అనువాదంలో మెలకువలు

అనువాదంతోనే ఆంధ్ర సాహిత్యానికి అంకురార్పణ జరిగింది.మన ప్రాచీన కవుల్లో చాలామంది అనువాదంలో నిష్ణాతులు.నీ డు ము వు లు నీవు తీసుకొని మా సంస్కృతాన్ని మాకివ్వు అని శ్రీనాథుడంతటివాడిని ఎకసెక్కం ఆడారంటే,అనువాదం ఎంతగా పాతుకుపోయిందో అర్థం చేసుకోవచ్చు.కవయిత్రి మొల్ల, అనువాదానికి పూనుకొనే ముందు వెలిబుచ్చిన అభిప్రాయాలు కూడా ఆమె పరిశీలనకు అద్దం పడతాయి.అనువాదం ప్రత్యేక కళ.మన గిరీశం మాటల్లో “సివిలైజేషన్‌కు నిగ్గు ” అనువాదమే.హరప్పా ముద్రలు అనువాదాలకు లొంగనందునే మన నాగరికత ఆనవాళ్ళు గూఢంగా ఉండిపోతున్నాయి.మన సున్న ఎల్లలు దాటింది అనువాదాల వల్లే అని మరువరాదు.ఇక్కడ,మన చర్చా విషయం కవిత్వానువాదం.

అనువాదం మాతృభాషలోనే సాధ్యం

కవిత్వం లాగే అనువాదకూడా సృజనాత్మక ప్రక్రియ.మూలఉందికదా చెలరేగిపోవచ్చు అనుకొంటే అది శుద్ధతప్పు.నీకు చాలా పరిమితులున్నాయి.కవిని మించిన ప్రజ్ఞ అవసరం.నీ ఫాయాలో నీవు కవివే.కవిత్వం మాతృభాషలోనే సాధ్యం (చాలా ఎక్కువ సార్లు)అన్న సంగతి అందరూ ఎరిగిందే.కాబట్టే మనప్రపంచంలో ఏ భాషనుండైనా తెలుగులోకి అనువదించి ఒప్పించవచ్చు.కానీ తెలుగు నుండి పరభాషల్లోకి తెలుగువారే చేబడితే వస్తుంది చిక్కు.దానికి గల కారణాలు అనేకం.నీ బాల్యం,గతం
పెనవేసుకొన్నది మాతృభాషతో అంటే..తెలుగుతో. నీ అనుభవాల వేళ్ళు తన్నింది దానిలోనే.మన పరభాష ఆంగ్లం అనుకొందాం.మనం దాన్ని నేర్చుకొంది బుద్ధిమార్గంలో,
నానా వ్యాకరణాలను భట్టీయం వేసి.తెలుగులో వ్యాకరణం అంటే ఏమిటో తెలియకముందే మనకాభాష కంఠదఘ్నంగా వచ్చు.కాబట్టి ఇతర భాషల్లోకి మనం చేసేఅనువాదాలు
నానాటికి తీసికట్టు నాగంభొట్లు తరహాలో లేదా రాను రాను రాజగుర్రం గాడిదైన చందానో ఉంటాయి.ఇది ఎరిగిన వారు కాబట్టే ,ప్రపంచవ్యాప్తంగా పండితులు పలు
భాషల్లోంచి తమమాతృభాషల్లోకి అనువాదాలకు పూనుకొన్నారే తప్ప,తమభాష లోంచి ఇతర భాషల్లోకి కాదు.ఈ వాదానికి ఎప్పుడో ఎక్కడో మినహాయింపులు ఉండవచ్చు, కానీ ,ఖగోళ ఘటనల్లా అవి బహు అరుదు.

అనువాదం పాండిత్యప్రదర్శన కాదు

చాలామంది అనువాదం అనగానే నడుం బిగించి,ఎంత అర్థం కాని భాషలోకి వికటింపచేస్తే అంత గొప్ప అన్నట్టు బయల్దేరతారు.పాఠకులు అనువాదం అనగానే “ఎన్ని కష్టాలు
వచ్చాయిరా నాయనా” అని అన్యమనస్కంగా వాటిని చదవడానికి ఉద్యుక్తులవుతారు. “అనువాదం ఇంకా బావుండవలసింది “అని ఖర్మకాలి ఎవరైనా గొణిగారో ఇక పని ఖాళీ, “ఠాట్‌!ఇది మూలంలో బహు దుష్కరము,అరటి పండు వలిచి పెడితే ఇల్లా అంటారు” అని విరుచుకు పడవచ్చు.మొత్తానికి అనువాదాలు అంటే జనాలు పిక్కబలం చూపేదాకా వచ్చింది వ్యవహారం.అనువాదం బహు సున్నితమైన విషయం.అభిరుచి ఉన్నవాడు వాటిని చేబడితే వాటికి విలువా,అందం;పాండిత్య ప్రదర్శన ఎలా కవిత్వం కాదో,అలాగే అనువాదం కూడా కాదు.

