అన్నివైపుల నుండి చీకటి కమ్ముకొస్తుంది. సూర్యుడు ఎత్తైన మేడల వెనుక నుండి మెల్లిగా జారుకుంటున్నాడు. వదిలిపోతున్న సూర్యుణ్ణి తనలో దాచుకోవడానికి ప్రయత్నిస్తూ హడ్సన్ నది ఎర్రబడిపోయింది.
కనిపిస్తున్న ఆ దృశ్యం మొత్తం టచ్ స్క్రీన్ డివైస్ మీద వాల్ పేపర్ అయినట్టు కార్ విండోపై చూపుడు వేలు పెట్టి సూర్యుణ్ణి పైకి లాగబోయింది ఆమె.
“హలో! సన్‍సెట్ బాగుంది కదా అని చూడమన్నాను. సూర్యుణ్ణే మింగేసేట్టు చూడాలా?” అన్నాడతడు.
ఆమె నవ్వలేదు. మూతి బిగించలేదు. సూర్యుణ్ణే మింగేస్తే తనలో ఎంత వెలుగు నిండిపోతుందో ఊహించుకుంటోంది. వెలుగు. ఎంత వెలుగది? చీకటిని పూర్తిగా ముంచేసేంత వెలుగా? మనసు మూలల్లో దాగున్న దిగులుని పోగొట్టేంత వెలుగా? అంత వెలుగు తనలోనే గానీ నిండిపోతే?!
చీకటి చిక్కబడుతుంది. ఒక ఉదుటున మీద పడి గొంతు కొరికే రాకాసి కాదది. అతి మెల్లిగా నరనరాల్లోకి చొచ్చుకుని పోయి, ఆమెను బలహీనపరిచే విషవాయువు అది.
“అబ్బా! ఇక్కడగానీ ఇరుకున్నామా, చచ్చామే!” మళ్ళీ తనే.
ఆమె బయటకు చూసింది. విద్యుద్దీపాల వెలుతురులో ప్రయాణం సాఫీగానే సాగుతున్నా, ఆమె చూపంతా ఎక్కడో దూరాన, ఆకాశాన నిలిచి ఉండటంతో తననే చీకటి చుట్టుముట్టేస్తుందన్న భావన కలిగి సీటులో ముడుచుకొని పోయింది.
“హలో! ఏంటా పరధ్యానం?” కార్‍తో పాటు ఆమె ఆలోచనలకూ బ్రేక్ వేశాడు.
ఒక చిరునవ్వు. ఆమె మొహమంత చీకటిలో రవ్వంత వెలుగు.
“సో… వాట్ బ్రింగ్స్ యు హియర్? ఇన్నేళ్ళ తర్వాత?”
“ఫేస్‍బుక్ లో పొరపాటున లాగిన్ అయ్యాను.” మళ్ళీ ఓ చిరురవ్వ వెలిగి ఆరిపోయింది. “ఫామిలీ ఫంక్షన్‍కని వచ్చాను. కొంచెం రిసర్చ్ పని కూడా…”
“రిసర్చ్?”
“హుఁ, ఫోక్‍లోర్ మీద చేస్తున్నాను.”
“కూల్! ఇంకా? మీ ఆయన సంగతులేంటి? పిల్లలూ..?”
మొబైల్‌పై ఆడుతున్న ఆమె చేతివేళ్ళు ఆగిపోయాయి. ఇలాంటి ప్రశ్నలకు ఆమె దగ్గర సమాధానాలు సిద్ధంగా ఉంటాయి గానీ, ఆ క్షణాన ఎందుకో అబద్ధాలు బయటకు రాలేకపోయాయి. మొహం మీదకు తీక్షణంగా వెలుగు చిమ్ముతున్న ఆమె చేతిలోని మొబైల్ నిద్రావస్థకు జారుకుంటూ చీకటైపోయింది. అదే క్షణాన, ఆ చీకటిలో అతడి ఫోన్ వెలిగింది.
“హేయ్ లారెన్, … ఆహా, … హూఁ, లెట్స్ సీ, … నౌ … డోన్ట్ పానిక్, లెట్స్ వర్క్ ఇట్ అవుట్, … ఆహా, … యా, … యప్ …”. అతడి పొడిపొడి మాటల మధ్యలో ఆమె సర్దుకొని మామూలు మనిషి అయ్యింది.
“నా స్టూడెంట్. డాన్స్ అకాడమీలో. ఓ మంచి కథ కోసం వెతుకుతున్నాం. బాలే పర్ఫామెన్స్ కోసం. ఏదైనా మంచి కథ ఉంటే చెప్పు.”
“ఎలాంటి కథ?”
