తెలుగులో మొదటి నీతి పుస్తకం: సుమతి శతకం

భారత చరిత్రలో 19వ శతాబ్దం ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ శతాబ్దం. ఈ శతాబ్దిలోనే దేశంలో బ్రిటిష్ ప్రభుత్వం స్థిరపడింది. 1857-58 కాలంలో వచ్చిన తిరుగుబాట్లు అలజడులు తగ్గి అందులోంచి నిబ్బరంగా ప్రభుత్వం నిలదొక్కుకుంది. వ్యాపారం చేసుకోవడానికొచ్చిన కంపెనీ వారికి అనుకోకుండా ఒళ్ళో పడ్డ ఆస్తిగా కాకుండా, భారతదేశం తమ వల్ల అనాగరికత లోంచి నాగరిక స్థాయి లోకి తీసుకు రాబడ వలసిన భూఖండంగా బ్రిటిష్ వాళ్ళు ఈ శతాబ్ది లోనే గుర్తించారు. బ్రిటన్ పశ్చిమ నాగరికతలో అత్యున్నత స్థాయిలో వుంది. భారతదేశం అణిగిపోయి శిథిలమైన నాగరికతకు చిహ్నంగా చూడబడుతోంది. ఈ రెండింటి మధ్య సంబంధాలు ఈ శతాబ్దిలో అతి ముఖ్యమైన పరిణామాలకి దారి తీశాయి. ఈ పరిణామాలకి అందరూ అంగీకరించే ఒక వ్యాఖ్యానం ఏదీ లేదు. బ్రిటిష్ పరిపాలన వల్ల భారతదేశానికి సంక్రమించిన మేళ్ళు/కీళ్ళు చాలా వున్నాయి. ఇంగ్లీషు విద్య, అచ్చు యంత్రప్రభావం, ‘ఎన్‌లైటెన్మెంట్’ పేరుతో వ్యాప్తిలోకి వచ్చిన సాంస్కృతిక పునరుజ్జీవనం, దానితో పాటు వచ్చిన విక్టోరియన్ నైతిక స్పృహ, క్రైస్తవులు ప్రతిపాదించిన ప్రవర్తన మార్గాలు, ఇంకా అనేక లక్షణాలతో కలగాపులగంగా ఉన్న ఈ మార్పుల్ని ‘వలస కాలపు ఆధునికత’ అని తరచు అంటూ వుంటారు. ఈ భావ పరిణామాల వల్ల భారతీయుల ప్రపంచ దృక్పథంలో వచ్చిన విప్లవాత్మకమైన మార్పులు ఇప్పుడు మనం ఆధునిక కాలపు భారతదేశం అనే దాన్ని నిర్మించడానికి కారణాలయ్యాయి.

ఈ చిన్న వ్యాసంలో అవన్నీ చర్చించడానికి వీలు లేదు కానీ, బ్రిటిష్ వాళ్ళతో పరిచయం కారణంగా తెలుగు దేశంలో వచ్చిన రెండు మార్పులను మాత్రం వివరంగా చర్చిస్తాను. అందులో ఒకటి అచ్చు యంత్రప్రభావం. రెండవది ఇంగ్లీషు విద్యా విధానం. ఈ రెంటి ప్రభావం ఫలితంగా భారతీయులు తమ గ్రంథాలని చదివే, పరిష్కరించే, అర్థం చేసుకునే పద్ధతుల్లో వచ్చిన మార్పుల్ని ప్రముఖంగా ప్రస్తావిస్తాను. యూరోపులో అచ్చు యంత్రం అమలు లోకి తెచ్చిన వాడు గూటెన్‌బెర్గ్ (Johannes Gutenberg). ఆ అచ్చు యంత్రం ఫలితంగా వచ్చిన విప్లవాత్మకమైన మార్పుల్ని గూటెన్‌బెర్గ్ విప్లవం అంటారు. అయితే ఆ విప్లవం తాలూకు ఫలితాలు భారతదేశంలో ఎలా ప్రవర్తిల్లాయి అన్నది ఈ వ్యాసానికి మించిన పెద్ద విషయం. ఆ పని పరుచూరి శ్రీనివాస్, పప్పు నాగరాజు – ఈ ఇద్దరూ వేరేగా చేస్తున్నారు.


