెబ్ పత్రిక నడుపుతున్నదీ! ఈపాటి దానికి ఈ చాలెంజీలు దేనికండీ? జ్ఞానం విషయంలో గాని, సమాచారం విషయంలో గానీ ఇచ్చిపుచ్చుకునే ధోరణి పత్రికలో వాంఛనీయం గాని, ఇదేం విసుర్లూ? నిందాపూర్వకమైంది, ఆధిక్యంతో కూడిందీ గొంతు ఎవరిదైనా బాగుండదు.

    తెలుగుదేశంలో ఉన్న పత్రికల్లోని అవలక్షణాల కన్నా దారుణంగా ఇటువంటి పధ్ధతులు మీ పత్రికల్లో ఉండటం ఆశ్చర్యం! చాలా మంచి పధ్ధతి మీ పత్రికలో బెజ్జాల కృష్ణమోహన రావు గారిది. కటువు గా మాట్లాడుకోవటంలో ఘనత ఏమీ లేదు. ఆ ధోరణి బలహీనతకి గుర్తు. అలాగే ఒక సూచన బాగుంటే దాన్ని అనుసరించటంలో తప్పేముందీ ఎవరైనా? అలాకాక అస్పష్టంగా ఎందుకో, ఏమిటో తెలియకనే ఇద్దరు అకారణంగా దెబ్బలాడుకున్నట్టుగా వ్యాఖ్యలు చేసుకోవడం పత్రికని చదివే ఇతర పాఠకుల్ని వీటితో ప్రమేయంలేని వారిని అయోమయ పరచడమే అవుతుంది కద. యదుకులభూషణగారు చ్చందోశాస్త్రంలో నిష్ణాతులా?? ఇటువంటి వ్యాఖ్యల కన్నా ఆయన తనకి తెలిసిన విషయాల్ని వివరంగా వ్యాసంగా రాయడం మంచిదేమో?!

    మోహనరావుగారూ, మీ రెండో భాగం కోసం ఎదురుచూస్తాను.
    రమ.

  8. నన్నెచోడుని క్రౌంచపదము గురించి పరుచూరి శ్రీనివాస్ అభిప్రాయం:

    03/11/2009 2:07 pm

    మోహనరావుగారు: మీరు నన్నయ, నన్నెచోడులలో ఎవరు ముందు, ఎవరు వెనుక అన్న దానిని గురించి స్థిరమైన అభిప్రాయం చెప్పలేదని నేను చూశాను. మీరు అలాంటి అభిప్రాయన్ని బలపరచాలని ఆ వ్యాసం రాయలేదని కూడా నేను గ్రహించాను. మీరు ఛందస్సుని వాడుకున్న తీరు నిజంగా చాలా బాగుంది. నన్నెచోడులు చాలామంది ఉన్నారనీ, బద్దెనకు కూడా నన్నెచోడుడనే పేరుందని ఇలాంటి సూచనలవల్ల కాలక్రమ సమస్యలు అనవసరంగా జటిలమవుతున్న పరిస్థితిలో మీ వ్యాసంలో ఛందస్సు మీద చేసిన చర్చ నిజంగా ఉపకరిస్తుంది. కానీ నన్నెచోడుడి సంప్రదాయం వేరు, అతనికి అనుయాయులు లేరు అన్న విషయాన్ని గుర్తించడం మీ వ్యాసానికి మరికొంత స్పష్టతనిస్తుందని నా ఉద్దేశం. మీ సౌమనస్యానికి నా కృతజ్ఞతలు.
    – శ్రీనివాస్

  9. నన్నెచోడుని క్రౌంచపదము గురించి mOhana అభిప్రాయం:

    03/11/2009 11:03 am

    వ్యాసం నచ్చినవారికి నా నమస్సులు. నచ్చనివారికి ఇక మీద బాగుగా రాయటానికి ప్రయత్నిస్తా. ఒక రెండు విషయాలు. ఈ వ్యాసరచనకు ప్రోత్సాహం శ్రీ బ్రందావనరావుగారి పద్యం. నన్నెచోడుని విపులంగా ఎందుకు పాఠకులకు పరిచయం చేయరాదనే భావం నాకు అప్పుడు కలిగింది. మొదటి భాగంలో అతని కవిత్వాన్ని గురించి వివరించాను. రెండవ భాగం నా అభిప్రాయాలు. పాఠకుల అభిప్రాయాలకు జవాబు ఇవ్వరాదనే
    భావం నాకు లేదని వినయపూర్వకంగా విన్నవించుకొంటున్నాను.

    కలింగత్తుప్పరణి మదురై ప్రాజెక్టులో దొరుకుతుంది. బ్రహ్మానందంగారు చెప్పిన పద్యం చూడగలిగాను. దాని అర్థపర్థాలు అడిగి తెలుసుకోవాలి. ఒక పద్యం ఎవరు ముందు రాశారో ఎవరు అనుకరించారో
    చెప్పడం సులభం కాదు. భూషణ్ గారు నాగేంద్ర చోడుడు 940 కాలం వాడన్నది బహుశా కవిగారి సిద్ధాంతాన్ని ఉద్ఘాటిస్తున్నారని అనుకొంటాను. రెడ్డిగారు కూడా నన్నెచోడుడు శాలివాహనశకం కాక విక్రమశకం వాడాడని అనుకొన్నారు.

