శ్రీమాన్ కొండ్రాజు బలాదూర్ చరిత్ర: వరాహపర్వం

కొఠాం కోటలో ‘టంగ్ టంగ్ టంగ్’ మంటూ వేకువ గంట మ్రోగింది. అది విన్న రాచనగరిలోని పరివారమూ ప్రజానీకమూ నిద్రకళ్ళని నులుముకుంటే, మరికొంతమంది ప్రక్కలమీద సర్దుకొని మళ్ళీ నిద్రకి ఉపక్రమించారు.

కాస్సేపటికి… తిథి నక్షత్రాలని బట్టి, ఘడియ విఘడియలు లెక్కగట్టిన ఆస్థాన జ్యోతిష్యుడి ఆజ్ఞల ప్రకారం సూర్యోదయం అయిందన్నట్టుగా నగారా మ్రోగింది. కోట ఎదుట సిద్దంగా వున్న ఇద్దరు రాజోద్యోగులు ఏలినవారి జెండాని ఎగరేశారు. సూర్యాస్తమయం వరకూ ఆ జెండా అలా రెపరెపలాడుతుంటుంది.

గోపాలురు గోశాలల వైపు, రౌతులు అశ్వశాలల వైపు, మావటీలు గజశాలల వైపు అడుగులేస్తుంటే… రాచకొడుకులు కందాల వైపు వడివడిగా పరుగులు తీస్తున్నారు.

దివాణంలో వున్న హుజూరు కందా రాచబంధువులకి ప్రత్యేకం. పెద్ద కందా ఇతర వర్ణాలవారిది. మడి కందా పూజా పునస్కారాలు చేస్తూ మడి తడి ఆచరించే శాకాహారులది. రాచబంధువులలోని వితంతువులకీ, వానప్రస్థం స్వీకరించిన వృద్ధరాజులకీ భోజనవసతులన్నీ మడి కందాలోనే. ఇక్కడ వంటావార్పూ వ్యవహారాలన్నీ బ్రాహ్మణులవి.

గ్రాండ్ ట్రంకురోడ్డు మీదనుంచి బ్రిటిషోళ్ళ ట్రక్కులూ జీపులూ అప్పుడొకటీ అప్పుడొకటీ డబడబ శబ్దంతో నిశ్శబ్దాన్ని చెదరగొడుతూ పోతున్నాయి. దానినానుకొని వున్న ధర్మసత్రం వైపు నెమ్మదిగా నడుస్తున్నాడు కొప్పెర్ల నరసరాజు. ఆయన వెనకాలే కొడుకు బండరాజనే కొండరాజు తలమీదుగా దుప్పటి దిగేసుకొని నిద్రమత్తుతో జోగుతూ సాగుతున్నాడు.

మొక్కిన దేవుళ్ళకి మొక్కకుండా, ఎక్కిన గుట్టలు ఎక్కకుండా, చుట్టిన పుట్టలు చుట్టకుండా, నోచిన నోములు నొయ్యకుండా నోచినా సంతానం కలగలేదు నరసరాజుకి. ఇక తల తాకట్టుపెట్టయినా పుత్రకామేష్ఠి యాగం చేద్దామనుకుంటుండగా పుట్టాడు బండ్రాజు. లేకలేక కలిగిన సంతానం కావడంతో అల్లారుముద్దుగా పెంచుకొంటున్న బండ్రాజుకి చదువు సంధ్యలబ్బలేదు. ప్రక్కపిల్లలతో గిల్లికజ్జాలు పెట్టుకొని వాళ్ళని దొర్లించి దొర్లించి కొడుతూవుండడంతో గురువులతన్ని పాఠశాల నుంచి బయటకి గెంటేశారు. దాంతో దారికాచి గురువులనే తన్నడం లాంటి పోరంబోకు పనులు మరీ ఎక్కువయ్యాయి బండ్రాజుకి. వంటలో నలభీములంతటోడైన నరసరాజు, సోమరిపోతులా తిరుగుతున్న కొడుకుని తనంతటివాడిని కాకపోయినా అంతటోడినో, ఇంతటోడినో చెయ్యాలన్న సంకల్పంతో వెంట తిప్పుకోవడం మొదలెట్టాడు. బండోడికి వంట అబ్బుతుందన్న నమ్మకమైతే లేదుకాని, తూతూ మంత్రంగానైనా నేర్చుకుంటే చదువూ సంధ్యాలేక, ఏ ఉజ్జోగం సజ్జోగం రాని కొడుకు కందాలోనో, సత్రంలోనో పడుంటే సమయానికి కడుపునిండా తిని తన పాడుదేహాన్ని కాపాడుకుంటాడన్న ఆలోచన ఆయనది.