బ్రౌన్ సుమతి శతకం
ఆం. ప్ర. సాహిత్య అకాడెమి ప్రచురణ

అంచేత ఈ చిన్న వ్యాసంలో నా పరిధిని చిన్నది చేసుకుని ‘సుమతి శతకం’ ఈ కాలంలో, అంటే 19-20 శతాబ్దాలలో, ఎన్ని మార్పులు పొందిందో పరిశీలించడం ద్వారా కొన్ని ప్రతిపాదనలు చేస్తాను. బ్రిటిష్ వాళ్ళు ప్రవేశ పెట్టిన స్కూళ్ళలో ఈ పుస్తకం వాడడం మూలంగా గ్రంథ సంస్కృతిని గురించి భారతీయుల ఆలోచనా ప్రపంచంలో పెద్ద మార్పు (epistemic shift) వొచ్చిందని సూచిస్తాను. బ్రిటిష్ వాళ్ళతో సంపర్కం కారణంగా భారతదేశంలో వచ్చిన ఆధునికతని ‘వలస కాలపు ఆధునికత’ అని ఎందుకు అనాలంటే భారతదేశంలో అంతకు ముందే వేరే రూపంలో ఇంకొక ఆధునికత ఉన్నది అని గుర్తుచేసి దాని నుంచి ఈ కొత్త ఆధునికతని విడదీయటం కోసం [చూ: Afterword to Girls for Sale, 2007].

ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యాపారం లోంచి పరిపాలన లోకి వచ్చిన తరువాత తీసుకున్న బాధ్యతలలో ఒకటి తమ పాలనలో వున్న ప్రజలకి ‘నీతి’ (morals) బోధించడం. అందుకోసం ఒక మెట్టు అందరూ చదువుకోడానికి వీలుగా వుండే బడులను (Public schools) ఏర్పాటు చేయడం. ఇలాంటి స్కూళ్ళను ఏర్పాటు చేయడం వల్ల కంపెనీ ప్రభుత్వానికి కొన్ని కొత్త బాధ్యతలు, దానితో పాటు కొన్ని కొత్త అధికారాలు సంక్రమించాయి. పిల్లల చేత చదివించడం కొత్త బాధ్యత ఐతే, వాళ్ళు ఏం చదవాలో నిర్ణయించడం వాళ్ళకు కొత్తగా వచ్చిన అధికారం. ఆనాటికే కంపెనీ ప్రభుత్వం ఆదరం వల్ల ఇంగ్లీషు నేర్చుకున్న ఫలితంగా లాభసాటి అయిన ఉద్యోగాలు పొంది సుఖంగా బతుకుతున్న పెద్ద మనుషులు బ్రిటిష్ సంస్కృతి భారతీయ సంస్కృతి కన్నా గొప్పది అని మనసారా నమ్మడం ప్రారంభించారు. ఆ నమ్మకంలో భాగంగా భారతదేశంలో మనుషులకి నీతి లేదు అనే బ్రిటిష్ ప్రభువుల నమ్మకం వాళ్ళలో స్థిరంగా యేర్పడింది. మద్రాసు ప్రెసిడెన్సీలో వున్న సాదర్ అదాలత్ కోర్టులో అనువాదకుడిగా చేరిన వెన్నెలకంటి సుబ్బారావు (1784-1839) అనే తెలుగు నియోగి బ్రాహ్మణుడు, ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రభుత్వంలో భారతీయులు పొందగలిగిన అత్యున్నతమైన ఉద్యోగంలో వుండిన ఆయన, తెలుగు పిల్లలకి నీతి గట్టిగా బోధించాలని భావించాడు. మద్రాసు స్కూల్ బుక్ సొసైటీలో సభ్యుడిగా నియమించబడిన ఆయన, స్కూళ్ళలో జరిగే బోధన గురించి 1820లో ఒక రిపోర్ట్ ప్రభుత్వానికి సమర్పించాడు. పిల్లలకి నీతి బోధించవలసిన అవసరాన్ని గురించి చెప్తూ, ఆయన వివిధ గ్రంథాలనుంచి నీతిబోధకమైన భాగాలను ప్రాంతీయ భాషల్లో రాసి పిల్లలకి బోధించాలి [Subbarao, 1976] అని ప్రత్యేకంగా సిఫారుసు చేశాడు.

