అష్టమాత్రావృత్తములు

పరిచయము

పాటలలో, పద్యములలో చతుర్మాత్రలను ఎక్కువగా ఉపయోగిస్తారు. ప్రాకృతములోని గాథా, పజ్ఝటికా, సంస్కృతములోని ఆర్యా, కన్నడ తెలుగు భాషలలోని కందము, కొన్ని రగడలు, షట్పదులు చతుర్మాత్రా భరితమయినవి. ఉపగణములైన ఇంద్రగణములలో న-ల, భ-గణములు చతుర్మాత్రలు. చతుర్మాత్రలు ఐదు, అవి – IIII, IIU, UII, UU, IUI. ఇందులో చివరిదైన జ-గణము లగారంభమై ఎదురు నడకను కలిగియున్నది. సంస్కృత ఛందస్సులో ఉండే చతుష్చతుర్మాత్రా వృత్తములను గుఱించిన కొన్ని విశేషాలను క్రింద తెలుపుచున్నాను.

  1. 5 చతుర్మాత్రలతో మొత్తము వృత్తములు – 625.
  2. 5 చతుర్మాత్రలతో గుర్వంతమగు వృత్తములు – 250.
  3. 4 చతుర్మాత్రలతో ఎదురు నడక లేని వృత్తములు – 256.
  4. 4 చతుర్మాత్రలతో ఎదురు నడక లేక గుర్వంతమయిన వృత్తములు – 128.
  5. ఛందశ్శాస్త్రములో ఎదురు నడక లేక పేర్కొనబడినవి – 68 (ఇది నా గణన, ఇంక కొన్ని ఉండవచ్చును.)
    *అందులో లఘ్వంతములు – 9
  6. ఛందశ్శాస్త్రములో ఎదురు నడకగల జ-గణముతో పేర్కొనబడినవి – 15 (ఇది నా గణన, ఇంక కొన్ని ఉండవచ్చును)
    *అందులో లఘ్వంతములు – 1

(*నేను సృష్టించిన వృత్తములను ఇందులో కలుపలేదు.)

చాల ప్రసిద్ధమైన చతుష్చతుర్మాత్రా వృత్తములు విద్యున్మాలా, రుగ్మవతీ, మత్తా, దోధక, మోటనక, భ్రమరవిలసితా, తామరస, తోటక, మోదక, ప్రహరణకలితా, శశికలా, జలోద్ధతగతి, మౌక్తికదామ వృత్తములు. ప్రతి పాదమును రెండుగా విఱిచి మాత్రాగణములకు తగినట్లు పదములను వాడి, యతిని కూడ మూడవ మాత్రాగణముతో ఉంచినప్పుడు ఈ వృత్తములు గానయోగ్యములుగా ఉంటాయి.

ఒక అష్టమాత్రగా రెండు చతుర్మాత్రలు – చతుర్మాత్రలతో నిండిన కొన్ని పాటలలో, కొన్ని ఛందస్సులలో ఒక్కొక్కప్పుడు రెండు చతుర్మాత్రలకు బదులు మధ్య గురువుతో ఒక అష్ట మాత్రను కూడ వాడుతారు. చతుర్మాత్రలతో ఉండే కొన్ని జయదేవుని అష్టపదులలో అక్కడక్కడ అష్టమాత్రలను చూడవచ్చును, ఉదా.

మదన మహీపతి “కనకదండరుచి” కేసర కుసుమ వికాసే
మిళిత శిలీముఖ పాటల పటల కృతస్మర తూణ విలాసే – (అష్టపది 3.4)

గోప కదంబ నితంబవతీ ముఖ చుంబన లంభిత లోభం
“బంధుజీవ మధు”రాధర పల్లవ కలిత దరస్మిత శోభం – (అష్టపది 5.3)

ఇలాటి ఉదాహరణములు పాదమునకు నాలుగు చతుర్మాత్రలు గల మధురగతి రగడలో, పాదమునకు ఎనిమిది మాత్రలు గల హరిగతి రగడలో కూడ వెదికినప్పుడు ప్రత్యక్షమవుతాయి. క్రింద దీనికి ఉదాహరణములు –

శేషము వేంకటకవి శశాంకవిజయము, మధురగతి రగడ, 2-118:

“ఇంతి యెక్కడివె” – యీ కోరకములు
చెంతను నుండి-చ్చెద కోరకములు

తిమ్మావజ్ఝల కోదండరామయ్య అన్నమయ్య ఉదాహరణములో, హరిగతి రగడలోని చతుర్థీ విభక్తి కళిక:

పాయని యనురా”గమున రాగమున” – బాడెడు గాయక కవి గురువునకై
పెదతిరుమలకవి పేర గవిని గని – “పేర్మి జెందు బం”గారు కడుపుకై
సదమల కృతిచి”త్రముల నాదకవి” – “జరపినట్టి రం”గారు నిడుపుకై
కుల మెల్లను గవులును గాయకులను – “గొప్ప జెప్పికొన” నొప్పిన గురుకై

కంద పద్యములలోసరి పాదములలోని రెండవ, మూడవ (నల/జ గణము) చతుర్మాత్రలను లయకొఱకు ఐదు, మూడు మాత్రలుగా విఱుచుట సర్వసామాన్యము. ఉదా.

