పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16475

  1. ఒక సరళ నిర్వచనం గురించి ravikiran timmireddy అభిప్రాయం:

    09/04/2012 9:16 pm

    గరిమెళ్ళ గారు,

    కవిత బాగుంది. మీ అనాలసిస్, మీ వ్యక్థీకరణ బాగున్నాయి. కానీ మీరు ఇంకా కొంత మంది మనుషుల గురించి కూడా వ్రాయవలసింది. ఇది మీ కవిత నేను యుసర్ప్ చెయ్యటం పద్దతి కాదు. కానీ మీరు పిలుపిస్తే మన ఈమాట పాఠకులు ఇంకా చాలా మంది, ఇంకా చాలా రకాల మనుషుల గురించి చెప్పగలరు. మచ్చుకి, వీళ్ళు….

    వీళ్ళకి ఒక అబిప్రాయం అంటూ వుండదు
    ఏ గాలి బలంగా వుంటే ఆ గాల్లో కొట్టుకపోతారు
    డ్రాయింగ్ రూం లో పులులైపోయే వీళ్ళు
    బయట పిల్లులుగా కూడా వుండలేరు
    బొద్దింకలై పారిపోతారు
    పిల్లలకి నీతుల్ని నూరి పోస్తారు
    బతుకంతా అవినీతికి అవకాశం ఇస్తారు

    వీరు ఋషుల్లాటి వారు, కళ్ళు మూసిన వారు
    వారు మూసిన కళ్ళు మాత్రం దేవుడి కోసం కాదు
    వారు నీతులు చెప్పరు, చెయ్యగలిగింది ఏదో చేస్తారు
    మనం తప్పు చేసినా వారు చలించరు
    తామరాకు మీద నీటి బొట్లు వారు
    మనుషులతో, సంఘం తో వారికి పనిలేదు
    వారి మూసిన కళ్ళకి అందరూ దొంగలే
    వీరు పైవాళ్ళ కంటే కనిష్టులు

    వీళ్ళకి రెండు చేతులు, కాళ్ళు,
    వాటి మధ్య ఎప్పుడూ కరకర లాడే పొట్ట
    బుర్రలో అందరి లాగే గుజ్జున్నా
    ఏ అవకాశం, ఎప్పుడూ ఏ కిటికీ
    కూడా వీరి కోసం తెరుచుకోదు
    నవ్వనేది మనిషికి తప్పదు కానీ
    బతుకంతా కలిపినా ఒక దోసిడు
    కూడా నింపలేరేవో వీరు

    -రవికిరణ్ తిమ్మిరెడ్డి

  2. చెట్టు కింది మనుషులు గురించి Seetha kumari అభిప్రాయం:

    09/04/2012 7:11 pm

    చక్కని పదచిత్రం. ఎప్పటిలానే మళ్ళీ మళ్ళీ చదవాలనిపించేలా ఉంది మీ కవిత.

  3. గానవిద్యా వారిధి: డా. శ్రీపాద పినాకపాణి గురించి మోహన అభిప్రాయం:

    09/04/2012 3:34 pm

    మంచి వ్యాసము, ఎన్నో క్రొత్త విషయాలు తెలిసినాయి. ఆసక్తి ఉంటే ఏ విభాగములోనైనా రాణించవచ్చును అనే నమ్మకము కలుగుతుంది ఈ వ్యాసము చదివిన తరువాత. ఆ కాలములో తిరుపతిలో పినాకపాణిగారి సంగీత కచ్చేరి విన్నట్లు గుర్తు. 50 ఏళ్ల విషయము, అంశాలు గుర్తుకు రావడము లేదు. బ్రహ్మానందంగారికి అభినందనలు.

