పరిచయము
శార్దూల విక్రీడితము (శా.వి.) ప్రాచీనతమ వృత్తములలో ఒకటి. స్రగ్ధరతో ఈ వృత్తము కూడ సంస్కృతములో విరివిగా వాడబడిన నిడుద వృత్తములలో ఒకటి అని చెప్పవచ్చును. ఇది పింగళ ఛందస్సులో, భరతుని నాట్యశాస్త్రములో పేర్కొనబడినది. దీని నడక గంభీరముగా ఉంటుంది. స్రగ్ధరవలెనే ఇది కూడ గురువులతో ఆరంభమవుతుంది. ఈ వృత్తపు పింగళసూత్రము – శార్దూలవిక్రీడితం మూసౌ జూసౌ తౌ గాదిత్యఋషయః, అనగా శా.వి. కి గణములు మ/స/జ/స/త/త/గ, పాదములు పండ్రెండు (ఆదిత్య) అక్షరములు, ఏడు (ఋషి) అక్షరములుగా విఱుగును. ఈ వ్యాసము ద్వారా ఈ వృత్తమును గురించి వివరముగా చర్చిస్తున్నాను.
నిడుద వృత్తముల ఉత్పత్తి
వేద, పురాణేతిహాసములలోని పద్యముల (శ్లోకముల) ఛందస్సు అక్షర సంఖ్యపైన ఆధారపడినవి. ఎక్కువగా ఎనిమిది అక్షరముల అనుష్టుభ్, త్రిపద గాయత్రి, పదకొండు అక్షరాల త్రిష్టుభ్, పండ్రెండు అక్షరముల జగతి ఛందములను మనము ఋగ్వేదాది గ్రంథములలో చూడవచ్చును. జ్ఞాపకము పెట్టుకొనుటకు, ఉచ్చరించుటకు సులభముగా నుండుటకోసం చివరి అక్షరములను ప్రత్యేకమైన గురులఘువుల అమరికతో (ఉదా. IUIU) వ్రాసేవారు. ఒకే శ్లోకములోని పాదములలో అక్షర సంఖ్యలు, పాదముల అమరికలు కూడ భిన్నమై ఉండవచ్చును. క్రింద ఒక ఉదాహరణ –
న రూపమస్యేహ తథోపలభ్యతే
నాంతో న చాదిర్న చ సంప్రతిష్ఠా
అశ్వత్థమేనం సువిరూఢమూలం
ఆసంగశస్త్రేణ దృఢేన ఛిత్త్వా – (భగవద్గీతా, 15.03)
(ఈ అశ్వత్థవృక్షపు రూపమును అవగాహన చేసికొనుటకు వీలుకాదు; దాని ఆద్యంతములు, మూలము ఎక్కడో తెలియదు. దృఢ చిత్తముతో, బంధమును త్యజించి…)
ఈ శ్లోకములో మొదటి పాదము పాదము 12 అక్షరములు గల జగతీఛందములోని వంశస్థ వృత్తము, రెండవ మూడవ పాదములు పాదమునకు 11 అక్షరములు గల త్రిష్టుభ్ ఛందములోని ఇంద్రవజ్ర వృత్తము, నాలుగవ పాదము అదే ఛందములోని ఉపేంద్రవజ్ర వృత్తము.
వైదిక ఛందస్సు
ఋగ్వేదములో వాడబడిన చందస్సును మొదటి చిత్రమునందు గల పట్టికలో గమనించవచ్చును. వేదములలోని త్రిపదలను నేను ఇదే పత్రికలో త్రిపదలపైన (ఉష్ణి, పరౌష్ణి, కకుభ్) వ్రాసిన వ్యాసములో ఉదహరించినాను. ఇందులోని సతోబృహతిని గుఱించిన ప్రస్తావన ఈ వ్యాసమునకు వర్తిస్తుంది. వేదములలో, రామాయణ భారతములలో అక్షర సంఖ్యపైన ఆధారపడిన అనుష్టుభ్, త్రిష్టుభ్ వంటి ఛందములతోబాటు ఇంద్రవజ్ర (UUI UU – IIUI UU), ఉపేంద్రవజ్ర (IUI UU – IIUI UU), ఈ రెంటితో ఉపజాతులు కూడ కనబడుతాయి. పాదమునకు 12, 13 అక్షరములపైన ఉండే ఛందస్సులను ప్రారంభ దశలో వాడలేదు.
పెద్ద వృత్తముల నిర్మాణము
వైదిక ఛందస్సునుండి కావ్యములలో వాడబడిన లౌకిక ఛందస్సుకు వచ్చేసరికి పాదముల గురులఘువుల అమరిక పటిష్ఠమైనది. పెద్ద వృత్తముల నిర్మాణము ఎలా జరుగుతుంది? సులభమైన చిట్కా, రెండు చిన్న వృత్తములను చేరిస్తే ఒక పెద్ద వృత్తము వస్తుంది. రెండు కలా(ళా) వృత్తములను (IUIU, శ్లోకములయందలి సరి పాదములలోని చివరి అక్షరములు) చేరిస్తే ఒక ప్రమాణిక వృత్తము (IUIU IUIU) లభిస్తుంది. రెండు ప్రమాణికలను ప్రక్క ప్రక్కన ఉంచితే అది పంచచామర వృత్తము (IUIU IUIU – IUIU IUIU) అవుతుంది. ఇదే పంచచామరవృత్తములో మొదటి లఘువును తొలగించిన యెడల, మనకు ఉత్సాహజాతికి మూస అయిన సుగంధి (UI UI UI UI – UI UI UIU) లభిస్తుంది. రాజరాజి అనబడే వృత్తమునకు గణములు త/త/గ. ఇందులోని త-గణములకు బదులు ర-గణములను ఉంచినప్పుడు అది హంసమాల (ర/ర/గ) అవుతుంది. ఒక వృత్తమునుండి మఱొక వృత్తమునకు మనము కూడిక, తొలగింపు, ఒకదానికున్న గణములకు బదులు వేఱు గణముల నుంచుట ద్వారా సాధించ వీలగును. దీనినే నేను ఆంగ్లములో insertion, deletion, substitution లేక sub-in-del అంటాను. ఈ సిద్ధాంతముపైన ఆధారపడిన ఒక చిన్న ఆటను కూడ మఱొక చోట వివరించియున్నాను.
అక్షరసంఖ్యపైన ఆధారపడిన శ్లోకములు వేదములలో, పురాణేతిహాసములలో ఎక్కువైనను, కావ్యములలో క్రమబద్ధమైన పాదములతో నిర్దిష్టమైన గురు-లఘువులతో, ప్రతి ఛందస్సుకు ఒక ప్రత్యేకమైన పాదపు విఱుపులతో గల పద్యములను మనము చదువుతాము. ఈ మార్పు ఒకే రోజు వచ్చి ఉండదు. ఇలాటి మార్పు రావడానికి బహుశా ఒక రెండు శతాబ్దములై ఉండవచ్చును. సంస్కృత కావ్యములలో ఎక్కువగా చిన్న వృత్తములనే వాడారు. ఇంద్రవజ్ర, ఉపేంద్రవజ్ర, వంశస్థ, వసంతతిలక, మాలిని, మాత్రాబద్ధ ఛందస్సైన ఆర్య (గాథ) మున్నగునవి లౌకిక ఛందస్సులో వాడబడిన ప్రథమ ఛందోబంధములు. ఈ సమయములో బహుశా నిడుద వృత్తములను వాడవలయుననే ఆశ, అవసరము కవులకు కలిగినది కాబోలు. అప్పుడే శార్దూలవిక్రీడితము, స్రగ్ధరలు పుట్టి యుండవచ్చును.
శా.వి.కి గురులఘువులు – UUUIIUIUIIIU – UUIUUIU. ఇందులో 1-8 అక్షరములు శ్లోకములయందలి సరి పాదములకు సరిపోతాయి. ఎందుకనగా ప్రత్యేకముగా IUIU అమరిక శ్లోకపు సరి పాదములలో మనము చదువుతాము. (ఇదే విషయమును అమూల్యధన్ ముఖర్జీ కూడ ప్రస్తాపించినారు. కాని వారు శా.వి.కి గ్రీకు భాషలోని కొన్ని పద్యములకు గల పోలికను గమనించి వీటికి ఒక సమానమైన ఉత్పత్తి స్థానము ఉన్నదేమో అని ఊహించినారు.) అదే విధముగా చివరి మూడు అక్షరములు కూడ. మఱొక విషయము నా కళ్ళకు కనబడినది, 9-16 అక్షరములను పరిశీలించినయెడల 9-13 అక్షరముల గురులఘువులు 1-5 అక్షరముల గురులఘువులలో గురులఘువులను తారుమారు చేసినప్పుడు కలిగిన ఫలితము. అది క్రింద చూపిన అమరిక ద్వారా గ్రహించవచ్చును. 6-8, 14-16, 17-19 అక్షరముల అమరిక ఒక్కటే (ర-గణము). చివరి ర-గణము లయకై చేర్చబడినదేమో?
