ప్రవాసాంధ్ర సాహిత్య దిగ్గజం, ఈమాట పత్రిక విశ్రాంత సంపాదకులు, బహుముఖ ప్రజ్ఞాశాలి, సదా ఈమాట పత్రికకు శ్రేయోభిలాషి అయిన డా. వేలూరి వేంకటేశ్వర రావుగారు […]
ఫిబ్రవరి 2026
భారతీయ భాషా సాహిత్యాన్ని సూటిగా మూలంనుండి తెలుగులోకి అనువాదం చేయకుండా ఆంగ్ల అనువాదం ఆధారంగా అనువాదం చేయడం ఒక రకమైన సాంస్కృతిక అపరాధంగా పరిగణించాలి. భారతదేశంలో పలు భాషాకుటుంబాలకు చెందిన భాషలు పలుప్రాంతాలలో విస్తరించి ఉన్నా, అవన్నీ కనీసం మూడువేల యేండ్లపాటు భారత-ఉపఖండంలో కలిసి అభివృద్ధి చెందడం వల్ల, పరస్పరప్రభావాలతో ఈ ఉపఖండం ఏకీకృత భాషాసాంస్కృతిక ప్రదేశంగా (Linguistic Area and Cultural Area) మారిపోయింది. దాదాపు ఒకే రకమైన వాక్యనిర్మాణం, సాహిత్య సంప్రదాయాలు; సామాన్య చారిత్రక, రాజకీయ, సాంస్కృతిక నేపథ్యం; సమానార్థకాలైన సామెతలు, పౌరాణిక ప్రతీకలు; అన్ని భాషలలోకి చొచ్చుకుపోయిన సంస్కృత పదజాలం — ఇవన్నీ మూలభావాన్ని మరో భారతీయ భాషలోకి అనువదించడాన్ని సులభతరం చేస్తాయి. ఈ సామీప్యతను, భావ సారూప్యతను విస్మరించి, పాశ్చాత్య సాహిత్య అభిరుచులకు అనుగుణంగా మారిన ఆంగ్లానువాదాన్ని అనుసరించడం వలన మూలభావం పూర్తిగా దెబ్బతింటుంది. రవీంద్రనాథ్ ఠాగూర్ ‘గీతాంజలి’ కావ్యంలోని ఒక ఉదాహరణే దీనికి నిదర్శనం. బెంగాలీ మూలంలో ‘వసంతం’ గురించి రాసిన ఒక కవితను ఆంగ్లానువాదంలో ఠాగూర్ సమ్మర్‌గా మార్చారు. ఎందుకంటే, ఇంగ్లీషు వారికి గ్రీష్మం అతి ఆహ్లాదకరమైన కాలం. సంవత్సరమంతా, చలిలో గడిపి, సమ్మర్-డేస్ కోసం ఎదురు చూస్తుంటారు. ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సూచించడానికి భారతీయ సాహిత్యంలో వసంతానికి ఏ స్థానం ఉందో, ఇంగ్లీషు సంస్కృతిలో వేసవికి ఆ స్థానం ఉంది. ఈ తేడాను గమనించకుండా, ఆంగ్ల అనువాదం ఆధారంగా చేసిన తెలుగు గీతాంజలి అనువాదాలలో ‘వేసంగి’ నిట్టూర్పులతో వచ్చినట్లు వర్ణించడం ద్వారా, కవి మూల భావానికి పూర్తిగా విరుద్ధమైన భావాన్ని చెప్పి రసాభాస చేసారు పలు తెలుగు అనువాదకులు.