    తఃతః గారు తెలిపిన వ్యాసాన్ని చదివినాను – అందులోని కొన్ని చర్చనీయమైన అంశాలను క్రింద ఇస్తున్నాను –

    పాణిగారు: చెరకు గడను మెషీన్‌లో పెడితే ఏం వస్తుంది? రసం వస్తుంది. ఆ రసం సంగీతం, పిప్పి సాహిత్యం.
    సం: కీర్తన చెరుకుగడ అయితే, సాహిత్యము పిప్పి, సంగీతము రసమూను, కీర్తన ఒక వర్ణ చిత్రమనుకొంటే, సాహిత్యము వర్ణలేపనాని కాధారమైన పటము మాత్రమే అని రాశాడు గోపాలకృష్ణముర్తిగారు (పినాకపాణి అన్న). ఇది 1951 భారతిలోని వ్యాసమట. నా దగ్గర ఉందో లేదో చూడాలి.
    పాణిగారు: అవును, అంతే.
    సం. కాని అన్నమయ్య సాహిత్యంలో ఈ మాదిరి ప్రాబ్లం లేదు కదా?
    పాణిగారు: అన్నమయ్య సాహిత్యము అంతేనండి, అది కూడ అంతే. అన్నమయ్య సాహిత్యంలో అచ్చ తెలుగు ఎక్కువ. త్యాగయ్య తెలుగుతోబాటు సంస్కృతం కూడా కలిపాడు. అంతే.
    నా కచ్చేరి జరిగిన మరునాడు వారిని (మంగళంపల్లి పట్టాభిరామయ్య) సమీపించి సలహా అర్థించగా “నేను 50 అసంవత్సరాలనుండి పెద్ద విద్వాంసుల పాట విన్నాను, వారిలోనున్న గుణవిశేషాలన్నీ మీలో నున్నాయి” అని మూడు క్షణాలు ఆగి “మరెక్కడా లేవు” అని గొంతు రెట్టించి అన్నారు.

    అప్పుడూ, ఇప్పుడూ, బహుశా ఎప్పుడూ ఇంతే. కవులకన్న గాయకునికే అందరూ పెద్ద పీట పెడుతారు. సాహిత్యానికి సంగీతానికి ఒకే స్థానము కల్పించబడినా, సాహిత్యాన్ని చిన్న చూపుతోనే చూస్తారు. చిన్న సందేహం, సినీరంగములో గాయకునికి, కవికి ఒకే విధమైన పారితోషికమా లేక తరతమ భేదము ఉన్నదా? సంగీతమే అంత ప్రధానమయితే మఱుగేలరా ఓ రాఘవా కు బదులు లలలాలలా లా లాలలా అని ఎందుకు పాడుకోరాదో?

    విధేయుడు – మోహన

  4. నా కోరిక, నా ప్రార్థన గురించి indrani Palaparthy అభిప్రాయం:

    09/04/2012 2:44 pm

    ప్రసంగం చాలా బాగుంది. అనువాదం కూడా.

    ఓపిక,ఆసక్తి ఉంటే: ఈ వ్యాసం

    పాలపర్తి ఇంద్రాణి.

  5. జీవిత నవల – 1 గురించి Rajesh Devabhaktuni అభిప్రాయం:

    09/04/2012 2:03 pm

    అసలు వ్యాసం తర్జుమా చేయబడినది అనే సంశయమే కలగలేదు, బాగా వ్రాశారు.

    ఈ విధంగా తను చెప్పదలచుకున్న కథాస్వరూపాన్ని ఆకళించుకున్నాక, రచయిత వీథిన పడాలి – తన నాయకుడు నివసించిన ప్రదేశాలు, అక్కడి నైసర్గిక, వాతావరణ పరిస్థితులు …

    …కాని నైసర్గిక పరిస్థితులు, మనం ఎవరి మీద / గురించి వ్రాస్తున్నామో, వారి కాలానికి, ఇప్పుడు వ్రాయబడుతున్న కాలానికి చాల వరకు మారే అవకాశం ఉంది కదా, అలాంటప్పుడు ఆ ప్రదేశాలకు వెళ్లి కేవలం చూడడం, పరీక్షించడం ద్వారా ఆనాటి నైసర్గిక పరిస్థితులను మనం ఏమి అవగతం చేసుకోగలుగుతాము…?

