పదహారేళ్ళ మా పిల్లాడు ఒక కేథలిక్ హైస్కూల్లో పదకొండవ తరగతి చదువుతున్నాడు. వాడి చిన్నప్పటి నించీ వాడిని పెంచడంలో ఎక్కడ తప్పులు చేస్తానో అని నన్ను నేను చెక్ చేసుకుంటూనే వస్తున్నాను. నాకిష్టం లేకపోయినా అమెరికన్ ఫుట్‌బాల్ టీమ్‌లో చేరనిచ్చాను. వాడికోసమని అర్థం కాకపోయినా వాడి ప్రతీ మాచ్కీ వెళ్ళాను. నెగ్గినప్పుడల్లా వాడితో పాటూ నేనూ సంతోషించాను. ఓడినప్పుడల్లా వాడితో పాటూ నేనూ విచారిమ్చాను. ఐదవ తరగతి నించీ వాడిని ప్రైవేటు స్కూళ్ళో చేర్పించాను ఖర్చు ఎక్కువైనా. వాడికి కావలసినవన్నీ కొంటూనే వున్నాను. వాడికి స్నేహితుడిలా కూడా ప్రవర్తించేవాడిని. ఫ్రీగా ఆర్య్గూ చేయనిచ్చేవాడిని. బేంక్ బేలన్సులూ, నా జీతం అన్నీ తెలుసు వాడికి. చిన్నపిల్లాడిలా ట్రీట్ చెయ్యకుండా అన్ని విషయాలూ చెప్తూవుండేవాడిని. అడిగినప్పుడల్లా డబ్బు ఇచ్చేవాడిని ఏం కొనుక్కోడానికన్నా. నాకిష్టం అయిన కర్నాటక సంగీతం క్లాసులు మానేసి, వాడి కిష్టమయిన కరాటే క్లాసులకి వెళతానంటే అలాగే ఒప్పుకున్నాను. పక్కా శాఖాహారినయినప్పటికీ, స్కూళ్ళో మాంసం తినడం నేర్చుకుని ఆ రుచుల కోసం అడుగుతూ వుంటే, వాడి కోసమ్ నేర్చుకుని ఇంట్లో మాంసం వండేవాడిని.