VIDEO
వ. రామకథను విని కలయో, భ్రమయో, రాక్షసమాయయో అని సందేహపడుతున్న సీతను గమనించిన హనుమంతుడు, ఆమెకు సమీపంగా చేరి, అత్యంత వినయంతో చేతులు జోడించి ఇలా పలుకసాగాడు:
సోఽవతీర్య ద్రుమాత్తస్మాద్విద్రుమప్రతిమాననః ।
వినీతవేషః కృపణః ప్రణిపత్యోపసృత్య చ ॥ ౧ ॥
తామబ్రవీన్మహాతేజా హనూమాన్మారుతాత్మజః ।
శిరస్యంజలిమాధాయ సీతాం మధురయా గిరా ॥ ౨ ॥
టీకా, తాత్పర్యములు
పదచ్ఛేదము:- సః – అవతీర్య – ద్రుమాత్ – తస్మాత్ – విద్రుమప్రతిమాననః – వినీతవేషః – కృపణః – ప్రణిపత్య – ఉపసృత్య – చ – తామ్ – అబ్రవీత్ – మహాతేజాః – హనుమాన్ – మారుతాత్మజః – శిరసి – అంజలిమ్ – ఆధాయ – సీతాం – మధురయా – గిరా ||
అన్వయ క్రమము:- విద్రుమప్రతిమాననః వినీతవేషః కృపణః మహాతేజాః, మారుతాత్మజః సః హనుమాన్ తస్మాత్ ద్రుమాత్ అవతీర్య తాం సీతాం ప్రణిపత్య, ఉపసృత్య చ శిరసి అంజలిమ్ ఆధాయ మధురయా గిరా (ఏవమ్) అబ్రవీత్.
ప్రతిపదార్థము:- విద్రుమప్రతిమాననః = పగడముతో సమానమైన ముఖముగల వాడును, వినీతవేషః = వినయముగల వేషము గలవాడును, కృపణః = దీనుడును, మహాతేజాః = గొప్ప తేజస్సు గలవాడును, మారుతాత్మజః = వాయుపుత్రుడును అగు, సః హనుమాన్ = ఆ హనుమ, తస్మాత్ ద్రుమాత్ = ఆ చెట్టునుండి అవతీర్య = దిగి, తాం సీతాం = ఆ సీతాదేవిని, ప్రణిపత్య = మ్రొక్కి, ఉపసృత్య చ = సమీపించియు, శిరసి = శిరస్సున, అంజలిమ్ ఆధాయ = అంజలిని ఘటించి, మధురయా గిరా = మధురమైనట్టి వాక్కుతో, (ఏవం = ఈరీతిగా) అబ్రవీత్ = పలికెను.
ఉ.
విద్రుమ కాంతులన్ వెలుగు వీరుడు శ్రీపవనాత్మజుం డశో-
కద్రుమశాఖనుండి దిగి కాంతకు గొంత నుపాంతమందునన్
ముద్రిత హస్తముల్ వినతి మూర్ధము జేర్చుచు స్వాదు వాక్కులన్,
భద్రపవిత్రగాత్రి గని పల్కె ననిద్రిత పద్మనేత్రతోన్!
కా ను పద్మపలాశాక్షి క్లిష్టకౌశేయవాసిని ।
ద్రుమస్య శాఖామాలంబ్య తిష్ఠసి త్వమనిందితా ॥ ౩ ॥
టీకా, తాత్పర్యములు
పదచ్ఛేదము:- కా – ను పద్మపలాశాక్షి – క్లిష్టకౌశేయవాసిని – ద్రుమస్య – శాఖామ్ – ఆలంబ్య – తిష్ఠసి – త్వమ్ – అనిందితా ॥
అన్వయక్రమము:- పద్మపలాశాక్షి, క్లిష్టకౌశేయవాసిని, ద్రుమస్య శాఖామ్ ఆలంబ్య తిష్ఠసి, అనిందితా త్వం కాను?
