పలుకుబడి: ముందుమాట

భాష అంటే జ్ఞాపకాల నిధి. ఒక జాతి సంస్కృతి, చరిత్ర ఆ భాషలో నిక్షిప్తమై ఉంది. భాషలోని ప్రతి పదం వెనుక ఒక ఆసక్తికరమైన కథ దాగి ఉంటుంది. ఒక భాషలోని పదాల సామూహిక ఆత్మకథే ఆ భాషాచరిత్ర అని చెప్పుకోవచ్చు. పదాల పుట్టుపూర్వోత్తరాల వివరణలతోనే ఉద్భవించిన భాషాశాస్త్రపు పరిశోధనలో పదాల వ్యుత్పత్తి ప్రధానాంశం. ఇది గుర్తించిన మన ప్రాచీన పండితులు పదాల వ్యుత్పత్తి తెలిపే నిరుక్తాన్ని ఆరు వేదాంగాలలో ఒకటిగా పేర్కొన్నారు. ఈ వేదాంగాల ప్రస్తావన మొదటిసారి ముండకోపనిషత్తులో కనబడుతుంది.

తత్రాపరా ఋగ్వేదో యజుర్వేదః
సామవేదోఽ థర్వవేదః శిక్షా కల్పో
వ్యాకరణం నిరుక్తం ఛందో జ్యోతిష మితి

అపరావిద్యలలో ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణవేదము అనెడి నాలుగు వేదములు, శిక్ష, కల్పం, వ్యాకరణం, నిరుక్తం, ఛందస్సు, జ్యోతిషము అనెడి వేదాంగాలు కలవు.

ఈ వేదాంగాలను స్థూలంగా ఇలా వివరించవచ్చు:

  1. శిక్ష: ధ్వనుల ఉత్పత్తి క్రమాన్ని తెలిపే శాస్త్రం ‘శిక్ష’. ఇది వేదాలను ఉచ్చరింపవలసిన పద్ధతిని బోధిస్తుంది. ప్రతి వేదసంహితానికి అనుబంధంగా ఆ వేదమంత్రాలలోని ధ్వనులను ఎలా ఉచ్చరించాలో తెలిపే విభాగాలు ఉండేవి. ఈ విభాగాలను ప్రాతిశాఖ్యలు అనేవారు. ఋగ్వేద ప్రాతిశాఖ్య, శుక్లయజుర్వేద ప్రాతిశాఖ్య, తైత్తిరీయ ప్రాతిశాఖ్య మొదలగునవి మనకు ఇప్పటికీ లభ్యమౌతున్న ప్రాతిశాఖ్యలకు కొన్ని ఉదాహరణలు. 3000 సంవత్సరాల క్రితమే ఎంతో శాస్త్రీయంగా శిక్షలలోనూ, ప్రాతిశాఖ్యలలోనూ కనిపించే సంస్కృత ధ్వనుల నిరూపణం ఆధునిక ధ్వనిశాస్త్రాలకి భిక్ష పెట్టిందనే చెప్పాలి.
  2. కల్పము: కల్పశాస్త్రంలో యజ్ఞయాగాదుల విధానము, వాటిలోని భేదాలు చెప్పబడ్డాయి.
  3. వ్యాకరణము: దోషరహితమైన పదప్రయోగమునకు సంబంధించిన నియమాలు అన్నీ ఇందులో చెప్పబడ్డాయి.
  4. నిరుక్తము: వేదమంత్రములలోని పదముల వ్యుత్పత్తి ఇందులో చెప్పబడింది. యాస్కుడు రచించిన నిరుక్త శాస్త్రము అతి ప్రాచీన గ్రంథం. పదములన్నీ ధాతువులనుండి పుట్టినవని యాస్కాచార్యుని అభిప్రాయము.
  5. ఛందస్సు: వేదవాఙ్మయములో వాడిన ఛందస్సు వివరించే శాస్త్రము. పింగళుడు రచించిన ఎనమిది అధ్యాయాల ఛందశ్శాస్త్రము మనకు దొరుకుతున్న ప్రాచీన గ్రంథం. వేద మంత్రములకు సంబంధించిన ఛందస్సులే కాక లౌకిక ఛందస్సులు కూడ ఇక్కడ చెప్పబడ్డాయి.
  6. జ్యోతిషము: వేదాలలో చెప్పిన యజ్ఞాలు చేయడానికి కాలనిర్ణయం చాలా ముఖ్యం. ఆ కాలనియమాలు జ్యోతిషంలో ఉంటాయి. లగధుడు, గర్గుడు మున్నగువారు రచించిన జ్యోతిష శాస్త్ర గ్రంధాలు మనకు ఇప్పుడు లభ్యం.

పాణినీయ శిక్షాస్మృతిలో ఈ వేదాంగాలను వేదపురుషుడి వివిధ అంగాలుగా వర్ణించడం కనిపిస్తుంది.

