ఆ మధ్య మదర్స్ డే నాడు గుడికి వెళ్ళిన నాకు, తెలిసిన పెద్దమనిషొకరు తారసపడ్డారు. యోగక్షేమాలు అడిగేక ఆయన “అన్నట్టు మర్చిపోయాను. హాపీ మదర్స్ డే!” అని శుభాకాంక్షలు చెప్పి, అంతటితో ఆగకుండా “మాతృ దేవోభవ – అంటూ దినచర్య ప్రారంభించమని బోధించిన సంస్కృతిలో పెరిగిన వాళ్ళకి, ఏడాదిలో ఫలానా రోజునే ఇలా అనాలి అన్న విషయం వింతగా తోచదూ?” అని విశ్లేషణని కూడా జతపరిచారు.
నాక్కూడా నిజమే అనిపించింది. గుడి మెట్లు దిగుతున్న నా దృష్టి మురిపాల కృష్ణుణ్ణి ముద్దుచేస్తున్న యశోదమ్మ చిత్ర పటం, దాని కింద రాసి ఉన్న ‘ముద్దుగారే యశోద ముంగిటి ముత్యము వీడు’ అన్న మాటల మీద పడింది. నిజంగా తల్లంటే యశోదే. చరిత్ర కందని దినాల్లో చిన్న కృష్ణుడి తల్లిగా, తరతరాలుగా చరిత్ర పుటల్లో మరపురాని కొమ్మగా, మాయని బొమ్మగా నిలిచిపోయింది ఈ అమ్మ అనుకున్నాను.
మన భాషలో ఈ కధ ఇలా నిలిచిపోవటంలో – భావం శబ్దంలో ఒదిగిందో, శబ్దం భావంలో కలిసిందో, అంతుపట్టని రీతిని పరుగులు పెట్టే, తన కవితాప్రవాహానికి ఆధారం, సహజ పాండిత్యమో, భక్తి పారవశ్యమో తెలియకుండా – గంటం తిప్పిన పోతన్న చేతి మహిమ చాలా ఉంది. ఈయన అక్షరాలా అమ్మకి భక్తుడు. సమస్త మహోన్నత లక్షణాలకి మూల రూపం అయిన అమ్మలగన్న అమ్మని “క్షోణితలంబునన్ నుదురు సోకగ మ్రొక్కి నుతింతు..” అంటూ మొదలు పెట్టి, నాలుగు పద్యాలలో నోరారా స్తుతించాడు భాగవత పీఠికలో. తరువాత తనతల్లి లక్కమాంబను ప్రస్తుతి చేసాడు. ఈ మాతృభక్తి భావమే యశోదా పాత్ర చిత్రణకి అంత చక్కగా మెరుగులు దిద్దిందేమో.
నిజానికి యశోదమ్మ కృష్ణుని కన్న అమ్మ కాదు. పాలిచ్చి పెంచిన గోపాంగన. యోగమాయని కని, ఆ మాయల తెరలలో యశోద, ఆమెతో బాటు గోకులం సమస్తము నిద్రలోకి జారుకుంది. ఇలా నిద్రావస్థలో ఉన్న యశోద పక్కలో ‘చిన్ని నల్లనయ్యను’ ఉంచి చిఱుతపాప రూపున ఉన్న యోగమాయని పుచ్చుకుని తిరిగి చెరసాలకు చేరుకున్నాడు వసుదేవుడు. ద్రోణుడనే వసువును, అతని భార్య ధరను, భూలోకంలో మానవులుగా జన్మించండి అని బ్రహ్మ కోరితే, ‘వైకుంఠుని సేవాభాగ్యం మాకు కలిగేటట్టు వరమిస్తే వెళతాం’ అని అడిగారుట ఆ దంపతులు. దానికి ఆ విధాత తధాస్తు అన్నాడట. వాళ్ళే ద్వాపర యుగంలో యశోద,నందులు.