ఏది మంచి అనువాదం?

మొదలు అనువాదకుడు “జగద్ధితంబుగా” చేస్తున్నాడో,జనాలు ఠారుకొని చావడానికి చేస్తున్నాడో నిర్ణయించుకొంటే ఉత్తర క్రియ సులభంగా వుంటుంది.మూలభాషనుండి ఒక కవిని ఆంధ్రీకరిస్తున్నావే అనుకో..ఆ భాషలో ఆ కవి ఎప్పటి వాడు?ఎంత ప్రాచీనుడు? తన కవిత్వాన్ని ఏ ఛందస్సులో నడిపాడు? దాని వల్ల కావ్యసౌందర్యం ఏ రకంగా ఇనుమడించింది? కావ్యం మొత్తం అదే ఛందస్సులో ఉందా? ఇటువంటి విషయాలు కూలంకషంగా విచారించుకోవాలి..ఆంగ్లప్రపంచంలో ఉమర్‌ఖయ్యాం రుబాయీల కున్నంత ప్రశస్తి అంతా ఇంతా కాదు.రుబాయీ అంటే ఫారసీలో పద్యం అని అర్థం.ఐతే అంత్య ప్రాస ఉంటుందిి( చాలా సార్లు మూడవ పాదం తప్పించి). ఫిట్జ్‌గెరాల్డ్‌దాన్ని బీరు పోకుండా, మూల విధేయంగా పట్టుకొచ్చాడు.మన భాషకు అంత్యప్రాస అంత సహజం కాదు.ఉమర్‌ఖయ్యాంను తెలుగు చేస్తే మన గతి ఏమిటి ? ఆటవెలదిలోకి లాగాలా?? శార్దూల మత్తేభాలను ఉసిగొల్పాలా? లేదా హాయిగా free verse లో చలం లా తెనిగించాలా ?

దువ్వూరి ఏకంగా ఫారసీ నుండి తెనిగించారు.Fitz Gerald లాగే. కానీ ఛందస్సు విషయంలో అతను చూపినంత ఉపజ్ఞ చూపలేదనిపిస్తుంది.ఫారసీలో,ఆంగ్లంలో సూటిగా, సరళంగా ఉన్న భావాలు భారీ ఛందాల్లో పడి ఇబ్బందిగా కదులుతున్నాయి అనిపిస్తుంది.ఆశ్చర్యకరంగా ఆదిభట్ల వారు ఫారసీ నుండి సంస్కృతంలోకి చేసిన అనువాదాలు,బహు పొందిగ్గా ఉన్నాయి (అవును,Fitz Gerald కు ధీటుగా!). దువ్వూరి వారు ఏ ఆటవెలదినో లేదా మాత్రాబద్దఛందస్సునో ఎంచుకొని ఉంటే వాటి భాగ్యం ఇంకోలా వుండేదేమో !నిస్సందేహంగా సరళ ఫారసీ ఛందానికి,బరువు సంస్కృత వృత్తం సరిజోడీ కాదు.వీటికి భిన్నంగా సజీవభాషలోకి,చలంచేసిన అనువాదాలు,వాటి కవిత్వ తీవ్రత వల్ల అద్భుతంగా ఉన్నాయి.

సజీవభాషను స్వీకరించు

గురజాడ ,గిడుగు జీవితం ధార పోసింది సజీవ భాషకోసమే.ఆ క్రమంలో మనకు దక్కినదే కన్యాశుల్కం,సాహిత్యంలో సజీవభాషకు గల స్థానాన్ని స్థిర పరచింది.ఇదిలా ఉండగా, మనకు భారత రామాయణాల్లా ,పాశ్చాత్యులకు హోమర్‌విరచిత ఇలియడ్‌,ఒడిస్సీలు.వాటికి వందల కొద్దీ అనువాదాలు వచ్చాయి.ఇంకా వస్తున్నాయి. ఎందుకివన్నీ ? వెనుకటి అనువాదాలు చాలవనా? పనికిరావనా? భాష మారుతూ ఉంది.మారుతున్న భాషకు అనుగుణంగా కొత్త అనువాదాలు!పాత అనువాదాలు కావలసినవారు పాతవిచదువుకొంటారు.ఏది ఏమైనా అనువాదాల్లో సజీవభాషకు పట్టంగట్టిన కవే ఆదరణకు నోచుకొంటాడు.మన విషయమే తీసుకొంటే భర్తృహరికి
చాలా అనువాదాలే వచ్చాయి.ఏనుగు లక్ష్మణకవి ఎందుకు అందరినీ మించాడంటే ఛందస్సు ఎంపికలోను,సజీవభాషాప్రయోగంలోను గొప్ప వివేకాన్ని కనబరచడంవల్లే. శ్రీనాథుడి పద్యాలు మిరుమిట్లు గొలుపుతూ ఉండటానికి కారణమిదే,అతను సజీవభాషను తనపద్యాల్లో అలవోకగా ఒప్పించగలిగాడు.మనం చలాన్ని చదివి పరవశించడానికి కారణం ఇదే.కాబట్టే చలం రుబాయీలు అందరినీ అంతగా ఆకట్టుకొనేది!!

