పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16475

  1. ప్రాచీన తెలుగు కొలమానం గురించి సురేశ్ కొలిచాల అభిప్రాయం:

    08/14/2013 3:36 pm

    Padmaji Rao గారు,

    మీరు చెప్పిన ఆ కొలత కఠా అయ్యి ఉంటుంది. కఠా/కఠ్ఠా అంటే బీగములో ఇరువదియవ భాగము అంటే మూడు గజాల కొలత అని ఐ. కొండలరావు గారి ఉరుదూ – తెలుగు నిఘంటువు (1938) లో పేర్కొన్నారు.

    కాష్ఠము అన్న సంస్కృతంలోని కొలత పదం ప్రాకృతంలో కఠ్ఠా (kaṭṭhā) గా మారిందని ప్రాకృత నిఘంటువులు చెబుతున్నాయి. విగ్రహ- అన్న కొలత ప్రాకృతంలో బీగ- గా మారింది. బీగ అంటే ఎకరంలో మూడవ వంతని ఆ నిఘంటువులు చెబుతున్నాయి. ఈ లెక్క ప్రకారం కఠ్ఠా అంటే 80 గజాలు (ఎకరంలో 60వ భాగము) అవుతుంది.

    సురేశ్.

  2. ప్రాచీన తెలుగు కొలమానం గురించి Padmaji Rao అభిప్రాయం:

    08/14/2013 10:40 am

    Dear sir,

    I have an old document mentioning aaru kathula bhumi which is used to measure area of land. I have been searching the net for this measurement, but I could not find the measurement kathula. The original document was in Parsi, then it was translated to Telugu as aaru kathula bhumi. Could any one explain or let me know what the measurement exactly means.

  3. ప్లే బ్యాక్ సింగర్ పి. బి. ఎస్. గురించి మోహన అభిప్రాయం:

    08/13/2013 7:26 pm

    నిలవే ఎన్నిడం నెరుంగాదే పాటకు మూలమునుండి నా అనువాదమును క్రింద ఇస్తున్నాను.

    చేరకు నాదరి శశి నీవు తలచిన తీరున నేలేను
    కోరిక నింపకు విరి నీవు పరవశమవగను రాలేను

    వేసవి వర్షము పడవచ్చు
    నా మనికియు మరల చిగురిడునో
    మరువున తీగయు బూయొచ్చు
    నా కనులకు మరల వెలుగెపుడో

    మూగ కలలను ఎవరెరుగు
    నా మది తలుపుల తెరచుటెటో
    క్రమ్మిన మేఘము చెదరక మునుపే
    పాడగ నరుదెంచితివో నీవు

    ఊరటలేని కాలములో నను
    ఆ దేవుడు సృష్టించేనో యేమో
    నెమ్మదిలేక తిరుగుచునుండ
    నిన్నెందులకో పంపెను వాడు

    రమణమూర్తిగారు మరొక చోట ఇచ్చిన లంకెలో పిబిఎస్ permutation ఐన ఎస్‌పిబి పాడిన ఇదే పాటను వినవచ్చును.

    – మోహన

  4. తెనాలి రామలింగకవి శబ్దార్థ గూఢచిత్ర పద్యం గురించి jayaprabha అభిప్రాయం:

    08/13/2013 11:53 am

    ఏల్చూరి మురళీధరరావు గారికి , మీ ఘోష లాగానే ఇది నా ఘోష! ఈమధ్య నేను తంజావూరు సరస్వతీమహల్ వెళ్ళి చూసి అక్కడ ఆ లైబరీ తాలూకు తెలుగు గ్రంధాలని, రాతప్రతులని పర్యవేక్షించే వ్యక్తితో మాట్లాడేను. ఆయన నా ప్రశ్నలకి జవాబులు చెప్పలేదు కానీ అక్కడ ఉన్నవి ఏవో ఆ కాసిన్ని రాత ప్రతులనీ మాత్రం చూపించాడు. ఆయనతో జరిపిన సంభాషణల నించి నాకు అర్ధమైనదేమంటే ఆయనకి ఆ ఉద్యోగం చేయడానికి ఉండవలసిన కనీశ అర్హతలు [డిగ్రీలు ఉండే ఉంటాయి, నేను ఆయన డిగ్రీల గురించి చెప్పడం లేదు] మిగిలినవి ఏవీ ఉన్నట్టు లేవు. ఇంటర్వ్యూ లో నెగ్గి తెచ్చుకున్న ఉద్యోగమే కాబోలు కానీ తెలుగు సాహిత్యం గురించి ఆయనలో నాకు అభినివేశం, ఆసక్తీ, గ్రంధాల విషయంలో అంత తెలివిడీ మాత్రం పెద్దగా కనిపించలేదు. ఏమి ప్రశ్న అడిగినా అన్నిటికీ ఔనౌనని తలూపుతాడు. ఇలా చేసే వీలుంది కదా ? అంటే పై ఆఫీసర్లకి తెలుగు విషయంలో ఏమీ ఆసక్తి లేదని అంటాడు. మరి ఏవన్నా సూచనలు చేయబోతే దేనికీ డబ్బులు లేవు అని మాత్రం అంటాడు.