బండ్రాజు పుట్టినప్పుడు అతని జాతకం చూసిన సత్రంలోని సాధువులూ సన్నాసులూ ‘సిరి నీకు చిడుమూ గజ్జీ పట్టినట్టు పట్టేస్తుందని, బండోడికి అదృష్టం, దరిద్రం తగులుకున్నట్టు తగులుకొంటుందని’ ఒకటే ఊదరగొట్టారు. బండ్రాజు పదహారేళ్ళ ప్రాయంవాడైనా ఇప్పటికీ వాళ్ళా బాకా ఊదడం మానలేదు. అది నిజమని నమ్మిన నరసరాజు ఇంటి తలుపులు వేసేస్తే లక్ష్మీదేవి ఎక్కడ రావడం మానేస్తుందోనన్న అనుమానంతో వాటిని బార్లా తెరిచే వుంచడం మొదలెట్టాడు. దాంతో ఆనూపానూ కనిపెట్టిన దొంగలు, ఓ అర్ధరాత్రిపూట పూసా పుస్తెతో సహా ఆయన్ని నిలువుదోపిడీ చేసేశారు. పిసరంత నేతిచుక్కకోసం, అదనపు బూరిముక్కకోసం కక్కుర్తిపడి, ఈ సన్నాసోళ్ళంతా లేనిపోనివి చెప్పి ఉబ్బేస్తూ తన కొంప ముంచేశారని లబోదిబోమన్న నరసరాజు అన్నవరం పోతే అన్నవస్త్రాలకి లోటుండదని తలచి, సత్యనారాయణస్వామికి వ్రతం చేసుకొనొచ్చి, అప్పట్నుంచీ కాషాయం కట్టినోడు భోజనాల బంతిలో కనబడితే నెయ్యీ బూరీ వడ్డించడం మానేశాడు.

సత్రం చేరుకున్న నరసరాజు రొంటిలో దోపుకున్న తాళంగుత్తితో వంటగది తలుపులు తెరచి, వంటి మీదున్న బట్టలు పాగాబల్లకి తగిలించి, నడుంకి కాశీతువ్వాలు కట్టుకున్నాడు. హారతి కర్పూరంతో గాడిపొయ్యి వెలిగించి, పెద్ద డేగిసాతో అన్నం వండడానికి ఎసరు పడేశాడు. వంట సరుకులు తెచ్చుకోవడానికి కొట్టుగది వైపు వెళ్ళేసరికి, అప్పటికే దాన్ని ఆక్రమించుకున్న బండరాజు గుప్పెళ్ళతో గుల్ల శనగపప్పు బుక్కుతూ మధ్యమధ్యలో బెల్లమ్ముక్క నంజుకుంటున్నాడు. అదిచూసిన నరసరాజు ‘ఖర్మ ఖర్మ’ అని తలకొట్టుకుంటూ తనకి కావాల్సినవి తీసుకొని బయటపడ్డాడు.