తన పక్కన పొత్తిళ్ళలో ఉన్న చిన్నిపాపడు – తండ్రి సంకెళ్ళు త్రెంచి, చెరసాల చెరలను వదిలించి, మధురానగరిని మాయానిద్రలో ముంచి, పాపఱేని పడగల నీడన, అర్ధరాత్రి వేళ, ఒదిగి దారిచ్చిన యమునని దాటి వచ్చేడని, ఆ తల్లి ఎఱుగదు. ముద్దుల బిడ్డడిని ఒడిలో చేర్చుకొని మురిసిపోయింది. నందుడు వేదవిదులను పిలిచి బాలుడికి జాతకర్మలు చేయించాడు. ఈ కృష్ణావతారంలో మాత్రం ఆ విష్ణుమూర్తి, ఆనాటి అదితీపుత్రుడైన వామనుడిలా ఉపనయన వయస్కుడై జన్మించి, నా భిక్షాపాత్ర ఏది? నేను బలిని దానం అడగాలి! అంటూ కాళ్ళల్లో చెప్పులు పెట్టుకుని అడగలేదు, సరికదా “మన యశోద చిన్ని మగవాని కనెనట చూచి వత్తము” అంటూ గోపికలు వచ్చి, కానుకలు ఇచ్చి “జో జో కమలదలేక్షణ! జో జో కృష్ణా!” అని జోలలు పాడగా, లోకాలని నిద్రపుచ్చే స్వామి కళ్ళు మూసుకుని నిద్ర నటించాడు.
ఏబాములెఱుగక యేపారు గట్టికి బసులకాపరి యింట బాముగలిగె
ఏకర్మలు లేక యొనయు నెక్కటికిని జాతకర్మంబులు సంభవించె
ఏ తల్లి చనుబాలు ఎరుగని ప్రోడ యశోద చన్నుల పాల చొరవ యెఱిగె
(భాగవతం, దశమస్కంధం, పూర్వభాగం, 193)
పుట్టుక అనేది లేకుండా ప్రకాశించే ఆ దేవుడికి ఒక పశువుల కాపరి ఇంట్లో జన్మం కలిగింది. కర్మలకి అతీతుడైన ఆ నేర్పరికి జాతకర్మలు జరిగాయి. ఏ తల్లి పాలు ఎరుగని ఆ ప్రౌఢునికి(పెరిగి ఉన్నవాడు) యశోదాదేవి చన్నుపాలలోని మాధుర్యం తెలిసింది.
అన్నీ తెలిసిన ఆ భగవంతుడికి అంతా మాయే. అంతా లీలే. కాని ఆ తల్లికి మాత్రం తన బిడ్డడు నవ్వే ప్రతి నవ్వు, వేసే ప్రతి అడుగు, చేసే ప్రతి చేష్టా ఒక అద్భుతము, అపూర్వము అయిన అనుభూతి. దాన్ని కాదనడానికి, త్రోసిపుచ్చడానికి సాధ్యాసాధ్యాలు అంటూ లేని ఆ దేవదేవుడికి కూడా సాధ్యం కాలేదు. అందుకే ఎన్ని వేషాలు వేసి, ఎన్ని మాయలు చూపించినా, ప్రేమపాశానికి పట్టుబడి, తల్లి ఒడిన పాపడు కావడం తప్పలేదు ఆ జగన్నాటక సూత్రధారికి.
కంసుడి ఆజ్ఞ మేరకు, తనను చంపబోయిన పూతన ప్రాణాలని పాలతో కలిపి లాగేసిన ఆ కృష్ణుడికి దృష్టి తీసి, పాలిచ్చి, పాన్పు పై పడుకొనబెట్టి, ఓ పాపడా! నిద్రపోవయ్యా! అని జోలపాడి, జోకొట్ట గలిగిన భాగ్యవంతురాలు ఆ యశోద. తన పాపడు బోర్లా పడగానే బ్రాహ్మణులని పిలిచి, సంభావనలని ఇచ్చింది. పండుగ చేసింది. శకటాసురుణ్ణి సంహరించిన ఆ దుష్టశిక్షకుడు, తన చుట్టూ ఉన్నవారిని మాయ పుచ్చటానికి ఏడుస్తుంటే, ఆ పాపడిని ఎత్తుకుని బుజ్జగించింది. బాలగ్రహం సోకిందని శాంతులు చేయించింది. తృణావర్తుడనే రాక్షసుడు, సుడిగాలి రూపున బాలుడిని చుట్టుముట్టి, పైకి లేపుకు వెళ్ళిన విషయం తెలుసుకుని, ఇలాంటి ఆపద ముంచుకు వచ్చిందే అని వాపోయింది. దైవాన్ని దూషించింది.
