రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

భాస నాటకాలు – అతిక్లుప్తపరిచయం

రచన: శ్రీనివాస్ వురుపుటూరి
మే 2026

భాసుడి గురించి

“ప్రథితయశసాం భాససౌమిల్లకవిపుత్రాదీనాం ప్రబంధానతిక్రమ్య వర్తమానకవేః కాలిదాసస్య క్రియయాం కథం బహుమానః?” అని సూత్రధారుడి సహాయకుడిచేత ప్రశ్నింపజేస్తాడు కాళిదాసు మాళవికాగ్నిమిత్రనాటకపు ప్రస్తావనలో. ఖ్యాతి గడించిన భాసుడు, సౌమిల్లుడు, కవిపుత్రుడు మొదలైనవారి ప్రబంధాలను విడిచిపెట్టి (నవీనుడైన) కాళిదాసకృతిని ఆదరించడం ఏమిటి?” అని ఆ మాటకు అర్థం. (ఈ ప్రశ్నకు సమాధానంగానే “పురాణమిత్యేవ న సాధు సర్వమ్…” శ్లోకాన్ని సంధిస్తాడు సూత్రధారుడు.)

కాళిదాసు కాలం నాటికే భాసుడు సుప్రసిద్ధుడు; ఆ తరువాతి ఆలంకారికుల గ్రంథాలలో భాసుడి, స్వప్నవాసవదత్తనాటకపు ప్రస్తావనలు ఉన్నాయి; 13వ శతాబ్ది వాడైన జయదేవుడు కవితాకామినికి ‘భాసో హాసః’ అని వర్ణించాడు; అయినప్పటికీ ఆధునికకాలం వచ్చేసరికి భాసకృతులు అందుబాటులో లేకుండా పోయాయి.

1909లో మహామహోపాధ్యాయ టి.గణపతిశాస్త్రి ప్రాచీనగ్రంథాన్వేషణార్థమై ఇప్పటి కేరళరాష్ట్రంలో భాగమైన అప్పటి తిరువాన్కూరు రాజ్యంలో పర్యటిస్తూ ఉండగా పద్మనాభపురం సమీపంలోని మణలిక్కర మఠంలో 105 కమ్మల తాళపత్రగ్రంథం ఒకటి దొరికిందట. ఇప్పుడు భాసనాటకచక్రంగా చెప్పుకునే నాటకాల్లో పది రూపకాలు అందులో ఉన్నాయి. ఆ తరువాతి పర్యటనల్లో మరో మూడు నాటకాలు దొరికాయి. వీటన్నింటినీ గణపతిశాస్త్రిగారి సంపాదకత్వంలో త్రివేండ్రం సాంస్క్రిట్ సిరీస్‌లో భాగంగా 1912-13 మధ్యకాలంలో ప్రచురించారు. ఈ నాటకాలనన్నింటినీ కలిపి భాసనాటకచక్రం అని పిలుస్తారు.

‘ఈ నాటకాలన్నింటినీ ఒకే రచయిత వ్రాసాడా, అనేకులా?’, ‘ఒకే రచయిత అయిన పక్షంలో, ఆ రచయిత భాసుడేనా?’, ‘ఇప్పుడు లభ్యమవుతున్న కృతులన్నీ మూలకృతులేనా, లేక అంతకు మునుపు వ్రాయబడ్డ కృతులకు అనుసరణాలా?’, ‘భాసుడనే వ్యక్తి కాళిదాసు కన్నా ముందువాడా, ఆ తరువాతివాడా?’ వంటి ప్రశ్నలపై పెద్దయెత్తున వివాదాలు చెలరేగాయి. ఆంగ్లంలో, భారతీయభాషల్లో ఈ విషయమై వేల కొలది పుటల్లోకి విస్తరించిన చర్చోపచర్చలను ‘భాససమస్య’గా వ్యవహరిస్తారు.