సత్రం ప్రక్కనే గోశాల, దానికి కూతవేటు దూరంలో గుర్రాలశాల, దానికి అంతే దూరంలో గజశాల వున్నాయి. గజశాలలో ఏనుగుల ఘీంకారాలకి పోటీగా అశ్వశాల నుంచి గుర్రాలు సకిలిస్తున్నాయి. వాటి అరుపులకి గోశాలలో లేగదూడలు బెదురుతున్నాయి. గుర్రాలకి గుగ్గిళ్ళు పెట్టి, వాటికి తమాషాగా మాలిష్ చేస్తున్న వేటుకూరి డబ్బెత్తురాజు ప్రక్కనే చిందులేస్తున్న గుర్రప్పిల్ల వైపు చూసి ఆశ్చర్య చకితుడయ్యాడు. చేస్తున్న పనాపి గుర్రప్పిల్ల తోకని చేత్తో పట్టుకుని చూశాడు. గట్టిగా బిగించి కట్టిన కొండచీపురుకట్టలా వ్రేళ్ళాడే దాని తోక ఎందుకో కాస్త పలచబడినట్టు అనిపించింది. గుర్రాలశాలంతా గుచ్చిగుచ్చి చూసినా ఎక్కడా రాలి పడ్డ వెంట్రుకలు కనబడలేదు. ‘అమ్మడియ్యమ్మ! ఏటిదిది? ఏదో పేను పట్టి గుర్రంతోకని కుతుకులోకి కొరికేస్తుందేమో! వెంటనే దీనికి మందేయించకపోతే మిగతా గుర్రాలకి కూడా పేనుకొరుకుడొచ్చే ప్రమాదం వుంది. అసలే వచ్చేమాసంలో తెల్లదొరల ముందు గుర్రాల ప్రదర్శన వుంది. తోకల్లేని గుర్రాలాళ్ళ కంటబడితే రాజావారికి లేనిపోని అప్రదిష్ఠ. వెంటనే విషయాన్ని దివాన్‌గారి దృష్టికి తీసుకువెళ్ళాలి’ అనుకొని, మళ్ళీ తన మాలిష్ పనిలో పడిపోయాడు.


దివాణం వీధిలో ఎక్కడా జనసంచారం లేదు. కోటలో ‘టంగ్ టంగ్ టంగ్’ మంటూ గంట పన్నెండుసార్లు మ్రోగింది. ఉదయం పదకొండు గంటలకల్లా భోజనాలు ముగించి, భుక్తాయాసం తీర్చుకున్న పెద్దరాజులు విశ్రామానంతరం మళ్ళీ వీధుల్లోకొచ్చే వేళది. పనీపాటా చేసుకునే సామాన్యజనం భోజనాల కోసం ఇళ్ళకి తిరిగొచ్చేవేళ కూడా అదే. నకనకలాడే ఆకలితో ఇంటికి పోయే వేళ, అరుగుల మీద తీరుబడిగా కూర్చున్న పెద్దరాజుల కళ్ళల్లో పడితే ‘చుట్టకి నిప్పట్రా, జారిన పంచెని కొంచెం పైకి ఎగ్గొట్టిపెట్టు’ లాంటి పనికిమాలిన పనులతో చంపుకుతింటారన్న భయంతోనే ఆ వేళల్లో జనం ఆ వీధిని తప్పించుకుపోతుంటారు.

ఇంటి అరుగుమీద ఒక్కరే కూర్చుని, ఇద్దరికి పేక పంచుతున్నారు కొండూరి పెదరామరాజు.

“అదేంటి తాతయ్యా! ఇద్దరాటా ఒక్కరే ఆడేసుకుంటున్నారు?” ఆశ్చర్యంగా అడిగాడు అటుగా వచ్చిన బండ్రాజు.

“నువ్వట్రా బండా. ఇది జంపనోరి పెదబాబు ఆటోయ్!”

“ఆయనేరీ?”

“వాడు కాశీ పోయాడు కదటోయ్. ‘నేను లేకుండా మీరు పేకాడేసుకుంటారేమో, నే కాశీకి వెళ్ళనని’ ఒకటే మొరాయిస్తుంటే… నీ ఆట నేనాడి పెడతాలేనని అనునయిస్తే, అప్పుడు వెళ్ళాడాపీనుగ.”

