శాస్త్రీయ సంగీతం గురుముఖంగా నేర్చుకోకుండా అద్భుతంగా పాడేవారు అరుదుగా కనిపిస్తారు. అలాంటి వారిలో ప్రముఖంగా చెప్పుకోవలసిన వ్యక్తి శ్రీ ప్రతివాది భయంకర శ్రీనివాసాచార్యులు. సంగీత ప్రియుల హృదయాల్లో ‘పిబిఎస్’గా స్థిరపడ్డ ప్రముఖ సినీ సంగీత నేపథ్యగాయకుడు ఈ సంవత్సరం ఏప్రిల్ 14 తారీకున, తన 82వ ఏట కాలం చేశారు. శ్రీనివాస్ ఇంటి పేరు ప్రతివాది భయంకర కావచ్చు గాని ఆయన ఒక అజాతశత్రువు. ఒక వ్యక్తి సౌజన్యాన్ని, సౌహార్దాన్ని, సౌశీల్యాన్ని ఏకగ్రీవంగా అందరు మెచ్చుకోవడం అరుదే. గాయకుడిగా పిబిఎస్ విశిష్టతను గుర్తు చేసుకోవటం కోసమే ఈ నివాళి వ్యాసం!
పి. బి. శ్రీనివాస్ (1930-2013)
తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలులో 22 సెప్టెంబర్, 1930లో జన్మించిన పిబిఎస్ చిన్ననాటి జీవితం, చదువు కాకినాడలో జరిగింది. కాలేజీ పూర్తయిన తరువాత లా చదువు కోసం చెన్నై రావటం, సినిమాల్లో పాటలు పాడటం జరిగాయి. ఈ బహుముఖ ప్రజ్ఞాశాలి జీవితంలో సినిమా పాటల ఘట్టం విశిష్టమైనది అయినా, పిబిఎస్ సాహిత్య రంగంలో సలిపిన కృషి కూడా ఘనమైనదే. ఈ వ్యాసంలో పిబిఎస్ పాడిన తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం పాటల ప్రస్తావనే కాకుండా హిందీ పాటలను గురించి కూడా అక్కడక్కడ ముచ్చటించటం జరిగింది. (పాఠకుల సౌలభ్యం కోసం అక్కడక్కడా ఇతరభాషల పాటల సాహిత్యాన్ని, అర్థాన్ని ఇచ్చే ప్రయత్నం చేశాం.) పిబిఎస్ సుదీర్ఘ సినీ జీవిత ప్రయాణంలో ఎన్నో ఘట్టాలున్నా, వాటన్నిటినీ ఇక్కడ పొందుపరచటం సాధ్యం కాదు కాబట్టి, ఈ విశిష్ట వ్యక్తి పాడిన కొన్ని పాటలను పాఠకులకు గుర్తు చెయ్యటం మా ముఖ్యోద్దేశం.
తెలుగు పాటలు
సాలూరి రాజేశ్వర రావు సంగీత దర్శకత్వంలో భీష్మ అన్న సినిమా 1960 దశాబ్దంలో విడుదల అయ్యింది. ఈ సినిమాలో అప్పటి ప్రముఖ సినీ తారలైన అంజలీ దేవి, కాంతారావులు నటించగా మనసులోని కోరిక, తెలుసు నీకు ప్రేమిక అన్న యుగళ గీతాన్ని అప్పటి నేపథ్య గాయకులైన సుశీల, పిబిఎస్ లచే పాడించారు. గీత రచన ఆరుద్ర. ఈ పాటని కల్యాణి రాగంలో బాణీ కట్టారు సాలూరి. కల్యాణి రాగాన్ని పరిచయం చేస్తూ ఈమాటలో గతంలో వచ్చిన రెండు వ్యాసాల్లో ఈ పాట ప్రసక్తి ఉంది. అతి లలితంగా వినటానికి ఈ పాట హాయిగా ఉన్నా, ఈ పాట పాడాలని ప్రయత్నిస్తే అంత తొందరగా పట్టుబడే పాట కాదు అన్న విషయం తెలిసిపోతుంది. పాట మొదలవుతూనే సుశీల గొంతులో పలికే ఆలాపన ఒక ఎత్తు. పిబిఎస్ గొంతులో వినిపించే ‘పడతి చేతి మహిమ వలన…’ అన్న మొదటి చరణం నుంచి పాట చివర దాకా సుశీల, పిబిఎస్‌ల యుగళ గాత్రం మరొక ఎత్తు.
మనసు లోని కోరిక తెలుసు నీకు- భీష్మ శ్రీ రఘురాం జయ రఘురాం – శాంతి నివాసం మనసు మనసు కలిసే – రంగుల రాట్నం
ఈ పాట ఒక ఉదాహరణగా చెప్పటానికి రెండు కారణాలు ఉన్నాయి. మొదటిది, భారతీయ సినీసంగీత ప్రపంచంలో మకుటాయమానంగా వెలిగిపోతున్న హిందీ సినీగీతాలకు ఆ రోజుల్లో నౌషాద్, శంకర్ – జైకిషన్, మదన్ మోహన్, ఎస్. డి. బర్మన్, సి. రామచంద్ర, వంటి హేమాహేమీలు బాణీలు కట్టారు. హిందీ భాష రాక పోయినా ఈ బాణీలు దేశంలో అన్ని ప్రాంతాలవారు పాడుకొనే రోజులవి. అలాంటి తరుణంలో, సాలూరి రాజేశ్వర రావు హిందీ బాణీలంత కమ్మగా తెలుగులో బాణీలు కట్టారు. అందుకు ఒక మంచి ఉదాహరణ ఈ పాట. ఇక రెండవ కారణం, ఎంతో మంది సంగీత దర్శకుల బాణీలు తన గొంతులో వినిపించిన పిబిఎస్‌కి ఒక గొప్ప ప్రశంస సంగీతదర్శకుల వద్ద నుంచి వచ్చేది — పాటకి బాణీ కట్టిన దర్శకుని అంచనాలకి మించి పాడతాడు అని. ఇది రెండవ కారణం. అప్పటికే ఘంటసాల వంటి అతి ప్రతిభావంతులైన గాయకులు ఉన్నా, సాలూరి రాజేశ్వర రావు ఈ పాటకి సుశీలకి తోడుగా పిబిఎస్‌ని ఎన్నుకోవటంలో పాటకి రావలసిన వైవిధ్యం పిబిఎస్ తేగలడనే నమ్మకం ఒక్కటే కారణంలా అనిపిస్తుంది.
1960 దశాబ్దంలోనే, శాంతినివాసం అన్న సాంఘిక చిత్రం విడుదలయ్యింది. ఈ చిత్రానికి సంగీత దర్శకుడు అమర గాయకుడు ఘంటసాల. ఈ సినిమా మొదట్లోనే హంసధ్వని రాగంలో శ్రీరామచంద్ర అన్న శ్లోకము, ఆ వెంటనే శ్రీరఘురాం జయ రఘురాం అన్న యుగళ గీతం అదే రాగంలో నడుస్తాయి. ఈ శ్లోకాన్ని ఆలపించినవారు పిబిఎస్. ఆ తరవాత వచ్చే యుగళ గీతం కూడా సుశీల, పిబిఎస్ లచే పాడించారు ఘంటసాల. ఘంటసాల తాను స్వయంగా ఈ చిత్రానికి సంగీత దర్శకుడై ఉండి కూడా పిబిఎస్ చేత ఈ సినిమాలో పాడించటంలో ఆయన మీద ఉన్న నమ్మకం ఎలాంటిదో తెలుస్తుంది.