ఇక్కడం బెట్టితిం దనయుఁ డిక్కడ నాడు చుండె గాలి దా
నెక్కడ నుండి వచ్చె, శిశువెక్కడి మార్గము వట్టిపోయెనే
నెక్కడఁ జొత్తు నంచుఁ గమలేక్షణ గ్రేపుఁ దొఱంగి ఖిన్న యై
పోక్కుచు వ్రాలు గోవు క్రియ భూస్థలి వ్రాలె దురంతచింతయై (భా. ద. పూ. 268)
దూడను కోల్పోయిన గోమాత లాగ పట్టరాని దుఃఖంతో భూమి మీదకి ఒరిగి పోయిందట.
పుట్టి పుట్టఁడు నేఁడు దొంగిలబోయి మా యిలు సొచ్చి, తా
నుట్టి యందక ఱోలుఁ బీఁటలు నొక్కప్రోవిడి యెక్కి చే
వెట్టఁ జాలక కుండక్రిందొక పెద్దతూఁ టొనరించి మీ
పట్టి మీఁగడ పాలు చేరలఁ బట్టి త్రావెఁ దలోదరీ! (భా. ద. పూ. 309)
ఓ యశోదమ్మా ! నీ ముద్దుల బిడ్డడు పీటలు, ఱోలు దొంతరలుగా పేర్చి, దాని మీదకెక్కి, అప్పటికి చేతికి అందకపోతే కుండకు చిల్లు పెట్టి దానిలో నుంచి కారుతున్న మీగడ పాలను పట్టుకుని తాగేడు. ఇలా అయితే మేము ఊరు వదిలి పోవాల్సిందే! అంటూ వెన్నలదొంగ ఆగడాలను వినిపిస్తారు గోపికలు.
అంతా విని, “కన్నులు తెరవని మా యీ చిన్ని కుమారుని ఱవ్వ సేయం దగునే? అన్య మెఱుగడు, తనయంత ఆడుచుండు. మంచివాడితడు. ఎగ్గులు మానరమ్మ!” అని వాళ్ళనే ఎదురు తిరిగి మందలిస్తుంది. మనసులో అనుమానం ఉన్నా ముద్దుల కొడుకుని కోపించడానికి మనసు రాదు ఆ తల్లికి. గోపకాంతలు చెప్పిన ఎగ్గులను విని, భయపడుతున్న వాడిలాగా, పరమ సాధువు లాగా, ఆ గడుసు వాడు తల్లి గుండెల్లో తల దాచుకుంటాడు.
అన్న, గోపన్నలు వచ్చి, తుంటరికన్నడు మన్ను తింటున్నాడని తల్లితో చెబుతారు. తన ఇల్లు, పరాయిల్లు అన్న తేడా లేకుండా, ఇంటింటా దూరి పాలు వెన్నలు తినే బాలుడు మన్నెందుకు తింటున్నాడో బోధపడలేదు ఆ యశోదమ్మకు. పిల్ల వాడి చెయ్యి పుచ్చుకుని, “మన్నేటికి భక్షించెదు మన్నియములేలా నీవు మన్నింపవు?” నేను చెప్పిన మాట ఎందుకు వినవు?” అని విసిగిపోయి, అమాయకంగా అడుగుతున్న తల్లితో:
అమ్మా! మన్ను దినంగ నే శిశువనో, యాఁకొంటినో, వెఱ్ఱినో,
నమ్మంజూడకు వీరి మాటలు మది న్నన్నీవు కొట్టంగ వీ
రిమ్మార్గమ్ము ఘటించి చెప్పెదరు, కాదేనిన్, మదీయాస్య గం
ధమ్మాఘ్రాణము సేసి, నా వచనముల్ దప్పైన దండింపవే (భా. ద. పూ. 337)
నా మాటలు నమ్ముతావా ? లేక నన్ను నీ చేత కొట్టించాలనుకున్న వీళ్ళ అబద్ధాలు నమ్ముతావా? చూడు నా నోరు మట్టి వాసన వేస్తోందేమో? అదే నిజమైతే నన్ను దండించు. అని నేరుపులన్నీ నేర్చిన ఆ బాలుడు ఎంతో ప్రేమగా పలికి, తన నోరు చూపించాడు. అంతే!
