జనవరి నెల… తేదీ ఆరు… రెండువేల ఇరవయ్యారు.
‘అయ్యో’ అనుకున్నాడు నలభై ఏళ్ల వయసు దాటుతున్న బ్యాచిలర్ బ్యాంకు ఉద్యోగి మల్లికార్జున్. అతను అలా అనుకోవడానికి కారణం – హంగేరియన్ సినిమా దర్శకుడు బేలా టార్ (Bela Tarr) ఆరోజు మరణించాడన్న వార్త వినాల్సి రావడమే.
ఏకాంతజీవి, చింతనాపరుడు, సాహిత్యం, సినిమా పట్ల ప్రత్యేక అభిరుచి కలిగిన మల్లికార్జున్‌కి బాగా నచ్చిన సినిమాల్లో బేలాటార్ తీసిన The Turin Horse సినిమా ఒకటి.
తన అభిరుచి మేరకు ఎంచుకున్న టాప్ హండ్రెడ్ సినిమాల్లో పదిలోపు సంఖ్యలో ఉంటుందది.
అతనికి మొదటిసారి ఆ సినిమా చూసినప్పటి క్షణాలు గుర్తుకొచ్చాయి.
లేత శీతలవాయువేదో తనకు ఎడమవైపునుండి తాకి శరీరంలో సమాంతరంగా ప్రయాణించి కుడివైపునుండి బయటికి వచ్చి అదృశ్యమైన భావనేదో కలిగింది అతనికి. అది తను ఉద్యోగం చేస్తున్న మోడ్రనైజేషన్ బ్యాంకులోని ఆ సమయపు స్ప్లిట్ ఏసీలోంచి వీస్తున్న చల్లగాలిలా లేదు. ఆ గాలిమధ్యలోంచి దిగులు ముఖంతో ఒక ముసలిగుర్రపు బగ్గీ తన ఎడమ వైపునుంచి కుడివైపుకు ప్రయాణించినట్లు కూడా అనిపించింది అతనికి.
పదిహేనేళ్ల క్రితం అతని హైదరాబాద్ మిత్రుడు అజయ్ హార్డ్ డిస్క్‌లో నింపి, మల్లిఖార్జున్‌కి ఇచ్చిన ఇరవై సినిమాల్లో The Turin Horse సినిమా కూడా ఒకటి.
అతను అప్పుడు వరంగల్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. బ్యాంకులో క్లర్క్‌గా ఫస్ట్ పోస్టింగ్. ఆఫీస్ దగ్గర్లోనే అతని అద్దె గది ఉండేది. ఆ రోజు వాతావరణం అతనికి బాగా గుర్తుంది.
ఆగస్ట్ నెల. ఆరోజు అతను నిద్రలేవడానికి ముందే మొదలైన సన్నని తుంపరతో వాన ఆరోజంతా కురుస్తూనే ఉంది. సాయంత్రం డ్యూటీ అయ్యాక గొడుగుపట్టుకుని నడుచుకుంటూ (అప్పటికింకా బైక్ కొనలేదు) దార్లోని కిరాణా షాపులో కోడిగుడ్లు కొనుక్కుని రూంకి చేరుకుని ఫ్రెష్ అయి, డబుల్ ఆమ్లెట్లతో భోజనం కానిచ్చేసి, సిస్టమ్ ఓపెన్ చేసి సినిమా చూడడం మొదలుపెట్టాడు.
బేలా టార్ సినిమా చూడడం అదే మొదటిసారి అతనికి.
సినిమా ప్రారంభమైన అరగంటలోనే ‘ఈ దర్శకుడు అందరు మనుషుల్లాగే ఈ భూమ్మీద పుట్టిన వ్యక్తేనా? లేక ఏ గ్రహంనుండో ఇక్కడికి వచ్చి ‘సినిమాని ఇలా కూడా తియ్యొచ్చు’ అని కొన్ని సినిమాలు తీసి, వాటిని ఇక్కడే వదిలేసి, తిరిగి తన గ్రహానికి వెళ్లిపోవడానికొచ్చి మనిషి రూపంలో సంచరిస్తున్న గ్రహాంతరవాసా?’ అనుకున్నాడు మల్లికార్జున్.
శతాబ్దాల క్రితంనుండీ కాలక్రమేణా మానవుల్లో వస్తున్న వికాసంవల్ల మనిషి హృదయంలో అట్టడుగున చీకట్లో ఒక మూలకు వెళ్లి కూర్చున్న అస్తిత్వంలోని ఒక భాగమైన ‘దిగులు’ చప్పున అతనికి అనుభవంలోకి వచ్చినట్లయింది. ‘అప్పటిదాకా తను చూసిన సినిమాలు వేరు, ఈ ఒక్క సినిమా వేరు’ అనుకున్నాడతను.
సినిమా చూడడం పూర్తయ్యాక చాలాసేపటిదాకా నిద్రపట్టలేదతనికి.
ఆరోజు ఉదయంనుండి మొదలైన వర్షాన్ని తుఫానుగా డిక్లేర్ చేసింది వాతావరణ శాఖ. రేడియోలో ఆ వార్త విన్నట్లుగా సన్నని చినుకులు అతని అద్దె గది మీద ఇక తీరిగ్గా కురవడం మొదలుపెట్టాయి.
