ఉయ్ టూ

అతను వచ్చేటప్పటికి, నా ఎపార్ట్‌మెంట్‌లో నేలమీదంతా పుస్తకాలు గుట్టలు గుట్టలుగా పడున్నాయి. గతవారం ఎరిన్ వచ్చినప్పుడు, పుస్తకాలెంత దుమ్ముపట్టిపోయాయో చూపించి తిట్టింది, మీ మొగాళ్ళంతా ఎందుకిలా ఉంటారు అన్న ధోరణిలో. రోషం వచ్చి, పుస్తకాలు సర్దుదామని అన్నీ షెల్ఫులలోంచి బయటికి తీసి కింద తివాచీలమీద రాసిపోసుంచాను. ఈలోపు కాస్త బద్ధకమూ, మరికాస్త పనీ తగులుకుని అవింకా అలానే ఉన్నాయి.

అతను చాలా పొడుగ్గా ఉన్నాడు. పొడుగ్గా అంటే చాలా పొడుగ్గా, ఎంత లేదన్నా ఆరడుగుల నాలుగంగుళాలు ఉంటాడేమో. ఎత్తైన సీలింగ్ ఉన్న హైఎండ్‌ న్యూయార్క్ ఎపార్ట్‌మెంటు, నేను చాలా గర్వంగా ఫీలయ్యే ఎపార్ట్‌మెంట్, అతను వచ్చేసరికి కాస్త మట్టసంగా అనిపించేంత పొడుగ్గా ఉన్నాడు. మార్ఫనాయిడ్‌ కాదుకదా! తన బాక్‌పాక్ తలుపు పక్కనపెట్టి, ఎపార్ట్‌మెంట్ చివరి మెట్టుమీద కూర్చుని నేను అవసరం లేదని చెప్తున్నా కూడా, బూట్లు విప్పి బయటపెట్టి లోపలకి వచ్చాడు. అతను బూట్లు విప్పుతున్నప్పుడు సోకుతున్న రకరకాల వాసనలు–చెమట, పొగాకు, వానలో తడిసిన కుక్క, సాక్సుల్లోంచి కుళ్ళిన చీజ్ వాసన–ఇవన్నీ.

అతను ఒక ప్రొటెస్టర్. దేశం నలుమూలలనుంచీ వచ్చిన నిరసనకారులందరూ ఆరు వారాలుగా, న్యూయార్క్‌ జుకాటి పార్క్‌లో ఆక్యుపై వాల్‌స్ట్రీట్‌ అనే నినాదంతో నిరసన చేస్తున్నారు. ప్రొటెస్టర్ ఏక్రన్‌, ఒహాయోలో, వాళ్ళ నాన్న ఇంట్లో బేస్‌మెంట్లో ఉంటాడు. ఆన్‌లైన్‌లో క్రెయ్‌గ్ లిస్టులో మరికొందరు నిరసనకారులతో పరిచయం అయ్యింది. ఆ లిస్టులోనే మాలాంటివాళ్ళు కొందరు, వాళ్ళ బాత్రూములు వాడుకోడానికి సమ్మతిస్తే, అలా ఇప్పుడు ఈ రాత్రి నా ఇంట్లో స్నానం చెయ్యడానికి వచ్చాడు. రాత్రికి పడుకుని, రేపుదయాన్నే వెళ్ళిపోతాడు.

బూట్లు విప్పి లోపలకి వస్తూ నా వైపు చూసి స్నేహపూరితంగా నవ్వాడు. మీరు జుకాటి పార్క్‌కి ఎక్కువ వెళ్తుంటారా అనడిగాడు. అతనికి పుస్తకాల మీద అంత ఆసక్తి ఉన్నట్టులేదు, చాలా పుస్తకాలున్నాయే అన్నాడంతే. సాధారణంగా నా ఇంటికి వచ్చినవాళ్ళు, పుస్తకాలు చూసి రేర్ కలెక్షన్ అనో, ఇలాంటి పుస్తకాలు షాపుల్లో ఎక్కడా చూడలేదే అనో అంటుంటారు. కానీ, ఇతనికి ఆపాటి ఆసక్తి కూడా ఉన్నట్టు లేదు.

