నా చిన్నతనంలోనే లబ్దప్రతిష్టులైన గజ్జెల మల్లారెడ్డి గారిని దగ్గిరనుండి చూసే అవకాశం, ఆయనతో చనువుగా వుండే అదృష్టం కలుగడం నా సౌభాగ్యం. ప్రొద్దుటూరులో మా ఇంటి ప్రక్కన కాలనీలో నివసించిన ఆయన తరచుగా, దాదాపు పెందరాళే మా ఇంటికొచ్చే వారు. ఆయనేమో కమ్యూనిస్టు, మా నాన్నగారు కాంగ్రెస్కు చెందిన గాంధేయవాది. కాని అవన్నీ వారి సఖ్యతకు, స్నేహానికి ప్రతిబంధకాలు కాలేదు.
స్కూల్ విద్యార్థిగా ప్రొద్దుటూరు బహిరంగ సభల్లో ఆయన వాగ్ధాటి నెరిగిన నాకు ఆయన అప్పటికి కేవలం రాజకీయ నాయకుడిగా, వక్తగా మాత్రమే తెలుసు. పెరిగి పెద్దయి, ప్రొద్దుటూరు వీడిన తర్వాత క్రమక్రమంగా బహుముఖ ప్రజ్ఞాశాలైన ఆయన ప్రతిభాపాటవాలు మరింత తెలిసి అచ్చెరువొందాను. నేనెరిగిన మల్లారెడ్డి కంటే ఎరుగని మల్లారెడ్డి మరింత ఎత్తైన వ్యక్తి – వక్త, కవి, రచయిత, అనువాదకుడు, సంపాదకుడు, విమర్శకుడు, కమ్యూనిస్టు ఉద్యమనేత, అన్నింటినీ మించి మనసున్న మనిషి.
“పెద్దంకి రెడ్డి ఖూనీ జరిగిన” ఐదేండ్ల తరువాత బహుశా 1925 ప్రాంతంలో, ఒక సామాన్య గ్రామంలో, ఓ మధ్య తరగతి రైతు కుటుంబంలో గజ్జెల సోమిరెడ్డి, నాగమ్మ దంపతులకు ‘యేదోడు’గా (రోగిష్టి) జన్మించాడు మల్లారెడ్డి. జీతగాడు మాదిగ అంకడిని ‘అంకన్నా’ అని పిలిచేంత సంస్కారం చిన్నప్పుడే పుణికి పుచ్చుకున్నాడు. తన బాల్యంలోనే తల్లితండ్రులు చనిపోతే మేనమామల ప్రాపకంలో దాదాపు అనాథగానే పెరిగాడు. విద్య వీధిబడి గడప దాటకపోయినా, బర్రెగొడ్లను మేపడం తప్పకపోయినా, బి. పి. చిన నరసరాజు అనే ప్రైవేట్ టీచర్ పుణ్యమా అని పద్నాలుగేళ్ళకే “శ్రీ రమణీ మణీ విమల… మము బ్రోచు గావుతన్” అనే ఉత్పలమాలను ఊదేశాడు. కానీ తొలి తొలుత “ఆంధ్రప్రభ” దినపత్రిక చూసినప్పుడు ఎలా చదవాలో ఆయనకు తెలియలేదట!