“మరి డబ్బులు?”

“పదిరూకలు ధరావత్తు కట్టెళ్ళాడు. అవెప్పుడో అయిపోయాయి. ఎక్కడికి పోతాడు, వచ్చేకా ఇస్తాడు, పద్దు రాసి పెడుతున్నా…”

“డబ్బు ఎలాగూ ఆయనదే కదా! ఆయనాట నేనాడనా?”

“పాకలపాటి వరహాలుకి నేను ఇరవై రూకలు బాకీ. అది నువ్విచ్చేలా వుంటే చెప్పు అలాగే ఆడుదువుగాని.”

“అదెలా కుదురుద్ది…”

“అందుకనే… ఈ బేడ పట్టుకెళ్ళి పువాకు పట్టుకురా. నేనా డబ్బు పెదబాబు ఆటాడి సంపాదించుకుంటా.” మెలికేశారు రామరాజు. దాంతో కిక్కురుమనకుండా బండ్రాజు బేడ కాసు జేబులో వేసుకొని కోమటింటికి బయలుదేరాడు.

రాజవీధి ప్రక్కదే దివాణం వీధి. పొడవుగా వుండే ఆ వీధికి అటూ ఇటూ వున్న ఇళ్ళల్లో రాచబంధువులు సకుటుంబ సపరివార సమేతంగా కాపురముంటారు. వీళ్ళకి ప్రత్యేకంగా పనీ పాటూ అంటూ ఏం వుండదు. వేళకి హుజూరు కందాకి పోవడం, ముప్పొద్దులా మెక్కడం, దర్బారుహాలుకి పోయి దర్జాలు వొలకపోయడం, ఆ మాత్రం దానికే అలిసిపోయినట్టు ఇంటికి పోయి విశ్రాంతి తీసుకోవడం, ఇదీ వాళ్ళతీరు. కందా వరకూ పోయి తినలేనివాళ్ళకి ఇంటికే నేరుగా భోజనాలు పంపించే వెసులుబాటు కూడా వుంది. చేతి ఖర్చులకి… కుటుంబ పరిమాణాన్ని బట్టి నెలనెలా కొంత బంధుభృతి కూడా దివాణం నుంచి అందుతూ వుండడంతో కులాసాగా రోజులు గడిచిపోతుంటాయి. వళ్ళొంచి వ్యవసాయమో, వ్యాపారమో చేసుకునేవాళ్ళు కొంతమంది ఉండకపోరు. కానీ అలాటివాళ్ళని వ్రేళ్ళ మీద లెక్కపెట్టవచ్చు.

“ఏం ఇవ్వమంటారు దివాణం?” అడిగాడు వైకుంఠ శెట్టి కొట్టుముందు నిలబడ్డ బండ్రాజుని.

“పువాకు.”

“డబ్బులివ్వండి.”

నరసరాజంతటి ఉత్తముడి కడుపున పుట్టి పరమశుంఠలా తిరిగే బండ్రాజంటే శెట్టికి కొంచెం చిన్నచూపు. బండ్రాజు డబ్బులిచ్చాకా పొగాకు చేతిలో పెట్టాడు.

“ఇదేవిటిది? లంక పువాకేనా? మెట్టాకు అంటకలుపుతున్నావా?” శెట్టి ఇచ్చిన పొగాకుని వాసన చూస్తూ అడిగాడు బండ్రాజు.

“మీమీదొట్టు. ఇది లంకాకే మారాజా… లంకాకే.”

“సరే కొసరేదీ?”

కత్తికంటుకున్న బెల్లప్పిసరుని కొండ్రాజు చేతికి రాశాడు శెట్టి.