అప్పటికి రాత్రి ఎనిమిది అయ్యింది, ఏమైనా తింటావా అనడిగాను. అడుగుతున్నప్పుడే నాకు పెద్దగా వంట చెయ్యడం రాదని చెప్తూనే, స్టిర్ ఫ్రై చేద్దామనుకుంటూన్నా, పర్లేదా అనడిగాను. ష్యూర్ అన్నాడు. అతనికోసమని నిన్న రాత్రి ఉతికిన తువ్వాళ్ళు తీసిస్తుంటే, అతను పాపం బట్టలు ఉతుక్కోవాలేమో అని గుర్తొచ్చి, వాషింగ్ మెషీన్ చూపించాను. థాంక్స్‌ చెప్పి, బాక్‌పాక్ లోంచి బట్టలన్నీ తీసి, తను వేసుకున్న ప్యాంటు, టీషర్టూ కూడా తీసేసి చకచకా వాషింగ్ మెషీన్లో పడేశాడు. అతను టీషర్టు తీస్తున్నప్పుడు చూశాను. తెల్లగా కండలు తిరిగిన శరీరం, చంకలకింద జీబురుగా పెరిగిన నల్లటి వెంట్రుకలు, పొట్టమీద పలకల మధ్య డైమ్‌లా మెరుస్తున్న బొడ్డూ, పొడుగాటి తెల్లటి చేతులూ–అతని ఒంటిమీంచి వస్తున్న మొగవాసన.

కూరలు తరుగుతున్నప్పుడే నాకేం పెద్దగా ఆకలిగా లేదని అనిపించింది. అతను బాత్రూములో ఉన్నంతసేపు ఏదో చెయ్యాలి కదా అని, ఇంటికొచ్చిన అతిథికి ఏదో పెట్టాలి కదా అనీనూ ఏదో వండుదాం అని మొదలెట్టాను. కిచెన్‌ కాబినెట్‌ తెరవంగానే ఎప్పుడో నీల్స్‌ తెచ్చిన రిస్కే సొమెలియే వైన్‌బాటిల్ కనిపించింది. దాన్ని ఇవాళ మళ్ళీ ఓపెన్ చెయ్యాలనిపించింది, కానీ అతనేమనుకుంటాడో అని కాస్సేపు తటపటాయించి, అలెక్స్ ఇచ్చిన లాయర్స్ వైన్ తీశాను. రెడ్ కీన్వా కుకర్‌లో పెట్టాను. చైనీస్ వోక్ స్టౌ మీద హై హీట్‌లో పెట్టి అందులో కాస్త నూనె పోశాను. ఫ్రిడ్జ్‌లో టోఫూ ఉంది, ఇంకా పాడయిపోలేదు. అదీ దానితోపాటే ఫ్రీజర్ లోంచి తీసిన కాసిని మిక్స్‌డ్ వెజిటబుల్స్ కలిపి కాగిన నూనెలో పడేశాను. ఫోను స్పీకర్ డెక్‌లో పెట్టి, బెస్ట్ ఆఫ్ నీనా సిమోన్ ఆల్బమ్ సెలక్ట్ చేసుకొని ప్లే నొక్కాను.