UUUIIUIU (1- 8)
IIIUUUIU (9-16) UIU (17-19)
వైదికఛందస్సులోని పట్టికలో (మొదటి చిత్రము) సతోబృహతి అని ఒక ఛందస్సు గలదు. అందులోని పాదములకు 12, 8, 12, 8 అక్షరములు. 12, 8 అక్షరములను ప్రక్క ప్రక్కన ఉంచి, ఒక అక్షరమును తగ్గించినప్పుడు మనకు 19 అక్షరముల పద్యము లభిస్తుంది. శా.వి. వంటి వృత్తములకు పునాది ఇట్టి ఛందస్సుగా కూడ ఉండవచ్చునను అభిప్రాయము ఉన్నది. సతోబృహతికి ఒక ఉదాహరణము –
ఇరజ్యన్ అగ్నే ప్రథయస్వ జంతుభిర్
అస్మే రాయో అమర్తియ
స దర్శతస్య వపుషో వి రాజసి
పృణక్షి సానసిం క్రతుం – (ఋగ్వేదము, 10.140.04)
(అగ్నీ, నీవు జీవంతమైన లోకమునకు పాలకునిగా వ్యాపించుము. అమర దైవమా, మాకు సర్వ సంపదలను ప్రసాదించుము. నీ సౌందర్యము ప్రకాశించుచున్నది. నీ ఆధ్వర్యములో మేము సశక్తులమై విజయమును పొందెదము.)
ఏది ఏమైనా శా.వి. క్రీస్తుశకారంభము నాటికే సంస్కృత కవులకు పరిచితమైన ఛందస్సు. మహాభారతములోని దక్షిణ భారత ప్రతిలోకర్ణ, అనుశాసనిక పర్వములలో శా.వి. ఛందములో నాలుగైదు పద్యములు ఉన్నవి. కాని ఇవి బహుశా ప్రక్షిప్తములని భావించవచ్చును. అశ్వఘోషుని సౌందరనంద కావ్యములో ప్రప్రథమముగా శా.వి. వృత్తమును మనము చదువవచ్చును. ఒక ఉదాహరణము –
భిక్షార్థం సమయే వివేశచ పురౌం – దృష్టౌర్జనస్యాక్షిపన్
లాభాలాభ సుఖాసుఖాదిషు సమః – స్వస్యేంద్రియో నిస్పృహః
నిర్మోక్షాయ చకార తవ చ కథాం – కాలే జనాయార్థినే
నైవోన్మార్గ గతాన్ జనాన్ పరిభవ – న్నాత్మాన ముక్తర్షయన్ – (అశ్వఘోషుని సౌందరనందము, 18.62)
(అతడు భిక్షార్థము నగరప్రవేశము చేసినప్పుడు, ప్రజలు అతడిని గమనించినారు. లాభనష్టములు, సుఖదుఃఖాదులను సమముగా నెంచు నతడు ఇంద్రియములకు అతీతుడు. అక్కడ ఆ క్షణము జనులకు తప్పు దారులను చూపక తన గుఱించి గొప్పలు చెప్పుకొనక ముక్తి మార్గమునుగుఱించి బోధించెను.)
సంస్కృతనాటకరచయితలలో పురాతనుడైన భాసమహాకవి వ్రాసిన ప్రతిమానాటకమునుండి ఒక శా.వి. వృత్తము –
ఆరంభే పటహే స్థితే గురుజనే – భద్రాసనే లంగితే
స్కంధోచ్చారణ నమ్యమాన వదన – ప్రద్యోతితోయే ఘటే
రాజ్ఞాహూయ విసర్జితే మయి జనో – ధైర్యేణ మే విస్మితః
స్వః పుత్రః కురుతే పితుర్యది వచః – కస్తత్ర భో విస్మయః – (భాసుని ప్రతిమానాటకము, 1.5)
(గురుజనుల సమక్షములో పటహ వాద్యములు మ్రోయుచుండగా, మంగళాసనముపైన నేను కూర్చుండగా, మంత్రజలములు పాత్రనుండి పోయబడు సమయములో చక్రవర్తి నన్ను చూడ రమ్మనెనను వార్త నా పేర వచ్చినది. జనులందఱు నా ధైర్యమునకు ఆశ్చర్యపోయారు. స్వపుత్రుడు తండ్రి మాటను పరిపాలించుటలో ఆశ్చర్య మెందుకో?)
శిలాశాసనములలో కూడ శా.వి. పద్యములను అల్లినారు. హరిసేనుడు సముద్రగుప్త చక్రవర్తిని గుఱించి వ్రాసిన ప్రయాగప్రశస్తిలోని క్రింది పద్యము దానికి ఒక ఉదాహరణము –
ఏహ్యోహీత్యుపగుహ్య భావపిశునై – రుత్కర్ణితే రోమభిః
సభ్యేషూచ్ఛ్వసితేషు తుల్యకులజ – మ్లానాననోద్వీక్షితః
స్నేహవ్యాలులితేన బాష్పగురుణా – తత్త్వేక్షిణా చక్షుషా
యః పిత్రాభిహితో నిరీక్ష్య నిఖిలాం – పాహిత్వముర్వీమతిః – (సముద్రగుప్తుని ప్రయాగప్రశస్తి, క్రీ.శ. 360)
(తాము తిరస్కరించబడిరనే మ్లాన వదనములతో సామంతరాజులు చూచుచుండగా, శ్రేయోభిలషులు సంతోషపడుచుండగా, రోమాంచితుడై తండ్రి అట్టి పుత్రుని (సముద్రగుప్తుని) కౌగిలించుకొని ఇతడు సమస్త లోకమును పరిపాలించు చక్రవర్తి అయ్యెనని ఆనందించెను.)
సంస్కృతాంధ్రేతర భాషలనుండి కొన్ని శార్దూలవిక్రీడిత వృత్తములు
తమిళము తప్ప మిగిలిన అన్ని భారతీయ భాషలలో శా.వి.వృత్తములో కవులు వ్రాసినారని అనుకొంటున్నాను. నాకు దొఱకిన కొన్ని ఆంధ్రేతర భాషలైన కన్నడ, మణిప్రవాళ మలయాళము, మరాఠీ, గుజరాతీ, హిందీ భాషలలోని శా.వి.వృత్తమునందలి పద్యములను ఇక్కడ పంచుకొటున్నాను.
కన్నడ –
రంగత్తుంగ తరంగ భంగుర లస – ద్గంగా జళం నర్మదా
స్వంగస్వచ్ఛవనం ప్రసిద్ధ వరదా – పుణ్యాంబు గోదావరీ
సంగత్యోర్జిత వారి సార యమునా – నీళోర్మి నీరం భుజో-
త్తుంగంగీగరిగంగె మంగళమహా – శ్రీయం జయ శ్రీయుమం – (పంపభారతము, 14.31)
(గంగా, నర్మదా, వరదా, గోదావరి, యమునా నదుల నీరములు అర్జునునకు (అరికేసరికి) మంగళమును కలుగజేయుగాక!)
మణిప్రవాళ మలయాళం –
మూణ్ణల్లో పురుషార్థ మిన్నవనిమేల్ – అమ్మూణ్ణిలుం ధర్మమే
మాన్యం మంగళగాత్రి ధర్మమళియుం – కామార్థ యోగే నృణాం
కామార్థంగళ్ నముక్కు ధర్మమవిడె – క్కామేన పోమార్థమె-
ల్లార్కుం నియమం నముక్కు మకళే – అక్కామ మర్థం తరుం – (ఉణ్ణియాడి చరితం)
(కుమారీ, ధర్మము మూడు పురుషార్థములలో ముఖ్యమైనది. కామార్థముల కూడికవలన ధర్మము నశించును. కాని కామార్థములే మన ధర్మములు కదా! సామాన్యముగా ధనము కామమువలన హరించబడును, కాని మనకు కామమే ధనము నిచ్చును గదా!)
హిందీ –
శంఖే ద్వాభమతీవ సుందరతనుం – శార్దూలచర్మాంబరం
కాల వ్యాల కరాల భూషణధరం – గంగా శశాంకప్రియం
కాశీశం కలి కల్మషౌఘ శమనం – కల్యాణకల్పద్రుమం
నౌమిఢ్యం గిరిజాపతిం గుణనిధిం – కందర్పహం శంకరం – (తులసీదాస కవితావలి)
(శంఖములాటి మెడగలవానికి, అందమైన శరీరముగలవానికి, పులితోలు ధరించినవానికి (శార్దూల పదము ముద్రాలంకారముగా వాడబడినది), కాలసర్పమును నగగా ధరించినవానికి, గంగకు, చంద్రునికి ప్రియమైనవానికి, కాశీపతికి, కలికాలపు పాపములను బాపువానికి, మంగళకరమైన కల్పవృక్షమువంటివానికి, గిరిజాపతికి, సద్గుణనిధికి, మదనహరునికి, శంకరునికి నా నమస్కృతులు.)