    డబ్బులతో సంబంధం లేని పనులేమన్నా చేయకూడదా, కనీశం మీ వద్ద ఉన్న గ్రంధాలకి ఒక సూచికని తయారు చేసి దానిని సరస్వతీ మహల్ లైబ్రరీకి ఒక వెబ్ సైట్ ని చేసి అందులో పెట్టే వీలులేదా? అప్పుడు ప్రపంచంలో ఎవరన్నా మీ దగ్గర ఉన్న తెలుగు పుస్తకాల రాత ప్రతులు అముద్రితాలు ఇంకా ఏమేమి ఉన్నవో తెలుసుకోగలుగుతారు కదా? అందులో ముఖ్యమైన వాటిని ఆసక్తి ఉంటె ఏ సంస్థలైనా బహుశా ప్రచురించగలరేమో కదా అలాంటి ప్రయత్నం చేశారా? అని అడిగితే అన్నిటికీ తలూపడం తప్ప మరో భావ ప్రకటన లేదు. అక్కడ ఆ కుర్చీ లో కూర్చుని ఆయన చేసే పాటు ఏమిటో నాకు మాత్రం స్పస్టపడలేదు. చురుకు లేని, ఊహ చాలని ఎందరెందరికో సరిపడని తావులలో ఉద్యోగాలు దొరికితే మరి ఆయా తావులు ఎలా ఉండాలో అలాగే ఉంటాయి కదా ??

    ఇంక మీ ఆవేదన సరైనదే! ఆధునిక కాలంలోని వారికి తెలుగులో ఉన్న పాత సాహిత్యం చదివే ఆసక్తీ అలవాటు ఉన్నా మానినా, ముఖ్యమైన పుస్తకాలని గురించి ఎప్పుడైనా ఎవరైనా చదవాలని అనుకుంటే గనక ఆ వీలుని తెలుగు వాళ్ళు మిగుల్చుకోవడం మాత్రం చాలా అవసరం! అది ఎలా అన్నది, ఆలోచన చేయగలిగిన వారో లేక అందుకు తగినన్ని వనరులు సమకూర్చ గలిగిన వారో ఉంటే గనక అది వారు తప్పక చేయదగిన పనే!

    జయప్రభ.

  5. తెనాలి రామలింగకవి శబ్దార్థ గూఢచిత్ర పద్యం గురించి ఏల్చూరి మురళీధరరావు అభిప్రాయం:

    08/13/2013 11:01 am

    మాన్యులు శ్రీ వెల్చేరు నారాయణరావు గారికి
    నమస్కృతిపూర్వకంగా,

    అధీతిబోధానుభవసంక్షిప్తిగా మీరు వ్రాసిన వాక్యావళికి ధన్యవాదాలు.

    ఇటువంటి అపురూపమైన గ్రంథాలకు తమిళ కన్నడదేశాలలో లేని దుఃస్థితి ఒక్క తెలుగుదేశంలో మాత్రమే ఉన్నదన్న విచారంతో పై మాటలను వ్రాశాను. అందులో పొరపాటున “మేకాధీశ శబ్ద శతకోటి” చర్ల భాష్యకారాచార్యుల వారి కృతి అని పేర్కొనటానికి మాఱుగా వాసుదేవ అద్వైత పరబ్రహ్మశాస్త్రి గారి కృతి అని వ్రాశాను. సవ్యాఖ్యానంగా ప్రకటితమైన ప్రశస్తమైన ఆ రచనను నలభై యేళ్ళ క్రితం చూచినపుడు అందులోని నవీన చిత్రబంధాల బొమ్మలను మాత్రం వ్రాసుకొన్నాను కాని, మొత్తం పుస్తకాన్ని వ్రాసుకోవటానికి అవకాశం లేకపోయింది. దాని వ్యాఖ్యానపంక్తులు ఎంతో అందంగా ఉండినవని మాత్రమే నాకు గుర్తున్నది. ఆ తర్వాత ఆ గ్రంథం ఇప్పుడెక్కడున్నదో ఆచూకీ చెప్పగలవారు కనబడలేదు. అటువంటి రచనను చేసిన విద్వాంసులు వేఱే భాషలోనూ లేరు. ఆ గుర్తింపైనా వారికి దక్కలేదని బాధ మాత్రం మిగిలింది.