వోక్‌లో కూరముక్కలు కలుపుతూ ఉంటే హఠాత్తుగా తట్టింది, ఇంకో మనిషికోసం ఏదైనా వండిపెట్టి ఎంతకాలం అయ్యుంటుందీ అనీ. నిజానికి అసలు ఎప్పుడూ ఎవరికోసం నేను వంట చేసిన జ్ఞాపకం లేదు. అప్పుడప్పుడూ గ్రూప్ కుకింగ్ సెషన్స్‌లో వంట చేసినమాట నిజమే కానీ, ఆ సందర్భాల్లో కూడా నా చేతకానితనాన్ని ఒక అర్హతలా మార్చి ఆడిన డ్రామానే ఎక్కువ. ఎన్నోసార్లు, నాకు ఆసక్తి ఉన్న అబ్బాయితో, ‘నిన్ను ఇంటికి డిన్నర్‌కి పిలవాలనుంది, కానీ నాకు వంటచెయ్యడం అంత సరిగ్గా చాతకాదు’ అనడం, ఆ అబ్బాయి ‘పర్లేదు, నేను బా వండుతా’ అంటే, ‘అలా అయితే ఇంటికి రాకూడదూ, నేను కూడా నీ దగ్గర నేర్చుకుంటా’ అని మస్కా కొట్టడం, ఇంటికొచ్చిన తర్వాత వీటన్నిటినీ వైన్ తాగుతూ ఇంటలెక్చులైజ్ చెయ్యడం–ఇంతే ఇప్పటివరకూ జరిగింది. అలెక్స్‌‌ వస్తున్నాడని తెలిస్తే అతని కోసం తెచ్చే శాండ్‌విచ్‌లు కూడా బైటనుంచి కొనుక్కొచ్చేవే. ఎంత ఆలోచించినా, ఒక్కసారి కూడా నేను వంటిట్లో నిలబడి పూర్తిగా ఓ నాలుగు డిషెస్ నా అంతట నేను తయారుచేసిన గుర్తు లేదు. దీనికి విరుద్ధంగా, అమ్మపాలు కుడిచినప్పటినుంచీ, ఇప్పటిదాకా నాకు ఎంతమంది భోజనం పెట్టలేదు! కొని లక్షలసార్లు, కొన్ని వందల టన్నుల భోజనం చేసుంటాను. అంతెందుకు, మొన్ననే కదా ఎరిన్ బ్రహ్మాండమైన చికెన్ రోస్ట్ చేసింది, విలియమ్ బ్రాంక్‌ కవితాసంకలనం మీద పనిచెయ్యడానికి వెళ్ళినప్పుడు? కిందటివారమే కదా ఎలీనా మిడిల్ ఈస్ట్రన్ శాలడ్ చేసిపెట్టిందీ… ఈ రెండు సందర్భాలలోనూ కూడా నేను చేసిందేం లేదు. సాధారణంగా నేను చేసేదల్లా ఒక వైన్ బాటిల్ తీసుకెళ్ళడం, అది కూడా ఇంకెవరో ఎంతో శ్రద్ధతో చేసిందే!

ఈ తేడా నన్ను ఆలోచనలో పడేసింది. ఎగ్ వైట్స్ వేసి అవి కొంచెం గట్టిపడ్డాక, సోయ్ సాస్, పెపర్ ఫ్లేక్స్ వేసి ఫ్రై అంతా తిరగకలిపాను. వాటితోపాటే, ఇవాళ ఇదో రుచీపచీలేని చప్పటికూడు అవుతోంది అని తెలిసినా సరే, మెదటిసారి ఇంకో మనిషికి వండిపెడుతున్నాననే వెచ్చటి సంతోషం, దాంతోపాటే ఈ చప్పటి స్టిర్ ఫ్రై కూడా ఓ వంటేనా అనే ఘాటైన నిరసనభావం సెగలు కక్కుతూ సుళ్ళుతిరుగుతున్నాయి. ఇవాళ నుంచీ స్నేహితులకోసం తరచుగా ఏదైనా వండాలి, ఒక మనిషిని సంతృప్తిపరిచే అతి ప్రాథమికమైన ఆహారాన్ని ఇప్పటినుంచీ తినటమే కాకుండా, తయారుచేసే పనితనం నేర్చుకోవాలి అనిపిస్తోంది. కానీ, ఇంతలోనే–ప్రొటెస్టర్ స్నానం చేసొచ్చే లోగానే–నా పొలిటికల్ మెటీయరిలిజానికీ, నా చేతకానితనానికీ మధ్య వైరుధ్యం నన్ను చికాకు పెట్టింది. అయితే, మనిషి కడుపునింపుకోడం అనే అతి మామూలు అవసరాన్ని–వండటం, తినటం కూడా గొప్ప కళాకౌశలం, తిండి కూడా ఒక బ్రహ్మపదార్థం అన్నంత స్థాయికి తీసుకుపోయిన బొటీక్ నేచురల్ ఫుడ్ మార్కెట్స్ వెనక ఉండే బయోపాలిటిక్స్ ఆ చికాకుని కాస్త తగ్గించాయి. అదీకాక, ఎరిన్, ఎలీనా ఏదో చేశారంటే, దాని వెనకాల భూమిని దున్నే రైతు దగ్గర నుంచి, ప్రపంచం నలుమూలలని కలిపే రవాణా వ్యవస్థలవరకూ ఎంత గొప్ప ప్రణాళిక ఉందో, దాంతోపాటే తిండిని కూడా ఓ పెద్ద వ్యవస్థగా మార్చిపడేసిన ప్రపంచ వాణిజ్య వ్యవస్థల క్రూరత్వం కూడా ఉంది కదా? ఈ ఆలోచనలతో, నాలో స్వార్థపరత్వం ఎంత ఉందో తెలుస్తున్నకొద్దీ అది మరింత ఎక్కువ అవుతోందేకాని తగ్గటంలేదు. నామీదే నాకే అసహ్యం కలుగుతోంది. ముప్పైమూడేళ్ళ పాటు, ఈ ప్రాథమికమైన, మౌలికమైన అవసరానికి ఎవరూ నామీద ఆధారపడింది లేదు కదా కనీసం నానుంచీ ఎవరూ దాన్ని ఆశించనుకూడా లేదు… అందరూ నా అవసరాన్ని అలవోకగా తీర్చినవాళ్ళేకానీ.