కాళిదాసు కవిత్వకొంత..

ఆ పై తన పైత్యకొంత!అనువాదకుడి స్వంత పైత్యానికి  కొంత స్థానం వుంది.ఎటొచ్చీ,అది మితిమీరకుండా జాగ్రత్త వహించాలి.అసలుకు ఎసరు పెట్టే పనులు ఎవరికీ మంచివి కావు.కొన్ని అనువాదాల్లోకి రావు.ఎంత భీష్మించుక్కూచున్నా లాభంలేదు.ఎంతవరకు అవి అనువాదయోగ్యాలో ఆలోచించాలి.చైనీస్‌కవిత్వాన్ని ఎజ్రా పౌండ్‌ఆంగ్లంలోకి చక్కగా పట్టుకొచ్చాడు.కొంతవరకూ దానిక్కారణం వాటిలోని concrete imagery.  Polish అనువాదాలను సంకలిస్తూ ,జెస్వావా మిలోష్‌ (90వ పడిలో, ఈయనక్కూడా మాతృభాషలోనే రచించాలి అని గట్టి పట్టుదల)ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తాడు.అనువాదానికి పరిమితులున్నాయి.భారతీయ భాషల్లో,ఒక భాషనుండి మరొక భాష
లోకి అనువాదాలు భావం చెడకుండా పట్టుకురావచ్చు.ఇదే విధంగా ఆంగ్లం,ఫ్రెంచి,స్పానిష్‌ తదితర Romance/Germanic భాషల్లో పరస్పరానువాదాలు అంత కష్టం కావు.దేశకాలాలు మారితే అనువాదకుడి శ్రమ అధికమవుతుంది.

సాధకబాధకాలు

అనువాదాలెప్పుడూ మాతృభాషలోకే,నీరుపల్లమెరుగు అన్నంత సహజంగా..తొలుత గద్యంతో మొదలు పెట్టి,కొంచెం చేయి తిరిగాక కవిత్వం వైపు కన్నెత్తి చూడటం మంచిది.లేడికి లేచిందే పరుగు,ఇక్కడ సరిపోదు.భాష లోతులు తెలియాలంటే పలు మునకలు వేయాలి.ఆనుపానులు తెలిశాక ఎలా ఈదినా ప్రమాదం లేదు.కేవలం శుష్క పాండిత్యంతో శూలం తిప్పితే ఒరిగిదేమీ లేదు.సజీవభాషలోని లఘువు బిగువులను ఒడిసి పట్టుకొని ప్రయోగించగలిగినప్పుడే అనువాదాలు రాణించేది.పరభాషలో
మనకింత వెసలుబాటు అనగా సజీవభాషలోని తూగునూ,ఊనికనూ ,కాకువునూ హృదయగతం చేసుకొని ప్రయోగించగలిగే సామర్య్థం లేదు కాబట్టి,మనం ఆంగ్లంలోకి చేసే అనువాదాలు తరచూ తడి తక్కువ తపన ఎక్కువ అన్న నానుడిని నిజం చేస్తూ ఉంటాయి.

