యూలియా నవాల్‍న్యా

నీ నీలి కన్నుల దైన్యాన్ని
రాక్షస పాదం కింద
నలిగిపోయిన దేహాన్ని
నీ భర్త ప్రాణాన్ని

అంతులేని దుఃఖాన్ని
అన్ని వైపులా కమ్ముకొచ్చే
అంధకారాన్ని
ఎవరూ ఎరుగని
ఎర్రని వడగళ్ళ వర్షాన్ని
నీ నీలి కన్నుల దైన్యాన్ని

ఊహలన్నీ ఊచలుగా
మారిపోయిన వైనాన్ని
సిరల్లో, ధమనుల్లో
పారే రక్తంలో
కలిసిన విషాన్ని
నీ నీలి కన్నుల దైన్యాన్ని

దివారాత్రాలు ఏకమై
నిలిచిన కాలాన్ని
అతి శీతల
మృత్యు ఆలింగనాన్ని

నిస్సహాయంగా పడివున్న
నీ భర్త శవాన్ని
నీ తోడులేని తనాన్ని
నీ నీలి కన్నుల దైన్యాన్ని


(ఎంతో కాలంగా ఆత్మకథ రాసుకోవాలి అన్న రష్యా ప్రతిపక్ష నేత అలెక్సే నవాల్‍నీ (Alexei Navalny, 1976-2024) సంకల్పం – సైబీరియాలో అతని మీద విష ప్రయోగం (2020) జరిగిన అనంతరం వాస్తవ రూపం దాల్చింది. అలెక్సే దుర్భరమైన ఆర్కిటిక్ కారాగారంలో, మూడేళ్ళు నరకయాతన పడి – ఎన్నో కష్టాలకోర్చి తాను మొదలుపెట్టిన ఆత్మకథను ముగించగలిగాడు కానీ చిన్న వయసులోనే జైలుగోడల మధ్య చనిపోయాడు. ప్రతిపక్ష నేతలను, విమర్శకులను విషప్రయోగంతో లేదా అతిశీతల కారాగారాల్లో మగ్గిపోయేలా చేసి చంపివేయడం ‘ప్రజాస్వామిక సామ్యవాద’ దేశాల్లో మామూలు విషయం. ఆ దేశాల్లో స్వేచ్ఛ గురించి మాట్లాడటం, రాయడం క్షమార్హం కాని నేరం. భర్త స్మృతిని సజీవంగా ఉంచడానికి కంకణం కట్టుకున్న అతని భార్య యూలియా నవాల్‍న్యా ఆ ఆత్మకథను పుస్తకరూపంలోకి తీసుకురాగలిగింది. అలెక్సే ఆత్మకథ Patriot: A memoir ఇటీవలే, 22 భాషల్లో వెలువడింది.)


రచయిత తమ్మినేని యదుకులభూషణ్ గురించి: తమ్మినేని యదుకుల భూషణ్‌ జననం రాయలసీమలోని చారిత్రకస్థలం తాడిపత్రిలో. కొన్నాళ్ళు సింగపూర్‌లో పనిచేసారు. నివాసం సోమర్‌సెట్‌, న్యూజెర్సీలో. "నిశ్శబ్దంలో నీ నవ్వులు" అనే కవితాసంకలనం ప్రచురించారు. కథలు, విమర్శలు కూడా రాసారు.  ...