ఔను. ఎవరికైనా వండిపెట్టాలి. ఎవరినైనా ఆలనపాలన చూసుకోవాలి. ఎందుకో తెలీకుండానే ఒక కొడుకో, కూతురో ఉంటే బావుండును అనిపించి, వెంటనే ఆ ఆలోచనకి ఒళ్ళంతా జలదరించింది. ఇదన్నమాట సంగతి అనుకున్నాను, ఒక ఐడియలాజికల్ మెకానిజమ్ ఎలా పనిచేస్తుందో స్పురించి. ఒక ఖరీదైన అపార్ట్‌మెంట్‌లో, ఒక కుర్రాడిని యాంటీ కాపిటిలిస్ట్ ఉద్యమస్నానానికి పంపించి, కూరముక్కలు వేయిస్తూ ఉంటే, నీ ఆలోచనలు నీ ప్రతిబింబాన్ని ప్రపంచంలోకి తేవడం వైపుకి నిన్ను నడిపిస్తాయన్నమాట. ఎందుకంటే, నీకంటూ ఏం చేతకాదు కాబట్టి. దీన్నంతా అందంగా దాచడానికి వైనూ పాటా ఆర్టూ వంటివి కావాలి కాబోలు. నీ ఇంట్లో బాత్రూముని ఇంకెవరికో ఒక సాయంత్రం ఇవ్వటం, నాలుగు కూరముక్కలు, కాస్త అన్నం వండటం కూడా రాని నీ చాతకానితనం కలిసికట్టుగా నీ రెండు చెంపలూ వాయించడంలోంచి ప్రపంచ సమస్యలన్నీ నదురుగా నీ ఇంట్లో ప్రైవేట్ డ్రామా అయిపోతాయన్నమాట. మగవాడిని కాబట్టేనా ఈ ఆలోచనలు? ఎవరో ఒకరు నామీద ఆధారపడున్నారనో, ఒకరికంటే నేను మెరుగనో నన్ను నేను ప్రూవ్ చేసుకోవడమేనా ఇదంతా?

