కళాసాగరం కర్ణాటకం

1400 కిలోమీటర్లు.
తొమ్మిది క్షేత్రాలు.
ఆరు రోజులు.
ఇద్దరు వ్యక్తులు.
ఒక కారు.

‘ఇంతే’ అనుకుంటే దీన్ని గురించి రాయడానికేమీ ఉండదు. ఇంతేలా అనిపించినా ఎంతో ఉంది. అది చూసింది. చూడనిది ఇంకెంతో ఉంది.

చూడాలన్న కోరిక ఉంటే సరిపోదు. అది తపనగా గడ్డకట్టాలి. ఆ తపనకు ప్రయత్నం తోడు కావాలి. ఆ ప్రయత్నానికి వనరులూ సమయమూ కుదుర్చుకోవాలి. ఇవన్నీ కుదరడానికి మెదడు సహకరించాలి.
తపనకు మెదడు సహకరిస్తున్నంతసేపూ గుండె కూడా కలల ద్వారా కళ్ళ ద్వారా దర్శిస్తుండాలి. అప్పుడు కదూ ఒక చక్కని అనుభవం మిగిలేది?


బేలూరు, హళేబీడు, హంపి…

చిన్నప్పటినుంచీ అనేకసార్లు ఫోటోల్లోనూ సినిమాల్లోనూ చూస్తున్న స్థలాలు. మొదటిసారి, చిన్నప్పుడు చూసిన ‘శంకరాభరణం’ సినిమాలో ‘రాగం, తానం, పల్లవి’ అన్న పాటలో కథానాయకి నాట్యానికి నేపథ్యంగా కనపడింది హళేబీడు. ఆ ఆలయం ఏ దేవుడి స్థానమో తెలియకపోయినా, అక్కడి పురాతన శిల్పకళా వైభవాన్ని మాత్రం తర్వాతి దశాబ్దాల్లో అనేకసార్లు ఇష్టంగా గుర్తు చేసుకున్నాను. అక్కడి శిల్పకళ అన్నిసార్లూ అబ్బురపరుస్తూనే ఉంది. బతుకు పరుగుతీతల్లో ఆ ఇష్టమైన జ్ఞాపకాలను అప్పుడప్పుడూ తడుముకుంటూనే ఉన్నా, ఆ సౌందర్యాన్ని ప్రత్యక్షంగా పలకరించాలన్న కోరికను ఎప్పటికప్పుడు ఏదో ఓ కారణంతో వాయిదా వేసుకొంటూ వచ్చాను.

2025 డిసెంబర్లో ఒక అవకాశాన్ని కల్పించుకున్నాను.

బేలూరు, హళేబీడు, హంపి. ఈ మూడు స్థలాలే కాక మరికొన్ని కూడా కలిపి ఒక చిన్న యాత్రను ఎలా రూపొందించుకోవాలా అని స్నేహితులనుంచీ ఆత్మీయులనుంచీ కొంత సమాచారాన్ని సేకరించి ఒక స్కెచ్చీ ప్రణాళికను సిద్ధం చేసుకున్నాం. దానికి AI ఇచ్చిన సూచనలు కూడా కలిపి.

2025 డిసెంబర్ 20 పొద్దున్నే బెంగుళూర్‌లో ట్రైన్ దిగాం. యలహంక రైల్వే స్టేషన్‌నుంచి బయల్దేరి విశాలమైన బెంగళూరు రోడ్లగుండా పరుగులు తీసిన మా కాబ్, ‘బనశంకరి’లోకి చేరేసరికి ఇరుకైన రోడ్ల గుండా లెక్కలేనన్ని మలుపులు తిరిగి, అద్దెకు తీసుకోబోతున్న కారు ఉన్న చోటికి మమ్మల్ని చేర్చింది. అంత సన్నని రోడ్లకు రెండువైపులా ఇళ్ళు, దుకాణాలు. అడపాదడపా ఎదురవుతున్న వెడల్పాటి కార్లు. టైర్ పట్టేంత సందు దొరికితే చాలు – పరుగులతో దూసుకొచ్చి దాటిపోతున్న ద్విచక్ర వాహనాలు. ఆశ్చర్యం వేసింది. ఇంత ఇరుకు దారుల్లో ఇన్ని వాహనాలా?

ఆ కారు యజమాని చాలా మర్యాదస్తుడు. కారు గురించిన వివరాలు – ‘ఫాస్టాగ్’ లో బాలన్స్ ఎంత వుందో, కార్లో ఎంత పెట్రోల్ ఉందో చెప్పాడు. చక్కటి కారు అది. మారుతి స్విఫ్ట్. 2025 మోడల్.