ఫూలే కంజసమాన మంజు దృగతా – థీ మత్తతాకారిణీ
సోనే సీ కమనీయ కాంతి తన కీ – థీ దృష్టి ఉన్మేషిణీ
రాధా కీ ముసకాన కీ మధురతా – థీ ముగ్ధతా-మూరి సీ
కాలీ కుంచిత లంబమాన అలకే – థీ మానసోన్మాదినీ – (ప్రియప్రవాస)
(మంజులమైన ఆమె మత్తు కలిగించే చూపులు తామరపూల సమానము; బంగారు వన్నెతో దేహపు కమనీయ కాంతి వీక్షకుల కళ్ళను పెద్దగా తెరిపిస్తుంది; రాధ చిఱునవ్వుల మాధుర్యము ముగ్ధ శృంగారదాయి; పొడవైన ఉంగరాల నీల కుంతలములు మనస్సుకు పిచ్చిని పట్టిస్తుంది.)
మరాఠీ –
జో లోకత్రితయీ ఫిరే స్థిర నసే తాటీ జసా పారద
స్వాంతధ్యేయపదీంచ నిశ్చల భవాంబోధీంత జో పారద
జో వర్ణే గగనోదరీం క్షణ దిసే పూర్ణేందు కీ శారద
శ్రీశాంతఃపురచత్వరీంచ ఉతరే తో సన్మునీ నారద – (మోరోపంత్)
(ఒక చోట ఉండని త్రిలోకసంచారి, సంసారసాగరమును తరించుటకు దృఢమైన నిశ్చలమైన మార్గము నెఱిగినవాడు, శరత్కాలచంద్రునిలాటి వన్నె గలవాడు, బ్రహ్మలోకమునుండి దిగివచ్చినాడు నారదమహాముని.)
గుజరాతీ –
ఆవే శాంత సమే శి ఖళ్‌ఖళ వహీ – ఝర్ణే నదీఓ లళీ
సంగీతధ్వని విస్తరే అనిలనీ – ల్హేరో విలాసే ఢలీ
తారామండళ సాథ రాస రచితే – వాళా తరంగోజ్జ్వళా
శీ ఆదర్శసమే సరోవర జళే – నాచే శశీనీ కళా – (కుంజవిహార)
(ఈ నీరవ వేళలో నదులు, నిర్ఝరిణులు సుస్వనములతో ప్రవహించుచున్నవి. ఆ విలాసవంతములైన అలల కలకల ధ్వనిని గాలి అన్ని దిశలకు వ్యాపింపజేస్తున్నది. తారామండల ప్రకాశముతో అవి ప్రకాశముతో జ్వలించుచున్నది. ఈ సముచిత సమయములో సరోవర జలము నెమలిలా నాట్యము చేయుచున్నది.)
సామాన్యముగా శా.వి. అనగా సంస్కృత పదములతో కవులు ఈ వృత్తములను నింపెదరు. అచ్చ తెలుగులో శా.వి. ఏ విధముగా నుండునో అని కొందఱికి ఆసక్తి కలుగవచ్చును. క్రింద అచ్చతెలుగులో ఒక పద్యము –
అమ్మా యెన్నడు నిట్టి చెయ్వులను సే-యంబోను నన్ గొట్టకే
నెమ్మిన్ జూడుము వ్రేఁతలాడు నుడుగుల్ – నీగుండె యందామరన్
నమ్మంబోకు మటంచు వేడుకొని వి-న్నాణెంపు గందమ్ములన్
ముమ్మారంబుగ నీరుఁ జాఱ లలి – మోమున్ ద్రిప్పి తా నేడ్చినన్ – (ఠయ్యాల లక్ష్మీనృసింహాచార్యులు, అచ్చ తెనుఁగు కుబ్జాకృష్ణవిలాసము, 1.181)
(చెయ్వు = పని, వ్రేఁత = దెబ్బ, ఉడుగు = కృశించు, విన్నాణెము = నేర్పు, ముమ్మారము = అధికము, లలి = ప్రేమ)
శార్దూలవిక్రీడిత వృత్తపు గుణగణములు
శా.వి. వీర, రౌద్ర, బీభత్స రసప్రధానమైనది. అందుకే దీనికి బహుశా పులుల చెరలాట అన్నది సార్థకనామమైనది. కాని ఇది భక్తిరసప్రధానమైనది కూడ. అందుకే కాబోలు శంకరాచార్యులు అన్నపూర్ణ, మీనాక్షి, కామాక్షి మున్నగు దైవములపై ఈ వృత్తములో వ్రాసెను. అంతెందుకు, నన్నయభట్టు శ్రీమదాంధ్రభారతములోని మొదటి పద్యమును ఈ వృత్తములోనే సంస్కృతములో రచించెను (రెండవ చిత్రము, గ్రంథసూచి 2). క్షేమేంద్రుడు సువృత్తతిలకములో ఈ వృత్తమును గుఱించి ఇలా చెబుతాడు –
సాకారాద్యక్షరైః పాద / పర్యంతైః సవిసర్గకైః
శార్దూలక్రీడితం ధత్తే / తేజోజీవితమూర్జితం – (2.35)
(అకారముతో మొదలగు అక్షరముల పదములతో, విసర్గాంత పాదములతో, శా.వి. తేజోమయమైన రూపమును ధరించును.)
విచ్ఛిన్న పాదం పూర్వార్ధే / ద్వితీయార్ధే సమాసవత్
శార్దులక్రీడితం భాతి / విపరీతమతోఽధమం – (2.37)
(శా.వి.లో మొదటి రెండు పాదములలో విడి పదములు, చివరి రెండు పాదములలో దీర్ఘ సమాసములున్న సౌందర్యవంతముగా నుండును, కానిచో అధమముగా నుండును.)
శౌర్యస్తవే నృపాదీనాం / శార్దూలక్రీడితం మతం
సవేగపవనాదీనాం / వర్ణనే స్రగ్ధరా మతా – (3.22)
(రాజుల శౌర్యమును వర్ణించుటకు శా.వి. ఉత్తమము; వేగముతో వీచు గాలిని వర్ణించుటకు స్రగ్ధర ఉచితమైనది.)
శార్దూలక్రీడితైరేవ / ప్రఖ్యాతో రాజశేఖరః
శిఖరీవ పరం వక్రైః / సోల్లేఖైరుచ్ఛశేఖరః – (3.35)
(పర్వతములు ఉన్నత శిఖరములచే, అందముగా వర్ణానార్హములైన శార్దూలగమనముచే శోభిల్లునట్లు, రాజశేఖరకవి శా.వి. వృత్తమును వాడుటవలన ప్రసిద్ధి పొందెను.)
తెలుగు సాహిత్యములో ఎందఱో కవులు శా.వి. వృత్తములో ఎంతయో చక్కగా వ్రాసినారు. కాని నా ఉద్దేశములో తిక్కన విరాటపర్వములో వ్రాసిన క్రింది మూడు పద్యములు తలమానికాలు అంటే అతిశయోక్తి కాదు.