ఆస్పత్రిలో కీమోథెరపీలో ఉండి కూడా, అంత బాధలోనూ ఏమీ కానట్టూ ఎప్పుడూ హాయిగా ఉండే రొబెర్టో గుర్తొచ్చారు. ఆయనా, ఆయన భార్య బార్బరా పాతికేళ్ళపాటు ఎంతమంది ఆర్టిస్టులకీ రచయితలకీ చేయూతనివ్వలేదు! ఆయన ఎన్ని పుస్తకాలు ఎంత అందంగా ప్రచురించలేదు! అంతకంటే అందమైన జీవితాలు వాళ్ళవి. వాళ్ళ అమ్మాయి వివియన్‌ ఎంత అందంగా ఉండేదనీ! అంత అందమైన అమ్మాయీ వర్జీనియా పాలిటెక్నిక్‌ యూనివర్సిటీ షూటింగ్‌లో దారుణంగా చనిపోయింది. అప్పుడుకూడా రొబెర్టో దంపతులు కుంగిపోలేదు, కసికీ కార్పణ్యానికి లొంగిపోలేదు. ఆయన నాతో ఎప్పుడూ అంటుండేవారు, ది షాడో ఆఫ్ ది క్రాస్ కెన్ నాట్ బి ఎ వాకింగ్ స్టిక్, అని. నువ్వు చెయ్యాల్సిందల్లా, నీమీద నీకున్న మమకారాన్ని ఓ పిల్లాడిగా మార్చుకోడం కాదు; ఆ మమకారాన్ని, నీ స్వీయప్రేమనీ లాభాలు ఆర్జించే క్షణాలు కాకుండా కాపాడుకోడం.

భోజనం మరీ అంత చెత్తగా ఏం లేదు, కాస్త పర్లేదు. దానికే ప్రొటెస్టర్ ఆసమ్! అని మెచ్చుకున్నాడు. అతనింకా, నడుంకి తెల్లటి తువ్వాలు మాత్రం చుట్టుకునే ఉన్నాడు. కండలు తిరిగిన అతని యవ్వనం లైటు వెలుతుర్లో మెరుస్తోంది, అతని కళ్ళలో అమాయకత్వపు తేటదనం మల్లేనే. అతని తండ్రి బానే సంపాదించాడు, ఇళ్ళు చవగ్గా వస్తున్నాయని ఉన్న డబ్బులన్నీ కుమ్మరించి రెండు పెద్ద ఇళ్ళు కొన్నాడు, హౌసింగ్ స్కామ్‌లో అదంతా ఊడ్చుకుపోయింది. ఆ దెబ్బకి తట్టుకోలేక, డిమెన్షియా వచ్చింది. అమ్మ కూడా మంచం పట్టింది. ప్రొటెస్టర్‌ ఇప్పుడు ఇంట్లోనే ఉంటూ తల్లినీ తండ్రినీ చూసుకుంటున్నాడు. ఇ-కామర్స్ కంపెనీలకి కొరియర్ డెలివరీలో గిగ్‌ జాబ్ చేస్తుంటాడు. అదికాకుండా కారు రిపేర్లు, ఇంటి మరమ్మత్తులు, పెయింటింగ్, కార్పెంటరీ ఇలా సమస్తమైన పనులూ అతనికి వచ్చు. పెద్దగా చదువుకోలేదుగానీ మంచి చురుకుదనం, చాకచక్యం ఉన్న మనిషి.

అతని అమాయకత్వం, పనివాడితనం చూసి నాకు కాస్త కుళ్ళుగా ఉంది. మాటల్లో అతనితో నా చాతకానితనం గురించి, దానివల్ల నేను అనుభవించే అపరాధభావన గురించీ చెప్తూ రొబెర్టో మాటలు చెప్పాను. అతనికి అంత పొయెట్రీ అర్థంకాలేదు, అంటే? అన్నాడు. అదే, సాటి మనుషుల ప్రేమనీ స్నేహాన్నీ, బాధలనీ అవసరాలనీ, సహానుభూతి చెందే మామూలు మంచితనాన్ని మనం శిలువ ఎక్కించేసి, ఆ తర్వాత ఆ శిలువనే ఒక రెలిజియస్ సింబల్‌గా మార్చేస్తాం కదా! వియ్ మేక్ రెలిజియన్ ఔట్ ఆఫ్ గిల్ట్! అన్నాను.

సౌండ్స్ ప్రొఫౌండ్ మాన్! కానీ, నువ్వు అంటున్నంత సంక్లిష్టత ఏం లేదనుకుంటాను. నా ఉద్దేశంలో, అనుభవంలో విషయం అంతకన్నా చాలా సింపుల్, ఈవెన్ ప్రైమార్డియల్! అంటూ కాస్సేపు తన యాత్రలు, ఉద్యమాలు–అందరితో అన్నిటిగురించీ వాదించి తగువు పెట్టుకోడం, పోలీసులచేతిలో లాఠీ దెబ్బలు తినడం, పార్క్లుల్లోంచి బలవంతంగా బయటకి ఈడ్చేయబడడం, రాత్రిపూట జెనరేటరు వైర్లని కలపడం, డ్రగ్సు మానేయడం– వీటిగురించీ చెప్తూ, విషయం ఏంటంటే, ఈ ఏడాదిలో మనుషులందరితో కలిసిమెలగడం గొప్ప అనుభవం, ముఖ్యంగా నాట్ ఆల్ మెన్ ఆర్ ఆనిమల్స్ యూ నో, అన్నాడు.