“ఎలాంటిదైనా పర్లేదు.ఆ అమ్మాయి డాన్స్ చాలా గ్రేస్‌పుల్‌గా ఉంటుంది. ఆమె మీదే ఫోకస్ ఉండేలా, అమ్మాయి కథైతే బాగుంటుంది. మాయలూ, మంత్రాలూ ఉంటే ఇంకా బాగుంటుంది.”
ఆమె ఆలోచనలో పడింది. మాటలు లేని ఓ రెండు నిముషాలు అతణ్ణి ఇబ్బంది పెట్టాయి.
“మళ్ళీ? హలో! లాస్ట్ అగైన్? ఇంతకీ నీ కథేంటి?”
“అనగనగా ఓ చిన్న రాజ్యం. దానికో రాజు, రాణి. వాళ్ళకో రాకుమారి…” ఆమె కథ చెప్పటం మొదలెట్టిందని గ్రహించి ఆశ్చర్యపడి, శ్రద్ధగా వినడానికి ఓ క్షణం పట్టిందతడికి.
“రాకుమారి అందగత్తె. ఇరుగుపొరుగు రాజ్యాలలో కూడా ఆమె అందం గురించి కథలు కథలుగా చెప్పుకునేవారు. దానికి తోడు రాజుగారు ఆమెకు మంచి చదువు చెప్పించారు.ఆటపాటల్లోనూ ఆమె ముందుండేది. ఆమెకు పెళ్ళీడు వచ్చింది. అర్హత ఉన్నా లేకున్నా ఆమెను మనువాడాలని ప్రతి యువకుడూ కలలు కనేవాడు. స్వయంవరం వరకూ రాకుండానే ఆమె తనకు నచ్చిన మరో రాజ్యపు రాకుమారుని వరునిగా ఎంచుకున్నానని రాజురాణిలతో చెప్పింది. ఆమె పెళ్ళి అతడితో అంగరంగ వైభవంగా జరిగింది…”
“… తొలిరేయి. ఊహలెన్నో కవ్విస్తుండగా ఆమెను రాకుమారుడు సమీపించాడు. ‘ప్రియా’ అంటూ చేయి పట్టుకున్నాడు. మెల్లిమెల్లిగా ఆమె చేయి మొద్దుబారిపోయి, రాయిగా మారింది. అతడు కంగారుపడి ఆమె భుజంపై చేయి వేశాడు. భుజం కూడా రాయై పోయింది. ఏం చేయాలో తోచక ఆమెను దగ్గరకు తీసుకున్నాడు. ఆమె అచ్చంగా శిలగా మారిపోయింది.”
“ఓహ్! ఎందుకలా?”
“ఏమో…?”
అప్పుడే వాళ్ళు చేరాల్సిన చోటుకు చేరుకున్నారు – టైమ్స్ స్క్వేర్.
కార్ ఒకచోట పార్క్ చేసి కొంచెం దూరం నడిచి వెళ్ళాలి. జనాన్ని తప్పించుకుంటూ వెళ్తున్నప్పుడు ఆమెను ‘గార్డ్’ చేయడానికి ఆమె చుట్టూ తన చేతితో కోట కట్టాడు, ఆమెను తాకకుండా. ఆమె భుజం దగ్గరిగా అతడి చేయి వస్తున్నప్పుడల్లా వేళ్ళు సన్నగా వణకటం ఆమె ఓరకంట గమనించింది. ఒకప్పుడు ఆ చేతుల్లో ఒదిగిపోయిన తనువు ఇప్పుడెంత అంటరానిదయ్యిందో గ్రహించింది.
అప్పటికే వాళ్ళు కలవాల్సినవాళ్ళందరూ వచ్చి ఉన్నారు. మాటమాటల్లో వాళ్ళున్న ప్రదేశాన్ని, దేశాన్ని, కాలాన్ని వదిలి ఎన్నో వేల మైళ్ళ దూరంలో గడిచిన గతంలోకి ప్రయాణించారు. కాలేజిలో వాళ్ళ అడ్డాకు చేరుకున్నారు.