దుర్వారోద్యమ బాహువిక్రమ రసా-స్తోక ప్రతాపస్ఫుర
ద్గర్వాంధ ప్రతివీర నిర్మథన వి-ద్యాపారగుల్ మత్పతు-
ల్గీర్వాణాకృతు లేవురిప్డు నిను దో-ర్లీలన్ వెసన్ బట్టి గం-
ధర్వుల్ మానము ప్రాణముం గొనుట – తథ్యంబె మ్మెయిం గీచకా. – (2.55, 2.172)
భీష్మద్రోణకృపాదిధన్వినికరా-భీలంబు దుర్యోధన
గ్రీష్మాదిత్యపటుప్రతాపవిసరా-కీర్ణంబు శస్త్రాస్త్రజా
లోష్మస్ఫారచతుర్విధోజ్జ్వలబలా-త్యుగ్రంబు దగ్రధ్వజా
ర్చిష్మత్త్వాకలితంబు సైన్య మిది నేఁ – జేరంగ శక్తుండనే – (4.52)
సింగంబాకటితో గుహాంతరమునం – జేడ్పాటుమై నుండి మా
తంగస్ఫూర్జితయూథదర్శనసము-ద్యత్క్రోధమై వచ్చు నో
జం గాంతారనివాసఖిన్నమతి న-స్మత్సేనపై వీఁడె వ
చ్చెం గుంతీసుతమధ్యముండు సమర-స్థేమాభిరామాకృతిన్ – (4.95)
మత్తేభవిక్రీడిత జననము
మామూలుగా అయితే, శార్దూలవిక్రీడితముపైన వ్యాసము ఇంతటితో సమాప్తము కావాలి. కాని రెండు దక్షిణ భాషల సాహిత్య సంపద ఈ శార్దూలవిక్రీడితములో ఒక కవి చేసిన ఒక చిన్న మార్పుతో ముడివేయబడినది. పడమటి చాళుక్య చక్రవర్తి రెండవ పులకేశి సత్యాశ్రయుని కాలములో రవికీర్తి అనే ఒక కవి ఆ రాజును పొగడుతూ వ్రాసిన పద్యములు ఐహొళె శిలాశాసనములలో ఉన్నాయి. ఇది క్రీస్తుశకము 634 కాలము నాటిది. మనము మొట్టమొదట మత్తేభవిక్రీడిత వృత్తమును (మ.వి.) ఇందులో పరికిస్తాము. శార్దూలవిక్రీడితములో మొదటి గురువును రెండు లఘువులుగా మార్చితే మత్తేభవిక్రీడితము లభించునన్న విషయము నేడు అందఱికి తెలిసిన విషయమే. కాని ఏడవ శతాబ్దములో ఇది నా ఉద్దేశములో ఛందశ్శాస్త్రములో ఒక మహత్తరమైన విప్లవము అనే చెప్పాలి. ఎందుకనగా, కన్నడ తెలుగు సాహిత్యములలో చంపూకావ్యములందు చంపకోత్పలమాలల పిదప ఈ వృత్తమునే శా.వి. కన్న ఎక్కువగ కవులు ఉపయోగించినారు. ఒక్క పోతన మాత్రము చంపకమాలల పిదప మ.వి.ని ఎక్కువగా వాడినాడు. ఆ శాసన పద్యము –
వరదా తుంగ తరంగ రంగ విలస – ద్ధంసానదీ మేఖలాం
వనవాసీమవమృద్నతస్సురపుర – ప్రస్పర్ధినీం సంపదా
మహతా యశ్య బలార్ణవేన పరిత – స్సేచ్ఛాదితోర్వీతలం
స్థలదుర్గంజలదుర్గతామివ గతం – తత్తక్షణే పశ్యతాం
(దేవతల వీటిని తలదన్నే సంపదలు కలిగి, ఒడ్డాణములా దానిని చుట్టియున్న వరదానదిపై ఆటలాడు హంసలను కలిగినదైన వనవాసీ దుర్గమును (రెండవ పులకేశి) సైన్యము చుట్టుకొనగా, ఆ స్థల దుర్గము జలదుర్గమువలె నుండినది. సంస్కృతములో వ్రాయబడిన మ.వి. వృత్తములను వ్రేళ్ళపైన లెక్కించవచ్చును, అందులో ఇది ఒకటి.)
కన్నడ తెలుగు భాషలలో శా.వి.కన్న మ.వి.ని ఎక్కువగా కవులు వాడినందులకు బహుశా ఒకే కారణము, మూడు గురువులను పాదములకు ముందుగా నుంచి పద్యములను వ్రాయవలయునన్నచో అట్టి పదములు ఆ భాషలలో ఎక్కువగా నుండవు. అందులకు బదులు మొదట రెండు లఘువులను ఉంచినప్పుడు పద్యమునకు ఒక సొగసు, తూగు జనించును. అందుకే సంస్కృతమునుండి జనించినను, మాతృక శా.వి.కన్న తనయ మ.వి. అందఱి మన్ననలను అందుకొన్నది! తెలుగులో నవరసములను చిందించే మ.వి. పద్యములను ఒకప్పుడు ఇదే పత్రికలో చర్చించియున్నాను.
శార్దూలవిక్రీడితపు లయతో మఱి కొన్ని వృత్తములు
తొమ్మిది సంవత్సరాలకు ముందు హేమచంద్రుని ఛందోనుశాసనమును చదువునప్పుడు సద్రత్నమాల అనే ఒక వృత్తము కనబడినది. దానిని సరిగా పరిశీలించగ నాకు అవగాహన అయినదేమనగా, శా.వి. లోని ఆఱవ అక్షరమైన సగణములోని గురువును రెండు లఘువులు చేయగా సద్రత్నమాలా వృత్తము మనకు లభిస్తుంది. క్రింద సద్రత్నమాలకు నా ఉదాహరణము –
సద్రత్నమాల- మ/న/స/న/మ/య/లగ, యతి (1, 6, 14)
20 కృతి 298745
వాదమ్మేలకొ – వరద నిన్నె మదిలో – వాంఛిచుచుంటిన్ గదా
మోదమ్మందుచు – మురిసిపోయితినిగా – మోహాబ్ధిలో ముంచరా
పేదన్ గాంచర – విరియుగాదె త్రుటిలోఁ – బ్రేమార్ద్ర పుష్పమ్ములున్
తాధింతా యని – తరియ నిందు మనముల్ – తైతక్క లాడంగ రా
తఱువాత హేమచంద్రుని ఛందోనుశాసనములో వంచిత అనే వృత్తమును గుఱించి చదివినాను. ఈ వంచిత వృత్తము కూడ శా.వి.లో జరిగిన మార్పులే. శా.వి.లోని రెండవ, మూడవ గణములైన స/జ లకు బదులు వంచితలో త/న గణములు గలవు. అనగా IIUIUI అక్షరములకు బదులు UUIIII. చతుర్మాత్రయైన స-గణమునందలి మొదటి రెండు లఘువులు ఒక గురువైనది, జ-గణమునందలి మధ్య గురువుకు బదులు రెండు లఘువులు. మరే మార్పులు లేవు. క్రింద వంచితకు నా ఉదాహరణము –
వంచిత- మ/త/న/స/త/త/గ, యతి (1, 6, 13)
19 అతిధృతి 149473
రావా నన్ గానన్ – రసమయ హృదయా – రాజీవనేత్రా దరిన్
జీవానందమ్మై – చిఱునగవులతోఁ – జేరంగ రమ్మో హరీ
భావోద్రేకమ్ముల్ – భవమునఁ గలుగున్ – బాలన్ ననున్ జూడరా
జీవమ్మీవే వం-చితగ నను ధరన్ – జేయంగ నీకిచ్ఛయా
ఈ వంచిత వృత్తములో చివరి గణములైన (శా.వి.లో కూడ ఇవే గణములు) త/త/గ లకు బదులు ర/ర/గ లను ఉంచినయెడల మనకు పుష్పదామ అను వృత్తము లభించును. పుష్పదామకు క్రింద ఒక ఉదాహరణము –
పుష్పదామ- మ/త/న/స/ర/ర/గ, యతి (1, 6, 13)
19 అతిధృతి 75745
వాదా లేలా, నీ – వదనము గనఁగన్ – వంద విశ్వాలు వెల్గెన్
బోధించన్ రావా, – బుధులు పొగడఁగన్ – మోదవేదమ్ము లెన్నో
నాదశ్రీలన్ నే – నవత జెలగఁగన్ – నర్మిలిన్ బాడుచుందున్
బోదున్ నీకై యీ – భువనతలిని నేన్ – బుష్పదామమ్ముతోడన్
ఇలా శా.వి.లోని కొన్ని మార్పులతో అదే లయ గలిగిన వృత్తములను కనుగొనిన తఱువాత శా.వి.యందలి గురులఘువులను క్రమబద్ధముగా మార్చినప్పుడు కలిగిన లయలను పరీక్షించవలయుననే ఆశ జనించినది. దాని ఫలితముగా మూడవ చిత్రములో నున్న వృత్తములను సోదాహరణముగా సృష్టించినాను. వాటికి వివరణలను, ఉదాహరణములను అనుబంధములో చదువ వీలగును.
శార్దూలవిక్రీడితము – మందాక్రాంత
మందాక్రాంత వృత్తమునుగుఱించి ఆషాఢస్య ప్రథమదివసే అను వ్యాసములో నేను సుదీర్ఘముగా చర్చించియున్నాను. కాని మందాక్రాంతము ఎలా జన్మించి ఉంటుందో అన్న విషయమును ఎక్కువగా చర్చించలేదు. అక్కడ చెప్పినట్లు మందాక్రాంతమునకు స్రగ్ధరకు పోలికలు ఉన్నవి. స్రగ్ధరలోని కొన్ని అక్షరములను తొలగించినప్పుడు మనకు మందాక్రాంతము లభించును.
UUUUIUI – IIIIIIU – UIUUIUU – స్రగ్ధర
UUUU – IIIIIU – UIUUIUU – మందాక్రాంత
కాని మందాక్రాంతపు లయ శా.వి.లో కూడ గలదు. శా.వి. మార్పులైన సద్రత్నమాల, వంచిత, పుష్పదామములను ఇంతకు ముందే ప్రస్తావించినాను. ఇప్పుడు మళ్ళీ వాటిని పునఃపరిశీలన చేద్దామా? ఇంతకు ముందు ఇచ్చిన సద్రత్నమాల ఉదాహరణములోని నాలుగు పాదములలో క్రమముగా నిన్నె, పోయి, గాదె, నిందు పదములను తొలగించగా లభించిన క్రింది పద్యపు లయ మందాక్రాంతపు లయతో సరిపోవును. మందాక్రాంతములోని మొదటి నాలుగు గురువులకు బదులు మూడు గురువులు, రెండు లఘువులు గలవు. రెండవ భాగము పూర్తిగా మందాక్రాంతమువలెనే. మూడవ భాగములో మందాక్రాంతమునందలి ర/ర/గ గణములకు బదులు శా.వి.యందలి త/త/గ గణములు ఇందులో.