గతకాలపు జ్ఞాపకాలు కొన్ని చుట్టుముట్టాయతన్ని.
అమ్మను కోల్పోయిన బాల్యం, తనకు మెల్లకన్ను ఉందని అవహేళన చేసిన ఒక్కరిద్దరు క్లాస్మేట్స్, తన చర్మం కారునలుపులో ఉండడం వల్ల ‘బొగ్గుపెళ్ల’ అని నిక్‌నేమ్ పెట్టి బాధించిన కొందరు కాలేజీ రౌడీలు, డిగ్రీలో తను గాఢంగా ప్రేమించిన ఒకే ఒక్క యువతి స్వప్నతో కుదరలేకపోయిన జీవిత భాగస్వామ్యం, ఉద్యోగం సంపాదించి లోన్ తీసుకునైనా సరే ఒక చిన్న కారు కొనుక్కొని, అందులో తన తండ్రిని కూర్చోబెట్టుకొని, దేశమంతా తిప్పి ఆయన జీవితాంతం పడ్డ కష్టాల్ని (తోళ్ల పరిశ్రమలో కార్మికుడాయన) మర్చిపోయేలా చేయాలనుకున్న కల నెరవేరక ముందే, అనారోగ్యంతో వెళ్లిపోయిన ఆయన మిగిల్చిన వెలితి… ఆ వర్షపు చినుకుల రాత్రి అతని కళ్లముందు మెదిలాయి.
ఆ సినిమాలో ప్రారంభంనుండి చివరిదాకా వీస్తున్న పొగమంచులోంచి కొట్టుకు వస్తున్న ఎండుటాకుల్లాగా, ఆ రాత్రంతా మల్లికార్జున్ మనసులో కూడా ఎడతెగని వాన కురుస్తూనే ఉంది.
గతకాలవు వరంగల్ గది జ్ఞాపకాల్లోంచి బయటకొచ్చాడు అతను.
టైం మధ్యాహ్నం ఒంటిగంట దాటింది. ఆ రోజెందుకో బ్యాంకులో కస్టమర్ల సంఖ్యకూడా పల్చగానే ఉంది. ‘ఈ చలికాలపు రోజున బాగా ఎండవస్తే కాని బయటకి రాకూడదని ఇంట్లోనే ఉండిపోయారా కస్టమర్స్?’ అనుకున్నాడు. పెదవుల మీదికి నవ్వు వచ్చి చేరింది.
బయట ఇంకా ఎండ పూర్తిగా వచ్చిందో లేదో అనుకుంటూ కిటికీలవైపు చూసాడు. బయట ప్రపంచపు శరీరం కనిపించకుండా కిటికీలు కర్టెన్లను పూర్తిగా తొడుక్కొని ఉండడంతో అవతలి ప్రపంచం కనిపించలేదు.
లంచ్ పూర్తయ్యాక బ్యాంకు బయటకొచ్చి అలవాటైన బడ్డీకొట్లో సిగరెట్ తీసుకొని వెలిగించాడు.
ఎండ ఇంకా పూర్తిగా విచ్చుకోలేదు. పల్చని ఎండలో చలికాలపు గాలి ఈలవేసుకుంటూ రోడ్లమీద తిరుగుతోంది. ఇలాంటి శీతాకాలపు వాతావరణాన్ని చూస్తే ఏదో దిగులు కలుగుతుంది మల్లిఖార్జున్‌కి.
పది దాటుతోన్నా ఎండ కాయని పగళ్లు, ఐదు గంటలకే చీకటి పడే సాయంత్రాల్లోంచి పుట్టే ఒక రకమైన దిగులుని జయించడానికి టీలు, సిగరెట్లు, ఫస్ట్ షో సినిమాలు, ఓడ్కా, చెమటలు కక్కేదాకా చేసే వ్యాయామం అలవాటు చేసుకున్నాడు. నిజానికి ఈ రోజు అతను ఫస్ట్ షో సినిమాకు వెళ్లాలని ఉదయం గదిలో టీ తాగుతున్నప్పుడే అనుకున్నాడు. మమ్ముట్టి నటించిన ‘భ్రమయుగం’ సినిమా అది. మలయాళంనుండి తెలుగు డబ్బింగ్.
సాయంత్రం బ్యాంకునుండి బయలుదేరి బస్టాండు కాంప్లెక్స్‌లోని హోటల్ మధువన్లో రెండు పరోటాలు తిని టీ త్రాగి నింపాదిగా వెళ్లాలనుకున్న సినిమా.
నిన్న సాయంత్రం బ్యాంకునుండి రూంకి వెళ్తున్నపుడు దారిలో అతనికి కనిపించిందా సినిమా పోస్టర్. పైన చొక్కాలేకుండా మమ్ముట్టి ఒక కుర్చీలో కూర్చొని గెడ్డంతో, పైకి దువ్విన క్రాఫ్‌తో, మెడలో పూసలదండతో, అదో రకమైన పై పలువరుస నవ్వుతో బ్లాక్ అండ్ వైట్‌లో కనిపించిన పోస్టర్ అది. ఈ అన్నింటికన్నా ‘భ్రమయుగం’ అన్న టైటిల్ బాగా ఆకర్షించింది మల్లిఖార్జున్ని. ఆ అక్షరాల్లోనే మానవజాతి ఆధునిక జీవనానికి సంబంధించిన రహస్యమేదో దాగి ఉన్న భావన కలిగిందతనికి.
