హఠాత్తుగా అక్షరాలు మాయమైతే…

[ఆంధ్రప్రభ సచిత్రవారపత్రిక 1999వ సంవత్సరం జనవరి, ఫిబ్రవరి మాసాలలో వచ్చిన ఈ వ్యాసం ఈమాట పాఠకులకోసం పునర్ముద్రితం — సం.]

సుమారు పదిహేనేళ్ల క్రితం మాట. పీసీలు వచ్చిన కొత్త రోజుల్లో ఒక కంప్యూటర్ ఆట వచ్చింది. నిజం చెప్పాలంటే అది ఆట కాదు. ఏడిపించడానికి ఎవరో సరదాగా రాసిన ప్రోగ్రామ్. దాని పేరు ‘డ్రిప్’ దాన్ని కంప్యూటర్లోకి ఎక్కిస్తే కంప్యూటర్ స్క్రీన్ మీద మాటల్లోంచి అక్షరాలు, ఒక్కో అక్షరం ఒక్కోసారి, చూరునించి నీళ్లు జారివడ్డట్టు జారిపోతాయి. దానికి ఒక వరసా-వాయీ లేదు. ఎవరినన్నా కంగారు పెట్టాలంటే, వాళ్లకి తెలీకుండా వాళ్ల కంప్యూటర్లోకి ఈ ప్రోగ్రామ్ని ఎక్కించవచ్చు. ఇదేదో వైరస్ అనీ వాళ్లు గడబిడపడతారు.

అప్పుడనిపించింది నాకు. తెలుగు అక్షరాలు ఒక్కక్కటే మాయమవడం మొదలైతే ఏమవుతుందీ అని. ఒక ఊహాచిత్రం రాద్దామని అప్పటినించీ అనుకుంటూనే ఉన్నాను. కిందటి సంవత్సరంలో కాబోలు, రిచర్డ్ విల్బర్, “The disappearing Alphabet” అని పద్యాలు రాశాడు. “అరెరె! కనీసం పదేళ్ల క్రితం నేను రాసి వుండాల్సిందే” అని కొంచెం బాధపడ్డమాట నిజమే! అయినా ఏమాట కామాట ఒప్పుకోవాలి. అతను రాసిన పద్యాలు బాగున్నాయ్. నాకు చాలా నచ్చాయి. అందుచేత ఈ ఊహాచిత్రానికి ఊహ అతనిదే అని చెప్పడం నాకే గౌరవం. అయితే, దీనికి ఊపిరి మాత్రం అచ్చంగా నాది. ముంచుకొస్తున్న ఈ హైటెక్ సైబర్ కల్చర్, ఈ ఊహాచిత్రం కేవలం ఊహాచిత్రంగానే మిగులుతుందనీ, నిజంగా జరగదన్న ఆశతో.

తెలుగువాడి మొదటి అచ్చు ‘అ’. అచ్చుల్లో ‘అ’ కాస్తా మాయమైతే, అచ్చులుచ్చులవుతాయి. అత్తమ్మ- తమ్మయి, అమ్మమ్మ- మ్మమ్మయి. పిల్లా పెద్దా అంతా త్తత్తత్త మ్మమ్మమ్మంటూంటాం ఆజన్మాంతం. అసురులు సురులవుతారు. సురాసురుల మధ్య భేదం పోయి సాగరమథనం స్తంభిస్తుంది. దానితో, మోహిని వెనకాల మహేశ్వరుడు పరిగెత్తడు. మరి అప్పుడు అయ్యప్పస్వామి. సంగతేమిటి? అరుణపతాకం రుణపతాకం అవుతుంది. ‘హూ కేర్స్!’ కాని, అద్వైతం ద్వైతమై శంకరుడు మాయమౌతాడు. అది ఇబ్బంది!

‘ఆ’ కాస్తా జారుకుంటే: ఆవడలు వడలవుతాయి. పెరుగులేని ఉత్తిత్తి వడలు తిని మనం పెరగడమెలా? ‘ఆనందం అర్ణవమైతే’ పాటలో ‘ఆ’ పోతే పాట వెగటవుతుంది. ఆవకాయ ఘాటు చచ్చి గొంతులో వెలవెలపోతుంది. నసపెడుతుంది. ఆరుద్రగారి ఎర్రదనం వెలవెలపోతుంది.

‘ఇ’ లేకపోతే ఇళ వుండదు. ఇళ పురూరవుడికి తల్లీ తండ్రీ కూడానూ. ఋగ్వేదంలో చిక్కని చక్కని కథ కంచికెళుతుంది. కాళిదాసుగారి విక్రమోర్వశీయానికి నాందీవాక్యమే వుండదు. ఇబ్బంది ‘బ్బందీ’ అయితే ఫరవాలేదు కానీ, ‘ఇభం’ని ‘భం’ అంటే ‘నేనేం కుక్కనా?’ అని ఏనుగు ఘీంకరిస్తుంది. ఇరుగుపొరుగు పోతారు. ఇహంలో ‘ఇ’ క్షయిస్తే తెలుగువాడికి మిగిలేది బోలెడహం. ఇస్పేటులో ‘ఇ’ పోతే, మిగిలేది స్పేటు. అప్పుడు తెలుగులో పేకాడటం ఎలా?

‘ఈ’ కాస్తా మాయమయితే: నెమలి ఈకకు రంగులు ఈ కలల్లో రంగుల్లో తెలతెలబోతాయి. అప్రయోజకులంతా బరితెగిస్తారు. ఈబరిలో ‘ఈ’ కాస్తా క్షయిస్తే… ముఖ్యంగా, ‘ఈరేయి నన్నల్ల నేరవా రాజా’ అన్న పాట పాడడానికి వీలు లేక పొడవుతుంది. మా ఏలూరి వారు, నండూరి సుబ్బారావుగారు మనల్ని క్షమించరు.

‘ఉ’ పోతే, ఉద్భటుడంత వాడుత్తుత్తి భటుడవుతాడు. ఉపచారి పచారీ కొట్లో గుమస్తాగా చేరతాడు. మనకిక ఉగాదులూ ఉషస్సులూ ఉండవు. ఉపమానం, ఉత్ప్రేక్షలూ మాయమై, మొత్తం కవిత్వం సున్న అవుతుంది. ఉదారం దారంగా మిగులుతుంది.

‘ఊ’ లేకపోతే, ఊష్మం కాస్తా ‘ష్’ అంటూ గాలిపాలవుతుంది. ఊపిరి పిరికౌతుంది. ఊకొట్టడం వుండదు. మరి మన చిన్నపిల్లల కథలేమయ్యేట్టు? యశోదమ్మ చిన్ని కిష్టయ్యకి చెప్పిన రామాయణం కథ తెలీదూ? రామోనామబభూవ ‘హుం’ తదబరేసీతేతి ‘హుం’ …ఎంత చక్కటి పిల్లల కథ! అదికాస్తా శ్రీ గుటుక్కుమంటుంది.

