పలాయనం

శనివారం తెల్లవారు ఝాము. సమయం అయిదు. అలారం మోగగానే, చటుక్కున లేచాడు సుబ్బారావు. అప్పటికే అతని భార్య సుబ్బలక్ష్మి నిద్ర లేచేసింది. సుందరమైన ప్రసన్న వదనంతో సుబ్బారావు ముఖ ప్రక్షాళనం కానిచ్చి, హైకింగు బట్టలు తొడుక్కుని వంటింట్లోకి వెళ్ళాడు.

ఇండియాలో వాళ్ళ పల్లెటూళ్ళో వుండేటప్పుడు, పనుల మీద కాలవ గట్టులూ, గుట్టలూ, కొండలూ ఎక్కడం అనేది జీవితంలో ఓ భాగంగా వుండేది. పెద్ద చదువులు చదివి, పెద్ద ఉద్యోగాల కోసం ఇతర దేశాలు చేరుకుని, ఆరోగ్యం కోసం అటువంటి గుట్టలూ, కొండలూ హైకింగు అనే పేరుతో ఎక్కి రావల్సి వచ్చింది సుబ్బారావుకి. మానసిక శ్రమ తప్ప శారీరక శ్రమ లేని ఉద్యోగాలాయే.

వంటిట్లో సుబ్బలక్ష్మి స్టవ్ మీద పాలు కాస్తోంది ఇత్తడి గిన్నెలో. డైనింగు టేబుల్ మీద ప్లేట్లో రెండు ఇడ్లీలూ, పక్కనే కారప్పొడీ. ఇడ్లీల మీద నేతితో సుతారమైన పూత. వాటిని చూడగానే సుబ్బారావుకు నోరూరింది.

“ఎందుకు లక్ష్మీ, పొద్దున్నే ఇంత కష్ట పడతావు నా కోసం? ఏదో కాస్త కార్న్ ఫ్లేక్స్ తినేసి వెళ్ళేవాణ్ణిగా?” అని సుబ్బారావు ఎంతో ప్రేమగా అడిగాడు.

భర్త కంఠస్వరం లోని ప్రేమకి సుబ్బలక్ష్మి వదనం విప్పారింది.

“అదేంటండీ, అలా అంటారూ? మీరిప్పుడు ఓ మూడున్నర గంటల సేపు హైకింగుకి వెళతారు కదా? ఖాళీ కడుపుతో వెళితే పొట్టలో వికారం పెడుతుంది. ప్రతీ వారం అదే కార్న్ ఫ్లేక్స్ తినాలంటే విసుగు పుట్టదూ? మీ కోసం ఓ రెండిడ్లీలు చెయ్యడం ఎంత పనీ?” అంది ముసి ముసిగా నవ్వుతూ.

భర్త తనని మెచ్చుకున్నప్పుడల్లా ఆవిడకి తనువు పులకరిస్తుంది. అంత గాఢంగా అర్థం చేసుకునే అర్థాంగి లభించి నందుకు సుబ్బారావు తృప్తిగా నిట్టూర్చాడు.

ఒక్క నిమిషంలో రెండిడ్లీలూ గుటుక్కు మనిపించి, చక్కగా కాస్త యాలకుల పొడీ, ఓ పిసర కుంకుమ పువ్వూ తగిలించి, పంచదార కలిపిన వేడి వేడి పాలు అర్థ నిమీలిత నేత్రాలతో సేవించి, హైకింగు బూట్లు తొడుక్కుని, సుబ్బలక్ష్మికి, ‘బై’ చెప్పి, అపార్టుమెంటు నించి బయట పడ్డాడు.

ఆ అపార్టుమెంటు కాంప్లెక్సులో కొంత మంది మగాళ్ళందరూ కలిసి, శనాదివారాలు హైకింగుకి వెళుతూ వుంటారు. అందరూ నడి వయసులో పడ్డ వారే. ఆరోగ్యం మీద ఎంతో శ్రద్ధ వాళ్ళకి.

“కాఫీ తాగారా సుబ్బారావు గారూ?” అంటూ ఆప్యాయంగా పలకరించాడొకాయన.

“శుభోదయం పెద్దిభొట్ల వారూ! నేను కాఫీ, టీలకి చాలా దూరమండీ! రెండిడ్లీలు తిని, వేడి పాలు తాగొచ్చానండీ!” అంటూ విప్పారిన మొహంతో బదులిచ్చాడు.

అందర్నీ ఇంటి పేర్లతో సంబోధించడం సుబ్బారావుకి అలవాటు. దాని వల్ల వారిని తాను గౌరవిస్తున్నానని సంతోషిస్తాడు. దానికి ఎవరూ అభ్యంతర పెట్టరు కూడా. వాళ్ళకి కూడా అలా పిలిపించుకోవడం ఇష్టమే. కొంత మందైతే తమ వంశం పేరు వినగానే పరవశం చెందుతారు కూడా. కాకి ఇంటి పేరు కాకికి గొప్ప కదా?