మగువా! నీ కొమరుఁడు మా
మగవా “రటు పోవఁ జూచి” – మంతనమునకుం
దగఁ జీరి పొందు నడిగెను
జగముల “మున్నిట్టి శిశువు” – చదువంబడెనే? – (పోతన భాగవతము, దశమ-పూర్వ-321)

ఎనిమిది మాత్రలతో వృత్తములు

ఈ వ్యాసములో నేను చర్చించబోయే విషయము, పాదమునకు 16 మాత్రలు కలిగి ఉండి, అందులో రెండు అర్ధ భాగములలో ఏ ఒక్కటిలోనైనను, లేక, రెండింటిలో కూడ రెండు నాలుగు మాత్రలు కాని ఎనిమిది చతుర్మాత్రలు ఉండే వృత్తములను గుఱించి. అనగా ఈ వృత్తములలోని పాదముల అమరిక క్రింది విధములుగా నుంటుంది –

  1. స్వాగత వర్గము – 8 / (4-4 )
  2. మాలతీ వర్గము – (4-4) / 8
  3. రథోద్ధత వర్గము – 8 / 8

ఈ వర్గములలో ప్రసిద్ధమయిన వృత్తముల పేరులను వర్గమునకు ఉంచినాను. వివిధ మాత్రా గణముల సంఖ్యను విరహాంక-హేమచంద్ర సంఖ్యలు (Fibonacci numbers) తెలుపుతాయి. దీని ప్రకారము 1 నుండి 8 వఱకు మాత్రల సంఖ్యలున్న మాత్రాగణములు 1, 2, 3, 5, 8, 13, 21, 34. అనగా 8 మాత్రలతో 34 మాత్రాగణములు గలవు. వీటిలో నాలుగు మాత్రాగణములను పక్క పక్కన ఉంచితే మనము 5×5=25 (నాలుగు మాత్ర గణముల సంఖ్య 5) పొందవచ్చును (ఉదా. IUIIUI, UIIIIU, ఇత్యాదులు). మిగిలిన తొమ్మిది అష్టమాత్రా గణములు వేఱు విధముగా వచ్చును. ఆ తొమ్మిది అష్ట మాత్రా గణములు – UIUIU, UIUUI, UIUIII, IIIUIU, IIIUUI, IIIUIII, IUUIU, IUUUI, IUUIII. ఇందులో మొదటి ఆఱు అష్ట మాత్రా గణములకు ఎదురు నడక (అనగా లగారంభము) లేదు, అందులో రెండు మాత్రమే గుర్వంతములు. ఈ ఆఱు అష్టమాత్రలతో ఏ విధముగా పాదమునకు 16 మాత్రలు గల వృత్తములను కల్పించ వచ్చునో అనే విషయమును ఇప్పుడు గమనిద్దాము.

అష్ట మాత్రాగణములు – UIUIU, IIIUIU, UIUUI, UIUIII, IIIUUI, IIIUII
చతుర్మాత్రా గణములు – UU, IIU, UII, IIU

[సూచన: పూ – పూర్వ భాగము, ఉ – గుర్వంతముగా ఉత్తర భాగము, * – నేను కల్పించిన వృత్తము]


1. స్వాగత వర్గము

మొదటి చిత్రము – స్వాగత వర్గము – పూ 8, ఉ 4/4 – మొత్తము 48 వృత్తములు (6x4x2)

వ్యాసములోని వృత్తములు – నిర్మేధా, శ్రేయ*, మాధురి*, పల్లవి*, కనకవల్లీ*, స్వాగతము, జాబిలి*, ద్రుతపదము, చంద్రవర్త్మ.


2. మాలతీ వర్గము

రెండవ చిత్రము – మాలతీ వర్గము – పూ 4/4, ఉ 8 – మొత్తము 32 వృత్తములు (4x4x2)

వ్యాసములోని వృత్తములు – దీపకమాలా, విరాట్, సీధు, ఉత్పలరేఖా$, నీలా, మాళవికా, మాలతీ, విరలా, అవిరలరతికా, శ్రావణ*, ఉపలేఖా, విరతప్రభా, వికలవకులవల్లీ, కమలదళము*.


3. రథోద్ధత వర్గము

మూడవ చిత్రము – రథోద్ధత వర్గము – పూ 8, ఉ 8 – మొత్తము 12 వృత్తములు (6×2)

వ్యాసములోని వృత్తములు – కర్ణపాలిక, మాధవ*, కనకమంజరి, సుకర*, రథోద్ధత, ఉపదారిక, వాక్ఝరీ*, ప్రియంవద, సురస*, అశోక*, ముకుళితకళికావళి, కుసుమకోమల*.

[($) – ఇక్కడ ఉత్పలరేఖను గుఱించి ఒక రెండు మాటలు చెప్పాలి. ఫేస్‌బుక్‌లో ఛందస్సు అనే ఒక కూటమి ఉన్నది. అందులో శ్రీ ధనికొండ రవిప్రసాద్‌గారు చంపకోత్పలమాలలో యతి స్థానమునుండి పాదాంతమువఱకు గల అక్షరములతో, అనగా UII UII UIUIU అమరికతో ఉత్పలరేఖ అను వృత్తమును కల్పించినారు. ఆ కల్పన నన్ను ఆకర్షించి ఈ పరిశోధనలకు దారి తీసినది. ఈ వర్గములకు చెందిన వృత్తములను తెలుగు కవులు అరుదుగా వాడినారు. నాకు తెలిసిన కొన్ని ఉదాహరణములను అక్కడక్కడ తెలిపినాను.]

స్వాగత వృత్తము

స్వాగత వృత్తము చాల పురాతనమైనది. ఇది దోధక వృత్తములో [దోధకము – 11 త్రిష్టుప్పు 439 భ/భ/భ/గగ UII UII – UII UU] మూడవ, నాలుగవ అక్షరములను తారుమారు చేయగా స్వాగత వృత్తము జనించినదని అమూల్యధన్ ముఖర్జీ (1) అభిప్రాయ పడెను. కాలిదాసాది కవులు ఈ వృత్తమును వాడిరి. రఘువంశమునుండి ఒక ఉదాహరణము –

కుంభపూరణభవః పటురుచ్చై
రుచ్చచార నినదోఽంభాసి తస్యాః
తత్ర స ద్విరదబృంహితశంకీ
శబ్దపాతినమిషుం విససర్జ – (కాలిదాసుని రఘువంశము, 9.73)

(తమసానదీజలముల నుండి కుండను నింపునప్పుడగు శబ్దమువలె ఒక గంభీర నాదము జనించినది. బహుశా అది ఏనుగులవలన జనించినదనుకొని ఆ దిక్కుగా దశరథుడు బాణమును ఎక్కుబెట్టాడు.)