నీతి అనే మాటలో అర్థ విపరిణామం

సుబ్బారావు సిఫారసుతో ఈస్ట్ ఇండియా కంపెనీ వుద్యోగంలో వున్న తెలుగు పండితులందరూ తెలుగు పుస్తకాలలో స్కూళ్ళలో పాఠం చెప్పడానికి అనువుగా వుండే నీతి భాగాల కోసం అన్వేషణ మొదలు పెట్టారు. ఇంగ్లీషులో moral అనే మాటకి వాళ్ళకి తెలుగులో సమానార్థకంగా తట్టిన మాట నీతి. అప్పట్లో ఈస్ట్ ఇండియా కంపెనీలో వున్న తెలుగు పండితులు సంస్కృతంలోను తెలుగు ప్రాచీన కావ్యాలలోను గట్టి ప్రవేశం వున్న వాళ్ళు. Moralకి సమానార్థకమైన మాట నీతి కాబట్టి సంస్కృతంలో నీతిబోధకమైన పంచతంత్ర కథలు morals బోధించడానికి పనికొస్తాయి అనే అభిప్రాయానికి వచ్చారు. 1834లో రావిపాటి గురుమూర్తి శాస్త్రి అనే కంపెనీ ఉద్యోగి పంచతంత్ర కథల్ని తెలుగులో రాశాడు. వాటినే 1853లో చిన్నయసూరి తాను లాక్షణికమైనది అనుకునే భాషలో తిరిగి రాశాడు.

[పంచతంత్ర కథలు స్కూళ్ళలో పాఠం చెప్పబడే స్థితికి ఎలా వచ్చాయో స్పష్టంగా బోధ పడటం లేదు. చిన్నయసూరి మద్రాసు యూనివర్సిటీలో తెలుగు హెడ్ మాస్టర్‌గా పని చేసేవాడు. తాను లాక్షణికమైనది అనుకునే భాషలో రాసిన పంచతంత్రానికి ఇంగ్లీషులో ‘నీతిచంద్రిక or Moral stories’ అనే పేరు పెట్టి మద్రాసు యూనివర్సిటీకి, College of Fort St. Georgeకి కార్యదర్శిగా వుండే A.J. Arbuthnot Esq. గారికి సవినయంగా అంకితమిచ్చాడు (respectfully dedicated as a mark of respect), కొత్తపల్లి వీరభద్రరావు, 1986; పే. 239-40.]

పంచతంత్రం సంస్కృతంలో అందరికీ తెలిసిన గొప్ప కథల పుస్తకం. విష్ణుశర్మ అనే పండితుడు మూర్ఖులైన రాజుగారి ముగ్గురి పిల్లల్ని ఆరు నెలల్లో రాజనీతి కుశలులుగా చేస్తానని ప్రతిజ్ఞ చేసి అందుకోసం ఈ పుస్తకం రాశాడు. అంటే దానర్థం ఈ పుస్తకం రాసింది మోరల్స్ అనే నీతిని బోధించడానికి కాదు. రాజనీతి అనే నీతిని బోధించడానికి. నీతి అనే పదాన్ని ఇంగ్లీషులోకి అనువాదం చేయడంలో వచ్చే సాంస్కృతిక సమస్యలు అప్పట్లో వాళ్ళకి స్పష్టపడలేదనే అనుకోవలిసి వస్తోంది. నీతి అనే సంస్కృత పదానికి యూరోపియన్ భాషల్లో సమానార్థకం లేదని పంచతంత్రాన్ని ఇంగ్లీషులోకి అనువాదం చేసిన రైడర్ (Arthur W Ryder) గుర్తించాడు. అతని మాటల్లో ‘నీతి’ అంటే జీవితాన్ని వివేకంగా నడుపుకునే పద్ధతి అని అర్థం. “ఇంగ్లీషులో కానీ, ఫ్రెంచ్‌లో కానీ, లాటిన్‌లో కానీ, గ్రీక్‌లో కానీ ఈ మాటకి సమానార్థకమైన మాట లేనందుకు మనం కొద్దిగా సిగ్గుపడాలి. నీతి అనే ఒక్క మాట కోసం ఈ భాషల్లో చాలా మాటల్ని వాడవలసి ఉంది. కాని ఒకసారి ఆ అర్థం బోధపడితే ఆ మాట స్పష్టం గాను, ముఖ్యం గాను, తృప్తికరం గాను ఉంటుంది.” అని రైడర్ తన అనువాదానికి ముందుమాటలో [Ryder, 1962] రాశాడు. పంచతంత్ర కథల్లో నీతి – లౌకిక ప్రయోజనాల కోసం అవలంబించవలసిన వ్యూహాలు, మార్గాలు, పద్ధతులు వాటికి సంబంధించినది. బ్రిటిష్ పరిపాలకులూ, క్రైస్తవ మిషనరీలూ పిల్లలకి బోధించ దలచుకున్న నీతికీ, ఈ నీతికీ సంబంధం లేదు. అయినా పంచతంత్ర కథలు పిల్లలకి నీతి కథలుగా బోధించడానికి పండితులేమీ సందేహించలేదు.