అనువాదం అందరివల్లా అయ్యే పని కాదు.కవిత్రయం మొదలుకొని ,శ్రీనాథుడి నుండి శ్రీ శ్రీ దాకా డొక్కశుద్ధిగలవారే ఇందులో ఆబోరు దక్కించుకొన్నారు.శ్రీ శ్రీ అనువాదాలు మూలవిధేయంగా ఉంటూనే,మూలానికి ధీటుగా ఉంటాయి.పోల్‌ఎల్వార్‌,ఎలిటస్‌,స్విన్‌బర్న్‌, డైలాన్‌థామస్‌ తదితరులందరూ తెలుగులోకి వచ్చి స్థిర పడ్డారు. ఇస్మాయిల్‌గారి పుణ్యమా అని ప్రపంచ కవుల్లో ముఖ్యులుదర్జాగా మన వసారాలో పీఠం వేసుకొని కూర్చున్నారు.స్మైల్‌ కవిత్వానువాదాలు అంతే ఖ్యాతిగడించాయి. అనువాదకుడికి ఇరుభాషల్లో కవిత్వం పోకడలు క్షుణ్ణంగా తెలిసి ఉండాలి.లేని పక్షంలో కాలు జారడం ఖాయం.రిల్కే విషయంలో Robert Bly (ఈయన ఇటీవల గాలిబ్‌
అనువాదాల్లో పాలు పంచుకొన్నారు.)లాంటి గొప్ప కవుల అనువాదాలు తేలిపోయాయి.జర్మన్‌కవి గొథే రచించిన Faust నాటకానికి పలు అనువాదాలు లభ్యమవుతున్నా, కొందరివే ప్రమాణంగా భావిస్తారు.కావున,మన శక్తి సామర్య్థాలను బేరీజు వేసుకొని ముగ్గులోకి దిగడం శ్రేయస్కరం.

చివరి మాటలు

అనువాదాలు కత్తి మీద సాము.వ్రతమూ చెడుతుంది..ఫలమూ దక్కదు.వీటికి మంచి సాధన, గొప్ప ఓర్పు కావాలి.కేవల నిఘంటు పరిచయం నీకు లాభించదు.సజీవ భాషలోని సౌందర్యం, నుడికారం మీద నీ పట్టు ఇవీ నీ ఆయుధాలు.అనువాదం ద్రవిడ ప్రాణాయామం కారాదు.కుప్పుస్వామయ్యర్‌ మేడ్డిఫికల్ట్‌ చేయవద్దు.సదరు కవి అచ్చంగా తెలుగులో కవిత్వచెప్పినట్టు ఉండాలి,కింద పడి పల్టీ అన్నట్టు కాదు.మూలంలోని శైలినీ,పదప్రయోగాన్ని,తూగునూ తీవ్రంగా పరిశీలించిన పిమ్మటే ఉద్యమించాలి.సంగీత గుణం మరీ అధికమైన వాటిజోలికి పోకు; కారణం,సంగీతం అనువాదానికి లొంగదు.

ఉదాహరణలు

ఏది మంచి అనువాదం ? అయితే ఎందుకు?
గతశతాబ్దంలో వచ్చిన ఉమర్‌ఖయ్యాం తెలుగు అనువాదాలను తరచిచూడటానికి ముందుగా కొంత చరిత్ర .ఉమర్‌ఖయ్యాం (10481122)కొంచెం అటూ ఇటుగానన్నయ కాలం వాడు.అప్పటి ప్రపంచంలో పేరుపొందిన గణితశాస్త్రజ్ఞుడు.మన గణితశాస్త్రవేత్త భాస్కరాచార్యుడు,గణితసార సంగ్రహం రాసిన పావులూరిమల్లన ఈయన తర్వాతి వారు.పారశీకులకు వేమన లాంటివాడు.కాలపరీక్షకు తట్టుకొని ,బహుళ ప్రాచుర్యం పొందిన రుబాయీలను Edward Fitzgerald(18091883)ఎంతో శ్రమకోర్చి అనువదించాడు.తర్వాత నాలుగు సార్లు తిరగరాశాడు.Swinburne, Rosetti లాంటి గొప్ప కవుల ప్రశంసలు లభించే సరికి ఈ అనువాదాలకు తిరుగులేకుండా పోయింది.

ముందు ఫారసీ మూలాన్ని పరిశీలిద్దాం.

తంగీ ఈ మైలాల్‌ఖాహదీవానీ
సద్దీ రమ్‌కీ బాయద్‌వనస్పీ నానీ
వాంగ్‌హ్‌మన్‌వత్‌నిష్టీడర్‌వీరానీ
ఖుష్టర్‌బూద్‌ఆజ్‌ముమ్లూ ఖటీ సుల్తానీ1
అంత్య ప్రాస అన్ని పాదాలకు ఉంది.సాధారణంగా రుబాయీల్లో మూడో పాదానికి అంత్యప్రాస ఉండదు.(fitz gerald దీన్నివిధిగాపాటించాడు).ఒక్కసారి చదవడంతోటే
లఘువుల కన్నా గురువులు ఎక్కువఉన్నాయని తెలిసి పోతుంది.చివరి పాదం కొంచెం దీర్ఘం,లేదంటే అన్నిపాదాలు దాదాపు సమంగా ఉన్నాయని చెప్పవచ్చు.