నిజానికి ఈ సినిమా పోయినేడాది వచ్చినప్పుడే చూడడం మిస్ అయింది అతనికి. ఇప్పుడు కూడా ఓ రెండ్రోజుల కోసమే ఆడిస్తున్నట్లున్నారు. కొత్త సినిమా వేసే ముందు పాతవే మళ్లీ ఒకట్రెండు రోజులు నడిపిస్తుంటారు ధియేటర్ వాళ్లు.
అయితే హంగేరియన్ సినిమా దర్శకుడు బేలా టార్ మరణించాడన్న వార్త విన్నాక ‘భ్రమయుగం’ సినిమా ప్రోగ్రాం కాన్సిల్ చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు మల్లికార్జున్. ఆ దర్శకునికి నివాళిగా ఈ రాత్రి ఆయన తీసిన సినిమాలు (ముఖ్యంగా The Turin Horse) చూస్తూ, మధ్యమధ్యలో ఆయన జీవిత విశేషాలు చదువుతూ గడపాలనిపించిందతనికి.
ఒక రకంగా మల్లికార్జున్ తనకు నచ్చిన ఏ కళాకారుడికైనా నివాళి అర్పించే తీరుకూడా సెలిబ్రేట్ చేసుకోవడంలా ఉంటుంది. ‘మనిషి ఏడుస్తూ పుట్టింది ఏడవడానికి కాదు’ అనే వాక్యం మల్లిఖార్జున్ దినచర్య కింద కనిపించని ట్యాగ్ లైన్లా వేలాడుతూ ఉంటుంది.
తనకు బాగా నచ్చిన రచయిత ఒకాయన చనిపోయిన రోజు బ్యాంకుకి ఒక రోజు సెలవు పెట్టి, ఆ రోజంతా ఆ రచయిత రాసిన కథలు చదువుతూ గదిలోనే గడిపాడు అతను. (ఆ కథల్లో మరణం, చావు అన్న పదాలు వచ్చిన చోట కాసేపు పుస్తకం పక్కన పెట్టి, ఆ పదాలు రాస్తున్నప్పటి ఆ రచయిత ప్రాణమున్న చేతి వేళ్ల కదలికల్ని ఊహించుకున్నాడు).
ఈరోజు సాయంత్రం కూడా బేలా టార్కి నివాళిగా అలాగే గడపాలనుకున్నాడు. అందుకే ఫస్ట్ షో సినిమా ప్రోగ్రాంని కాన్సిల్ చేసుకున్నాడు.
నూటా ముప్పై సంవత్సరాల క్రితం ప్రపంచ ప్రఖ్యాత తత్వవేత్త ఫ్రెడరిక్ నీషే (Friedrich Nietzsche) ట్యూరిన్ నగరంలో ఒక వీధిలో నడుచుకుంటూ వెళ్తున్నాడు.
ఒకచోట ఒక గుర్రాన్ని దాని యజమాని కొడుతున్న దృశ్యాన్ని చూసి చలించిపోయి, ఆ తర్వాత ఆ గుర్రాన్ని కౌగిలించుకుని ఏడ్చి స్పృహ తప్పిపోయాడతను.
ఎంతవరకు నిజమో తెలియుదు కానీ ఆ తర్వాత కొన్నిరోజులకే నీషే పిచ్చివాడైపోయాడని అంటారు.
‘ఆ తర్వాత ఆ గుర్రం ఏమైంది?’ అన్న ప్రశ్నను ఆధారం చేసుకొని తీసిన సినిమానే… ద టూరిన్ హార్స్.
‘సర్… టీ’ అన్న అటెండర్ గొంతు విని కళ్లు తెరిచి, రిలాక్స్డ్గా రెండు నిమిషాలు సీట్లో వెనక్కి వాలిన వాడు కాస్తా యధాస్థితిలోకి వచ్చాడు మల్లికార్జున్. ఆ సినిమా నేపథ్యం గురించి అతనెప్పుడో చదివిన వ్యాసంలోని వాక్యాలు తెరచిన అతని కళ్ల వెనుకనుండి పక్షుల్లా ఎగురుకుంటూ వెళ్లిపోయాయి.
మధ్యాహ్నం లంచ్ తరువాత ఇంకా మిగిలిన పావుగంటలో ఓ పది నిమిషాలు చిన్న కునుకు తీయడం అలవాటు అతనికి. ఈ రోజు బయటకెళ్లి సిగరెట్ తాగాలనిపించడంవల్ల అది కుదరలేదు. టైం మధ్యాహ్నం మూడున్నర అవుతోంది. టీ టైం. గాజుబాటిల్లోంచి నీళ్లు గొంతులోకి ఒంపుకొని టీ కప్పుని చేతిలోకి తీసుకున్నాడు. తాగడం పూర్తయ్యాక తిరిగి తన టేబుల్ మీదున్న ఫైల్ తీసుకొని పనిలో పడ్డాడు.
అతని చేతివేళ్లు ఫైల్లోని పేపర్లమీద కదులుతున్నాయి కానీ మనసులో మాత్రం The Turin Horse సినిమా టైటిల్స్ పడడం ప్రారంభమైంది.