  6. మనం అనుసరించలేకపోయిన భద్రిరాజు కృష్ణమూర్తి గురించి మోహన అభిప్రాయం:

    09/04/2012 11:48 am

    ప్రశంసనీయమైన సంపాదకీయము. కృష్ణమూర్తిగారు ఛందోబద్ధమయిన పద్యాలను కూడ ఎన్నో వ్రాసారని ఎక్కడో చదివినట్లు గుర్తు. ఎవరైనా కొన్ని మచ్చు తునకలను అందిస్తారనుకొంటాను.
    విభాగాల ఈ compartmentalisation భారతదేశములో ఎక్కువ. భౌతికశాస్త్రము వేరు, గణితశాస్త్రము వేరు, రసాయనశాస్త్రము వేరు, ఇలా చేయబట్టి ఈ విభాగాల మధ్య పరస్పర సంబంధాలు లేకపోయాయి. అదే విధముగా తెలుగు వేరు, భాషాశాస్త్రము వేరు, ఇలా. దీనికి ఒక కారణము విశ్వవిద్యాలయాలలో PhD పట్టా పొందడానికి ఎక్కువగా emphasis సిద్ధాంత వ్యాసముపైన. అసలు ఈ ఆద్యయన శాఖలను ద్వీపములనడము సమంజసమేమో? విధేయుడు – మోహన

  7. ఛందస్సులో గణితాంశములు గురించి మోహన అభిప్రాయం:

    09/04/2012 10:10 am

    నా వ్యాసమునకు స్పందించిన పాఠకలోకమునకు వినయపూర్వకమైన వందనములు.

    ఛందస్సు నిజముగా ఒక మహాసాగరమే, అది సంగీత, సాహిత్య, గణితాదులవంటి ఎన్నో జ్ఞానస్రవంతులను కలుపుతుంది. చెలియలికట్టపై కూర్చుండి ఆ అలలను చూస్తూ, తీరములోని సైకతముపై ఇసుకతో ఇండ్లు కట్టుతూ, ఒక చిన్ని గవ్వను, ఒక నత్త గుల్లను చూసి ఆనందపడే స్వభావము నాది.

    ఈ సమయములో న్యూటన్ విజ్ఞాని ఈ వాక్కులు స్మరణియము – I was like a boy playing on the sea-shore, and diverting myself now and then finding a smoother pebble or a prettier shell than ordinary, whilst the great ocean of truth lay all undiscovered before me.

    వేలూరిగారు, భూషణ్ గారు, ఛందస్సుపైన పుస్తకాలు తేవాలనే నా ప్రయత్నము కూడ. మీ ప్రోత్సాహానికి, సహాయానికి సదా కృతజ్ఞుడిని. తప్పు నాదే. సమయాభావము, తాత్సారము, అనారోగ్యము ఇత్యాదులు ఎన్నో కారణాలు.

    రమ గారు, నాకు కూడ ఛందశ్శాస్త్రాధ్యయనారంభములో అన్నీ అయోమయమే. కాలక్రమేణ అర్థమయి నేడు కొద్దిగా స్వతంత్రముగా ఆలోచించే అవకాశము కలిగినది. సంస్కృత ప్రాకృత ఛందస్సులలో జ-గణానికి పెద్ద పీట. నవవిధములైన ఆర్య మాత్రమే (అందులో కందము కూడ ఒకటి) కాదు, పజ్ఝటికవంటి పద్యాలలో కూడ జ-గణమునకు గొప్ప స్థానము ఉన్నది. అందుకే దానికి నరేంద్ర అని పేరు. పాదాంతమునుండి తరువాతి పాదమునకు పదములను లాగుకొని వెళ్లడము మొట్టమొదట కన్నడ కవులు ఆరంభించారు, తరువాత తెలుగు కవులు అనుసరించారు. అందుకే పంకరుహ దళేక్షణ పం కరుహ దళేక్షణ అయినది 🙂 దేశి ఛందస్సులో సామాన్యముగా ఏ పాదానికి ఆ పాదము స్వతంత్రముగా ఉంటుంది. రగడలలో, ద్విపదలలో ఇది ఒక నియమము కూడ.

    నా ఉద్దేశములో మొదట లఘువు తరువాత గురువు ఉండినప్పుడు, పదముల ఉచ్చరణలో ఆ మొదటి లఘువు సరిగా వినబడని కారణమువలన ఎదురునడకను కవులు, సంగీతకారులు ఆచరించలేదు అనుకొంటాను. కాని సంస్కృతములో సుప్రసిద్ధ వృత్తములయిన పంచచామరము, భుజంగప్రయాతము, శిఖరిణి మున్నగునవి ల-గారంభమే.