ఇదే స్వాగతపు వృత్తములో నా అనువాదము –

నింపగా ఘటము – నీళ్ళను లోతౌ
గంపనంపు సడి – గల్గును, మత్తే-
భంపు నాదమను – భావనతోఁ దా
బంపె నా దెసకు – బాణము నొండున్

స్వాగత వృత్తము ఏ విధముగా నుండినప్పుడు పద్యము శోభాయమానముగా నుంటుందో అన్న విషయమును క్షేమేంద్రుడు ఈ విధముగా తెలియజేసెను –

సాకారాద్యైర్విసర్గాంతైః
సర్వపాదైః సవిభ్రమా
స్వాగతా స్వాగతా భాతి
కవికర్మ విలాసినీ – (క్షేమేంద్రుని సువృత్త తిలకము, 2-15)

(స్వాగతా వృత్తమునకు ఆదిలో ఆ-కారము, అంతములో విసర్గము అన్ని పాదములలో ఉండినచో, అది మంచి నడక కలదై కవితావిలాసినిగా నుండును.)

తెలుగులో ఆదికవులయిన నన్నయభట్టు, నన్నెచోడుడు స్వాగత వృత్తమును ఉపయోగించారు. ఆ పద్యములు –

వేగవంతుఁ డను – వీరుఁడు సాంబున్
వేగవంతుఁడయి – వీఁకను దాఁకెన్
వేగ బాణపద-వీతతులన్ ది-
గ్భాగముల్ విశిఖ – పంజరములుగాన్ – (నన్నయభట్టు ఆంధ్రమహాభారతము – అరణ్యపర్వము 1.158)

ఆ గిరీంద్రసుత – హర్షముతో శై
వాగమోదిత వి-ధాయతితో సు
స్వాగతాభిమత – వాక్యములం ద
భ్యాగతోచిత స-పర్యలఁ దన్సెన్ – (నన్నెచోడుని కుమారసంభవము – 7.5)


స్వాగత వర్గములో 48 వృత్తములు సాధ్యము, అందులో నాలుగింటికి ఛందోగ్రంథములలో లక్షణములు గలవు, ఆఱింటిని నేను కల్పించి లక్షణ లక్ష్యములను చూపినాను. ఒక్కొక్క వృత్తమునకు ఒక్కొక్క లక్షణమును ఇక్కడ ఇస్తున్నాను.

నిర్మేధా – న/త/మ/గ IIIUUI – UU UU
10 పంక్తి 40

భవములో నీవు – భావమ్మై రా
రవములో నీవు – రాగమ్మై రా
కువముగా నీవు – క్రొత్తావిన్ రా
నవముగా నీవు – నాకై రావా
(కువము = కలువ)

శ్రేయ – ర/న/మ/గ UIUIII – UU UU
10 పంక్తి 59

రాసకేళికకు – రావా యిప్డే
హాస కౌముదికి – నందమ్మీయన్
నీ సమాన మిల – నీవే గాదా
దాసుడైతి హరి – దాసుండైతిన్

మాధురి – ర/య/స/గ UIUIU – UII UU
10 పంక్తి 203

మానసమ్ములో – మాధురి నిండెన్
గానవార్ధిలో – గంగయుఁ జేరెన్
తేనెలూరు యీ – తెల్గు పదమ్మున్
నేను వింటిగా – నేఁడు ప్రియమ్మై

పల్లవి – ర/ర/స/గ UIUUI – UII UU
10 పంక్తి 211

ఆడె నా జింక – లాతరు ఛాయన్
చూడు నీరెండ – సొంపుల కాంతిన్
కూడ రావేల – కోమల వేళన్
పాడ గీతమ్ము – పల్లవితోడన్

కనకవల్లీ – న/ర/భ/గగ IIIUIU – UII UU
11 త్రిష్టుప్పు 408

కనకవల్లి నన్ – గానఁగ రారా
యనఘ కంద యీ – యందము నీదే
నెనరుతోడ నా – నెమ్మిలితోడన్
గనుల పండువై – గాముని రూపై

స్వాగతము – ర/న/భ/గగ UIUIII – UII UU
11 త్రిష్టుప్పు 443

నా గళమ్మునకు – నాలుక నీవా
రాగరాగిణుల – రమ్యత నీవా
వేగవంతమగు – ప్రేమకు నావా
స్వాగతమ్మిదియె – చక్కఁగ రావా

జాబిలి – ర/య/న/లగ UIUIU – UII IIU
11 త్రిష్టుప్పు 971

చందమామ రా – జాబిలి త్వరగా
చిందులేసి రా – చిందుచు సుధలన్
వంద పూలు తే – పాపకు సరమై
సుందరమ్ముగా – జోలకు వెలుఁగై

ద్రుతపదము – న/భ/జ/య IIIUIII – UII UU
12 జగతి 888

అదరిపోకు కల – లందున నీవున్
ముదము నిండఁగను – ముద్దుల కన్నా
నిదురపో త్వరగ – నీరజనేత్రా
మృదువుగా జగతి – మీలితమయ్యెన్

చంద్రవర్త్మ – ర/న/భ/స UIUIII – UII IIU
12 జగతి 1979

ఇంద్రనీలమణు – లెల్లెడఁ గనఁగా
మంద్రమైన స్వర – మాధురి వినఁగా
సాంద్ర మయ్యె మదిఁ – జక్కని ముదముల్
చంద్రవర్త్మవలె – సాఁగెను పథముల్
(చంద్రవర్త్మ = చంద్రుని మార్గము)