నిర్మానుష్యమైన పొగమంచు దారిలో ఓ ముసలిగుర్రం, ఒక వృద్ధుడు కూర్చున్న బగ్గీని లాగుతూ ముందుకు కదులుతోంది. నిజానికి అది మోస్తూ లాగుతున్నది మనిషిని మాత్రమే కాదు… ‘ప్రకృతి శక్తుల ముందు మానవుని నిస్సహాయతను’ అన్నట్లు వినిపిస్తోంది, ఆ దారిలో వీస్తున్న ఈదురు చల్లగాలిలో కొట్టుకుపోతున్న ఎండుటాకుల చప్పుడులోంచి వ్యక్తమవుతున్న విచార సంగీతం.
ఆ గుర్రమూ, వృద్ధుడూ వాళ్ల జీవితకాలమంతా ఇలా అంతులేని ప్రయాణాన్ని కొనసాగిస్తూనే ఉంటారా? ఈ సినిమా అంతా ఇంతేనా… అనిపించేప్పుడు వచ్చింది – నిర్జన ప్రదేశంలో ఉన్న ఒక ఇల్లు.
ఆ ఇంటి షెడ్లో ముసలి గుర్రాన్ని కట్టేసి, అవిరామంగా వీస్తోన్న సన్నని గాలిదుమారపు పొగమంచు బయట ప్రపంచంనుండి చెక్క తలుపు వేసుకొని ఇంట్లోకి ప్రవేశించాడా వృద్ధుడు.
ఇక ఆ తర్వాత ఆ ఇంటి లోపలి ప్రపంచంలో ఆ వృద్ధుడు, అతని యుక్తవయసు కూతురి సహాయంతో కలసి ఒక అవిటి చేత్తో, అతి సాధారణమైన జీవితాన్ని గడుపుతూ ఉండడాన్ని నిశ్శబ్దంగా కరుగుతోన్న కాలం చూపిస్తూ ఉంది.
సాయంత్రం అయిదున్నర. భుజాలకు బ్యాక్‌ప్యాక్ తగిలించుకొని బ్యాంకులోంచి బయటకొచ్చాడు మల్లికార్జున్. చల్లగాలి రివ్వున తగిలింది ముఖానికి… చేతులకి. ‘ఈ సంవత్సరం చలి బాగా ఉంది’ అనుకున్నాడతను. అయిదున్నరకే పూర్తిగా చీకటి పడిపోయిందా ఊళ్లో.
అతనికెందుకో ఆ రోజు తన గదికి నడుచుకుంటూ వెళ్లాలనిపించింది. బైక్ దగ్గరికి వెళ్లి, బ్యాక్‌ప్యాక్‌లోంచి స్వెట్టర్ తీసి తొడుక్కొని, ఆఫీసు ముందు పార్కింగ్ ప్లేసులోంచి బైక్ స్టార్ట్ చేసి, ఆఫీస్ వెనుక ఉన్న షెడ్లో పార్క్ చేశాడు. అలా చేస్తున్నపుడు అతనికి ఒక ఇనుపగుర్రాన్ని షెడ్లో కట్టేస్తున్నట్లు అనిపించింది. గుర్రపు మంచి యజమాని ప్రేమగా గుర్రం వీపుని తాకినట్లుగా బైక్ సీటుని తడిమి అక్కడినుండి కదిలాడు.
బ్యాంకునుండి అతను అద్దెకుండే పెంట్ హౌస్ మూడు కిలోమీటర్ల దూరం. దార్లోనే కూరగాయల మార్కెట్ కూడా ఉంటుంది ‘రైతుబజార్’ అనే బోర్డు తగిలించుకొని. డ్యూటీ ముగిసాక గదికి వెళ్లేప్పుడు వారానికి రెండు మూడుసార్లు అక్కడ కూరగాయలు కొనుక్కుంటాడు. బ్యాచిలర్ వంట.
రోడ్‌మీద వాహనాల సంచారం పల్చగా ఉంది. సంక్రాంతి సెలవులు మొదలయినట్లున్నాయి. స్కూల్ బస్సుల సందడి లేదు. ఒకటీ రెండు కాలేజ్ బస్సులు ఎదురయ్యాయి.
వీధి దీపాల ముఖాల్లో ఏదో విచారం వ్యక్తమవుతోంది. ఈ రాత్రంతా ఎంత చలికి వణికిపోవాలో అని ఆలోచిస్తున్నట్లున్నాయవి. చల్లగాలి ఉండీ ఉండీ ముఖానికీ చేతులకూ తాకుతూ వెనక్కి వెళ్లిపోతోంది. రెండు చేతులూ ప్యాంట్ జేబులో పెట్టుకొని నడవసాగాడతను.
ఇతర సినిమాలతో కలిసి గోడలకు అతుక్కుపోయిన ‘భ్రమయుగం’ సినిమా వాల్ పోస్టర్ దాటాక వచ్చింది రైతుబజార్. కూరగాయలు కొంటున్నప్పుడు అతని దృష్టి ఆలుగడ్డల మీద పడింది. చప్పున అతని తలలో The Turin Horse సినిమాలో వృద్ధుని పాత్రధారి, ఆ రాత్రి తన డిన్నర్లో వేడివేడి పొగలు కక్కుతున్న మెత్తని దూదిపింజలాంటి ఆలుగడ్డని, తనకు పనిచేస్తున్న ఒకే ఒక ఎడమచేత్తో పొట్టు ఒలుచుకొని ఆబగా తినే దృశ్యం మెదిలింది.