జ్ఞాపకాలతో వారి సల్సా మొదలయ్యింది. గడిచిన ఘడియల అడుగుల్లో అడుగులు వేశారు లయబద్ధంగా. ఎదుటకు వచ్చిన గతం మెడకు దండలా రెండు చేతులనూ వేసి, పెనవేసుకొని విడిపడి-విడిపడి పెనవేసుకున్నారు కాసేపు. నిటారుగా నిలుచున్న గతం వేలు పట్టుకొని కాస్తకాస్తగా మోకాలు వంచుతూ కిందకు ఒదిగిపోయి, బొంగరంలా తిరిగారు మరి కాసేపు. గతానికి దూరదూరంగా తిరుగుతూ, ఒక ఉదుటున దాన్ని ఆలింగనం చేసుకున్నారు మధ్యమధ్యలో. మధ్యలో ఉన్నట్టుండి ఒకరు –
“హేయ్, యు వోంట్ బిలీవ్ దిస్! మా టీమ్‌లో కొత్తగా ఒకతను వచ్చాడు. రీసెంట్ గ్రాడ్యుయేట్. అవర్ కాలేజ్. నన్నే బాచ్ అని అడిగాడు. చెప్పాను. యు నో వాట్ హి సెడ్? …హాఁ?”
అందరి దృష్టీ అటువైపుకు…
“కార్తీక్-రోహిణీ బాచ్? అని అడిగాడు. నేను షాక్! ఏం చెప్పాడో తెలుసా? ఇప్పటికి ఫేర్వెల్ పార్టీలో మీరు చేసిన డాన్స్ గురించి జనాలు మాట్లాడుకుంటారట! బెస్ట్ డాన్సింగ్ పెయ్‌ర్ అని.”
ఇంకా ఏవో మాటలు కురుస్తూనే ఉన్నాయి. ‘కార్తీక్-రోహిణి’ అని వినిపించగానే ఆమె అతడిని చూసింది. అదే క్షణాన అతడూ చూశాడు. చూసి, చూపు తిప్పుకున్నాడు. ఐస్ వల్ల గ్లాస్‌కి చెమటలు పడుతున్నాయి. ఆమె అతడిని గమనిస్తూనే ఉంది. ఒక్కో గుక్క తాగి, గ్లాస్ కిందపెట్టి, ఆమెను చూడబోయి, ఆమె గమనిస్తుందని గమనించి, రెప్పలనీడలో కళ్ళను అటూ ఇటూ పరిగెత్తిస్తూనే ఉన్నాడు. వాళ్ళిద్దరి డాన్స్ గురించే ఇప్పుడు అందరూ తలా ఒక మాట మాట్లాడుతున్నారు. అతణ్ణి ఆటపట్టించడానికన్నట్టు ఆమె అతడినే చూస్తూ ఉంది.
తన ప్రేమ మూగదనీ, తనంతట తాను చెప్తేగానీ అది ఎవరికీ తెలియదనీ అతడి పొగరు. ఆమె నడుం చుట్టూ చేతులు వేసేటప్పుడు వణికే అతడి వేళ్ళు, ఆమెను దగ్గరకు లాక్కున్నప్పుడు అతడి గుండె చప్పుడు, ఆమెను గాల్లోకి లేపి మళ్ళీ క్షేమంగా తీసుకొచ్చే వరకూ అతడి ఏకాగ్రత, కౌగిలింతల్లో అతడి ఊపిరిలోని వేడి, అతడిని ఎప్పటికప్పుడు రెడ్‌హాండెడ్‍గా ఆమెకు అప్పజెప్పేవని అతడికి తెలీదు.
వాళ్ళిద్దరూ చేసిన ఒక డాన్స్ బాలేని గుర్తుజేశారు ఇంకెవరో.
అందానికి అహంకారపు తొడుగు వేసుకొని విర్రవీగే ఆడదానిగా ఆమె. అందానికి మోకరిల్లే మగాడిగా అతడు.
‘వలచాను ప్రియా! ఒడి చేరు,’ అని మోకాళ్ళపై కూర్చొని అర్థిస్తున్న అతడి ఛాతీపై తన్ని, కాలి కొనగోటితో అతడి చెంపపై గీరి ఆమె వెళ్ళిపోబోతుండగా, ఆమె పాదాన్ని రెండు చేతుల్లోకీ తీసుకొని వాటిని అతడు ముద్దాడగానే, కలిగిన తన్మయత్వంలో ఆమె వేసుకున్న అహంకారపు కాస్ట్యూమ్ పటాపంచలై అందం అతడి సొంతమయ్యే సీన్.
దాని రిహార్సల్స్ అప్పుడు, ఆమెకు రెండు రోజులు బాగోలేకపోతే, వేరే అమ్మాయి చేసింది. ఆ అమ్మాయి కాలు అతడి ఎదను తాకకముందే అతడు తూలిపోయేవాడు. ఆమె కాలుగోరు అతడి చెంపకు చేరక ముందే తల వాల్చేసేవాడు. ఆమె పాదాలు అతడి అరచేతుల్లో గాలిలో ఉంటాయి. వాటిని ముద్దాడేది అతడి పెదవులు కావు, వాటి నీడ.