అతని సెక్సువల్ ఎవేకనింగ్ గురించి మాట్లాడతాడేమో అనుకున్నాను కాని, అతను అంతకంటే చాలా మామూలు విషయాన్నే ఎత్తుకున్నాడు. వయసొచ్చిన ప్రతీ మగాడు నా మొగతనానికో సవాల్ అనుకోడం నుంచి మొదలైన నేను, వాళ్ళ డీసెన్సీ ఇప్పుడు కాస్త చూడగలగుతున్నాను. నాకు గుర్తున్నంతవరకూ, పన్నెండేళ్ళ వయసునుంచీ రోడ్డుమీద నడుస్తున్నప్పుడో, పక్క కార్లో డ్రైవరుని చూసినప్పుడో, స్కూల్ కారిడార్లో కొత్త మొహం కనిపించినప్పుడో, ఎవడిని చూసినా ‘వీడితో నేను తూగగలనా? తలపడితే ఎవరు గెలుస్తారు?’ అన్న ఆలోచన ఒకటి దానంతట అదే మెదడుపొరల్లోంచి బయటకొచ్చేది. ప్రతీ మొగాడు ఇలానే స్పందిస్తాడనుకుంటా. బహుశా సర్వైవల్ ఇన్‌స్టింక్ట్స్ అయుండాలి–అన్నాడు ప్రొటెస్టర్. నాకు అవుననిపించింది ఆ క్షణంలో, నాలో ఆ కోణం ఇప్పుడు బాగా మరుగున పడిపోయినప్పటికీ. ప్రొటెస్టర్ నా ఇంట్లోకి అడుగుపెట్టినప్పుడు అతని ఒడ్డూ పొడుగూ చూసి నేనూ అలానే అనుకుని ఉంటానా, ఏమో మరి. కానీ, ఇన్ని అనుభవాల తర్వాత కూడా ఇదిగో–ఇలా నేను అతనికి నా బాత్రూము, పడకగదీ ఏమీ సంకోచించకుండా ఇవ్వడం గురించి చేతితో చూపిస్తూ–ఇక అలా ఆలోచించటం అసంభవం, ఉయ్ ఆల్ కెన్ లివ్ టుగెదర్ వితౌట్ సచ్ టాక్సిక్ మాచోనెస్, ఆర్ కాంప్లికేటెడ్ థింకింగ్, అన్నాడు అతనే. కన్వల్యూటెడ్ అనను కాని, మీరు ప్రపంచంలో జరిగే అతిమామూలు విషయాలని కూడా క్రిస్టియానిటీ నుంచీ కాస్మాలజీ దాకా ముడిపెట్టకుండా ఆలోచించలేరు. ప్రపంచంలో మహా అయితే ఓ పది మహానగరాల్లో, బాగా డబ్బున్న సబర్బుల్లో ఉండే మేధావులు, బిలియనీర్లే ఇప్పుడు ప్రపంచాన్ని శాసించేది. మీడియా, ఆర్ట్, పాలిటిక్స్, ఎకానమీ అన్నిటికీ మీ మాటలే మూలం. మీకు మీ ఐడియాలతోనే తప్పించి, మామూలు ప్రపంచంతో సహజమైన అనుబంధం తెగిపోయిందేమో అని నా అనుమానం. అందుకే డెమోక్రసీ అన్నా, మార్కెట్స్ అన్నా, మీడియా అన్నా మాలాంటివాళ్ళకి నమ్మకం పోయింది! అన్నాడు కాస్త ఆవేశంగా. అతని మాటలు మరీ అంత తీసెయ్యడానికేం లేదనిపించింది నాకు. ప్రపంచాన్ని శాసిస్తున్నవి ఒక పది నగరాలే అన్నమాట నిజమే మరి. వాతావరణం తేలికపరచడానికి మాటమార్చి లేట్ నైట్ టాక్‌షో హోస్ట్‌ల గురించి మాట్లాడుకున్నాం.

