గుర్రం జాషువా
సాహిత్యానికి తగ్గ సంగీతం, సంగీతానికి దీటైన సాహిత్యం రెండూ పోటాపోటీలుగా కలవటం అరుదైన విషయం. మహాకవి గుర్రం జాషువా రచించిన నాలుగు పాపాయి పద్యాలను సంగీత దర్శకుడు, ఆంధ్రుల అమర గాయకుడు శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు నాలుగు విభిన్న రాగాల్లో స్వరపరచి గానం చెయ్యటం తెలుగువారి అరుదైన అదృష్టమే. అప్పుడే పుట్టిన పాపాయిపై ఇంత రసాత్మకంగా కట్టిన పద్యాలు బహుశా తెలుగులో మరింక లేవేమో!
పాపాయి పద్యాలు – ఘంటసాల
(ఘంటసాల.ఇన్ఫో సౌజన్యంతో)
“అక్షయంబైన మాతృక్షీర మధుధార లన్నంబుగా తెచ్చుకొన్న యతిథీ ” అన్నది ఎంత అందమైన భావన. మనం రోజూ చూసే సామాన్యమైన విషయాల్లోంచి అందమైన కవిత్వాన్ని సృష్టిస్తాడు కవి. జాషువా చేసింది అదే! “అమృతమ్ము విషమను వ్యత్యాస మెరుగ కాస్వాదింప చను వెర్రిబాగులాడు” అని కానీ ” ఎవ్వరెరుంగ రితని దేదేశమో గాని, మొన్న మొన్న నిలకు మొలిచినాడు” అని కానీ అప్పుడే పుట్టిన పాపాయిని వర్ణించడం గొప్ప కవులు మాత్రమే చెయ్యగలరు. తల్లికి పిల్లలపై ఉన్న ప్రేమ గురించి గొప్ప కవులు ఆర్ద్రతతో ఎంతో సాహిత్యం సృష్టించారు కానీ, “అమ్మతో తనకెంత సంబంధమున్నదో, ఏడ్చి యూడిగము సేయించుకొనును” వంటి భావంతో తల్లి-బిడ్డల బంధాన్ని ఇంత చక్కగా వర్ణించటం జాషువా గారికే చెల్లింది.
ఘంటసాల
ఈ పాపాయి పద్యాలలో ఇంత మంచి సాహిత్య సృష్టి జరిగింది. కానీ, ఆ సాహిత్యాన్ని అనుభవించి, పలవరించకపోతే అద్భుతమైన సంగీత సృష్టి అసాధ్యం. ఆ పని చేసి ఘంటసాల ఈ పద్యాలకు చిరాయువు కల్పించాడు. సంగీతాన్ని శాస్రీయంగా అభ్యసించిన అందరూ పద్యాలకు ఇంత అందంగా బాణీలు కట్టలేరు. అసలు సాహిత్యాన్ని చూడగానే (అందులో పద్యాలకి మరీను) ఇలా బాణీ కట్టాలని సంగీతకారుడుకి ఎలా తెలుస్తుందో!
మొదటి పద్యం: నవమాసములు
రాగం: హిందూస్తానీ సంగీతంలో దుర్గా (కర్నాటక సంగీతంలో శుద్ధ సావేరి)
శుద్ధ సావేరీ కర్నాటక సంగీతంలో 29వ మేళకర్త అయిన ధీరశంకరాభరణం నుంచి జనించిన రాగం. రక్తి రస ప్రధానమైనది.స్వరాలు: స, రి2, మ1, ప, ధ2. చాలా ప్రాచుర్యమున్న ఈ రాగంలో రిషభం, నిషాదం లేవు. త్యాగరాజ రచనలు ‘దారి నే తెలుసుకొంటి..’, ‘కాలహరణ మేలరా..’ ఈ రాగంలో ప్రాచుర్యమైనవి. ఈ పేరుతో హిందూస్తానీ సంగీతంలో ఏ రాగం లేదు. అయితే, హిందూస్తానీ సంగీతంలోని ‘దుర్గా’ రాగం శుద్ధ సావేరికి దగ్గరగా ఉన్న రాగం.