పుట్టుకతో ఆయన పులివెందుల దగ్గరి అంకాలమ్మ-గూడూరు వాసి అయినా, ఆయన వాసి కాశీ వరకు ప్రాకింది. హిందీ విశ్వవిద్యాలయంలో చదువుకోమన్న ప్రోత్సాహం బాల్య మిత్రుడు వెంకటరెడ్డిది; ఉత్తరోత్తరా ఉపయోగపడింది తరిమెల నాగిరెడ్డి ఇచ్చిన సిఫార్సు ఉత్తరం. అక్కడ హేమాహేమీలతో భుజాలు రాసుకున్నాడు. ప్రపంచ పరిజ్ఞానం పెంచుకున్నాడు. 1943లో కమ్యూనిస్టు సభ్యుడై పరిణతి తో రాష్ట్రానికి తిరిగి వచ్చినప్పుడు పుచ్చలపల్లి సుందరయ్య, చండ్ర రాజేశ్వరరావు, బసవ పున్నయ్య ఇత్యాదులు సంపాదక వర్గం గా వుండిన “ప్రజా శక్తి” లోని వ్యాసాలు ఆయనపైన, ఆ తరువాతి రోజుల్లో ఆయన కాలమ్ ‘పుణ్యభూమి’ పైన చాలా ప్రభావాన్నే చూపాయని ఆయనే వ్రాసుకున్నారు. పులివెందుల తాలూకాలో కమ్యూనిస్టు పార్టీ ప్రచారం, చేనేత కార్మికులను సంఘటిత పరచడం, ‘ఒక కాలు ఇంట్లో మరో కాలు జైల్లో’ వున్నా’ అమ్మాయి వాళ్ళకేమీ అభ్యంతరం లేకపోవడంతో నచ్చిన ‘సావిత్రి’ని తాడిపత్రి చింతలరాయుని దేవాలయంలో పెళ్ళి చేసుకోవడం -తరువాతి ముఖ్య ఘటనలు. 1946లో పెద్ద పసుపులలో జరిగిన జిల్లా రైతు మహాసభలో ప్రధాన వక్త కామ్రేడ్ పిల్లలమర్రి వెంకటేశ్వర్లు రాకపోవడంతో, అనుకోకుండా పదివేలకు పైగా వున్న కార్యకర్తల ఎదుట,మైక్ లో రైతు సమస్యల గురించి సుమారు గంటన్నర సేపు అనర్గళంగా మాట్లాడ్డం ఆయన్ను తిరుగులేని వక్తగా నిలబెట్టింది. ప్రొద్దుటూరు బహిరంగ సభల్లో అనేక సార్లు ఆయన పలు పసందైన ఉపన్యాసాలు వినడానికి చెవులు కోసుకున్నదీ, మిగతా శ్రోతలతో పాటు చప్పట్లు కొట్టిందీ – నాకు బాగా జ్ఞాపకం. ఆయన “మాటల కఛేరి” అక్కడితోనే ప్రారంభమయ్యిందని నా నమ్మకం. కానీ ఇవేవీ ఆయన్ను 1955 ప్రాంతంలో ఎన్నికల్లో ఓడిపోకుండా కాపాడలేక పోయాయి. ఇల్లాలి నగలమ్మి, పొలం కొని వ్యవసాయంలోకి దిగి, చొప్ప మోపు స్వయానా మోయాల్సిన దుస్థితి.ఆస్తులంతకు ముందే పార్టీ పరం చేసిన ఆయనకు జరిగిన ఒకే ఒక మంచి ఈ మల్లునికి మరో రాచమల్లుడు, సాహితీవేత్త రా.రా. (రాచమల్లు రామచంద్రారెడ్డి) మరింత సన్నిహితుడు కావడం. అందువల్ల తరువాతి రోజుల్లో ఆయన “సవ్యసాచి” పత్రికలో ‘సమదర్శి’ అనే సుదీర్ఘ రాజకీయ సమీక్ష వ్రాయడం. అటుపిమ్మట, ఎన్నడో ఆరంభ దశలోనే వదిలేసిన కవితాధార అకస్మాత్తుగా “ఇంటర్వ్యూహం” గా వెలికి ఎగజిమ్మింది. పుట్టపర్తి గారి ప్రోత్సాహమూ లభించింది. “ఆ కవితా స్రవంతిలో మహోత్తుంగ తరంగం…మలికవిత ‘భక్తిరసం’.
“తెలుగునాట భక్తి రసం
తెప్పలుగా పారుతోంది
డ్రైనేజీ స్కీములేక
డేంజరుగా మారుతోంది”
లాంటి వాక్యాల్లో అతినిశిత వ్యంగ్య ధోరణివల్ల ఈ గేయానికి రాష్ట్రవ్యాప్తంగా ప్రశంసలు లభించాయి. ఈ వాక్యాలు నేటికీ అన్వయిస్తాయి. ఈ గేయంలో నాకు నచ్చిన మరో పదబంధం ‘మగవిధవలు’.