‘ఋ’ జారుకుంటే వశిష్ఠమహాఋషిని ‘షి’ అనాలి. అప్పుడు మామూలుగానే మీకూ నాకూ ఎప్పుడూ కనబడని అరుంధతి, ఇప్పుడు వశిష్ఠుడికి కూడా కనపడకుండా పోతుంది. ఋష్యమూక పర్వతం పంపానదీ తీరాన్నించి పరారయితే వాల్మీకిగారి రామాయణానికి మొదట్లోనే అడ్డంకి. ఋతువులన్నీ నాగరీకం నేర్చి, వాతావరణక్రమం తారుమారు చేస్తాయి. భర్తృహరిని ‘భర్తహరి’ అంటే కోప్పడడు కాని, భృగుమహర్షిని ‘భగుమషర్షి’ అంటూ మటుకు శపించక మానడు.

‘ఎ’ మాయమయితే, ఎల్లలన్నీ మాయమవుతాయి. ఎల్లలు కాస్తా పోతే, మళ్లీ యూదులు, అరబ్బులూ, ఒకళ్లనొకళ్లు చావగొట్టుకోవడం మొదలెట్టరూ? ఎన్నికలు పోతే, మన వాళ్లకి ఓ పెద్దపండగ కాస్తా గుటుక్కుమంటుందే! మరదళ్లు ఎగతాళి చెయ్యడం లేకపోతే, ఇక తెలుగుతనం ఏదీ?

“ఎవ్వతెవీవు కాళ్లుమొగమెర్రన?”
“హంసను నేను”
“ఎందునుందువో?”
“దవ్వుల మానసంబున…”

అనే ఒక హంస సంవాదం, బకబక సంవాదంగా మారుతుంది!

‘ఏ’ అదృశ్యమైతే, ఏకాకులు కాకుల్లో కలిసిపోతారు. మనకున్న కాసిని ఏలపాటలూ మరుగున పడతాయి. ఏకాంతం మునిమాణిక్యంగారి కాంతంతో చేరి, మనకి విశ్రాంతినివ్వదు. ఏలూరును, ‘లూరు’ అని రాస్తే, కొల్లేరు పొంగుతుంది. ఇక మా ఏలూరు దాటి రైళ్లేవీ పోలేవు.

‘ఐ’ పోతే, మనకి అస్సలు ఐక్యతే లేదని సరిపెట్టుకోవచ్చు. కానీ, ఎప్పుడో చిన్నప్పుడు “నా అక్షరాలు ప్రజాశక్తుల వహించే విజయ ఐరావతాలు” అని తన కవిత్వం గురించి చెప్పుకున్నాడు తిలక్. అతని అక్షరాలు విజయ ఐరావతాలు అంటావా? అతను పట్టించుకోక పోయినా, ఇంద్రుడి ఏనుగు ఊరుకోదు. తిలక్ కవితలు ఉత్తుత్తి వెన్నెలో ఆడుకునే ఆడపిల్లలు’ మాత్రమేనని సరిపెట్టుకుంటే ఆధునిక కవిత ఎంత పేలవం అవుతుందో మీరే చెప్పండి! కుబేరుణ్ని ‘ఐలబిలుడు’ అంటారు. ఇప్పుడు వాడిని ‘లబిలుడు’అంటే వాడికి కోపం పెరిగి పలకడం మానేస్తాడు! పూర్తిగా అమెరికాలోనే వుండిపోతాడు.

‘ఓ’ మాయమైతే, ఒకటి కట్ అయి, అసలు అంకెలు మొదలవవు. ఒప్పులకుప్పలు, ఒయ్యారిభామలు వేరు వేరౌతారు. “ఒకచో నేలను పవ్వళించి, ఒకచో నొప్పారు పూసెజ్జపయి, ఒకచో శాకములారగించే కార్యసాధకులు” కంటికరుదవుతారు.

ఓ’ అనే అక్షరం అన్నింటికీ నాంది. ఓంకారంలో ‘ఓ’ కాస్త పోతే, కేవలం ‘కారం’ మాత్రం మిగులుతుంది. ఓ, ఓయి, ఓరి, ఓసి, ఇసిరికొట్టుకపోతాయి. ఓ కాస్త గుటుక్కుమంటే, కవిత్వంలో తిట్టడం ఎల్లాగ? అక్షరాభ్యాసం రోజున ఓనమాలు దిద్దించడు. అవి ఇసకలో నామాలు పెట్టుకుంటాయి.

ఔచితిలో ఔ కాస్తా పోతే, మిగిలేది చితి. ఔషధాలు మాయమౌతాయి. డాక్టర్లు లాటిన్లో ప్రిస్క్రిప్షన్లు రాయలేరు పాపం!

ఇక హల్లుల సంగతి సరేసరి. మరీవింత!

‘క’ జారిపోతే హాకీ హా’ మంటుంది. క్రికెట్ రిట్ అవుతుంది. మన హాకీ ఎప్పుడో ‘హా’ అన్నదిలే అని సరిపెట్టుకోవచ్చు కానీ, క్రికెట్ కూడా పోతే మన కాలేజీ పిల్లలందరూ మరీ లేజీగా తయారవరూ? కమలంలో ‘క’ పోతే *ఏమవుతుందో వేరే చెప్పాలా?

కమలములు నీట బాసి కమలాత్ముని రశ్మి సోకి కమలవు. రావణుని తల్లి కైకసి, కాదు, కైకేశి, అహ అదీకాదు, కౌకేళి అనే వివాదం నిష్ప్రయోజనం, ‘క’ పోతే. ఆవిణ్ని ఏమనాలి?

‘ఖ’జారుకుంటే ఖజానా జానా కదా! నానారకాల వాళ్లు ‘థ’ పోకండానే అంతా కాజేస్తున్నారని సరిపెట్టుకోవాలి. ఖగోళశాస్త్రం గుండ్రంగా పెద్దసున్న చుట్టేస్తుంది. శేఖరుడికి శేరుడు బియ్యం కూడా దొరకవు, ఎంత అడుక్కున్నా! పంచముఖుడు, ‘ఖ’ పోతే కులభ్రష్టుడవుతాడు. గోఖలేని ‘గోలే’ అంటే మరాఠీ వాళ్ళు మనల్ని మార్కాపురం దాకా తరుముతారు. ఏ పనీ ఖచ్చితంగా ఖరారుగా జరగదు. మన రాజకీయకవుల ఖండకావ్యాలు అండకావ్యాలవుతాయి, ఖ హరిస్తే.