ఆ లలితాంగి కనుంగొనె
ముఖమందు జలధి పర్వత వన భూ
గోళ శిఖి తరణి శశి ది
క్పాలాది కరండ మైన బ్రహ్మాండంబున్ (భా. ద. పూ. 339)
బాలుని నోట బ్రహ్మాండాన్ని చూసి సందేహంలో పడిపోయింది తల్లి. ఇది కలా? వైష్ణవ మాయా? అసలు నేను యశోదాదేవి నేనా? ఇది అసలు రేపల్లె కాదేమో? అంటూ కొంచం ఆలోచించుకుని, “బాలుని భంగిని ఇతడు భాసిల్లు గాని, సర్వాత్ముడాది విష్ణుడు అగుట నిజము” అని నిర్ణయించుకుంది. కప్పుకొన్న మాయతెరలు జారడం చూసి మళ్ళీ మాయ పన్నుతాడు ఆ పరమాత్మ. మోహపు పొరలు కమ్ముకోగానే ఆమె ‘సర్వాత్ముడు’ అనుకోవడం మానేసి, ‘నా బిడ్డ’ అని తొడపై కూర్చోపెట్టుకుని ఎంతో మమతతో ముద్దు చేసింది. ఆ యశోదమ్మ జ్ఞాని, భక్తురాలుగా కాకుండా తనని బెదరించి, బుజ్జగించి, ముద్దు మురిపాలలో తేల్చే అమ్మగానే తనకి ఇష్టం అన్నట్టుగా ప్రవర్తించాడు బాల కృష్ణుడు. ఈ సందర్భంలో భాగవత కధను తనకు వినిపిస్తున్న శుకయోగితో పరీక్షిత్తుడు:
ప్రబ్బిన భక్తిని హరిపైఁ
గబ్బంబులు సెప్పి కవులు కైవల్య శ్రీ
కబ్బుదు రఁట హరి పోషణ
మబ్బిన తలిదండ్రు లెచటి కబ్బుదురో (భా. ద. పూ. 350)
భక్తితో హరినికీర్తన చేస్తూ కావ్యాలు వ్రాసే కవులకి మోక్షం ప్రాప్తిస్తుందట. మరి ఆ విష్ణుముర్తి ఆలనా పాలనా చూసే భాగ్యం కలిగిన వారికి ఏం లభిస్తుందో ? అని అంటాడు. శుకుడి సమాధానం ఎలా ఉన్నా, జన్మాంతం దాకా ఎందుకు? అప్పడే, అక్కడే, ఆవిడ ముంగిటి లోకే వచ్చి కూర్చుంది వైకుంఠం. ఈ జన్మలోనే ముజ్జగాలను పాలించే ఆ వైకుంఠాధీశుని ఒడిలో ఉంచుకుని లాలించే భాగ్యం ఆ గోపెమ్మకే అబ్బింది.
ఒక నాడు తల్లి యశోద కవ్వంతో పెరుగు చిలికి వెన్న తీస్తోంది. చేరవచ్చి, ఆకలి వేస్తోందని మారాం చేస్తాడు, గారాలు పోతాడు, పేచీలు పెడతాడు కన్నడు. కవ్వాన్ని విడిచి కుర్రవాడిని చేరదీస్తుంది. ఇంతలో పొంగిపోతున్న పాలదుత్తిని పొయ్యి మీద నుంచి దింపడానికి కొడుకుని కింద పెట్టి వెళుతుంది. ఆ పెంకెవాడు తన ఆకలి తీర్చకుండా వెళ్ళిన తల్లి మీద అలిగి కోపంతో కుండ తన్ని పగుల గొట్టి వెన్న తిని పోతాడు. తిరిగి వచ్చిన యశోద బిడ్డ కోసం వెదుకుతుంది. మరో ఇంట్లో రోటి మీద ఎక్కి వెన్న దొంగిలిస్తూ కనబడ్డాడు. యశోదాదేవికి బాగా కోపం వచ్చింది. నేను పిల్ల వాడిని గారాం చేసి పాడు చేస్తున్నాను. భయం పెట్టాలి అనుకుంది. దండించడానికి కర్ర పుచ్చుకుని తన కేసి వస్తున్న తల్లిని చూసి, రోటి మించి దూకి పరుగుతీస్తాడు గోపాలుడు. నీ వేషాలు నా దగ్గర చెల్లవు. నా చేతికి చిక్కకుండా ఎక్కడికి పోతావు అని వెంట తరిమింది. అతి ప్రయాస పడి పట్టుకుంది కొడుకుని.