“సుబ్బారావు గారంత అదృష్టవంతులు ఈ ఇలలో వేరొకరు లేరనుకోండీ! ఆయనకి వాళ్ళావిడ అన్నీ చేసి పెడతారు” అన్నాడు ఇంకొకాయన కాస్త అసూయగా. ముసి ముసిగా నవ్వాడు సుబ్బారావు.


అందరూ ఒకే వేన్‌లో హైకింగు స్థలానికి వెళ్ళారు. అక్కడ ఇంకో ఇద్దరు, ముగ్గురు కలిశారు వీళ్ళతో. అందరి వదనాలూ ఆరోగ్యంగా, కాంతివంతంగా వున్నాయి. ఆ సమూహంలో అందరూ తెలుగు వాళ్ళే. ప్రతీ ఒక్కరికీ సాహిత్యంతో ఎంతో గట్టి పరిచయం. ఒకరిద్దరు కాస్త కధలూ, కవితలూ రాసి, పత్రికల్లో ప్రచురిస్తూ వుంటారు.

దార్నిండా సాహిత్యం గురించి చర్చలే! శ్రీశ్రీ, తిలక్, వగైరాల కవిత్వం గురించి ఘాటు వాదోపవాదాలు. కొత్త కవుల కొత్త కవిత్వాల మీద వెటకారాలు. నానీల మీద నవ్వుతూ జోకులు. ఇంక కధల విషయం చెప్పక్కర్లేదు. ఏ రచయితలో ఏ కోణం ఎంత అద్భుతంగా వుంటుందీ అనే వర్ణనలు. ప్రస్తుతం వెలువడుతున్న వెబ్ పత్రికల తీరూ,తెన్నుల మీద అభిప్రాయాలు. సాహిత్యంతో వూరుకునే వ్యక్తులు కారు. పిల్లలూ, వాళ్ళ చదువులూ, వాళ్ళతో మెలగాల్సిన తీరూ, అన్నీ చర్చించారు. ఇంటి పనుల విషయంలో కూడా అందరూ సమర్ధులే. ఆవ పెట్టిన కూరల దగ్గర్నించీ, పులుసు పెట్టిన కూరల దాకా మాట్టాడుకున్నారు. కాస్సేపు కొత్త వంటల గురించి మాట్టాడుకున్నారు. తలొకరూ తలో ప్రాంతం నించీ కావటంతో, సమైక్య ఆంధ్ర ప్రదేశ్ అక్కడఏకళ కళ లాడింది. అందులోనూ పొరుగు ప్రాంతం వారి వంటలంటే వేరే ప్రాంతం వారికి ప్రీతి. అందరి కందరూ మంచి భోజన ప్రియులే మరి!

ఇన్ని ఉత్తమ లక్షణాలున్న వ్యక్తులు సంఘ సేవ మాత్రం వదిలి పెడతారా? కొంత మంది ఆసుపత్రుల్లో సాయం చేస్తే, కొంత మంది మురికి వాడల్లో కాలవలు కడుగుతారు. కొంత మంది రెడ్ క్రాస్ వాళ్ళకి సాయం చేస్తే, మరి కొంత మంది వయోవృద్ధుల ఆశ్రమాల్లో పని చేస్తారు.

అందరూ ప్రతీ యేడాదీ ఇండియాకి వెళ్ళి తమ తల్లితండ్రులతో గడిపే వారే. రెండేళ్ళ కోసారి తమ తల్లితండ్రులని అమెరికాకి తీసుకొచ్చే వారే. అలా తమ పిల్లల్ని తమ తల్లితండ్రులకి దగ్గర చెయ్యాలని ప్రయత్నిస్తారు. అందుకని కాస్సేపు తమ ఇండియా ప్రయాణ వివరాలు మాట్టాడుకున్నారు.

మొత్తానికి హైకింగు చాలా ఆహ్లాదంగా ముగిసింది ఆ రోజుకి. మర్నాడు ఇంకా కొంచెం ఎక్కువ సేపు హైకింగు చెయ్యాలని నిర్ణయించుకుని, ఆ రోజుకి ఒకరి నించొకరు శలవు తీసుకున్నారు.


తలుపు తీసి అపార్టుమెంట్లోకి అడుగు పెట్టిన సుబ్బారావుకి స్వర్గమనేది ఎక్కడో లేదూ, ఇంట్లోనే వుందీ అనే అద్భుతమైన, ఆనందమైన, ప్రేమ పూరిత భావన. హోం, స్వీట్ హోం అని ఊరికే అనలేదు కదా పెద్దలు?

పిల్లలిద్దరూ కార్పెట్ మీద కూర్చుని, ఎంతో ఇష్టంగా చదివేసుకుంటున్నారు. అప్పుడే స్నానాలు చేసి, ఉతుకుడు బట్టలు తొడుక్కుని, కడిగిన ముత్యాల్లా మెరిసి పోతూ వున్నారు. తండ్రిని చూడగానే, “నాన్నా, నాన్నా” అంటూ వచ్చి తండ్రిని చుట్టేశారు.

“వుండండర్రా బంగారు కొండలూ! హైకింగు చేసి, చెమటతో వున్నాను. స్నానం చేసి వస్తాను” అంటూ సున్నితంగా విడిపించుకున్నాడు.