    పోకూరి కాశీపతి గారిది “త్రింశదర్థపద్యరత్నము” అద్భుతావహమైన రచనం. (నేను “త్రింశత్యర్థ” అని వ్రాసినది లేఖనదోషం) అటువంటివి ఎందరో వ్రాయలేరు. వారి “శ్ర్రీ శౌరి శైశవలీల” దశాక్షరీయ కావ్యం పీఠికలో వ్యాఖ్య లేకుండా అచ్చయింది. విడిగా అచ్చయిన లఘుప్రతి ఇప్పుడు లభిస్తుందనుకోను. ఆచూకీ చెప్పగలవారు లేరు. శిష్టు కృష్ణమూర్తిశాస్త్రి గారి “కంకణబంధ రామాయణము” ప్రతికి ఒకప్పుడు మద్రాసు ఓరియంటల్ లైబ్రెరీలో వ్రాతప్రతులను సరిచూసి ఎవరో అద్భుతంగా పరిష్కరించిన కాగితం ప్రతి ఒకటుండేది. నేను దానిని చూసి 1971లో ముప్పాతిక భాగానికి పైగా ప్రతిని వ్రాసుకొన్నాను. ఆ తర్వాత చాలా కాలానికి వెళ్ళినప్పుడు వేఱే ప్రతులున్నాయి కాని, నేనొకప్పుడు చూసిన ప్రతిని తిరుపతికి తరలించామని చెప్పారు. అది తిరుపతికి చేరనే లేదు. ఇప్పుడేమయిందో తెలియదు. ఉన్న ప్రతులకు ఫోటోకాపీని సంపాదించగలిగినా, ఆ సుపరిష్కృతమైన ప్రతి ఆచూకీని కనుగొనటం సాధ్యం కాలేదు. పరిష్కరించినవారు ఏ వ్రాతప్రతిని చూసి సరిచేశారో కాని, ఆ వ్రాతప్రతి కూడా ఇప్పుడు మద్రాసు ఓరియంటల్ లైబ్రెరీలో లేదు. ఇప్పుడక్కడ తెలుగు పుస్తకాలకు దిక్కూ దివాణం లేని స్థితి. శ్రీమాన్ గోపాలాచార్యులవారి “గురుమూర్తి నాయని విలాస చిత్రప్రబంధము” అద్భుతమైన సుముద్రిత చిత్రబంధకృతి మైసూరు గవర్నమెంటు ఓరియంటల్ లైబ్రెరీలో ఉండేది. ఇప్పుడు లేదు. ఆంధ్రదేశం లోనూ లేదు. కాకినాడ ఆంధ్ర సారస్వత పరిషత్తు వారి కార్యాలయంలో పుస్తకాలన్నీ ఏటేటా కొన్ని కొన్ని “LOST” అన్న పేరుతో మాయమైపోతుంటాయి. ఆరుద్ర గారు ఎంతో శ్రమకోర్చి వెళ్ళి, చూసి, చదివి “సమగ్రాంధ్రసాహిత్యం”లో ఉదాహరించిన అక్కడి గణపవరపు వెంకటకవి గ్రంథాలు నేను వెళ్ళేనాటికి “MISSING” పట్టికలోకి చేరిపోయాయి. ఏమైపోయాయో వాళ్ళూ చెప్పలేకపోయారు.

    ఇటువంటి దుఃస్థితిని తెచ్చుకోవటం ఒక్క తెలుగు జాతికి మాత్రమే సాధ్యమనిపించి ఏదో నా ఘోషను వ్రాశాను.

    పోనీ, పై పుస్తకాలన్నీ రసవదర్థాలు కావా? అంటే, మహావిద్వాంసుల రచనలు కదా, శ్రద్ధగా పరికించి చూస్తే సరసకావ్యాలే అనిపిస్తుంది. మొన్నీ మధ్యనే నేను దైవజ్ఞ సూర్య పండితుని సంస్కృత కృతి “రామకృష్ణవిలోమ కావ్యం” చదివాను. నాకైతే అద్భుతంగా అనిపించింది. అనులోమవిలోమైక్యంతో ద్వ్యర్థికావ్యాన్ని ఇంత రమణీయంగా, ఇంత భావస్ఫోరకంగా వ్రాశాడే, ఏకార్థకావ్యమే వ్రాసివుంటే ఏ నారాయణీయం లాగా వ్రాసేవాడో! అనిపించింది. అరిశాణఫాల వేంకటాధ్వరి “రాఘవయాదవీయం,” వింజమూరి సోమేశ్వరకవి “రాఘవయాదవీయం,” కృతులకంటె వేయిరెట్లు మిన్న.