“చీచ్చీ ఏంటిది? నేనేవన్నా చిన్నపిల్లాడిలా కనబడుతున్నానా? బేడ బేరానికి ఇంత బెల్లప్పిసరా? పువాకు కొన్నాను కాబట్టి ఓ బీడీ అన్నా ఇవ్వు.”

“మా బాబే! బేడ బేరానికి, ‘కానీ’ బీడీ కొసరిస్తే నేను నెత్తి మీద చెంగేసుకోవాలి. మీ బేరానికి నేను పెట్టిందే ఎక్కువ. ఇంకెళ్ళండి కొట్టుకట్టేసి భోజనానికెళ్ళాల!”

శెట్టిమాటలకి బండ్రాజుకి వళ్ళు మండిపోయింది. ఇంతకింతా శెట్టిని ఏడిపించి బురిడీ కొట్టించకపోతే నా పేరు బండ్రాజే కాదు అనుకొన్నాడు.

“అయితే నా బేడ నాకిచ్చెయ్!” అన్నాడు.

“యే బేడ?”

“పువాక్కి నాలుగణాలిచ్చేను కదా అందులో బేడ పోతే మిగతా బేడ.”

“మీరు బేడే ఇచ్చారు.”

“కాదు నాలుగణాలు.”

“బేడే…”

“నాలుగణాలు!”

ఇద్దరి వాదనలతో వీధి దద్దరిల్లిపోతోంది. గొడవేంటో అర్థంకాని జనం అక్కడ గుమిగూడారు.

“సరే బేడే. ఆ బేడే ఇచ్చెయ్యి అయితే!” తీవ్ర స్వరంతో అన్నాడు బండ్రాజు.

“ఇదిగో” అంటూ తనూ తీవ్రంగా అరుస్తూ బేడ ఇచ్చేశాడు శెట్టి.

తనని నానా కంగాళీ చేసి బండ్రాజు బేడకొట్టేశాడన్న సంగతి, అతను వెళ్ళిన తర్వాతకానీ కనిపెట్టలేకపోయిన శెట్టి, ‘నా బేడ తినేసి మీరెంత బాగుపడతారో నేనూ చూస్తా. బేడకి బేడా ఏసి మీ బావాజ్జీ దగ్గర వసూలు చెయ్యకపోతే నాపేరు చెక్కా వైకుంఠ శెట్టే కాదు. మీ అంతు చూసేదాకా మీ గుండెల్లో నిద్రపోకపోతే నామీదొట్టే…’ అని శాపనార్థాలు పెట్టడం మొదలెట్టాడు.


డబ్బెత్తురాజు చెప్పింది విన్న ఆస్థాన పశువైద్యుడు సీతారామాచార్యులు అశ్వశాలని సందర్శించారు. ఒక్కో గుర్రాన్ని క్షుణ్నంగా పరీక్షించాకా రెండు చేతులతోనూ రెండు చెంపల జుట్టునూ గుప్పెళ్ళతో గుంజుకున్నారు.

“ఏమయ్యిందండయ్యా?” అనడిగారు ఆయన్నే పరిశీలనగా చూస్తున్న డబ్బెత్తురాజు.

“నశ్యం డబ్బా ఇంటి దగ్గర మరిచానండోయ్,”

“నేనడుగుతున్నది గుర్రం తోకల గురించండీ!”

“అదా అదీ… ఇందులో ఏదో కుట్రకోణం దాగి వుందనిపిస్తోంది. అత్యంతవశ్యంగా దివానుగారిని కలిసి విన్నవించాలి.” గంభీరంగా చెప్పిన ఆచార్యులు తన గుర్రం వైపు నడిచారు.

“శెట్టిగారూ, ఒక నశ్యం డబ్బా పంపిస్తారూ?” అని పిలిచారు రాజవీధి మలుపులో గుర్రాన్ని ఆపిన ఆచార్యులుగారు.