మా స్వంత కార్లో అయితే, డ్రైవర్ సీటు ఎత్తును పెంచుకునే వీలుంది. ఆ వీలు కోసం ఈ డ్రైవర్ సీటునూ బుజ్జగించాను. లాభం లేకపోయింది. పర్వాలేదనుకుని, స్టార్ట్ చేశాను. కారు మెత్తగా కదిలింది.

బేలూరు, హళేబీడులకు దగ్గర్లోని పెద్ద పట్నం ‘హాసన’ అని, అక్కడ బస చేసి ఆ రెండు చోట్లనూ దర్శించవచ్చనీ ప్లాన్ వేసుకుంటున్నప్పుడు లభించిన సమాచారం ప్రకారం, హాసన మా మొదటి మజిలీ అయింది. ఆ సమాచారం అంత సరైంది కాదని తర్వాత తెలిసింది.

కారు GPS లో ఆ గమ్యాన్ని నమోదు చేసి, దాని సూచనల మేరకు వాహనాన్ని ఆ దారిలోకి తిప్పాను.



హైవే 275

బెంగళూరు ట్రాఫిక్‌లో ఈదుతూ నగరపు పొలిమేరలు దాటిన వెంటనే, పెద్ద పెద్ద బండల మధ్యనుంచి నిర్మించిన హైవే మీదుగా ప్రయాణం సాగింది. కనువిందు చేస్తూ సాగిన ఆ మార్గం, హైవే 275. ‘రామ్ నగర్’ అన్న బోర్డు కనబడి, భారతీయ చలనచిత్ర చరిత్రలో మైలురాయిగా నిలిచిన ‘షోలే’ లోని కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రించిన ప్రదేశం ఇదేనని గుర్తు చేసింది. ఇన్నేళ్ళలో అనేకసార్లు చూసిన ఆ సన్నివేశాల్లోని లాండ్‌స్కేప్‌ల జ్ఞాపకాలతో, కళ్ళకు ఎదురవుతూ వెనక్కు పరుగెడుతున్న ఈ బండలను సరిపోల్చుకునే ప్రయత్నం అప్రయత్నంగా చేసింది మనసు.

మరికొంత దూరం సాగి, మాండ్యా మీదుగా సాగిన హైవే ‘కగ్గరె’, ‘మట్టనవిలె’ల మీదుగా మమ్మల్ని శ్రవణ బెళగొళకు చేర్చింది.

జైనులకు పవిత్రతీర్థ స్థలం శ్రవణ బెళగొళ. బెళగొళ అంటే ‘తెల్ల కొళను (లేక కొలను)’ అని అర్థమట. ఈ బెళగొళను మరొక రెండు బెళగొళలు – హళె, కోడి – బెళగొళలనుంచి విడిగా పేర్కొనడానికి ఆ పేరుకు ముందు శ్రవణ అని చేర్చారట. పరమభక్తురాలైన ఒక వృద్ధురాలు తన వద్దనున్న గుల్లెకాయ – అంటే కొబ్బరికాయలో నింపుకొని తెచ్చిన పాలతో గొమ్మటేశ్వరుడిని అభిషేకించిందని, అందుకే ఈ ప్రాంతానికి దేవర బెళగొళ అనే పేరు కూడా ఉందని స్థలపురాణం.

ఈ క్షేత్రం పేరు శ్రావణ బెళగొళ కాదు; శ్రవణ బెళగొళ. శ్రవణ అన్న పదానికి మూలం శ్రమణక. జైనమతంలో ఆత్మ క్రమశిక్షణతో ఆధ్యాత్మిక సాధన చేసే వారిని శ్రమణకులుగా పేర్కొనేవారు. ఇది శ్రమణక సరోవరం – శ్రవణ బెళగొళ.

శ్రవణ బెళగొళ అన్న పేరు స్ఫురణకు వచ్చిన వెంటనే కళ్ళెదురుగా ప్రత్యక్షమయేది ఎత్తైన బాహుబలి – గొమ్మటేశ్వరుడి బృహద్విగ్రహం. కాళ్ళకు చుట్టుకొని ఎగబ్రాకినట్లున్న ఒక్క లత మాత్రమే ఆచ్ఛాదన ఆ విగ్రహానికి. ఆ ఆజానుబాహు స్వరూపంలో ప్రముఖంగా, బలంగా కనిపించేవి భుజాలు. మిగిలిన ఆకారమంతా చక్కటి సౌష్టవంతో రూపొందినా, ఆ భుజాలను మాత్రం ఉద్దేశ్యపూర్వకంగానే దృఢంగా మలిచినట్లు తోస్తుంది.