మాత్రా స్వాగతము – స్వాగతవృత్తపు లయతో ఇంతవఱకు మొత్తము తొమ్మిది పద్యములు పరిచయము చేయబడినవి. స్వాగత వృత్తపు లయతో మాత్రా స్వాగత వృత్తములను కల్పించ వీలగును. ఇందులో మొదటి భాగములో రెండు చతుర్మాత్రలు కాని అష్టమాత్ర, రెండవ భాగములో రెండు చతుర్మాత్రలు. ఏ అష్టమాత్రనైనను, ఏ చతుర్మాత్రనైనను ఉపయోగించవచ్చును. యతి ప్రాసలు ఉన్నాయి. అందువలన ఇది ఒక జాతి పద్యము అవుతుంది. ఇట్టి మాత్రా స్వాగత వృత్తములను మలయాళ ఛందస్సులో వాడుతారు. క్రింద ఒక ఉదాహరణము –

మాత్రా స్వాగతము –
పూర్వ భాగము – 6 అష్టమాత్రలలో ఒకటి
ఉత్తర భాగము – 4 చతుర్మాత్రలలో ఒకటి, UU లేక IIU

సుమధురమ్ముగా – సుందరతరమై
భ్రమలు దొల్గఁగాఁ – బాడుమ యిపుడే
సుమమువోలె నతి – సొగసుగఁ బూయున్
విమలమై మదియుఁ – బ్రేమముతోడన్

మాలతీ వృత్తము

మాలతీవర్గములో మాలతీవృత్తము పురాతనమైనది. దీనికి యమునా, తతి అని కూడ పేరులు గలవు. అపరవక్త్రా అనే అర్ధసమ వృత్తములో సరి పాదములు మాలతీ వృత్తమునకు సరిపోతాయి. ఈ అపరవక్త్రా అర్ధసమ చతుష్పది నాట్యశాస్త్రములో కూడ ఉన్నది. ఆ ఉదాహరణమును క్రింద ఇస్తున్నాను –

అపరవక్త్రా –
బేసి పాదములు – న/న/ర/లగ III III – UIUIU
సరి పాదములు – న/జ/జ/ర IIII UII – UIUIU

సుతను జలపరీతలోచనం
జలదనిరుద్ధ మివేందుమండలం
కిమిద మపరవక్త్ర మేవతే
శశివదనేద్య ముఖం పరాన్ముఖం

(ఓ శశిముఖీ, నీ కన్నులలో నీళ్ళెందుకు, మేఘములు కప్పిన చంద్రుడిలాగున్నవు, నీ ముఖము మఱియొకరి ముఖములాగున్నది.)

అదే వృత్తములో నా అనువాదము –

కనుల జలము – కల్గియుంటివే
ఘనములు కప్పిన – గల్వఱేఁడనన్
వనిత యపర-వక్త్రమున్ ధరిం-
చెనొ యన నుంటివి – సిందుజాననా

వరాహమిహిరుని బృహత్సంహితలో గ్రహగోచరాధ్యాయములో మాలతీ వృత్తము ప్రస్తాపించబడినది. ఆ పద్యము –

రిపుగద కోప భయాని పంచమే
తనయకృతాశ్చ శుచో మహీసుతే
ద్యుతిరపి నాస్య చిరం భవేత్ స్థిరా
శిరసి కపేరివ మాలతీ యథా – (వరాహమిహిరుని బృహత్సంహిత, 104.14)

(కుజుడు జన్మరాశినుండి ఐదవ రాశిలో ఉంటే, శత్రువు, రోగము, భయము, క్రోధము, పుత్రుల వలన శోకము కలుగుతుంది. ఒక కోతి తలపైన మాలతీపుష్పము స్థిరముగా క్రింద పడక ఏ విధముగా నుండదో, అదే విధముగా ఈ మనుష్యులు కాంతివంతముగా చాల కాలము ప్రకాశించరు.)

కుజుఁ డయిదై మనఁ – గోపతాపముల్
రుజయు భయమ్ము వి-రోధ మిచ్చు స్వ-
ప్రజయును శక్తియుఁ – బల్లటిల్లుగా
మజ యిది మాలతి – మర్కటమ్ముపై
(నా అనువాదము)

మాలతీ వర్గములో 32 వృత్తములు సాధ్యము, అందులో పది వృత్తములకు ఛందోగ్రంథములలో లక్షణములు గలవు, రెండింటిని నేను కల్పించి లక్షణ లక్ష్యములను చూపినాను. ఉత్పలరేఖా ధనికొండ రవిప్రసాద్‌గారి సృష్టి. ఒక్కొక్క వృత్తమునకు ఒక్కొక్క లక్షణమును ఇక్కడ ఇస్తున్నాను.

దీపకమాలా లేక పూలదండ – భ/మ/జ/గ UII UU – UIUIU
10 పంక్తి 327

సోముని గాంతుల్ – సుందరమ్మురా
వ్యోమపు తారల్ – బూలదండరా
ప్రేమము నిండన్ – బిల్చుచుంటి నీ
యామని రాత్రిన్ – హ్లాద మీయ రా

విరాట్టు లేక శుద్ధవిరాట్టు – మ/స/జ/గ UU UII – UIUIU
10 పంక్తి 345

రావా సంద్రపు – రంగు నీవెగా
రావా వేణువు – రాగ మూఁదగా
రావా వెన్నెల – రాస మాడఁగా
రావా యీ హృది – రంగవల్లిగా