భాసుడి చేత రచించబడిన (భాసుడికి ఆపాదించబడిన) నాటకాలను స్థూలంగా నాలుగు వర్గాలలోకి విభజించవచ్చు:

  1. ఉదయనకథాసంబద్ధాలు (స్వప్నవాసవదత్తం, ప్రతిజ్ఞాయౌగంధరాయణం)
  2. రామాయణసంబద్ధాలు (ప్రతిమానాటకం, అభిషేకనాటకం)
  3. మహాభారతసంబద్ధాలు (బాలచరితం, మధ్యమవ్యాయోగః, పంచరాత్రం, దూతవాక్యం, దూతఘటోత్కచం, కర్ణభారం, ఊరుభంగం); నిజానికి, బాలకృష్ణుడి కథ అయిన బాలచరితాన్ని భాగవతపురాణ/హరివంశ సంబద్ధమని చెప్పుకోవాలేమో.
  4. కాల్పనికాలు (అవిమారకం, చారుదత్తం)

భాసనాటకాలలో కొన్ని ప్రత్యేకతలు

  1. సంస్కృతనాటకాలు, సాధారణంగా – మంగళశ్లోకం పఠించడంతో ప్రారంభమవుతాయి. దానిని నాంది అని అంటారు. నాంది అయ్యాక (“నాంద్యంతే”) సూత్రధారుడు తనకు సహాయకులుగా ఉన్నవారితో సంభాషణను మొదలుపెడుతూ నాటకాన్ని పరిచయం చేస్తాడు. ఆ భాగాన్ని ప్రస్తావన అని పిలుస్తారు. ఈ ప్రస్తావనను భాసనాటకాలలో ‘స్థాపన’ అని పిలుస్తారు (కర్ణభారంలో ‘ప్రస్తావన’ అనే పిలుస్తారు). “నాంద్యంతే తతః ప్రవిశతి సూత్రధారః” అని ఎకాఎకిన సూత్రధారుణ్ణి రంగప్రవేశం చేయిస్తుంది ఈ స్థాపన అనే ప్రక్రియ (నాంది, అంతకన్నా ముందే – “గ్రీన్ రూములోనే” – పూర్తవుతుందట). సూత్రధారుడు మొదటగా మంగళశ్లోకం చదివి, ప్రదర్శింపనున్న నాటకాన్ని బహుక్లుప్తంగా పరిచయం చేసి వేదిక దిగిపోతాడు. ఈ ఎత్తుగడ దాక్షిణాత్య సంస్కృతనాటకాలలో సాధారణమే కానీ వాటికి భిన్నంగా, భాసనాటకాలలో సూత్రధారుడు నాటకరచయిత గురించి ఏమీ చెప్పడు.
  2. నాట్యశాస్త్రం ప్రకారంగా నాటకాలలో యుద్ధదృశ్యాలు, రక్తం, నిద్ర, మరణం వంటివి చూపకూడదు. నాటకం శుభాంతం కావాలి. భాసనాటకాలలో ఈ నియమాలను అతిక్రమించిన సందర్భాలు అనేకం ఉన్నాయి.
  3. రామాయణాది పూర్వగ్రంథాలలోని పాత్రలను వాడుకుంటూ రచించిన నాటకాల్లో రచయిత మూలగ్రంథాల స్ఫూర్తిని గౌరవిస్తూనే తన స్వాతంత్ర్యాన్ని నిలుపుకుంటాడు. మధ్యమవ్యాయోగం, దూతఘటోత్కచం, పంచరాత్రం లాంటి కృతుల్లో పాత్రలను ఇతిహాసం నుంచి తీసుకున్నా కథ/సన్నివేశం మూలంలో లేనిదే. ప్రతిమ, ఊరుభంగం, కర్ణభారం వంటి నాటకాలలో కైకేయి, రావణుడు, దుర్యోధనుడు, కర్ణుడు వంటి దుష్టపాత్రల కల్పనలో సానుభూతిని కనబరుస్తాడు. పౌరాణికపాత్రలను కొత్తకోణంలో చూడడం భాసుడంత పాత విషయం అన్నమాట!
  4. ఈ రచయితకు వర్ణాశ్రమవ్యవస్థ పట్ల, బ్రాహ్మణాధిక్యత పట్ల చాలా గౌరవమున్నదని విమర్శకులు సోదాహరణంగా నిరూపించారు. మధ్యమవ్యాయోగంలాంటి రచనల్లో ప్రస్ఫుటంగా కనబడుతుంది కూడా.
  5. ఇతివృత్తపు ఎంపికను బట్టి మంగళశ్లోకాల రచనను బట్టి ఈయనకు విష్ణుభక్తి విశేషించి కృష్ణభక్తి ఉన్నదని చెప్పుకోవచ్చు. ప్రసంగానుగుణంగా శివస్కందాది దేవతల ప్రస్తావన ఈ నాటకాల్లో కనబడుతుంది.
  6. కేరళలోని చాక్యార్లు అనే వర్గపు వారు కూడియాట్టం అనే నాటకసంప్రదాయాన్ని కొన్ని శతాబ్దాలుగా కొనసాగిస్తూ ఉన్నారు. ఈ కూడియాట్టం నాటకసంచయంలో భాసనాటకాలు ఒక భాగం. భాసనాటకాల ప్రాచీనతను నిరాకరించే పండితులు ఈ నాటకాలను భాసనాటకచక్రమని కాక “పదమూడు తిరువనంతపురం నాటకాలు” (Thirteen Trivandrum plays) అని వ్యవహరించి ఇవన్నీ చాక్యార్ల రచనలని వాదించారు. ఈ నాటకాలలో కనిపించే సంస్కృతవ్యాకరణవిరుద్ధప్రయోగాలు, విలక్షణమైన ప్రాకృతమూ చాక్యార్ల కర్తృత్వాన్ని సూచించే గుర్తులని వీరి వాదన.

