అద్దం లా
అందమైన అ
బద్ధం లా
నిశ్చలం గా నా మనసు
బాకం లా
తటాకపు గట్టు పైన
వాకం లా
నిర్నిమేష గా నీ తనువు
అలజడి అలలు రేపుతూ పడుతున్న జ్ఞాపకాల రాళ్ళు
ఓ ధనుర్మాసపు తెల్లారగట్ల
నన్ను దించెళ్ళిపోయిన వాహనపు నల్లటి జ్ఞాప
కాల వలయాల్లో పెట్రో ఫ్యూజనిస్టిక్ రివిజన్ లో రీవిజన్
గాలిలో చిక్కగా తేలుతూ మంచులో
మనిషీకరించుకుంటూ మారుతూ అంతలోనే మసకగా
తాష్కెంట్ డీ జే తిరుప్పావై డిజిటల్ రీమిక్స్
మంచు బాష్పాల మార్బుల్సు నింపుకున్న జేబుల్తో
పిల్ల చిగుళ్ళు కాళ్ళకడ్డం పడుతూ; బోసినోటి నాయనమ్మ నోట్లో
నానుతున్న పొంగలి ప్రసాదపు నల్ల మిరియపు గింజ ఘాటుగా
సిగ్గు పడుతూ బిడియంగా పలకరిస్తూ కరిగిపోయే పదహారేళ్ళ నాటి పాత గుండె సవ్వడి
వాన కురిసి మెరుపు మెరిసి వయసు వురకలేస్తుంది
పిల్ల గాలి తెల్ల మబ్బు పూల గుఛ్ఛాలతో
నీలి ఆకాశమంత పందిరేసి పోతుంది
చూరునుంచి వాన చుక్క వొకటి వొకటి నొకటి గా
వొళ్ళు విరుచుకున్న తనువు నవ్వుతున్న మనసులో
ఏవేవో కొత్త కొత్త స్పందనలను రేపుతుంది కొంటెగా
తెరపిచ్చిన వాన ముద్దు పెట్టుకున్న హరివిల్లు
మబ్బుల కిటికీల నుంచి తొంగిచూసి సూరీడు
తడిగా పొడిగా పచ్చగా వెచ్చగా నవ్వుతాయి ఊరు వాడ
అలా అడుగు బైటికేసాను. కాలువలోంచి బైటికొచ్చి ఒళ్ళు విదుల్చుకుంది ముచ్చటగా ప్రాయంలో వొక చిన్న పంది పిల్ల, ముక్కు చిట్లిస్తూ. చటుక్కున వంగి ముద్దు పెట్టుకున్నాను. అందం మనసుకు తెలియ రానిది. తనువంతా కర్పూరమై మనసు పాడుతున్న మందాక్రాంత పాట. చేతుల్లో అరవిరిసిన మంకెన పూలు. మళ్ళీ వాన కురిసి తెరపిస్తే ఎంత బాగుంటుంది!