ఇక ఆంగ్ల అనువాదాన్ని పరిశీలిద్దాము

A Book of Verses underneath the Bough,
A Jug of Wine, a Loaf of Bread-and Thou
Beside me singing in the Wilderness-
Oh, Wilderness were Paradise enow!2

3 వ పాదాన్ని వదిలి ఎప్పటిలా అంత్యప్రాస పాటించాడు.భాష చాలా మూర్తంగా వుంది.మద్యం,పద్యం,ప్రేయసి,రొట్టె,చెట్టు వేటి ముందు ఒక్క విశేషణం కూడా లేదు..
విశేషణాలు చేసే పని వస్తువు గురించి చెప్పడం.కవిత్వానికి నామవాచకాలతో పని, విశేషణాలతో కాదు.వస్తు వర్ణనను పూర్తిగా పాఠకుడికే వదిలివేస్తున్నాడు.అరటిపండు
వలిచిపెట్టే పని చేయడం లేదు.దీనివల్ల  క్లుప్తతకు క్లుప్తత,కవిత్వ ప్రక్రియలో పాఠకునికి భాగస్వామ్యం ఒనగూరుతున్నాయి. భావతీవ్రత(lyrical tension) ఉంది.తను ..ప్రేయసి..ఏకాంత,నిర్జనారణ్యం..
క్లుప్తంగా ఉంది.మూలంలోని నడక,పొందిక,బిగువు దాదాపు అనువాదంలో వున్నాయి..

ఇంకోసారి,అనువాదంలో చూడవలసిన లక్షణాలు నాలుగు.
1.సజీవభాష 2.ఉద్వేగాలు 3.పదప్రయోగం 4.తన పైత్యం
సజీవభాషలోనే ఉద్వేగాలు సవ్యంగా వ్యక్తమవుతాయి.వేటి ద్వారా? మూర్తపదాల ద్వారా !
కాబట్టి సజీవభాష,ఉద్వేగాలు,పదప్రయోగం ఒకేవస్తువుకు మూడు ముఖాలు.లోపలికి వెళితే వాటిమధ్య అసలు భేదం లేదు.ఈ మూడు ఉంటే చివరి లక్షణం తనపైత్యం లేనట్టే.తనపైత్యం ఉందంటే,ఆ నిష్పత్తిలో ఈ మూడింటికి అనగా కవితాభివ్యక్తికి హాని ,నష్టం వాటిల్లుతాయి.

ఇక తెలుగు అనువాదాల్లోకి ప్రవేశిద్దాము.మొదట కరుణశ్రీ.

1.కరుణశ్రీ 1987

కరమున పానపాత్ర ; బిగికౌగిట చేరి చకోరనేత్ర; అం
బరమున చంద్రరేఖ; ఇటుపక్కన చక్కని పూలతోట; అ
ద్దరిసెలయేరు; ముందర సుధామధుకావ్యము, కందళించు సుం
దర సుషమా సుఖంకర దినంబులు మాకు క్షణంబులై చనున్‌

అనువాదంలో పైన పేర్కొన్న లక్షణాల్లో చివరిది అనగా తనపైత్యం హిమాలయాలను తాకుతుందని చెప్పవచ్చు.కాబట్టి కవిత్వం అటకెక్కింది. మూలాన్ని మూలన తొక్కి “ఇంతింతై ” అని విస్తరించింది అనువాదం..మూలంలో పానపాత్ర చేతిలో ఉందని ఎక్కడా చెప్పలేదు.సరే దాన్ని వదిలేద్దాం.ప్రేయసి (అందునా,చకోర నేత్ర!మూలంలో ఆమె గురించి పల్లెత్తు మాట లేదు) బిగికౌగిట చేరింది.ఇది ఖచ్చితంగాపైత్యమే.బరితెగించాక హద్దూ ఆచారాలు ఎవడిక్కావాలి? వెంటనే అంబరమున చంద్రరేఖ ప్రవేశించింది. ఖయ్యాం,అది రాత్రని,పగలని చెప్పిన పాపాన పోలేదు.ఇటుపక్కన చక్కని పూలతోట (అది కరుణశ్రీ obsession,కాబట్టి అదీ ఉండవలసిందే).ముందరి సుధా మధు కావ్యము (అనవసర విశేషణాలు,ఉమాకాన్తం  గారి మాటల్లో దండుగ్గణాలు).కందళించు సుందర సుషమా సుఖంకర దినంబులు(మళ్ళీ,దండుగ విశేషణాలు);మాకు క్షణంబులై చనున్‌. నాకు ఇక్కడికి వచ్చేసరికి అనిపిస్తుంది,అసలీయన అనువదించింది ఉమర్‌ఖయ్యాం నేనా ? లేదా ఏదో పోనీలే పాపం అని ఆయన బోర్డు తగిలించుకొని తనే ఉచితవైద్యం చేసినట్టుంది! ఊరూరా పేరు మారుమోగిన వారి అనువాదాలు(?) ఇలా అఘోరిస్తే,ఇక తెలుగులో అనువాదసాహిత్యం ఏ గంగలో కలవను? అలవాటు మీద అవధానిలా ఏదో కూర్చడం తప్ప, అనువాదానికి/కవిత్వానికి కావలసిన పరిణతి భూతద్దం పెట్టి చూసినా కనిపించడం లేదు.ఈ పద్యంలో సజీవభాష హుళక్కి అని వేరే చెప్పాలా ?

