భారతీయ చరిత్ర రచన: శైలీలక్షణం – ఉపసంహారం

ఇది [ఇబ్రహీం ఖాన్ యరగొండుపాళేన్ని ధ్వంసం చెయ్యడం] ఒక అవతారసమాప్తి అయినట్లుగానే అయిపోయెను. ఈలాగున కొన్ని దినములు గడచేవరకు ఈ దూపాటితాలూకాను కానలరెడ్డి అనే పరాయిసంస్థానీకుడు వ్యవహారం చేసుకొంటూ తాను అనుభవిస్తూ ఉండెను. అపుడు ఈ శాయపనాయనివారు ఎవరయినా పోయి హుజూరున [గోల్కొండ నవాబు] చెప్పుకొని బోధించేందుకు క్షాత్రవంతులయినవారు అంతా పోయిరి. తతిమ్మా ఉన్నవారైనా ఏదోపోయి ఒక మార్గం ఏర్పరచుకోవడానకు ఏమి బలం చాలకనో (…) ఆరీతున కొన్ని దినములు జరిగిన తరువాత శాయపనాయనిజోగన్నగారి కుమారులు చెన్నప్పనాయడు పురుషోత్తంనాయడు ఇద్దరు వెనుకటి దస్తావేజులు ఏమైనా ఉన్నవేమోనని విచారించేవరకు యరగొండుపాళెం దోచుకొని అగ్నితప్తం చేసిన సమయంలో ఒకటి అయినా ఆకరం లేకుండాపోయెను.

ఇకముందు సాధన ఏమి విచారించవలసినది అని వీరు విచారణీయం చేస్తున్న సమయమందు గుండాపణతుల పెదఓరుగంటిగారి మనుమడు శంభుడు అనే నియ్యోగి పూర్వమునుండి యీ సంస్థానానికి బాధ్యుడేగనుక గద్వాల రాయదుర్గం ఆ ప్రాంత్యములనుంచి వచ్చేటప్పుడు ఆ కాగిదాలు కొన్ని కొన్ని తీసుక వచ్చినాడు గనుక ఆ తారకాలు ఈ పైని వ్రాసిన సనదులు వగైరా కొన్ని కాగితాలు చెన్నప్పనాయడు పురుషోత్తమనాయనింగారికి చూపించినంతలో ఈ కాగితాలు తీసుకొని గుండాపణతుల శంభుడు తాము కొర్లకుంటవారు, రావురువారు, బోడవారు, నల్లాటివారితోకూడ షహరుకు పోయి హజరతు నవాబు సాహేబుల వారి దర్శనం చేసుకొని తమ పుర్వోత్తరం యావత్తు మనవి చేసికొని తమ వద్దనున్న పూర్వపుదస్తావేజులు అన్నీ చూపించినంతలో యథాప్రకారం శలవు ఇవ్వడానకు ఎక్కడెక్కడ దేశాలు అన్నీ అమీనులు హుమ్మారావులకు జాగీర్లు అయి ఉన్నందున ఒట్టుకు సీమలు ఇచ్చే యుక్తం లేదని అపుడు దూపాటి సీమలో దోరణాలసముత్ వగైరా ఏభైయెనిమిది గ్రామాదులున్ను దూపాటితాలూకా పైకి మంతనాల కనుమ, చామ కనుమను వచ్చే హస్వీలున్ను కొచ్చెర్లకోటసీమలో కురిచేటి వంటి పదియిర్వయి గ్రామాదులున్ను ఇవి కొద్దికొద్దిగా పేష్‌కష్ యేర్పఱచి ఫర్మానా వ్రాసి యిచ్చినారు.