“మహద్భాగ్యం. ఇదిగో తెస్తున్నా…” అంటూ వైకుంఠ శెట్టి ఓ ముక్కపొడుం డబ్బా పట్టుకొని స్వయంగా తనే వచ్చాడు. అది అందుకుంటున్న ఆచార్యులుగారు శెట్టి వ్రేలికి వున్న ఉంగరం వైపు నిశితంగా చూశారు.

“ఇదేం ఉంగరమండోయ్ శెట్టిగారూ! కడుచిత్రంగా వుంది. ఏదీ చూడనియ్యండి,”

“నాకూ తెలీదండయ్యా! కొట్టు దగ్గరకొచ్చిన వాళ్ళెవరో పడేసుకున్నట్టున్నారు. బాగుంది కదా అని తగిలించుకున్నాను,” అంటూ తీసి ఇచ్చాడు.

“సరి సరి, నేను దీన్ని నాతోపాటూ తీసుకువెళ్తాను. పరిశీలించాకా మళ్ళీ అప్పగిస్తాను, ఏమంటారు?”

“మహద్భాగ్యం. తిరిగి ఇవ్వకపోయినా మహద్భాగ్యమే…” చేతులు జోడించాడు శెట్టి.

“సరి సరి.” అంటూ ఆచార్యులుగారు గుర్రాన్ని ముందుకు అదిలించారు.


ధర్మసత్రం నిత్యం బాటసారులతో కిటకిటలాడుతూ సందడి సందడిగా వుంటుంది. దూరదేశాలకి పోయే పాదచారులు కావచ్చు, ఎడ్లబండ్లమీదా గుర్రాలమీదా పోయేవాళ్ళు కావచ్చు, సత్రం దగ్గర తమ ప్రయాణాలకి విరామమిచ్చి ఓపూటో, ఒకట్రెండురోజులో బసచేసి తమ ప్రయాణాలని తిరిగి కొనసాగిస్తుంటారు. ఇందులో వ్యాపారులు, యాత్రికులు, యాచకులు, ఇలా అన్ని వర్గాలవారూ వుంటారు. ఆడా మగా విడివిడిగా విశ్రమించటానికి విడిది శాలలుంటాయి. గ్రాండ్ ట్రంక్‌రోడ్ మీదుగా పోయే ఇంగ్లీషోళ్ళయితే రహదారి బంగళాల్లో విశ్రాంతి తీసుకుంటారు.

సత్రానికి కూతవేటు దూరంలో ఆకులు జారిపోయిన పాకలో కూర్చున్న కుర్రసాధువొకడు గట్టిగా గంజాయిదమ్ము కొడుతున్నాడు. అక్కడికొచ్చిన బండ్రాజు నిక్కరు జేబులోంచి గుప్పెడు గుర్రం వెంట్రుకలు తీసి రహస్యంగా వాడి చేతిలో పెట్టాడు.

“మీ తెలివే తెలివండి మారాజా! గుర్రపెంటుకు ఏలికి కట్టుకుంటే అష్టయిశ్వర్యాలూ కలుగుతాయని చెప్పడం, జనం దాన్ని నమ్మెయ్యడం!”

“…”

“ఇయ్యాళ యాపారం మాజోరుగా జరిగింది మారాజా. కానీకి రొండెంటుకులు చొప్పునమ్మేశాను. ఇయిగో మీ వాటాకొచ్చిన రొండ్రూపాయలు,” అంటూ ఇచ్చాడు సాధువు.

“…”

“ఇంకో ఇద్దర్నెట్టుకొని చుట్టుపక్కల గేమాల్లో కూడా అమ్మిద్దామా? డబ్బే డబ్బు!” బండ్రాజు నాణాలు లెక్కపెట్టుకుంటుంటే అడిగాడు సాధువు.

“వద్దొద్దు. ఇప్పటికే గుర్రం తోకలు గొరక చీపుర్లులాగా అయిపోయాయి.” ఖంగారుగా అన్నాడు బండ్రాజు.