ప్రతిపదార్థము:- పద్మపలాశాక్షి = పద్మపత్రముల వంటి నేత్రములు గలదానవును, క్లిష్టకౌశేయవాసిని = నలిగిపోయిన పట్టువస్త్రములను ధరించిన దానవును అగు ఓయమ్మా, ద్రుమస్య = వృక్షముయొక్క, శాఖాం = కొమ్మను, ఆలంబ్య = పట్టుకొని, తిష్ఠసి = నిలచియున్నావు, అనిందితా త్వం = నిందలేని (మచ్చలేని) దానవు నీవు, కా ను = ఎవరవో?
తే.గీ.
మలిన కౌశేయ వస్త్రము మయిన దాల్చి
తరువు నూతగ నిల్చిన తమ్మికంటి
మచ్చ లెరుగని సొచ్చెపు మెచ్చులాడి
యేల వగచుచుంటి విచట? యెవరు నీవు?
కిమర్థం తవ నేత్రాభ్యాం వారి స్రవతి శోకజమ్ ।
పుండరీకపలాశాభ్యాం విప్రకీర్ణమివోదకమ్ ॥ ౪ ॥
టీకా, తాత్పర్యములు
పదచ్ఛేదము:- కిమర్థం – తవ – నేత్రాభ్యాం – వారి – స్రవతి – శోకజమ్ – పుండరీకపలాశాభ్యాం – విప్రకీర్ణమ్ – ఇవ – ఉదకమ్
అన్వయక్రమము:- పుండరీకపలాశాభ్యాం విప్రకీర్ణమ్ ఉదకమ్ ఇవ, తవ నేత్రాభ్యాం, కిమర్థం శోకజం వారి స్రవతి?
ప్రతిపదార్థము:– పుండరీకపలాశాభ్యాం = తామరపత్రముల నుండి (ద్వివచనము), విప్రకీర్ణమ్ ఉదకమ్ ఇవ = కారిపోవుచున్న నీరువలె, తవ నేత్రాభ్యాం = నీ రెండు కన్నుల నుండియు, కిమర్థం = ఎందుకొఱకు, శోకజం వారి = దుఃఖబాష్పజలము, స్రవతి = స్రవించుచున్నది?
తే.గీ.
నీరజదళముల దొరలు నీటి భంగి
భారనయనముల దొరలె బాష్పజలము
యేల జార్చెదవమ్మ కన్నీరు నీవు?
చింత నీకేల కలిగెనొ చెప్పవమ్మ?
సురాణామసురాణాం వా నాగగంధర్వరక్షసామ్ ।
యక్షాణాం కిన్నరాణాం వా కా త్వం భవసి శోభనే ॥ ౫ ॥
టీకా, తాత్పర్యములు
పదచ్ఛేదము:- సురాణామ్ – అసురాణామ్ – చ – నాగగంధర్వరక్షసామ్, యక్షాణాం – కిన్నరాణాం – చ – కా – త్వం – భవసి – శోభనే ||
అన్వయక్రమము:- శోభనే, త్వం సురాణాం, అసురాణాం చ, నాగగంధర్వరక్షసాం, యక్షాణాం, కిన్నరాణాం చ కా భవసి?
ప్రతిపదార్థము:- శోభనే = ఓ శోభనాంగి! త్వం = నీవు, సురాణాం = దేవతలలోను, అసురాణాం చ = దానవులలోను, నాగగంధర్వరక్షసాం = నాగులలోను గంధర్వులలోను రక్కసులలోను, యక్షాణాం యక్షులలోను, కిన్నరాణాం = కిన్నరులలోను, కా భవసి = ఎవ్వతెవై యున్నావు?
తే.గీ.
అసుర కాంతవొ? సురకన్నియవొ? శుభాంగి
నాగ గంధర్వ రాక్షస నారివేమొ?
యక్ష కిన్నర జాతుల యతివ వేమొ?
ఎవరు నీవమ్మ? దయతోడ నెరుగ జెపుమ.
కా త్వం భవసి రుద్రాణాం మరుతాం వా వరాననే ।
వసూనాం వా వరారోహే దేవతా ప్రతిభాసి మే ॥ ౬ ॥
టీకా, తాత్పర్యములు
పదచ్ఛేదము:- కా – త్వం – భవసి – రుద్రాణాం – మరుతాం – వా – వరాననే – వసూనాం – వా – వరారోహే – దేవతా – ప్రతిభాసి – మే ||
అన్వయక్రమము:- వరాననే, రుద్రాణాం మరుతాం వా? వరారోహే, వసూనాం వా, త్వ కా భవసి; త్వం మే దేవతా ప్రతిభాసి.