ప్రఖ్యాత అభ్యుదయ కథా రచయిత కొడవగంటి కుటుంబరావు మెచ్చుకుంటూ ‘ఇంతకు శ్రీశ్రీ మారు పేరుతో ఎందుకు రాసినట్లు?’ అని రా.రా. ను ప్రశ్నించాడట.
అనతికాలంలోనే ఆయనకు కవిగా మంచి గుర్తింపు రావడం విశేషం. చీనీ తోటలో పాదులు తవ్వేటప్పుడు, కమ్యూనిస్టు కమిటీ సమావేశాల విరామాల్లో కూడా మధ్యమధ్యలో ఆయన కవిత్వం వెల్లువై పారింది. అతిత్వరలో సంపుటిగా మారింది. మల్లారెడ్డి పట్టుపట్టడం వల్ల ఆ సంపుటికి ‘పరిచయం’ రాసిన రా.రా మల్లారెడ్డి ది “గొప్ప కవిత్వం కాకపోవచ్చు; కానీ క్రొత్త కవిత్వం” అన్నాడు. మల్లారెడ్డిని పొగిడితే ఆత్మస్తుతవుతుందేమోనని సంకోచించాడు. కాని కొడవగంటి “గొప్ప కవిత్వం ఇంకెలా గుంటుంది?” అని ఆయనతో విభేదించాడు. శ్రీశ్రీ తను “పాతికేళ్లలో…కూడబెట్టుకున్న కీర్తి…తస్కరించా”వని కేసు పెడుతున్నానని నిందా స్తుతి చేశాడు. “మళ్ళీ అభ్యుదయ కవిత్వాన్ని ఆకాశానికెత్తాడన్నారు”.
అభ్యుదయ రచయితల సంఘం (అరసం) నిర్మాణంలో:
“తొడగొట్టి బరిలోన దూకరా కార్మికా
నిఖిల పీడిత జాతి నీవెంట ఉంటుంది
…
లావా ప్రవాహాన్ని లాఠీలు ఆపునా?
…
తెంపుగల్ల మొనగాడా తిప్పు మడమ నీ ఎడమకు”
లాంటి పలు గేయాలను వ్రాసినా, ఆశించిన ఫలితం దక్కలేదంటారు ఈ ప్రజాకవి.
అభ్యుదయ కవులు ప్రేమ కవిత్వం వ్రాయకూడదన్న నిబంధన ఎక్కడా లేదు. ఆ రకంగా మల్లారెడ్డి సవ్యసాచే. కావాలంటే ఆయన ‘కష్టపడి’ చేసిన మఖ్దూం కవితా ‘ఇంతిజార్’ స్వేచ్ఛానువాదం చూడండి:
మూలం:
“రాత్ భర్ దీద్ ఏనమ్ నాక్ మే లహరాతే రహే
సాంస్ కీ తరహ్ ఆప్ ఆతేరహే జాతే రహే”అనువాదం:
“తడి కన్నుల రేయెల్ల
తొలకాడు చున్నావు
వలపుటూర్పుల వోలె
వచ్చి పోతున్నావు…”
వలపుటూర్పులు తప్పక ఆయన నగిషీ యే!
ఇక భారత్-పాక్ సరిహద్దుల జరిగిన రక్తపాతాన్ని చిత్రిస్తూ ఆలీ సర్దార్ జాఫ్రీ వ్రాసిన ఉర్దూ కవిత ‘సుబహ్ ఏ పర్దా’ కు ఆయన అనుసృజన:
మూలం:
“కల్ ఇసీ సర్ హద్ పే
సూరజ్ డూబ్ గయే హోకే దో టుక్ డా
కల్ ఇస్ సర్ హద్ పే జఖ్మీ హుయీ థీ
సుబహే ఆజాదీ”
అనువాదం:
“అస్తమించెను మొన్న ఈ సరి
హద్దుపై రవి చీలి రెండుగ
నిన్ననిటు స్వేచ్ఛా ప్రభాతం
నెత్రు వరదల్లోన మునిగెను”
అడిగి ఈ కవిత వినిపించుకున్న ప్రముఖ కవి బాలగంగాధర తిలక్ స్వతంత్ర రచనలాగే వుందంటే, జాఫ్రీ స్వయంగా ‘ఇది మూలం కన్నా బాగుందే!’ అన్నారట.