ఒకే గడ్డపై పుట్టిన భాషల మధ్య జరిగే భావ వ్యక్తీకరణలో ఉండే సహజత్వం, ఆ అనువాదాలకు నిండుదనాన్ని ఇస్తుంది. కన్నడంలోగాని, మలయాళంలోగానీ రచయిత మనకు అరిటాకులో ఇచ్చిన దోసె తెలుగులోనూ అరిటాకులోనే ఉంటుంది. అందుకని దోసె రుచే కాకుండా అరిటాకు వాసన కూడా మనకు పట్టుబడుతుంది. అదే ఇంగ్లీషులోకి వచ్చేసరికి అరిటాకు మాయమై పింగాణీపాత్ర ఎదురవుతుంది. తినేది దోసె కాదు, క్రేప్ అవుతుంది, లేదా ప్యాన్‌కేక్ అవుతుంది. అంటే, రంగు, రుచి, వాసన అన్నీ ఆంగ్ల వాతావరణానికి అనుగుణంగా మారిపోతాయి.
మరో భారతీయ భాష అయిన మూలభాష మనకు తెలియకపోయినా, ఆ మూలభాష తెలిసిన భాషాకోవిదులనో, సాహిత్యాభిమానులనో హైదరాబాదు వంటి పెద్దనగరాల్లో పట్టుకోవడం అంత పెద్ద సమస్య కాకపోవచ్చు. ఇప్పుడు కృత్రిమమేధ సాయంతో కూడా భారతీయ మూలభాషలోని ప్రతిపదార్థాలను వివరంగా గ్రహించవచ్చు. పాశ్చాత్య సాహిత్య అభిరుచులకు, సాహితీ-సంస్కృతులకు అనుగుణంగా రూపొందించిన ఆంగ్లానువాదాల మీద ఆధారపడటం కంటే, భారతీయ భాషలలోని సాహిత్యాన్ని నేరుగా మూలభాషలలో అధ్యయనం చేసి, భారతీయ సాహిత్య అభిరుచులకు అనుగుణంగా తెలుగులోకి అనువదించడం ఉత్తమం. జర్మన్, ఫ్రెంచ్ వంటి యూరోపియన్ భాషల అనువాదాలకు ఆంగ్ల అనువాదాల మీద పూర్తిగా ఆధారపడడం సబబే అయినా, భారతీయ భాషల రచనలలోని రంగు, రుచి, వాసన, ఆత్మ పట్టుకోవాలంటే, మూలభాషలో రచనను కొంతైనా అధ్యయనం చేయడం అనువాద రచయితల కనీస కర్తవ్యం.
వెదురుపొదలే కంచెలుగా, ఎక్కడ
పనసచెట్ల వేర్లపై పళ్ళు విరగ కాస్తాయో
ఆ కొండవాలు ప్రాంతపు యువకుడా, నువ్వు సరైన పని చేయి!
ఆమె మనసులో ఏముందో ఎవరికి తెలుసు? కొండవాలున
చెట్టు సన్నని కొమ్మకు వేలాడే పెద్ద పనసపండు లాగ,
ఆ పిల్లది చిన్ని ప్రాణం! ఐతే నీపై ఆమెకున్న ప్రేమయో? ఎంతో పెద్దది!
పదుల సంవత్సరాలు శ్రమించి, ప్రాచీనశిల్పులు రాతిలో మలచిన అతిలోక సౌందర్యాన్ని వీక్షించటానికి మనుషులకు కళ్ళు ఉండడం – ఆ అదృష్టం. ఆ కళ్ళు రెండు మాత్రమే ఉండడం – అన్యాయం.
“వందల ఏళ్ల తర్వాత కూడా మాక్స్వెల్ గతకాలపు ప్రకాశవంతమైన నక్షత్రాలలో ఒకటిగా వెలుగుతూనే ఉంటాడు.”
మాఘమాసం రాగానే
కిందటేడాది ఎక్కడ వదిలిపెట్టానో
ఆ కవితలక్కడే కనిపిస్తాయి.
రాత్రుల చీకటీ, దీపాల కాంతులూ,
రాత్రుల నిశ్శబ్దం, పలకరించి పోయే శబ్దాలూ,
రాత్రి లాంటి ప్రపంచం, ఎదురై, మాయమయే ప్రేమలూ
నా చూపులు వేల మైళ్ళు పరిగెత్తినా,
నీ నీడను తాకలేవు.
