చనిపోయిన వాణ్ణి తట్టి లేపకు
మీద జల్లిన మట్టి తలకెత్తుకోకు
పుట్టుకను ఆహ్వానించు
బొడ్డుతాడు తావీదులో దాచు
ఎప్పటికైనా పనికొస్తుంది
పాలతిత్తి వదిలేసేక
నడవడం నేర్పు
జీవితకాలమంతా
చెయ్యవలసిందదే
రాత్రి పడుకోవడం
ఉదయాన్నే లేవడం
తీరికలేని పగలు
దినచర్యగా మార్చుకోకు
తంత్రి బిగించి ఏక్ తార
శ్రుతి చేసి పెట్టుకో
గుమ్మం పొదిగిట
దీపం వెలిగించి
రాత్రికి పగలుకు
అభేదమైన కాలాన్ని
మంద్రస్వరంలో
ఆవిష్కరించు
నీరున్నచోట, చెట్టున్నచోట
నలుగురున్న చోట నివసించు
మాట కలిసినప్పుడు
గొంతు కలుపు
మరణాన్ని పొగడకు
మరోసారి మరుభూమికి
వెళ్ళాలనుకోకు
మరిచిపోయినవన్నీ మంచివే
పాతకథలు తవ్వకు
కొత్తలోకం కనిపిస్తే
తరచి చూడు
బొందితో ప్రయాణం
కుదురుతుందేమో తెలుసుకో
అంతస్తులన్నీ
మనం కట్టుకున్నవే
గాలం వెయ్యడం సులభం
నిచ్చెన గాల్లో నిల్చోదు
నీరు, గాలి, వెలుగు
కొనుక్కునేవాడు
అద్దె కొంపలోనే ఉన్నాడు
ఇంక మిగిలింది
ఎగరలేని ఆకాశమొక్కటే
బందీనయ్యేనని బాధపడకు
బంధనాల్లేని బంధమేలేదు
అనుమానమొచ్చినప్పుడు
స్టెప్పీలలోకి వెళ్లు
త్రోవ తెలుసా?
హరప్పా మొహెంజోదారో
దాటి వెళ్ళాలి
పెంపుడు జంతువుల్ని
తిరిగి తోలుకెళ్ళాలి
నడిచిన త్రోవ గుర్తొస్తే
తావీదులో జన్మరహస్యం
మత్తెక్కిన వేళ
గుర్రమెక్కకు
మదమెక్కిన ఏనుగు
మాట వినదు
మధ్య జీవితాన్ని వదిలేస్తే
పుట్టుకకి, మరణానికి
విషచషకం
మతమొక్కటే
యంత్రాన్ని కనుక్కో
తంత్రాన్ని వదలకు
యంత్రతంత్రాలు
యుద్ధవేదికలైనప్పుడు
నీ కుర్చీ ఖాళీ
కరిగిపోతున్న
హిమానీనదాన్ని
కావలించుకోకు
నీరై పారిపోతుంది.
నక్షత్రాలన్నీ
చిల్లులుపడ్డ ప్రపంచానికి
వేసిన మెరుగు టాకాలే!