శ్రవణ బెళగొళలోని వింధ్యగిరిపై ఉన్న ఈ విగ్రహాన్ని క్రీ.శ. 981లో చాముండరాయుడు చెక్కించాడట. చాముండరాయుడు పశ్చిమగాంగుల రాజు మరసింహునికి (క్రీ.శ. 961-77) సైన్యాధిపతిగా, మంత్రిగా సేవ చేసినట్లు తెలుస్తుంది. అతని తల్లి కాలాదేవి కోరిక మేరకు, అతను శ్రవణ బెళగొళ వద్ద 57.8 అడుగుల ఎత్తైన ఈ గొమ్మఠ విగ్రహాన్ని నిర్మించాడు (గొమ్మఠ అన్నది బాహుబలికి మరో పేరు). దీనిని అరిష్టనేమి అనే శిల్పి చెక్కాడని, ఈ శిల్పి ప్రసిద్ధ శిల్పి జక్కనాచార్యుని శిష్యుడని చెబుతారు.


బాహుబలి గొమ్మటేశ్వరుడు

శ్రవణ బెళగొళ వైపు కారు మలుపు తిరిగిన వెంటనే దూరంనుంచి, ఎత్తైన కొండ మీద నిలబడిన గొమ్మటేశ్వరుడి విగ్రహం కనపడింది, భుజాలనుంచి పై వరకూ. మరో మలుపు తిరిగినప్పుడు ఆ కొండమీదకు మెట్లమార్గం ఉన్నట్లు గమనించాం. దాదాపు 700 మెట్లు.

అప్పటికి సమయం దాదాపు మూడున్నర. అంతవరకూ లంచ్ కోసం ఆగలేదు. ఇక్కడి చలి ఢిల్లీ చలితో పోల్చదగినది కాక పోగా, వేడిగానూ అనిపిస్తోంది. మా ప్రణాళికలో శ్రవణ బెళగొళ ఎలానూ లేదు కాబట్టి, ఆ మధ్యాహ్నపు ఎండలో అన్ని మెట్లు ఎక్కి బాహుబలిని దగ్గరనుంచి దర్శనం చేసుకోవాలన్న ఆలోచనను విరమించుకొని ముందుకు, హాసన వైపుకు సాగాం.


కర్ణాటకలో అడుగుపెట్టడం ఇది మొదటిసారి కాదు కానీ, బెంగుళూరు దాటి వెళ్ళిన సందర్భాలు లేవు. హాసన చిన్నపాటి పట్నమే అయినా, హాసన జిల్లా మాత్రం వైశాల్యం పరంగా ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ రీజియన్ (NCR) కన్నా పెద్దదే. కొండలూ మైదానాలూ కలగలిసిన ప్రాంతం. అటు గ్రామీణశైలీ ఇటు నగరశోభా సమ్మిళితమైన పట్నం హాసన కాగా, అటవీ ప్రాంతమూ వ్యవసాయ భూములూ కలగలిసిన ప్రదేశం హాసన జిల్లా.

ఆ సాయంత్రాన్ని హాసన పట్నంలో, మేము దిగిన హోటల్‌కు దగ్గర్లోని వీధులను సందర్శిస్తూ గడిపాం. చక్కగా, ముచ్చటగొలిపే బజార్లు. దాదాపు ప్రతి వీధిలోనూ ఒక ఆలయం. చాలా షాపుల్లో, అందమైన పూల మాలలు – ప్లాస్టిక్ పూలే అయినా, ఆకట్టుకున్నాయి. మరో యాభై అడుగులు ముందుకు వేసేసరికి ఒక మోస్తరు పెద్దదైన పళ్ళ మార్కెట్.

ఒక కూడలిలో, 2021లో హఠాత్తుగా వెళ్ళిపోయిన నటుడు, గాయకుడు, సినీ నిర్మాత పునీత్ రాజ్‌కుమార్ విగ్రహం కనపడింది. అక్కడే కాదు. ఆ తర్వాత అనేక చోట్ల ఆయన ఫోటోలు దండలతో సహా ఉన్నాయి. కన్నడ సినీరంగంలో ఆయనకు చాలా ప్రజాదరణ ఉందన్న విషయం తెలిసిందే. తన దానగుణంతో ఆయన ప్రజలకు బాగా చేరువ అయారు. అందుకు నిదర్శనం – ఆయన తండ్రి ‘కన్నడ కంఠీరవ’ డా. రాజ్‌కుమార్ స్థాపించిన కళ్ళ ఆస్పత్రిలో, గత ముప్ఫై ఏళ్ళ కాలంలో 76 వేల నేత్రదానాలు జరిగాయట. కానీ పునీత్ రాజ్‌కుమార్ మరణించినప్పుడు, ఆయన తన కళ్ళను కూడా దానం చేశారన్న వార్త తెలియగానే, తర్వాతి పది నెలల్లోపే దాదాపు లక్షమంది నేత్రదానాలు చేస్తామని ప్రతిజ్ఞ చేశారట!