నా చేతులు చీకట్లోకి ఎంతగా చాచినా,
నీ వేళ్ళ వెచ్చదనాన్ని అందుకోలేవు.
పొద్దుగూకిందని
పక్షులన్నీ
చెట్లు వెతుక్కున్నాయని
వెలుతురు కిటికీ మూసేసి
చీకటి తలుపు తెరవకు
దూరాన ఉన్న కొండచరియల మీద కనిపిస్తోన్న జలపాతాల దృశ్యం అధివాస్తవిక చిత్రంలా అనిపించింది. ఏదో ఆరుబయలు రంగస్థలంలోని బృహత్తరమైన గ్రానైట్ తెరమీద జాలువారే జలధారల వర్ణచిత్రంలా అనిపించింది. అంత చక్కని దృశ్యం చిత్రించిన చిత్రకారుడెవరూ? ‘ఏ కౌన్ చిత్రకార్ హై?’ అని శాంతారామ్ సినిమాలోని పాటలో అడిగినట్లు అడగాలనిపించింది.
కథలు పుట్టేవి
వెచ్చని రెక్కల కుర్రాడు
మంచులో మునిగిన కథ
మంచు తెర మీద విరిసిన
కాంతి పూల కథ
నన్ను మోసుకు తిరగమని
నామీద కుట్రగా
ఎక్కడిదో ఎవరిదో
ఒక పక్షి
నామీద వచ్చి వాలుతుంది
ఎన్ని ఇక్కట్లు ఎదురైనా అతని దృష్టి ఎటూ చెదరకుండా గమ్యం మీదనే ఉంది. ఆ గమ్యం ఇథకా పట్టణం. ఆ పట్టణంలో ఉన్న తన భార్య పెనలొపీ, కొడుకు టెలెమాకస్. ఈపాటికి పిల్లడికి పన్నెండేళ్ళు వచ్చి ఉంటాయి. తన తల్లిదండ్రులు? వారింకా బ్రతికే ఉన్నారా?
తన్మయుం డద్దమున కెదురుగా నిలచి లా-
వణ్యముల తిలకించి మురిసిపోవునటు
చిన్మయుడు సృష్టి చిత్రమున తన వీర్య సం-
పన్నము ననుభవించు – మంకుతిమ్మ
ముష్టెత్తడానికి ఆమెకు ప్రత్యేకమైన ఏర్పాట్లేం ఉండవు. ఖాళీ చెయ్యి సాచి యాచిస్తుంది. వచ్చిన నోట్లని ఎడమ చేతిలో బిగియపట్టుకుంటుంది. సిగ్నల్ పడి వాహనాలు వెళుతుండగా పేవ్మెంట్ మీదికి చేరి, బొడ్డున దోపుకున్న ఒక తిత్తిలోకి ఆ మొత్తం చేరుస్తుంది.
‘ఉ’ పోతే, ఉద్భటుడంత వాడుత్తుత్తి భటుడవుతాడు. ఉపచారి పచారీ కొట్లో గుమస్తాగా చేరతాడు. మనకిక ఉగాదులూ ఉషస్సులూ ఉండవు. ఉపమానం, ఉత్ప్రేక్షలూ మాయమై, మొత్తం కవిత్వం సున్న అవుతుంది. ఉదారం దారంగా మిగులుతుంది.
వంగపండు పాటంటే వెంటనే గుర్తొచ్చేది “ఏం పిల్లడో ఎల్దుమొస్తవా”పాట.
ఈ పాటలో “ఏం పిల్లడో ఎల్దుమొస్తవా!” అని అడుగుతాడు కవి. ఎక్కడికీ? అంటే “శ్రీకాకుళంలో సీమకొండకి” అంటాడు. అపుడు ఎందుకూ? అనే ప్రశ్న వస్తుంది. “సిలకలు కత్తులు దులపరిస్తయట” అని అక్కడ జరుతున్న పోరాటాలను సింబాలిక్‌గా చెపుతాడు. శ్రీకాకుళ గిరిజన రైతుల పోరాట నేపధ్యంలో మంచి నిర్వహణ దక్షతతో రాసిన ఈ పాట తెలుగు ప్రజలను ఉత్తేజితులను చేసింది, ఉర్రుతలూగించింది.