తెలుగులో భాసుడు

గణపతిశాస్త్రిగారు భాసనాటకాలను ప్రచురించడం కన్నా ముందుగానే – తాళపత్రప్రతుల ఆధారంగా మానవల్లి రామకృష్ణకవిగారు వాటిని తెలుగులోకి అనువదించడం ప్రారంభించారు. కర్ణభారానువాదానికి ఉపోద్ఘాతం వ్రాస్తూ,

“కేరళ దేశ లక్ష్మి యింట నిరుద్ధ శోభాకరములైయుండిన భాసకృతిరత్నములు వెలువడి పండిత కంఠ పరిష్కారములగుచుండుట పెక్కండ్రకు విదితమేగదా. ఇంచుమించు మూఁడుసంవత్సరములకుఁ బూర్వము స్వప్నవాసవదత్త, ప్రతిజ్ఞాయౌగంధరాయణముల మాత్రము తాళపత్రప్రతులు సంపాదించి వాని రససంపదకు మెచ్చి తెనిగించి యుంటిని. ఇటీవలఁ గార్యాంతరముగాఁ గేరళ దేశమున కేతెంచి తక్కుఁగల పదునొకొండు రూపకములఁ జదివి యభూతపూర్వమగు నానందముంజెంది, వానినెల్ల నల్పకాలములోఁ దెనిగించితిని.”

అని అన్నారాయన. అయితే, ఈ అనువాదాలలో ఏడే ముద్రితమయ్యాయని, (1972 నాటికి) అవిమారకము, కర్ణభారము మాత్రమే లభ్యమయ్యేవట.

1913లోనే కర్ణభారాన్ని, మధ్యమవ్యాయోగాన్ని వేటూరి ప్రభాకరశాస్త్రిగారు తెలుగులోనికి అనువదించారు. ఆయనే ప్రతిమానాటకాన్ని 1927లో అనువదించారు. ఆ అనువాదం భారతి మాసపత్రికలో ఆ యేడు ఆగస్ట్-డిసెంబర్ సంచికలలో ధారావాహికంగా ప్రచురించబడ్డాక గ్రంథరూపంలో వెలువడింది. చిలకమర్తి లక్ష్మీనరసింహం పంతులుగారు 1926 నాటికే భాసనాటకచక్రంలో పన్నెండు నాటకాలను తెలుగులోనికి అనువదించారట. 1933లో అభిషేకనాటకపు అనువాదంతో నాటకచక్రపు అనువాదాన్ని పూర్తిచేసినట్లున్నారు. మల్లాది సూర్యనారాయణశాస్త్రిగారు ‘భాసనాటకకథలు’ అనే పేరుతో భారతనాటకాలు కాక మిగతావి కథారూపంలో అనువదించారు. జి.వి.కృష్ణారావుగారు ప్రతిమా నాటకాన్ని అనువదించారు. ఇటీవల (2017) డా.రామవరపు శరత్‌బాబుగారు మొత్తం భాసనాటకచక్రాన్ని తెలుగులోకి అనువదించారు.