గ’ కాస్తా పోతే, గంగిగోవుపాలు గంటెడైనా ‘గ’ రహితం అవుతుంది. ఏ ఆవూ ఒక్కచుక్క పాలయినా ఇవ్వదు. గంభీరులని భీరులంటే వాళ్లూరుకుంటారా? గమ్మత్తు మత్తవుతుంది. గోంగూరకు పులుపు చస్తుంది. ‘గ’ పోతే! గంగ ఎండిపోతుంది. ఇదంతా గంగపాలు అని దేనినీ అనలేం.

ఘనాపాఠీలో ‘ఘ’ మిస్సయితే, అంతా నా పాటివాళ్లే అవుతారు. ఘల్లుఘల్లుమని గంటలు మోగక అల్లులల్లుగా తయారయి, ఏ పాపకీ అందెలు మోగవు. “అఘోరించావులేవోయ్!” అని ఎవ్వడినీ అనలేం. ‘ఘ’ పోతే, మాఘమాసం కాలెండర్లోంచి మాయమై పెళ్లిళ్లన్నీ ఆగిపోతాయి.

‘ఙ’ పోతే, తెలుగువాడికి ఏ ఇబ్బందీ లేదు. సంస్కృతం మాట్లాడేవాళ్లకే కష్టం.

‘చ’ జారుకుంటే, రచయితని ‘రయిత’ అనాల్సి వస్తుంది. అది వాడికి నామర్దా. ఆ మాటకొస్తే రయితుతో వీణ్ని పోల్చడం రయితుకే అవమానం. చీనావాడు, నావాడు అవుతాడు. వాజపేయీజీకి గుండె గతుక్కుమంటుది. “చీకటి మిణుగురు జోతులు చిటిలి చిల్లులడక మునుపే”లో చకారం తీసేస్తే, పాట పాడుపాడు. అంతే కాదు, కంచెమీద గుమ్మడిపువ్వు పొంచిపొంచి చూడదు. మా ఏలూరి కొనకళ్ల వారి ‘బంగారిమామ’ గతేం కాను?

‘ఛ’ లేకపోతే, ఛందస్సు అదేమిటో తుస్సుమన్నట్టుంటుంది. స్వచ్ఛందసేవ, స్వంత సేవ అవుతుంది. రామం గచ్ఛంతి అనడానికి మారుగా “రామం గంతి” అంటే సంస్కృతం మాస్టారు రాజీనామా చేసేసి పోతారు. అచ్చా అని ఛాతీ మీద చేయివేసుకుని ఎవడూ ఏదీ చెప్పలేడు. పూలగుచ్ఛాలన్నీ ఎండిపోతాయి.

‘జ’ మాయమయితే, అజారుద్దీన్ ‘అరుద్దీన్’ అవుతాడు. అతని ఆట కుంటుతుంది. జమాఖర్చులు చెప్పకుండా మన నాయకులు అంతా మా ఖర్చులంతారు. ‘ప్రజ’లో ‘జ’ లేకపోతే ఇక మిగిలేవన్నీ ప్రశ్నలే! జయవిజయులు విష్ణుమూర్తి గుమ్మానికి కాపలా కాయడం మానేసాస్తారు.

‘ఝ’ లోపిస్తే ఝంకారం మానుకొని తుమ్మెదలుంకారం చేస్తాయి. నిర్రర్తరీ-నిరరజరీ అని వినిపిస్తుంది. జర్మన్ సిల్వరీ జరీ లాగా. ఝుంఝా మారుతాలు వీయడం మానుకుంటాయి.

‘ఞ’ కి సహజంగా నిలబడగల శక్తిలేదు. దీని మనుగడ అజ్ఞానంతోటీ, విజ్ఞానంతోటీని. ‘ఞ’ కాస్త గుటుక్కుమంటే విజ్ఞానం ఆరుకోట్ల ఆంధ్రులు మెచ్చిన అన్నగారి అగ్నానమై పోతుంది.

‘ట’ నిజంగా ఎంతో అందమయిన ధ్వని. ‘ట’ కాస్తా పోతే, కటకటా అని ఎవ్వడూ విచారం వెలిబుచ్చలేడు. నాటకం నాకం అంటే దేవతలు హర్షించరు. “టంటంట టంటం టటటంట టంటం” అని భోజుడు సమస్య ఇవ్వలేడు, మనం ఇంద్రవజ్రం అనే ఛందస్సులో ఈ అద్భుతమైన ఈ కాళిదాసు పూరణ వినలేము:

రాజాభిషేకే మదవిహ్వలా యా
హస్తాచ్చ్యుతో హేమ ఘటో యువత్యా
సోపాన మార్గేఘ కరోతి శబ్దం
టం టం ట టం టం ట ట టం ట టంటం
భావం: రాజుగారి స్నానానికి నీళ్ళు తెచ్చిన యువతి అతని సౌందర్యానికి సమ్మోహితయై చేతిలో ఉన్న బంగారు బిందెను జాఱ నిడిస్తే అది మెట్లమీదపడి టం టం టమ్మన్న శబ్దాన్ని చేసింది.

‘ట’ కాస్తా పోతే, ఆ పద్యంలోని అందమైన అమ్మాయి చేతిలో నాజూగ్గా కూచున్న బంగారుబిందె, చేతినుంచి జారినా చార్లీచాప్లిన్ సినిమాలోలాగా నిశ్శబ్దంగా, చడీచప్పుడు చెయ్యకుండా కిందికి దిగుతుంది. దీపావళి రోజున టపాకులు తుస్సుమని, పేలడం మానేస్తాయి. ఖంగుఖంగుమని మోగుతూ వుండే శ్రీశ్రీగారి గంటలు అలిగిమూగవోతాయి. ‘ట’తో ఆమ్రేడితాలు కోకొల్లలు. కటకట, కిటకిట, చిటపట, చ్చటచ్చట, మీటమిట, పటపట, లొటల్ట, ఈ ఆమ్రేడితాల ‘గతేంగాను ‘ట’ కాస్తా మాయమయితే?

‘ఠ’మాయమైతే శుంఠలు పోతారు, నిజమే! ఇబ్బంది ఏమిటంటే, అల వైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌధంబులేక, మహావిష్ణువు దేశాల పాలవుతాడు. ఏగుళ్ళోనూ శఠగోపం పెట్టరు. ముఠాలు, మఠాలు మూలబడతాయి. కానీ, మిఠాయికొట్లు కూడా పోతాయి కదా! పఠానీ వాడిని పనివాడని చూడు, డొక్కచీరేస్తాడు. కుంఠితనాదంతో కంఠాలు శోషించవు. ఉత్కంఠ వుండదు. అకుంఠిత దీక్ష అంతరిస్తుంది.