“ఐపోతే ఐపోనీండి. ఏ చైనా టూరిట్టో వొచ్చినపుడు ఆత్తానంలో తోకల్లేని మొండి గుర్రాలని చూసేనని రాత్తాడు, చెరిత్తరలో మిగిలిపోద్ది.”

బండ్రాజు ఏదో చెప్పబోతుండగా, “హమ్మో హమ్మో ఇంత ఘోరమా! రాజుగారి గుర్రపెంటుకులతోనే యాపారమా! ఇప్పుడే దివాన్‌గారికి చెప్పి మీకు ఉరిశిక్ష వెయ్యించేస్తాను,” అంటూ చెట్టు చాటునుంచి వచ్చిన వైకుంఠ శెట్టి గుండెలు బాదుకున్నాడు.

తమ బండారం శెట్టి ముందు బట్టబయలైపోయిందని వెంటనే గ్రహించిన సాధువు అక్కడున్న చిలుమూ సంచీ అందుకుని అదే పరుగందుకున్నాడు. కొంచెం ఆలస్యంగా గ్రహించిన బండ్రాజు “ఇదిగో శెట్టీ, మన మధ్య జరిగిందేమీ మనస్సులో పెట్టుకోకు. నా దగ్గరున్న డబ్బులన్నీ ఇచ్చేస్తా. ఇదిక్కడే మర్చిపో. బాబ్బాబు నీ కాళ్ళట్టుకుంటాను పుణ్యముంటుంది,” అంటూ కూర్చునే శెట్టి వైపు కదిలాడు.

“ముందుకు రాకండి. కాళ్ళట్టుకొని గిరగిరా తిప్పి నేలకేసి కొట్టి చంపేద్దామనే! ధర్మగంటకొట్టి నేనీ విషయం రాజుగారి దాకా తీసుకుపోతాను. ఇప్పటికే ఆచార్యులుగారికి వెంటుకుల ఉంగరం సాక్ష్యంగ ఇచ్చేను. రేపట్నుంచి సంస్థానానికి కావాల్సిన సరుకుల సరఫరా వ్యాపారం అంతా నాదే.” అంటూ శెట్టి కూడా పరుగందుకున్నాడు.

‘దివాన్ తిరుమలరాజు గోపాలరాజు చండశాసనుడు. ఆయనకి ఈ గుర్రం తోక గురించి తెలిస్తే, కోటగుమ్మానికి చచ్చేదాకా తనని తలకిందులుగా వ్రేల్లాడదీసేస్తాడు. ఏం చెయ్యాలా?’ అని పరిపరి విధాల ఆలోచించిన బండ్రాజు అలా కొండల్లోకి పోయి ఆకులలములు తింటూ తపస్సు చేసుకుంటే మంచిదనిపించి, దూరంగా కనబడుతున్న కొండలవైపు భారంగా అడుగులు వేయడం మొదలెట్టాడు.


చేతికి అందాల్సిన వేరుశనగ పంటని అడవి పందులు బుడ్దగించి తినేస్తుండడంతో వాటినెలా అయినా సంహరించాలన్న ధ్యేయంతో మాటువేస్తున్నారు రైతులు. కానీ వాళ్ళవల్ల కావడం లేదు. అందులో ఒంటిపంది మరీ దారుణంగా కొరకరానికొయ్యలా వుంది. దాన్ని అడ్డు తొలగించుకుంటే కానీ పంట మిగిలేలాలేదని గ్రహించి, తేలుకుంట నుంచి ప్రత్యేకంగా వేటగాడు వీరన్నని పిలిపించారు. వీరన్న ఈటెని విసరడంలో మొనగాడు. చీకట్లో తిరిగి కొండ మీదకి వెళ్ళే ఒంటిపంది కోసం చెట్టు చాటున ఒక్కడే మాటువేశాడు.