ఎంతో కాలం శాస్రీయ సంగీతం నేర్చున్న వారు కూడా పాడలేని పాటలు అతి సునాయాసంగా పి. బి. శ్రీనివాస్ పాడటం వింటూ ఉంటే ఆశ్చర్యం వేస్తుంది. బి. ఎన్. రెడ్డి దర్శకత్వం – సాలూరి సంగీత దర్శకత్వంలో వచ్చిన ఒక మంచి సినిమా రంగుల రాట్నం. ఈ సినిమాలో మనసు మనసు కలిసే వేళా అనే పాట పిబిఎస్ పాడిన పాటలలో ఒక కలికి తురాయి. ఈ పాట బాణీ పట్‌దీప్ రాగంలో కట్టబడింది. హిందూస్తానీ రాగ ప్రధానంగా బాణీలు కట్టిన సినీ గీతాల్లో అరుదుగా వినిపించే ఒక రాగం పట్‌దీప్.
పాటలో శ్రావ్యత
పిబిఎస్ పాటల్లోని శ్రావ్యత గురించి ప్రస్తావించే ముందు సంగీతంలోని కొన్ని ప్రాథమిక విషయాలు గుర్తుకి తెచ్చుకోవాలి. పాటలు పాడేవారికి ఉండవలసిన ఒక ముఖ్యగుణం శ్రుతి నిర్ణయం – పాట పాడుతున్నంత సేపు శ్రుతి తప్పకపోటం. అంటే పాట శ్రుతి శుద్ధంగా ఉండాలన్నమాట! ఒక్కొక్క గాయనీ – గాయకుల సమర్థత బట్టి శ్రుతి నిర్ణయం జరుగుతుంది. సాధారణంగా గాయనీమణుల శ్రుతి తక్కువ గాను, గాయకుల శ్రుతి కొంచెం హెచ్చు స్థాయిలోనూ ఉంటుంది. ఇందులో మళ్ళీ కర్నాటక గాయకుల శ్రుతి స్థాయి హిందూస్తానీ గాయకుల శ్రుతి స్థాయి కన్నా కొంచెం తక్కువగా ఉంటుంది. ఈ శ్రుతి స్థాయిల్లో మినహాయింపులు లేకపోలేదు. పిబిఎస్ గొంతు లలితంగా పలికే శ్రుతి స్థాయి 1. వెస్ట్రన్ భాషలో చెప్పాలంటే C స్కేల్. ఘంటసాల, బాలమురళి కృష్ట్ణ వంటి గాయకుల శ్రుతి స్థాయిలు C స్కేల్‌తో మొదలయ్యినా తారస్థాయిలో షడ్జమం దాటి, మ, ప స్వరాల వరకు కష్టపడకుండా సులభంగా చేరగలరు. కొంతవరకు ఘంటసాల కొన్ని పాటల్లో పై శ్రుతిలో పాడుతున్నప్పుడు, గొంతులో లాలిత్యం లోపించి గాయకుడు శ్రమపడుతున్నాడని తెలిసిపోతుంది. ఇక, శ్రుతి 1లో మొదలయ్యి తారస్థాయిలో గాంధారం దాకా లలితంగా పాడటం పిబిఎస్ నేర్పు. గాంధారం దాటి మధ్యమం, పంచమం దగ్గరకి వచ్చేసరికి పిబిఎస్ గాత్రంలో మార్దవం లోపిస్తుంది. అయితే, తను శ్రమ పడకుండా పాడగలిగే స్థాయిల్లో పిబిఎస్ మరెవరూ చూపలేని లాలిత్యన్ని తన పాటల్లో చూపించారు. అందుకే, ఆయన పాటల్లోని లాలిత్యాన్ని మరొకరు తీసుకురాగలగటం కష్టం!
ఏమి రామ కథ శబరి! శబరి! అది ఒక ఇదిలే – ప్రేమించి చూడు అదిగో మనప్రేమ – ఉషాపరిణయం చిన్నారి చేతులా – అన్నాతమ్ముడు
పిబిఎస్ పాడిన ఎన్నో తెలుగు సినిమా పాటలలో కొంత విలక్షణంగా వినిపించే పాటలు 1960లో వచ్చిన ఒక సినిమాలో ఉన్నాయి. ఆ సినిమా పేరు భక్త శబరి. ఆ సినిమా సంగీత దర్శకుడు పాలగుమ్మి విశ్వనాథం. ఈ సినిమా సంగీత దర్శకుడిగా పెండ్యాల నాగేశ్వర రావు పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ఈ సినిమాలో రాగ మాలికగా సాగే పాట ఏమి రామ కథ శబరి! శబరి! పిబిఎస్ ఒకసారి, మరోసారి పి. సుశీల పాడారు. ఈ బాణీలు సినిమాలో ప్రవేశపెట్టక ముందు రేడియో కోసం పాలగుమ్మి రూపొందించారు. పాటల్లో లలిత సంగీతం అంటే ఎలా ఉండాలో నిర్వచనం చెప్పిన అతి కొద్ది మంది మహామహులలో పాలగుమ్మి విశ్వనాథం గారు ఒకరు. ఈ పాట జాగ్రత్తగా వినండి. ఎంత లలితంగా సాగుతుందో ఈ పాట. దేవులపల్లి కృష్ణశాస్త్రి (పాలగుమ్మి పద్మరాజు ఉచిత సలహాతో) గొప్ప పాటలు రాసిన ఈ సినిమాకి జీవకథ రామకథ. అయితే ఈ జీవ కథలో రససుధ ఈ పాట.
రావే రావే బాలా – కులగోత్రాలు గో గో గో గో గోంగూర
ఇప్పుడు కొన్ని తమాషా పాటలు చూద్దాం! పిబిఎస్ తెలుగు సినిమా పాటల్లో హాస్యరసం ముఖ్యంగా ఉన్న పాటలు ఎక్కువగానే పాడారు. సరదా పాటలు కాబట్టి వీటిని తేలికగా పాడవచ్చు అనుకొనేరు, అలా పాడటం నవ్వులాట కాదు! కులగోత్రాలు అన్న సినిమాలో సాలూరి సంగీత దర్శకత్వంలో, కొసరాజు రచనకు, పిబియస్ జమునా రాణితో కలిసి ‘రావే రావే బాలా, హల్లో మైడియర్ లీలా’ పాడారు. ఈ పాటకి జనాదరణ బాగా లభించింది. పాశ్చాత్య సంగీత పోకడలు కనిపించే ఈ పాట గమ్మతైన సాహిత్యంతో, అంతకన్నా గమ్మతైన సంగీతంతో, సాగుతూ శ్రోతలకు హుషారు కలిగిస్తుంది. విచ్చలవిడి శృంగారాన్ని సమర్ధించే ప్రియుడి కోరికలని, పచ్చి పచ్చి లవ్ చూపావంటే, పిచ్చాస్పత్రిలో వేస్తారు అన్న ప్రేయసి సమాధానం హాస్యరసాన్ని కురిపిస్తూ గమ్మత్తుగా సాగుతుంది. ఇలాంటి మరొక పాట ఇద్దరు మిత్రులు అన్న సినిమా కోసం సాలూరి బాణీ కట్టి పిబిఎస్, సుశీలల యుగళగీతంగా పాడించారు, చక్కని చుక్క సరసకు రావే ఒక్క సారి నవ్విన చాలే అని సాగే పాట. అలాగే తెలుగుదేశమంతా మారుమ్రోగి పోయిన మరో హాస్య గీతం (ఆరుద్ర రచన, అశ్వత్థామ సంగీతం) దేవాంతకుడు చిత్రంలోని గో గో గో గో గోంగూర, జై జై జై ఆంధ్ర అన్నది.
