ఆలిస్ మన్రో

ఆలిస్ మన్రో (Alice Munro, July 10, 1931 – May 13, 2024).

కెనేడియన్ కథారచయిత ఆలిస్ మన్రో 130 పైచిలుకు కథలు రాసింది. అవి 14 సంకలనాలుగా ప్రచురితమయ్యాయి. 2013లో మన్రోకి నోబెల్‌ బహుమతి వచ్చింది. కేవలం కథారచయితకి నోబెల్‌ బహుమతి ఇవ్వడం ఇదే మొదటిసారి. కొందరు విమర్శకులు, ఆవిడ కథకి ఆఖరి నిర్వచనం ఇచ్చిందని అంటారు. మరి కొందరు అసంతృప్తి వెలిబుచ్చారు కూడాను!

“నేను పెరిగిన ఊరిలో ప్రతి వీధితో నాకు ఒక విధమైన భావానుబంధం, మరుపురాని వాతావరణం ఉన్నది. ఆ వాతావరణం, ఆ వత్తిడిలోంచి ‘జూబ్లీ’ ఊరు పుట్టింది” అని చెప్పుతుంది, మన్రో.

ఆమె కథలన్నీ గ్రామీణ ఆంటారియోలో జరుగుతాయి. కష్టపడుతూ పొలంలో బాల్యం; దీర్ఘకాలిక అనారోగ్యంతో తల్లి; విజయవంతం కాని మొదటి వివాహం; ప్రేమాయణాలు, వేదనలు, మొదలైనవన్నీ కథల్లోకి వెళ్తాయి.

లైవ్స్ ఆఫ్ గర్ల్స్ అండ్ ఉమెన్ (1971) ఒక నవల అని అమ్ముకున్నారు కానీ అది నిజంగా నవల కాదు. ఇది ఒక అమ్మాయి ఆంటారియో బాల్యంతో ముడిపడి ఉన్న చిన్న కథల సంకలనం.

మనం సాధారణంగా ఇగ్నోర్ చేసే వ్యక్తులు, పరిసరాలు అంటే ఒక చిన్న ఆడపిల్ల, ఒక చిన్న ఊరిలో ప్రాథమిక పాఠశాల, రిటైర్డ్ సేల్స్‌మన్ – ఇలాంటి వారి జీవితాలని జాగ్రత్తగా చూసి, ఆమె వారి గురించి వ్రాసింది. ఆమె వాళ్ళ జీవితాలను సీరియస్‌గా తీసుకుంది. అందువల్ల, ఒక్కొక్కసారి వారి పాత్రలు వారి కంటే పెద్దవిగా, ఘనంగా కనిపిస్తాయి. అది, కాల్పనిక సాహిత్యంలో మన్రో చేసిన గొప్ప పని. నిజం చెప్పాలంటే, ఆవిడ రాసిన ప్రతి ఒక్క కథా ఒక నవలగా మలచవచ్చు. అయితే, నవలావస్తువును కథగా చెప్పటం బహుశా చెకోవ్‌‌కి తెలుసు.

ఉదాహరణకి ‘టర్కీ సీజన్’ కథలోని పాత్రలను తీసుకోండి. వాళ్ళు తమ ఉద్యోగాన్ని గౌరవిస్తారు. ఇష్టపడి కష్టపడి పనిచేస్తారు. థాంక్స్ గివింగ్, క్రిస్మస్ పండగలకోసం కోసం టర్కీలకి ఈకలు పీకి శుభ్రపరచడం, చంపడం, ప్యాకింగ్ చేయడం వగైరా. కష్టపడి పని చేయడం గర్వకారణంగా భావిస్తారు. ఈ కథలో నవలకు సరిపడేంత వస్తువు ఉంది.

యుక్తవయసులో దేవుడున్నాడా, లేదా అన్న ప్రశ్న మన్రోని చాలా బాధపెట్టింది. దేవుడు ఉన్నాడా లేదా అనే చర్చ చర్చిలో ఎప్పుడూ జరగలేదు. అతను (దేవుడు) ఆమోదించాడా లేదా అనేది మాత్రమే ఎల్లప్పుడూ చర్చ్‌‌లో మాట్లాడే విషయం! సాధారణంగా అతను (దేవుడు) ఆమోదించనిది ముఖ్యం. ‘ఏజ్ ఆఫ్ ఫెయిత్‌’ కథలో, అదే పైకి వస్తుంది. మన్రో పన్నెండు ఏళ్ళప్పుడే దేవుడిని నమ్మటం మానేసింది.

మన్రో స్త్రీవాది అవునో కాదో తెలుసుకోవాలంటే టూమచ్ హాపీనెస్: స్టోరీస్ (2009) చదవాలి. అందులో ముఖ్యంగా రోజ్‌ అనే పేదపిల్ల, తెలివైన పిల్ల కథ. తోడుగా, పోలికలకోసం సోఫియా కోవలెవ్‌స్కీ (Sophia Kovalevsky -1850 -1891) అనే రష్యన్‌ గణిత శాస్త్రవేత్త, జీవితంలో పడ్డ అగచాట్లు. మన్రో ఈ సంకలనం ప్రారంభంలో ఆమె జీవితకథ (Little Sparrow: A Portrait of Sophia Kovalevsky, 1983) తన కథకి ఆధారమని చాలా హుందాగా రాస్తుంది.