ఆమెను పరధ్యాన్నం లోనుండి మళ్ళీ ఒకరు బయటకు లాగాల్సివచ్చింది. కాసేపటికి డిన్నర్ ముగిసింది. ఇన్నాళ్ళకు మళ్ళీ అందరూ కల్సుకున్నందుకు తృప్తిగా నిట్టూర్చి ఎవరి గూటికి వాళ్ళు ఎగిరిపోయారు.
“కాసేపు టైమ్స్ స్క్వేర్‌లో తిరుగుదామా?” అప్పుడే విడిపోవడం ఇష్టం లేని రెండు మనసులూ అడిగిందదే, కొంచెం తటపటాయిస్తూనే.
కళ్ళు జిగేలుమనిపించే నియాన్. భారీగా ఉన్న డిజిటల్ ఎడ్వర్టయిజింగ్ బోర్డులు. మిరుమిట్లు గొలిపే కాంతులతో వీధులన్నీ దేదీప్యమానంగా వెలుగుతున్నాయి. నల్లని ఆకాశం వెలివేయబడిన దానిలా ఎక్కడో సుదూరంగా ఉంది. కొత్తగా ఒక ఆకాశం ఏర్పడింది, విద్యుద్దీపాలతో. తల ఎటు తిప్పినా వెలుగే! ఆ కాంతుల్లో ఆమె మేను కొత్త ఛాయను సంతరించుకుంది.
దీపం చుట్టూ మూగే పురుగుల్లా మనుషులు ఆ వెలుగుల్లో, హడావుడిగా, తత్తరపాటుగా. చిన్నవి మొదలకుని అన్ని సైజుల కెమేరాలు క్లిక్ మంటూ, వాటి ఫ్లాష్‌లు నేలమీద నక్షత్రాల్లా…
కాసేపు షాపింగ్. కాసేపు నడక. కాసేపు కబుర్లు. కబుర్లలో దొర్లిన కథ ప్రస్తావన, ఆమెకు నచ్చని విధంగా.
“అవునూ! ఇందాకేదో కథ చెప్తూ ఉన్నావ్! ఇంతకీ, ఆమె సమస్యేంటి?”
“సమస్య ఆమెలోనే ఉందని ఎలా నిర్ణయిస్తావ్?”
“అరే! రాయిగా మారింది ఆమె కదా, సమస్య ఆమెదే కదా?”
“ఏం? ఆ స్పర్శలో సమస్యుండచ్చుగా?”
“వాదాలు వద్దు గానీ, పోనీ ఏదోటిలే, తర్వాత ఏమైంది?”
“ఏముంది? ఈ శిలను నేనేలుకోలేను అని వదిలివెళ్ళిపోయాడు.”
“తర్వాత?”
“కథ అయిపోయింది. లేదా ఆగిపోయింది.”
“ఆర్ యు క్రేజీ!? ఏంటీ కథ అసలు?”
“ఏం ఇది కథ ఎందుక్కాకూడదు?” – ఆమె పైకి అనాలని అనుకోలేదు.ఆ ప్రశ్నకు ఎలా సమాధానం చెప్పాలో తెలీక అతడూ ఏం మాట్లాడలేదు. ఆమెలో ఆ ప్రశ్నతో కాస్త అణిగిమణిగి వున్న చీకటి నిద్ర లేచి ఒళ్ళు విరుచుకుంది. రాకాసిలా ఆమెను మింగేస్తుంది ఇంకాసేపట్లో. కానీ ఎదుట అతడున్నాడే? ఈ పూట దానికి లొంగకూడదు. ఎలా? ఎలా?
అంతలో ఓ లైఫ్ సైజ్ మికీ మౌస్ వచ్చి ఆమెకు షేక్‌హ్యాండ్ ఇచ్చాడు. అతడితో చేయి కలిపింది. అందిన చేయి వదలకుండా మికీ అడుగులు వేయడం మొదలెట్టాడు, ముందు మామూలుగా, తర్వాత లయబద్ధంగా. పక్కనే గిటార్లు మెళ్ళో వేసుకున్న ఓ జంట వాటిని వాయించటం మొదలెట్టారు. సంగీతం మొదలవ్వగానే గుమిగూడినవారంతా మికీ చేతిలో చేయుంచిన ఆమెనే చూస్తున్నారు. కంగారుపడి, జనంలో ఉన్న అతడిని చేయి పట్టుకొని లాగేసింది మధ్యలోకి. మికీ తప్పుకున్నాడు. సంగీతపు వేగంలో అంటీముట్టకుండా డాన్స్ మొదలెట్టినా రాను రాను జోరు పెరిగి ఒక్కప్పటి ఈజ్ వచ్చింది ఇద్దరి మధ్య.
