స్వాధీనపతిక
లలన మీగడ బుగ్గలదుముచు
వలపుతో నెలవంక నుదుటన
తిలక మలదిన ప్రియుని ప్రేమకు
మురిసెనే! స్వాధీనపతిక
చంద్రకాంతులు ప్రతిఫలించే
సౌధమున తన ప్రియుడు ముదముగ
ముద్దు పదముల దిద్ద లత్తుక
కులికెనే! స్వాధీనపతిక.
అనుగు చెలువుని అన్యకాంతల
కందనంతటి దవులనుంచుచు
వలపు సేవలనంది తనరెడి
గడుసరే! స్వాధీనపతిక.
వాసక సజ్జిక
చెలియరో! ప్రియవిభుడు చేరెడి
తరుణమాయెను తడవు సేయక
కురులు దిద్దుము విరులు ముడువగ
అనెను వాసకసజ్జిక
వెలది అందము పరిమళించగ
అలది గంధపు పూత మేనికి
అలరువిల్తుని సతిని మించగ
మెరిసె వాసకసజ్జిక
పడకటింటిని మరుని విడిదిగ
సరిది చెంపకు చేయి చేరిచి
కలల పందిరి లోన పతికై
వేచె వాసకసజ్జిక
విరహోత్కంఠిత
సందె వాలెను, అందగాడిని
తనను వలచిన వన్నెకానిని
చేర రమ్మని, జాడ లేదని!
వెదకె విరహోత్కంఠిత
జాము రాతిరి గడిచిపోయెను
జాజి పూవులు వెక్కిరించెను
రాతి గంధము ఇగిరిపోయెను
కుందె విరహోత్కంఠిత
వెలదికన్నులు వేడి బాష్పపు
జలదముల తలపింప దిగులుగ
తనువు గడపకు ధారపోయుచు
వేచె విరహోత్కంఠిత
విప్రలబ్ధ
మూడు జాములు దాటిపోయెను
ముగుద హృదయము సెగలు గ్రక్కెను
విరహబాధకు స్రుక్కి సోలిన
విప్రలబ్ధను చూడరే!
మోసులెత్తిన పొలతి ప్రేమను
మోసగించిన ప్రియునితలచగ
వాడిపోయిన పూలసరమౌ
విప్రలబ్ధను చూడరే!
ఆశలన్నీ ఆవిరాయెను
రోషనాగము వోలె కనలుచు
భూషలన్నీ విసరికొట్టిన
విప్రలబ్ధను చూడరే!
ఖండిత
మాపు గడిచెను రేయి గడిచెను
ముచ్చు రీతిగ వచ్చితివి నీ
ఇచ్చకములను నమ్మబోనని
తేల్చి చెప్పెను ఖండిత
గోటి గుర్తులు కావికన్నులు
చాటు కథలను చాటిచెప్పెను
మాటలేటికి మరలిపొమ్మని
కేరడించెను ఖండిత
మేని గంధము మారిపోయెను
ఉత్తరీయమునంటె తిలకము
దేని పొందున అలసినావని
పతిని దూరెను ఖండిత
కలహాంతరిత
వేచి విసిగిన భగ్నహృదయము
భగ్గుమనెను నిరాశ వేచగ
ప్రాణవల్లభు గాంచి కోమలి
మారె కలహాంతరితగా
తననుమరచిన తామసమ్మున
అనునయించెడి విభుని సముఖము
తాళజాలక వెడలిపొమ్మని
తరిమె కలహాంతరితయై
వెర్రికోపపు చేటు నొంటిగ
విభుని తలచుచు విధిని దూరుచు
ఎదురుతెన్నులె ఎదర బ్రతుకై
కుమిలె కలహాంతరితయై
ప్రోషితభర్తృక
దూరసీమల కరిగె పతి, దరి
చేరుటెపుడని క్షణము యుగమై
భారముగ బ్రతుకీడ్చుచున్నది
పొలతి ప్రోషితభర్తృక
చక్కనొత్తదు చెదరు కురులను
చెలుల సాంత్వన చెవులకెక్కదు
చంద్రునొంటిగ చూడనొల్లదు
తలరి ప్రోషితభర్తృక
మరల మురిపెపు గడియలెపుడని
వేయి కన్నుల ఎదురు తెన్నుల
విభుని ప్రేముడి వివరముల జడి
తడిసె ప్రోషితభర్తృక
రాముడట్టుల రహిని గూర్చగ
కృష్ణుడై మురిపాలు తీర్చగ
మరల పతి నన్నేలుటెపుడని
వగచె ప్రోషితభర్త్రుక
అభిసారిక
పొట్ట విచ్చిన పుచ్చపూలను
రివ్వు రివ్వున రువ్వినట్టుగ
నవ్వుజల్లులు కురియు వెన్నెల
నీడలో అభిసారిక!
పడగలెత్తిన అలలనురగలు
చెడుగుడాడుచు విరుగు వంపుల
పాలవెన్నెల ప్రతిఫలించే
తీరమున అభిసారిక!
నిండుచంద్రుని కోరి సాయము
ఒంటిగా పూపొదల మాటున
ప్రియుని రాకకు వేయికన్నుల
వేచినది అభిసారిక.