జనవరి 2022

కాలాతీతమైన సాహిత్యం అని అనడం కొన్ని సందర్భాల్లో కొన్ని రచనలకు సంబంధించి మంచి విశేషణమే కాని, అలా కాని సాహిత్యాన్ని కొట్టిపారేయడానికి లేదు. కాలానుగుణమైన సాహిత్యం కూడా ఒక సామాజిక అవసరం. సమకాలీన సమాజపు పోకడలను నిశితంగా గమనించి చాప కింద నీరులా పాకే దుష్ప్రభావాలను ఎత్తి చూపుతూ సాహిత్య సృజన చేయడం కొన్నిసార్లు ప్రథమ చికిత్స లాంటి అవసరం. ఎనభైల దశకంలో తెలుగునాట స్త్రీవాద సాహిత్యం చేసింది దాదాపు అలాంటి పనే. స్త్రీ చేతన కోసం రచయిత్రులు కూడి పరిశ్రమ చేసిన ఉద్యమకాలమది. తమ తమ జీవితాల పట్ల, హక్కుల పట్లా స్త్రీలకు ఉండాల్సిన అవగాహన గురించి, గౌరవం గురించీ గొంతెత్తి మాట్లాడిన తరమది. హద్దుల్లేని జీవనోత్సాహం కోసం కనపడ్డవన్నీ కూల్చేయమని ప్రబోధించిన వేలంవెర్రి అచ్చు కాగితాల మధ్య మానసిక శారీరక ఆరోగ్యాల గురించి, స్త్రీ తనకు తానుగా మొదటగా మిగుల్చుకోవలసిన హుందాతనం గురించి, కన్నబిడ్డలైనా వేలెత్తి చూపే వీల్లేని వ్యక్తిగతనిర్ణయ స్వాతంత్రాల గురించి, జీవించే హక్కు గురించీ మాట్లాడిన సత్యవతిగారి కథల్లోని సూక్ష్మదృష్టికి వెలకట్టలేం. అభ్యుదయ సాహిత్యం అంటే మొహం మీద కొట్టినట్టుండే ఆవేశాలో ఉపదేశాలో, నినాదాలో సందేశాలో కావని, చుట్టూ ఉన్న సమాజంలో నుండి నడిచి వచ్చినట్టుండే పాత్రల సంఘర్షణ, పోరాటం, నిబ్బరం, నిజాయితీతో కూడిన లోచూపు ఉన్న కథలే ఆలోచనలను రగిలించగలవని, నిజమైన అభ్యుదయానికి దారి తీయగలవని పి. సత్యవతి కథలు రుజువు చేస్తాయి. నిన్ను నువ్వు చూసుకోవడం నేరం కాదని, నీ కోసం నువ్వు బతకడం ఒక జీవనావసరమని, నీ గౌరవాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నించడమొక కనీస బాధ్యత అనీ స్త్రీలకు లోపల నిండు ధైర్యాన్ని కలిగించిన అభయవచనాలామె కథలు. రెచ్చగొట్టడానికీ ఆలోచన కలిగించి భరోసానివ్వడానికీ మధ్య ఉన్న తేడాని పట్టుకుని రాశారు కనుకే, కాలానుగుణంగా వచ్చిన ఆ కథలు ఇప్పటికీ గుర్తింపుకి నోచుకుంటున్నాయి. అవకాశం ఉండి కూడా, ఆమె తెలుగులో నేరుగా చేసిన కృషి కళ్ళబడనట్టు, సాహిత్య అకాడెమీ ఆమెకు అనువాద కేటగిరీలో అవార్డు ప్రకటించి తన హ్రస్వదృష్టిని చూపుకుంది. ఇదేమీ ఆశ్చర్యం కాదు – అకాడెమీ అవార్డులు కనీసం తెలుగుకి సంబంధించి ఎన్నేళ్ళుగానో మూసలో ఇరుక్కుని ఉన్నాయి. అవార్డులు ఒక పరిమితిగా మారిన కాలమిది. రచనా ప్రక్రియ, ప్రాంతం, వాదం, చివరిగా వయసు – ఇలాంటి బేరీజుల మధ్య నలిగిపోతూ తెలుగు సాహిత్య అకాడెమీ అవార్డు విలువ నానాటికీ దిగజారుతోంది. అయితే నిజమైన సాహిత్యం ఎల్లలు దాటి తన ఉనికిని చాటుకుంటుంది. కన్నడిగుల ప్రతిష్టాత్మకమైన కువెంపు జాతీయ సాహిత్యపురస్కారం మొట్టమొదటిసారి ఒక తెలుగు రచయితకు రావడం, సత్యవతిగారి సాహిత్యప్రతిభకు నిదర్శనం. సాహిత్యానికి పైవరుసల్లో ఎన్నో గళ్ళలో టిక్ మార్కులు పడితే తప్ప అవార్డులు వరించని ఈ కాలంలో, తాము పొందడం ద్వారా అవార్డుల గౌరవాన్ని పెంపొందించే సాహిత్యం సత్యవతిగారి లాంటి ఏ కొద్దిమంది రచయితలకే సొంతం. అలాంటి సాహిత్యమే మనకిప్పుడు అవసరం.