‘డ’ బదులుగా ‘ర’ రాయవచ్చని పండితులు అంటారు కానీ, పండితుని పంరితులంటే తప్పుపడతారు. డుమువులలో, మువులే మిగులుతాయి. ప్రతి పేరు చివర ‘డ’ చేరకపోతే, తెలుగుతనానికి మగతనం కాస్తా స్వాహా అంటుంది. చరిత్రపుస్తకంలో జనరల్ డయ్యర్‌ని జనరలయ్యర్ అని రాస్తే మన దక్షిణాది వాళ్లు కస్సుమంటారు. నండూరివారికి గుండె గొంతుకలో కొట్లాడటం మానుకుంటుంది. “కూకుండ నీదురా కూసింతసేపు” అని కూనిరాగం తీయలేరు. “సూడాలి నా యెంకి సోదెమాయేళ” అని అనలేక నాయుడు బావ గొంతు జాలిగా తేలిపోతుంది. ‘డ’ కాస్త మాయమయితే, పోతనగారు మహాలక్ష్మి బాధ ఏమని చెప్పగలరు? ఎలా చెప్పగలరు?

అడిగెదనని కడువడి జను
నడిగిన దను మగుడ నుడవడని యుడుగన్
వడివడి జిడిముడి తడబడ
నడుగిడునడుగిడదు జడిమ నడుగిడునెడలన్

‘రడయోర్ అభేదః’ అన్న సూత్రం ఈ పద్యం మీద ప్రయోగించి చదువు చూద్దాం!

‘అండజభీముడండ డడ డండడ డండడ డండడ డండ డండ’ అంటూ అధివాస్తవికులు ప్రవేశించరు! అడ్డాటలో ఆట మాత్రవేఁ మిగిలిపోతుంది. అడ్డు అనడం కుదరదుగా, అంచేత ఎవడూ ఏ షరతూ పెట్టలేడు.

‘ఢ’ జారుకుంటే, ఢంకాపలాసు ఆట దివాలా తీస్తుంది. ఢంకాలు బజాయింపవు. మహాశివుడు ఢమరుకం వాయించడం మరిచిపోతాడు. ఢిమడిమ అనడానికి బదులు ఫిరంగి మమ అని చప్పబడుతుంది. గాఢ-జపాలు గాజుపాలవుతాయి. మూఢునికి ముత్యంగా మూడుసార్లు చెప్పినా బోధపడదు.

‘ణ’ పోతే, దిగులుపడక్కరలేదు. అణాలు ఎప్పుడో పోయాయి కదా! అయితే కణకణనిస్వనాలు, ఎవరికీ సయించవు. ఘణఘణమని రణగొణ ధ్వనులు నశిస్తాయి. ఖణిఖణిమని నిప్పులు రగలవు. ‘ణ’ కాస్తా మాయమయితే, గుళ్లల్లో గంటలకి చెవుడొచ్చి ఝణఝణమని మోగవు. వైష్ణవమతం వైషవమతం అంటే రామానుజులవారు ఆగ్రహిస్తారు. అణుశాస్త్రం కాస్తా అశాస్త్రం అవుతుంది.

‘త’ జారిపోయిందనుకో, తాతలందరూ అదృశ్యం అయిపోతారు. పసితనంలోనే మనవలకి, మనవరాళ్లకీ మనోవ్యాధి వస్తుంది. భారతం భారం అయిపోయి పల్లెల్లో చదువురాని వాళ్లు కూడా వినడం మానేస్తారు. యయాతి యయా అవుతాడు. అమెరికావాడిలాగా ఔనని తలూపుతూ. వ్యాసమహర్షి దేవయాని కథ మార్చి రాసుకోవాలి. తామసి మసి అయి, తలారివాడు లారీవాడవుతాడు. తబలా కుడిలో తకిటతకిటలు కిటకిటలయి, నాట్యం ఇరకాటంలో పడుతుంది. తమలపు తీగలు కాళ్లకు తగిలి మొరాయించవు. బంగారిమామకి నోరుపండదు.

కథల నుంచి ‘థ’ తప్పుకుంటే మిగిలేది కల. మీరు రాసేదంతా కల అంటే, కలం పట్టగల వాళ్లందరికీ కోపం వస్తుంది. ఆఖ్యానమో, ఉపాఖ్యానమో, అని సంస్కృతం తెలిసినవాళ్లు ఒప్పుకున్నా, సిసలయిన తెలుగు కథలు తిరగ బడతాయి. కావాలంటే కాళీపట్నం మేస్టారినడుగు. అర్థంలో ‘థ’ పోతే, మిగిలే తెలుగుమాట అర. మరేమీ ఫరవాలేదనుకుంటే, అర్థాంతరన్యాసంలో, ‘థ’ గుటుక్కుమంటే, అది అవాంతరమే. శ్రీనాథ కవిని శ్రీనాకవి అంటే, నైషధం ప్రధమాశ్వాసంలోనే బెడిసికొడుతుంది. మంథరలో ‘థ’ మాయమయితే, రామాయణం బాలకాండతోటే ఆగిపోతుంది. మిథునం మినం అయి, దంపతులు గోలపెడతారు.

‘ద’ పోతే, ‘గదయెద’ తోడుతప్పి గయె! పదకవితలు కవితలు అంటే అవి పకపకనవ్వగలవు. కందపద్యంలోంచి ‘ద’ పోతే అంతా కంపం! ‘ద’ పోతే పాండవులకి చవగ్గా బడిపంతులు వచ్చేవాడా? భీష్ముడితో ద్రోణుడి ఇంటర్వ్యూ గుర్తులేదూ?

ఎందుండి వచ్చితిందుల,
కెందుండగ నీకు నిష్టమెరింగిపుము, స
ద్వందిత యని యడిగిన, సా-
నందుడు ద్రోణుండు భీష్మునకు నిట్లనియెన్.

అలాగే:

ఎందుండి యెందుఁ బోవుచు
నిందుల కేతెంచినార లిప్పుడు? విద్వ
ద్వందిత! నేఁడుగదా! మ
న్మందిరము పవిత్రమయ్యె, మాన్యుఁడ నైతిన్‌.