“మరేం నాన్నా! మేం రేపటి హోం వర్కు కూడా ఇవాళే చేసేశాము. వచ్చే వారం పరీక్షల కోసం అన్నీ ముందరే చదివేశాము. స్కూల్లో ఇంకా చెప్పని పాఠాల్లో ఏముందా అని చదువుతున్నాము. నువ్వు స్నానం చేసి, పూజ చేసుకున్న తర్వాత మాకు పరీక్ష పెట్టు నాన్నా! సాయంకాలం మమ్మల్ని డిస్నీ వాళ్ళ సినిమాకి తీసుకెళతానన్నావు కదా? అందుకని సాయంత్రం చదువు కూడా ఇప్పుడే చదివేస్తున్నాము” అని ముక్త కఠంతో చెప్పారు పిల్లలిద్దరూ.

వెంటనే సుబ్బారావుకి పిల్లలోత్సాహం కలిగేసింది. మందహాసం చేస్తూ పిల్లలిద్దరి తలలూ నిమిరాడు. పక్కనే వున్న వంటిట్లోకి తొంగి చూశాడు. అక్కడి దృశ్యం కన్నుల పండుగ్గా వుంది సుబ్బారావుకి. పరవశం కలిగి తనువంతా పులకరించింది.

సుబ్బలక్ష్మి శనివారమని తల స్నానం చేసి, పిడప పెట్టుకుంది. ఎలక్ట్రిక్ పొయ్యి మీద ఒక రాచ్చిప్పలో పప్పు పులుసు తెర్లుతోంది. ఇంకో పొయ్యి మీద ఇత్తడి బూర్లె మూకుడులో కంద ముక్కలు పొలో మని కమ్మగా వేగుతున్నాయి. అప్పుడే గంజి వార్చి వండిన అన్నం వాసన పెద్ద ఇత్తడి గిన్నె లోంచి నాసికా పుటాలని సున్నితంగా తాకుతోంది. ఇంకో పొయ్యి మీద మామిడి కాయ పప్పు, “నా అంత పరిమళ భరిత రుచికర పదార్థం వేరొకటి లేదన్నట్టు” ఉడుకుతోంది.

ఆ వంట వాసనలకి స్వర్గం ఇంట్లో, ముఖ్యంగా వంటిట్లోనే వుందని నమ్మాడు సుబ్బారావు. “ఏంటోయి ఇవాళ వంట?” అని అడిగాడు హాస్యంగా, అన్నీ కనబడుతూ వున్నా.

“మీరు స్నానం చేసొచ్చి పూజ ముగించే సరికి పూర్తయి పోతుంది వంట. శనివారం కదా, మీ చేత ఇవాళ పూజలో మహా నైవేద్యం పెట్టించాలన్నదే నా సంకల్పం. కొంచెం కొబ్బరి కాయ రోటి పచ్చడి చేసి, పులిహార కలిపేస్తే పెద్ద వంట అయిపోయినట్టే. పరమాన్నం వండటం, పులుసులో పోపు వెయ్యడం ఎంతసేపూ? చిటికలో అయిపోతుంది” అంది సుబ్బలక్ష్మి తృప్తిగా.

భార్య గురించి బయటి వాళ్ళు చేసే పొగడ్తల్లో అతిశయం ఏమీ లేదనిపించింది. “పులుసులో వేసే పోపులో ఇంగువ హీన పక్షం రుద్రాక్ష పరిమాణంలో వుండాలమ్మాయీ!” అన్నాడు హాస్యంగా, “మిథునం” కధలోని “అప్పదాసుని” అనుకరిస్తూ.

సుబ్బలక్ష్మి నవ్వింది భర్త హాస్యానికి సరదా పడుతూ. ఆవిడ కూడా ఆ కధ చదివింది. అంతే కాదు. పిల్లలిద్దరికీ కూడా ఆ కధ చెప్పింది. అందుకే వాళ్ళిద్దరూ కూడా తల్లి నవ్వులో పాలు పంచుకున్నారు.

స్నానం చేసి పూజకి కూర్చునే సరికి, సుబ్బారావు మొహంలో ఒక రకమైన తేజస్సూ, ప్రశాంతతా, వుద్వేగమూ! అన్నీ కలిసి వదనం కాంతి వంతమైంది. తండ్రి పూజకి కూర్చోగానే, పిల్లలు నిశ్శబ్దంగా అయిపోయారు. వంటిట్లో వంటలు వుడుకుతున్న శబ్దం తప్పితే, వేరే చప్పుడు లేదు. సుబ్బలక్ష్మి సెల్ ఫోనులు వైబ్రేటింగ్‌లో పెట్టి, ఇంటి ఫోను రింగరు తగ్గించేసింది. పిల్లలు అలికిడి చెయ్యకుండా చదువుకుంటూ, అప్పుడప్పుడూ తండ్రి వైపు భక్తిగా చూస్తున్నారు.