కేవలం నీళ్లలో ఉడకబెట్టిన వేడివేడి ఆలుగడ్డని తినడంలోని జీవితానందం అతని కళ్లముందు కదిలింది. అప్పటిదాకా చల్లగా ఉన్న అతనిచేతులకు ఏదో వెచ్చని అవిరి తాకిన భావన కలిగింది.
అరకిలో ఆలుగడ్డలు కొనుక్కున్నాడు. పెద్దవి… నాలుగు వచ్చాయి. ఈ రాత్రికి ఇదే డిన్నర్… విత్ వోడ్కా అనుకున్నాడు. ‘క్రేజీ ఫెలో’ అనికూడా అనుకున్నాడు.
మార్కెట్లోంచి రోడ్డు మీదకొచ్చి నడవసాగాడు. భ్రమయుగం సినిమా పోస్టర్ ఎందుకో అతడివైపు ఆసక్తిగా చూసింది, వెనుకనుండి.
మిరపకాయ బజ్జీలు, పుణుకులు, గారెలు వేడివేడిగా అమ్ముతున్న బండ్ల దగ్గరికి – పొయ్యిమీద మరుగుతున్న పాలు, టీ పొడి, పంచదార మిశ్రమంలోంచి పైకి లేస్తోన్న వేడివేడి పొగల టీకొట్ల వద్దకు – స్వెట్లర్లు, రగ్గులు అమ్ముతున్న నేపాలీ దుకాణాల వద్దకు చలికాలపు మనుష్యులు మెల్లిమెల్లిగా చేరుకుంటున్నారు. రేకులతో నిర్మించిన చిన్న హెయిర్ సెలూన్‌లోని ఎఫ్.ఎం రేడియోలోంచి ‘పగలైనా రేయైనా… ఎడారిలో ఒకటేలే – కల ఐనా నిజమైనా… నిరాశలో ఒకటేలే’ అన్న పాట షేవింగ్ క్రీమ్ వాసనతో కలసి రోడ్డుమీదికి ప్రసారం అవుతోంది.
‘ఈ పాట ఆ సినిమాలోని వాతావరణానికి సరిగ్గా సరిపోతుంది’ అనిపించిందతనికి. పగలూ రాత్రుళ్ల వెలుగులో తేడా తప్ప మిగతాదంతా ఒకేలా ఉండే ఆ చల్లని వాతావరణం అతని కళ్లముందు మెదిలింది. మరి, అలాంటి నిశ్శబ్దపు సినిమా తనకు అంత బాగా ఎందుకు నచ్చిందో అనుకుంటూ నడవసాగాడు.
లిఫ్ట్ సౌకర్యం లేని మూడంతస్తుల ఇంటి మెట్లెక్కి తను అద్దెకుండే పెంట్ హౌస్‌కి చేరుకునేసరికి ఏడున్నర అయింది. గది ఊడ్చుకొని, స్టవ్ మీది పెద్ద బర్నర్ మీద ఒక వైపు వేన్నీళ్లు, మరో స్టవ్ మీద గిన్నెలో నీళ్లు పోసి ఆలుగడ్డలు వేసి, పొయ్యి వెలిగించి, కాసేపు వ్యాయామం చేసి స్నానం కానిచ్చి వచ్చాడు.
బీరువాలోంచి వోడ్కాబాటిల్, గ్లాసూ తెచ్చుకుని ముందుగదిలోని టీపాయ్ మీద పెట్టి, కిచెన్‌లోకి వెళ్లి బాగా మెత్తగా ఉడికిన ఆలుగడ్డల్ని నీళ్లు వంపి పింగాణి ప్లేట్లో వేసుకొని తెచ్చుకున్నాడు. ఆలుగడ్డలు పొగలు కక్కుతున్నాయి. గ్లాసులో ఓడ్కా పోసుకుని సిప్ చేసి ఒక ఆలుగడ్డని తీసుకొని మరో ప్లేట్లో పెట్టుకొని పొట్టు ఒలవబోతుంటే చేతులు కాలాయి.
చేతివేళ్లను ఉఫ్ ఉఫ్‌మని ఊదుకుంటూ రెండు స్పూన్లు తీసుకొని వాటితో ఆలుగడ్డ పొట్టు ఒలిచి ఒక స్పూన్ని అడ్డంగా తిప్పి ఆలుని గట్టిగా ఒత్తాడు. అది నాలుగు పక్కలకూ విచ్చుకుంది. దాంట్లోంచి వేడివేడిగా చిన్నిచిన్ని పొగలు బయటికి వెలువడ్డాయి.
వోడ్కా సిప్ చేసి స్పూన్‌తో కొంచెం ఆలూ నోట్లో వేసుకున్నాడు. ఉప్పూ, కారంలేకపోవడంవల్ల చప్పగా తగిలింది నోటికి.