ఉన్నట్టుండి శ్రీమతి కళ్ళు మెరిశాయి. ఒక బండి మీద – ఎన్నో ఏళ్ళ క్రితం ఎంతో ఇష్టంగా తిన్న తాటి ముంజలను చూసి! ఏడాదికో ఏడాదిన్నరకో – అదీ వేసవిరోజుల్లో ఆంధ్రా వెళ్ళినపుడు తప్ప, ఉత్తర భారతంలో గడచిన రెండుమూడు దశాబ్దాల్లోనూ తాటికాయలుగానీ ముంజలుగానీ కనపడే ప్రసక్తే లేదు. ఆత్రంగా కొనుక్కున్నాం. ముంజ కొరికిన వెంటనే చిన్నప్పుడు తిన్న వాటి రుచి ఊహలో మెదిలింది. అనుకోకుండా ముంజ మీది తొక్క నోట్లోకి చేరితే తెలిసే లేత వగరు చేదూ గుర్తొచ్చింది!

రాత్రి తొమ్మిదయేసరికి మేము చూస్తున్న హాసన వీధుల్లో జనసమ్మర్దం తగ్గింది.


ఆర్మీలో గడిపిన సంవత్సరాలు నాకు అనేక భాషలను పరిచయం చేశాయి. వాటిలో కన్నడం కూడా ఒకటి. తెలుగు లిపికీ కన్నడ లిపికీ చాలా దగ్గరి పోలికలున్నాయన్నది వేరే చెప్పనక్కర్లేదు. అయితే, ఎవరైనా కన్నడంలో మాట్లాడుతుంటే చాలా వరకూ అర్థమైనప్పటికీ తిరిగి కన్నడంలో జవాబివ్వడం మాత్రం కష్టమే!

ఆ రోజు హాసన‌లో ఆ ఇష్టమైన కష్టం అనుభవంలోకి వచ్చింది. షాపుల్లోనూ, హోటళ్ళలోనూ రాసి ఉన్న కన్నడ అక్షరాలు కొంతవరకు ఆకళింపు అవుతున్నాయి కానీ, అది పెద్దగా ఉపకరించని పరిజ్ఞానమే అయింది. ‘ఎక్కడ’ అనడానికి ‘ఎల్లి’ అనీ, ‘ఎంత’ అనడానికి ‘ఎష్టు’ అనాలనీ తెలుసు. ‘బేకు’ అంటే కావాలి అనీ, ‘సాకు’ అంటే ‘చాలు’ అనీ, ‘బేడ’ అంటే ‘వద్దు’ అనీ కూడా తెలుసు. ఆ నాలుగైదు మాటలూ ఆ హాసన వీధుల్లోనూ హోటళ్ళలోనూ పనికివచ్చాయి!

వేడి నీళ్ళు కావాలనీ, జాడించిన బట్టలు ఎక్కడ ఆరేయాలనీ మా హోటల్ సిబ్బందిని ఎలా అడగాలన్నది గూగులమ్మ నేర్పింది! పని సానుకూలమయింది. నేటి సాంకేతికతలోని ఒక ముఖ్యభాగం అలా మా సాయానికొచ్చింది.


హాసన‌నుంచి హళేబీడు దాదాపు 30 కిలోమీటర్ల దూరం.

పెందరాళే – ఉదయం ఆరున్నరకల్లా కారును హళేబీడు వైపుకు పరుగు తీయించాం. అక్కడక్కడా తారసపడుతున్న పల్లెల మధ్యనుంచి – పెద్దగా గతుకులు లేకుండా, పర్వాలేదనిపిస్తున్న రోడ్డు మీద ప్రయాణించి, ముప్పావుగంటలో హళేబీడు చేరాం.

ఏదీ?! చూడటానికి మేం ఉవ్విళ్ళూరుతున్న హోయసళేశ్వరుడి ఆలయం ఎక్కడా?

ఒక షాపు ముందు ఆగి వాకబు చేస్తే, మేం ఇందాక తిరిగిన మలుపులోకే వెనక్కి మళ్ళాలని చెప్పారు. కారును వెనక్కి తిప్పేం. అరఫర్లాంగు దూరంలో కుడివైపున కనపడింది – ఈ యాత్రకోసం ప్రణాళిక వేస్తున్నపుడు ఆప్షన్‌గా ఎదురైన ఒక వసతిగృహం. కర్ణాటక ప్రభుత్వపు పర్యాటక శాఖ వారి హోటల్ అది. ‘హోటల్ మయూర శాంతళ’. అందులో రూమ్ దొరకక పోవడంవల్లనే హాసన‌లో రూమ్ తీసుకోవలసి వచ్చింది.