తెలుగులో మొదటి నీతి పుస్తకం

1846లో పూదూరి సీతారామశాస్త్రి పెద బాలశిక్ష రాశాడు. మళ్ళా మళ్ళా అచ్చయిన ఈ పుస్తకంలో రచయితే కూర్చిన నీతి వాక్యాలు ప్రముఖంగా కనిపిస్తాయి. నీతి అనే అర్థానికి morals అనే కొత్త అర్థం పూర్తిగా స్థిరపడింది. కాని ఈ వాక్యాలు జాగ్రత్తగా చూస్తే సుమతి శతకంలో వున్న పద్యాలకి ఇవి వాక్యరూపాలు అని బోధ పడుతుంది. సుమతి శతకం 1870లో మొదటి సారిగా ఆదిసరస్వతి ముద్రణాలయం వారు ప్రచురించారు. (ఈ సంస్థే తరువాత వావిళ్ళ రామస్వామి శాస్త్రులు అండ్ సన్స్‌గా రూపాంతరం చెందింది.) ఈ ప్రచురణ బహుళ ప్రచారం పొంది చాలా మంది ప్రచురణకర్తల చేత కొన్ని స్వల్పమైన మార్పులు, చేర్పులతో లెక్కలేనన్ని సార్లు తారీకులు లేకుండా ముద్రించబడింది. ఇదే అందరికీ తెలిసిన సుమతి శతకం.

[1966లో ప్రచురించిన సుమతి శతకానికి పీఠిక రాస్తూ నిడదవోలు వెంకటరావు సుమతి శతకం మొట్ట మొదటి సారిగా ఆదిసరస్వతి ముద్రణాలయం వారు 1868 ఏప్రిల్ 20వ తారీకున ప్రచురించారు అని రాశాడు. తెలుగులో ఏ పుస్తకానికైనా ఇంత నిక్కచ్చిగా అది ప్రచురించబడిన సంవత్సరం, నెల, తేదీతో సహా తెలుసుకోవడం చాలా కష్టమైన విషయం. దాదాపు 100 సంవత్సరాల క్రితం ప్రచురించబడిన ఇంత విలువైన సమాచారం వెంకటరావుకి ఎలా దొరికిందో ఆయన వివరించలేదు. కానీ ఈ సమాచారాన్ని ఇంకొక ఆలోచన లేకుండా మచ్చా హరిదాసు (తథ్యము సుమతి: పరిశోధన వ్యాసాలు, 1984, పే. 67), ఆరుద్ర (సమగ్రాంధ్ర సాహిత్యం, 2002, సంపుటం 1, పే 224) తిరిగి చెప్పారు. కాని 1868 సంవత్సరపు ప్రచురణ నాకు ప్రపంచంలో ఏ గ్రంథాలయంలోనూ దొరకలేదు. ఇలాటి ముద్రణ తాము చూసినట్లు ఏ పరిశోధకుడు నాతో చెప్పలేదు. అందుచేత 1870 సంవత్సరపు ప్రచురణనే సుమతి శతకానికి మొదటి ముద్రణగా నేను భావిస్తున్నాను.]

క్రమక్రమంగా ఈ సుమతి శతకం లోంచి కొన్ని పద్యాలు చిన్న తరగతులకి ఉపయోగపడే పాఠ్యపుస్తకాల్లో చేర్చబడ్డాయి. ఉదాహరణకి 1930లో ప్రచురింపబడి Director of Public Instruction వారిచే మూడవ తరగతి పాఠ్య పుస్తకముగా ఆమోదించబడిన ‘ఆనంద వాచకము’లో నీతి పద్యములు అనే పేరుతో సుమతి శతకం నుంచి 10 పద్యాలు ఉన్నాయి. కొంత మంది సుమతి శతక ప్రచురణ కర్తలు కొద్దిగా జాగ్రత్తపడి “బాలురకు గాని బాలికలకు గాని బోధింపదగిన పద్యములు ముందు వ్రాయబడినవి. తరువాత బాఠశాలలయందు బోధింపగూడని పద్యములు వ్రాయబడినవి.” [Sumati Satakamu, 1922] అన్న సూచనతో ప్రచురించారు.