నా కవితా వ్యాసంగం మా ఊళ్ళో వాళ్ళకు తెలిసింది. వాళ్ళు నేనేదో మహాకవినై పోయినట్లు గౌరవించేవాళ్ళు. దాంతో నాకు ప్రోత్సాహం కలిగింది. ప్రతిదినం ఏటి ఒడ్డుకు పోయి కూర్చుండి నీళ్ళకు వచ్చే వాళ్ళను, పశువులను కడిగేవాళ్ళను, పాత్రలు తోముకునే వాళ్ళను చూస్తూ రకరకాల పద్యాలు రాసేవాణ్ణి.
గడియారం రామకృష్ణ శర్మ
జీవిత విశేషాలు
గడియారం రామకృష్ణ శర్మ (1919-2006) ఆలంపూర్కు సంబంధించిన చరిత్రను తెలిపే పలు పుస్తకాలు వెలువరించారు. వారి గ్రంథం మాధవిద్యారణ్య ప్రామాణికమైనది. వీరి సాహితీసేవలకు గుర్తింపుగా 2007 కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు (తెలుగు భాషలో) మరణానంతరం ప్రకటించారు. సాహితీవేత్తగానే కాకుండా స్వాతంత్ర్య సమరయోధుడుగానూ పేరొందిన శర్మగారు సంఘ సంస్కరణాభిలాషి, రంగస్థల నటుడు కూడా.
గడియారం రామకృష్ణ శర్మ రచనలు
ఒక వేళ రాకపోతే? అప్పుడు తానే పిలవవలెనా అస్పష్ట సమాధానము భయంకరమై ఉండెను. గౌరవ భంగమని పిలవడము వీలు కాదు. అట్లని ఒకతే పండుకోవడమూ సాధ్యం కాదు. వస్తున్న నొప్పులు ఒక్కోసారి ఆమె నిశ్చయాన్ని సడలిస్తుండెను. ధైర్యమును జారుస్తుండెను. ‘థూ, పాడునొప్పి’ అనుకుంటుండగానే నొప్పి తగ్గి ముందు ముందు తాను ఎదుర్కోవలసిన దృశ్యమును కల్పించుకొన్నప్పుడు వళ్ళంతా సిగ్గుతో ముడుచుకుని పోయెను.
ఇట్లా ఉండగా జనవరి 12వ తేదీనాడు తెల్లవారి గుజరాతి పత్రికను తెరచినపుడు Demonetization శాననపు పిడుగు దొంగ వ్యాపారులు, లంచగొండులు అందరికీ సోకినట్లే అతనికి హఠాత్తుగా సోకెను. ‘500 రూ॥లకు పైన విలువగల నోట్లన్నీ రద్దు’ అనే పెద్ద అక్షరాల శీర్షిక కండ్లలో పడగానే పిలానికి తల తిరిగి కన్నులు చీకట్లు క్రమ్మెను. గుండెలు దడదడ లాడెను. శ్వాస నిలిచిపోయెను. చేతులు వణికి పత్రిక పడిపోయెను.