ఈ పద్యంగల్లంతయితే, పెద్దన గారిగతేం కాను? మనుచరిత్ర సంగతేం గాను? ప్రవరుడూ, సిద్ధుడూ కలవకపోతే, లేపనం లేదు. మాయాప్రవరుడు, వరూధినీల దాగుడుమూతల ప్రేమకలాపం గల్లంతు! మనువు కాస్త మనకి కాకండా పోతాడు. మనధర్మశాస్త్రం, కాదు కాదు, మనుధర్మశాస్త్రం మటుమాయమవుతుంది. ‘ద’ మిస్సయితే, గద్దర్ గీతాలు ‘గర్‌గర్’ మంటాయి!

‘ధ’ మాయమయితే, మా ఎదురింటి రాధని ‘రా’ అనాలి. లెంప పగలెయ్యగలదు. వెధవల వ్యథలేని కన్యాశుల్కం ఎందుకు? కాలబెట్టనా? అసలే అంతంత మాత్రం మన స్కూళ్లలో బోధన, అది కాస్తా బోనెక్కుతుంది, ‘ధ’ మరుగున పడితే. దశకంఠరావణుడు చదివిన శివతాండవం విన్నారా? ‘ధగద్ధగద్ధగజ్జ్వలల్లలాట పావకే’ బదులు, గదగదగదజ్జ్వలల్లలాట అంటే, శివతాండవం ముసలివాళ్ల బాత్రూమ్ కన్నా నీరసంగా తయారవుతుంది!

‘న’ కాస్తా జారిపోతే నేను అదృశ్యం. ‘నానాసూన వితాన వాసనలు’, ‘నా’ రహితమై ముక్కులు మూయిస్తాయి. ‘నానావని నాథ’ ‘వథ’గా మారతాడు. అందాకా ఎందుకు? ఆదికవి నన్నయగారు యడంగా మిగులుతారు. నవలలు ‘వలలై’ వలలుడు కూడా నవల రాయడానికి వల్ల కాకండాపోతాయి. మోనికాలో ‘న’ పోతే, ఆమె మోకాలిపై కూచోవచ్చుగానీ, మేనకని ‘మేక’ అంటే, దేవేంద్రుడు వెయ్యికళ్లెర్రజేస్తాడు. అనగా అనగా ఒకరాజు కథలన్నీ ‘అగాఅగా’ అని మొదలెడితే ఏ పాపా పడుకోదు.

‘ప’ కాస్తా పరారయితే, పదుగురాడుమాట పాడియై ధరచెల్లదు. అప్పిచ్చేవాడుండడు. నొప్పించక తిరిగేవాడూ వుండడు. మా టైలర్ పోతరాజుని ‘తరాజు’ అనాలి. అతని కొడుకు మనకి మట్టెలాగూలు కూడా కుట్టడు. పాపగారి గాలివాన చిన్నజల్లుగా కూడా బయటపడదు. అడపాతడపా ‘అడతడయి’, గడబిడకి కారణం అవుతుంది. పతితులు, భ్రష్టులూ పోదాంపోదాం పైపైకి అంటూ ముందుకిపోలేరు. పూలపై పుప్పొడి కరువై తేనెటీగలు ఆత్మహత్య చేసుకుంటాయి. ‘పదిమందిలో యెంకిపాట నే పాడంగ’ అని నాయుడు బావ ఉబ్బిపోలేడు. తాండ్రపాపయ్య ఉత్తుత్తి తాండ్రయ్య అవుతాడు, అంత వీరుడూనూ! పలనాటి వీరులు గర్జిస్తూ దూకుతారు, మనమీదకి! ప్రగతి గతించి తిరోగమిస్తుంది. పాట పద్యం మన సాహిత్యం నుంచి మాయమవుతయి. ”ప’ కాస్తా మాయమయితే! పకోడి ‘కోడి’ అవుతుంది. శాకాహారులిక నిరాహారదీక్ష చెయ్యాలి.

సీతాఫలంలో ‘ఫ’ పోతే, సీతాలం వందకన్నులెర్ర జేస్తుంది. కాఫీకి కరువొస్తుంది. కాపర్లు కార్లెక్కుతారు. ఫాలాక్షుడిని లాక్షుడని సంబోధిస్తే, మూడోకన్నుమూయడు. అంతా మసి మసి…. చిన్నపాపలకి ఫోటోలు, టాఫీలు వుండవు. పాట్ఫారంలూ, ఫిట్నెస్ సెంటర్లూ మూతపడతాయి. ఫిలాసఫీ అంతా ఉత్త ‘లాస’ గా మిగులుతుంది. ఫినిష్ చెద్దామని మొదలెట్టిన ఏపనీ సాఫీగా సాగదు. సఫలం కాదు, సలాం పెట్టినా సరే! పురాణశ్రవణాలకి ఫలశ్రుతులుండవు. ఫారిన్‌లో ఫాదర్‌ని, ఫారసీలో ఫకీరుని, ‘ఫ’ పోతే ఏమనాలి? .రెన్.దర్ అంటే, .కీర్ అంటే ఎవ్వడికీ బోధపడదు. మాఫియా మరీ మాయగా తయారవుతుంది. రఫీగొంతు బొంగురుపోతుంది. సూఫీమతం సమ్మతం కాదెవరికీ!

‘బ’ కాస్తా మాయమయితే, అంబ, అంబిక, అంబాలికలు పరారవుతారు. మహాభారతకథ ఆరంభించకముందే అడ్డంతిరుగుతుంది. కప్పల బెకబెకబెక లాడటటం మానేసి, కాకుల్లా కకక అంటాయి. బలిమహారాజు పాతాళంలోనే పాతుకుపోతాడు. చలిమంటలూ సంక్రాంతులూ సర్దుకుంటాయి. ముగ్గుల రథాలు మూలబడతాయి. అబల అనడానికి బదులు ఆవిడని ‘అల’ అనాలి. అలా అంటే ఫెమినిస్టు కవులు ఉప్పెనలా మనమీదికొచ్చి ముక్కుపిండేస్తారు. కాషాయ బాబాలు పోతారు. నయం, అని అనుకుంటే రమణగారి బుడుగు, బాపుగారి బొమ్మలు పోతాయి. That’s no good. పెదపాడులో కబాడీ ఆట ఆడటం మానేస్తారు. ఏ పనీ గబగబ ఏ ఒక్కడూ చెయ్యడే. ఉబుసుపోక రాసిన, రాసే గబ్బిగుబ్బల కవిత్వం హరిస్తుంది. శుభం! కానీ, మనకి అబ్బురపడేశక్తి కూడా నశిస్తుంది గదా!