మేమింతకుముందు ప్రస్తావించిన యితర కరణాల రచనలలాగే, యిది కూడా స్పష్టమైన తెలుగు వచనంలో, కరణాల రచనాశైలికి స్వాభావికంగా, పొడుగైన వాక్యాలతో సాగుతుంది. సూటిగా, పదునైన వ్యంగ్యంతో ఆకర్షణీయంగా ఉంటుందా శైలి. గోల్కొండ, మొఘల్ పాలనా యంత్రాంగానికి సంబంధించిన ఆధికారిక, రెవెన్యూ పారిభాషిక పదాలు కూడా యిందులో సర్వత్రా కనిపిస్తాయి. అంతటా ఒక బలమైన వాస్తవికత ద్యోతకమవుతూ ఉంటుంది. ప్రపంచాన్ని గురించి, అందులోని రాజకీయ ఆర్థిక వాస్తవాల గురించి, ఒక సంక్లిష్టమైన, సూక్ష్మమైన, విలక్షణమైన దృష్టి – అద్భుతమైన సంఘటనలు, వాటి అవగాహనల రూపంలో అభివ్యక్తమవుతుంది. సుదీర్ఘమైన చరిత్ర జ్ఞాపకాలను, తరతరాలుగా పరిశీలించి, పరిశోధించి, నిశ్చయించి, విమర్శనాత్మకంగా స్థాపించడం ఈ రచనలో చూడగలం. ఇది అప్పుడప్పుడు చాలా తీక్షణరూపం కూడా దాలుస్తుంది. ఈ చిన్ని ప్రాంతంలో, కృష్ణదేవరాయలు మొదలుకొని ఈస్టిండియా కంపెనీ వరకూ సాగిన చరిత్ర గతిని మనమిందులో గమనిస్తాం. ఈ వృత్తాంతానికి ఒక రకంగా మన్రో రెవెన్యూ తీర్మానం ముగింపు నిస్తుంది. ప్రసిద్ధమైన కరణాల విశ్లేషణా పద్ధతి ఎరిగున్న జాగురూకుడైన పాఠకుడు, ముగింపు ఘట్టాలు అందించే అనుభవపాఠాలను గ్రహించ గలుగుతాడు. ఈ పాఠాలు సాధారణంగా లోగొంతులో, అర్థచ్ఛాయల ద్వారా, భావాత్మకమైన ఖాళీల (అధ్యాహారాల) సహాయంతో, కథనంలో కేవలం సూచనప్రాయంగా మాత్రమే వ్యక్తీకరించబడతాయి. ఇప్పుడింక అలాంటి సూక్ష్మభేదాలను తిరిగి టీకాతాత్పర్యాల సహితంగా యిక్కడ విప్పి చెప్పాల్సిన అవసరం లేదు. ఆ చర్వితచర్వణానికి బదులు, ఒక్క రెండు చక్కని శబ్దచిత్రాలను మాత్రం ఉదాహరణగా యిచ్చి ముగిస్తాం.

ఇందులో మొదటిది, పైన చెప్పిన సంఘటన జరగడానికి కొన్నేళ్ళకు ముందు, ఆ ప్రాంతాన్ని మొఘలులు ఆక్రమించిన కొత్తలలో జరుగుతుంది. ఆ కాలంలో, పరాభూతుడైన కారుమంచి అయ్యపరాజు అనే ఒక నియోగి పాత్ర మనకెదురవుతుంది. అతడు దూపాటి నాయకుల ఆస్థానంలో నౌకరీ చేస్తున్నవాడే, అవమానానికి గురై, ఖైదు చేయబడతాడు. అతడా బంధిఖానా నుండి తప్పించుకొని, దూపాటి నాయకులకు శత్రువు, తిరుగుబాటుదారుడు, అయిన మీర్ ఫజురుల్లా అనే అమీరు దగ్గర చేరి, నాయకుల ముఖ్య పట్టణమైన దద్దనాల, దాని చుట్టుపట్లనున్న ప్రాంతాల మర్మాలు, ఆ సంస్థానం సైనిక బందోబస్తు గురించిన సమాచారం, ఆ అమీరుకి చేరవేస్తాడు. అప్పుడు:

మీర్ ఫజురుల్లా అనేవారున్ను కొంత గుఱ్ఱం మందిని తీసుకొని అయ్యపరాజుతోకూడా తాను ఖుద్దు తరలి ఎకా ఎకీన వచ్చి దద్దనాల పట్టణం చుట్టూ ముట్టడివేసి పట్టణం దోచి బహుమందిని హతం చేసి శాయపనాయనివారి నగరు మీదికి వచ్చేవరకు పెద వెంకటాద్రినాయడు అతిశయమైన క్షాత్రవంతుడు కాడు గనుక అధికారబలం చాలనివాడు అయినందుచే తను ఆ వచ్చిన ఫంజు పట్టణం చరాచురా చేసేవరకు పెద వెంకటాద్రినాయడు ఎంత క్షాత్రవంతుడు కాకున్నా కొంత దూరం ఎదిరించి చూడవలెననే రోషం చేతను రాజ్యలక్ష్మి అనే నామం కల్గిన గుఱ్ఱం సవారీ కావలెనని తెప్పించి సవారీ కాబొయ్యేవరకు తొడక్రింద వృషణాలు పడి నల్గి నష్టపోయెను. అంతట నగరిలో క్షాత్రవంతుడైన పురుషుడు లేనందున పట్టణమంతా దోచుకొని అనేకమైన ప్రజలను కొట్టివేసిన తర్వాత నగరిలో ఉన్న స్త్రీలను అందరిని ఒక కొట్టడిలో ప్రవేశింపజేసి నగరున్ను తమాం దోచేవరకు అక్కడున్న స్త్రీలు గృహాలకు చిచ్చు కల్పించుకొని గృహాలతోకూడ స్త్రీలున్ను హతమైపోయిరి. వారు అందరు హతమయ్యేవరకు చిన వెంకటాద్రినాయనివారి కుమారుడు మల్లికార్జున నాయడు అనే పేరున శిశువు అయిదు సంవత్సరములవాడై యుండెను. ఆ విలయకాలమందు ఒక దాసీమనిషి ఈ శిశువును దాచుకొని నగరి చుట్టూ ఉన్న ప్రాకారానకు ఉండే గవాక్షి గుండా యెత్తుకొని పోయి తూర్పుకొండవీటి సీమలో వారి రాజబంధువులు రావెళ్ళవారు కిలారువారు అనే ఇంటిపేరిటివారు నలభైయిండ్లవారు తాళ్ళూరు, తక్కెళ్ళపాడు అనే గ్రామములలో ఉండియుండగా అక్కడికి తీసుకొని పోయెను.

ఎప్పుడూ ధీరులైన నాయకులే అంటే చిరాకు కలుగుతుంది. రాజసం సంగతి అలా ఉంచితే, కాస్త నమ్మశక్యం అనిపించే, మామూలు మనిషి (పాపం, పరిహాసాస్పదుడైనా) ఎదురవ్వడం నిజంగా కాస్త ఊరట కలిగించే విషయమే. ఆదర్శవంతం కానంత మాత్రాన, ఇలాంటి సంఘటనలను సవరించివేసి, మసిపూసి మారేడుకాయ చెయ్యవల్సిన అవసరం లేదని యీ చరిత్రకారుడు గ్రహించాడు. చిన్నపిల్లవాడైన వారసుడిని చివరి క్షణంలో ఒక సేవకురాలు గుట్టుగా కోట బయటకు తీసుకుపోయి రక్షించడం అనే అంశం ఇంతకు ముందు కూడా మనకు తారసపడింది. అది యిక్కడ ఒక రకమైన సాంప్రదాయిక కథావస్తువైపోయింది. బయటనుండి వచ్చిన యిలాంటి కథాంశాలతో పాటు, పచ్చి వాస్తవికతతో, నిక్కచ్చిగా భద్రపరచబడిన కుటుంబ సంప్రదాయాలు కూడా పక్కపక్కనే కనిపిస్తాయి. దుష్టుడైన నియోగికి కూడా చివరకు తగిన శాస్తి జరుగుతుంది. ఇలాంటివాడు చాలా ప్రమాదకరమైన మనిషని, దద్దనాల స్వాధీనమయ్యాక, అయ్యపరాజును ఉరితీయిస్తాడు మీర్ ఫజురుల్లా. ఇక మళ్ళీ మరో ఆవృత్తి మొదలయినట్టే. మళ్ళీ కమ్మ నాయకుల వంశస్థుడు కష్టపడి తన హక్కులను తిరిగి సంపాదించే ప్రయత్నం మొదలుపెట్టవచ్చు.