ప్రతిపదార్థము:- వరాననే = శ్రేష్ఠమైన ముఖముదానా! రుద్రాణాం = రుద్రులలోగాని, మరుతాం వా = మరుత్తులలోగాని, వరారోహే = శ్రేష్ఠమైన పిఱుదులదానా! వసూనాం వా = వసువులలోగాని, త్వం, త్వం = నీవు, కా భవసి? = ఏగణమునకు చెందినదానవు? త్వం = నీవు, మే = నాకు, దేవతా = దేవతవుగా, ప్రతిభాసి = తోచుచున్నావు.
తే.గీ.
రుద్రగణములకును జెందు భద్రసతివొ?
వసు వధువువో? మరుత్తుల వనితవేమొ?
దేవతాకృతి నొప్పారు దీప్తి తోడ
కనుల కగుపించుచుంటివి కాంత నీవు!
కిం ను చంద్రమసా హీనా పతితా విబుధాలయాత్ ।
రోహిణీ జ్యోతిషాం శ్రేష్ఠా శ్రేష్ఠా సర్వగుణాన్వితా ॥ ౭ ॥
కా త్వం భవసి కల్యాణి త్వమనిందితలోచనే ।
టీకా, తాత్పర్యములు
పదచ్ఛేదము:- కిం – ను – చంద్రమసా – హీనా – పతితా – విబుధాలయాత్ – రోహిణీ – జ్యోతిషాం – శ్రేష్టా – శ్రేష్టా సర్వగుణాధికా – కా – త్వం – భవసి – కల్యాణి – త్వమ్ – అనిందితలోచనే ||
అన్వయక్రమము:- (త్వం) విబుధాలయాత్ పతితా, జ్యోతిషాం శ్రేష్టా, సర్వగుణాధికా, చంద్రమసా హీనా శ్రేష్ఠా రోహిణీ కిం ను? కల్యాణి, అనిందితలోచనే! త్వం కా భవసి.
ప్రతిపదార్థము:- (త్వం = నీవు) విబుధాలయాత్ పతితా = స్వర్గలోకమునుండి పడినట్టి, జ్యోతిషాం శ్రేష్ఠా = నక్షత్రములలో శ్రేష్ఠురాలును, సర్వగుణాధికా = సద్గుణములచే మహనీయురాలును, చంద్రమసా హీనా = చంద్రునితో వియోగము నొందినదియు నగు, శ్రేష్ఠా రోహిణీ కిం ను = సర్వోత్తమురాలవైన రోహిణివా ఏమి? కల్యాణి! = ఓ మంగళస్వరూపురాలా! అనిందితలోచనే = ఉత్తమమైన నేత్రశోభగల ఓ సుందరీ! త్వం కా భవసి = నీవు ఎవ్వతెవైయున్నావు?
తే.గీ.
సకల సద్గుణములరాశి సాధ్వి యయ్యు
చంద్రు బాసిన రోహిణి చందమగుచు
నింగినుండియు జారిన నెలతవేమొ?
మచ్చలేని కళ్యాణి వాపుచ్చవమ్మ!
కోపాద్వా యది వా మోహాద్భర్తారమసితేక్షణే ॥ ౮ ॥
వసిష్ఠం కోపయిత్వా త్వం నాసి కల్యాణ్యరుంధతీ ।
టీకా, తాత్పర్యములు
పదచ్ఛేదము:- కోపాత్ – వా – యది – వా – మోహాత్ – భర్తారమ్ – అసితేక్షణే – వసిష్ఠం – కోపయిత్వా – త్వం – న – అసి – కల్యాణీ – అరుంధతీ ॥
అన్వయక్రమము:- అసితేక్షణే, (త్వం) కోపాత్ వా, యది వా మోహాత్ భర్తారం వసిష్ఠం కోపయిత్వా, (విబుధాలయాత్ పతితా) కల్యాణీ అరుంధతీ న అసి కిమ్?