ఆవులు ‘అంబా’ అనడం మానుకుని ‘ఆంఆం’ అంటూ ఎప్పుడూ నెమరు వేసుకుంటూ కూచుంటాయి. నువ్వెంత ఘటికుడివైనా, తనని ‘బాబూ’ అనకపోతే మన నాయకుడికి కోపం రాదూ? బ్యూరోక్రాట్లూ, అంతా యూరోక్రాట్లు అయి, స్విట్జర్లండులో డాలర్లు దాచేస్తారు. మన నాయకులతో షరీకయి! గూబలు దొరకవు పగలగొడదామన్నా!

ఎఱ్ఱనగారి ఈ పద్యం ఏమైపోతుంది?

అంబ! నవాంబుజోజ్వల కరాంబుజ!శారద చంద్రచంద్రికా
డంబర చారుమూర్తి! ప్రకటస్ఫుట భూషణ రత్నరోచిరా
చుంబిత దిగ్విభాగ! శ్రుతిసూక్త వివిక్త నిజప్రభావ! భాచేర
వాంబరవీథి విశ్రుతవిహారి! ననుం గృప జూడు భారతీ!

భాగవతంలో, భారతంలో ‘భ’ జారుకుంటే ‘గవతం,’ ‘రతం’ అయి. ఎవ్వడికీ బోధ పడవు. మీరు నమ్మరుగానీ, ‘భ’ పోతే అడవుల్లో భిల్లులు, భల్లలు, భల్లూకాలనీ ‘ల్లల్లల్లల్లూ’ కాలని పిలవాలి. నా ఉద్దేశ్యంలో అలా పిలవడం వాటికే మాత్రం ఇష్టం వుండదు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఢాం అంటుంది. కరిభిత్ గిరిభిత్ తురంగాలు కమనీయంగా వుండవు. ‘భ’ పోతే! వినుకొండ వల్లభరాయని క్రీడాభిరామం, మళ్లీ శ్రీనాథునికే అంటకడతారు. క్రీడారామం పేరుతో! అసలు టిట్టిభశెట్టి లేకపోతే వాడి రసికత గూర్చి వర్ణించే ‘పక్కలు వంచి వంచి, మునిపండ్లను రాచిరాచి…’ అన్న పద్యం గతేం కాను? ఘూకంకేకా, భేకంబాకా వినపడవు. సరళకవిత చప్పబడుతుంది. భరనభభరవ- ఉత్పలమాలలెవడూ కట్టడు. ‘భ’పోతే ఆవిడ భూపతిని చంపదు. ‘మగడు భూరిభుజంగము చేత చావడు…..’ ఆవిడ కుండలో పాలు నేలపాలు కావు, మరి ‘గొల్లభామ’ సినిమాగతి ఏంగాను? భజనసంఘాలన్నీ జనసంఘంలో చేరే ప్రమాదం వుంది. బహుపరాక్!

‘మ’ మరుగున పడితే, అమ్మని ‘అ’ అనాలి. ఆమె ఏమీ అనుకోదు గానీ, “అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల పెద్దమ్మ సురారులమ్మ…” ససేమిరా ఒప్పుకోదు. ఏ పని పాడయినా ‘రామరామ’ అని రోదించడు. మరో ప్రపంచం ‘రో ప్రపంచం’గా తయారయి, వెక్కివెక్కిపోతుంది. మొక్కజొన్న తోటలో ముసిరిన చీకట్లుండవు. ముద్దులమామతోటి, “ముసురేసిందంటే పైన అసలేమతిపోతది మామా” అని చెప్పడం సర్దుమణిగితే, కొనకళ్లవారి పాటలో ససి చెడుతుంది. మా ఏలూరి వాళ్లు ఊరుకోరు. మందారమకరంద మాధుర్యాలు కరవై భాగవతం ఎండిన బెండులా చప్పగా వుంటుంది. కామాల కాలువిరిగి, వచనాలు పరిగెడతాయి. మానస సరోవరం ఎండిపోయి, హంసలన్నీ బాతుల్లో కలుస్తాయి. “అమ్మా తమ్ముడు మన్ను తినేను” అని బలరాముడు యశోదకు పితూరీలు చెప్పడు. యశోదకి పద్నాలుగు భువనభాండాలూ కన్పడవు. చిన్నికృష్ణుని నోటిలో. అంతా మాయ, మిధ్య అనే మన ముద్దుల వేదాంతి పరారవుతాడు. శుభం!

కానీ, మమకారాలు కారాలూ మిరియాలూ నూరతాయి కదా! ఆరుద్రగారి కూనలమ్మపదాల్లో కవిత్వం ఏమౌతుంది? ‘మ’ తీసిపారేసి, కూనల పదాలని వాటిని ఖూనీ చేస్తే రాలక్ష్మీ ఆరుద్రగారు రాళ్లు రువ్వుతారు.

‘య’ పోతే యడాగమాల గతేం కాను? గేయకవితలని గేకవితలని అంటే అవి రాసేవాళ్లు కుళ్లికుళ్లి చస్తారు. శంకరభగవత్పాదుల మాయావివాదం, మా-వాదం అంటే, మీవాళ్లెవ్వరూ ఒప్పుకోరు. యాదవదేవుడు దవదేవుడై, ‘యదాయదాహిధర్మస్య’ అనడానికి బదులు, నత్తిగా ‘దాదాహి ధరస్య’ అనేస్తే, గీతలో నీతి కాస్తా చెట్టెక్కుతుంది. టెలిఫోన్లో యాయా అనడం పోతే, అవతల వాడు ఉన్నాడో పోయాడో ఎల్లా తెలుస్తుంది? యోయోలన్నీ చిక్కువడతాయి. అయ్యయ్యో అని కూడా జాలిపడలేం! ‘ఆయం పటాటోపః’ అన్న కథ కాస్తా ఫటాపట్ అవుతుంది.

‘ర’ చాలా మంచి అక్షరం. ‘ర’ పోతే, హరిహరులు హహలయి నవ్వులపాలే! పరశురాముని చేతిలో పరుశువు కాస్తా పశువు అవుతుంది. పరశురాముడంటే గుర్తుకొచ్చింది:

పరశురాముడొండె హరుకొండె నరుడొండె
గాక యొరులు గలరె కర్ణునోర్వ
బలిమి భీముడొండె బలదేవుడౌండె, గా-
కొరులు నరులు శల్యునోర్వగలరే?