సీధుః లేక అపరాంతికా – స/భ/ర/లగ IIU UII – UIUIU
11 త్రిష్టుప్పు 692

విరహజ్వాలల – వేఁగుచుంటి నా
కరయన్ సీధువె – యయ్యె నేస్తమై
కరమం దుంచితి – గాజు పాత్ర నే
వరమై త్రాగెద – బాధఁ బాయఁగా

ఉత్పలరేఖా – భ/భ/ర/లగ UUI UUI – UIUIU
11 త్రిష్టుప్పు 695

కెంపుల నభ్రము – కేరి చల్లెఁగా
సొంపుగఁ బుల్గులు – సోలి యాడెఁగా
వంపులతో నది – పారె రమ్యమై
యింపులతో నను – నిప్డె చేర రా

నీలా లేక ఉద్యత – త/న/ర/లగ UU IIII – UIUIU
11 త్రిష్టుప్పు 701

అమ్మా బ్రదుకున – కమ్మ నీవెగా
అమ్మా చదువుల – కమ్మ నీవెగా
అమ్మా జగమున – కమ్మ నీవెగా
అమ్మా వదలకు – మమ్మ యెప్పుడున్

మాళవికా – త/జ/స/లగ UU IIU – IIIUIU
11 త్రిష్టుప్పు 749

కావేరిగ రా – కదలియాడుచున్
సావేరిగ రా – స్వరము పాడుచున్
దేవేరిగ రా – త్రికరణమ్ములన్
నీవిప్పుడు రా – నెనరు దీపమై

మాలతీ 1392 న/జ/జ/ర IIII UII – UIUIU
12 జగతి 1392

మఱచితివా నను – మాలతీలతా
కరములతో నిను – గౌగిలించితిన్
సరసములాడుచుఁ – జాల సేపు నీ
శిరసునఁ జల్లితి – శీతలాంభువున్

విరలా – స/న/జ/ర IIU IIII – UIUIU
12 జగతి 1404

మధుమాసము ప్రియ – మందహాసమా
హృదయమ్మున గల – ప్రేమభావమా
ముదమిచ్చెడు మృదు – మోహపాశమా
కదలించెడు యొక – కామరూపమా

అవిరలరతికా – భ/న/జ/ర UII IIII – UIUIU
12 జగతి 1407

లేకను చదువుము – లేఁతయైన యీ
మూక హృదయమున – మ్రోఁగు గీతికన్
చేకొను వలపుల – చిన్న దీవియన్
చీఁకటి తొలగఁగఁ – జేర గమ్యమున్

శ్రావణ – భ/స/న/ర UII IIU – IIIUIU
12 జగతి 1503

దేవుని గుడిలో – దివెగ మారనా
భావపు సెలలో – పరుగు తీయనా
జీవన గతిలో – చెలిమి నీయనా
శ్రావణమున నే – జలము గార్చనా

ఉపలేఖా – స/భ/న/ర IIU UII – IIIUIU
12 జగతి 1524

వనితా యేడ్వకు – వరుఁడు వచ్చి నిన్
గని దా మెచ్చును – గలఁతఁ జెందకే
మనమున్ జొచ్చును – మదనకేళిలో
వనజాతాక్షుఁడు – వలచుఁ గూర్మితో

విరతప్రభా – భ/భ/న/ర UII UII – IIIUIU
12 జగతి 1527

ఏమని పాడెద – నిపుడు నీకు నీ
యామని రోజున – నలరు పూల యా-
రామమునందున – రమణతో సకీ
ప్రేమకవిత్వపు – ప్రియ రవమ్ముగా

వికలవకులవల్లీ – న/న/త/త IIII IIU – UIUUI
12 జగతి 2368 (లఘ్వంత వృత్తము)

కనులకు కనులే – కమ్మ వ్రాయంగ
మనసుకు మనసే – మాల వేయంగ
తనువును దనువే – తాకి యూఁగంగ
విను మిఁక తలఁపే – ప్రేమగీతమ్ము

కమలదళము – న/జ/న/జ/గ IIII UII – IIIUIU
13 అతిజగతి 3056

కమలదళమ్ముల – కనుల వానికిన్
విమల కలాపము – వెలుఁగు వానికిన్
సుమముల మాలల – సొబగు వానికిన్
నమనము లిచ్చెద – నగుల వానికిన్

మాత్రా వృత్తముగా మాలతి – మాలతీ వృత్తమునకు పూర్వార్ధ భాగములో రెండు చతుర్మాత్రలు, ఉత్తరార్ధ భాగములో రెండు చతుర్మాత్రలు కాని ఒక అష్టమాత్ర ఉంటాయి. ఈ లక్షణములతో నిండిన వృత్తములు పరిచయము చేయబడినవి. ఇప్పుడు మాలతీ వృత్తమును ఒక మాత్రా మాలతిగా తెలుపుచున్నాను. ఇందులో చతుర్మాత్రల స్థానములో నాలుగు చతుర్మాత్రలలో ఏదైనను, అష్టమాత్రల స్థానములో రెండింటిలో ఏదైనను ఒకటి వాడవచ్చును. యతి ప్రాసలు ఉన్నాయి, అందువలన ఇది ఒక జాతి పద్యము. మాత్రా మాలతీ వృత్తమునకు ఒక ఉదాహరణము –

మాత్రా మాలతి –
పూర్వ భాగము – 4 చతుర్మాత్రలలో ఒకటి
ఉత్తర భాగము – 6 అష్టమాత్రలలో ఒకటి, IIIUIU లేక UIUIU

విరిసిన వెన్నెల – పిండియయ్యెనో
కురిసిన మంచులు – కుప్పలయ్యెనో
మురిసిన మనసులు – పూవులయ్యెనో
హరుసము లెల్లెడ – నమృతమయ్యెనో

రథోద్ధతము

పురాతన వృత్తములలో (అనగా సుమారు రెండు వేల సంవత్సరాలుగా వాడబడినవి) రథోద్ధత ఒకటి. వాల్మీకి రామాయణములో లేకున్నను, వ్యాసుని మహాభారతములోని శాంతి పర్వములో రెండు పద్యములు[2] రథోద్ధత వృత్తములో నున్నవి. అవి ముందే ఉండినవా, లేక తఱువాతి కాలములో చేర్చబడినవా అన్నది వివాదాంశము. అందులో ఒకటి క్రింద ఉదాహరించబడినది.