ఎడమవైపున గేట్ లోపలికి తిరిగి, పదడుగులు వేసేక ప్రత్యక్షమైంది – ఇన్నేళ్ళుగానూ వూహల్లో తేలియాడిన హళేబీడు ‘హోయసళేశ్వరుడి’ ఆలయం.



హోయసళేశ్వరాలయం

ఒకప్పుడు, ఈ ఊరికి ద్వారసముద్రం అనే పేరు ఉండేది. హోయసళ రాజ్యానికి ఇది రాజధాని. 12 – 13 శతాబ్దుల మధ్యకాలంలో, ఈ రాజ్యాన్ని పరిపాలించిన విష్ణువర్ధనుడనే రాజు, ఈ ఆలయాన్ని నిర్మించాడని చరిత్ర చెప్తోంది. ఈ ఆలయ నిర్మాణం 1160 ప్రాంతంలో పూర్తి అయింది. ఆ తర్వాత ఢిల్లీ సుల్తాన్ అలావుద్దీన్ ఖిల్జీ కాలంలో, ‘మాలిక్ కాఫర్’ అనే శక్తివంతుడైన సేనాధిపతి దక్షిణ భారతదేశంలోని అనేక హిందూ రాజ్యాలపై దండయాత్రలు చేశాడు. దేవాలయాలను ధ్వంసం చేసి, చాలామందిని మతమార్పిడి చేయించాడు. కాకతీయ రాజు ప్రతాపరుద్రుడిని ఓడించి, కోహినూర్ వజ్రాన్ని ఢిల్లీకి తీసుకెళ్ళినవాడు ఇతడే అని చరిత్ర పుటల్లో నమోదైంది. అతడి దాడులకు గురైనప్పటికీ, ఈ ప్రాంతం ఇక్కడి వెలకట్టలేని శిల్ప సంపదను శిథిలాలుగా మిగుల్చుకోగలిగింది. అందుకే దీనికి హళేబీడు (శిథిల నగరం, పాత నివాసం) అనే పేరు స్థిరపడింది.

ఆలయం మీద అలంకారంలా సూర్యకాంతి నులివెచ్చగా కుడి వైపునుంచి ప్రసరిస్తూ బలం పుంజుకుంటోంది. పల్చటి చలిని పక్కకు చేర్చే ప్రయత్నం చేస్తోంది. విశాలమైన ఆ ఆలయం చుట్టూతా చక్కగా తీర్చిదిద్దిన లాన్లు. ఆ లాన్లలో చెట్లు. అక్కడక్కడా నిలిపిన పురాతన శిల్పాలు. ఎక్కడా రాలిన పండుటాకులుగానీ ప్లాస్టిక్ వ్యర్థపదార్థాలుగానీ లేవు.

అత్యంత ప్రతిభావంతులు ఈ హోయసళేశ్వరుని ఆలయాన్ని మలచిన శిల్పులు. ‘కేదారోజ’ ముఖ్య పర్యవేక్షణ నిర్వహించగా, బల్లిగావికి చెందిన ‘దాసోజ’, ‘మల్లితమ్మ’ తమ ప్రత్యేకమైన శైలిలో, అప్పట్లో విభిన్న మత సంప్రదాయాల మధ్యనున్న వైషమ్యాన్ని పక్కనపెట్టి, పూర్తి కళాస్వేచ్ఛతో ఈ ఆలయాలను నిర్మించారట.

శిల్పకళకు చాలా అనువైన సోప్ స్టోన్ అనే రకపు రాళ్ళను శిల్పాలుగా మలచి నిర్మించిన ఆలయం అది. ఆ రాయి భూమిలో ఉన్నంత కాలమూ మృదువుగా ఉంటుందని, బయటి వాతావరణంలోకి వచ్చిన తర్వాత, కాలం గడుస్తున్నకొద్దీ గట్టిపడుతూ వస్తుందని ఒక గైడ్ చెప్పాడు. అయిదారడుగుల ఎత్తున పేర్చిన విశాలమైన రాతి అరుగు మీదనున్న ఆలయ ముఖద్వారానికి చేరేందుకు దాదాపు యాభై అడుగుల పొడవైన బాట… బాటకు ఎడమవైపున ప్రసన్నంగా ఆశీర్వదిస్తున్న బొజ్జ గణపతి, కుడివైపున, ఒక వీరుడు సింహాన్ని దునుమాడుతున్న సన్నివేశాన్ని చూపుతున్న శిల్పం ఉన్నాయి. ఆ శిల్పం హోయసళ రాజచిహ్నమట.



