శూన్యం చెక్కిన శిల్పం

ఊహ కందని ఉదాసీనత
బరువుకాని బరువై
ఎద మీద వాలుతున్నప్పుడు
మూసీ మూయని నా కనురెప్పల మాటున
కదలీ కదలని ఒంటరి మౌనమేదో
దైన్య చిత్రాలను చెక్కుతుంటుంది.

దిగులు గుదిబండ
గుండెమీద రాతి పాదం మోపుతున్నప్పుడు
తెరచీ తెరువని నా తలపు తలుపుల వెనుక
తెలిసీ తెలియని ఏకాకి మూగ భావమేదో
అశ్రు వాక్యాలను ఎక్కుపెడుతుంటుంది.

చెప్పీ చెప్పక వచ్చిన తుఫాను
నా పూలపాటలను చెరిపేస్తున్నప్పుడు
నేను మూర్చిల్లిన నీరవ నిశ్శబ్దంలోకి
నిర్వికారంగా నిర్గమిస్తుంటాను.

ఆ అశాంత సాయంతనాన
నా అణుగోళ కక్ష్యా౦తర అసీమ
విశ్వా౦తరాళమై విస్తరిస్తుంటుంది;
స్థాణువై పోయిన
నా శుష్క మానసం ముందు
నా ప్రతిబింబంలా
శూన్యం చెక్కిన చలనహీన
బృహత్ విగ్రహం!