కానీ వేడి వేడిగా…
ఆ వేడిలో, చలికి గడ్డకట్టుకు పోయి చనిపోవాల్సిన పురాతన మానవుల్లో వేలమందిని బతికించిన నిప్పుయొక్క దయ దాగి ఉన్నట్లనిపించిందతనికి.
టీవీ ఆన్ చేసి యూట్యూబ్‌లో The Turin Horse movie అని సెర్చ్ చేశాడు. యూట్యూబ్‌లో ఆ సినిమా అందుబాటులో లేదు. ఒకటీ రెండు ట్రైలర్స్, కొన్ని షార్ట్ వీడియోలు కనిపించాయి. ఒకచోట మాత్రం పదిగంటల నిడివి ఉన్న ఇదే సినిమా కనిపిస్తే ఆసక్తిగా దానిపై క్లిక్ చేసాడు.
సినిమా ప్రారంభంలో వృద్ధుడు తన ముసలి గుర్రపు బగ్గీపై వస్తున్న దృశ్యంతోనే మొదలైంది కానీ అది పూర్తి సినిమా వీడియో కాదు. ఆ ఒక్క సీనే పదిగంటలసేపు తిరిగి తిరిగి వచ్చేలా ఎడిట్ చేసి అప్లోడ్ చేసిన వీడియో అది.
‘ఇదేదో గమ్మత్తుగా ఉంది. దీన్ని అప్లోడ్ చేసిందెవరో కానీ ఈ సినిమా ఆత్మను దాదాపు పట్టుకున్నాడు’ అనుకున్నాడు మల్లిఖార్జున్.
‘ఇదీ బాగానే ఉంది. కానిద్దాం’ అనుకుంటూ ఓడ్కా ఆలుగడ్డతో కలిపి ఆ వీడియోని చూడసాగాడు.
అరగంట చూసాక వచ్చిన సీనే రిపీట్ అవుతుండటంతో బోర్ కొట్టింది.
ఇక లాభంలేదనుకొని Buy or rent ఆప్షన్ క్లిక్ చేసి సినిమా చూడడం మొదలుపెట్టాడు.
ముసలి గుర్రాన్ని షెడ్లోకి పంపించి ఆ వృద్ధుడు రివ్వుమని బలంగా వీస్తున్న పొగమంచు బయట ప్రపంచంనుండి తలుపులు వేసుకొని తన ఇంట్లోకి ప్రవేశించడం… ఆ ఇంట్లో జీవిస్తున్న ఆయన కూతురు చేసే సపర్యలు… గాజు గ్లాసులోంచి గొంతులోకి ఒంపబడే సారాయి, చెక్కబల్లకి ఇరువైపులా కూర్చొని తండ్రీకూతుర్లు తినే వేడివేడి ఆలుగడ్డలు, రాళ్లూ మట్టితో నిర్మితమైన ఆ ఇంటి గోడల మధ్య రాత్రంతా వెలుగుతున్న గాజుదీపం, పెద్ద అద్దపు కిటికీ ముందు ఒంటరిగా కుర్చీ వేసుకొని కూర్చొని, అవతలి ప్రపంచంలో గాలికి కొట్టుకు వస్తున్న ఆకులతో కలసి ప్రయాణిస్తోన్న పొగమంచువైపు చూస్తున్న వృద్ధుని నింపాది సమయం, రెండు చెక్క బకెట్లతో ఆ ఇంటి సమీపంలోని బావివైపు నీళ్లు తోడుకొని రావడానికి నడుచుకుంటూ వెళ్ళే ఆ యువతి…
సినిమా చూడడం పూర్తయింది.
టీపాయ్ మీద ప్లేట్లో ఆలుగడ్డ ఒకటి చల్లబడి మిగిలిపోయింది రెండు స్పూన్లతో కలిసి. వోడ్కా సీసా పావుభాగం శూన్యతతో కలిసి నిలబడి ఉంది. గోడగడియారంలో సమయం పదకొండుకు దగ్గరవుతోంది.
టీవీ ముందునుండి లేచి ప్లేట్లను కిచెన్‌లో, బాటిల్‌ని బీరువాలో పెట్టి వచ్చి సోఫాలో కూర్చున్నాడు. టీవీలో The Turin Horse సినిమా తన చివర్లో వచ్చే టైటిల్స్ మీద మ్యూట్‌లో పెట్టబడి ఉంది.
ఓడ్కా అతని తలలోని నరాల్లో సరైన దారిని వెదుక్కుంటోంది. అతని ఆలోచనల్లో కాసేపటి క్రితం తను చూసిన సినిమాలోని పాత్రలు కదలసాగాయి.
ఆ వృద్ధుడు చనిపోయాక అతని కూతురు జీవితం ఎలా ఉంటుందో? దురదృష్టవశాత్తూ అతనికన్నా ముందే అతని కూతురే మరణిస్తే ఆ ఒంటరి వృద్ధుని జీవితం అతడి చివరి రోజుల్లో ఎలా ఉంటుందో? మరింత దురదృష్టవశాత్తూ ఆ ముసలి గుర్రంకన్నా ముందే ఆ తండ్రి కూతుర్లిద్దరూ మరణిస్తే ఆ గుర్రం బాగోగులు ఎవరు చూసుకుంటారు?