ప్రతిపదార్థము:- అసితేక్షణే = నల్లనికన్నులుగల ఓ సుందరీ! (త్వం = నీవు) కోపాత్ వా = కోపమువలనగాని, యది వా మోహాత్ = లేక మోహమువలనగాని, భర్తారం వసిష్ఠం = భర్తయైనట్టి వసిష్ఠమహర్షిని, కోపయిత్వా = కోపింపజేసి, (విబుధాలయాత్ పతితా = స్వర్గమునుండి క్రిందికి పడిన), కల్యాణీ అరుంధతీ న అసి (కిం) = మంగళ స్వరూపురాలైన అరుంధతివి కావుగదా!
తే.గీ.
అలక వలననొ మోహంపు కలక వలనొ,
ముని వసిష్ఠు కినియజేసి భువికి జనిన
సతి యరుంధతి బోలిన సాధ్వి వేమొ?
కప్పు కన్నుల కలకంఠి చెప్పవమ్మ.
కో ను పుత్రః పితా భ్రాతా భర్తా వా తే సుమధ్యమే ॥ ౯ ॥
అస్మాల్లోకాదముం లోకం గతం త్వమనుశోచసి ।
టీకా, తాత్పర్యములు
పదచ్ఛేదము:- కః – ను – పుత్రః – పితా – భ్రాతా – భర్తా – వా – తే – సుమధ్యమే – అస్మాత్ – లోకాత్ – అముం లోకం – గతం – త్వమ్ – అనుశోచసి
అన్వయక్రమము:- సుమధ్యమే! అస్మాత్ లోకాత్ అముం లోకం గతం (యం) త్వం అనుశోచసి, (సః) తే పుత్రః పితా, భ్రాతా, భర్తా వా, కో ను (భవతి?)
ప్రతిపదార్థము:- సుమధ్యమే = ఓ సుందరాంగీ, అస్మాత్ లోకాత్ = ఈ లోకమునుండి, అముం లోకం = ఆ (పై) లోకమునకు, గతం = పోయినట్టి, యం = ఎవ్వనినిగూర్చి అయితే, త్వం = నీవు, అనుశోచసి = శోకించుచున్నావో (సః = అతడు) తే = నీకు, పుత్రః = పుత్రుడా, పితా = తండ్రియా? భ్రాతా = సోదరుడా, భర్త వా = లేక భర్తయా? కోను (భవతి) = ఎవ్వడై యున్నాడు?
తే.గీ.
ఎవరి నెడబాయ నీకింత యేడ్పు గల్గె?
కన్న తండ్రియొ? గారాల కన్న కొడుకొ?
తోడ బుట్టిన వాడొ? నీ తోడు పతియొ?
శోకకారణమేమిటి శోభనాంగి?
రోదనాదతినిఃశ్వాసాద్భూమిసంస్పర్శనాదపి ॥ ౧౦ ॥
న త్వాం దేవీమహం మన్యే రాజ్ఞః సంజ్ఞావధారణాత్ ।
వ్యంజనాని చ తే యాని లక్షణాని చ లక్షయే ॥ ౧౧ ॥
మహిషీ భూమిపాలస్య రాజకన్యాఽసి మే మతా ।
టీకా, తాత్పర్యములు
పదచ్ఛేదము:- రోదనాత్ – అతినిశ్శ్వాసాత్ – భూమిసంస్పర్శనాత్ – అపి – న – తా దేవీమ్ – అహం – మన్యే – రాజ్ఞః – సంజ్ఞావధారణాత్ – వ్యంజనాని – హి – తే – యాని – లక్షణాని – చ – లక్షయే – మహిషీ – భూమిపాలస్య – రాజకన్యా – చ – మే – మతా
అన్వయక్రమము:- రోదనాత్, అతినిశ్శ్వాసాత్, భూమిసంస్పర్శనాత్ అపి రాజ్ఞః సంజ్ఞావధారణాత్, అహం దేవీం న మన్యే. తే యాని వ్యంజనాని, లక్షణాని చ లక్షయే (తాని) లక్షయతః మే (త్వం) రాజకన్యా, భూమిపాలస్య మహిషీ మతా.