మరోమారు తనకు కుదర్లేదని, వీలైతే తెలుగుకు అనువాదం చేయమని నార్ల చిరంజీవి గారు సాహిర్ లూధియాన్వీ రాసిన సుదీర్ఘ కవిత “పర్ ఛాయియా” – రణమారణ హోమంలో బలియైన భగ్న ప్రేమ-ను ఇస్తే రసభంగం కాకుండా మల్లారెడ్డి మలిచిన తీరు చూడండి:
“పడుచు రాతిరి పేరురమ్మున
పాల వెన్నెల జిలుగు పయ్యెద
కదలుచున్నది స్వప్న సీమల
మెదలు సుందర దృశ్య మట్టుల”
…
పదండి నేడే క్షతాత్ములంతా
ప్రతి గాయమ్మొక ప్రజా వాక్కుగా
…
ఇంకో యుద్ధం రానేవస్తే
నీడలు కూడా నశించుతాయని
నినదిద్దాం పద పదండి పోదాం “
ఈ విధంగా ఉర్దూ/హిందీ ప్రణయ భావార్ద్ర కవితలను అనువదించడం వల్ల, స్వతంత్రంగా తెలుగులో అభ్యుదయ కవులకులేని అవకాశాన్ని పూరించుకోవడమే కాదు, ఈ కవిమల్లుడు తన కడప కత్తికి రెండువైపులా పదునేనని తన కలాన్ని కదను తొక్కించారు. రేడియో మాస్కోలో:
“సోవియట్ల దేశమా
సమతా సందేశమా
ఆంధ్రజాతి విప్లవాభి
వందనాలు అందుకో”
అంటూ గళమెత్తి చదివాడు.
అంతేకాదు ప్రొద్దుటూరు రాజన్న కవి ఇచ్ఛ మేరకు కొన్ని పద్యాలు కూడా వ్రాశాడు.
“కళ్ళకు సిద్ధాంతాల గంతలు…అసంగతం”…
“ఏమైనా కవులూ, రచయితలూ ఏదో ఒక వాదానికి బందీ కానప్పుడే సాహితీ ఆకాశంలో స్వేచ్ఛగా విహరించగలరన్న సంగతి” తను చాలా ఆలస్యంగా అర్థం చేసుకున్నానని తన ఆత్మకథ “మనస్సాక్షి”లో చెప్పుకొస్తారు మల్లారెడ్డి. అందుకే రోత పుట్టించే వ్యక్తి పూజా విధానం అనుసరించిన మావోయిజం ను ఈసడిస్తూ ‘ఋక్కులు’ వ్రాశానంటారు. ఆ రకంగా కమ్యూనిస్టు పార్టీ కి చెందిన అన్ని వర్గాలతో ఏదో ఒక సందర్భంలో ఆయనకు తగవు తప్పేది కాదు.
అంతేకాదు కవిత్వం లోని వివిధ ధోరణుల పై ఆయన విమర్శ తన ‘కవితా విపణి’ లో ప్రస్ఫుటిస్తుంది.
“కవితాసతి…గడసానై…ఆడిన దొమ్మరి ఆటలు” అంటూ శ్రీశ్రీ లిమరిక్కులను, “ఇంటింటికి ముఖ్యంగా / వంటింటికి పనికి వచ్చు” అంటూ ఆరుద్ర “ఇంటింటి పద్యాల”ను విమర్శించడానికి ఆయన వెనుదీయలేదు.
“సెక్సు మీద సిగ్గు మీద సెన్సు మీద మనిషి మీద
ధిక్కారం ప్రకటించిన దిసమొల వీరావేశం”
అంటూ దిగంబరులను నిలదీశాడాయన. “వందేమాతరం” పట్ల వక్రబాష్యం చేసిన విప్లవ కవి చెరబండరాజు ను ఈసడించుకున్నారు.