సహస్ర నామాలూ, అష్టోత్తరాలూ పూర్తి చేసి, పదకొండు రుద్రాలూ శ్రద్ధగా చేశాడు. అప్పటికి ఒక పెద్ద విస్తరిలో మహా నైవేద్యానికి అన్నీ సిద్ధం చేసింది సుబ్బలక్ష్మి.

ఆ విస్తరిలో అన్నం, మామిడి కాయ పప్పూ, కంద ముక్కల వేపుడూ, పప్పు పులుసూ, రోటి కొబ్బరి పచ్చడీ, ఇంట్లో తోడెట్టిన కమ్మటి పెరుగూ, వూరు మిరపకాయలూ, పులిహోరా, పరమాన్నం!

దేముడి పేరుతో ఇవన్నీ తినేది మనమే కదా అని సంతృప్తిగా అనుకున్నాడు. అసలే భోజన ప్రియుడైన సుబ్బారావుకి మహా నైవేద్యం నోరు కట్టుకుని పెట్టడం మహా కష్టమై పోయింది. వెంటనే నిష్టా గరిష్టమైన తన భక్తి గుర్తు చేసుకుని, తనని తాను సంభాళించుకున్నాడు. తృప్తిగా, సంతోషంగా మహా నైవేద్యం పెట్టాడు.

ఆ రోజు భోజనాన్ని ఓ పట్టు పట్టాడు. ప్రతీ పదార్థమూ రెండు సార్లకి తక్కువ కాకుండా కలిపాడు. సుష్టుగా తిని త్రేన్చాడు. “సారీ పిల్లలూ” అంటూ పిల్లల వేపు చూశాడు. వాళ్ళు కిసుక్కున నవ్వారు. భోజనం చేస్తున్నంత సేపూ సుబ్బలక్ష్మిని ఆపకుండా పొగుడుతూనే వున్నాడు. భర్త మనసులోకి దారి అతని ఉదరం లోంచని ఎప్పుడో గ్రహించిన ఆ మహా ఇల్లాలు తృప్తిగా నిట్టూర్చింది.

“భర్తకీ, పిల్లలకీ కడుపు నిండా భోజనం పెట్టడం కంటే ఆనందకరమైన విషయమేముంది నాకు?” అని కూడా మనసులో అనుకుంది.
భుక్తాయాసంతో పడగ్గది వేపు నడుస్తున్న తండ్రిని చూసి పిల్లలిద్దరూ అర్థమయిందన్నట్టు నవ్వారు.

“పిల్లలూ! కడుపు నిండా తినడం అయింది. కాస్సేపు కంటి నిండా నిద్రోయి వస్తాను. అప్పటి వరకూ మీరు చప్పుళ్ళు చెయ్యకుండా, క్యూమాన్ స్కూలు లెక్కలు చేసుకోండి. సాయంకాలం మిమ్మల్ని సినిమాకి తీసుకెళతాను. మధ్యలో కాస్సేపు అమ్మకి సాయం చేయండి” అంటూ లోపలకి నడిచాడు సుబ్బారావు.

పిల్లలిద్దరూ సంబరంగా తలలూపారు. తృప్తిగా నిద్రా దేవి ఒడిలోకి ఒరిగాడు సుబ్బారావు.



అలారం మోగగానే వులిక్కిపడి లేచాడు సుబ్బారావు. కాస్సేపు ఎక్కడున్నాడో అర్థం కాలేదు. “జరిగిందంతా కలా? నిజంగా కలా? ఎంత మంచి కల! ఎంత మంచి కల! అబ్బ! కలలోగా జీవితం వుంటే ఎంత బాగుణ్ణు!” అని కొంతసేపు మధన పడ్డాడు. కలలో కాకపోతే, అన్ని రుచికరమైన పదార్థాలు తినే యోగం తన కెక్కడ పడుతుందీ అని తనని తాను సమాధాన పరుచుకున్నాడు. అప్పుడే తెల్లారిందా అని అనుమానంగా టైం చూశాడు. శనివారం పొద్దున్న అయిదు గంటలయింది.

“అప్పుడే తెల్లారాలా” అని బాధగా నిట్టూర్చాడు సుబ్బారావు.

“అబ్బా! మీరు పడుకోరూ, నన్ను పడుకోనీరూ! వెంటనే అలారం ఆపరేం? మీ హైకింగు కాదు గానీ, నా ప్రాణాల మీద కొస్తుంది ప్రతీ శనాదివారాలూ” అని విసుక్కుంటూ అటువేపు తిరిగి, ముసుగెట్టి మళ్ళీ నిద్రలోకి జారుకొంది సుబ్బలక్ష్మి.

భావ రహితంగా అరుస్తున్న గడియారం నోరు నొక్కి, బాత్రూం లోకి వెళ్ళాడు. తెల్లవారు ఝామున కలిగిన మధుర స్వప్నం లోని అద్భుత అనుభూతులనూ, జిహ్వని పెంచే రుచులనూ తలుచుకుంటూ దంత ధావనం కానిచ్చాడు. “తెల్లారుగట్ట వచ్చిన కలలు నిజమవుతాయని” ఎవరో చెప్పిన విషయం గుర్తొచ్చి, పొంగిపోయాడు. మనిషి ఆశాజీవి కదా? బయటికి వచ్చి, రాత్రి కట్టుకున్న బట్టలు మార్చుకుని, వంటిట్లోకి వెళ్ళాడు.