ఇలా పారంపరికగా వచ్చే కొన్ని అంశాలు ఏకంగా కవిసమయాల స్థాయిని పొందుతాయి. ఇలాగే కోటనుండి రహస్యంగా రక్షింపబడిన మరో శాయప్ప వంశస్థుడు, మల్లికార్జునుడనే వాణ్ణి, నియోగులు, వెలమలు, తన బంధువులైన కమ్మవారు కలిసి పెంచుతారు. మీర్ ఫజురుల్లా చేసిన దద్దనాల విధ్వంసం (క్రీ.సం. 1710) తర్వాత పదేళ్ళకు, మల్లికార్జునుడు తన కుటుంబ హక్కులను, ఆ ప్రాంతపు సర్వాధికారి అయిన ఆసఫుజా నిజాముల్ ముల్కుగారి నడిగి తిరిగి తీసుకోవాలని బయలుదేరుతాడు.

వేయి రెండువేల మందితోకూడా పాలకీలు గుఱ్ఱాలు వగైరా సవారీలతోకూడా షహరుకు పోయి ఒక ప్రదేశమందున దిగి హజరతుగారికి వీరు వచ్చిన సమాచారం ఎరుక చేసిన మీదను హజరతుగారు అనుమానించి శాయపనాయనివారు అందరు దద్దనాలపట్నం హలాలైనప్పుడు వారి గృహాలతోకూడా లయం అయిపోయినారన్న సంకోచం మనస్సున ఉంచుకొని పరీక్ష పూర్వకముగా వీరిని బైటికి రమ్మని శలవు ఇవ్వడంలో దిడ్డిదర్వాజాను రమ్మని చెప్పిరి గనుక వీరు ఆ మర్మం తెలియక వారు శలవు ఇచ్చిన దర్వాజా పర్యంతం పోయినంతలో ఈ మల్లికార్జుననాయడు ఎంత చిన్నవాడైనా గొప్పవారి గర్భవాసమందు ఉత్పత్తి అయినాడు గనుక సంకోచంతోచి ఏనుగు నెక్కి దిడ్డిదర్వాజాను పోవటము మనకు సాంప్రదాయం కాదు, మనమీద దయవచ్చినప్పుడే మనమున ప్రీతి చేశేరు. ఇంతటినుంచి తిరిగిపోవలసినదేనని ఆ దర్వాజా దాటిపోక తిరిగి వచ్చి యథాపలాన ప్రవేశించేటంతటిలో ధణివారు ఈ సమాచారం విని వారి సొత్తు అయినవాడు గనుకనే మనము చేసిన ఎత్తుకు త్వరపడి నడచినవాడుకాడు అని దయవచ్చి తిరిగి పెద్ద దర్వాజాను రమ్మను మని దివానులను పంపించిరి గనుక మరునాడు సాయంత్రంవేళ పోయి హజరతుగారి దర్శనం చేసుకొని తమ సమాచారములు యావత్తు పూర్వోత్తరములు అడిగిన తర్వాత ఈ చిన్నవారు తేజస్సు కలవాడున్ను దేవాంశ కలవాడున్ను వస్తుతః క్షాత్రవంతుడు అయిన వెంకటాద్రినాయని కుమారుడు గనక ధణివారి యెదుట కూర్చుండి వారు అడిగిన ప్రశ్నలకు మరియొకరిని యోచన అడుగక ఉత్తరం చక్కగా ఖామందుతో మనవిచేసినంతలో అత్యంత సంతోషం చేతను చాల దయవచ్చి వీరిదగ్గిర ఉన్న వకీలు దస్తావేజులు మొదలయినవి కొన్నికొన్ని చూపించినందున చక్కగా విచారించి వినుకొండ మొదలయిన దుర్గాలు దేఖీలు తాలూకాలు జహగీర్లు వ్రాసియిచ్చి తన దగ్గర మల్లికార్జుననాయని కొన్ని దినములుంచుకొని తర్వాత సెలవు ఇచ్చిన మీదను…