మందాక్రాంతపు లయతో సద్రత్నమాల –
వాదమ్మేలకొ – వరద మదిలో – వాంఛిచుచుంటిన్ గదా
మోదమ్మందుచు – మురిసితినిగా – మోహాబ్ధిలో ముంచరా
పేదన్ గాంచర – విరియు త్రుటిలో – బ్రేమార్ద్ర పుష్పమ్ములున్
తాధింతా యని – తరియ మనముల్ – తైతక్క లాడంగ రా
అదే విధముగా పుష్పదామములోని నాల్గు పాదములలో మొదటి ఐదు గురువులకు బదులు నాలుగు గురువులను ఉంచి, తఱువాతి ఒక లఘువును తొలగించిన అది మందాక్రాంతము అవుతుంది. అట్లు చేయగా పుష్పదామమునుండీ లభించిన మందాక్రాంత వృత్తము క్రింది విధముగా నుండును –
మందాక్రాంత –
వాదా లేలా, – వదనము గనన్ – వంద విశ్వాలు వెల్గెన్
బోధించన్ రా, – బుధులు పొగడన్ – మోదవేదమ్ము లెన్నో
నాదశ్రీలన్ – నవత జెలఁగన్ – నర్మిలిన్ బాడుచుందున్
బోదున్ నీకై – భువనతలి నేన్ – బుష్పదామమ్ముతోడన్
ఇట్టి మందాక్రాంతపు నడక శార్దూల మత్తేభ విక్రీడితములలో కూడ ఉన్నవి. క్రింద శా.వితో ఒక ఉదాహరణము –
శార్దూలవిక్రీడితము –
శ్రీనాథా నను వేగఁ – జేరగను రా – శృంగార రూపమ్ముతోఁ
గానన్ గోరితి నిన్నుఁ – గాదనకురా – కాలాంబుదాభా హరీ
వేణూరావము నాదు – వీనులకు నీ – ప్రేమమ్ము విన్పించుఁగా
నీ నామమ్మును నేను – నిశ్చలమతిన్ – నిండారఁ దల్తున్ సదా
మందాక్రాంతపు లయతో పై పద్యము –
శ్రీనాథా నను – జేరగను రా – శృంగార రూపమ్ముతోఁ
గానన్ గోరితిఁ – గాదనకురా – కాలాంబుదాభా హరీ
వేణూరావము – వీనులకు నీ – ప్రేమమ్ము విన్పించుఁగా
నీ నామమ్మును – నిశ్చలమతిన్ – నిండారఁ దల్తున్ సదా
కావున మందాక్రాంత వృత్తము శా.వి.నుండి జనియించి ఉండియుండవచ్చును.
శార్దూలవిక్రీడితము – వసంతతిలక
మందాక్రాంత వృత్తపు లయ మాత్రమే కాదు, శార్దూల మత్తేభ విక్రీడితములలో వసంతతిలక వృత్తపు లయ కూడ ఉన్నది. శ్రీవేంకటేశ్వర సుప్రభాతములో శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం మకుటముతో ఎన్నియో వసంతతిలకములు గలవు. ఈ లయ చంపకోత్పలమాలలలో కూడ గలదు. క్రింద ఉదాహరణములు –
మత్తేభవిక్రీడితము –
హరుసానన్ మదిలోని భావముల మా-లాళిన్ రచింతున్ హరీ
చిరునవ్వుల్ ముదమార రంగు లిడి పూ-చెన్ సుందరమ్మై, సదా
విరియున్ నా హృదయమ్ము పద్మమయి పృ-థ్విన్ శోభతోడన్ సఖా
సిరి నిండన్ బ్రదుకింకఁ బండుగయి భా-సిల్లంగ రారా ప్రియా
ఆమనిసిరి – వసంతతిలక లయతో జాతిపద్యము –
పం/పం/చ/పం/గ, యతి – 1.1, 3.1
మదిలోని భావముల – మాలాళిన్ రచింతున్
ముదమార రంగు లిడి – పూచెన్ సుందరమ్మై
హృదయమ్ము పద్మమయి – పృథ్విన్ శోభతోడన్
బ్రదుకింకఁ బండుగయి – భాసిల్లంగ రారా
మఱి కొన్ని విశేషములు
శార్దూలవిక్రీడితమునకు ఒక్క యతి మాత్రమే ఎందుకు? — శా.వి.లో మూడు మాత్రలను తొలగించినప్పుడు మనకు మందాక్రాంతపు లయ లభించునని చెప్పినాను. కాని మందాక్రాంతమునకు రెండు యతులుండగా, శా.వి.కి ఒక యతి మాత్రమే. దీనికి కారణము బహుశా చారిత్రకమేమో? వైదికఛందస్సైన సతోబృహతి నిడుద పాదము 12, 8 అక్షరముల కూర్పు. ఈ 12 అక్షరముల సరళిలో సౌలభ్యముకోసం విఱుపులు లేవనుకొంటాను. అదియునుగాక 11, 12 అక్షరముల త్రిష్టుభ్, జగతీ ఛందములలో చాల వృత్తములకు పాదాంతయతి తప్ప పాదముల మధ్య యతి లేదు. అందువలననేమో శా.వి.లోని మొదటి 12 అక్షరములకు గతి కుంటు పడకుండుటకై యతి నియమమును ఉంచలేదేమో? అయినను, ఈ విషయమును ఇంకను దీర్ఘముగా పరిశీలించవలయును.
- చంపకోత్పలమాలలను, శార్దూల మత్తేభ విక్రీడితములను కన్నడ తెలుగు కవులు వాడుటకు బహుశా వారికే తెలియని మఱొక కారణము ఒకటి ఉన్నది. అదేమనగా శా.వి.కి 30 మాత్రలు, మాలావృత్తములకు 28 మాత్రలు. ఇండులో శా.వి.లో మొదటి రెండు మాత్రలను (మొదటి గురువు) తొలగించినప్పుడు మిగిలిన 28 మాత్రలకు, మాలికావృత్తముల 28 మాత్రలకు మాత్రాగణముల అమరిక ఒక్కటే (చ-పం-పం – చ-పం-పం). ఇట్టి లయ విశేషము వారిని ఆకర్షించి యుండవచ్చును. ఇట్టి అమరికను నేను సంపఁగి అను జాతి పద్యముగా పది సంవత్సరములకు ముందు వివరించినాను. శా.వి.లో మొదటి గురువును (మ.వి.లో మొదటి రెండు లఘువులను) తొలగించగా లభించిన వృత్తమును నా మిత్రులు లైలా పేరితో నేను నిర్మించియున్నాను. క్రింద లైలా వృత్తమునకు ఒక ఉదాహరణము –
లైలా – త/జ/భ/య/ర/ర, యతి (1, 11)
18 ధృతి 74669ఏమో మనసేమొ భావనల – కిల్లై లాలిగా నూఁగునా
ఏమో చితియైన లేఁత వయ – సీనాఁ డింతగా రేఁగునా
ఏమో తకధింత యంచు మది – యింతన్ సంతస మ్మందునా
ప్రేమ మ్మను భావ మందముగఁ – బ్రీతిన్ బుష్పమై కందునా - ఏ అక్షరము వద్ద యతిని ఉంచుట అన్నది లాక్షణికుని హక్కు. పూర్వకాలము నుండి సంస్కృతములో శా.వి.ని 12, 7 అక్షరములుగా విఱిచినారు, కావున 13వ అక్షరముపైన తెలుగు కవులు అక్షరయతిని ఉంచినారు ఈ యత్యక్షరము నా ఉద్దేశములో పాదములో ఎక్కడో వచ్చునట్లు కనిపించుచున్నది. పాదమును 15, 15 మాత్రలుగా సరి సమముగా నుండునట్లు విఱిచి యతిని ఉంచుటకు వీలగును. ఇందులో అక్షర యతిని, ప్రాసయతిని రెంటిని ఉంచినాను. మ.వి. గణములతో నుండు దీనికి సామజము అని పేరు నుంచినాను. క్రింద ఒక ఉదాహరణ –
సామజము- స/భ/ర/న/మ/య/లగ, యతి (1, 12)
వరదా కాలినిఁ బట్టె నక్రము – భరించన్ గాని బాధాయెరా
మొర లాలించర మోహనానన – మురారీ కేలఁ గావంగ రా
వరలక్ష్మీ హరితోడఁ జెప్పవె – పరాభూతున్ ననున్ గానఁగా
సరసందున్ మరణింతు సామజ – శరీరా నీవు రావేని నేన్ - మూడు దశమాత్రల విఱుపుతో మేఘ – శా.వి.లోని త/త/గ గణములయందు మొదటి త-గణపు రెండవ గురువు మేఘ వృత్తములో రెండు లఘువులుగా మారినది. ఇట్టి అమరికలో శా.వి. వృత్తపు పాదమును పదేసి మాత్రలుగా విడదీసి రెండు యతుల నుంచవచ్చును. దానికి ఒక ఉదాహరణ –