ఎలాగే సుఖాల – వీరభాస్కరుడు అందాలబాల – రమాసుందరి భోగినీ దండకం ఎంత ఘనుడివయ్యా – శ్రీకృష్ణ గారడీ ఆనందమోహనా – కార్తవరాయని కథ సుధామధురము – కృష్ణప్రేమ
భక్తి (ఏమి రామకథ), ప్రణయం (మనసులోని కోరిక), విరహం (వెన్నెల రేయి), విషాదం (మంటలు రేపే) మోహం (అది ఒక ఇదిలే) కవ్వింత (బుచ్చబ్బాయ్) లాంటి రసాలనే కాక, సరదా పాటలు (రావే రావే బాలా, చక్కని చుక్క సరసకు రావే) కూడా అంతే సులువుగా పాడటం మరొకరికి సాధ్యమా? 1966లో గుత్తా రామినీడు ఎంతో సాహసంతో గుమ్మడి ప్రధాన పాత్రధారిగా భక్తపోతన సినిమా తీసినప్పుడు పోతన అంటే నాగయ్యే అన్న భావన ఆనాటి ప్రేక్షకుల్లో స్థిరంగా వుండటంతో గుమ్మడి నటన ఎంత బాగున్నా ఆ చిత్రం విజయవంతం కాలేదు. దానితో పాటు పి.బి. శ్రీనివాస్ ఎంతో బాగా పాడిన భోగినీ దండకం, భాగవతంలోని పద్యాలు కూడా మరుగున పడ్డాయి. అలాగే ఘంటసాల గొంతు ప్రథమ శ్రేణి నటులైన అక్కినేని, నందమూరిలకు స్థిరపడి పోవటంతో, పి.బి. శ్రీనివాస్ ఎక్కువగా ద్వితీయ శ్రేణిలోని నటులకు, లేక డబ్బింగు చిత్రాలకు పాడటం, ఆ చిత్రాలు ఆర్ధికంగా అంత విజయవంతం కాకపోవడంతో మరిన్ని మంచి పాటలు మరుగున పడ్డాయి.
రాదటే చెలీ రాధికా చిలకా గోరింక కులికే పకా పకా చెట్టులెక్కగలవా – చెంచులక్ష్మి
ఈ సందర్భంలో పేర్కొవలసిన మరొక రెండు మంచి పాటలు ‘చెట్టులెక్కగలవా, చిలకా గోరింక’. ఈ రెండు పాటలు చాలామందికి చెంచులక్ష్మి (1958) సినిమాలో ఘంటసాల పాడిన యుగళగీతాలు గానే తెలుసు. కానీ ఇవి మొదట పి. బి. శ్రీనివాస్ గొంతుకలోనే రికార్డు కాబడ్డాయి. కానీ తరువాత కారణాంతరాల వల్ల సినిమా ట్రాకులో ఘంటసాల గొంతు వాడుకోవడం జరిగింది. ఈ పాటలు పి.బి.ఎస్. గొంతుకలో వినండి.
వెన్నెల రేయి – ప్రేమించి చూడు బుజ్జి బుజ్జి పాపాయి – ఆడబ్రతుకు ఓహో గులాబి బాల – మంచి మనిషి
పిబిఎస్ పాడిన మరికొన్ని మరపురాని పాటలు: వెన్నెల రేయి ఎంతో చలీ చలీ (ప్రేమించి చూడు), ఓహో గులాబి బాల (మంచి మనిషి), చిగురాకుల ఊయలలో ఇల మరచిన ఓ చిలుకా (కానిస్టేబుల్ కూతురు) బుజ్జి బుజ్జి పాపాయి (ఆడబ్రతుకు), చక్కని చుక్క సరసకు రావే (ఇద్దరు మిత్రులు), నీవే నీవే నిన్నే నిన్నే (ఇంటీకి దీపం ఇల్లాలే!), తనువుకెన్ని గాయాలైన మాసి పోవు ఏలాగయినా (ఆడబ్రతుకు).
ఎగరేసిన గాలిపటాలు – స్నేహం గోరుముద్దలు – గోరంత దీపం
చివరిగా పి.బి. శ్రీనివాస్ పాటలను గుర్తుకు తెచ్చుకుంటున్న ఈ సమయంలో బాపు-రమణ, ఆరుద్రల కలయికలో వచ్చిన పాటలను కనీసం ఒకటి రెండైనా పేర్కొనకుండా వుండలేము. గోరంతదీపం (1978) సినిమాలో ఆయన పాడిన గజళ్ళ లాంటి కూనలమ్మ పదాలు, 1977 లో వచ్చిన స్నేహం సినిమాలో ఆరుద్ర ఎంతో తేలికైన పదాలతో బాల్య జ్ఞాపకాలమీద రాసిన ఎగరేసిన గాలిపటాలు ఎంత బాగుంటాయి!
పడవ నడపవోయ్ ఇదేకదా తొలిరేయి హృదయ సమీర సాంధ్య ప్రణయసీమ పయనమవుదామా
సినిమా పాటలే కాకుండా అసంఖ్యకంగా ప్రైవేటు రికార్డులు, క్యాసెట్లు కూడా యిచ్చారు. వీటిలో కొన్ని గజళ్ళు, యుగళగీతాలు ఉన్నా, అధిక భాగం భక్తి పరమైనవి. ఇక్కడ ప్రముఖంగా చెప్పుకోవలసినది దేవులపల్లి కృష్ణశాస్త్రిగారి సాహిత్యానికి ఆయనే వరసలు కట్టుకుని పాడిన టేపు. ఇవే కాకుండా రేడియో, టి.వి.ల్లో చాలా లలితగీతాలని పాడారు. పడవ నడపవోయ్, ఇదే కదా తొలిరేయి (ఎస్. జానకితో, ఒక ఆత్రేయ నాటకంలోని పాట), హృదయ సమీర సాంధ్య లాస్యము లాంటి పాటలు విజయవాడ కేంద్రం ద్వారా తరచుగా వినపడేవి. ఈ లలితగీత పరంపరలో మరో రెండు మంచి పాటలు: రాదటే చెలి రాధికా, ప్రణయసీమ పయనమవుదామా (కె. జమునారాణితో).
తమిళ పాటలు
పిబిఎస్ తమిళంలో మొదట జెమినీవారి మిస్టర్ సంపత్ సినిమాలో కోరస్ పాడాడు. ప్రధాన గాయకుడిగా ఆర్. నాగేంద్రరావు నిర్మించిన జాదగం చిత్రం మూడు భాషలలోనూ (కన్నడ – జాతకఫల; తెలుగు – జాతకఫలం) పాడాడు. తరువాత విడుదలై సినిమాకి పని చేశాడు. అలాగే పక్కింటి అమ్మాయి తమిళ వెర్షన్‌లో (అడుత్త వీట్టు పెణ్) పాడిన పాటలకు (మాలైయిల్ మలర్ సోలైయిల్) కూడా బాగా పేరు వచ్చింది. 1950లలో జెమినీ గణేశన్‌కు ఎ.ఎం. రాజా పాటలు పాడేవాడు. కాని వీరపాండ్య కట్టబొమ్మన్ చిత్రానికి సంగీత దర్శకుడు రామనాథన్ శ్రీనివాస్ చేత జెమినీ గణేశన్ కోసం పాడించాడు (ఇన్బం పొంగుం వెణ్ణిలా వీశుదే). ఆ తరువాత ఎన్నో సినిమాలలో జెమినీ గణేశన్‌కు మాత్రమే కాకుండా శివాజీ గణేశన్, ఎం. జి. రామచంద్రన్, ముత్తురామన్ వంటి నటులకు పాడటానికి శ్రీనివాస్‌ను విశ్వనాథన్-రామమూర్తి లాటి సంగీత దర్శకులు ఎన్నుకొన్నారు.
జాదగం – శిందనై ఎన్ శెల్వం నాన్ ఉన్నై శేర్న్ద శెల్వం నినైప్పదెల్లాం నడందు విట్టాల్ ఇంద మండ్రత్తిల్ ఓడివరుం ఇళం తెండ్రలై రోజామలరే రాజకుమారీ
బలే పాండియా, శుమైతాంగి, నెంజిల్ ఓర్ ఆలయం (మనసే ఒక మందిరం), కాదలిక్క నేరమిల్లై (ప్రేమించి చూడు), పోలీస్‌కారన్ మగళ్ (కానిస్టేబుల్ కూతురు) చిత్రాలలోని పిబిఎస్ పాటలు పేరు గడించుకొన్నాయి.