చిక్కఁడు సిరి కౌఁగిటిలోఁ
జిక్కడు సనకాది యోగి చిత్తాబ్జములన్
జిక్కఁడు శ్రుతి లతికావళిఁ
జిక్కె నతఁడు లీలఁ దల్లి చేతన్ ఱోలన్ (భా. ద. పూ. 381)
లక్ష్మీదేవి కౌగిట గాని, సనకాది యోగిజనుల హృదయాల్లో గాని, వేదవేదాంగాలలో గాని ఇమడని ఆ హరి లీలగా తల్లి చేత చిక్కి పోయాడు. అలా చిక్కిన వాడిని నవనీత హృదయ ఆ యశోదకి కొట్టటానికి చేతులు రాలేదు. అందుకే తాటిని తెచ్చి ఱోటికి కట్టి పడేస్తాను నిన్ను అంది. ఎంత పెద్ద తాడు తెచ్చినా సరిపోలేదు. “పట్టి కడుపు పెక్కు బ్రహ్మాండములు పట్టుట ఎరిగేనేని ఏల కట్టు?” తన కొడుకు పొట్టలో బ్రహ్మాండాలన్నీ నిండి ఉన్నాయని తెలిసిననట్టు అయితే ఎందుకు కట్టాలనుకుంటుంది? ఎరగక పోవటం ఏమిటి? చూసిందిగా ఇంతకు పూర్వం. కాని ఏం లాభం? ఆ చూసిన విషయం తాలూకు వాసన లేకుండా ఇంద్రజాలం చేశాడు మరి బాల వాసుదేవుడు.
ఎలాగైనా కొడుకుని ఱోటికి బంధించాలనే పట్టుదలతో ప్రయత్నిస్తున్న ఆ యశోదకి ఒళ్ళంతా చెమటలు పోశాయి, కొంగు జారిపోతోంది. తలలో పూలు నేల రాలాయి. తనని కట్టి పడేయ్యాలనే తాపత్రయ పడుతున్న తల్లి అవస్థని చూసి, ఆమెని కరుణించాడు కరుణాసింధువు.
బంధ విమోచనుఁ డీశుఁడు
బంధింపఁ బెనంగు జనని పాటోర్చి సుహృ
ద్బంధుఁడు గావున జననీ
బంధంబునఁ గట్టువడియెఁ బాటించి నృపా! (భా. ద. పూ. 386)
అలా కట్టబడి ఱోలీడ్చుకుని మద్దెచెట్లని కూల్చి నలకూబర మణిగ్రీవులని శాపబంధ విముక్తుల్ని చేస్తాడు.
ఇంద్రుడు ఎడతెరపి లేకుండా కురిపించిన ఘోరమైన వర్షధారల నుంచి గోకులాన్ని రక్షించడానికి గోవర్ధన గిరినెత్తి లోకరక్షకుడైన గోపాలుడు, లోకధర్మాన్ని పాటించి, తల్లి దండ్రుల మీద భక్తి చూపుతూ, ”రా తల్లి! రమ్ము తండ్రీ !” అని ముందుగా యశోదను నందుడిని పిలుస్తాడు.
ఆ లోకైక రక్షకుడిని వేయికళ్ళతో కాపాడడమే ఆ మాతృమూర్తి కర్తవ్యం, అతడే ఆమె లోకం. తనను పసివాడిగా భావించి పరిరక్షించాలని నిరంతరం తాపత్రయ పడే ఆ యశోదాదేవిని తన నటనలతో, మభ్య పెట్టటము, మురిపించడమే తన కర్తవ్యం అన్నట్టు ప్రవర్తించేడు బాలకృష్ణమూర్తి.