కానీ అతను మళ్ళీ అందుకున్నాడు–యూ నో, చిన్నప్పుడు స్కూల్లో మిగిలిన కుర్రాళ్ళతో బాత్రూములో ఉచ్చపోసుకొనేప్పుడు పక్క పక్కనే నుంచుంటాం చూడూ… ఇతను కాస్త వైన్ ఎక్కువై ఈ టాపిక్‌తో ఎటు వెళ్తాడో అని కాస్త నాకు ఆందోళన ఎక్కువైంది… అప్పుడు వాడిది ఎంతుందో చూట్టం, వాడిది చూసి మనదో సారి చూసుకోటం. ప్రతి కుర్రాడు ఈ పని చేస్తాడు కదా? కాస్త పెద్దయి, కాలేజీకి వచ్చాక అది మర్యాద కాదని దొంగచాటుగా చేస్తాం. కానీ అప్పుడు కూడా, పబ్లిక్ యూరినల్ అంటే అదొక డ్రామా. ఉయ్ ఆర్ ఆల్ పీపింగ్ టామ్స్ ఇన్ దేర్. నువ్వు మోకాళ్ళు కొద్దిగా వంచి, ఏదో పెద్ద భారం మోస్తున్నట్టో లేదా ఒక అరచెయ్యి నడుముకు ఆసరాగా పెట్టి, ఒంటిచేత్తో ఏదో పెద్ద ఫైర్ హోస్ కంట్రోల్ చేస్తున్నట్టు పోజు కొట్టడం, ఇవన్నీ కామనే కదా?

నాకు నవ్వాగలేదు. నాకు ప్రొటెస్టర్ దేని గురించి మాట్లాడుతున్నాడో అర్థం అవుతోంది, కానీ ఇలా నేను ఎప్పుడూ దీనిగురించి పట్టించుకోలేదు. లెక్కలేనన్ని దృశ్యాలు నా కళ్ళముందు కదలాడుతున్నాయి. కాన్సస్‌లో లాకర్ రూములు, ఈ మధ్య ఎయిర్‌పోర్ట్‌లు, సినిమా హాళ్ళు, మ్యూజియంలూ–అందరూ కాకపోయినా చాలా మంది మొగాళ్ళు యూరినల్స్‌లో, బరువైన పైపునో లేదా పెద్ద బరువుని అతి తేలికగా మోస్తున్నట్టో పట్టుకొని మొహం పైకెత్తి నిలబట్టం ఏదో వెయిట్ లిఫ్టింగ్ చేస్తున్నట్టుగా. ఇతర దేశాల్లో కూడా ఇలానే ఉంటుందా అని జ్ఞప్తికి తెచ్చుకోడానికి ప్రయత్నించాను. అప్పటికే అతను కుర్చీలోంచి లేచి, రెండు చేతులతో ఫైర్‌హోస్‌ని ఆపరేట్ చేస్తున్నట్టు మైమ్ చెయ్యడంతో మరింక నవ్వాగలేదు. ఏదైతే‌నేం, ఇద్దరం బిగ్గరగా, తెరలు తెరలుగా, కడుపుబ్బా నవ్వుకున్నాం. నేను అంత పెద్దగా నవ్వి ఎన్నేళ్ళయిందో.

