అన్నీ చెప్పగల భాష

అన్ని చెప్పగల భాష
అక్కడే ఆగిపోయింది.
వేసుకుందామంటే ఏచొక్కా
నచ్చని ఐదేళ్ళ నా కొడుకు
పెంకితనమే నా భాష కొచ్చింది.
ఎంత దువ్వినా వంగని రింగుల జుట్టు
ఎంత కట్టినా కుదరని ఆర్గండీ చీర
తెగిన చెప్పుతో నడిచే కాలి నడక
అక్కడే కూలబడింది.
పోనీ మరోమాటేదైనా
వెతుకుదామంటే
కర్ఫ్యూలో పాత బస్తీలో
తెరచిన దుకాణంలా
తిరణాళ్ళలో పడిపోయిన
పదిపైసల బిళ్ళలా
చెప్ప పెట్ట కుండా
రాత్రికి రాత్రే రైలెక్కేసి
కాశీకి పారిపోయిన సంసారిలా
నాకు దొరక్కుండా పోయింది.