ద్వారపాలకుడు

మెట్లు ఎక్కి ఆలయప్రాంగణంలోకి అడుగు పెట్టాం. ముఖద్వారానికి రెండు వైపులా ఉన్న ద్వారపాలకుల విగ్రహాలు అమితంగా ఆకట్టుకున్నాయి. వాటి పరిమాణం, భంగిమ, అతి సంక్లిష్టమైన పోగరపని సంభ్రమం గొల్పుతున్నంతలోనే, రెండు మోచేతుల వద్దా తెగ్గొట్టబడిన చిహ్నాలుగా ‘స్లాట్’ లు కనపడి, మనసు బరువెక్కింది. వాటిని చూస్తే, చేతులు కూడా ఉండి ఉంటే ఆ విగ్రహాల శోభ ఇంకెంత ఇనుమడించేదోకదా అన్న స్ఫురణ ఎవరికైనా కలుగుతుంది. లేని చేతులను ఊహించుకుని, సంపూర్ణ విగ్రహాన్ని మనసులో చూసుకున్నాను, అప్రయత్నంగానే! అయినా అంతటి మనోజ్ఞ కళాకృతిని వికృతం చెయ్యడానికి మనిషిలో ఎంత కాఠిన్యం కరుడుగట్టి ఉండాలో!

ఆలయనిర్మాణమంతా అతి సున్నితంగా అనిపించే శిల్పకళా చాతుర్యంతో జరిగింది. ఆ కళను స్థూలంగా వర్గీకరించాలంటే ఘంట, కలశం, పుష్పగుచ్ఛాలవంటి ఆకృతుల్లో చెక్కిన స్తంభాలు, నాట్యభంగిమల్లో ఉన్న మదనికలు, ఆలయమంటపాలు – ప్రధానంగా ఈ మూడు రకాల శిల్పాలు కనిపిస్తాయి.



నందీశ్వరుడు

ఇక్కడ ఉన్న రెండు ఆలయాల్లో హోయసళేశ్వరుడు, శాంతళేశ్వరుడు అనే పేర్లతో రెండు శివలింగాల దర్శనమవుతుంది. ఇవి రెండూ పురుష, స్త్రీ రూపాలకు ప్రాతినిధ్యం వహిస్తాయట. ఈ రెండు గర్భగృహాలకు ఎదురుగా రెండు నిలువెత్తు నందీశ్వర విగ్రహాలు కొలువుదీరి కనిపించాయి. ఆ నందుల శోభ మాటలకందనిది. నంది ఎప్పుడూ కూర్చుని ఉన్న భంగిమలోనే కనిపిస్తుంది. ఆ భంగిమలోనే ఉన్నా, ఈ నందులు ఒక్కొక్కటీ దాదాపు ఆరడుగుల ఎత్తున దర్శనమిచ్చాయి. వాటి ముఖాల్లో కాలాతీతంగా ఇమిడిన జీవకళ! మెడల్లో అయిదు వరసల గొలుసులు! వాటికి మధ్యన వేలాడుతున్న ఒక అందమైన గంట! ఇపుడో ఇంకాసేపట్లోనో ఆలయంలోని శివుడు బయటికి వస్తాడన్నట్లు, ఆయన రాగానే స్వామికార్యబద్ధమై, స్థిరచిత్తంతో లేచి నిలబడేందుకు సిద్ధంగా ఉన్నట్లు వాటి ముఖాలు భావాన్ని వ్యక్తం చేస్తున్నాయి!

రెండు ఆలయాలనూ కలుపుతూ ఒక మంటపం.


స్తంభశోభ

ఆ ఆలయాల్లోనూ, వాటిని కలిపే మంటపంలోనూ, నంది విగ్రహాలున్న మంటపాల్లోనూ దాదాపు 48 స్తంభాలున్నాయి. వాటిని స్తంభాలు అనడం కన్నా, స్తంభరూపంలో ఘనీభవించిన శోభ అనడం సరిపోతుందేమో. అవి మామూలు స్తంభాలా? వాటిలో ఏ ఒక్కటీ మరొకదానితో సరిపోలదు. పది పన్నెండు అడుగుల ఎత్తైన ఆ స్తంభాలు నిలువునా అంగుళమంగుళమూ, రింగులు ఒకదానిమీద మరొకటిగా పేర్చినట్లు, ఏదో ‘లేత్’ మిషన్ తో చెక్కినట్లు కనిపిస్తున్న గుండ్రని, నున్నని ఆకృతులు. వాటిలో కొన్ని వడ్డాణాలను తలపిస్తాయి. కొన్ని వడ్డాణాలమీద పూలవంటి ఆకృతులున్నాయి. కొన్ని రింగులు సూదిగా కనిపిస్తాయి. కొన్ని గాజుల్లా అనిపిస్తే, కొన్ని బెల్టుల్లా భ్రమగొల్పుతాయి. అసలు నేటికి తొమ్మిది వందల ఏళ్ళ క్రితం, లేత్ మిషన్లవంటి అధునాతన యంత్రాలేవీ కనుగొనని కాలంలో, ఇటువంటి స్తంభాలను చెక్కడానికి ఉపయోగించిన అప్పటి శిల్పుల హస్తకళా ప్రావీణ్యాన్ని ఏమని అంచనా వేయగలం?

