కొత్త రాతి యుగం

తెల్ల కాగితం మీద రాసి ఉన్నది
నిశ్శబ్దమేనా?

నల్లరాతి శిల్పంలో ఉన్నది
బెచ్చలూడిన దుఃఖమేనా?

గుహల్లో ఆది మానవులు
చిత్రించిన బొమ్మల్లో
గుండెలు మోగుతున్నాయి

పాదముద్రలు
ఊపిరి జాడలు
శ్మశాన ఉద్యానాలూ
ఈ పరిమళం ఇక్కడిది కాదు
ఈ దుఃఖం ఇప్పటిది కాదు

మాటలకు రెక్కలిచ్చాం
రక్తాన్నిచ్చాం
కన్నీళ్ళనిచ్చాం
ఎగిరిపోతుంటే పట్టుకునేందుకు
వడిసెల్లో గుండెలు పెట్టి విసురుతున్నాం
వేటాడుతున్నాం
గాలిలో
ఆకాశంలో

ఒక అడుగు
గాలిలోకి లేచినప్పుడు
మరో పాదం నేల మీద
అలా రెండు పాదాలతో
ఒక బాట
చివరికి బాటసారిని వెతుక్కుంటో

బాట చెరిగిపోవచ్చు
ఎటూ తీసుకుపోలేని బాటలో
తుప్పలు పెరిగిపోవచ్చు

రాసిన అక్షరాన్ని మాత్రం
చెరపలేవు ఎప్పటికీ
తెల్లని కాగితం మీద
తెల్లని అక్షరం ఎప్పటికీ దొరకదు

నిశ్శబ్దాన్ని పగలగొట్టడానికి
పెద్ద గుండె కావాలి
అది అక్షరంలో పొగిలే
శబ్దం

నీలో నిన్ను
ప్రతిష్ఠించుకున్నప్పుడు
నీకు నీవు దొరక్కపోవడమే
అర్థం

అడవి పాడే వైయక్తిక గీతంలో
పల్లవి లేదు
అను పల్లవి లేదు
అసలేదీ రెండోసారి వినిపించదు
కార్చిచ్చులు కఠోర
తుపానులు అన్నీ కొత్తవే

పాపం కవులు కందెనలు పట్టుకుని
తిరుగుతుంటారు
యుద్ధ క్షేత్రంలో కొన ఊపిరితో ఎదురు చూస్తున్న
మనషుల్ని వెతుకుతుంటారు

భాషను కనిపెట్టినప్పుడే
మనిషి ఒక
రహస్యాన్ని కోల్పోయాడు

గెలుపును గిరిగీసినప్పుడే
మనిషి తన జీవితాన్ని
పోగొట్టుకున్నాడు


రచయిత పసునూరు శ్రీధర్‌బాబు గురించి:

‘అనేకవచనం’ పసునూరు శ్రీధర్‌బాబు తొలి కవితా సంపుటి. 1999లో ప్రచురితమైంది. రెండో కవితా సంకలనం ‘నిదురపోని మెలకువ చెప్పిన కల’ 2021లో విడుదలైంది. ‘అనేకవచనం’ కవిత్వానికి అజంతా అవార్డు, రమణ సుమనశ్రీ ఫౌండేషన్, సిరిసిల్ల ‘మారసం రుద్రరవి’ పురస్కారాలు లభించాయి. ‘నిదురపోని మెలకువ చెప్పిన కల’ సంకలనానికి ‘రొట్టమాకు రేవు షేక్ మహ్మద్ మియా’ కవిత్వ పురస్కారం, ఖమ్మం ఈస్థటిక్స్ అవార్డు, నవసాహితి దాశరథి ఉత్తమ కవిత అవార్డు, మల్లావఝల సదాశివుడు స్మారక పురస్కారాలు లభించాయి. ‘ఏకాంతం ఒక అతిథి’ పేరుతో ఈ కవి తన మూడో సంకలనాన్ని 2025లో ప్రచురించారు. వృత్తిరీత్యా జర్నలిస్ట్. ఇండియా టుడే, హెచ్ఎంటీవీ, 10టీవీ, బీబీసీ న్యూస్‌ వంటి సంస్థలలో పని చేశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని మోత్కూరులో 1969 జూలై 21న జన్మించారు.

 ...