యచ్చతే మనసి వర్తతే పరం
యత్రచాఽస్తి తవ సంశయః క్వచిత్
శ్రూయతామయమహం తవాగ్రతః
పుత్ర కిం హి కథయామి తే పునః

నాట్యశాస్త్రములో కూడ రథోద్ధత అదే పేరుతో పేర్కొనబడినది. అందులోని ఉదాహరణము –

కిం త్వయా సుభటా దూరవర్జితం
నాత్మనో న సుహృదాం ప్రియం కృతం
యత్పలాయన పరాయణస్య తే
యాటి ధూలి రధునా రథోద్ధతా

(ఇలా యుద్ధభూమి నుండి పారిపోవడము సరియేనా, అది నీకు, నీ వారికి ఎట్టి మేలును కలిగించదు, ఎందుకంటే నీ రథము లేపే దుమ్ము ఇద్దరికీ మంచిది కాదు.)

పోరులో వెనుక – పోవుచుంటివే
పారిపోవుటయు – పాడియా భటా
తేరు ధూళి యది – తెచ్చు ముప్పు నీ
వారికం చెఱుఁగ-వా రథోద్ధతా
(నా అనువాదము)

రథోద్ధత వృత్తమును కాలిదాసాదికవులు ఎక్కువగా వాడినారు. క్రింద రఘువంశమునుండి ఒక ఉదాహరణము –

మాతృవర్గ చరణం స్పృశౌ మునేః
తౌ ప్రపద్య పదవీం మహౌజసః
రేజతుర్గతివశాత్ప్రవర్తినౌ
భాస్కరస్య మధుమాధవావివ

(రామలక్ష్మణులు మాతృవందనము చేసి, విశ్వమిత్రుని వెంట వెళ్ళుచుండగా, సూర్యుని పరిధిలో ఉండే చైత్రవైశాఖ మాసములవలె కనిపించినారు.)

వందనమ్మొసఁగి – వారి తల్లికిన్
ముందు సాగిరి త-పోధనుండు ము-
న్ముందు బోవగను – పూషుఁ గక్ష సీ-
మందు నేఁగు మధు – మాధవ మ్మనన్ (నా అనువాదము)

రథోద్ధత వృత్తమునకు పాదాంతములో విసర్గలు ఉన్నయెడల అవి బాగుగా నుండుననియు, ఆ వృత్తము చంద్రోదయాది వర్ణనలకు ఉత్తమమనియు క్షేమేంద్రుడు సువృత్తతిలకములో ప్రస్తావించెను –

విసర్గయుక్తైః పాదాంతైః
విరాజతి రథోద్ధతా
కలాపరిచయైర్యాతా
లటభేవ ప్రగల్భతాం – (క్షేమేంద్రుని సువృత్త తిలకము, 2-13)

(సంగీతము, నాట్యము మున్నగు కళల పరిచయముతో ఒక జాణ ఏ విధముగా ప్రకాశించునో, అదే విధముగా పాదాంతములో విసర్గములుంటే రథోద్ధతా వృత్తము విరాజిల్లుతుంది.)

రథోద్ధతా విభావేషు
భవ్యా చంద్రోదయాదిషు
షాడ్గుణ్య ప్రగుణా నీతి-
ర్వంశస్థేన విరాజతే

(చంద్రోదయము వంటి వర్ణనలకు రథోద్ధతము, రాజనీతియందలి ఆఱు గుణములైన సంధి, విగ్రహము, యాన, ఆసవ, ద్వైధీభావ, సమాశ్రయములను వర్ణించుటకు వంశస్థ వృత్తము బాగుగా నుండును.)

నన్నయభట్టు ఆంధ్ర మహాభారతములో రథోద్ధతవృత్తమును వాడెను. క్రింద ఆ ఉదాహరణము –

హారహీర ధవళాంశు నిర్మలో-
దార కీర్తి రణ-దర్ప సద్గుణా
వైరివీర రస-వైద్య మన్మథా-
కార ధీర పర-గండ భైరవా – (నన్నయభట్టు ఆంధ్రమహాభారతము – సభాపర్వము 2.320)

విశ్వనాథ సత్యనారాయణ రామాయణ కల్పవృక్షములో రెండు చోటులలో వాడెను. క్రింద ఒక ఉదాహరణము –

ఱేని సంతస మె-ఱింగి సూతుఁడున్
దోన వాజులను – దూఁకఁజేఁయగన్
బూనికన్ కదను – బోవఁగా రథా-
స్థాని రాజు మెయి – సాఁగ నూఁగుచున్ – [విశ్వనాథ సత్యనారాయణ, శ్రీరామాయణ కల్పవృక్షము, బాల, ఇష్టి-52]

పాదములోని రెండు భాగములలో అష్టమాత్రలుండుట రథోద్ధత వృత్తపు ప్రత్యేకత. ఎదురు నడక లేక గుర్వంతముగా ఈ లయను పండ్రెండు విధములుగా సాధించవచ్చును. వాటికన్నిటికి క్రింద ఉదాహరణములను ఇచ్చియున్నాను.