“ఖాళీ కడుపుతో ఎక్సర్‌సైజు చేస్తే హానికరం” అని ఎవరో చెప్పారు సుబ్బారావుకి. అందుకని రెండు గుప్పెళ్ళ కార్న్ ఫ్లేక్స్, కప్పుడు పాలలో వేసుకుని తిన్నాడు. ఒక పెద్ద గ్లాసుడు ఆరంజ్ జ్యూసూ, ఓ పెద్ద అరటి పండూ లాగించాడు. ఆత్మారాముడు శాంతించాక, కొత్తగా కొనుక్కున్న హైకింగ్ షూస్ తొడుక్కుని బయటికి నడిచాడు. ఆ షూస్ కొనుక్కునేటప్పుడు, “మాక్కూడా కొత్త షూస్ కొను” అని పిల్లలు చేసిన హఠం గుర్తొచ్చినా, వెంటనే ఆ విషయం మర్చిపోయి, నిశ్శబ్దంగా వున్న ఇంట్లోంచి బయట పడ్డాడు.


“గుడ్ మార్నింగ్ సుబ్బారావు గారూ!” అంటూ ఒకాయన నీరసంగా, నిద్ర కళ్ళతో పలకరించాడు.

“ఏం గుడ్ మార్నింగో, ఏమిటో! పొద్దున్నే నిద్ర లేచి రావడం నానా యాతనగా వుంది సుమండీ!” అంటూ వాపోయాడింకొకాయన.

ఆ అపార్టుమెంటు కాంప్లెక్సులో వున్న నడి వయసు తెలుగు వాళ్ళు ఒక గుంపుగా హైకింగుకి వెళతారు. అందర్నీ వాళ్ళ ఫిజికల్ చెకప్ రిపోర్టులు భయ పెడుతూ వుండటం వల్ల, మనసుని మంచి చేసుకుని, కనీసం వారం చివర్లోనయినా కొంచెం వ్యాయామం అవుతుందని హైకింగుకి బయల్దేరుతారు. ఒంటరిగా వెళితే మోటివేషన్ వుండదని, ఒకర్ని చూసి ఇంకొకరు మోటివేట్ అవుతూ, ఒక గేంగ్‌లా వెళుతూ వుంటారు. కిట్టని వాళ్ళు వాళ్ళని “తొట్టి గేంగ్” అని కూడా పిలవడం కద్దు.

ఇంతలో ఒకాయన కాఫీ కప్పుతో వచ్చాడు హైకింగుకి బయలు దేరడానికి.

“చక్కగా మీ శ్రీమతి గారు కాఫీ కలిపిస్తే, గుటకలేస్తూ వచ్చారా?” అని నవ్వుతూ అడిగాడు సుబ్బారావు.

“మా ఆవిడ కాఫీ కలిపివ్వడమా, మరోటా? ఆవిడ హాయిగా, సుబ్బరంగా నిద్రోతూ వుంది ఇంట్లో. నేనే బ్రూ కాఫీ మైక్రోవేవ్‌లో కలుపు కొచ్చాను” అన్నాడాయన నిరుత్సాహంగా. ఆయనకి తన భార్య చేత సేవలు చేయించుకోవాలని మహా కోరిక.

“కిందటి సారి నా వేన్‌లో వెళ్ళాం. ఈసారి మీ వేన్‌లో వెళదాం. ఏమంటారూ?” అంటూ సుబ్బారావు ఒకాయన భుజం తట్టాడు.
పెట్రోలు ధరలు ఎంపైర్ స్టేట్ భవనం శిఖరాగ్రాన్ని అంటుతున్నాయి మరి.

“సరేనండీ!” అంటూ ఏడ్వలేని నవ్వు మొహంతో తన వేన్ తీసుకొచ్చాడాయన.

హైకింగు స్థలంలో ఒకరిద్దరు కలిశారు. అందరి మొహాలూ బలవంతపు బ్రాహ్మణార్థానికి వచ్చిన వాళ్ళవిలా వున్నాయి. ఒకరికి షుగర్ ఎక్కువ. “కంట్రోల్లో లేదూ, కాలో, కన్నో తీసేయ్యాల్సి వస్తుంది తొందర్లో” అని డాక్టరు బెదిరించడంతో, భయంతో వచ్చాడాయన.

ఇంకొకాయనకి, “గాలి పీల్చినా కొలస్ట్రాల్ పెరిగి పోతోంద”ని బాధ. పకోడీలూ, వేపుళ్ళూ, సమోసాలూ వదలడాయె. “ఎప్పుడో ఢామ్మని గుండాగి పోతుందని” డాక్టరు తిడితే, కొలస్ట్రాల్ తగ్గించుకోడానికి వచ్చాడాయన.