కొన్ని ఆణిముత్యాలు: అత్తిక్కాయ్ కాయ్ కాయ్, మనిదన్ ఎన్బవన్ దెయ్వమాగలాం, మయక్కమా కలక్కమా,అనుబవం పుదుమై(అది ఒక యిదిలే), నాళాం నాళాం తిరునాళాం (సుశీలతో), ఇంద మండ్రత్తిల్ ఓడివరుం ఇళం తెండ్రలై (జానకితో, చిగురాకుల ఊయెలలో), పొన్ ఎన్బేన్ శిరు పూవెన్బేన్ (పూవు వలె విరబూయవలె), నినైప్పదెల్లాం నడందు విట్టాల్ (తలచినదే జరిగినదా), నిలవే ఎన్నిడం నెరుంగాదే, నాన్ ఉన్నై శేర్న్ద శెల్వం, జానకితో పాదకాణిక్కై సినిమాలో పూజైక్కి వంద మలరే వా, మణప్పందల్ సినిమాలో ఉడలుక్కు ఉయిర్ కావల్ (తెలుగులో ఇంటికి దీపం ఇల్లాలే లోని ఎవరికి ఎవరు కాపలా, ), వీరత్తిరుమగన్ సినిమాలో రోజామలరే రాజకుమారీ, వాళ్కైప్పడగు సినిమాలోని చిన్న చిన్న కణ్ణనుక్కు ఎన్నదాన్ పున్నగైయో — ఇలా ఎన్నో ఎన్నెన్నో మధురగీతాలు.
హిందీ సినిమా న్యూఢిల్లీ తమిళంలో కూడి వాళ్దాల్ కోడి నణ్మై అనే సినిమాగా తీశారు. శంకర్-జైకిషన్‌ల సంగీతదర్శకత్వంలో పిబిఎస్ కిశోర్‌కుమార్ హిందీలో చేసినట్లు తాను కూడ యోడెలింగ్ చేసినది ఆయనకే ఒక మరపురాని అనుభవం. ఇంటిలో రిహర్సల్ చేసేటప్పుడు దానిని కుక్క కూతలు, నక్క కూతలు అని గేలి చేసేవారట.
ఇందులో ఒక రెండు పాటలను గురించి కొంచెం చర్చిద్దాం. మొదటిది, ‘పావమన్నిప్పు’లో విశ్వనాథన్-రామమూర్తి దర్శకత్వములో జెమినీ గణేశన్‌కి పాడిన కాలంగళిల్ అవళ్ వసందం అనే పాట, పిబిఎస్ గాత్రంలోని మార్దవాన్ని, మాధుర్యాన్ని చాటి చెబుతుంది. 1961లో ఆ పాటను పాడిన పిబిఎస్, ఆ తరువాత ఎన్నో పాటలను పాడాడు. పాడడం మానేసినా, ఇప్పుడు మనమధ్య లేకపోయినా, ఈ పాట విన్నప్పుడు మాత్రం మనముందు ఎప్పుడూ నిలిచేది పిబిఎస్ గాత్రంలోని వసంత ఋతువు వైభవం, ఆమని అందాలే. కణ్ణదాసన్ వ్రాసిన ఆ పాట ఇది:
కాలంగళిల్ అవళ్ వసందం
కాలంగళిల్ అవళ్ వసందం
కలైగళిలే అవళ్ ఓవియం
మాదంగళిల్ అవళ్ మార్గళి
మలర్గళిలే అవళ్ మల్లిగై
(ఋతువులలో వసంతము, కళలలో చిత్రకళ, నెలలలో మార్గశిరము, పూలలో మల్లెపూవు ఆమె)
పరవైగళిల్ అవళ్ మణిప్పురా
పాడల్గళిల్ అవళ్ తాలాట్టు
కనిగళిలే అవళ్ మాంగని
కాట్రినిలే అవల్ తెండ్రల్
(పక్షులలో ముద్దు పావురము, పాటలలో జోలపాట, పండ్లలో మామిడిపండు, పవనాలలో పిల్లగాలి ఆమె)
పాల్‌పోల్ శిరిప్పదిల్ పిళ్ళై – అవళ్
పనిపోల్ అణైప్పదిల్ కన్ని
కణ్పోల్ వళర్పదిల్అన్నై – అవళ్
కవిజ్ఞ నాక్కినాళ్ ఎన్నై
(అమాయకముగా నవ్వుటలో శిశువు, మంచులా కౌగిలించుకొనుటలో షోడశి, కంటిలా కాపాడుటలో తల్లి, ఆమె నన్ను ఒక కవిగా మార్చినది)
భగవద్గీత విభూతియోగములో శ్రీకృష్ణుడు అర్జునుడితో, విశ్వంలో ప్రతి చరాచరవస్తువులో అతి శ్రేష్ఠమైన వస్తువును పేర్కొని తాను కూడ అదేనంటాడు. మాసానాం మార్గశీర్షోఽహం ఋతూనాం కుసుమాకరః అని అంటాడు. కణ్ణదాసన్ బహుశా వీటిని పల్లవిగా తీసుకున్నాడేమో. ఒక పాట చక్కగా అమరాలంటే దానికి చిత్రంలోని సన్నివేశం, పాట సాహిత్యం, సంగీతం, నటీనటులు — ఇవన్నీ చక్కగా కుదరాలి. నిజ జీవితంలో భార్యాభర్తలైన సావిత్రీ గణేశన్లు నటులు. వేణువు, వయలిన్, అకార్డియన్, మృదంగ వాద్యాలతో నేపథ్య సంగీతం. పిబిఎస్ తరువాత పాడిన ఎన్నో ప్రేమ పాటలకు ఇది ఒక మార్గదర్శిగా నిలిచిపోయిందంటే అతిశయోక్తి కాదు.
మయక్కమా కలక్కమా మనిదన్ ఎన్బవన్ దైవమాగలాం
కాలంగళిల్ అవళ్ వసందం మదికి ఆనందాన్నిచ్చే శృంగారగీతమయితే, 1960లో విడుదలైన శుమైతాంగి చిత్రంలో, ‘మనిదన్ ఎన్బవన్’ మనసు పడే నిరాశానిస్పృహలను ఎత్తి చూపిస్తుంది. ఈ సినిమాలో అన్ని పాటలు కర్ణానందంగా వుంటాయి. అందులో తాత్విక చింతనలతో నిండిన రెండు పాటలు ఉన్నాయి. అవి – మయక్కమా కలక్కమా, మనిదన్ ఎన్బవన్. మయక్కమా కలక్కమా పాటలో వాయువాద్యాల నేపథ్యం మనకు ఒక విచిత్రమైన అనుభూతిని కలిగిస్తుంది. మనిదన్ ఎన్బవన్ దైవమాగలాం వినడానికీ,చూడడానికీ కూడా బాగుండే పాట.
సన్నివేశం మదరాసు లోని మెరీనా బీచి. నిర్జనంగా ఉన్న ఆ రాత్రిపూట ఏకాంతంగా జెమినీ గణేశన్ గాంధీ బొమ్మ దగ్గర నడుస్తూ పాడతాడు. తాను ప్రేమించి పెండ్లి చేసుకోవాలన్న పిల్లతో పెళ్ళి ఆగిపోతుంది. ఆ నిరాశ ఈ పాటలో ప్రతిధ్వనిస్తుంది. నేపథ్య సంగీతంలో వేణువు, వయలిన్ ఈ పాట అందాన్ని మరింతగా చేస్తాయి. పిబిఎస్ తన గొంతుతో శ్రోతలను, ప్రేక్షకులను ఒక కొత్తలోకానికి తీసుకుని వెళతాడు ఈ పాటతో. ఇది నిజంగా ఒక మఱపురాని మఱువలేని చిత్రగీతమే!
