అనుకొంటాం
కలలని శ్వాసిస్తూ పువ్వునుంచి పువ్వుకి
ఈదులాడే సీతాకోకల్లాగా- అని,
ఇంకా ఇంకా అనుకొంటాం
కలలని శాసిస్తూ తోటనుంచి తోటకు
వాసనలు మోసుకెళ్ళే సీతాకోకచిలుకలమని
ఎంత మోహం
ఎంత మిడిసిపాటు
కలలే మనల్ని కలగన్నాయని
మనమే లేకుంటే
ఈ రంగులు,రాగాలు ఉండనేవుండవని
కాలం పరుసవేది-
పుటంపెట్టి పసిడిరెక్కల్ని తొడిగి ఎగరేస్తుంది
మోహ ఋతువుల్తో ఆరెక్కల్నే మసిచేస్తుంది
అయినా–
కాలం మాయాపసరు-
గాయాన్ని మచ్చగా, మచ్చని జ్ఞాపకంగా
జ్ఞాపకాన్ని శిలాజంగా పదిలం చేస్తుంది
అయినా–
రాతిమీది పాచిని తింటూ, పాకుతూ-
పాకుతూనే వుంటే–
ఎప్పటికి తెలుసుకోవాల ?
శిలాజాలేమిటో– ఆ అనుభవాలేమిటో?
మనం ఏమిటో? కలలేమిటో -కాలమేమిటో
ఎప్పటికి తెలుసుకుంటాం.?
రెక్కలు విచ్చుకోకుండా–?