మేఘ- మ-స-జ-స-భ-జ-స, యతి (1, 7, 14)
21 ప్రకృతి 976729నిన్నీ భూతలిపై – నిరంతరము చూడన్ – నిముసమైన విడకన్
కన్నుల్ గాఁచెనుగా – కళాప్రతిమ రావా – కవితగా నవతగా
కన్నీరెందులకో – కవిత్వమున లేదా – కలకలల్ కిలకిలల్
వన్నెల్ నింపుటకై – ప్రయత్న మొనరింతున్ – వసుధపై మనికిలో - మూడు అంత్యప్రాసలుండినచో అది త్రిభంగి యగును. త్రిభంగిగా శా.వి.లోని ఒక మార్పైన ప్రేమలత – శా.వి.లోని మార్పులలో ప్రేమలత అను వృత్తమును పరిశీలించిన దానిని త్రిభంగివలె వ్రాయుటకు వీలగును. ఇట్టి త్రిభంగిగతి గానయోగ్యము. క్రింద ఒక ఉదాహరణము –
ప్రేమలత – న/జ/జ/భ/జ/జ/త/గ, ప్రాసయతి (1, 6, 15) IIIIU – IIUI UIIIU – IIUI UUIU
22 ఆకృతి 1236336కవనములా – నవరాగ భావనములా – జవమైన నిస్వనములా
కవనములా – నవచిత్ర శోభనములా – యువరాగ గుంభనములా
కవనములా – నవజీవ చేతనములా – కవిరాజ కేతనములా
కవనములా – నవలోక వాహనములా – భువనైక మోహనములా
విరళోద్ధతా, రాజరాజీ
సంస్కృతములో యతి అనగా పాదముల విఱుపు. అందుకే ప్రతి శా.వి. పాదమును 12, 7 అక్షరములుగ విఱిచి వ్రాసినప్పుడు అన్ని శా.వి. వృత్తములు ఒకే విధముగా ధ్వనించును. కాని తెలుగులో అలా కాదు. ఒక శా.వి. వృత్తములా మఱొకటి ఉండదు. ఇంతకు ముందు ఇచ్చిన తిక్కన పద్యములను చదివితే ఈ విషయము తెలియును. సంస్కృత శా.వి. వృత్తములలోని 12 అక్షరములను, 7 అక్షరములను వీలు ఉన్నప్పుడు విఱిచి కూడ చదువుకొనవచ్చును. ఈ విషయమును ఇక్కడ విశదీకరించుచున్నాను. శా.వి.లోని మొదటి 12 అక్షరముల గణములతో విరళోద్ధతా అను ఒక వృత్తము దుఃఖభంజనకవి వ్రాసిన వాగ్వల్లభలో పేర్కొనబడినది. అదే విధముగా చివరి ఏడు అక్షరములతో రాజరాజీ అను వృత్తము కూడ అదే గ్రంథములో చెప్పబడినది. ఈ రెండు వృత్తములకు ఉదాహరణములు –
విరళోద్ధతా – మ/స/జ/స, యతి (1, 6) UU UII – UIU IIIU
12 జగతి 1881
ఆకాశమ్మున – నందమౌ రజనిలో
రాకాచంద్రుని – రమ్యమౌ ప్రభలలో
నేకాంతమ్మున – నిద్దఱ మ్మొకరమై
నాకమ్మున్ జిఱు-నవ్వులన్ గనుదమా
రాజరాజీ – త/త/గ UUI UUI U
7 ఉష్ణిక్ 37
ఈ రమ్య రాత్రిన్ సకీ
యా రాజరాజిన్ గనన్
నీ రూపలావణ్యమే
శ్రీరాశిగాఁ గన్పడెన్
అన్నపూర్ణాష్టకములోని మొదటి శా.వి. వృత్తపు ప్రథమార్ధమును మాత్రము వ్రాసినప్పుడు అవి విరళోద్ధతవలె నుండును. క్రింద దానిని చదువవచ్చును –
నిత్యానందకరీ వరాభయకరీ
నిర్ధూ తాఖిల ఘోర పావనకరీ
ప్రాలేయాచల వంశ పావనకరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ
అదే విధముగా ద్వితీయ భాగములోని పదములు రాజరాజీ వృత్తము వలె నుండును. ఆ పంక్తులను క్రింద చదువవచ్చును –
సౌందర్య రత్నాకరీ
ప్రత్యక్ష మాహేశ్వరీ
కాశీపురాధీష్వరీ
మాతాఽన్నపూర్ణేశ్వరీ
శార్దూలవిక్రీడితపు రెండు అర్ధముల తారుమారు
శార్దూల మత్తేభవిక్రీడితముల రెండు భాగములను తారుమారు చేసి వ్రాసినను ఆ వృత్తములు చదువుటకు ఇంపుగానే ఉండును. ఇది ఒక విధముగా cyclic permutation. శా.వి.ని తారుమారు చేసిన స్మేర వృత్తమును, మ.వి.ని తారుమారు చేసిన కరిణీ వృత్తమును క్రింద చదువవచ్చును –
శార్దూలవిక్రీడితము –
చీరం గట్టితిఁ జేరుచుక్క నిడితిన్ – స్మేరస్మితా మోహనా
శ్రీరాగమ్ములఁ బాడనా లలితమై – స్త్రీరాగ సమ్మోహనా
చీరంగావల దీ హృదిన్ హరిహరీ – సీరాయుధాఽనంతరా
చేరంగా నిట రమ్ము ప్రేమమయుఁడై – శ్రీరంగరంగేశ్వరా
స్మేర – త/త/మ/భ/ర/న/గ, యతి (1, 8)
19 అతిధృతి 240677
శ్రీరంగరంగేశ్వరా – చీరం గట్టితిఁ జేరుచుక్క నిడితిన్
స్మేరస్మితా మోహనా – శ్రీరాగమ్ములఁ బాడనా లలితమై
స్త్రీరాగ సమ్మోహనా – చీరంగావల దీ హృదిన్ హరిహరీ
సీరాయుధాఽనంతరా – చేరంగా నిట రమ్ము ప్రేమమయుఁడై
మత్తేభవిక్రీడితము –
దరి నీవే భవతారిణీ భయహరీ – తారుణ్య మొప్పారు సుం-
దరి నీవేగద శంకరీ శివకరీ – ద్వారావతీశాఽనుజా
ధర నీవే కరుణించు మంగళకరీ – ధారాళవాత్సల్యతా-
తరు వీవే హరిణీ శుభంకరిణి యో – దైతేయసంహారిణీ
కరిణీ- త-త-భ-త- జ-భ-లగ, యతి (1, 8)
20 కృతి 481701
తారుణ్య మొప్పారు సుం-దరి నీవేగద శంకరీ శివకరీ
ద్వారావతీశాఽనుజా – ధర నీవే కరుణించు మంగళకరీ
ధారాళవాత్సల్యతా- తరు వీవే హరిణీ శుభంకరిణి యో
దైతేయసంహారిణీ – దరి నీవే భవతారిణీ భయహరీ
సంకర వృత్తములు
శా.వి. చంపకోత్పలమాలల రెంటి లయతో ఒక రెండు వృత్తము లున్నవి. శా.వి.ని చర్చించునప్పుడు ఈ వృత్తములను గుఱించి చెప్పుట కూడ అవసరమే. అవి నందన, పున్నాగ. నందన వృత్తమును అశ్వఘోషుడు వాడినాడు, అనగా అది శా.వి.వలె ఒక పురాతన వృత్తము. పున్నాగ శ్రీపాద కృష్ణామూర్తి శాస్త్రిగారి సృష్టి. నేను కూడ పుష్పకేళిక, పుష్పడోలిక అను రెండు వృత్తములను సృష్టించినాను. వీటికి ఉదాహరణములు –
నందన – న/జ/భ/జ/ర/ర, యతి (1, 12) IIIIUIUIIIU – IUIUUIU
18 ధృతి 76720 (ప్రథమార్ధము – చంపకమాల లయ; ద్వితీయార్ధము – శా.వి. లయ)
లలితముగా సరాగములతో – రమించఁగాఁ బాడఁగా
వలపుల నుల్లసించి మది సం-భ్రమించఁగా నాడఁగా
కలలను యింద్రచాపముల వీ-క్షణమ్ము భాసించఁగా
నిల యిది నందనమ్మగుఁ గదా – హృదిన్ వసంతమ్ములో
పున్నాగ – భ-ర-న-మ-య-లగ, యతి (1, 11) UIIUIUIIIU – UUIUUIU
17 అత్యష్టి 37335 (ప్రథమార్ధము – ఉత్పలమాల లయ; ద్వితీయార్ధము – శా.వి. లయ)
ఆయమ తల్లి యీ జగతికౌ – నా దేవుఁడే తండ్రియౌ