మనిదన్ ఎన్బవన్ దైవమాగలాం
వాఱి వాఱి వళంగుంబోదు వళ్ళలాగలాం
వాళైప్పోల తన్నై తన్నై తందు త్యాగి యాగలాం
ఉరుగి ఓడుం మెళుగుపోల ఒళియై వీశలాం
(మనిషి తానె ఆ దేవుడవగనౌ / కరముతోడ దాన మొసగి కర్ణు డవగనౌ / అరటివోలె తన్నె నఱికి త్యాగి యవగనౌ / కరుగు క్రొవ్వు వత్తి వోలె కాంతి నియగనౌ )
ఊరుక్కెండ్రు వాళ్న్దద నెంజం శిలైగళ్ ఆగలాం
ఉఱవుక్కెండ్రు విఱింద ఉళ్ళం మలర్గళ్ ఆగాలాం
యారుక్కెండ్రు అళుదపోదుం తలైవన్ ఆగలాం
మనం మనం అదు కోవిల్ ఆగలాం
(జనుల కొఱకు మనిన హృదియు శిలగ మారునే / ప్రేమ కొఱకు మనిన హృదియు విరిగ మారునే / ఒరులకొఱకు యేడ్వ నేతగాను మారునే / హృది? యది? ఒక కోవెలవగనౌ)
మనమిరుందాల్ పఱవై కూట్టిల్ మాన్‌గళ్ వాళలాం
వళియిరుందాల్ కడుగుక్కుళ్ళే మలైయై కాణలాం
తుణిందువిట్టాల్ తలైయిల్ ఎంద శుమైయుం తాంగలాం
గుణం గుణం అదు కోవిల్ ఆగలాం
(ధైర్యముతో గూటిలోన మృగములుండునే / దారి యుండ కొండ జూడ నౌను ఆవలో / నిశ్చలముగ నెట్టి భారమైన మోయనౌ / మది? యది? ఒక కోవెలవగనౌ)
ఆర్మ్‌స్ట్రాంగ్ చంద్రునిపై కాలుపెట్టిన సందర్భంలో పిబిఎస్ ఇంగ్లీషులో మూన్ సాంగ్ ఆల్బమ్ వ్రాసిన విషయము అందరికీ తెలిసినదే. ఆ రికార్డును అమెరికా అధ్యక్షుడు నిక్సన్‌కూ, అపోలో వ్యోమగాములకూ పంపారు కూడా. అది మాత్రమే కాదు, తమిళంలో నిలవు పాడల్గళ్ (చంద్రుని పాటలు) పాడడంలో గొప్పవాడని పిబిఎస్‌కి ఎంతో పేరుంది.
ఒకే పాట ఇద్దరు పాడితే ఎవరు బాగా పాడేరు అన్న ప్రశ్న సాధారణంగానే వస్తుంది. సుమారు 1966లో రాము అన్న సినిమా తెలుగులోనూ, తమిళంలోనూ వచ్చింది. తమిళ సినిమాలో కె.ఆర్. విజయ, జెమినీ గణేషన్ నాయికా నాయకులుగా నటిస్తే, తెలుగులో జమున, ఎన్.టి. ఆర్ లు నటించారు. ఈ రెండు సినిమాలకి సంగీత దర్శకత్వం ఇచ్చినవారు ఎం. ఎస్. విశ్వనాథన్ (తమిళ), ఆర్. గోవర్ధనం (తెలుగు). ఈ సినిమాలో చాలా మంచిపాటలు ఉన్నా, వాటన్నిటిలోను మంటలు రేపే నెల రాజా అన్న పాట పాట మంచి ప్రజాదరణ పొందింది. అందుకు ఒక ముఖ్య కారణం ఈ పాట బాణీ హిందూస్తానీ సంగీతానికి చెందిన భాగేశ్రీ అన్న రాగం ఆధారంగా కట్టబడి ఉండటమే! పాటలోని సాహిత్యానికి తగ్గట్టు విషాదభరితంగా నడిచే భాగేశ్రీ రాగం ఈ పాటకి ఎన్నుకోబడ్డది.
మంటలు రేపే – రాము నిలవే ఎన్నిడం నెరుంగాదే
ఘంటసాల పాట గురించి వేరే ఏమీ చెప్పక్కరలేదు. పైగా ఘంటసాల స్వయంగా భాగేశ్రీ రాగంలో బాణీలు కట్టి (ఉదా. ఈమాటలో ప్రచురించబడ్డ గుర్రం జాషువా పాపాయి పద్యాలు అన్న వ్యాసంలోని ఆఖరి పద్యం) పాడారు. ఇంతకన్న ఎవ్వరూ ‘మంటలు రేపే నెల రాజా’ అన్న పాట బాగా పాడలేరు అన్న నిర్ధారణకు భిన్నమైన అభిప్రాయం ఇదే పాట తమిళ భాషలో విన్నప్పుడు కలుగుతుంది. తమిళ పాట లోని సాహిత్యాన్ని ఆస్వాదించే భాషా ప్రావీణ్యం కొంతమంది శ్రోతలకి లేకపోయినా, తమిళ పాటలో వచ్చిన గమకాలు, ఆలాపనలు వింటూంటే ఉక్కిరి బిక్కిరి అవ్వక తప్పదు. తమిళ పాట (నిలవే ఎన్నిడం నెరుంగాదే) పాడింది పిబిఎస్. ఘంటసాల పాటలంటే ఎంతో అభిమానమున్నా, ఈ పాట విషయంలో పిబిఎస్‌కి ఎక్కువ మార్కులు వెయ్యక తప్పదు. చిత్రరంగంలో గాయకులందరూ కూడా రాము సినిమాలో పిబిఎస్ పాడిన నిలవే ఎన్నిడం పాట అత్యుత్తమమైనదని చెబుతారు. రెండూ విని మీరే నిర్ణయించుకోండి.
ఈ పాట తమిళ సాహిత్యానికి తెలుగు అర్థం ఇదీ:
నెలరాజా నా దగ్గర చేరకు, నీవనుకొన్న చోటులో నేను లేను; విరిబాలా నన్ను చూసి మురిసిపోకు, నీవు మురిసే విధముగా నేను లేను.
వేసవిలో ఒక రోజు వాన కురుస్తుంది, కాని నా ఆకారంలో ఇకపై అందము కొత్తగా వస్తుందా? ఎడారిలో ఒక రోజు పూలతీగ పెరగవచ్చు, కాని నాకది ఆనందాన్ని ఇస్తుందా?
మూగవాడి కలలను గురించి ఎవరికి తెలుసు, నా గుండె తలుపులు ఎవరు తెరుస్తారు? కమ్ముకొన్న మేఘాలు చెదరిపోకముందే పాడడానికి వచ్చావేమో?
శాంతిలేని ఒక సమయంలో ఆ దేవుడు నన్ను సృష్టించాడు, వేదనతో నేను తిరుగాడుతున్న స్థితిలో నిన్ను దూతగా ఎందుకు పంపాడో?
కన్నడ పాటలు
ఇంతకు ముందు చెప్పుకున్నట్టుగా, తమిళంలో లాగానే ఆర్ నాగేంద్ర రావు జాతకఫల సినిమా ద్వారానే పిబిఎస్ మొట్ట మొదట కన్నడ చిత్రసీమకు (గోవర్ధన్ సంగీత దర్శకత్వంలో) కూడా పరిచయమయ్యాడు. సంగీత దర్శకుడు జి కె వెంకటేశ్‌కు (ఒకప్పుడు ఇళయరాజా ఇతనికి సహాయకుడు, తరువాతి కాలములో వెంకటేశ్ ఇళయరాజాకు సహాయ దర్శకుడు!) పిబిఎస్ అంటే ఇష్టం. తాను ఓహిలేశ్వర అనే కన్నడ చిత్రానికి సంగీత దర్శకత్వం వహిస్తున్నప్పుడు రాజకుమార్‌ను తనకు పాడడానికి ఒక కొత్త గాయకుడికి అవకాశం ఇస్తే బాగుంటుందని సూచించాడు. వెంకటేశ్, రాజ్ మంచి స్నేహితులు. అలాగే ‘ఝమాయించ’మన్నాడు రాజకుమార్.
