ఆకుపాట – వాసుదేవ్ కవిత్వం

కవిత్వంలో ఆధునికత అనే పదానికి ఏనాడూ ఒక స్థిరమైన నిర్వచనం అనేది దొరకదు. ఏ తరానికా తరం కొత్త కవిత్వాన్ని సృజిస్తూనే ఉంటుంది. వచన కవిత్వపు తొలి నాళ్ళతో పోలిస్తే ఇప్పటి కవిత్వం ఎన్నో రకాలుగా మారింది. కొత్త ప్రతీకలు, కొత్త భావాలు, కొత్త రూపకాలు, సరికొత్త వాక్యనిర్మాణం, పదబంధాలూ – ఇవన్నీ కవిత్వంలో కొత్త కోణాలను చూపెడుతున్నాయి. కవుల సంఖ్య పెరుగుతోంది, ఎల్లలు చెరిగిన ప్రపంచంలో కవుల భాష కూడా స్వేచ్ఛను సంతరించుకొంటోంది. అభివ్యక్తి పరిథులు అంతకంతకూ విస్తృతమవుతున్నాయి. కవిత్వంలోని ఈ మార్పులకూ, కొత్త పోకడలకూ అద్దం పట్టే సంపుటిగా, వాసుదేవ్ గారి ‘ఆకుపాట’ను చెప్పుకోవచ్చు.

స్థూలంగా చూసినప్పుడు ‘ఆకుపాట’ అనుభూతి కవిత్వంలానే తోచినా, ఏ సిద్ధాంతాలకూ, బంధనాలకూ లొంగని విశృంఖల విహారిగానే కవి మనకు గుర్తుండిపోతాడు. ఆ మాటకొస్తే, భావ కవితాయుగంలోనో, అభ్యుదయ ఉద్యమంలోనో చిక్కుపడకుండా, తనకు తప్పనిసరైన వృతాల్లో తాను బందీగా ఉంటూనే, లోకంలోని సమస్యలకు అశాంతికి లోనయ్యే సగటు మనిషి గూర్చి పరితపించే ప్రవృత్తి వదులుకోలేక పోవడంలోనే ఈ తరపు కవిత్వ దృక్పథమేదో దాగి ఉందనిపిస్తుంది.

సాహిత్యమూ-సమాజమూ పరస్పర ఆశ్రితాలనీ, పరస్పర ప్రభావితాలనీ పునరుద్ఘాటిస్తున్నారు నేటి కవులు. అభ్యుదయ కవితా వస్తువునెంచుకుని, భావకవిత్వ శైలిలో వ్రాయడం ఈ మధ్య కాలంలో కనిపిస్తోన్న మరో పరిణామం. దీనిని ప్రయోగంగా స్వీకరించవచ్చు కానీ, ఈ రెంటికీ అతీతంగా మానవతా దృక్పథాన్ని పలికించగల గొంతొకటి కవి లోతుల్లోనుంచి రానప్పుడు, కవిత బలహీనపడుతుంది. ప్రస్తుత సమాజంలో కనపడ్డ ప్రతి అసంబద్ధ విషయానికీ ప్రతిక్రియగా వస్తున్న కవిత్వంలో సుస్పష్టంగా కనపడుతోన్న దోషమిదే. ఆలోచన నశించిన ఆవేశమే తప్ప, ఆవేదన ఏ అక్షరంలోనూ ప్రతిఫలింపజేయని ఖండికలుగా మిగులుతున్నాయవి. సామాజిక సమస్యలపై వ్రాయబడ్డ కవితల్లో సహానుభూతి స్పష్టంగా ఉండాలంటే, అంతుపట్టని ఆవేదనను సమర్థవంతంగా అక్షరాల్లో నింపాలంటే, ముందుగా ఆ బాధ కవిలో ఇంకాలి. ఆ కాస్త సమయాన్నీ కూడా వెచ్చించగల సహనం లేకపోవడం వల్లే, చాలా మంది కవుల కవితలు తేలిక భావాన్ని కలుగజేస్తున్నాయి.

‘ఆకుపాట’ కవి ఆ తప్పిదం చేయలేదు. ఉదాహరణకు ఖాళీనీడల్లో అనే కవితలో (పు:50), కొన్ని దక్షిణాసియా దేశాల్లోని ట్రాన్స్‌జెండర్స్‌ గురించి బలమైన ప్రతీకలతో చక్కని కవిత వ్రాశారు. మొదటి పాదంలోనే వాళ్ళ దేహాన్ని వర్ణిస్తూ, “వెన్నెలని తొడుకున్న సూర్యుడిలా” అంటాడీ కవి. వెన్నెల సూర్యుడు స్త్రీ పురుష తత్వాలకు ప్రతీకలు. అలాగే వెన్నెలను తొడుక్కోవడం అనడంలో – వెన్నెల పైన ఉంటుందనే భావం కూడా వ్యక్తమవుతోంది. (ఈ ట్రాన్స్‌జెండర్లకు స్త్రీ అవయవాలు పై భాగంలో ఉంటాయి).