ఈ విధంగా ఉర్దూ/హిందీ ప్రణయ భావార్ద్ర కవితలను అనువదించడం వల్ల, స్వతంత్రంగా తెలుగులో అభ్యుదయ కవులకు లేని అవకాశాన్ని పూరించుకోవడమే కాదు, ఈ కవిమల్లుడు తన కడప కత్తికి రెండువైపులా పదునేనని తన కలాన్ని కదను తొక్కించారు.
తప్పిపోయిన జీవుల కోసం వెతికే నలుగురు యువకుల కథలా ఈ నవలగా పైకి కనిపించే ఈ నవల లోపల లోతైన తాత్విక చింతన ఉంది. సమాజంలో జరుగుతున్న అనేక అంశాలపైన చర్చ ఉంది. దేనికోసమే వెతుకుతూ మరి దేన్నో కోల్పోతున్న నాగరికపు ప్రపంచానికి హెచ్చరిక ఉంది. జీవాలు సైతం మనుషుల్లా మారి అనేక అంశాలు చర్చించడం ఈ నవలలో కనిపిస్తుంది.
కాఫ్కా పేరు విననివారు ఉండరు. అతడి గురించి రెండు విషయాలు లోకానికి తెలుసు, అతన్ని చదవనివారికి కూడా. ఒకటి: తన రచనలను అన్నిటిని తన మరణానంతరం చింపి చెత్తలో వేయమని కోరాడని. రెండు: ఇద్దరమ్మాయిలతో మూడుసార్లు పెళ్ళి నిశ్చయమై, మూడుసార్లు భగ్నమయిందని; చివరకు పెళ్ళి చేసుకోకుండానే చనిపోయాడని.
ఈ పుస్తకంమీద దాదాపు 9 సంవత్సరాలు పని చేశాను. దాదాపు 900 మందిని కలిసిన తరువాతే ఈ పుస్తకం బయటకు వచ్చింది. నిర్దిష్ట ప్రణాళిక లేకుండా చేసిన వందలాది గంటల ఇంటర్వ్యూలు, సామూహిక చర్చలు, ఊరికే చెప్పుకొన్న కబుర్లు, ప్రణాళికాబద్ధమైన ప్రశ్నావళి – వీటన్నిటి ఫలితమే ఈ పుస్తకం.
కావ్య సాహిత్యం నుంచి ప్రబంధ సాహిత్యం వరకు, కాలక్రమేణా తెలుగు భాష అభివృద్ధి చెందే క్రమంలో కవులు కావ్యాలలో దృశ్యీకరణలకు ప్రాధాన్యతను పెంచుకుంటూ వచ్చారు. ఆదికవి నన్నయ మహాభారతం నుంచి ప్రబంధ కవి పింగళి సూరన కళాపూర్ణోదయం వరకూ, ఆ పిదప వచ్చిన కావ్యాలను గమనిస్తే ‘కథలను చెప్పే ధోరణి నుంచి, కథలను చూపించే పద్ధతి’ని కవులు ఆచరించారనిపిస్తుంది.
మారుతున్న కాలంతో పాటూ సాహిత్య వేదికలూ మారుతున్నాయి. ఆడియో కథలు ప్రాచుర్యంలోకి వస్తున్నాయి. వీటికి యూట్యూబ్ ముఖ్య వేదిక. కనుక, ఈమాట యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించాం. గతనెలలో కొత్తగా అప్లోడ్ చేసిన రచనల వివరాలు ఇవీ:
తెల్లాపూర్‌లోని ఫూలే అంబేద్కర్ ఇంగ్లీష్ ట్రైనింగ్ సెంటర్లో ఫిబ్రవరి 7- 8 తేదీలలో 50 మంది కొత్త తరం కవుల ‘మిలన్: వర్క్‌షాప్’ జరుగుతుంది.