(నాయనా! పురిటింటి తెరువరి! కులజ్యోతి! నీకు దీర్ఘాయువురా!)
నవమాసములు భోజనము నీరమెరుగక,
పయనించు పురిటింటి బాటసారి
చిక్కు చీకటి చిమ్ము జానెడు పొట్టలో,
నిద్రించి లేచిన నిర్గుణుండు
నును చెక్కిళుల బోసినోటి నవ్వులలోన,
ముద్దులు చిత్రించు మోహనుండు
అక్షయంబైన మాతృక్షీర మధుధార
లన్నంబుగా తెచ్చుకొన్న యతిథీబట్ట కట్టడు, బిడియాన బట్టువడడు,
ధారుణీ పాఠశాలలో చేరినాడు, (కానీ)
వారమాయెనో లేదో మా ప్రకృతి కాంత
కరపి యున్నది వీని కాకలియు నిద్ర!
రెండవ పద్యం: బొటవ్రేల ముల్లోకములు జూచి
రాగం: హిందూస్తానీ సంగీతంలో శుద్ధ సారంగ్
శుద్ధ సారంగ్ హిందూస్తానీ సంగీతంలో కాఫీ ఠఠ్‌కి చెందింది. స్వరాలు: స, రి2, మ1, మ2, ప, ద2, ని2. ఆరోహణలో గాంధారం, నిషాదం వాడరు. అవరోహణలో గాంధారం వాడరు. ఈ రాగంలో ఒక ముఖ్య ప్రయోగం రెండు మధ్యమాలని (మ1, మ2) పక్క పక్కనే ఉపయోగించటం. స్వర సంచారంలో రిషభం, నిషాదం పై ఆగటం ఒక వింతైన అందాన్నిస్తుంది. ‘సారంగ్’ కుటుంబంలోని రాగాలన్నిటిలో శుద్ధ సారంగ్ అత్యంత ప్రముఖమైనది. ఈ రాగచ్ఛాయలను జాగ్రత్తగా గమనించటానికి ఈ పద్యం ఎక్కువ సార్లు వినాలి.
(మా చిట్టి పాప నా ఒళ్ళో ముత్యాలు పోశాడు. నెలబాలుడై ఆనందాన్ని కుప్పవోశాడు. చిట్టిబాబూ!)
బొటవ్రేల ముల్లోకములు జూచి లోలోన
నానందపడు నోరులేని యోగి
తల్లి తండ్రుల తనూ వల్లరీ ద్వయికి వ
న్నియ పెట్టు తొమ్మిది నెలల పంట
అమృతంబు విషమను వ్యత్యాస మెరుగ
కాస్వాదింప చను వెర్రిబాగులాడు
అనుభవించు కొలంది నినుమడించుచు మరం
దము జాలువారు చైతన్య ఫలముభాష రాదు, వట్టి పాలు మాత్రమె త్రాగు,
నిద్రపోవు, లేచి నిలువలేడు .. (చిన్ని నాన్న)
ఎవ్వరెరుంగ రితని దేదేశమో గాని,
మొన్న మొన్న నిలకు మొలిచినాడు!
మూడవ పద్యం: గానమాలింపక
రాగం: ఆభేరి (హిందూస్తానీ సంగీతంలో భీంపలాస్)
కరుణ రసప్రధానమైన ఈ ఆభేరి రాగాన్ని ఎన్నుకోటంలో ఘంటసాల జీనియస్ కనపడుతుంది. ఒక లాలిపద్యంలా మొదలయ్యే ఈ పద్యం, ముందు – చివర ఒకే విధంగా ఆలాపనలో ఉంటుంది. హిందూస్తానీ సంగీతంలో భీంపలాస్ రాగం ఆభేరి రాగానికి దగ్గర. స్వరాలు: స, రి2, గ1, మ1, ప, ధ2, ని1. ఆరోహణలో రిషభం, ధైవతం నిషిద్దం. ఎన్నో సినిమా పాటలు, పద్యాలు, ప్రైవేట్ గీతాలు ఈ రాగంలో ఉన్నాయి. ‘పసిడి పొలాల్లో పల్లెపడుచు తన మావ కోసం కలవర పడుతూ ఇలా పిలుస్తోంది’ అంటూ మొదలయ్యే పాట ‘రావోయి బంగారి మావా..‘ ఈ రాగంలో ఘంటసాల బాణీ కట్టి పాడినదే.