‘ఈ రాత్రి అన్నీ మరణానికి సంబంధించిన ఆలోచనలు వస్తున్నాయేమిటి?’ అనుకున్నాడు మల్లికార్జున్. అతని మెదడులోని నరాల్లో ఓడ్కాకి ఏదో దారి దొరికినట్లయింది.
ఈ ఆలోచన్లకి కారణం ఈ సినిమా తనలో కలిగించిన ఒక రకమైన దిగులు అని అర్థమైంది అతనికి.
ది… గు… లు…
అతనికి భవిష్యత్‌లోని తన ఒంటరి వృద్ధాప్యపు రోజులు కళ్లముందు మెదిలాయి. ఒం…ట…రి…త…నం… శీతాకాలంలో పరిసరాల్ని పొగమంచు కమ్ముకున్నట్లు తను ఎంచుకున్న ఏకాకి జీవితానికి పొగమంచులా ఒంటరితనం కమ్ముకుంటే?
ఆ ఒంటరితనంలోని దిగులు మంచులా గడ్డకట్టుకుపోతే? అమ్మో! తలుచుకుంటేనే వణుకు పుడుతోంది.
‘అన్ని ప్రతికూలస్థితుల్లోంచీ లేచి నిలబడాలి’ అనుకున్నాడు వెంటనే. అట్లాంటి క్షణాల్లోంచి వెంటనే తేరుకునే తత్వమే మల్లిఖార్జున్ జీవనానందానికి చాలాసార్లు కారణమవుతూ ఉంటుంది.
అతనికి తన జీవితానికి తను ఏర్పరుచుకున్న ట్యాగ్ లైన్ గుర్తుకొచ్చింది – ‘నేను ఏడుస్తూ పుట్టింది ఏడవడానికి కాదు’. కానీ అతనికెందుకో ‘ఇది మాత్రమే సరిపోవడం లేదు… ఇంకా ఏదో గొప్ప ప్రేరణ కావాలి ఈ రాత్రి కలిగిన దిగులులోంచి బయటపడటానికి’ అని కూడా అనిపించసాగింది. మూత్రనాళాల్లో ఏదో కదలిక.
అటాచ్డ్ బాత్రూంలేదు ఆ పెంట్ హౌస్‌కి. లేచి వెనుకవైపు ఉన్న వాష్ రూంవైపు కదిలాడు.
వాష్ రూమ్ డోర్‌కి గడియపెట్టి తిరిగి గదికి వస్తున్నపుడు ఆ మూడవ అంతస్తు పైనుండి అతని దృష్టి దూరంగా కనిపిస్తున్న పెద్ద రావిచెట్టుమీద పడింది. కాసేపు అక్కడే నిలబడిపోయాడు.
అది తను రోజూ బ్యాంకుకి వెళ్లే మెయిన్ రోడ్డులోని, గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో ఉన్న పురాతన వృక్షం. తన కింద ఏర్పాటుచేసిన డెకరేటివ్ ఫ్లడ్ లైట్ల కాంతిలో దేదీప్యంగా వెలుగుతోంది ఆ వృక్షం – తన చుట్టూ ఉన్న చెట్ల మధ్య నిటారుగా నిలుచుని.
నిన్న బ్యాంకునుండి ఇంటికి వస్తున్నప్పుడు అతనికి కనిపించింది ఆ కాలేజీ ముందు కట్టిన పెద్ద బ్యానర్. ఈ రోజు ఆ కాలేజీ డెబ్భై అయిదవ వార్షిక దినోత్సవ వేడుకలు. అందుకే కాలేజీతోపాటు అక్కడ చాలా కాలంనుండి ఉన్న ఆ రావిచెట్టుకి కూడా వెలుగు జిలుగులు డెకరేట్ చేసినట్లున్నారు అనుకున్నాడు.
ఆ చెట్టుమీదినుండి రోజూ పక్షులు సరిగ్గా తన పెంట్‌హౌస్ మీదినుండి ఎగురుకుంటూ ఊరి చివరి తోటలవైపు వెళ్తుంటాయి ఉదయాన్నే. సాయంత్రం తిరిగి ఇదే దారిలోంచి అదే చెట్టు మీదికి చేరుకుంటాయి.
గూటికి చేరిన పక్షుల్ని ఆ రాత్రంతా తన ఒంటరితనాన్ని పోగొట్టే స్నేహితులుగానో కుటుంబసభ్యులుగానో భావించుకుంటూ నిబ్బరంగా ఉన్నట్లు నిండుగా కనిపిస్తుంది ఆ వృక్షం.
పెంట్‌హౌస్ ముందు కుర్చీ వేసుకుని టీ త్రాగే సమయాల్లోనో, ఏదైనా చదువుకునే సాయంత్రాల్లోనో అప్పుడప్పుడు అతని దృష్టి ఆ చెట్టుమీద పడుతూ ఉండేది. ఈరోజు మాత్రం ఫ్లడ్ లైట్ల వెలుగులో అది మరింత స్పష్టంగా కనిపిస్తోంది.
ఆ ‘పక్షులు వాలిన చెట్టు నిబ్బరంగా నిల్చొని ఉంది’ అనిపించింది.
అలా అనుకోగానే ఆ చెట్టునుండి తనలోకి ఏదో ప్రసారం అయిన భావన కలిగింది అతనికి.