అన్న పద్యంలో ‘ర’ క్షయిస్తే, పద్యం అంతా దొండుకు దొండుగా మిగులు తుంది. కరణాలు కణాలవుతారు. ఆడవాళ్ల ఆభరణాలూ వుండవు, అయినా, వాళ్లూ కారాలూ మిరియాలూ నూరలేరు! సరదాలు నశిస్తాయి. జరదాకిళ్లీలు దొరకవు. అరసున్న అసున్న అయి, విసర్గకి విసుగెత్తుతుంది. ‘ర’ పోతే చేరాతలన్నీ చేతలనే అపోహపడాల్సి వస్తుంది. ‘దూరాన నారాజు కేరాయుడౌనో, ఈ రోజు నారాతలే రాత పాలో’ అని ఎంకి పాడలేదు. అందుకని, ‘ర’ పోకండా పట్టుకోవాలి.

‘ల’ పోతే కలలు నశిస్తాయి. కలల్లేని బతుకు బతికేం ప్రయోజనం? మొదటి తరగతి పుస్తకంలో అల, వల, తల, పలకలు అవకతవకయి, ప్రతివాడి చదువూ మొదటి తరగతిలోనే ఆగిపోతుంది. కానీ, ఆలుమగళ్ళ యుద్ధం ఆ-మగాళ్ళ యుద్ధంగా మారిపోతుంది. కోలాటం కర్రలు ‘ల’ క్షీణించడంతో, చప్పుడు చెయ్యకుండా చంపుతాయి. ‘బాలరసాలసాల’ లకార హీనమయి, బారసాసా అవుతుంది. ‘వనైలావలీ అవవీలుంగలనంగ సంగతలతాని’ నుంచి ‘ల’ కాస్తా పోతే, చదవడమెట్లాగా? చిలకలు ‘చికచిక’ అంటాయి. మాట్టాడవు. చిల్లర చిల్లర పనులు చేయడానికి చిరచిరమంటారు. ఏలూరు ఏరయి వేలూరి వారి దారి వేరుదారి అవుతుంది.

‘వ’ పోతే, అవ్వని ‘అ’అని పిలవాలి. అర్థమే తారుమారు. అవకాశం ఆకాశం అంతెత్తు ఎదిగి ఎవ్వరికీ అందకండా పోతుంది. చివాలున కొమ్మలు వంగవు. తండ్రిమాట జవదాటని రాముడుండడు. తవుడు దొరక్క, దూడలు తడుముకుంటాయి. ‘వచ్చెడివాడు ఫల్గునుడవశ్యము గెల్తమనంగ రాదు. ‘లో ‘వ’ పోతే, ఇక కౌరవులు నెగ్గుతారు. భారతం తల్లకిందులవుతుంది. పాండవులు ‘పాండాలయి’ పూరీలో మకాం చేస్తారు, భంగు తాగుతూ! ఋతువులరాణి వసంతమాసం కాస్తా ‘సంత’ మాసం అయిపోతుంది.

‘శ’ కాస్తా మాయమవుతే, ‘శలవ్ లవ్’ అవుతుంది. భేష్ అనుకుంటే, కుశలమా అని అడగడానికి బదులు, జనం కులమడుగుతారు. అది లేనిపోని గొడవలకి దారితీస్తుంది. విశేషం విషం అవడం ఎవరికిష్టం? అస్సలు ఏదీ మొదలుకాదు. శ్రీకారం చుట్టడానికి వీల్లేదుగా? శ్రీశ్రీని ‘రీరీ’ అంటే ఆయన చిరునవ్వు నవ్వినా, ఆయన భక్తులు మనని చీరేస్తారు. విశ్వనాథని వినాథ అంటే, ఆయన అనుయాయులు మనమీద మరో రామాయణం మొదలెడతారు. పాతకాలపు దిగంబరుడు కేశవ్‌రావ్‌ను కేవ్‌రావ్ అంటే కొయ్యగుర్రాన్ని మనమీది కుసిగొల్పుతాడు. శరదృతువు రావడం మానేస్తుంది.

‘ష’ పోతే, ఉత్తరాది వాడికి ఢోకాలేదు. వాడికి శ, ష, స ల మధ్య బేధం తెలీదు. కానీ, ‘ష’ మాయమయితే చదరంగం ఆట చచ్చినా రక్తి కట్టదు — ‘షా!’ అనడం కుదరదుగా! భారతంలో భీష్ముడికీ, భీముడికీ తేడాపోయి నానారగడా అవుతుంది. అర్జునునికి ఎవరి మీద బాణం నెయ్యాలో తెలియక, శిఖండిని రథం మీద వదిలేసి, తికమకపడి, మళ్లీ అస్త్రసన్యాసం చేస్తాడు. అప్పుడు కృష్ణుడి గీత మళ్లీ చెప్పాల్సివస్తుందేమో. కిష్కింధ కికింద అయి వానరసైన్యం పరారవుతుంది. కోతులు లేని రామరావణ యుద్ధం, ఉప్పులేని ఉప్మాలా చప్పగా వుంటుంది. ‘ష’ పోతే కన్యాశుల్కంలో డైలాగుల చివరలు చిరిగిపోతాయి. ఎంత మంది ఎన్నిసార్లు మాసికలు వేసినా, అతుకులు పెట్టినా, మాటలు సరిగా అతకవు. కష్టాకష్టాలు చెప్పుకోలేక జనాలు కటకటాల పాలవుతారు.

‘స’ పోతే సంస్కృతం మరీ కృతకం అవుతుంది. సరిగమపదనిల్లో ‘స’ మాయమయితే, హంసధ్వని రాగం ‘హంధ్వని’గా మిగిలి, ‘వాతాపి గణపతిం భజే’ అందరూ అపశ్రుతుల్లో పాడతారు. త్యాగయ్య కీర్తనలు, అన్నమయ్య పదాలు, హెవ్వీ మెటల్లాగా గీపెట్టి రోతపుడతాయి. ‘సీతాసి తంతు సంతాన’ అనడానికి మారుగా నన్నయగారు ‘తాతంతు తాన’ అంటారు. ‘సుక్కలన్నీ కొండ మీద సోకు’ చేసుకోవడం మానేస్తాయి. ‘సిలక నా యెంకి సిగ్గొచ్చి’ నవ్వడం మానేస్తుంది. మసాలాలో పడక గసగసాలు గగ్గోలు పెడతాయి. అరసం విరసం కవులు అరవిరలు పడతారు, ఏం చెయ్యాలో తెలియక! రంతిదేవుడు ‘పుల్కసా’ అనలేక, పుల్కాలు తానే తింటాడు.