(కౌగిట్లో కదలి గారాలు కురుస్తాడు! ఉయ్యేల్లో, ఉల్లంలో ముద్దులు మురిపిస్తాడు!)
గానమాలింపక కన్నుమూయని రాజు
అమ్మ కౌగిటి పంజరంపు చిలక
కొదమ కండలు పేరుకొను పిల్ల వస్తాదు,
ఊయేల దిగని భాగ్యోన్నతుండు
ఉ ఊ లు నేర్చిన యొక వింత చదువరి,
సతిని ముట్టని నాటి సాంబమూర్తి
ప్రసవాబ్ధి తరియించ వచ్చిన పరదేశి,
తన ఇంటి క్రొత్త పెత్తనపుదారిఏమి పనిమీద భూమికి నేగినాడొ,
నుడువ నేర్చిన పిమ్మట నడుగవలయు
ఏండ్లు గడచిన ముందు ముందేమొకాని,
ఇప్పటికి మాత్ర మేపాప మెరుగడితడు!
నాలగవ పద్యం: ఊయేల తొట్టి
రాగం: బాగేశ్వరి లేదా బాగేశ్రీ (కర్నాటక సంగీతంలో ఇందుకు పోలిన రాగం లేదు)
ఇది ఒక ముఖ్యమైన అతి పాతదైన హిందూస్తానీ రాగం. అనేక సినిమా పాటల్లో విరివిగా ఈ రాగాన్ని వాడారు. తెలుగు, హిందీ సినిమా పాటల్లో ఈ రాగంలో బాణీలు కట్టిన పాటలు చాలా ప్రజాదరణ పొందాయి. ఈ బాగేశ్వరి రాగం గురించి తెలుసుకోవాలంటే రామరంగ్ అన్ని ఘరానాల్లో ఈ రాగాన్ని ఎలా పాడతారో మూడు నిమషాలు పాడి వినిపించే ఆడియో వినండి.
స్వరాలు; స, రి2, గ1, మ1, ధ2, ని1 (పంచమం ఈ రాగంలో నిషిద్ధం. రిషిభం అవరోహణలో మాత్రమే వాడతారు). కొన్ని ఘరానాలలో రిషభాన్ని కూడా ఆరోహణలో ఉపయోగిస్తారు. మరికొన్ని ఘరానాల్లో పంచమం వాడటం రివాజు! కొంత విషాదం, వియోగమున్న భావాలను తెలియపరచటానికి ఈ రాగం వాడతారు. ఈ క్రింది పద్యం వింటే, “మూన్నాళ్ళలోన ఏప్పుడు నేర్చుకొనియెనో, పొమ్మన్నచో….” అన్నప్పుడు “పొమ్మన్నచో”లో బాగేశ్వరి రాగచ్ఛాయని పూర్తిగా వినిపిస్తాడు ఘంటసాల.
ఇప్పటికీ గొప్పగా చెప్పుకొనే పాత సినిమా మాయాబజార్ లో ఉన్న యుగళ గీతం ‘నీ కోసమె నే జీవించునది…’ ఘంటసాల, లీల పాడగా ఈ రాగంలోనే బాణీ కట్టారు. పాట మొదలవుతూనే వచ్చే సంగీతం షడ్జమంతో మొదలయి ‘సామధ, గమధ, సనిధమగరిసా…’ తో సాగుతుంది. అలాగే రాము సినిమాలో ‘మంటలు రేపే నెల రాజా ఈ తుంటరి తనము..’ అన్న పాట కూడా ఇదే రాగంలో బాణీ కట్టిందే. ఇక హిందీ సినిమాల్లో ఈ రాగాన్ని చాలా ఎక్కువగా ఉపయోగించేవారు. ఆజాద్ సినిమాలో ‘నా బోలే నా బోలే..‘ అన్న లత పాడిన పాట, ప్రైవేట్ సెక్రెటరి సినిమాలో ‘జా రే బైయిమాన్’ అన్న మన్నాడే పాడిన పాట, అనార్కలి (హిందీ) సినిమాలో ‘జాగ్ దర్ద్’ అన్న హేమంత్ కుమార్, లత పాడిన పాటలు బాగేశ్వరి రాగానికి కొన్ని మంచి ఉదాహరణలు.