ప్రతిపదార్థము:- రోదనాత్ = ఏడ్పువలనను, అతినిశ్వాసాత్ = దీర్ఘమైన నిట్టూర్పుల – వలనను, భూమిసంస్పర్శనాత్ అపి = భూమియొక్క స్పర్శచేతను, రాజ్ఞః = రాచ, సంజ్ఞావధారణాత్ = గుఱుతును వహించుటచేతను, త్వాం = నిన్ను, అహం = నేను, దేవీం న మన్యే = దేవవనితగా భావింపను. తే = నీయొక్క, యాని వ్యంజనాని = ఏ లక్షణములను, లక్షయే = కనుగొనుచున్నానో, (తాని లక్షయతః = వాటిని చూచుచున్నట్టి), మే = నాకు, త్వం = నీవు, రాజకన్యా = రాజపుత్రివిగను, భూమిపాలస్య, మహిషీ = మహారాజుయొక్క పట్టమహిషివిగను, మతా = తోచుచున్నావు.
తే.గీ.
రోదనను చూడ నిట్టూర్పు రొదను చూడ
నేలపైన నిలుపు కాళ్ళ నెంచి చూడ
దేవకాంతవు కాదని తెలియవచ్చె
పొలతి! నీ మేన తేటగా పొలుపుమీరు
రాజ లక్షణములు చూడ రాణివేమొ?
రావణేన జనస్థానాద్బలాదపహృతా యది ॥ ౧౨ ॥
సీతా త్వమసి భద్రం తే తన్మమాచక్ష్వ పృచ్ఛతః ।
యథా హి తవ వై దైన్యం రూపం చాప్యతిమానుషమ్ ॥ ౧౩ ॥
తపసా చాన్వితో వేషస్త్వం రామమహిషీ ధ్రువమ్ ।
టీకా, తాత్పర్యములు
పదచ్ఛేదము:- రావణేన – జనస్థానాత్ – బలాత్ – ప్రమథితా – యది – సీతా – త్వమ్ – అసి – భద్రం – తే – తత్ – మమ – ఆచక్ష్వ – పృచ్ఛతః | యథా – హి – తవ – వై – దైన్యం – రూపం – చ – అప్రతిమానుషమ్ – తపసా – చ – అన్వితః – వేషః – త్వం – రామమహిషీ – ధ్రువమ్ ॥
అన్వయక్రమము:- త్వం జనస్థానాత్ రావణేన బలాత్ ప్రమథితా సీతా అసి యది, తే భద్రమ్ (అస్తు). పృచ్ఛతః మమ తత్ ఆచక్ష్వ. తవ దైన్యం, అప్రతిమానుషం రూపం, తపసా అన్వితః వేషః చ, యథా (శ్రుతమ్) (తథా) (స్థితా) త్వం ధ్రువం రామమహిషీ అసి.
ప్రతిపదార్థము:- త్వం = నీవు, జనస్థానాత్ = జనస్థానమునుండి, రావణేన = రావణునిచే, బలాత్ = బలవంతముగా, ప్రమథితా = పీడింపబడినట్టి, సీతా అసి యది = సీతయైన యెడల, తే భద్రమ్ (అస్తు) = నీకు శుభమగుగాక, పృచ్ఛతః మమ = ప్రశ్నించుచున్నట్టి నాకు, తత్ = ఆ సత్యమును, ఆచక్ష్వ = చెప్పుము. తవ = నీయొక్క దైన్యం = దీనస్థితియును, అప్రతిమానుషం రూపం = మానవాతీతమైనట్టి రూపమును, తపసా అన్వితః = తపస్సుతో కూడినట్టి, వేషః చ = వేషమును, యథా = ఏరీతిగా, శ్రుతం = వినబడియుండెనో, తథా (స్థితా) = ఆ రీతిగా నున్నట్టి, త్వం = నీవు, ధ్రువం = నిశ్చయముగా, రామమహిషీ అసి = రామపత్నివే యగుదువు.
కం.
దశరథ సూనుని సతివో?
దశకంఠుని చెరనుబడిన ధరణిజ వీవో?
కుశలము గలుగును సుదతీ
విశదము వివరించవమ్మ విన్నపమిదియే
కం.
పూనిన మునివేషంబును
దీనపు రూపము మరుగున దివ్యత తోపన్;
మానిని! రాముని సతియగు
జానకివేనని ధ్రువముగ స్వాంతము నెంతున్.