కొడవటిగంటి కుటుంబరావుగారికి భాసుడంటే చాలా అభిమానమట. చందమామ మాసపత్రికకు ఆయన సంపాదకుడుగా ఉన్న కాలంలో ప్రచురించిన క్లాసిక్ కథల ధారావాహికలో భాగంగా ఎనిమిది భాసనాటకకథలను 1960 జనవరి-ఆగస్ట్ మధ్య కాలంలో ప్రచురించారు.

ఈమాట సంస్థాపకసంపాదకులలో ఒకరైన భాస్కర్ కొంపెల్ల గారి స్వప్నవాసవదత్తం అనువాదం ఈమాట గ్రంథాలయంలో లభ్యమవుతుంది.

సంప్రదించిన పుస్తకాలు, వ్యాసాలు

1. Bhasa – A Study (A.D.Puslalker)
2. భాసుడు (ఆంగ్లం: వి.వేంకటాచలం; తెలుగు: పుల్లెల శ్రీరామచంద్రుడు)
3. వేటూరి ప్రభాకరశాస్త్రి వాఙ్మయసూచిక (మసవ చెన్నప్పగారు)
4. చిలకమర్తి జీవితం, సాహిత్యం (ముక్తేవి భారతి)
5. మానవల్లి కవి – రచనలు (నిడుదవోలు వెంకట్రావు, పోణంగి అప్పారావు)
6. ఐశ్వర్యం – ఓ పరిచయం (కొడవళ్ళ హనుమంతరావు)
7. భాస నాటక చక్రం

    
   

0There are no comments

మీ అభిప్రాయం తెలియచేయండిCancel reply

మీ అభిప్రాయం తెలియచేయండి

  

   ( సహాయం తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a

ఈమాట పాఠకులకు సూచనలు చదివాను. వాటికి కట్టుబడి ఉంటానని హామీ ఇస్తున్నాను.

ఈ రచయిత నుంచే...

  • మధ్యమవ్యాయోగము – సమూలానువాదం
  • కర్ణభారం – సమూలానువాదం
  • ఊరుభంగం – సమూలానువాదం: 2
  • దూతఘటోత్కచం – సమూలానువాదం
  • భాస నాటకాలు – అతిక్లుప్తపరిచయం

ఇటువంటివే…

  1. సంగీత నాటకాలు
  2. సంగీత నాటకాలు
  3. నిర్ణేతల వ్యాఖ్య: వ్యాసాలు, నాటకాలు
  4. స్వప్నవాసవదత్తం -1
  5. పోతన భాగవతంలో దృశ్యీకరణం – 2

మే 2026 సంచికలో ...

  • అస్తిత్వవాద సాహిత్యం: 5ఈ. కాఫ్కా
  • ఏది సంధి, ఏది జలసంధి?
  • ఒక నగరం, కొన్ని పగటి కలలు
  • ఓడిస్సీ – 6: ఇథకాకు తిరుగు ప్రయాణం
  • కంప్యూటర్ చిప్ కథ – 13: జె. జె. థామ్సన్ కనుగొన్న ఎలక్ట్రాన్
  • కళాసాగరం కర్ణాటకం-4
  • తెల్లారగట్ల
  • న్యూయార్క్ ముచ్చటగా మూడు
  • భాస నాటకాలు – అతిక్లుప్తపరిచయం
  • మంకుతిమ్మని మరో మిణుకు — 4 (31-40)
  • మధ్యమవ్యాయోగము – సమూలానువాదం
  • మనసును దోచే మనస్లు– 5
  • మే 2026
  • యూట్యూబ్ లో ఈమాట: ఏప్రిల్ 2026
  • విదూషకుడి చిరునామా
  • సమూహ
  • సౌతాఫ్రికాలో ప్రవాస ప్రస్థానం-2
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

రచనల జాబితా

ఓడిస్సీ – 6: ఇథకాకు తిరుగు ప్రయాణం
మధ్యమవ్యాయోగము – సమూలానువాదం

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.