2.ముద్దుకృష్ణ 1968

చెట్టునీడుండి రుచియైన రొట్టె ఉండి
దివ్యమైనట్టి శృంగార కావ్యముండి
పరవశము చేయగల మధుపాత్ర ఉండి
పాడుచును హాయిగా నీవు పక్కనుండ
వట్టిబయలున స్వర్గమే ఉట్టిపడును.

(రుచియైన)రొట్టె ,(దివ్యమైనటువంటి శృంగార)కావ్యం,(పరవశము చేయగల)మధుపాత్ర; ఇవి ఈయన పదప్రయోగాలు.బ్రాకెట్లలోనివి విశేషణాలు;మూలంలో రొట్టె రుచిగా ఉందని, కావ్యం శృంగారమని అందునా దివ్యమని,మధుపాత్ర పరవశం చేయగలదని(ఐనా వేరే చెప్పాలా, ఇది ఇంకో సూక్ష్మదోషము)ఉమర్‌ఖయ్యాం ఎక్కడైనా చెప్పాడా?లేదు .మరెలా ప్రవేశించాయి? (ఈయనకు గానీ కర్ణపిశాచి ఏమైనా ఉందా ??).మనకు తెలిసిన చివరి లక్షణం అనగా తనపైత్యం వల్ల. పౖౖెత్యం వుంది అంటే మిగిలిన మూడు లక్షణాలు లేనట్టే.సజీవభాష,ఉద్వేగాలు,పదప్రయోగాలు అన్నీ బంగాళాఖాతంలోకి.

3.ఎం.ఆర్‌.బలరామాచార్య 1962

దట్టమైన చెట్టుకొమ్మ తలపై గొడుగును పట్టెను
కాళ్ళకిందుగా పచ్చని గడ్డి తివాసీ పరచెను
మధుపాత్రిక చంకలోన,ఎదుట గ్రాసమొక్క రొట్టె
హస్తమ్మున సరసకావ్య మన్నింటిని మించినీవు

బలరామాచార్యులు సామాన్యులు కారు.ఇంకా ఒకడుగు ముందుకేసి తలపై గొడుగు పట్టిస్తున్నారు.గడ్డి తివాసీ పరిపిస్తున్నారు.కరుణశ్రీ పానపాత్ర కరమున ఉందంటే, ఈయన ఏకంగా  “చంకలోన” ఇరికిస్తున్నారు.మూలాన్ని గాలికొదిలేసి రాయడమంటే ఇదే.సరే దానివల్ల కవిత్వానికి లాభం కలిగిందా అంటే అదేమీలేదు.రెండవతరగతి పిల్లవాడి ఎక్కాలపుస్తకంలా ఉంది పద్యనిర్వహణ. దీనికి కారణం చివరి లక్షణమే..

4.మేకా రంగయ్యప్పారావు 1958

ఈ చెట్టు నీడలో ఆ ద్రాక్షారసముతో
నా చేతి పండ్లతో నీ గొంతుపాటతో
తీ తేనె కావ్యమ్ముతో వనమెల్ల నందనమె
ఓ ప్రేయసి!ఓ ప్రేయసి! ఇది స్వర్గమె!ఇది స్వర్గమె !

మొదటిపాదము ఫర్వాలేదు;చేతిపండ్లు,గొంతుపాట వికారం కలిగిస్తున్నాయి.మళ్ళీ తీ తేనె కావ్యము.చివరి పాదంలో మామూలుగా చెబితే ఎక్కదని పునరావృతి! నిర్జీవభాష.. ఉద్వేగాలు నట్టేట కలిసిపోయాయి.ఇందులో వలపుకన్నా తిండి చింత ఎక్కువగా ఉంది.