“దేహారణ్యంలోకి ప్రవహించే చీకటి బాధించేది కాదు
కాల్తున్న మిత్రుడి శవం చితిమంట వెలుగు
అప్పుడప్పుడూ వెలుగు నిచ్చేది
” –(రక్తాక్షరి, పు:102)

కవిత ఇతివృత్తం మలేషియా అడవుల్లోకి తీసుకువెళ్ళిన ఉద్యోగులను నెలల తరబడి అక్కడి ప్లాంటేషన్లలో వదిలేయడం. దానికి తగ్గట్టుగా ‘దేహారణ్యం’ అనే పదబంధాన్ని వాడి, శారీరక బాధలన్నింటికీ అలవాటు పడిపోయినట్టు చెబుతూనే, తరువాతి పాదంలో, అకారణంగా చనిపోయిన ఏ ఆప్తమిత్రుడి శవదహనమో తిరిగి వెల్లువలా పొంగించే ఆలోచనలో, ఆవేశాలో — తిరిగి రేకెత్తించే జీవితేచ్ఛనూ, తిరిగి వెళ్ళిపోయేందుకు రేగే తపననూ అలతి పదాల్లో ఆర్ద్రంగా చిత్రించారు.

భాష విషయానికొస్తే, ఆకుపాటలో వెనువెంటనే పాఠకుల గమనింపుకు నోచుకునేది ఆంగ్లపదాల వాడకం. కవిత్వంలో భాష కంటే భావాన్ని యథాతథంగా చెప్పడానికే ప్రాథాన్యత నిచ్చిన కవులు మనకు లేకపోలేదు. ఉదాహరణకు దాశరథి పద్యనిర్మాణంలో ఉర్దూ సాహిత్య సంస్కారం నుండి వచ్చిన పదబంధాలు ఎక్కువ. అలాగే మో “కవిత్వం భాష యొక్క భాష” అంటూ ఆంగ్ల పదాలను తన కవిత్వంలో అలవోకగా పొదగడమూ, శేషేంద్రశర్మ ఈ రెంటినీ అవసరమనిపించిన ప్రతిసందర్భంలోనూ యథేచ్ఛగా వాడటమూ మనకు తెలుసు. ‘ఆకుపాట’ కవి మీద మో నెరపిన ప్రభావం సామాన్యమైనదేమీ కాదని, ఈ సంపుటిలో అక్షరమో-అనుభవమో అన్న కవిత స్పష్టంగానే చెబుతుంది. ఒక్క ‘చితి-చింత’ను మినహాయించుకుని, మో ఇతర రచనలన్నింటినీ కలుపుతూ అల్లిన ప్రయోగాత్మకమైన కవిత ఇది. మో లోని తీవ్రత, తీవ్రమైన భావాలను వ్యక్తపరించేందుకు అంత తీవ్రమైన భాషనూ వాడటం, తెంపరితనమా అనిపించే అక్కడక్కడి అస్పష్టతా, ‘ఆకుపాట’ కవిత్వంలో కనపడవు. అయితే, ఆంగ్ల పదాల వినియోగానికి సంబంధించి, మో లో కనపడే సహజసిద్ధమైన ధోరణి ఆకుపాటలో మాత్రం కొన్నిచోట్ల కృతకంగా కనిపిస్తుంది. కొన్ని ఉదాహరణలతో గమనిద్దాం.

“హవర్ గ్లాసులో ఇసుక రేణువుల్లా
ఒత్తిడి పరుగు”
–(అంతర్ముఖం, పు:75)

అని వాడారీ కవి. ఇక్కడ ‘అవర్‌గ్లాసు’కి బదులుగా ఇసుకగడియారమనో, ఢమరుకమనో వ్రాయవచ్చు. కానీ వాటి వల్ల కవితకు ఒనగూరే ప్రయోజనం ఏమిటంటే సమాధానం ఉండదు. పాఠకులకు ఇసుకగడియారం అని చెప్పడం కన్నా అవర్‌గ్లాసు అని చెప్పడమే మంచిదనీ, ఇసుకరేణువులలా జరజరా నిర్విరామంగా పడడం లోని ‘పడకతప్పని’తనాన్ని బ్రతుకు ఒత్తిడితో సమన్వయం చేయడానికి తేలిగ్గా పట్టుకోగల తెలిసిన పదమే అవసరమనీ తోస్తుంది. ఆ మేరకు కవి ఎంపిక చేసుకున్న పదమే సముచితమైనదన్న నమ్మకమూ కుదురుతుంది.

రెండవ ఉదాహరణగా, ఈ కవితా సంపుటికి శీర్షిక అయిన ఆకుపాట (పు:94) కవితను తీసుకుంటే,

“మరో సీజన్, మరో పాట,
మా రంగులు మారుతూంటాయి”

అన్నప్పుడు, సీజన్‌కు బదులుగా ఋతువు అన్న పదం ఎందుకు వాడలేదన్న ప్రశ్న వస్తుంది. ఋతువు ఎంతో తేలిగ్గా లభ్యమయ్యే పదమైనప్పుడు, సలక్షణంగా కవితలో ఒదిగే అవకాశమున్నప్పుడు, ఆంగ్లపద వాడకం అకారణమని అనిపించక మానదు. మరొక కవితలో “మైనింగుల్లో మైనంటూ లేనివాళ్ళు” అన్నప్పుడూ అదే అసహజమైన ధోరణి.