అలాగే ఒకరికి ట్రై గ్లిసరైడ్స్ ఎక్కువయితే, ఒకరికి లివర్ ఫంక్షన్ ఘోరంగా వుందని కంప్లైంటు. అందరూ ఎయిర్ కండిషన్ ఆఫీసుల్లో, కాలు కదపకుండా కంప్యూటర్ ముందర పని చేసే వుద్యోగస్తులే! కొవ్వు పేరు కోక ఏమవుతుందీ? తిండి తగ్గించరు. ఇంటి పనులు చెయ్యరు. “హైకింగు చేశాంగా వీకెండులో” అని అంటారూ, అనుకుంటారూ.

“ఏంటండీ? ఈ మధ్య మీరు కాస్త ఒళ్ళు చేసినట్టున్నారూ?” అడిగాడొకాయన ఇంకొకాయన్ని.

ఆ ఇంకొకాయన తెగ బాధ పడిపోయాడు. “ఏమిటోనండీ? ఎంత వీకెండులో హైకింగు చేస్తున్నా కిందటి వారం కన్నా కాస్త బరువు పెరిగాను” అంటూ వాపోయాడు.

మొత్తానికి హైకింగు మొదలు పెట్టారు. బాధ తెలియకుండా వుండేటందుకు మాటలు మొదలు పెట్టారు.

“ఇండియాలో రియల్ ఎస్టేట్ ఎంతలా పెరిగి పోయిందో చూస్తున్నారా? అమెరికాలో కన్నా ఇండియాలోనే ఇళ్ళ ఖరీదెక్కువ. ఇప్పటికే రెండు ఫ్లాట్లు కొని వుంచాను. ఈసారి ఒక పెద్ద ప్లాట్ కొని పారేస్తే పోలా అని చూస్తున్నాను” అంటూ ఒకాయన తన ఘోష వెళ్ళబుచ్చుకున్నాడు.

“మీ ఇంట్లో నాలుగు చేతులా సంపాదిస్తున్నారండీ! అలా కొనుక్కోక ఏం చేస్తారూ?” అన్నాడు సుబ్బారావు అక్కసుగా.

“మరేం! మీకు మాత్రం? మీకు స్టాకు మార్కెట్‌లో వచ్చిన లాభాల సంగతి మాకు తెలీదా, ఏమిటీ? అయినా యాహూ స్టాకులు కొనడం మంచిదేనా? మైక్రోసాఫ్ట్ వాళ్ళు యాహూని కొనడం గేరంటీయేనా? మీరే మంటారూ?” అంటూ వేరొకాయన తన విషయాలన్నీ చెప్పుకొచ్చాడు.

“అబ్బ! అస్తమానూ రియల్ ఎస్టేటూ, స్టాకులూ! ఎవరూ చిరంజీవి పెట్టబోయే పార్టీ గురించి మాట్టాడరేం?” అని వాపోయాడొకాయన.

ఆ గేంగ్‌లో వాళ్ళందరూ తెలుగు వాళ్ళే అయినా, ఒక్కరూ సాహిత్యం జోలికి పోరు. తెలుగు అనేది సినిమాలు చూడ్డానికీ, వార్తలు చదవడానికీ మాత్రమే పరిమితం. చిరంజీవి సినిమాకి మొదటి రోజున వెళ్ళి, కాగితం ముక్కలు ఎగరేస్తూ, వుత్సాహంగా సినిమా చూడ్డం మాత్రం అందరికీ చాలా ఇష్టం.

ఇక పిల్లల చదువుల జోలికే పోరు. తిండీ, గుడ్డా ఇచ్చి, పబ్లిక్ స్కూలుకి పంపిస్తే, తమ బాధ్యత తీరిపోయిందని నిట్టూరుస్తారు. అప్పుడప్పుడు చదువుకోమని తిడుతూ వుంటారు. ఇక ఇంటి పనుల జోలికే పోరు. ఆడవాళ్ళు వుద్యాగాలు చేసినా, చెయ్యక పోయినా అవి ఆడవారి పనులే అని వారి గాఢ నమ్మకం. ఎటొచ్చీ బయట షాపింగు పనులు మాత్రం చేస్తారు. లేకపోతే తమ భార్యలు డబ్బు తగలేస్తారనే శంక.

ఆ మధ్య ఎవరో ఓ సంఘ సేవకుడు వీళ్ళని కాస్త సంఘ సేవ చెయ్యకూడదా అని అడిగాడు. అంతే! అందరూ అంతెత్తున ఎగిరారు.

“ఏమిటీ? మా పనులకే, మా జీవితాలకే టైం సరిపోవడం లేదు. ఇక సంఘ సేవ ఒకటా మాకు? చాల్లెండి మహా చెప్పొచ్చారు. మా సేవే ఎవరన్నా చెయ్యాలి” అంటూ అలా అన్న వాళ్ళ మీద విరుచుకు పడ్డారు.

మొత్తానికి పోసుకోలు కబుర్లతో హైకింగ్ ముగిసింది ఆ రోజుకి. ఆ మర్నాడు అంత కన్నా తక్కువ టైం లో హైకింగ్ పూర్తి చెయ్యాలని నిశ్చయించుకున్నా రందరూ.