నీ యిల పార్వతీపశుపతుల్ – హృత్పీఠమం దెప్పుడున్
బాయక నుండి యిత్తురుగ స-ద్భావమ్ములన్ బ్రేమతో
బూయఁగ జీవనమ్ము రమణన్ – బున్నాగ పుష్పమ్ముగా
పుష్పకేళిక – భ/ర/న/త/త/గ, యతి (1, 10) UIIUIUIII – UUIUUIU
16 అష్టి 18903 (ప్రథమార్ధము – ఉత్పలమాల లయ; ద్వితీయార్ధము – శా.వి. లయ)
నందకుమార నీ కొసఁగ – నావద్ద లేదేమియున్
మందిర మౌను మానసము – మాధుర్య ముప్పొంగు నీ
సుందర పుష్పకేళికను – జూడంగ రావేలరా
వందలుగాను పాటలను – భావమ్ముతోఁ బాడెదన్
పుష్పడోలిక – న/జ/భ/య/య/లగ, యతి (1, 11) IIIIUIUIII – UUIUUIU
17 అత్యష్టి 37808 (ప్రథమార్ధము – చంపకమాల లయ; ద్వితీయార్ధము – శా.వి. లయ)
తరగలవోలె గాలి మెలఁ – దాకంగ దేహమ్ము, రా
మురియుచు పుష్పడోలికల – మోదమ్ముతో నూఁగఁగన్
విరియును పుష్పమై మదియు – వేవేల పత్రమ్ములన్
హరి హరి యంచు పిల్చి నిను – హారమ్ము వేతున్ సఖా
శా.వి. వృత్తముతో ప్రథమార్ధము, చంపకోత్పలమాలలతో ద్వితీయార్ధము ఉండునట్లు క్షేమ అను ఒక వృత్తమును సృష్టించినాను. దానికి ఒక ఉదాహరణము –
క్షేమ – మ/స/జ/స/భ/ర/లగ, యతి (1, 13) UUUIIUIUIIIU -UIIUIUIU
20 కృతి (ప్రథమార్ధము – శా.వి. లయ; ద్వితీయార్ధము – చంపకోత్పలమాలల లయ)
క్షేమమ్మై మనుచుండె రాఘవుఁడు సు-గ్రీవునితో వనమ్ములో
శ్రీమంతుం డతఁ డుండె నిన్వెదకుచున్ – శ్రీమతి నిన్ను దల్చుచున్
రామున్ దోడుగ లక్ష్మణుండు నడచున్ – ప్రక్కన నుండి నీడగా
రాముండంపెను నన్ను నిన్ను గన నీ – రావణుఁ డుండు లంకలో
శార్దూలము – శార్దూలవిక్రీడితము
శార్దూలవిక్రీడితమును శార్దూలము అనుట వాడుక. శార్దూలము మఱొక వృత్తము, అది శార్దూల విక్రీడితము కాదు. శార్దూలము పింగళ ఛందస్సులో చెప్ప బడినది. వాయువేగ హేమచంద్రుని ఛందోనుశాసనములో, జానాశ్రయిలో నున్నవి. ఈ మూడు వృత్తములకు, శార్దూల విక్రీడితమునకు గల భేదము రెండవ భాగములో, అనగా త/త/గ స్థానములో. శార్దూలములో త/త/గ కు బదులు ర/మ, హేమచంద్రుని వాయువేగకు త/త/గ కు బదులు న/జ/గ, జానాశ్రయి వాయువేగకు త/త/గ కు బదులు న/న/గ. యతి స్థానము ఈ వృత్తములన్నిటికి ఒక్కటే. క్రింది ఉదాహరణలలో పూర్వార్ధము అన్నిటికి ఒకటే. ఉత్తరార్ధమును మార్చి వ్రాసినాను.
శార్దూలవిక్రీడితము- మ-స-జ-స-త-త-గ, యతి (1, 13)
19 అతిధృతి 149337
పారావారముగాదె సత్కరుణకున్, – బాలించు ప్రాణేశునిన్
శ్రీరామా యని బల్కరాదె ప్రియమై, – శ్రీలింక నీకేలనే,
యారామమ్ము విలోల మానసము, నీ-వందుండు పుష్పమ్ములన్
హారమ్మై పలు గ్రుచ్చరాదె విధిగా, – నా దైవ పూజార్థమై
శార్దూలము- మ-స-జ-స-ర-మ, యతి (1, 13)
18 ధృతి 10073
పారావారముగాదె సత్కరుణకున్, – బాల ముంచున్ దేల్చున్,
శ్రీరామా యని బల్కరాదె ప్రియమై, – శ్రీలవే, వేఱేలా,
యారామమ్ము విలోల మానసము, నీ-వా జపా పుష్పమ్ముల్
హారమ్మై పలు గ్రుచ్చరాదె విధిగా, – నా పదమ్మందుంచన్
వాయువేగ (జా) – మ-స-జ-స-న-న-గ, యతి (1, 13)
19 అతిధృతి 259929
పారావారముగాదె సత్కరుణకున్, – వరముల తరువున్
శ్రీరామా యని బల్కరాదె ప్రియమై, – సిరు లనవసర-,
మ్మారామమ్ము విలోల మానసము, నీ-వట గల విరులన్
హారమ్మై పలు గ్రుచ్చరాదె విధిగా, – నతనిని గొలువన్
వాయువేగ (హే) – మ-స-జ-స-న-జ-గ, యతి (1, 13)
19 అతిధృతి 194393
పారావారముగాదె సత్కరుణకున్, – వరముల భూజమున్
శ్రీరామా యని బల్కరాదె ప్రియమై, – సిరు లిక నేలనే,
యారామమ్ము విలోల మానసము, నీ – వలరు సుమమ్ములన్
హారమ్మై పలు గ్రుచ్చరాదె విధిగా, – నమలుని పూజకై
చిత్రక షట్పద
వైదిక ఛందస్సులో సతోబృహతినిగుఱించి (మొదటి చిత్రము) తెలిపినాను. అందులో పంక్తులు 12/8/12/8 అక్షరముల పాదములుగా ఉంటాయి. శా.వి. పాదమునకు 12,7 అక్షరములు గలవు. దీనితో మఱొక ఏడు అక్షరముల పాదము చేర్చినప్పుడు మనకు 12/7/7 అక్షరముల త్రిపద లభించును. ఇదే విధముగా మళ్ళీ చేసినప్పుడు మనకు 12/7/7/12/7/7 అక్షరముల షట్పద లభించును. శా.వి. మూసతో నుండు ఈ షట్పదకు చిత్రక షట్పద (చిత్రకము అనగా చిఱుతపులి) అని పేరు నుంచినాను. అన్ని పాదములకు ప్రాస గలదు. మొదటి, నాలుగవ పాదములలో ఎనిమిదవ అక్షరము యతి స్థానము. క్రింద నా ఉదాహరణములు –
చిత్రక షట్పద – శా.వి. (1-7) (8-12) / శావి (13-19) / శావి (13-19) ప్రాస
సందర్శించఁగ నిన్ను – సంతసమయెన్
సౌందర్య భావోదధీ
సిందూర సంధ్యాకృతీ
ఎందెందున్ గన నీవె – యెల్లపుడు నీ
హిందోళ మాలించఁగా
నుందున్ బ్రియా వేఁచుచున్
(పై పద్యములో 1,2 మఱియు 4,5 పాదములకు శా.వి.కి ఉండు లక్షణములన్నియు గలవు.)
శార్దూల మత్తేభ విక్రీడితములతో అర్ధసమ, ఉపజాతి వృత్తములు
సంస్కృతములో ఉపజాతులు సామాన్యము. కావ్యములలో సర్గములనే ఉపజాతులతో నింపినారు కవులు. ఇంద్రవజ్ర-ఉపేంద్రవజ్రలతో, ఇంద్రవంశ-వంశస్థ వృత్తములతో సామాన్యముగా ఉపజాతులను నిర్మించెదరు. శా.వి.-స్రగ్ధరలతో కూడ నిర్మించిన అర్ధసమ వృత్తములు కూడ ఉన్నవి. మూడవ చిత్రములో వివరించబడిన ఏ రెండు వృత్తములతో నైనను అర్ధసమవృత్తములనో లేక ఉపజాతులనో కల్పించవచ్చును. తెలుగులో మనకు పరిచితములైన శా.వి.-మ.వి.లతో కూడ ఇట్టివి నిర్మించ వీలగును. సామాన్యముగా అన్ని పాదములలో ప్రాసాక్షరము ముందున్న అక్షరములన్నియు గురువులుగానో లేక లఘువులుగానో ఉండవలయును. కాని ఉపజాతులకు ఈ నియమము లేదు. క్రింద శా.వి.-మ.వి.లతో ఒక ఉపజాతి వృత్తము –
శార్దూల మత్తేభ విక్రీడితములతో ఉపజాతి –
(1,2 పాదములు మ.వి., 3,4 పాదములు శా.వి.)