    ఆధునికపాఠకులు చదివినా, చదవకపోయినా – ఈ మహనీయుల రచనలను తెలుగువాళ్ళు చదవాలని ఆశించటం భావ్యమే అనుకొంటాను. ఒక్క రామలింగారెడ్డి గారి కృషిఫలితంగా పింగళి సూరనకు తెలుగులో మునుపెన్నడూ లేని స్వస్థితి, సుస్థితి కలిగాయి. అందుకు దేశకాలమానపరిస్థితులు తోడయ్యాయి. ఈ రోజు పింగళి సూరన కృతులన్నిటినీ నిజంగా చదివేవారు ఉన్నా, లేకున్నా ఆయన స్థానం మాత్రం పదికాలాలకు పదిలమయింది. అలాగే, సాధనసంపత్తి, సాధికారత కలిగిన మీవంటి విదితవిద్వాంసులు, ఉత్తమ ఉపాధ్యాయులు ఈ శ్రేణి రచనలను అధికరించి ఆంగ్లానువాదపూర్వకంగా పరిచాయక వ్యాసాలను, గ్రంథాలను సహృత్ సుహృత్ శిష్యకృతంగా సర్వసమ్మతంగా వెలయిస్తే వాటికి అర్హగౌరవం లభించి, సమానహృదయులలో కొంతైనా ఆసక్తి జనించి, మళ్ళీ వాటికి కనీసం సూర్యాలోకభాగ్యమైనా దక్కుతుందని, ఆదరం ఏర్పడుతుందని నా దృఢవిశ్వాసం.

    మీరూ ఆలోచింపగలరని ప్రార్థన. మీ వంటి పెద్దల వరివస్య మూలాన అనాదరం తగ్గి ఆదరం కలుగుతుంది.

    నేనేమైనా అధికప్రసంగం చేసివుంటే, మన్నించండి.

    సప్రశ్రయంగా,
    ఏల్చూరి మురళీధరరావు

  6. సిరిపాలుఁడు గురించి శ్రీరామం దగ్గుబాటి అభిప్రాయం:

    08/12/2013 7:08 pm

    శ్రీ దేశికాచార్యులు గారు,

    ఒక చిన్న ఇతివృత్తముతో శాంతి కరుణలను ప్రభావితము చెస్తూ మీరు రచించిన కవిత చాలా చక్కగా యున్నది. నాకు బుద్ధదేవుని వర్ణిస్తూ మీరు చెప్పిన సీస పద్యము “రాగమ్ము భోగమ్ముఁ ద్యాగమ్ము నొనరించి .”…..హృదయాన్ని హత్తుకొని ఆనందాన్ని కల్గించినది. హల్లకంబులు అంటే తామర పూలనుకొంటాను.

    “బుద్ధదేవుని పావనమూర్తిశతమె కానవచ్చెను” ఇక్కడ శతమె అంటే అర్థమేమిటి? ముఖమా లేక పాదములా?

    అభినందనలతో
    శ్రీరామం

  7. ఈమాట గురించి గురించి Nagaraju Vemuri అభిప్రాయం:

    08/12/2013 10:53 am

    శీర్షికలు లోని అందరి అభిప్రాయాలు, నచ్చిన పద్యాలు ఒక పుస్తకంలా ఇస్తే, చాల బావుంటుంది.

  8. ఎంగేజ్మెంట్ గురించి పి. చిరంజీవి అభిప్రాయం:

    08/11/2013 1:42 pm

    పెళ్ళి సంబంధం కోసం చెప్పారు బాగుంది. ఇంతకీ పెళ్ళి జరిగిందా జరగలేదా? ఇది ఇంకా బాగరాసి దానికి ముగింపు సరిగ్గా ఇచ్చి వుంటే బాగుండు.

  9. “అంటరాని వసంతం” నవల గురించి రమాసుందరి అభిప్రాయం:

    08/10/2013 10:34 am

    మంచి పరిచయం. నన్ను నిరుత్సాహపరచలేదు.

  10. రహస్య సాంగత్యం గురించి Elanaaga అభిప్రాయం:

    08/09/2013 10:39 pm

    థాంక్స్ పిడూరి రాజా గారూ.