తలుపు తీసి అపార్టుమెంట్లోకి అడుగు పెట్టిన సుబ్బారావుకి నిశ్శబ్దం ఒంటరిగా ఎదురైంది. ఎవరూ నిద్ర లేవ లేదు ఇంకా! స్నానం కానిచ్చాడు ముందర. టైం తొమ్మిది దాటింది.

“పిల్లలూ! లేవండి ఇక! స్కూలు వర్కు బాగా మురగ బెట్టుకున్నారు. ఇవాళన్నా పూర్తి చెయ్యాలి. లేవండి!” అంటూ పిల్లల్ని కేకల్తో లేపాడు.

“అబ్బా! శలవ రోజన్నా కాస్త నిద్ర పోనీవు కదా నాన్నా?” అని విసుక్కుంటూ లేచారు. ఆ కేకలకి, “మొదలయింది ఈయన శనివార సుప్రభాతం” అనుకుంటూ లేచింది సుబ్బలక్ష్మి కూడా.

పూజకి సామానులు సర్దుకుని కూర్చునే సరికి, సుబ్బలక్ష్మి వంటిట్లోకి కాఫీ కలుపుకోడానికి వచ్చింది.

“కొంచెం ఏమన్నా వండి ఇస్తావా, దేముడికి నైవేద్యం పెడతానూ?” అనడిగాడు కొంచెం జంకుతూ.

“నేనింకా స్నానమే చెయ్యలేదు. మడి లేకుండా వండితే, మీ నైవేద్యానికి పనికి రాదుగా? ఇవాళ్టికి బెల్లం ముక్క నైవేద్యంగా కానియ్యండి” అని కాఫీ చప్పరిస్తూ సలహా ఇచ్చింది.

పూజ మొదలు పెట్టాడు సుబ్బారావు మనసులోనే గొణుక్కుని. అమెరికాలో చాలా కాలం నించీ వుంటున్నా, చేసేది కంప్యూటర్ సాఫ్ట్ వేర్ ఉద్యోగం కాకపోవడం వల్ల, బాగా డబ్బు వెనకేసు కోవడం గానీ, ఓ ఇల్లు కొనుక్కోవడం గానీ చెయ్యలేక పొయాడు. వీళ్ళుండే ప్రాంతంలో ఇళ్ళ ధరలు అంబరాన్నంటుతున్నాయి మరి. వుంటున్న అద్దె కొంపలో పైన ఓ స్నానాల గదీ, రెండు పడగ్గదులూ. కింద ఓ హాలు. దాంట్లో మూడో వంతు చోటు పక్కన కొంత వరకూ ఓ గోడ పెట్టి, ఆ పక్కది వంటిల్లు అన్నారు అపార్టుమెంటు వాళ్ళు. ఆ గోడకి ఇవతల పూజా మందిరం. దానికి కాస్త ఇవతల ఓ సోఫా, దాని పక్కనే ఓ టీవీ. దాని పక్కనే పైకి వెళ్ళడానికి మెట్లు. హాల్లో బయట నించీ తలుపు తీసి లోపలకి రాగానే కనపడేది ఎదురుగా వున్న పూజా మందిరం. అగ్గిపెట్టెల్లాంటి ఈ అద్దె కొంపల్లో ఇంత కన్నా సౌకర్యాలేం వుంటాయి?

ఆ లోపల పిల్లలు గోల చేసుకుంటూ టీవీ మీద పడ్డారు. పూజ చేసుకుంటూనే, కళ్ళెర్ర జేసి, పిల్లల వేపు కోపంగా చూసి, టీవీ సౌండ్ తగ్గించమని సైగలు చేశాడు. వాళ్ళు తండ్రిని మనసులోనే తిట్టుకుని, సౌండు కొంచెమంటే కొంచెమే తగ్గించారు. టీవీ లోని బొమ్మలు అప్పుడప్పుడు సుబ్బారావు దృష్టిని ఆకర్షిస్తూనే వున్నాయి. తన దైవభక్తి గుర్తు చేసుకుంటూ, దృష్టి మరల్చుకుంటూ పూజ సాగించాడు. ఆ లోపల ఘొల్లుమంటూ ఇంటి ఫోను మోగింది.

“చీర మీద ఎంబ్రాయిడరీ ఎలా చెయ్యాలీ?” అనే విషయం మీద చర్చ మొదలు పెట్టింది సుబ్బలక్ష్మి ఫోనులో పక్కింటావిడతో.
గొంతు వాల్యూం తగ్గించమని సైగల్తో సుబ్బలక్ష్మికి చెప్పాడు. కానీ ఆవిడ అటు తిరిగి మాట్టాడుతూ, భర్త సైగల్ని చూసినా, చూడనట్టు నటించింది.

ఆ లోపల పక్కింటి తెలుగాయన చనువుతో తలుపు తోసుకుని పేపరు కోసం వచ్చాడు. సైగల తోనే పేపరెక్కడుందో చూపించి, తను పూజ చేసుకుంటున్నాననీ, ఇప్పుడు మాట్టాడలేననీ మళ్ళీ సైగల్తో చెప్పాడు.