ఛందః పాదౌ తు వేదస్య హస్తౌ కల్పోఽథ పఠ్యతే
జ్యోతిషామయనం చక్షుర్ నిరుక్తం శ్త్రోత్రముచ్యతే
శిక్షా ఘ్రాణం తు వేదస్య ముఖం వ్యాకరణమ్ స్మృతం
తస్మాత్ సాంగధీత్వైవ బ్రహ్మలోకే మహీవతే (పాణిని శిక్ష 41-42)

వేదమనే దేహానికి ఛందస్సు పాదమైతే, కల్పం హస్తం వంటిది. జ్యోతిషం కళ్ళు అయితే, నిరుక్తం చెవులవంటివి. శిక్ష ఘ్రాణేంద్రియమైన ముక్కు అయితే, వ్యాకరణం ముఖం వంటిది.

అయితే, వ్యుత్పత్తి శాస్త్రం భాషాశాస్త్రానికి ఎంత ముఖ్యమో, అశాస్త్రీయ వ్యుత్పత్తులు అంతే ప్రమాదకరం. ఒక పదానికి విపులంగా వ్యుత్పత్తి చెప్పాలంటే భాషాశాస్త్రపు అన్ని ఉపశాఖల పరిశోధన అవసరమౌతుంది. అందులో ఏ ఒక్క అంశం హేతుబద్ధంగా లేకపోయినా ఆ వ్యుత్పత్తి అనుమానాస్పదమౌతుంది. గత మూడు వందల సంవత్సరాలలో ఎంతగానే అభివృద్ధి చెందిన భాషాశాస్త్ర పరిశోధన ధాతు పద నిరూపణకు ‘శబ్ద సామ్యం’ ముఖ్యంకాదని ధ్వని సూత్ర శీలమైన ‘ధ్వని అనుగుణ్యత’ ముఖ్యమని తెలియ జెప్పింది. ఏ శబ్ద సామ్యం లేని bishop, foeque వంటి పదాలు ఒకే ధాతువు నుండి పుట్టినవని ఆధునిక భాషా సిద్ధాంతాల ద్వారానే నిరూపించగలం. అలాగే, సంస్కృత ‘లోక’ అన్న పదానికి, లాటిన్ లోని ‘లోకస్’ (locus) అన్న పదానికి ఏ సంబంధం లేదనీ, సంస్కృత ‘దేవ’ శబ్దానికి లాటిన్ భాషలోని ‘deus’ సజాతి పదమని, కానీ గ్రీక్ లోని ‘theos’ పదం ఈ పదాల ధాతువు ద్వారా పుట్టలేదని కూడా ఆధునిక సిద్ధాంతాల ద్వారానే నిరూపణ చేయగలం.

భాషాశాస్త్రం భారతదేశంలో ఎంతగానో అభివృద్ధి చెందినా, అశాస్త్రీయ వ్యుత్పత్తులు చెప్పుకోవడంలోనూ, దేశ భాషా పదాలను సంస్కృత ధాతువుల ద్వారా సాధించడంలో మనవారు చూపిన కల్పనా చాతుర్యం అద్వితీయమనే చెప్పాలి. ఉదాహరణకు, ఉమా అన్న పదానికి వ్యుత్పత్తి చెప్పే ఈ కథ వినండి: పర్వతరాజ పుత్రి అయిన పార్వతి శివుని భర్తగా కోరి తపస్సు చేయడానికి పూనుకోగా తలిదండ్రులు “ఉ = ఓసీ; మా = తపస్సు వద్దు” అని నిషేధించటానికి చేసిన ప్రయత్నమే ఆవిడకి ‘ఉమా’ అనే నామాన్ని సార్ధకం చేసిందట. అలాగే, పుత్ర అన్న పదానికి ‘పున్నామాత్ త్రాయతే ఇతి పుత్రః’ (పున్నామ నరకంనుండి రక్షించే వాడు పుత్రుడు) అన్న వ్యుత్పత్యర్థం చెప్పడం లోనూ ఈ విధమైన లోక నిరుక్తి కనిపిస్తుంది. కాళిదాసు వంటి మహాకవే ఇటువంటి వ్యుత్పత్యర్థాలు చెప్పడానికి ప్రయత్నించారంటే ఇక మిగిలిన వారి సంగతేం చెప్పగలం?