కర్ణపాలికా (హరహర, పంక్తికా, మరాళికా, మౌక్తిక) – ర/య/జ/గ UIUIU – UIUIU
10 పంక్తి 331

సోమసుందరా – సోమశేఖరా
రామపూజితా – రామకా ధృతీ
కామనాశనా – కామితార్థమై
శ్రీమహేశ్వరా – క్షేమ మీయరా

మాధవము – ర/ర/జ/గ UIUUI – UIUIU
10 పంక్తి 339

మాధవా రమ్ము – మాధవమ్ములో
మోద మందిమ్ము – పూలకారులో
మోదుగల్ జూడు – పూచె నెఱ్ఱఁగా
నాద మాలించు – నందనమ్ములో

కనకమంజరీ (రాజహంసీ, విభూషణా) – న/ర/ర/లగ IIIUIU – UIUIU
11 త్రిష్టుప్పు 664

కనకమంజరీ – కామలోచనీ
వనవిభూషణా – వర్ణకారికా
ప్రణయమోహినీ – ప్రాణబంధువై
నను గనంగ రా – నాదసింధువై

సుకర – న/త/ర/లగ IIIUUI – UIUIU
11 త్రిష్టుప్పు 680

కలములో నీవు – కావ్యమైతివో
వలపులోఁ గ్రొత్త – భాషవైతివో
తలపులో నాకు – ధైర్య మిత్తువో
మలుపులో నన్ను – మళ్ళి చూతువో

రథోద్ధతము – ర/న/ర/లగ UIUIII – UIUIU
11 త్రిష్టుప్పు 699

చైత్రమాసమునఁ – జంద్రకాంతిలో
నేత్రపర్వమ్ముగ – నిన్ను గాంచఁగా
చిత్రమై మనసు – చిందు హాయిలో
రా తృషన్ మనము – రంజిలన్ సకీ(కా)

రంజితా (ఉపదారికా) – ర/జ/స/లగ – UIUIU – IIIUIU
11 త్రిష్టుప్పు 747

రంజితమ్ముగా – రగులు కాంతితో
సంజ కెంపులే – సరస మాడెఁగా
మంజులమ్ముగా – మధుర రాగిణీ
గుంజనమ్ములే – కులుకుచుండెఁగా

వాక్ఝరీ – ర/భ/స/లగ UIUUI – IIIUIU
11 త్రిష్టుప్పు 755

శారదాదేవి – సరస రమ్ము నీ
నీరజాస్యమ్ము – నిఖిల వేద్యమే
పారిజాతాల – వరుస గూర్చి నీ
హారమై యిత్తు – నమృత వాక్ఝరీ

ప్రియంవద – న/భ/జ/ర IIIUIII – UIUIU
12 జగతి 1400

ఒడయనిన్ గనఁగ – నో ప్రియంవదా
ఒడలు పుల్కలిడె – నూహలన్ సదా
సుడులు గల్గె నన-సూయ నా మదిన్
తడవు సేయునొకొ – ధారుణీశుఁడున్

ప్రియంవద వృత్తమునకు ఒక ఉదాహరణమును రామాయణ కల్పవృక్షములో చదువవచ్చును. అది –

దివిషధీశ్వరుఁడు – తేవ మౌనులున్
గవురు గప్పుచు పొ-గల్ వెలార్పఁగా
నవు తపస్సుల మ-హాగ్ని రేఁగఁగా
నవుర యచ్చరల – నంపు నంటఁగా – (విశ్వనాథ సత్యనారాయణ, శ్రీరామాయణ కల్పవృక్షము, బాల, ఇష్టి-167)

సురస – న/ర/న/ర IIIUIU – IIIUIU
12 పంక్తి 1496

తెలుఁగు పాటలోఁ – దియని దేనెలో
కలుఁగు హాయియే – కడు ముదమ్ముగా
వెలుఁగు బాటలో – వెలయు కాంతిలోఁ
బలుకుచుందమా – పదము లల్లుచున్

అశోక – న/త/న/ర IIIUUI – IIIUIU
12 జగతి 1512

అరుణ రాగమ్ము – లసురసంధ్యలో
తరుణ రాగమ్ము – తరుల ఛాయలో
సరస రాగమ్ము – సరసి గట్టులో
మరుల రాగమ్ము – మనసు లోతులో

ముకులితకలికావలీ – ర/న/న/ర UIUIII – IIIUIU
12 జగతి 1531

మానసోత్కళిక – మఱల విచ్చునో
వేణు సద్రుతము – వినఁగ వచ్చునో
తేనియల్ ఝరిగఁ – దియగ పారునో
వానగన్ గురిసి – వలపు ముంచునో

కుసుమకోమల – న/భ/న/జ/గ IIIUIII – IIIUIU
13 అతిజగతి 3064

అసమమైనయవి – యతివ యందముల్
కుసుమకోమలము – కొమరి యంగముల్
రసపు వాహినులు – రమణి వాక్యముల్
మిసిమి యౌవనపు – మృదుల కావ్యముల్

స్వాగత, మాలతీ వృత్తములవలె రథోద్ధతమును కూడ అష్టమాత్రా గణములతో ఒక జాతి పద్యముగా వ్రాయ వీలగును. క్రింద ఒక ఉదాహరణము –

మాత్రా రథోద్ధతము

పూర్వ భాగము – 6 అష్టమాత్రలలో ఒకటి
ఉత్తర భాగము – IIIUIUలేక UIUIU

నెమ్మలీ చెప్పు – నెనరుఁ జూపునా
నమ్మితిన్ వాని – నగజ నందనున్
గ్రమ్మరన్ వాఁడు – కలియునా ననున్
వమ్ము సేయునా – వాఁడు గోర్కెలన్

కొన్ని విశేషములు

ఇంతవఱకు నేను ఎదురు నడక లేకుండ ఉండు వృత్తములను మాత్రమే పరిచయము చేసినాను. ఎందుకంటే పాడుకొనుటకు ఇట్టివి చక్కగా నుండును. ఎదురు నడకతో (అనగా చతుర్మాత్ర లేక అష్టమాత్ర లగారంభముగా) ఉండు రెండు వృత్తములను లయభేదమును తెలిసికొనుటకై ఇక్కడ వివరించుచున్నాను. అవి మయూరసారిణీ (స్వాగత వర్గము), వర్హాతురా (రథోద్ధత వర్గము).