మొత్తానికి బెల్లం ముక్క నైవేద్యంతో పూజ ముగించాడు. అప్పటిక్కూడా వంటింట్లో పొయ్యి లోంచి పిల్లి లేవలేదు వాళ్ళింట్లో.

“ఏమిటీ? ఇవాళ వంట చెయ్యవా? ఎవరన్నా భోజనానికి పిలిచారా?” అని గంటు పెట్టుకున్న మొహంతో అడిగాడు సుబ్బారావు.

“పూట పూటకీ వంట చెయ్యడం నా వల్ల కాదు బాబూ! నిన్న రాత్రి చేసిన కూరా, పప్పూ ఇంకా మిగిలే వున్నాయి. కాస్త ఎలక్ట్రిక్ కుక్కర్లో అన్నం పడేస్తాను. అంతే ఈ పూటకి” అని ఖచ్చితంగా చెప్పేసింది సుబ్బలక్ష్మి.

“హతవిధీ” అని నిట్టుర్చాడు సుబ్బారావు.

“పోనీ, మా అమ్మ పంపించిన కొరివి కారంలో కాస్త ఇంగువ దట్టించి పోపు వెయ్యకూడదూ?” అని అడిగాడు ఆశగా.

“ఇంగువంటే ఏమిటి నాన్నా?” అని కిసుక్కున నవ్వుతూ ఇంగ్లీషులో అడిగారు పిల్లలు.

“మీరు వంటింటి పని ఒక్కటి ముట్టుకోరు. కోరికలు మాత్రం ఎక్కువ. పనులు చేతకాని వాళ్ళు పెట్టింది తిని వూరుకోవాలి. లేదా సొంతంగా చేసుకోవాలి. అంతేగానీ ఈ వేవిళ్ళ కోరికలు తీర్చడం నా వల్ల కాదు” అని ఝాడించేసింది సుబ్బలక్ష్మి.

అయిష్టంగా ముఖం పెట్టుకుని భోజనం కానిచ్చాడు రాత్రి చేసిన కూరలతో. తిండి మింగుతున్నంత సేపూ రక రకాల మాటలతో తన అసంతృప్తిని వెళ్ళగక్కుతూనే వున్నాడు.

ఎంత రాత్రి వండిన పదార్థలయినా, సుబ్బరంగానే తిని లేచాడు. పిల్లలు కూడా భోజనాలు కానిచ్చి, మళ్ళీ టీవీ మీద పడ్డారు. వాళ్ళ స్కూలు ప్రిన్సిపలే ఇంటికి వచ్చి చదువుకొమ్మని చెప్పినా, పట్టించుకునే దశలో లేరు వాళ్ళు.

పెద్ద పొట్టతో శయనాగారం వేపు నడుస్తున్న భర్తని చూసి, “భుజించడం అయింది. ఇక శయనించడం తరువాత అంశం!” అంది వెటకారంగా సుబ్బలక్ష్మి.

“ఏమిటీ?” అన్నట్టు విసుగ్గా చూశాడు.

“వీకెండులో కూడా తెల్లారగానే హైకింగు పేరుతో వెళ్ళి పోతారు. ఇంట్లో ఏ పనీ చెయ్యరు. తిండి అసలు తగ్గించరు. ఇంటి పనులు చెయ్యడమే పెద్ద ఎక్సర్ సైజు. చీపురు పెట్టి హార్డ్ వుడ్ నేల వున్న గదులు వూడ్వండి. రోజూ వంటిల్లు కడగండి. వాక్యూం క్లీనర్ ఒదిలెయ్యండి. రోట్లో పిళ్ళూ, పచ్చళ్ళూ రుబ్బండి. గ్రైండర్లూ, మిక్సీలూ ఒదిలెయ్యండి. జబ్బు మనుషులకైతే ఈ ఎక్సర్ సైజులు కావాలి గానీ, ఆరోగ్యంగా వుంటూ, అన్ని ఇంటి పనులూ చేస్తూ వుండే వాళ్ళకి ఏ ఎక్సర్ సైజులూ అక్కర్లేదు. ఇన్ని పనులూ చేస్తుంటే, తిండి కూడా తగ్గించక్కర్లేదు” అంది సుబ్బలక్ష్మి ధాటీగా.

ఆ మాటలు ఏ చెవి తోనూ వినకుండానే తిప్పి కొట్టేశాడు.

పైపెచ్చు, “మరి నిద్ర పోకపోతే, కమ్మటి కలలెలా వస్తాయీ? షడ్రుచులతో భోజనం ఆరగించాలంటే నిద్రోయి కలలు కనడం తప్పని సరి. ఎవరేమనుకున్నా సరే, నా నిద్ర నేను పోయేది ఖాయం! కలలు కనేది కూడా ఖాయం!” అంటూ లోపలకి వెళ్ళాడు సుబ్బారావు.

ఆ మాటలేవీ పట్టించు కోకుండా, పిల్లలూ, సుబ్బలక్ష్మీ టీవీ చూడ్డంలో మునిగిపోయారు.