బయటికి వచ్చాం.

అంటే ఆలయం లోపలినుంచి మాత్రమే. ఆశ్చర్యంలోంచి – సంభ్రమంలోంచి కాదు.

ఆలయం చుట్టూతా పరిక్రమపథం – ప్రదక్షిణ చేసే మార్గం ఉంది. ఒక్క అంగుళమైనా ఖాళీగా వదలకుండా, పరమ లయాత్మకమైన ఆకృతులతో నిండుగా అలంకరించిన శిల్పకళ ఆ ఆలయపు బయటి గోడలను సంపూర్ణంగా అలంకరించింది.


ఆలయ కుడ్యాల మీది శిల్పకళ

ఆ గోడలమీది శిల్పకళను స్థూలంగా మూడు భాగాలుగా విభజించి చూడవచ్చు. అన్నిటికన్నా క్రింద, ఒక్కొక్కటీ అయిదారు అంగుళాల వెడల్పుండే పట్టీలవంటి వరుసల అమరికతో కనిపించే ఫ్రీజెస్ (Friezes). ఆ వరుసల మీద, రామాయణ మహాభారత పౌరాణిక గాథలను చెప్తూన్న, అతి క్లిష్టమైన శిల్పాలు. ఆ శిల్పాల వరుసమీద ఆలయపు పైకప్పుకు ఆధారంగా నిలబెట్టిన గోపురాలవంటి నిర్మాణవిశేషాలు.

అన్నిటికన్నా క్రింది పట్టీలో ఆటలాడుకుంటూ ముందుకు అడుగులు వేస్తున్నట్లు చెక్కిన ఏనుగులు! స్తంభాలలానే, ఈ ఏనుగులు కూడా ఒకేలా ఉండవు. ఒకేలా ఉండేలా మలచటమూ విశేషమే! అయినా ఇక్కడ మాత్రం, ఇన్ని వందల ఏనుగుల్లో ప్రతి ఏనుగూ శిల్పానికీ ఎక్కడో ఒకచోట ఏదో ఒక చిన్న మార్పు ఉన్నది. రెండో వరుసలో సింహాలు. మూడవ, అయిదవ వరుసల్లో పల్చని నగిషీ. నాలుగో వరుసలో, వేర్వేరు భంగిమల్లో కనిపించే అశ్వారూఢులు. ఆరవ వరుసలో హైందవ పురాణాల ఇతివృత్తాలు. ఏడవ వరుసలో మొసళ్ళు. ఎనిమిదవ వరుసలో హంసలు, నెమళ్ళు. తొమ్మిదవ వరుసలో కార్మికులు. పదవ వరుసలో పౌరాణిక ప్రాణులు; ఉత్సవాల, వేడుకల దృశ్యాలు. పదకొండవ వరుసలో ధర్మార్థకామ – శృంగార రసాన్ని ప్రదర్శించే భంగిమలు…


ఏనుగుల వరుస

ఆ శివాలయపు కుడ్యాలను పూర్తిగా శోభాయమానం చేస్తున్న శిల్పాలలో వైష్ణవ పౌరాణిక గాథల్లోని అనేక దృశ్యాలు కనిపించి అబ్బురపరచాయి. దశావతారాలు, మధ్య మధ్య నాట్యభంగిమల్లో మదనికలు. ఆ మదనికల శరీర సౌష్టవాలు, ఆ శరీరాల మీద అమరిన ఆభరణాలు, అలనాటి శిల్పుల సౌందర్య దర్శనానికి ప్రతీకలుగా చరిత్రలో నిలిచిపోయాయి! ఆ ఆభరణాల వెనుక ఏదైనా కాగితమో, కలమో, చేతి వ్రేలో పెట్టడానికి సరిపోయేంత ఖాళీ! అంత సున్నితంగా ఆ రాళ్ళను ఎలా మలిచారు? ఎలా తీర్చిదిద్దారు? ఏమిటి వారి కళాసాధనా చాతుర్యం?!