5.కనక మేడల 1957

దట్టమైన చెట్టునీడ,రొట్టెముక్క మధుపాత్ర
పాటపొత్తం పక్కనీవు పాడుతుంటే అడవే స్వర్గం

కనకమేడల ఉమర్‌ఖయ్యాంని మించి సారాంశాన్ని రెండు వాక్యాల్లో చెప్పివేశాడు కదా అని ఎవరైనా తుంటరి ప్రశ్న వేయవచ్చు.ఈ రెండు వాక్యాల్లో అవే తప్పులు. (దట్టమైన)చెట్టునీడ,(పాట)పొత్తం;మూలంలో ఎంత జాగ్రత్తగా ఉన్నాడు కవి.అటువంటి కవిత్వాన్ని “దాగుడుమూత దండాకోర్‌పిల్లీ వచ్చే ఎలకా భద్రం” స్థాయికి దించివేశారు.దీనిక్కారణం కేవలం పైత్యదోషం కాదు.వీరెవరూ కవులు కారు.పోనీ కవిత్వాన్ని,కవిత్వభాషనీ గుర్తించగల పరిజ్ఞానం లేదు. పద్యాన్ని నడపడమే కవిత్వమనుకొంటున్నారు.అందునా ఉమర్‌ఖయ్యాం లాంటి కవిని తెలిసీ తెలియని తనంతో అనువదించబూనుకోవడం చాలా సాహసం.కవిత్వానికి చాలా హృదయ
పరిపాకం ,ఉద్వేగప్రవృత్తి,క్లుప్తత కావాలి.ఇవన్నీ కేవలం పుస్తకాల్లో మునిగిపోయే జడప్రాయులకు అబ్బవు.

6. చలం 1960

చెట్టునీడలో కూచున్న మనకేం కావాలి
ఓ రొట్టె ఓ కావ్యమధువు
నా పక్కన కూచుని నీవు పాడుతో
ఎడారి స్వర్గమవుతుంది

అనవసర విశేషణాలు లేవు.సూటిగా వుంది.సజీవభాషలో;ఇందులో మనకు అర్థం కానిదేమీలేదు.డాబు,దర్పం లేవు.సరళంగా,నిజాయితీగా ఉంది.ఇదీ కవిత్వ లక్షణం.సజీవభాష,ఉద్వేగాలు,పదప్రయోగం,అన్నీ ముద్దగా కరిగినటువంటి అనువాదం.ఇక్కడ పైత్యానికి ఆస్కారం లేదు.దీనివల్ల తెలిసివచ్చేది ఏమంటే గొప్పజీవితం నుండే గొప్ప కవిత్వం,గొప్ప అనువాదం పుట్టుకొస్తాయి.

ఖయ్యాంను వీరందరికంటే ముందుగా ఫారసీ నుండి అనువదించిన ఆదిభట్ల వారిలో ఇవే లక్షణాలు కనిపించడం ఆశ్చర్యకరం.

7. ఆదిభట్ల నారాయణదాసు (18641945)

ఇక్షుచ్ఛాయే స్వాదుష్టాన్నం
అభీష్టం మధు పుస్తకం
త్వమత్ర యదీ గాయంతి
నూనం స్వర్గాయతే మహీ

ఆయన ఒకడుగు ముందుకేసి “స్వాదుష్టాన్నం” అన్నారు.కారణం ఖయ్యాం రొట్టె మన రొట్టె ఒకటి కాదు.మక్కీకి మక్కీ అలాగే చేయనవసరం లేదు.పైన పేర్కొన్న
పద్యాల్లోని బలహీనత ఇందులో మచ్చుకైనా కనిపించదు.వృధాగా విశేషణాలు వాడలేదు.పైత్యప్రకోపం లేదు.సంస్కృతానికి,సజీవమా ,నిర్జీవమా అన్న గొడవలేదు.పదప్రయోగం బహుక్లుప్తం,మూర్తం(concrete) కూడా.ఇది పండితలక్షణం..

పోతే చివరిగా హరివంశరాయ్‌బచ్చన్‌(అమితాబ్‌తండ్రి).ఈయన కూడా మనసోదర కవులు(?)చేసిన తప్పులన్నీ మరింత పైలా పచ్చీసుగా చేశాడు.

హరివంశరాయ్‌బచ్చన్‌

ఘనీ సిర్‌పర్‌తరువర్‌కీ డాల్‌
హరీ పావోంకే నీచే ఘాస్‌
బగల్‌మే మధుమదిరా కా పాత్ర్‌
సామ్నే రోటీకే దో గ్రాస్‌
సరస్‌కవితాకీ పుస్తక్‌హాథ్‌
ఔర్‌సబ్కే ఊపర్‌తుమ్‌ప్రాణ్‌
గా రహీ చేఢ్‌సురీలీతాన్‌
మురేX అబ్‌ మరు నందన్‌ఉద్యాన్‌

ఆ ఘరానా దోషాలు,పాఠకుడి మీద జాలిపడి వివరణకు పూనుకోవడం.మూలంలో నాలుగుపాదాలుఅనువాదంలో రెట్టింపు..కవితా స్ఫూర్తి ఘోరంగా దెబ్బతింది..ఉరామరికగా అనువాదం,కేవలం భావం తెలియడానికి

దట్టం తలపైని చెట్లకొమ్మలు
పచ్చగా పాదాలకింది గడ్డి
పక్కన మధుమదిరా పాత్ర
ఎదుట రెండు రొట్టెముక్కలు
చేతిలో సరసకవితాపుస్తకం
అన్నింటినీ మించి నా ప్రాణమా
సురగీతం పాడుతూ నీవు
ఇపుడు,మరునందన ఉద్యానం..