    శ్రీనివాస్ గారూ, నాకు నన్నయ లేక నన్నిచోడులలో ఒకరు ముందు మరొకరు వెనుక అనే స్థిరమైన అభిప్రాయం లేదు, అట్టి అభిప్రాయాన్ని బలపరచాలని ఈ వ్యాసం రాయలేదు. నేను చెప్పిందల్లా రేచన నన్నెచోడుని పిదప అని మాత్రమే. నన్నయ నన్నెచోడులకు ముందు గ్రంథాలు ఉన్నాయని పంపడు తెలుగులో రాశాడని వేంకటరావుగారు అభిప్రాయ పడ్డారు. ఇక పోతే నన్నెచోడులు ఎందరో ఉన్నారు. బద్దెనకు కూడా నన్నెచోడుడని పేరుందని చదివాను. నా ఆశయం ఛందస్సు కొన్ని సంశయాలను తీరుస్తుందేమోననే. చరిత్రగురించి చర్చించడానికి నాకు అర్హత లేదు. ముఖ్యంగా కొత్త వృత్తాల ఉపయోగం, వాటి పేరులు, చిత్రకవిత్వం ఇత్యాదులను చోడుడు ఉపయోగించాడు. వీటిని కన్నడం నుండి గ్రహించి ఉండాలి. కవిరాజమార్గములో చిత్రకవిత్వం ఉంది.

    శ్రీనివాస్ గారూ, ఆదిదంపతుల శృంగారాన్ని వర్ణించేటప్పుడు కాలిదాసుకు కూడా సమస్యలే వచ్చాయి. ఈశ్వరునిపై ఎన్నో భక్తిభరితమైన పద్యాలు కుమారసంభవంలో ఉన్నాయి. బహుశా నేను బాగా ఎత్తి చూపలేదేమో, అందుకు నన్ను క్షమించాలి. నన్నెచోడునికి సంగీతంలో కూడా బాగా పరిచయము ఉండి ఉండాలి. అతడు ఒక తరువోజలో ఎన్నో రాగాలను (సాహురి, ఫలమంజరి, పౌరాలి, ఆందోలి, భైరవి, నాట రాగాలను) పేర్కొన్నాడు. ఇవన్నీ పురాతన రాగాలు, అపూర్వ రాగాలు. అందులో కొన్ని బృహద్దేశిలో కూడా ఉన్నాయి. సంగీతజ్ఞానము ఉన్న వాళ్లు పరిశోధనలు చేయవచ్చు. వ్యాసం అచ్చవడానికి ముందు విజ్ఞుల క్రిటిసిసం తీసికోవాలని ప్రయత్నించాను, కాని సఫలీకృతుడిని కాలేక పోయాను.

    విధేయుడు – మోహన

  10. నన్నెచోడుని క్రౌంచపదము గురించి Vamsi M Maganti అభిప్రాయం:

    03/11/2009 10:21 am

    మోహనరావుగారూ,

    I have been a big fan of you and your writings and you never disappointed me….As usual – a fantastic piece from you.

    శ్లేష ఉపయోగించడం చేతనయిన వారు దానిని చక్కగా ఉపయోగించుకోవచ్చు. కాకపోతే ఒక కొలిక్కి రావాలి అనుకునే చర్చల్లో శ్లేష ఉపయోగం ఒక రకంగా అపాయాన్నే సృష్టిస్తుందని Sreenivas గారి మాటలు తెలియచేస్తున్నాయి.

    ఇక విభేదించడం అనే నాగరికత సంగతికి వస్తే అభ్యాసపూర్వకంగా కానీ, ప్రయత్నపూర్వకంగా కానీ అది పెంపొందే అవకాశాలు ఎక్కువ. ప్రసిద్ధమయిన ప్రతీదీ స్థిరమయింది కాదు కదా… అలాగే ఇదీనూ… తెలుగునాట విమర్శ తక్కువేమీ కాదు… చూసే వారి కళ్ళల్లో , రాసే వారి రాతల్లో ఉంటుంది. మనదగ్గర లేనిది, మనకు తట్టనిది ఇతరుల బుఱ్ఱల్లోకి ఎలా వచ్చిందా అని ఆశ్చర్యపోయేవారు ఉన్నంత మటుకున్నూ, ఆ పైన రాసిన వాటిల్లోనే వారికి అర్థమయిన, కావలసిన వాక్యాలను మటుకే తీసుకుని వాటి మీద చెలరేగిపోవటం సాధారణమే అన్న ధోరణితో ఉన్నవారున్నంతమటుకున్నూ ఇలా కొనసాగుతూనే ఉంటుంది… అదీ ఈ విమర్శ లేదన్న పార్శ్వపు నొప్పికి కారణం…

    ఇక్కడ చర్చకు, అసలు నువ్వు మాట్టాడే మాటలకు తాత్పర్యమే లేదు వెంకోజీ అని అంటే చెప్పేదేమీ లేదు…ఇంతే సంగతులు చిత్తగించవలెను… 🙂

    [ఈ వ్యాఖ్య ఎడిట్ చేయబడినది – సం.]