క్షణం ఆగాను.

ఏ కళారూపమైనా, మొదటి ప్రయత్నంలోనే ప్రదర్శనకు అనువుగా రూపుదాల్చడం అరుదు అని నమ్ముతాను. ఉదాహరణకు, ఒక మదనిక శిల్పాన్ని మలచాలని ఆనాటి శిల్పకారుడు తలచాడే అనుకుందాం. ముందుగా ఆ మదనిక సౌందర్య విన్యాసాన్ని, ఆమె దాల్చిన భంగిమను, వస్త్రవిశేషాలను, ఆభరణాలను, వాటికి సంబంధించిన కొలతలను మనసులో ఊహించి, ఎక్కడో ఒకచోట ఆ వివరాలను పదిలం చేసుకోవాలి కద! ఆ తర్వాత సరైన రాతిని ఎంచుకోవాలి కద! ఎంచుకున్న రాయి, తాను మలచదలచిన విగ్రహపు రూపు ధరించేవరకూ ముందు మందంగా చెక్కుతూ తర్వాత సున్నితమైన చెక్కుళ్ళతో ఆకారాన్నివ్వాలి కద! ఎక్కడ వొంపు ఉండాలి, ఎక్కడ లోతు కనపడాలి, ఎక్కడ ఉబ్బెత్తుగా రావాలి – ఇలాంటివన్నీ శిల్పకారుడి ఊహలోంచి రాతిమీదకు ప్రసారం కావాలి కద! ఇవన్నీ ఒక ఎత్తైతే, ఆ ముఖాల్లో భావాల వ్యక్తీకరణను సాక్షాత్కరించేలా మలచడం మరో ఎత్తు కద!

ఇన్ని అంచెల్లో ఎక్కడో ఓ చోట, ఏ దశలోనైనా కాసింతగా సుత్తి ఒత్తిడో, ఉలి తాకిడో పెరగొచ్చు, తరగొచ్చు కద! అప్పుడు, అనుకున్నట్లుగా రాలేదు కాబట్టి మలుస్తున్న ఆ శిల్పాన్ని పక్కన పెట్టేయవలసిందేగా! మళ్ళీ మరొకసారి మరో రాతితో మొదలుపెట్టవలసిందేగా!!

ఆ ఆలయాల నిర్మాణం పూర్తి కావడానికి వందేళ్ళకు పైగా పట్టిందట. అంటే, తరం తర్వాత తరంగా దాదాపు మూడు తరాల శిల్పులు ఆ పాషాణాలకు ప్రాణం పోయడానికి తమ జీవితాలను ధారపోశారని ఊహించుకోవచ్చు. అంతటి కళాదృష్టిని, నిబద్ధతను వారిలో ప్రోది చేసింది ఏది? ప్రేరణ ఏమిటి? రాజభక్తా? దండన భీతా? దైవభక్తా? మరేదైనానా?

మనుషులకు ప్రకృతో దేవుడో అందించిన ఒక అదృష్టాన్ని, చేసిన ఒక అన్యాయాన్ని స్ఫురింపజేసింది ఆ ఆలయదృశ్యం. పదుల సంవత్సరాలు శ్రమించి, ప్రాచీనశిల్పులు రాతిలో మలచిన అతిలోక సౌందర్యాన్ని వీక్షించటానికి మనుషులకు కళ్ళు ఉండడం – ఆ అదృష్టం. ఆ కళ్ళు రెండు మాత్రమే ఉండడం – అన్యాయం.

(ఇంకా వుంది)


శ్రీనివాస్ బందా

రచయిత శ్రీనివాస్ బందా గురించి:

దిల్లీలో స్థిరపడిన విజయవాడ వాసి శ్రీనివాస్ బందా మాజీ సైనికుడు, కార్పొరేట్ ఉద్యోగి. సంగీత సాహిత్యాలంటే చిన్నప్పటినుంచీ మక్కువ ఎక్కువ. ఆ మక్కువే ఒకప్పుడు ఆకాశవాణికీ, దిల్లీ చేరేక నేపథ్య గాత్రధారణకూ పునాది అయింది. తన ఆర్మీ అనుభవాలను కథలుగా మలిస్తే, అవి ‘సోల్జర్ చెప్పిన కథలు’గా ‘ఈమాట’లో ధారావాహికంగా వెలువడ్డాయి. కాగితం మీదికి దిగే ప్రతి అక్షరానికీ ఒక సామాజిక బాధ్యత ఉంటుందని నమ్మే శ్రీనివాస్‌కు, ఆలోచింపజేసే ఏ రచన అన్నా ఇష్టమే.

 ...