‘నైమిత్తికం’ (పు:86) కూడా ఇదే కోవలోకి చేరుతోంది, ఈ క్రింది పంక్తుల ద్వారా.

“మరణించే రోజుల్నుండి
జారిపోయిన క్షణాలని మైనస్సంటావా?”

తీసివేద్దామా /వెలివేద్దామా /చెరిపివేద్దామా /మలిపివేద్దామా – ఇలా పెద్ద ఆలోచనలేమీ అక్కర్లేకుండానే అందంగా అమరే పదాలున్నప్పుడు, పాఠకుల ఆలోచనాస్రవంతిని పక్కదారి పట్టించే అకస్మాత్తు మార్పులు అనవసరమే. కవిత్వమే కొత్త పుంతలు తొక్కే కాలంలో మనం ఉన్నప్పుడు, భాషాపరంగా కొత్తదారులు ఎంచుకోవడం అనివార్యమూ, అభిలషణీయమూ కూడా. కానీ, ఓ కొత్త భాషలోని పదం వాడేప్పుడు, అది కవితా ప్రవాహంలో కలిసిపోవాలి. ఆవేశంలో ఆవేశమై ఖణీమని మ్రోగాలి. సర్వస్వతంత్రంగా, ఆ పదం తీసివేసి మరేపదమూ పెట్టలేనంత పకడ్బందీగా చొచ్చుకుని వచ్చి, కవితకు కొత్త సొబగులద్దాలి. లేదా ఓ కొత్త రూపాన్నివ్వాలి, కొత్త భావాన్నివ్వాలి, కొత్త ఉద్వేగాన్ని సరికొత్తగా పలికించేందుకు తేలికైన సాధనంగా నిలబడాలి. ఇవేమీ మద్దతుగా నిలబడని సందర్భాల్లో పరభాషా పదాలు కేవలం పాఠకుల దృష్టిని కవిత మీద నుండి తప్పించడానికే ఉపయోగపడతాయి.

అన్వయం సరిగా కుదరక పాఠకుడు ఇబ్బంది పడే సందర్భాల గురించి కూడా ఒకట్రెండు ఉదాహరణలు –

“వెన్నెల వెండితెరలో నుండి తొంగిచూస్తూ
మబ్బుల తివాచీపై ఇంద్రధనువులా తన వైభవాన్ని
ముద్రిస్తూ ముద్దు కౌముది”
–(ఛాయాగీత్, పు: 43)

చదవగానే ఇది రాత్రికి సంబంధించినదని తెలుస్తుంది. కవితలో మిగిలిన పాదాలు కూడా హాయిగానే సాగుతాయి, లాలిపాటలా. వచ్చిన చిక్కల్లా ఈ మూడు లైన్ల దగ్గరే. రాత్రివేళ ఇంద్రధనువెలా వచ్చింది? మూన్‌బౌ అనుకోవడానికీ ఆస్కారం కనపడలేదు. కౌముది అంటేనే వెన్నెల. వెన్నెల వెండి తెరలో నుండి మళ్ళీ వెన్నెలే తొంగిచూస్తోందా?

అలాగే, ద్వైతం గురించి వ్రాస్తూ, వేరొక కవితలో (ద్వైతం, పు: 53), ఉచ్ఛ్వాసనిశ్వాసల రోలర్కోస్టర్, జీవనరథానికి భార్యాభర్తలు, నాణానికి రెండు వైపులు, ఇలా కొన్ని చక్కటి ప్రతీకలతో శీర్షికను ప్రకటిస్తూ, చివర్లో,

“కాలగమనాన్ని అందంగా శాసించే
వెలుగురేడు, రేవంతుల దాగుడుమూతలు
ద్వైతసమానమే”

అంటారు. ముందు ఉన్న ప్రతీకల ఆధారంగా చూస్తే, రోజుకు రెండు కొసలుగా ఉండేది పగలూ, రాత్రి. వాటిని శాసించేది సూర్యచంద్రులు. అలాంటప్పుడు అక్కడ వెలుగురేడు – రేరేడు అని రావాలి. రేవంతుడు అంటే అశ్వశిక్షకుడు. ఈ పదానికి చంద్రుడు అన్న అర్థం ఉంటే తప్ప, అక్కడ ఇమడదు. లేదూ, ఇది ఒక అచ్చుతప్పో, మానవ సహజమైన పొరబాటో అయి ఉండాలి. ఇతర కవితల్లో సైకతశ్రోణీ, ప్రేమపంకిణి లాంటి అరుదైన పదాలను అర్థవంతంగా వాడిన తీరు చూస్తే, ఇది పొరబాటేనేమో అనిపించక మానదు.