ఈమాట మార్చ్ 2014 సంచికకు స్వాగతం!

తమ మనోభావాలు గాయపడుతున్నాయని, తమ సంస్కృతిని అవమానించారని, ఇలా అర్థం లేని ఆరోపణలతో విద్యావేత్తలు, రచయితలు, కళాకారులపై జరుగుతున్న దాడులను సమర్థవంతంగా అడ్డుకోకపోగా, వ్యక్తిస్వేచ్ఛను మరింత నియంత్రించే విధంగా నాయకులు, ప్రభుత్వాలు ప్రవర్తించడం గర్హణీయం. నాగరిక సమాజంలో తమ అభివ్యక్తిని — అది ఎంత సమాజవ్యతిరేకమైనా సరే, నిర్భయంగా ప్రకటించే హక్కు ప్రతివారికీ నిర్ద్వంద్వంగా ఉండి తీరాలి; అంతే ముఖ్యంగా ఆ అభివ్యక్తాన్ని విమర్శించే హక్కు కూడా. విమర్శకు ఎవరూ అతీతులు కారు, కారాదు. కానీ, నిజాలని వక్రీకరించడం, ఒక పుస్తకాన్ని లేదా చిత్రాన్ని కనీసం చదవకుండా, చూడకుండా ఆందోళనలు చేయడం, వంటివి సహ్యమైన ప్రతిచర్యలు కావు. ఒక తాజా ఉదా. భారతదేశంలో పెంగ్విన్స్ ప్రచురణ సంస్థ ఇటీవలే అమ్మకాలు ఆపివేసిన ది హిందూస్: ఏన్ ఆల్టర్నేటివ్ హిస్టరీ, అన్న పేరుతో వెండీ డానిగర్ వ్రాసిన పుస్తకం. పెంగ్విన్స్ సంస్థను, డానిగర్‌ను, విమర్శిస్తూ మెయిన్‌స్ట్రీమ్ మీడియాలోనూ సోషల్ మీడియాలోనూ ముమ్మరంగా అభిప్రాయాలు వెలివడ్డాయి, చర్చలు జరిగాయి. నింద, ప్రతినిందల ఈ అయోమయపు పరిస్థితిలో, ఆ వివాదపు పూర్వాపరాలను నిష్పక్షపాతంగా, సహేతుకంగా బేరీజు వేసి మనకు తన వ్యాసం ద్వారా వివరిస్తున్న సురేశ్ కొలిచాలను అభినందిస్తున్నాం.


[గమనిక: ఈమాటలో శబ్దతరంగాలను ఇకపై Apple, Android టాబ్లెట్లలో కూడా వినగలిగే ఏర్పాటు చేశాము. పూర్తి స్థాయి మొబైల్ పోర్టబిలిటీ త్వరలోనే అందిస్తాము. – సం.]

ఈ సంచికలో:

  • కవితలు: దేవకన్య – మానస చామర్తి; అనాథ – భవానీ ఫణి; Mrs. Bird’s House – పాలపర్తి ఇంద్రాణి; ధనుర్దాసు – తిరుమల కృష్ణ దేశికాచార్యులు; సైగల్ – తమ్మినేని యదుకులభూషణ్; మాటలు – వైదేహి శశిధర్.
  • కథలు: అనగా అనగా ఒక రాత్రి – పూర్ణిమ తమ్మిరెడ్డి; గౌతమి – రాధ మండువ; ఒక ఆదివారం ప్లాట్ఫామ్ బెంచ్‌పై – బండ్లమూడి స్వాతికుమారి; నీలి తలపాగా – కొల్లూరి సోమ శంకర్; బల్లి ఫలితం – వేమూరి వేంకటేశ్వరరావు; ముగ్గురు సాధువులు – ఆర్. శర్మ దంతుర్తి; శిరోముండనం – సాయి బ్రహ్మానందం గొర్తి.
  • వ్యాసాలు, శీర్షికలు: కంద పద్యగాథ -1 – జెజ్జాల కృష్ణ మోహనరావు; నన్నెచోడుని కళావిలాసము: కొన్ని చర్చనీయాంశాలు – ఏల్చూరి మురళీధరరావు; నాకు నచ్చిన పద్యం: పల్లవడోలలో పసిబాలుడు – భైరవభట్ల కామేశ్వరరావు. వేండీ డానిగర్ – సురేశ్ కొలిచాల.
  • శబ్దతరంగాలు: ఒగి నీ దయార్ద్ర దృక్కదే చాలు, అరుణాచల పతి – కనకప్రసాద్; శ్రీమాన్ పుట్టపరి నారాయణాచార్యుల వారి శివతాండవ కవితాగానం, వారి జ్ఞాపకాలు – సమర్పణ: పరుచూరి శ్రీనివాస్.