మన్రో కథలు 50కి పైగా ది న్యూయార్కర్ పత్రిక ప్రచురించింది. వారు ప్రచురించడానికి నిరాకరించిన ఏకైక కథ ‘ద్వేషం, స్నేహం, కోర్ట్‌షిప్, ప్రేమ, వివాహం’. ఎందుకంటే అది 50 పేజీలకు పైగా ఉందిట అందుకని!

ఆమె వచనం చెకోవ్ వచనం లాంటిది. పారదర్శకం. ఆమె ఒక కథను చెప్పినప్పుడు, రచయిత, పాఠకుడు ఇద్దరూ కథలో పాత్రలకన్నా తెలివిగా మరింత అధునాతనంగా ఉంటారనే అభిప్రాయం కలగనివ్వదు. ప్రౌస్ట్ లాగా, ఆవిడ కథలు జ్ఞాపకాల దొంతరలు. అవి మన జ్ఞాపకాల మాదిరిగానే, కొన్నిసార్లు మొదటి సంఘటనలు చివరిగాను, చివరి సంఘటనలు మొదట్లోనూ ఉంటాయి, ఆమె కథలలో.

కథలు చాలావరకు ఓపెన్ ఎండెడ్, అసంపూర్తిగా అగుపిస్తాయి. కథల ముగింపు వదులుగా వదిలేస్తుంది, ఉద్దేశపూర్వకంగానే! అప్పుడే కథ ఆథెంటిక్ అవుతుంది. కారణం? మనకు దేని భవిష్యత్తూ కచ్చితంగా ఎప్పుడూ తెలియదు. కాబట్టి, కథ విషయంలో మాత్రం ఆ పట్టింపు ఎందుకు? ఇది ‘ముగింపు’ అని చెప్పటం?

మన్రో కెనడాలోని హ్యురాన్ కౌంటీలో నివసించింది. ఆ కౌంటీ ఎల్లప్పుడూ ఆవిడకి ఆసక్తికరంగానే ఉంటుంది. భూవిజ్ఞాన శాస్త్రవేత్త అయిన తన భర్తతో కలిసి ఆమె కారులో వెడుతూ, ఎవరూ పట్టించుకోని వివరాలు తను పట్టించుకొని, కథలోకి అల్లుతుండేది.

‘వాట్ డూ యూ వాంట్ టు నో?’ అన్న కథలో ఒక పాత్ర ఒక సమాధిని చూస్తుంది. ఒక విచిత్రమైన కుటుంబ సమాధి. దానిలో ఒక కుర్చీ, ఒక టేబుల్, ఒక దీపం వున్నాయి. కథలో భర్తతో కలిసి తిరిగి వెళ్ళుతున్న భార్య, ఆ సమాధిలో దీపం గుర్తుకొచ్చి, “దీపం వెలిగించడానికి నూనె ఉందా?” అని ఆశ్చర్యపోతుంది.

‘ది బేర్ కేమ్ ఓవర్ ది మౌంటైన్’ అనేది మన్రో రాసిన ప్రసిద్ధ కథ. అవే ఫ్రమ్ హర్(#Away from her#) అనే సినిమా వెర్షన్‌లో జూలీ క్రిస్టీ నటించింది.

ఫియోనా అనే 70 ఏళ్ళ వృద్ధురాలు ఇంటిలో వస్తువులను తప్పుగా ఉంచడం మొదలుపెడుతుంది. ప్రతిచోటా, చెంచాలమీద కూడా స్టికర్స్ పెట్టడం ప్రారంభిస్తుంది. ఆమె చాలాసార్లు పరిచయం ఉన్న దుకాణాల నుంచి ఇంటికి వెళ్ళే దోవ కూడా తప్పిపోతుంది. ఇంకేముంది? ఆమె భర్త గ్రాంట్ ఆమెను మెడోలేక్ అనే అసిస్టెడ్ లివింగ్ ఫెసిలిటీకి పంపిస్తాడు. ఫియోనా అక్కడ కోలుకుంటుంది. ఆరోగ్యం బాగుపడుతుంది. త్వరలోనే ఆమెకు ఒక ప్రియుడు దొరుకుతాడు. గ్రాంట్‌‌కి అసూయ, పశ్చాత్తాపం, తన ద్రోహాలను గుర్తు చేసుకుంటాడు. And an excellent home cooked dinner follows.

ఈ కథను న్యూ యార్కర్ పత్రిక డిసెంబర్ 27, 1999లోను, తిరిగి మళ్ళీ అక్టోబర్ 21, 2013 సంచికలో, మన్రోకు నోబెల్ బహుమతి వచ్చిన సందర్భంలో, ప్రచురించింది. ‘కాలక్రమాన్ని ముందువెనుకలు చేసి కథానిర్మాణాన్ని అధునాతనం చేసిన రచయిత్రి, మాస్టర్ ఆఫ్ కంటెంపరరీ షార్ట్ ఫిక్షన్’ అని నోబెల్ కమిటీ పేర్కొన్నది.