అప్పుడప్పుడే చీకటి ముసురుకుంటోంది. ఎంతనడిచినా కొండలు దూరమవ్వడమే కానీ దగ్గర అవకపోవడంతో బండ్రాజుకి ఆయాసం వచ్చింది. కడుపులో ఆకలి నకనకలాడుతోంది. ఎదురుగా కనబడుతున్న వేరిశనగ మొక్కలు లాగి కాయలు కసాపిసా తినడం మొదలెట్టాడు. ప్రక్కనే వున్న నేలనూతిలో నీళ్ళు తోడుకొని త్రాగేశాడు. తర్వాత అక్కడే వున్న మంచె ఎక్కి నిద్రపోయాడు.

ఒంటిపంది కొండ ఎక్కుతున్న అలికిడి విన్న వీరన్న అప్రమత్తం అయ్యాడు. తెగతిని బలిసిపోయిందేమో తొండంలేని గున్న ఏనుగంత వుందది. వెన్నెల్లో దాని కోరలు తళుక్కుమంటున్నాయి. ఈటెని గురి చూసి చెవి వెనక బలంగా పొడిశాడు. గుర్రుమంటూ వెనక్కి తిరిగి వీరన్నని ముట్టెట్టికొట్టడంతో అమ్మా అని కేకపెట్టి చీకట్లోకి జారిపోయాడు. ఒంటిపంది వెనక్కి తిరిగి ఈటెని వదిలించుకోవడానికి పరిగెత్తడం మొదలెట్టింది.

దబ్బుమన్న పెద్ద శబ్దం వినబడ్దంతో బండ్రాజు కళ్ళు తెరిచాడు. మోటుమనిషే కాకుండా మొండివాడు కూడా అయిన బండ్రాజుకుకి భయమంటే ఏమిటో తెలీదు. ముందు తనెక్కడున్నాడో అర్థంకాలేదు. తేరుకున్న తర్వాత మంచె విరిగిపోయి కిందపడ్దానని గ్రహించాడు. లేచి చూస్తే పెద్ద పంది ప్రక్కనే పడి వుంది. దాని గూబవెనక ఈటె. దగ్గరకి వెళ్ళి ‘ష్… ష్…’ అన్నాడు. పందిలో ఎలాటి కదలికా లేదు. అప్పుడప్పుడే తెల్లవారుతోంది. బండ్రాజులో ఏదో ఆలోచన వచ్చింది. పంది శరీరంలోని ఈటెని బలంగా లాగాడు. మంచెకి వున్న తడపలతో దాని కాళ్ళు కట్టేసి ఈడ్చుకుంటూ గ్రాండ్ ట్రంక్ రోడ్డెక్కాడు.


కోటముందు ఏనుగంత అడవిపంది. దాని ముందు ఈటె పట్టుకొని దర్పంగా నిలబడి వున్నాడు బండరాజు. వంటి చేత్తో ఒంటిపందిని కొట్టితెచ్చిన బండ్రాజు ఘనత రాచనగరి అంతా పాకిపోయింది. తండోపతండాలుగా వచ్చేస్తున్నారు జనం.

విషయం తెలుసుకున్న దివాన్‌తోపాటూ రహదారి బంగళాలో వున్న ఇంగ్లిష్ దొరలు కూడా వచ్చేశారు. ఓ ఇంగ్లీషోడు పందికీ, ఈటె పట్టుకున్న బండ్రాజుకీ ఓ ఫోటో కూడా తీశాడు.

బండ్రాజుని తన ప్రధాన అంగరక్షకుడిగా నియమించుకొన్నట్టు ప్రకటించారు దివాన్. జనంలో నిలబడ్ద శెట్టి తన వైపు చూస్తుంటే, తన భుజం మీద చేయి వేసిన దివాన్ని కళ్ళెగరేసి చూపించాడు బండ్రాజు.

ఆ రోజు నుంచీ ధర్మసత్రంలో కనిపించిన సాధువుకల్లా అడగకుండానే రెండేసి బూర్లు వడ్డించడం మొదలెట్టాడు నరసరాజు.