    కామేశ్వరరావు గారు, నా బాల్యములో తెలుగులో పద్యాలు వ్రాయడానికి ఆరంభించినప్పుడు గణభంగము కాకుండ కాపాడుకోవడము ఒక గొప్ప కసరత్తుగా ఉండేది, కాని వాటిని చదవడము నాకే కష్టముగా ఉండేది 🙂 పద్యములలో లయ ప్రధానము. మీరుదహరించిన సీస పాదములో ఎదురు నడక ఉన్నది, కాని మనకు సుపరిచితమయిన సీసపు నడక అందులో లేదు. రెండు ఇంద్రగణములకు బదులు మూడు సూర్య గణములను ఉపయోగించవచ్చును. దీనిని ఆధారము చేసికొని ఒకప్పుడు సీసపద్యమును త్ర్యస్రగతిలో వ్రాసినాను. కాని దానిని సీసము అని చెప్పడము కష్టమే 🙂 అది –

    సీసము-
    ఆకసమ్ము వెలిగె నాకు ముదము గల్గె
    చీక టంత తొలగె శ్రీలు జెలగె
    వేకువాయె గనర వేగ పాట వినర
    కేకి నటన మాడె కేక తోడ
    ప్రాకటముగ బూచె వనమునందు విరులు
    మ్రాకునందు గదలె నాకు లెల్ల
    తోక నూపుకొనుచు తొంగి చూచె గపులు
    దూకి నడచె లేగ దూడ లెన్నొ

    ఆటవెలది (సీసము)-
    నీకు లేవ నిపుడు నిజము సమయ మాయె
    స్వీకరించు ప్రణతు లో కళాత్మ
    నీ కరాబ్జముల ననేక వరము లిమ్ము
    మాకు నగును గాత మంగళమ్ము

    ఏది ఏమైనా ముఖ్యముగా పద్యమునకు ఒక తూగు ఉండాలి. వాక్యం రసాత్మకం కావ్యం అన్నట్లు పద్యం లయాత్మకం ఛందస్ అని చెప్పవచ్చును.

    కామేశ్ గారు, స-గణమును ఎదురు నడక అని చెప్పలేము. చతుర్మాత్రలలో రగడలాటి మాత్రాఛందస్సులలో జ-గణమే నిషిద్ధము.

    అక్షర గణముల వృత్త సంఖ్య తెలిసికొనవలసినప్పుడు, అందులోని గురు-లఘువుల సంఖ్య ఆ వృత్తము ఎన్నవ ఛందములో పుట్టినదో అనే విషయమును తెలుపుతుంది. మాత్రా ఛందస్సు విషయములో ఆ వృత్తపు మాత్రల సంఖ్య గురులఘువుల అమరికనుండి తెలిసికొనవచ్చును. అంశగణముల విషయములో ఒక వృత్తములో మొదటి అక్షరము గురువైనప్పుడు కష్టము లేదు, అందులోని మొత్తము అక్షరముల సంఖ్య ఆ ఛందపు సంఖ్య తెలుపుతుంది. ఉదాహరణకు, UII UII UII UU వృత్తము 11వ ఛందములో జనించినది. అక్షరగణములైనా, అంశగణములైనా ఇది 11వ ఛందమే. కాని వృత్తము లఘువుతో ప్రారంభమయితే, గురులఘువుల మొత్తము సంఖ్యనుండి ఒకటి తీసివేయవలయును. ఇది ఎందుకంటే మనము ఈ గణముల ప్రస్తారమును అప్పకవి తెలిపిన ఆ విధముగా చేసియున్నాము. ఉదాహరణకు, వృత్తపు గురులఘువులు IIII UII IIII UU అయినప్పుడు, ఈ వృత్తము 12వ ఛందమునకు చేరినది (లఘ్వాదిగా గల ఈ వృత్తపు మొత్తము గురులఘువుల సంఖ్య 13నుండి ఒకటి తీసివేయగా వచ్చిన ఫలితము). అక్షరగణరీత్యా ఈ వృత్తము 13వ ఛందమునకు చెందినది, అంశగణారీత్యా యిది 12వ ఛందమునకు చెందినది.

    మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. విధేయుడు – మోహన

  8. ఛందస్సులో గణితాంశములు గురించి తఃతః అభిప్రాయం:

    09/04/2012 8:05 am

    Combinatrics పాఠం Coins, Cards బదులు ఈ షట్ప్రత్యయాలను ఉదాహరణలుగా తీసుకొని చెప్పే రోజులు వస్తే ఎంత బాగుణ్ణు!

    ఇది చాలా ముఖ్యమైన ఆకాంక్ష. ఇది నిజం అవాలంటే మనకు మనదైన శాస్త్ర సంపద, దాని ద్వారా వచ్చిన శక్తి ఉండాలి. పాణిని, పింగళ, గోవింద, విరహాంకాదులు విలసిల్లే వాతావరణం మళ్ళీ రావాలి. చైనా ఆ ప్రయత్నంలో ఉంది. చాలా త్వరలొ మనం చైనీస్ పరిభాష వాడుతామేమో. మనం ఆ దరిదాపుల్లొ లేము.

    శ్రీ మోహన ఒక ఆదర్శ వంతుడైన వ్యాసకర్త. వారికి నా నమస్కారాలు.

  9. గానవిద్యా వారిధి: డా. శ్రీపాద పినాకపాణి గురించి తఃతః అభిప్రాయం:

    09/04/2012 4:17 am

    మహనీయులు శ్రీ పినాకపాణి గారి పై మంచి వ్యాసం అందించిన శ్రీ గొర్తికి అభినందనలు.

    ఈవ్యాసానికన్నా ముందే తెలుగులో(కూడా) వస్తున్న పక్ష పత్రిక The Sunday Indian మంగళవారం, సెప్టెంబర్ 4, 2012 సంచికలో నూరు వసంతాల శ్రీ శ్రీపాద వారిపై వ్యాసం చదివాను. విశాఖ పట్నంలొ ఆయన మిత్రులు డాక్టర్ బ్రహ్మయ్య శాస్త్రి గారు తదితరులు శ్రీపాద వారు పిట్టల కూతలకీ, తలుపుల చప్పుళ్ళకీ కూడా నొటేషన్ రాస్తుండేవారని ఆయన కచేరీ చేసిన ఒక సభ లొ అనుకోవడం నేను విన్నాను.
    ఆ సభ లొనే వారు పాడిన “చల్లరే…” [ఆహిరి , త్యాగరాజు] నాకు గుర్తుండి పొయింది.

    The Sunday Indian లో వ్యాసంలో [శాస్త్రీయ]సంగీతంలో ఉన్న సాహిత్యం మీద వారి అభిప్రాయం, చాలా బాధాకరంగా ఉంది. సంగీతంలో ఉన్న సాహిత్యాన్ని ‘పిప్పి’ గా వారు చూస్తారు. వారు ఎంత పెద్ద వారైనా ఈ విషయంలో ఈ పాత కాలపు తమిళ ధోరణి దుర్భరం. ఇదే కారణంగానేమో ధారావాహికగా చాలా సంవత్సరాల క్రితం వచ్చిన వారి ఆత్మ కధలో వారు బాల మురళి ని ప్రస్తావించలేదన్నట్టుగా గుర్తు.[పట్టాభిరామయ్య గారు తనని మెచ్చుకున్నారని అందులొ వారు ఒక చోట అన్నారు]. అలాగే కొత్త రాగాల విషయంలొనూ అన్యాపదేశంగా బాలమురళి మీద ఒక కరుకుదనం వినపడుతుంది. వారి అంతరాంతరాలలొ బాలమురళికి సంగీతం రాదన్న అభిప్రాయం ఉందేమోనని అనిపిస్తుంది నాకు. ఈ విషయం మీద The Sunday Indian వ్యాసం చదివిన వారు గానీ ఇతరులు గానీ యెవరైనా ఈమాటలో రాస్తే చదవాలని ఉంది.

    తఃతః

  10. నా కోరిక, నా ప్రార్థన గురించి Vijayavardhan అభిప్రాయం:

    09/04/2012 4:13 am

    The English transcript of this speech is available here.