సినారె తో కూడా బాహాటంగా విభేదించిన సిరా ఆయనది. చేరాతో చెడుగుడులూ సరేసరి.
“దిగిరమ్ము దిగిరమ్ము
దివి వీడి భువిపైకి”
అని భావకవులను వాస్తవ జగతికి తెచ్చే ప్రయత్నం కూడా చేశారు.
“నీకు మంచి ఎక్కడా కనబడదా?” అన్న తన విమర్శకుల ప్రశ్నకు సమాధానంగా త్యాగరాజ గాన సభలో ఆయన ” చెప్పే నీతులను చేతల్లో చూపుతున్న నేత ఎవరో చెప్పండి” అని సూటిగా ప్రశ్నిస్తూ, అలాంటి వారికి “క్షోణితలంబు నెన్నుదురు సోకగ మ్రొక్కెద” అని బాహాటంగా ప్రకటించారు.
కానీ అంతకు ముందే, మూడు దశాబ్దాల క్రిందటే ఆయన తన ఓ కవితలో:
“గొప్ప వాళ్ళ మాటల్లో
తప్పులెన్ను దుర్ వ్యసనం
పుట్టుకతో వచ్చె నీకు
పోతుందా మాటలతో!”
అని ఆత్మ బోధ చేసుకుంటే, తన సంధ్యా సమయంలో “ధమ్మపదం” అనువదిస్తూ, ఆ భావనను — మూలానికే మెరుగులు దిద్ది —
“పరుష వాక్కుల పరుల రాపాడవద్దు
తిట్టు కింకొక్క తిట్టు తోబుట్టువగును
దూషణల వల్ల కలుగు సంతోషమేమి
దెబ్బలాడిన తప్పదు దెబ్బ నీకు”
అని ఆత్మవిమర్శే చేసుకున్నాడు.
“నిప్పులాంటి నిజం చెప్పాలంటే నా జీవితంలో ఎవరితోను నాకు వ్యక్తిగతమైన తగవుల్లేవు” అని తన ఆత్మకథ “మనస్సాక్షి ” లో వ్రాసుకున్నారాయన. అక్షరాలా నిజమే! అందుకే తన ఆత్మకథకు తావిమర్శించిన, తనను తెగడిన శ్రీశ్రీ కవితతోనే శ్రీకారం చుట్టాడాయన.
చాలామందికి తెలియని విషయం ఏమిటంటే నటుడు నాగభూషణం కోరిక మేరకు ఆయన “ప్రజానాయకుడు” సినిమాకు గాను:
“మేడే పండుగ వచ్చిందీ ఎర్రని జెండా ఎగిరిందీ
కార్మికులంతా ఏకం కమ్మని కదన శంఖమూ ఊదింది”
అన్న పాట రాసిన వృత్తాంతం. కానీ చిత్రంలో ఆ పాటకు బదులు ఆత్రేయ వ్రాసిన “పండుగొచ్చిందీ ఓలమ్మీ పండుగొచ్చిందీ” అన్న పాట వాడుకోవడం ఒకింత వింతే! ఎంతైనా అది చిత్ర జగత్తే!
రాంభట్ల కృష్ణమూర్తి ప్రమేయం వల్ల 1972లోనే రామోజీరావు తో పరిచయమైనా 1976లో ‘ఈనాడు’ హైదరాబాద్ ఎడిషన్ కు యువకవులకై ఓ కాలం వ్రాయమని మల్లారెడ్డిని ఆయన ఆహ్వానించడం, కమ్యూనిస్టు పార్టీలోని కొందరు ముఖ్యులు మొదట పూర్తిస్థాయి నిర్వాహకులు సైతం పాక్షిక ఆదాయం వచ్చే మార్గం చూసుకోవచ్చని చెప్పినా, తదుపరి ఆయనను ‘ఈనాడు’ ఆఫీసు కు వెళ్ళవద్దనడం, ఆయన పార్టీ కి రాజీనామా ఇచ్చేలా చేసాయ్. ఆస్తులతో సహా అర్పించిన నలభై యేళ్ళ ఆయన అంకితభావం, బాంధవ్యం అలా పంకిలంగా అంతమయ్యింది.