సెలగోల పట్టుకుని జల
కలశము లోని నీడఁ జూచి కలశ గతుండై
సెలగోలఁ బాపఁ డొకఁ డిదె
తలచెన్ ననుఁ గొట్ట ననుచుఁ దల్లికి జెప్పెన్ (భా. ద. పూ. 418)
చేత కర్ర పుచ్చుకుని నీటిమడుగు ముందు నిలబడి తన నీడను చూసి, బెదరిపోతూ, అమాయకంగా తల్లితో, నీళ్ళలో ఉన్న ఆ బాలుడు కర్రతో నన్ను కొట్టటానికి వస్తున్నాడని చెప్పినప్పుడు, తనయుడిని గుండెల్లో పొదువుకుని, భయపడకు! అది వట్టి నీడే! అని బుజ్జగించక మరేం చేస్తుంది ఆ పిచ్చి తల్లి.
పిల్లలు పేచి పెట్టి ఏడిస్తే తల్లులు ఏదో సాకు చెప్పి, భయపెట్టి, ఊరుకో పెడతారు కదా. అందరు అమ్మల లాంటిదే యశోదమ్మ.
భిక్షులు వచ్చెద రేడ్చిన
భిక్షాపాత్రమున వేసి బెగడించి నినున్
శిక్షిం చెదరని చెప్పిన
భిక్షులఁ గని తల్లి నొదిఁగి భీతిల్లు నృపా! (భా. ద. పూ. 419)
నువ్వు ఏడ్చావంటే భిక్షువులు వస్తారు. నిన్ను వాళ్ళ భిక్షాపాత్రలో వేసుకుని పోయి శిక్షిస్తారు సుమా! అని భయ పెడుతుంది. నిజంగా వాకిటిలోకి భిక్షువు వచ్చినప్పుడు, భయపడుతూ తల్లి చాటున దాక్కున్నాడుట చిన్నారి కన్నయ్య. చరాచారాలన్నిటిలో తానే నిండి ఉండే వాడికి ఈ లీల ఏమిటి? ఈ మిషతో తన మాతృమూర్తిని సంతోషపెట్టి ధన్యురాలిని చెయ్యడం కాకపొతే. లోకాలన్నిటిని లాలించి పాలించి అలిసిన స్వామి బాలకృష్ణునిగా తల్లి యశోదాదేవి ఒడిలో తనివి తీరా సేద తీరాలనుకున్నాడో, లేక పూర్వ జన్మలో బ్రహ్మ ఆమెకు చేసిన వాగ్దానాన్ని మన్నించాలనుకున్నాడో – కారణం ఏదైనా, ఆ యశోదాదేవిని మాత్రం కలకాలం గుర్తుండిపోయే మాతృమూర్తిగా చేశాడు ఆ హరి.
పోతన్న భాగవతపీఠికలో “శ్రీ కైవల్య పదంబు చేరుటకు”, ఎవరినో కాదు “మహా నందాంగనా ఢింభకుని” (నందపత్ని చిన్ని కుమారుడిని) శరణు కోరడమే కాదు, ఆ తల్లి భాగ్యాన్ని ప్రశంసిస్తూ:
సంగడిఁ దిరిగెడు శంభుడు
నంగాశ్రయ యైన సిరియు నాత్మజు డై యు
ప్పొంగెడు పద్మజుడును
గోపాంగన క్రియ గరుణవడయ రఖిలేశ్వరుచేన్ (భా. ద. పూ. 387)
సఖుడైన శివుడు,అర్ధాంగి యైన లక్ష్మీ దేవి, పుత్రుడైన బ్రహ్మ కూడా గోపాంగన యైన ఆ యశోదాదేవి లాగ ఆ లోకాధీశ్వరుని కరుణని పొందలేదు – అంటాడు. ఆ కన్నడిని కనురెప్పల్లో దాచుకుని పెంచిన ఆ యశోదమ్మ, ఆ అమ్మని మనకందించిన ఆ పోతన్న, ఇద్దరూ ధన్యజీవులు.