కానీ అది కూడా సరిపోవడం లేదు. ఇంకా ఏదో కావాలి… అనుకుంటోంది అతని మనస్సు.
మళ్లీ ఆ చెట్టువైపు చూసాడు. తన చుట్టూ ఉన్న మరికొన్ని భవంతులు, మరికొన్ని చిన్నా పెద్ద చెట్లతో కలిసి ఉండడంవల్ల ‘అది మరీ ఒంటరిగా ఏంలేదు’ అన్న భావన కలిగిందతనికి.
చెట్టునుండి అతనిలోకి ప్రసారం అవుతోన్న ఫ్లో ఏదో చప్పున ఆగిపోయినట్లయింది.
గదికి గొళ్లెం పెట్టి వచ్చి సోఫాలో కూలబడ్డాడు.. ఎదురుగా టీవీలో The Turin Horse సినిమా టైటిల్స్ మీద మ్యూట్‌లో ఉంది.
మళ్లీ అతన్ని దిగులు ఏదో కమ్ముకుంది. కళ్లముందు తన భవిష్యత్ ఒంటరి రోజులు,వృద్ధాప్యం, ఒక్క పక్షికూడా వాలని ఒంటరి ముసలిచెట్టు – కదలాడాయి.
అతని తలలో ఏదో చప్పున మెరిసినట్లయింది. “అవును… అదే… అదే…”
ఇప్పుడు గుర్తుకువస్తోందా దృశ్యం. సినిమా చూస్తున్నప్పుడు పెద్దగా పట్టించుకోని దృశ్యం. అసలు లెక్క లోనిదే కాదన్నట్లు ఉన్న దృశ్యం. స్పష్టాతిస్పష్టంగా కనిపించిన దృశ్యం.
ఇప్పుడు అనిపిస్తోంది. అది మామూలు దృశ్యం కాదు. ఎలాంటి దిగులు మనసుకైనా గొప్ప ధైర్యాన్ని కలిగించే దృశ్యం.
ఒంటరితనానికి తోడుగా తన దేహం మీద ఒక్క ఆకు లేకపోయినా ధైర్యంగా నిలబడిన చెట్టు – ఒక్క పక్షి తనమీద వాలకపోయినా నిబ్బరంగా నిలబడిన చెట్టు. ఇరవై నాలుగ్గంటలూ పొగమంచూ, చల్లని సుడిగాలీ తనను నాలుగువైపులనుండీ తాకుతూ వెళ్తున్నా, చలికాచుకోవడం కోసం నిప్పుకై వెదికే ప్రయత్నం చేయని గట్టి చేతుల్తో నిలబడ్డ చెట్టు. మనుషులు వస్తారు – ఉంటారు – వెళ్లిపోతారు – సృష్టిలో అదేమంత గొప్ప విషయం కాదు అన్న వేదాంతపు చూపులతో, తనకు సమీపంలో ఉన్న ఒకే ఒక ఇంట్లో జీవిస్తూన్న ఇద్దరు మనుష్యుల దినచర్యవైపు నిర్వికారంగా చూస్తున్న చెట్టు. దాన్ని మళ్లీ చూడాలి… ఇప్పుడే చూడాలి… దాన్ని చూస్తే గొప్ప ధైర్యమేదో కలుగుతుంది.
ఎందుకు చూపెట్టాడో దర్శకుడు బేలా టార్ – ఎత్తయిన మట్టి దిబ్బమీద… మంచుగాలిలో అస్పష్టంగా నిలబడిన ఆ చెట్టుని కిటికీ ఫ్రేమ్‌లోంచి.
ఇప్పుడది ‘తన భవిష్యత్ జీవితపు ఒంటరితనంలోని దిగులుని పోగొట్టగలిగిన ఆత్మావసరం అనిపిస్తోంది.’
మల్లికార్జున్ ఆలోచనల్లోంచి బయటకొచ్చి టీవీ రిమోట్‌ని చేతిలోకి తీసుకొని స్క్రీన్ మీద మ్యూట్‌లో ఉన్న ఆ సినిమాలో కదలిక తెచ్చి సినిమాలో ఆ దృశ్యం కనిపించే చోటుని వెదకసాగాడు.
మట్టిగోడల మధ్య బిగించబడ్డ అద్దపు కిటీకి ముందు కుర్చీలో కూర్చొని సినిమాలో ఆ వృద్ధుడు ఆ కిటికీ అవతలి ప్రపంచం వైపు చూస్తున్నప్పుడు –
ఈదురుగాలిలో కొట్టుకు వస్తున్న ఎండుటాకులకు అవతల కొంచెం దూరంలో ఎత్తయిన మట్టి దిబ్బ మీద… బాగా దృష్టిపెట్టి చూస్తేనే కానీ కనిపించని ఆకుల్లేని చెట్టు… ఒంటరిగా పొగమంచులో ధైర్యంగా నిలబడ్డ చెట్టు… అతనిలోకి ఏదో చైతన్యాన్ని ప్రసారం చేయడానికి ఎదురుచూస్తూ ఉన్నట్లున్న చెట్టు…
ఆ సీన్ వద్దకు చేరుకున్నాడు మల్లికార్జున్.
(బేలా టార్కి నివాళి)