ఈ మూఢత నవిదేకె – జాతకఫల ఈ దేహదింద – ఓహిలేశ్వర
అలా ఓహిలేశ్వర సినిమాలో రాజకుమార్‌కు మొట్టమొదట పిబిఎస్ పాడాడు. ఆ చిత్రంలో ఎక్కువ పాటలను ఘంటసాల పాడాడు. ఒక పాటను రాజకుమార్ కూడా పాడినట్లున్నాడు. కాని పిబిఎస్ గాత్రం రాజకుమార్‌కు చక్కగా కుదిరినట్లు రాజ్‌తో సహా అందరూ అభిప్రాయపడ్డారు. అప్పటినుండీ 1974 వరకు రాజకుమార్ పాటలను కన్నడలో పిబిఎస్ మాత్రమే పాడాడు. 1974లో ఒక పాట రికార్డింగుకు పిబిఎస్ రాలేక పోయినప్పుడు రాజకుమార్ తానే పాడుకున్నాడు. అప్పటినుండి ప్రేక్షకులు రాజకుమార్ పాటలనే అభిమానించారు కాబట్టి పిబిఎస్ తరువాత అతనికి పాడలేక పోయాడు.
1950, 60 దశకాలలో కన్నడ చిత్రసీమలో ముగ్గురు ‘కుమార’ నాయకులు ఉండేవారు — రాజకుమార్, ఉదయకుమార్, కళ్యాణకుమార్. వాళ్ళ ముగ్గురికీ పిబిఎస్ గాత్రదానం చేశాడు. తరువాతగా వచ్చిన గంగాధర్, శ్రీనాథ్, విష్ణువర్ధన్, అంబరీష్ లాంటి హీరోలకి కూడా పిబిఎస్ పాడాడు. రాజకుమార్ తాను శరీరమయితే పిబిఎస్ తన శారీరము (కంఠస్వరము) అనే వాడు. అదేవిధంగా రాజకుమార్‌కు దాదాసాహెబ్ ఫాల్కే బహుమతి లభించినప్పుడు శ్రీనివాస్ అది తనకే వచ్చినట్లు పొంగిపోయాడు. పిబిఎస్ పాడిన చిత్రగీతాలలో ఎక్కువ పాలు కన్నడ సినిమాలలోవే. అతని కన్నడ ఉచ్చారణ, పాటలు అభ్యాసం చేసేటప్పటి క్రమశిక్షణ, వేళ తప్పకుండా రికార్డింగులకు వెళ్ళడం — చిత్రదర్శకులు, సంగీత దర్శకులు ఎంతో అభిమానించేవారు. కన్నడ చిత్రసీమలో 1960, 70 దశకాలలో గొప్ప సంగీత దర్శకులు ఉండేవారు — టి జి లింగప్ప, జి కె వెంకటేశ్, విజయభాస్కర్, రాజన్-నాగేంద్ర, ఎం రంగారావు తదితరులు. వారు బాణీలలో మాధుర్యానికి పెద్ద పీట వేసేవాళ్ళు. స్వతహా గానకోకిలయైన పిబిఎస్ ఆ సంగీత దర్శకుల ఆధ్వర్యంలో తన పాటలలో తేనెలొలికించాడు. అప్పుడప్పుడు రాజేశ్వర రావు (అమరశిల్పి జక్కన్న), చలపతి రావు (మావన మగళు) వంటివారి దర్శకత్వంలో పిబిఎస్ అన్ని రకాలైన పాటలు (శృంగార, శోక, విరహ, తాత్విక, హాస్య, యుగళ గీతాలు) పాడాడు.
హాడొందు హాడువె నీ కేళు మగువే అపారకీర్తి గళిసి మెరెవ భవ్య నాడిదు బింకద సింగారి
పిబిఎస్ పాడిన శోకరసపూరితమైన పాటలలో కొన్ని: నాంది చిత్రములోని హాడొందు హాడువె నీ కేళు మగువే, ‘బెళ్ళిమోడ’ లోని ఒడెయితు ఒలవిన కన్నడి, ‘ఉయ్యాలె’ లోని నగుత హాడలే అళుత హాడలే.
కన్నడిగులు తమ భాషను, దేశాన్ని తలచుకొంటూ పాడుకునే పాటలెన్నో పిబిఎస్ పాడాడు. అందులో కొన్ని – విజయనగరద వీరపుత్ర చిత్రం లోని అపారకీర్తి గళిసి మెరెవ భవ్య నాడిదు, గంధదగుడి చిత్రం లోని నావాడువ నుడియే కన్నడ నుడి, మన మెచ్చిద హుడుగి చిత్రములో రాష్ట్రకవి కువెంపు వ్రాసిన భారత జననియ తనుజాతె జయహే కర్ణాటకమాతె, ‘తాయి కరుళు’ లోని బా తాయి భారతియె భావ భాగీరథియె ఇత్యాదులు.
పిబిఎస్ పాడిన సోలో ప్రణయగీతాలు లెక్కకు లేనన్ని ఉన్నాయి, అందులో కొన్ని – కన్యారత్న చిత్రము లోని బింకద సింగారి, సీత లోని బరెద నీను నిన్న హెసరు నన్న బాళ పుటదలి, నాగరహావు లోని బారే బారే చందద చెలువిన తారే, బెళ్ళిమోడ యందలి ఇదే నన్న ఉత్తర ఇదే నన్న ఉత్తర, గెజ్జెపూజె లోని పంచమవేద ప్రేమద నాద, ఇత్యాదులు.
కన్నడములో పిబిఎస్ పాడిన యుగళగీతాలు చాలా అందమైనవి. సుశీలతో బెళ్ళిమోడ చిత్రములో పాడిన బెళ్ళిమోడవ అంచినింద, శరపంజర చిత్రములో సుశీలతో దరా బేంద్రే వ్రాసిన ఉత్తరధ్రువదిం దక్షిణధ్రువకు, సుశీలతో పునర్జన్మ చిత్రములో గోధూళి హారువ హొత్తు, జానకితో కన్యారత్న చిత్రములో సువ్వి సువ్వి సువ్వాలె, మిస్ లీలావతి చిత్రములో జానకితో బయకె బళ్ళి చిగురి నగుతిదె, అరిశినకుంకుమ చిత్రములో జానకితో నాను నీను జొతె యిరలు, సుమిత్రతో సతీ సుకన్యలో మధుర మధుర వీ మంజుళ గాన మచ్చుకు కొన్ని.
సువ్వి సువ్వి సువ్వాలె బయకె బళ్ళి చిగురి నగుతిదె పురందరదాస కృతి – తూగిరె రంగన దీన నా బందిరువె బాగిలలి నిందిరువె
ఇవికాక భక్తి చిత్రాలలో పాటలకు కూడా పిబిఎస్ తన గాత్రాన్ని అందించాడు. అనురాధ చిత్రములో జానకితో పురందర దాస కృతి గుమ్మన కరెయదిరె, అదే చిత్రములో మరొక పురందర దాస కృతి తూగిరె రంగన, శ్రీపురందరదాసరు చిత్రములో ఎన్నో పాటలు, భక్త కనకదాస చిత్రములో బాగిలను తెరెదు సేవెయను కొడు హరియే, మంత్రాలయ మహాత్మె చిత్రములో ఇందు ఎనగె గోవింద అనే పాట, సంధ్యారాగ చిత్రము లోని దీన నా బందిరువె బాగిలలి నిందిరువె, సంత తుకారాం చిత్రములో జయతు జయ విఠలా అనే పాట, అటువంటి కొన్ని పాటలు.
