నాణేనికి
ఒకపక్క శబ్దం
మరోపక్క నిశ్శబ్దం
ఉంటే ఎంత బావుణ్ణు!
కావలసినప్పుడు
నాణేన్ని బోర్లిస్తే
సరిపోతుంది
పాట ముగిసేక
స్విచ్ నొక్కినట్టు
యుద్ధమూ, శాంతి
నాణేనికి చెరో పక్కా
ఉంటాయని అనుకోవద్దు
రెండూ రెండుపక్కలా
సింహం బొమ్మలు
దూసిన కత్తులు
రణగొణ ధ్వని
అదే శాంతి అదే బాణీ
ఏం చేసినా, చేయకపోయినా
రాళ్లున్నవాడు
విసురుతూనే ఉంటాడు
కొంగుకి చమురు
కట్టుకుపోతూనే ఉంటాడు
సైరన్ల మధ్య
ఏదీ వినపడదు
గుండె చప్పుడు తప్ప
పట్టు విడుపుల మధ్య
గ్రహణంలో
ఏది సంధి, ఏది జలసంధి?
ప్రభాతభేరి కోసం చూడకు
ప్రాణం పోవడం కన్నా
ఇల్లు కూలడం నయం
అది ఇవాళ్టి మాట
రేపు మొదటిదే
నయమనిపిస్తుంది
రేపు ఉండడమే ఆశ
రేపు, ఎందుకున్నామా
అనిపించడం ఘోష
మరణాన్ని మించిన
నరఘోష
అస్త్రశస్త్ర విన్యాసానికి
వినాశనమే గమ్యం
జయమే పరాజయం