‘హ’ మాయమయితే, ఆహాహా అని ఆశ్చర్యపడలేరు. ఆశ్చర్యపడని వాడు బతికి ఏంప్రయోజనం? మనకున్న గొప్ప వ్యంగ్యనవల ‘హాహాహూహూ’ — అది కాస్తా మొత్తం అదృశ్యమవుతుంది. హేవిళంబి రాకండా ఒక్క ఉదుటున విళంబి వస్తుంది. అహం అంతం అవడం మంచిదే కానీ, దానితో సహనం, సహృదయత, కూడా సమసిపోతాయి. వారం వారం తారాబలం రాసేవాళ్లు ‘వాహనయోగం’ అని రాయడానికి బదులు వానయోగం అని రాయాలి. దానితో తెలుగునాట అతివృష్టిగా వానలు కురుస్తాయి. భారతయుద్ధంలో ద్రోణుడు మూడోరోజున పద్యవ్యూహం పన్నడం మరిచిపోతాడు. అభిమన్యుడి కథ మొదటికే తారుమారు! ‘సౌభద్రుని ప్రణయయాత్ర’ ఆరంభం కూడాకాదు, నాయనివారికి, ‘హరహరమహదేవ’ అనడం కుదరదు. ‘ఓం హిరణ్యవర్ణాం హరిణీం…” అనడం పడక శ్రీసూక్తం మొదటికే దెబ్బతింటుంది.

‘ళ’ హరిస్తే సంక్రాంతికి కళకళలాడే ముగ్గులు కన్పించవు. ‘కోకిలమ్మ పెళ్లి’ మరోసారి ఆగిపోతుంది. కలకత్తాలో కాళికామాత కూడా కాకామాతగా మారుతుంది. కళపెళ నీళ్లు కాగడం మానేస్తాయి, ‘ళ’ కాస్తా పోతే, కళింగులని కంగులని అంటే, ఓడ్రులు విజయవాడ దాకా మాదేనని పేచీ పెడతారు. కళావరు ముక్కలు కవలైపోతాయి. మూడేరకాల పేకముక్కలతో రమ్మీ ఆడటం ఎలా? తెలుగునాట క్లబ్బులన్నీ మూతపడవూ? అప్పుడు ఓడలు బండ్లెలా అవుతాయి. ‘ఝళఝళం’ అంటూ అందెలు మోగవు. కూచిపూడి పదశబ్దాలు మూగవోతాయి. పెళ్లాలు తాళిబొట్లు తాకట్టు పెడతారు. ఏ పాటకీ తాళం సరిగా పడదు.

‘క్ష’ మాయమయితే అక్షరరమ్యత సగంలో ఆగిపోతుంది. చక్షువులు చవులవుతాయి. మీనాక్షిని మీనా అంటే ముద్దుగానే వుంటుంది కానీ, కమలాక్షుడిని కమలాడని, కంజాక్షుడిని, కంజాడనీ అంటే విష్ణుభక్తులు ఊరుకోరు. రక్షణ సమసి రణ మారంభమవుతుంది. జడ్జీలు శిక్షలు వెయ్యరు. ‘లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం’ అనడానికి బదులు ‘మీం సముద్రరాజతనయాం’ అంటే గణాలు తప్పుతాయి. ఛాందసులొప్పుకోరు. లాక్షణికులని లాణికులంటే, ఆ ఛాందసులే కస్సుమంటారు, లాక్షణికులనమంటూ. ప్రపంచబాంకు ఇచ్చే లక్షలలక్షల కోట్ల అప్పు డాలర్లు అలా అలా తప్పుదారి బట్టి స్విట్జర్లాండ్ కెళతాయి. ఇండియాలో రిక్షాలు పోతున్నయని బ్రిటీషు రాయసగాడు నాస్టాల్జియాతో మంచమెక్కుతాడు. కాని, ఆ రిక్షాల వాళ్లే క్షయతో చస్తున్నారని ఎక్కడా రాయడు.

ఆ తాపీ ధర్మారావు గారి ధర్మమా అని, ‘ఱ’ అంటే అదే బండి-ర అంటే పరమవేళాకోళం. ‘ఱ’ కాస్తా మాయమయితే, సాంబారు జుఱ్ఱుజుఱ్ఱని జుఱ్ఱడం కుదరదు. మఱ్ఱిచెట్టుని పట్టుకోని, మచెట్టు అంటే ఊడలు కొట్టేసిన బోడి చెట్టవుతుంది. ‘ఱ’ పోతే పిల్లలమఱ్ఱివారూ, పైడిమఱ్ఱివారు ఏమనాలి? రైతులిక అఱకలు తోలరు. తెలుగువాడి పేటెంట్ ‘ఱ’ ఉచ్చరించడం. అందులోనూ ఆ ‘ఱ్ఱ’ ద్విత్వమైతే, మరీ మజా! మది,’ఱ’ పోతే, మనవాడి ఉచ్చారణ చప్పగా జారుకుంటుంది అది మనెకంత అవమానం! కుఱ్ఱకారు వెఱ్ఱి వేషాలు వెయ్యడం పోతుంది. నయం అనుకుంటే మరి బుఱ్ఱకథలు అడుగంటుతాయి కదా! అందాకా ఎందుకు? ఎఱ్ఱాప్రగడ ఏ ప్రగడవుతాడో అవుతాడు. దానితో తెలుగు మహా భారతం కాస్తా “శారదరాత్రుజ్వల లసత్తర తారకహార పంక్తుల…” తో ఆగిపోయి, అసంపూర్తిగా మిగిలిపోతుంది!

వెనకమాట: అక్షరాలు ఇలా మాయమవడం మొదలైతే, కొన్నికొన్ని మాటలు వెర్రివెర్రిగా వినిపిస్తాయి. అర్థం పర్థం లేకుండా మరికొన్ని మాటలు పూర్తిగా హరించిపోతాయి. కావాలంటే మీకు నచ్చిన మాటలు రాసిచూసి, వాటిల్లోంచి అక్షరాలు తీసివేసి చూడండి. సరదాగా! సరదాగా, అంతా ఎంత తారుమారవుతుందో!

మనం ప్రపంచాన్ని ఉద్దరిద్దామనుకున్నా, మన సంస్కృతిని పునరుద్ధరిద్దామనుకున్నా అదంతా మాటలమూటతోనే కదా సాధ్యమమయ్యేది! ఆ మాటలు కాస్తా హరీ అంటే, మన నాగరకతే నశించిపోదా?

అందుకని, మన అక్షరాలకి, మన తెలుగుమాటలకి, ఏ ఆపదా రాకండా కాపాడుకోవాలి. నిజం చెప్పాలంటే, మన జాతిపురోగమనం, మన జీవననాదం, మనం కట్టేపాట, మనం ఆడేమాట, మనం రాసే మాటల మీద ఆధారపడివుంటాయి. మరి ఆమాటకి చేటు రాకండా చూసుకోవాలి. గాంధీగారన్నారట– “మాతృభాషని మరిచిన వాడు మనిషి కాడేమోనని!’