అయితే శబ్ద సామ్యం ఆధారంగా వ్యుత్పత్తి చెప్పే ధోరణిని గమనించి విమర్శించిన వారు లేకపోలేదు. ఆంధ్ర దేశానికి చెందినవాడుగా చెప్పుకునే కుమారిల భట్ట ‘తంత్ర వార్త్తిక’ లో ద్రావిడ భాషలోని పదాలకు సంస్కృతభాషా పదాల ఆధారంగా అశాస్త్రీయ వ్యుత్పత్తులు చెప్పే ధోరణిని వివరిస్తూ ఇలా అంటాడు:

“తత్ యథా ద్రావిడభాషాయాం ఏవ తావద్ వ్యంజనాంత భాషాపదేషు స్వరాంత విభక్తి స్త్రీప్రత్యయాది కల్పనాభిః స్వభాషానురూపాన్ అర్థాన్ ప్రతిపాద్యమానాః దృశ్యంతే. తద్ యథా ఓదనమ్ చోర్ ఇత్యుక్తే చోరపదవాచ్యం కల్పయంతి; పంథానం అతర ఇతి కల్పయిత్వా ఆహుః, సత్యమ్ దుస్తరత్వాత్ అతర ఏవ పంథా ఇతి; తథా పాపశబ్దమ్ పకారాంతమ్ సర్పవచనమ్; అ కారాంతమ్ కల్పయిత్వా సత్యం పాప ఏవ అసౌ ఇతి వదంతి. ఏవమ్ మాల్ శబ్దం స్త్రీవచనం మాలా ఇతి కల్పయిత్వా సత్యం ఇతి ఆహుః; వైర్ శబ్దం చ రేఫాంతమ్ ఉదరవచనమ్, వైరిశబ్దేన ప్రత్యామ్నాయమ్ వదంతి; సత్యం సర్వస్య క్షుధితస్య అకార్యే ప్రవర్తనాత్ ఉదరమ్ వైరికార్యే ప్రవర్తతే ఇతి …”

ద్రావిడ భాష (ఇక్కడ ద్రావిడ భాష అంటే తమిళ భాష అన్న అర్థం) లోని హలంతమైన పదాలను ఆర్యులు అచ్చులతో అంతమయ్యే స్త్రీప్రత్యయాలుగా భావించి సంస్కృత భాషా వ్యుత్పత్తి ప్రతిపాదనలుచేయడం కద్దు. ఉదాహరణకు, ద్రావిడులు బియ్యాన్ని ‘చోర్’ అంటే, ఆర్యులు తమ స్వభాషా పదమైన ‘చోర’ శబ్దానికి ముడిపెడతారు. దారి అన్న అర్థంలో ద్రావిడులు ‘అతర్’ అన్న అన్న పదం వాడితే, దానికి ‘దుస్తరమైన మార్గము’ అన్న అర్థం చెబుతూ ‘అ-తర’ (దాటడానికి వీలులేనిది) అన్న వ్యుత్పత్తిని కల్పిస్తారు. ‘పాప్’ అన్న సర్పవచనానికి అ-కారాన్ని జతచేసి సర్పము నిజంగా పాపజీవి కాబట్టి ద్రావిడులు దాన్ని ‘పాప’ అన్నారని చెబుతారు. ‘మాల్’ అనే ద్రావిడభాషా పదాన్ని ‘స్త్రీ’ అన్న అర్థంలో వాడితే, ఔను నిజమే ఆడది ‘మాల’ వంటిదే అంటారు. కడుపును సూచించే ‘వైర్’ అన్న పదానికి ఇ-కారాంతం చేర్చి ‘వైరి’ అన్న పదానికి ముడిపెడతారు: నిజమే, ఆకలి కడుపుతో ఉన్నవాడు వైరి కృత్యాలు ప్రదర్శిస్తాడు కదా…

సంస్కృత భాషా పదాల వ్యుత్పత్తి గురించి, వాటికి మిగిలిన ఇండో-యూరోపియన్ భాషా పదాలతో గల సంబంధం గురించి గత మూడు వందల యేళ్ళలో ఎంతగానో పరిశోధనలు జరిగాయి. ఆ భాషా పరిశోధనలతో పోలిస్తే, ద్రావిడ భాషలలో భాషా పరిశోధన చాలా వెనుకబడి ఉందనే చెప్పాలి. అందుకే, ఈ శీర్షికలో ఎక్కువగా తెలుగు పదాల వ్యుత్పత్తిని, వాటికి సోదర భాషలైన తమిళ, కన్నడ భాషలలో సజాతి పదాల గురించి, వాటి ప్రయోగాల గురించి నాకు తెలిసినంతలో రాయాలని నా ప్రయత్నం. ఈ యత్నంలో విజ్ఞులైన పాఠకుల అభిప్రాయాలు, సలహాల ద్వారా నేనూ ఎన్నో కొత్త విషయాలు నేర్చుకుంటాననే ఆశతోనే ఈ శీర్షిక నడిపే సాహసం చేస్తున్నాను.

వచ్చే విడతలో ‘వ్యుత్పత్తి’, ‘నిరుక్తి’, ‘పలుకు’, ‘బడి’, ‘పలుకుబడి’, ‘నుడి’, ‘నుడికారము’, ‘మాట’ మొదలైన పదాల వ్యుత్పత్తి గురించి చర్చిద్దాం.

(ఇంకా ఉంది)