ఈ సన్నివేశంలో మల్లికార్జునునికి యుక్తితో పెట్టిన పరీక్ష, అతని ఔచితీమంతమైన ప్రవర్తనకు మెచ్చి అతడిని సన్మానించిన విధానమూ, నిజాముల్ ముల్కు వివేక ఔదార్యాలకు తార్కాణాలుగా నిలిచాయి. మొదటి రెండు శతాబ్దాల పాలనాకాలంలో శాయప్పవంశం తమ అధికారాన్ని కాపాడుకోడానికీ, పోయిన దాన్ని తిరిగి పొందడానికీ, యిలాంటి ఉన్నతాధికార కేంద్రాల ఆసరా ఉండేది. అసలు సమస్య తర్వాత కాలంలో, ఆ కుటుంబంలోనే చీలికలు ఏర్పడి, పదునెనిమిదవ శతాబ్దపు చివరి దశకాలలో అంబానాయడు అనే (కొంత దుర్బుద్ధి కలిగిన) పాత్ర ప్రవేశించడంతో, మొదలవుతుంది. అలా మొదలైన వారి వంశ విచ్ఛిత్తి ప్రక్రియకు కొన్ని దశాబ్దాల తర్వాత, మన్రో ప్రవేశపెట్టిన తీర్మానం ముక్తాయింపు నిచ్చింది. ఇటు దస్తావేజులు కాని, అటు రక్షింపబడిన చరిత్ర (విస్తృతార్థంలో) కాని, దూపాటి నాయకులను రక్షించ లేకపోయాయి. చివరికి, ఆ వంశానికి ఆఖరి ప్రతినిధి అయిన ‘సుబ్బానాయనింగారికి కుంఫిణీవారు దయతో ఎంతో కొంత జీవనం’ ఇప్పించాలని మనవి చేసుకోడం తప్ప మరేమీ చెయ్యలేని పరిస్థితిలో కైఫీయతు ముగుస్తుంది.

అయినా కాని, మల్లికార్జుననాయని ప్రవర్తన మనకెన్నో సందేశాలని అందిస్తుంది. ఒక మంచి సంస్కారం – గతాన్ని గూర్చి ఒక సహజమైన, శక్తివంతమైన అవగాహన, సూక్ష్మమైన అనుభూతి – ఆ యువరాజుని పరీక్షలో గట్టెక్కించింది. దక్షిణ భారతదేశ చరిత్రకారుడు కూడా, చరిత్ర రచనా విధానంలో ‘దొడ్డి దర్వాజా’ నుండి ఒక అడుగు వెనక్కి వేసి, తమ పూర్వీకులైన కరణాలు తొక్కిన రాజ మార్గాన్ని అనుసరించాల్సిన సమయం ఆసన్నమయింది.


ఈ పుస్తకానికి ఊహ ఎలా వచ్చింది, వ్రాయడం ఎలా జరిగింది, సంజయ్ సుబ్రహ్మణ్యం ఈ సంచికలో వ్రాసిన లేఖలో చదవండి. ఫిలిప్ వాగనర్ తన లేఖలో ఈ పుస్తకం ఎందుకు గొప్పదో వివరిస్తాడు. ఈ సంచికలో ఈ పుస్తకం మొదటి అధ్యాయం అనువాదం కూడా చదవండి.

షెల్డన్ పోలాక్ వ్రాసిన విమర్శాత్మక సమీక్ష (హిస్టరీ అండ్ థియరీ, సంపుటి 46, అక్టోబర్ 2007) పిడిఎఫ్, అదే సంచికలో వెల్చేరు, షూల్మన్, సుబ్రహ్మణ్యం ఇచ్చిన వివరణాత్మక సమాధానం పిడిఎఫ్. ఈ రెండు వ్యాసాలు అసోసియేషన్ ఆఫ్ ఏషియన్ స్టడీస్ వార్షిక సమావేశాలలో భాగంగా 2006లో ఈ పుస్తకంపై జరిగిన ప్రత్యేక చర్చ నుండి వచ్చినవి. ఇదే చర్చలో భాగంగా రమ మంతెన వ్యాసం, క్రిస్ చేకూరి వ్యాసం కూడా ఈ సంచికలో పొందుపరచబడినాయి.