(పిచ్చి తండ్రి! ఏమా ముచ్చట్లు! ఎవరితో ఈ కేకిసలు! లేదు! లేదు! ఏడవకు తండ్రి! ఏడవకు! పిచ్చితండ్రి!)
ఊయేల తొట్టి ఏముపదేశ మిచ్చునో,
కొసరి నొంటరిగ నూ కొట్టుకొనును
అమ్మతో తనకెంత సంబంధమున్నదో,
ఏడ్చి యూడిగము చేయించుకొనును
పరమేశ్వరుండేమి సరసంబులాడునో,
బిట్టుగా కేకిసల్ కొట్టుకొనును
మూనాళ్ళలోన ఏప్పుడు నేర్చుకొనియెనో,
పొమ్మన్నచో చిన్నబుచ్చుకొనునుముక్కుపచ్చలారిపోయి ప్రాయము వచ్చి,
చదువు సంధ్య నేర్చి బ్రతుకునపుడు
నాదు పసిడికొండ, నా రత్నమని, తల్లి
పలుకు పలుకులితడు నిలుపుగాక!
నా స్వానుభవం ఒకటి ముచ్చటించకుండా ఈ వ్యాసాన్ని ముగించలేను. చాలా ఏళ్ళ క్రితం ఒక తెలుగు వారి ఇంట్లో నేను ఈ పద్యాలు పాడాను. ఆ ఇంటి యజమాని భార్య తెలుగు వారే, కానీ పుట్టటం పెరగటం అంతా ఉత్తర భారత దేశంలోనే! యాదృచ్ఛికంగా ఆ దంపతులకి కొన్ని నెలల వయస్సు ఉన్న అబ్బాయి ఉన్నాడు. పాడేటప్పుడు నా మామూలు అలవాటు ప్రకారం నేను తల వంచుకొని ఈ నాలుగు పద్యాలు పాడి తల ఎత్తి చూసేసరికి ఆ ఇంటావిడ కళ్ళ నీళ్ళతో కనిపించింది. ఆవిడకి తెలుగు సాహిత్యంతో కానీ, భారతీయ సంగీతంతో కానీ ఎక్కువ పరిచయం లేదు. అయినప్పటికీ “ఈ పద్యాల సాహిత్యం, అందులో దాగిన సంగీతం వింటే నాకు అన్నీ అర్ధమయి ఏడుపు ఆపుకోలేకపోయాను” అని ఆమె చెప్పగానే ఈ పద్యాల సృష్టికి కారణమైన సాహిత్య – సంగీత కర్తల విశ్వరూపం ఒక్కసారిగా నాకు కళ్ళకి కట్టినట్టయింది!
(నాకెంతో ఇష్టమైన జాషువాగారి పాపాయి పద్యాలను ఘంటసాల పాడిన తీరును గురించి ఒక వ్యాసం రాద్దామని నేను చాలారోజుల క్రితమే అనుకున్నాను. ఇప్పుడు లక్ష్మన్న ఆ పని చేస్తున్నారని విని నా అభిప్రాయాలు రాయకుండా ఉండలేకపోతున్నానంటూ, కొడవటిగంటి రోహిణీప్రసాద్ రాసిన అనుబంధ వ్యాసం కూడా చదవండి.)
[ఊసు: సెప్టెంబరు 28, 1895 శ్రీ గుర్రం జాషువా జన్మదినం – సం]