మయూరసారిణీ – ర/జ/ర/గ UIUIU – IUI UU
10 పంక్తి 171

సారిణిన్ గనన్ – జలమ్ము లెందున్
మారుతమ్ములో – మయూర ఘోషల్
నీరు నిండఁగా – నిసర్గ మెల్లన్
జారు చిత్రమై – జ్వలించెఁ గాదా

వర్హాతురా – త/భ/త/గ UUIUI – IUUIU
10 పంక్తి 309

ఏమందు నిన్ను – హృదిన్ బూజలో
రా ముందు నవ్వి – రసార్ద్రమ్ముగా
నా మానసమ్ము – నవజ్యోతిగా
స్వామీ జపింతు – సదా నామమే

స్వాగత వర్గములోని వృత్తములకు మాలతీ వర్గములోని వృత్తములకు ముఖ్యమైన భేదము ఏమనగా, మొదటి వర్గములో అష్టమాత్ర పూర్వభాగములో ఉంటుంది, రెండవ వర్గములో అష్టమాత్ర ఉత్తరభాగములో ఉంటుంది. వీటిని తారుమారు చేయునట్లు వ్రాసిన వృత్తమునకు ఒక ఉదాహరణము –

స్వాగత వర్గములో మాధురి –
పూలు నీకెరా – మోహన రూపా
తేల జేయరా – దేహళి దీపా
యేల రమ్మురా – యీ హృది నీదే
తాళజాలరా – దాహము నాకున్

దీనిని తారుమారు చేసి వ్రాసినప్పుడు మాలతీ వర్గములో పూలదండ వృత్తపు లయ దీనికి సిద్ధించును –

మోహన రూపా – పూలు నీకెరా
దేహళి దీపా – తేల జేయరా
యీ హృది నీదే – యేల రమ్మురా
దాహము నాకున్ – తాళజాలరా

ముగింపు

చతుర్మాత్రలతో పాటలు అన్ని భాషలలో నున్నవి. చతుర్మాత్రలతో అష్టమాత్రలను చేర్చి వ్రాసినప్పుడు వాటికి ఒక ప్రత్యేకమైన అందము కలుగుతుంది, నడకలో వైవిధ్యము పుట్టుతుంది. ఇట్టి అమరికలు ఈ వ్యాసములో వివరించినట్లు ఛందశ్శాస్త్రములో గలవు. కాని వాటిని వెలికి ఇంతవఱకు ఎవ్వరు తీసికొని రాలేదు. ఈ నా ప్రయత్నము గానయోగ్యమైన ఛందస్సులను కల్పించుటకు సహాయకారిగా నుంటుందని భావిస్తాను. క్రింద అట్టి పాట నొకటిని ఉత్పలరేఖ ఛందస్సులో ఇచ్చి వ్యాసమును ముగించుచున్నాను –

ఎవ్వ రదెవ్వరు – ఎక్కడుంటివో
దివ్వెగ నాహృదిఁ – దేజరిల్లఁగా

ఆలయమందున – మూలమూర్తివో
నీలపు నింగిని – పాలపుంతవో
తాళము తప్పని – కాలి గజ్జెవో
బాలల నిద్రకు – లాలిపాటవో

ఎవ్వ రదెవ్వరు – ఎక్కడుంటివో
దివ్వెగ నాహృదిఁ – దేజరిల్లఁగా

సందెల పొంగెడు – సాగరమ్మువో
చంద్రుని వెన్నెల – చారుకాంతియో
మంద సమీరపు – మత్తు తావియో
అందని తారల – యంశరేఖవో

ఎవ్వ రదెవ్వరు – ఎక్కడుంటివో
దివ్వెగ నాహృదిఁ – దేజరిల్లఁగా

మేలగు సుందర – మేఘమాలవో
ఱాల ద్రవించెడు – రాగమాలవో
మూలలఁ బూచిన – పూలమాలవో
బేల మనస్సున – బ్రేమమాలవో

ఎవ్వ రదెవ్వరు – ఎక్కడుంటివో
దివ్వెగ నాహృదిఁ – దేజరిల్లఁగా


గ్రంథసూచి

  1. Mukkherji, Amulyadhan – Sanskrit Prosody : Its Evolution – Saraswat Library, Calcutta.
  2. Arnold, E. VErnon – Vedic Metre in its Historic Development – Cambridge University, 1905.
జెజ్జాల కృష్ణ మోహన రావు

రచయిత జెజ్జాల కృష్ణ మోహన రావు గురించి: జననం నెల్లూరు (1943).మదరాసులో SSLC వరకు.తిరుపతిలో ఉన్నత విద్యాభ్యాసం. IISc,బెంగుళూరులో Crystallography లో Ph.D పట్టా;1980 దాకా మదురై కామరాజ్ విశ్వవిద్యాలయంలో రీడర్‌గా విద్యాబోధన; తర్వాత అమెరికాలో శాస్త్రజ్ఞునిగా దీర్ఘకాలం ప్రవాస జీవితం. ఛందస్సు మీద విస్తారంగా వ్యాసాలు రచించారు.పాటలు పద్యాలు రాశారు. అనువాదాలు చేశారు.వీరి సుభాషితాల సంకలనం: Today’s Beautiful Gem. ఛందశ్శాస్త్రంలో కృషి,పరిశోధనకు గాను విరోధినామ (2009)సంవత్సరపు బ్రౌన్ పురస్కారాన్ని అందుకున్నారు. ...