పిబిఎస్ పాడిన కొన్ని కన్నడ సినిమాలు చాల ప్రసిద్ధమైనవి, క్రొత్త ప్రమాణాలను సాధించినవి కూడా. నాంది రాష్ట్రపతి రజతపతకము నందుకొన్న మొట్టమొదట కన్నడ చిత్రము. ఒక మూగ, చెవిటి పిల్ల కథ అది. 1964లో అటువంటి సినిమా తీయడం మనదేశంలో గొప్ప విషయమే. బెళ్ళిమోడ (వెండి మబ్బు) కన్నడ చిత్రసీమలో సుమారు 30 చిత్రాలకుపైన దర్శకత్వం నిర్వహించిన పుట్టణ్ణ కణగాల్ మొదటి సినిమా. (పుట్టణ్ణచే ప్రభావితుడైన మరొక ప్రఖ్యాత దర్శకుడు కె. బాలచందర్.) దాని కథ గొప్ప నవలా రచయిత త్రివేణి వ్రాసినది. త్రివేణి నవలలు 1960లలో తెలుగులోకి కూడా అనువాదించబడ్డాయి. ఈ సినిమాలో నాయిక కల్పనకు మినుగుతారె అనే బిరుదు ఈ సినిమాలో నటించిన తరువాత వచ్చినదే.
రవివర్మన కుంచద కలే
గెజ్జెపూజె అనే చిత్రం ప్రఖ్యాత స్త్రీవాద రచయిత ఎం. కె. ఇందిర వ్రాసిన కథపైన ఆధారపడినది. ఇది ఒకప్పుడు అమలులో వున్న వేశ్యావ్యవస్థను చిత్రీకరించింది. ‘శరపంజర’ కూడా త్రివేణి వ్రాసిన కళాఖండమే. ఇందులో బిడ్డ పుట్టిన తరువాత కొందరు ఆడవాళ్ళలో కలిగే మతిభ్రమ చిత్రీకరించబడింది. సంధ్యారాగ సుప్రసిద్ధ నవలాకారుడు అనకృ వ్రాసిన నవల ఆధారంగా తీయబడిన సినిమా. ఇందులో పిబిఎస్ బాలమురళీకృష్ణ, భీమసేన్ జోషీలతో సమానంగా పాడి ప్రశంసలందుకున్నాడు. సాక్షాత్కార అనే చిత్రములో పృథ్విరాజ్ కపూర్ కూడ నటించాడు. ఇలా ఎన్నో పురస్కారాలను అందుకొన్న చిత్రాలలో పాడిన శ్రీనివాస్ పేరు అప్పటి రేడియోలో, పత్రికలలో మారుమ్రోగింది. అరశిన కుంకుమ అనే చిత్రంలో దరా బేంద్రే రచించిన ఇళిదు బా తాయీ ఇళిదు బా అనే లోకప్రియ గీతాన్ని తనే స్వయంగా తెరపై కూడా పాడాడు. ఈ పాట సినిమాలో ఒక కళాశాల సాంస్కృతికోత్సవ సందర్భంలో వస్తుంది. సొసె తంద సౌభాగ్య అనే చిత్రానికి రవివర్మన కుంచద కలే (తెలుగులో కూడా బాగా పేరు తెచ్చుకున్న రవివర్మకే అందనీ ఒకే ఒక అందానివో అనే పాట) అనే పాటను జానకితో తన తల్లి చనిపోయిన రెండు రోజులకే పాడవలసి వచ్చినది. ఆర్ నాగేంద్రరావు కుమారుడు చిత్రగీత రచయిత ఆర్.ఎన్ జయగోపాల్ అభ్యర్థనపై తన మానసిక శోకాన్ని ఒక మూల పెట్టి పెట్టుబడిదారులకు కలిగే లక్షల నష్టాన్ని ఈ ఉదారచర్యతో ఆపాడు.
శ్రీనివాస్ గెజ్జెపూజెలో పాడిన పంచమవేద అనే పాట చాలా చక్కటి పాట. ఒక వేశ్య ఎదురింటిలో నాయకుడు ఉంటాడు. ఆ వేశ్య కూతురు, తను ఒకే కళాశాలలో చదువుకొంటారు. క్రమేణా వారిద్దరి మధ్య స్నేహం పెరుగుతుంది. వేశ్య కూతురికి ఆ వృత్తిలో బలైపోకుండా అందరిలా పెళ్ళి చేసుకొని ఒక క్రొత్త జీవితం గడపాలని కోరుకుంటుంది. ఆమె తల్లి తన మొట్ట మొదటి ప్రేమికుడిని తలచుకొంటూ తరచుగా పాడే పంచమవేద అనే పాటను కూతురు కూడ నేర్చుకొని నాయకుని చెల్లెలు పెళ్ళి విందులో పాడుతుంది. తరువాత నాయకుడు కూడ పాడతాడు. సన్నివేశము మైసూరు లలితమహల్లో ఈ పాట చిత్రీకరించారు. భీంపలాస్ రాగంలో విజయభాస్కర్ స్వరపరచిన పాట ఇది.
పంచమ వేద ప్రేమద నాద
పంచమ వేద ప్రేమద నాద ప్రణయద సరిగమ భావానంద
హృదయ సంగమ అనురాగ బంధ రాగరాగిణీ యోగానుబంధ
జీవజీవద స్వరసంచార అమృతచేతన రసధార
రాధామాధవ వేణువిహార గీతెయె ప్రీతియ జీవనసార
ప్రేమగానదె పరవశ వీ ధరె మానసలోకద గంగెయ ధారె
దివ్యదిగంతద భాగ్య తారె భవ్య రసికతె బాళి గాసరె
ఇది కన్నడమైనా అర్థం చేసుకోవడం కష్టం కాదు; అన్నీ సంస్కృత పదాలే, అజంతాలకు ము-కారం చేరిస్తే అవి తెలుగు పదాలు అవుతాయి. ఈ పాటలో తన గొంతుతో ప్రణయ నాదాన్ని వేదఘోషలా పలికించాడు శ్రీనివాస్. దీనిని విన్న తరువాత ఒక అపురూపమైన అనుభూతితో మనసు ఉయ్యాలలూగుతుందంటే అది అతిశయోక్తి కాదు.
మావన మగళు (మేనమామ కూతురు) అనే చిత్రములో చలపతి రావు దర్శకత్వంలో పిబిఎస్, జానకి పాడిన యుగళగీతపు రచయిత రాష్ట్రకవి కువెంపు (కె. వి. పుట్టప్ప). ఆ పాట నానె వీణె నీనె తంతి. గీతం, గాత్రం, సంగీతం వీణానాదబిందువులుగా మోహన రాగంలో ఒక రస సింధువుగా పల్లవించే ఈ పాట కవితకు తగిన ఆకృతి ఇచ్చిందనడంలో సందేహం లేలేదు.
తరువాతి పాట గుమ్మన కరెయదిరె అనే పాట. పసి పిల్లలను బూచివాడు అని మనము భయపెట్టే విధముగా యశోద కృష్ణుడిని గుమ్మని గురించి బెదిరిస్తుంది. గుమ్మడేడే గుమ్మడేడే అనే పాట తెలుగులో కూడ ఉన్నది. ఇది జానకితో పాడిన ఒక యుగళ గీతం. రాజన్-నాగేంద్ర దర్శకత్వములోని అనురాధ చిత్రం లోని పాట యిది. ఇందులో మొదట జానకి పాడగా, చివర పిబిఎస్ పాడుతాడు. ఇది పురందరదాసకృతి. (ఈ పాట తెలుగు అనువాదం.)