‘కొత్తపాళీ’ పాత పార్టీకి చరమగీతం పాడింది.
ఆ రోజుల్లోనే ‘ఈనాడు’ లో సిబ్బంది సమ్మెవల్ల సంక్షోభంతో ఎడిటోరియల్ బ్యూరో నుండి ముగ్గురు నిష్క్రమించితే, మొదట సంపాదకీయం మినహా ఇతర రచనలకు మల్లారెడ్డి అంగీకరించారు. కలం పేర్లతో ప్రారంభమైన కాలంలు క్రమేణా ఆయన పేరుతోనే వెలువడ్డాయి. చివరికి సంపాదకీయం కూడా ఆయనకే దక్కింది. ‘పాత వాసన’ కమ్యూనిస్టు పదజాలం దొర్లకుండా వ్యంగాన్నీ, అధిక్షేపాన్ని మేళవించి కవితాత్మకంగా సాగేది ఆయన శైలి. కాని రామోజీరావు తో కలిసి పనిచేయడం ఆయన్ను చాలామందికి, ముఖ్యంగా ఆయన కమ్యూనిస్టు మిత్రులందరికీ దూరం చేసింది…ఎంత దూరమంటే 1978లో ఆయనకు గుండెపోటొస్తే కనీసం వారెవరూ వచ్చి పరామర్శించనంత దూరం.
‘ఈనాడు’లో ఆయనకు ఎనలేని యశస్సు లభించినా తీరని ఆర్తి, ఆర్థిక సమస్య. అంచేత అంతకన్నా ఎక్కువ ఆర్థిక ప్రయోజనం సమకూరే ప్రతిపాదనను అంగీకరించి ‘ఆంధ్రభూమి’ చేరారు మల్లారెడ్డి. కాని పత్రికా రంగంలో తన స్థానమానాలన్నీ ‘ఈనాడు’ వల్లే అని ఆయన ఒప్పుకున్నారు; చెప్పుకున్నారు కూడా.
‘ఆంధ్రభూమి’లో చురకలు పేలినా, ఐదేళ్ళ ఆయన “అజ్ఞాతవాసం’ అడవిగాచిన వెన్నెలే అయ్యింది. తరువాతి “ఉదయం”లో స్వ, పర వివక్ష లేని ‘అక్షింతలు’ సంచలనాన్నే రేపాయి.
“సిగ్గు శరం ఉన్నవాడు సిపిఐ లో చేరడు
మతిస్థిమిత మున్నవాడు మార్క్సిస్టులతో ఉండడు”
– అన్నది అందులో భాగమే!
ఆనంద బుద్ధ విహార ట్రస్ట్ కోరిక ప్రకారం మల్లారెడ్డి”ధమ్మపదం”ను తెనుగు చేశారు. అనువాదం జయప్రదంగా ముగించడ మటుంచి, బుద్ధుని ప్రవచనాలు, అదే సమయంలో జిడ్డు కృష్ణమూర్తి రచనలు ఆయనను ఆధ్యాత్మికం వైపు నడిపాయి.
1996లో స్వామి వివేకానంద వ్రాసిన “యతిగీతం” కవిత కు ఆయన తెనుగు తర్జుమా ను ఆయన నోటివెంటే విన్న రామకృష్ణ మఠం స్వామి పరమార్థనంద తన్మయులై ప్రశంసించారు.
ఆయన ఆచార్య నాగార్జునిని ” సుహృల్లేఖ”ను కూడా అనువదించారు. ఆ పుస్తకావిష్కరణ సభే ఆయన పాల్గొన్న చివరి సభ.
1997 జూలై 5న మల్లారెడ్డి అంతిమ శ్వాస వదిలారు.
“బ్రతుకు పూలబాట కాదన్నా
ప్రతి మలుపులోనా
బలిసి ఉన్న ముళ్ళ పొదలన్నా”
అన్న ఆయన వాక్యాలు స్వానుభవాలే!