ఊపిరి పీల్చుకోవటం కష్టమయ్యేంత వరకూ ఆ సంగీతం, ఆ నాట్యం ఆగలేదు. ఆగగానే, దూరం నుంచి ఎదురు చూస్తున్న ఇబ్బంది వారిద్దరి మధ్య చటుక్కున దూరింది. ఆలస్యం అవుతోందన్న వంక కూడా దొరికింది.
తిరిగి ఆమెను క్షేమంగా ఆమె ఉంటున్న హొటేల్ దగ్గర దింపి, అతడు వెళ్ళిపోయాడు. ఆ రాత్రీ ఆమెకు నిద్రపట్టలేదు. హొటేల్ గదికున్న కర్టెన్లు పక్కకు జరిపి, బయటకు చూసింది. వీధుల్లో వెలుగు. దూరంగా హడ్సన్ నది చీకటిలోనూ వెలుగుతోంది. ఆమె నదిని చూస్తూ అలానే చాలాసేపు ఉండిపోయింది.
ఓ నెల గడిచాక, అతడి ఇన్‍బాక్స్‌లో ఆమె నుండి ఒక మెయిల్.
డియర్ కార్తీక్,
న్యూయార్క్‌లో ఆ పూట నీకు చెప్పిన కథ అర్థాంతరంగా ముగిసిందన్నావ్ కదా! ఇదిగో, దాని ముగింపు ఇప్పుడు పంపిస్తున్నాను.
భర్త విడిచిన రాకుమారి పరిస్థితి దారుణంగా తయారయ్యింది. మొదట్లో పగలు బాగానే ఉండి, రాత్రి మాత్రమే రాయి అయ్యేది. రానురాను పగలు కూడా బండబారిపోయేది. రాజుగారు చూపించని వైద్యులు లేరు. ప్రయత్నించిన పరిష్కారం లేదు. అయినా గుణం కనిపించలేదు.
అప్పుడు దూరదూరాల నుండి వచ్చిన ఓ ఫకీరు, రాకుమారిని పరీక్షించి, ఏవో మందులిచ్చి ఆమె పగలు బాగుండేలా బాగుజేశాడు. ఆమెను పూర్తిగా మనిషిని చేస్తే కోరుకున్నది ఇస్తానని రాజుగారు ప్రకటించారు. కానీ ఆ ఫకీరు తనకు చేతనైనది మాత్రమే చేయగలననీ, చేయలేనిది ఎంత ప్రయత్నించినా చేయలేననీ విన్నవించుకున్నాడు. వెళ్తూ వెళ్తూ రాకుమారితో ఏకాంతంలో ఇలా చెప్పాడు:
“నిన్నో కాళరాత్రి కాటేసింది. దాని విషప్రభావాన్ని నేను కొంచెమే తగ్గించగలిగాను. తక్కినది తగ్గించాలంటే వైద్యం కోసం నువ్వే వెతుక్కోవాలి. ఎక్కడినుండో తెప్పించడం, ఎవరినో రప్పించడం కాదు. నువ్వు వెళ్ళాలి. ముల్లును ముల్లే తీసినట్టు, నిన్ను మరో రాత్రే కాపాడుతుంది.”
ఫకీరు ఇచ్చిన సలహాను పాటిస్తూ ఆమె తన కోటను విడిచి దేశదేశాలు తిరగటం మొదలుపెట్టింది. అలా తిరుగుతూండగా అనుకోకుండా తనని ఒకప్పుడు ఆరాధించిన మనిషిని కల్సుకుంది, ఒక ఊరిలో.
అదొక విచిత్రమైన ఊరు. అక్కడ చీకటిపడగానే, దివ్యశక్తులున్న ఆ ఊరి ప్రజలు వెలుగును సృష్టిస్తారు. సృష్టించడమే కాదు, ఆ వెలుగుతో బోలెడన్ని ఆకారాలను చేస్తారు. చేసి వాటిని మేడలకూ, గోడలకూ వేలాడదీస్తారు. ఆ ఊర్లో రాత్రి కూడా తళుక్కుమంటుంది. అలా తళుక్కుమంటున్న రాత్రిని రాకుమారి రెప్పార్పకుండా సూటిగా చూసింది. అలా చూడ్డంలో ఏదో క్షణాన ఆమెలోని చీకటి ఆ ఊరిలో, ఆ వెలుగులో మాయమైపోయింది.
ఆపై ఆమె మనిషిగా మిగిలింది, పగలూ, రాత్రి కూడా!
రిగార్డ్స్,
రోహిణి