వనమాలీ విబుధప్రియా సురేంద్రవరదా – పంకేజపత్రాక్ష భా-
వనతేజా కమలాత్మకా నరేంద్రవరదా – వంశిప్రియా మోహనా
శ్రీనాథా సురపూజితా సుచరితా – శృంగారరూపా హరీ
నానాసూనములన్ బదాంబుజములన్ – నారాయణా యుంతురా
పంచనఖ జాతి పద్యముగా శార్దూలవిక్రీడితము
శా.వి. గణములతో ఆ వృత్తపు లయ మారకుండ కల్పించిన నూతన వృత్తములను మూడవ చిత్రంలో వివరించినాను. అట్టి వృత్తములకు ఉదాహరణములను వివరముగా అనుబంధములో ఇచ్చియున్నాను. దీనివలన మనకు అవగతమగు విషయ మేమనగా – శా.వి. వృత్తమును లయ చెడక ఒక జాతి పద్యముగా వ్రాయ వీలగును. దానికి నా సూచనలు – 1. మొదట ఆఱు మాత్రలు, కనీసము ఒక గురువైనను ఉండవలయును, రెండు గురువులుండిన నడక ఇంకను బాగుండును. లఘువులు ప్రక్కప్రక్కన ఉండవలయును (UIUI, IUIU లాటివి నిషిద్ధము); 2. ఒక ఎదురు నడక లేని పంచ మాత్ర, ఒక గురువైనను ఉండవలయును; 3. గుర్వంతమయిన ఏడు మాత్రలు; 4. ఎదురు నడక లేని రెండు పంచమాత్రలు, పంచమాత్రలో కనీసము ఒక గురువైనను ఉండవలయును; 5. చివర ఒక గురువు; మొత్తము 30 మాత్రలు. యతి శా.వి. వలెనే 19వ మాత్రతో, ప్రాస అవసరము. 12వ మాత్రతో యతి ఐచ్ఛికము. ఇలా వ్రాసిన జాతి పద్యములకు పంచనఖము అని పేరుంచినాను. పంచనఖము అనగా పులి, అంతే కాక ప్రతి పాదములో పైన చెప్పిన ఐదు “నఖములు” ఇందులో గలవు. క్రింద రెండు ఉదాహరణములు –
చిత్తమ్మందలి బాధఁ – జెప్పఁ దరమా – చెప్పంగ లేకున్నచో
చిత్తమ్మయ్యది క్రుంగుఁ – జేవ లేకన్ – ఛిన్నమ్ముగా వ్రయ్యలై;
చిత్త మ్మొక్క ప్లవమ్ము – చేదు తీపిన్ – జేయున్, మఱొక్క తరి యా
చిత్త మ్మా తీపినే – చేదు సేయున్, – జెప్పంగఁ గాదేదియున్
నిను నేఁ జూచిన ఘడియ – నిజము నాకున్ – నీపైన వలపాయెఁగా
కనులన్ గానఁగఁ బారెఁ – క్షణములోనన్ – గమనీయ విద్యుల్లతల్
వినుమా ప్రేమకు భాష – వేఱు గలదా – బ్రేమే కదా దైవమున్
మనసుల్ రెండును జేర – మమతతో నా – మాటల్ వృథాయే సుమా
వెన్నెలలో విహరించ – వేఁగితిని నేఁ – బ్రేమాగ్ని దహియించె నీ
గన్నెను గానఁగ రమ్ము – కామమ్ముతోఁ – గామేశ కామప్రియా
కన్నులు చూచుచు నిన్నుఁ – గాయలయెగాఁ – గందర్పదర్పహరణా
కిన్నెరసానిని వినన్ – గృష్ణ దరి రా – కృష్ణేందుకిరణమ్ములన్
ముగింపు
రెండు వేల సంవత్సరములుగా భారతదేశములో ఎందఱెందఱో కవులచేత మన్ననలంది భారతీదేవికి ఆనందమును కలిగించిన వృత్తము శార్దూలవిక్రీడితము. అన్ని రసములను ఆ పానపాత్రలో పోసి ఆ మాధుర్యమును ఆస్వాదించవచ్చును. దీని పరిధి, వైశాల్యము, లోతులను నా శక్తి మేరకు నేనీ వ్యాసములో వివరించుటకు ప్రయత్నించినాను. ఈ వృత్తము ఇంకిపోని రసగంగ. ఈ గంగాప్రవాహములో భూతకాలములో జలక్రీడలు సలిపినారు, వర్తమానకాలములో స్నాన మొనర్చుచున్నారు. భవిష్యత్తులో కూడ ఈ సజీవ స్రోతస్సు పాఠకులను, గాయకులను ఆహ్వానించునన్న విషయములో సందేహము ఏ మాత్రము లేదు.
మందమ్మౌ గతితోడ – మత్తగజమై – మాధుర్యమున్ నింపు, స-
త్సౌందర్యధ్వజ మెత్తి – సాఁగి నడచున్ – సంద్రమ్ముపై నావగా,
ఛందోబంధములందుఁ – జక్కని నడన్ – శార్దూలవిక్రీడీత-
మ్మందమ్మై యగుపించు – నల భములన్ – హర్షాంశబింబమ్ముగా
గ్రంథసూచి
- అచ్చ తెలుగు కుబ్జా కృష్ణ విలాసము – నల్లంతిగళ్ చక్రవర్తుల ఠంయాల లక్ష్మీనృసింహాచార్యులు, 1932.
- ఆంధ్ర మహాభారతము – సంశోధిత ముద్రణము, ఆది సభా పర్వములు, ఉస్మానియా విశ్వవిద్యాలయము, హైదరాబాదు, 1968.
- ఛందోఽనుశాసన – హేమచంద్ర సూరి, సం. హరి దామోదర్ వేళంకర్, సింఘీ జైన్ శాస్త్ర శిక్షాపీఠ, భారతీయ విద్యా భవన్, బంబయీ, 1961.
- ఛందోరచనా – మాధవ రావ్ పట్వర్ధన్, కర్ణాటక పబ్లిషింగ్ హౌస్, ముంబయీ, 1937.
- ఛందఃశాస్త్రం – పింగలాచార్య – సం. అనంతశర్మ, కేదారనాథ – పరిమల పబ్లికేషన్స్ – ఢిల్లీ, 2001.
- జానాశ్రయీ – జనాశ్రయ మాధవ వర్మన్, గుణస్వామి, సం. మానవల్లి రామకృష్ణ కవి, తిరుమల తిరుపతి దేవస్థానం ప్రెస్, 1950.
- తులసీ ఛందోమంజరీ – హరికృష్ణ రాయ్, రాష్ట్రభాషా గ్రంథమాలా.
- పింగలప్రకాశ – రఘువర దయాలు మిశ్ర, రత్నాశ్రం, ఆగ్రా, 1933.
- బృహత్ పింగల్ – రామనారాయణ్ విశ్వనాథ్ పాఠక్, గుజరాతీ సాహిత్య పరిషత్, ముంబయీ, 1955.
- వృత్తదర్పణ – పరశురాం బల్లాల్ గోడ్‌బోలే, కర్సన్‌దాస్ నారణ్‌దాస్ అండ్ సన్స్, సూరత్, 1939.
- శ్రీమదాంధ్ర భారతము, విరాటోద్యోగ పర్వములు, వావిళ్ళ రామస్వామి శాస్త్రులు అండ్ సన్స్, మదరాసు, 1915.
- సరళ పంప భారత – L బసవరాజు, గీతా బుక్ హౌస్, మైసూరు, 1999.
- సువృత్తతిలక – క్షేమేంద్ర, పుల్లెల శ్రీరామచంద్రుని వ్యాఖ్య – ఔచిత్యవిచార, కవికంఠాభరణా, సువృత్తతిలక – సురభారతీ సమితి – హైదరాబాదు – 1983.
- Epigraphica Indica and Record of the Archaelogical Survey of India, vol. 6, Calcutta, 1900-1901.
- Historicizing maNipravALam – Siby James, Mahatma Gandhi University, Kottayam, 2002.
- pratimAnATakam of bhAsa – M.R. Kale, Motilal Banarsidas, Delhi, 1991.
- Sanskrit Prosody: Its Evolution – Amulyadhan Mukherji, Saraswat Library, Calcutta.
- The saundarananda of aSvaghOsha – E.H. Johnston, Oxford University Press, London, 1928.
- Vedic Metre in its Historical Development – E. Vernon Arnold, Cambridge University Press, 1905.