నేను అతన్నే గమనిస్తున్నాను. అతను లేచి అటూ ఇటూ తిరుగుతూ మాట్లాడుతున్నాడు–నేను మా నాన్న ఇలానే చెయ్యడం చూశాను. నా కోచ్‌లు, నా స్నేహితులూ, ప్రాక్టికల్లీ అందరూ ఇలానే చేస్తారు. మొన్న మెక్‌డానల్డ్స్ వాడు బాత్రూమ్ వాడుకోడానికి మాకు అనుమతి ఇచ్చాడు. అక్కడ నాతోటి ప్రొటెస్టర్ క్రిస్, అదేదో టన్ను బరువున్నట్టు, ఇంకొకరి సాయం అవసరం అన్నట్టు నటించడం ఎప్పుడు మానేస్తావ్ బ్రో? అన్నంతవరకూ నేను కూడా, నాకు తెలియకుండానే ఇలానే చేసేవాడిని. అప్పుడే మొదటిసారి నేను ఎలా ప్రవర్తిస్తున్నానో నేను గమనించింది. అప్పటినుంచీ మానేశాను. ఆక్యుపై వాల్‌స్ట్రీట్ ప్రొటెస్ట్ లక్ష్యం ఇది కాదనుకో గానీ, ఇప్పుడు నేను ప్రతీ మొగాడిని, వీడితో నేను తూగగలనా? అనే అంచనా కట్టడం, బాత్రూమ్ వెళ్ళినప్పుడల్లా ఏదో డంబెల్ ఎత్తుతున్నట్టు ఫీలవడం మానేశాను, అప్పటినుంచీ ఈ ప్రపంచం కాస్త వేరుగా కనిపిస్తోంది, యూ నో!

అతని మాటల్లో నిజాయితీ వల్లో, వైను ఎక్కువయ్యో, ఇలాంటి ఒక ప్రైవేట్ టాపిక్‌ని ఇంత ఇంటిమేట్‌గా పంచుకోవడం వల్లో, అవేవీ కాక మరెందుకో… అతని దేహం నన్ను విపరీతంగా ఆకర్షిస్తోంది. వైన్‌గ్లాసు ఎత్తి అతడి మొహంలోకి చూశాను. నా ఆలోచనలు అతనూ గమనించాడు. దగ్గరికి వచ్చి, నా మొహం రెండు చేతుల్లోకి తీసుకొని తమకంగా ముద్దు పెట్టుకున్నాడు. నేల మీది పుస్తకాల మధ్యనుంచి బెడ్రూమ్‌లోకి ఎలా చేరామో కూడా తెలియలేదు. అరగంట తర్వాత అలసిపోయి పక్క పక్కనే పడుకున్నప్పుడు, అతను నన్నొకసారి ముద్దుపెట్టుకొని అవతలివైపుకి ఒత్తిగిల్లి నిమిషంలో నిద్రలోకి జారిపోయాడు. నేను కూడా వెంటనే నిద్రపోయాను. చాలాకాలం తర్వాత హాయిగా గాఢంగా.

ఉదయం నేను లేచేసరికే అతను డిష్‌వాషర్ లోడ్ చేసేసి, కాఫీ పెడుతున్నాడు. కాఫీలయ్యాక, పుస్తకాలు సర్దేద్దామా అన్నాడు. ఎగిరిగంతేసి సరే అన్నాను, ఒక గంటలో చక్కగా పుస్తకాలన్నీ దుమ్ముదులిపి అరల్లో సర్దేశాం. నేనైతే నిక్కుతూ నీలుగుతూ ఓ నెల్లాళ్ళు సాగదీసేవాడిని.

వాల్‌స్ట్రీట్‌ స్టేషన్ దగ్గర అతనికి వీడ్కోలు చెప్పాను. మృదువుగా చెయ్యినొక్కి థాంక్యూ అనిచెప్పి ట్రైన్ దిగి మాయమైపోయాడు. యూనియన్‌ స్క్వేర్ దగ్గర దిగి బయటకు వస్తుంటే, అలెక్స్‌ దగ్గరనుంచీ మెసేజ్. పదింటికి డాక్టర్ ఎపాయింట్‌మెంట్ ఉంది మర్చిపోకు. నేను నేరుగా క్లినిక్‌కే వచ్చేస్తాను, అని. ఇంతకు ముందుసారి కలిసినప్పుడు మాటల్లో వచ్చి మార్ఫన్‌ సిండ్రోమ్‌కి ఏదో ప్రయోగాత్మాకమైన జీన్ ఎడిటింగ్ ట్రీట్‌మెంట్ ఉందన్నాడు డాక్టరు, దాని గురించి ఇవాళ పూర్తి వివరాలు తెలుసుకోవాలి.