బాగిలను తెగెదు సేవెయను
రాజకుమార్ తాను శరీరము, పిబిఎస్ తన శారీరము అని ఎందుకన్నాడో అనే విషయము భక్త కనకదాస చిత్రములో అబ్రాహ్మణుడైన కనకదాసును భటులు బంధించినప్పుడు, అతను తలుపులను తెరవమని శ్రీకృష్ణుని ప్రార్థించే ఘట్టములో పాడిన బాగిలను తెగెదు సేవెయను కొడొ హరియే అనే కనకదాస కృతి వింటే మనకు అర్థమవుతుంది. భక్తి, దైన్యము, ఆతురత, సంభ్రమము, వేదన ఇవన్నీ ధ్వనించేటట్లు పాడడం బహుశా ఒక్క పిబిఎస్‌కి మాత్రమే సాధ్యమేమో?
కన్నడ, తమిళ, తెలుగు చిత్రములలో మాత్రమే కాకుండా ఎన్నో భాషలలో తీయబడిన చిత్రాలలో పిబిఎస్ పాడాడు. ఇక్కడ ఒకటి రెండు పాటలను ఉదహరిస్తాము. ఏళు రాత్రికళ్ అనే మలయాళ చిత్రములో సలిల్ చౌధరీ దర్శకత్వములోని రాత్రి అనే కోరస్‌తో మాత్రమే తాళము లేని పాట కర్ణపేయంగా వుంటుంది. లతా మంగేష్కర్‌తో మైఁ భీ లడ్కీ హూఁ అనే చిత్రములో చందా సే హోగా వో ప్యారా అనే పాట నిజముగా మధురమైనదే.
చందా సే హోగా వో ప్యారా నైనా జో నైన్ సే మిలే
పిబిఎస్ నటులకు సరిపోయే గాయకుల గాత్రం అనేదాన్ని గురించి అది ప్రేక్షకుల, శ్రోతల భ్రమ మాత్రమే అంటాడు. నిజంగా జెమినీ గణేశన్‌కు ఎ. ఎం. రాజా గొంతుక, తనది రెండు సరిపోతాయన్నది అలాటిదే. అదే విధంగా రాజకుమార్‌కు తన గొంతు సరిపోవడం అనేది కూడా. ఎందుకంటే వాళ్ళిద్దరు స్వతహాగా మంచి గాయకులు. (రాజ్ తరువాతి కాలంలో పాడాడు, జెమినీ పాటను మనం వినలేదు.) అలాగే తాను సామాన్యంగా ఘంటసాల మాత్రమే పాడే ఎన్.టి. రామారావు, నాగేశ్వర రావులకు పాడితే నప్పదు అనే భ్రమ కూడా అలాంటిదే.
పిబిఎస్ ఉచ్ఛదశ దాటిన తరువాత అతనికి పాడే అవకాశాలు తగ్గిపోయాయి. ఆ పరిస్థితుల్లో ఆయనని కొందరు నిర్మాతలు సరిగా ఆదరించక తిరస్కరించారు. ఒకప్పుడు ఒక పాటకు 300 మాత్రమే పారితోషికం (సుమారు 1500 రూపాయలు అప్పటి పారితోషికమయితే) ఇవ్వగా, సంస్కారవంతుడైన పిబిఎస్ అది బహుశా ఎవరికో చెందవలసినది తనకు పొరపాటుపడి ఇచ్చి ఉంటారని తనతో వచ్చిన వారితో చెప్పి వారికే తిరిగి ఇచ్చాడట ఆ డబ్బును. మరొక సారి ఎల్. వైద్యనాథన్ సంగీత దర్శకత్వంలో పిబిఎస్ పాటను కూడ బాలసుబ్రహ్మణ్యాన్ని పాడమంటే బాలూ నిరాకరించి పిబిఎస్ పాడేవరకు అక్కడే ఉండి తరువాత అతనికి పాదాభివందనం చేసి వెళ్ళాడట.
పిబిఎస్ బహుభాషా పరిచయాన్ని, కె. బాలచందర్ ఆకలిరాజ్యం సినిమాలో చక్కగా ఉపయోగించుకొన్నాడు. అందులో విశ్వనాథన్ దర్శకత్వంలో జానకి పాడే తూ హైఁ రాజా అనే హిందీ పాటకు సాహిత్యం అందించినది ఎవ్వరో కాదు, పి. బి. శ్రీనివాసే. నిజానికి పిబిఎస్ సినిమాల్లో ప్రవేశించింది జెమినీ వారి మిస్టర్ సంపత్ అనే హిందీ సినిమాలో దోహాలు పాడటం ద్వారా. ఆ తరువాత కూడా హిందీ సినిమాల్లోను, ప్రైవేటుగా చాలా గజళ్ళు కూడా పాడారు. ఆయన లతతో కలిసి, మైఁ భి లడ్కీ హూ సినిమాలో పాడిన ‘చందా సె హోగా హొ ప్యార్’ అన్న పాట ఎంత ప్రసిద్ధి చెందిందో చెప్పనవసరం లేదు. ఆయన డాకు భూపత్ అన్న హిందీ డబ్బింగ్ సినిమాలో (తెలుగు మాతృక: రాజనందిని, 1958) సుశీలతో కలిసి పాడిన నైనా జో నైన్ సే మిలే పాట, తెలుగులో ఎ. ఎం. రాజా, సుశీల ఎంతో మనోహరంగా పాడిన అందాలు చిందు సీమలో, అన్న పాటకి ఏ మాత్రం తీసిపోదు.
అరుదైన వ్యక్తి
అనేక భాషల్లో పాటలు పాడి ప్రఖ్యాతి పొందిన పిబియస్‌ను మన పొరుగున ఉన్నవారు ‘మా వాడు’ అని గర్వంగా చెప్పుకోవటం తెలుగువారిగా మనం అందరం గర్వించ తగ్గ విషయం. అది తెలుగువారి అదృష్టం. తెలుగునాట పిబియస్‌కి తగినంత గుర్తింపు రాకపోటం మనం బాధపడవలసిన విషయం! పిబిఎస్‌కు తమిళనాడు ప్రభుత్వం కలైమామణి పురస్కారం, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వము రాజ్యోత్సవ పురస్కారం, 2500 చదురపుటడుగుల భూమి, శివ ఫౌండేషన్ వారి మాధవపెద్ది పురస్కారం, రాజకుమార్ కుటుంబం వారి రాజ్‌కుమార్ సౌహార్ద పురస్కారం, శిరోమణి బహుమతి, గాయకి సుశీల ట్రస్ట్ వారి లైఫ్ టైమ్ అఛీవ్‌మెంట్ అవార్డ్ పి. బి. శ్రీనివాస్ పొందిన కొన్ని సన్మానాలు. సాత్వికుడిగా, అజాతశత్రువుగా, మెత్తని మనసుతో అందరితో ఎంతో కలివిడిగా కలిసిపోయే మనిషిగా ఆయన చాలా అరుదైన వ్యక్తి! రావలసింత గుర్తింపు కానీ, అవకాశాలు కానీ రాలేదని ఎన్నడూ చింతించని మనిషి. అందరూ నావాళ్ళే అని ఉడ్‌లాండ్స్-డ్రైవ్ఇన్ ఫలహారశాలలో కూర్చుని పలకరించిన వారందరితో ఎంతో ప్రేమగా మాట్లాడుతూ వుండేవారు. ఎవరికి సన్మానం అని విన్నా జేబులనిండా వుండే రంగురంగుల కలాలతో ఒక పద్యం రాసి దాన్ని ఒక ప్లాస్టిక్ కవరులో పెట్టి, స్వయంగా పాడి తరువాత సమర్పించేవారు ఆయన. తెలుగువారిగా ఈ మహామనీషిని ఈ సందర్భంలో స్మరించుకోటం మన కనీస ధర్మం!