మూలంలో లేనివన్నీ కల్పించి కూర్చాడు బచ్చన్‌.విశ్వనాథ సత్యనారాయణ జ్ఞానపీఠ్‌ ఉత్సవంలో హిందీకవులకు చేసిన హితబోధ గుర్తుకొస్తుంది “మీరు అనువాదాలు చేస్తున్నప్పుడు..అంత్యప్రాసల ఢమఢమలు కాస్త తగ్గిస్తే బాగు. లేనిచో ఇతరభాషల కవిత్వం..అగ్గిలో గుగ్గిలం “(యథాతథంగా ఆయన మాటలు కావు, భావం మాత్రమే).స్వస్తి.

References:

1.The Original Rubaiyyat of Omar Khayyam -Robert Graves,Omar Ali shah
ఇందులో పైన పేర్కొన్న ఫార్సీ రుబాయీకి పాఠాంతరం కనిపిస్తుంది.దీనికి కారణం Fitzgerald,1859 అనువాదాలు 15 శ.రాత ప్రతిని(అదిభట్ల వారి అనువాదాలకు ఇదే మాతృక అనిపిస్తుంది) ఆధారంగా చేసుకొంటే,దానికి Graves-Ali,12 శ.  ప్రతిని ఆధారంగా గ్రహించారు.
2.Rubaiyat of Omar khayyam -Edward Fitzgerald.(EF)
బహుళ ప్రచారంలో ఉన్నదిదే.అనువాదకుడు ఎక్కువ స్వేచ్చను తీసుకొన్నాడు అని పై రచయితల ఆరోపణ.ఏది ఏమైనా,ఉమర్‌ఖయ్యాం ఇతని(EF) వల్లే జీవం పొసుకొన్నాడు.ఖయ్యాం జీవిత,దృక్పథం మీద ఇతను వెలిబుచ్చిన అభిప్రాయాలను కొంతమంది ఎక్కువ పట్టించుకొన్నట్లు తోస్తుంది.
3.The Rubaiyat of Omar Khayyam -Peter Avery & John Heath Stubbs
ఉమర్‌ఖయ్యాం రచనలు,అప్పటి చారిత్రక పరిస్థితుల మీద చక్కని పుస్తకం.ఇతని కవిత్వాన్ని సూఫీ పరంగానే వ్యాఖ్యానించకపోతే అన్యాయం జరిగిపోతుంది,అని సంప్రదాయికుల వాదం.ఖయ్యాఅప్పటి కాలపరిస్థితులకు ఎదురీదిన సంశయ వాది, శాస్త్రజ్ఞుడు,కవికాబట్టి ఏకపక్ష ఆధ్యాత్మిక వ్యాఖ్యానాలు అసలుకు ఎసరు పెడతాయి అని ఆధునికుల అభిప్రాయాలు.ఈ గ్రంథ రచయితలది,రెండవ మార్గం,కాబట్టి EFని Graves-Ali ల్లా కాకుండా సమాదరించారు.వీరి అనువాదమూలవిధేయం.
4.ఉమర్‌ఖయ్యాం రుబాయీలు చలం,1960 EF  ఆధారంగా మన భాషలో వచ్చిన ఉత్తమ అనువాదం.

కృతజ్ఞతలు ఫార్సీ మూలం చదివి పెట్టిన ఖైర్‌కు;”సమయానికి తగు మాటలాడిన” వి ఎ కె రంగారావు ,మద్రాసు గారికి.

రచయిత తమ్మినేని యదుకులభూషణ్ గురించి: తమ్మినేని యదుకుల భూషణ్‌ జననం రాయలసీమలోని చారిత్రకస్థలం తాడిపత్రిలో. కొన్నాళ్ళు సింగపూర్‌లో పనిచేసారు. నివాసం సోమర్‌సెట్‌, న్యూజెర్సీలో. "నిశ్శబ్దంలో నీ నవ్వులు" అనే కవితాసంకలనం ప్రచురించారు. కథలు, విమర్శలు కూడా రాసారు.  ...