“నేను బుల్లెబ్బాయి గారింటికి పేరంటానికి వెళుతున్నాను. పాలమ్మాయి వస్తే ఈ నెల జీతం ఇవ్వండి.” అంటూ బల్ల మీద ఏభై రూపాయిల నోటు పెట్టింది మా ఆవిడ సత్యవతి. పిల్లల పరీక్ష పేపర్లు దిద్దుతున్న వాణ్ణి తలెత్తి చూసి, అలాగే నన్నట్లు తలూపుతూ ఏమిటి విశేషమన్నట్లు చూశాను.
“అనసూయమ్మగారు గౌరీ వ్రతం పట్టిందట. పసుపూ, కుంకుమకని పిలిచారు. అన్నట్లు చెప్పడం మరిచాను. భీమవరం నుండి మీ ఫ్రెండు వెంకటరత్నం వచ్చాడట.” పట్టు చీర సవరించుకుంటూ అంది.
వెంకటరత్నం అంటే అనసూయమ్మ తమ్ముడు; వెరసి బుల్లెబ్బాయి బావమరిది. వాడూ, నేనూ కలిసి చదువుకున్నాం. భీమవరం కాలేజీలో వాడు లెక్చెరరుగా పనిచేస్తున్నాడు. బుల్లెబ్బాయంటే మొబర్లీ పేటలో ఎవర్నడిగినా చెబుతారు. పాతికెకరాల పొలమూ, పదెకరాల కొబ్బరితోటా వున్న మోతుబరి. గాంధీబొమ్మ సెంటర్లో పెద్ద బట్టల దుకాణం ఉంది.
“వస్తే వాడే కలుస్తాడులే!” అనేసి నా పనిలో పడిపోయాను. అమలాపురం వచ్చి నన్ను కలవకుండా వెళ్ళడు వెంకటరత్నం. నా మాటలు పట్టించుకోనట్లుగా వెళ్ళిపోయింది సత్యవతి. పేపర్లు దిద్దుతూ టైం తెలియలేదు నాకు. కొంతసేపటికి సత్యవతి పేరంటం నుండి తిరిగొచ్చింది. ఉన్న చోటనుండి కదలకుండా పేపర్లు దిద్దుతున్న నన్ను చూసి ఆశ్చర్యపోయింది.
“ఏంటి? అప్పట్నుండీ పేపర్లు దిద్దుతూనే వున్నారా?”
“ఊ!”
“పాలమ్మాయి రాలేదా? లేక మీరు మీ లోకంలో పడి ప్రపంచాన్ని మర్చిపోయారా?” చికాగ్గా అంది అక్కడ బల్ల మీద పెట్టిన ఏభై నోటును చూస్తూ.
“వెంకటరత్నం కనిపించాడా?” ఆమె ప్రశ్నకి జవాబివ్వకుండా మాట మార్చాను.
“మీ ఫ్రెండు కనిపించలేదు కాని వాళ్ళావిడ పేరంటంలో కనిపించింది. ఇవాళ పేరంటంలో ఓ పేద్ద విచిత్రం జరిగింది,” కళ్ళు పెద్దవి చేస్తూ అంది. ఏమిటని నేనడక్కుండానే తనే మళ్ళీ చెప్పింది.
“ఇవాళ పేరంటానికి ఆకాశం మేడ పంకజం వచ్చింది. ఆవిణ్ణి చూసి మిగతా ముత్తైదువులందరూ బుగ్గలు నొక్కుకున్నారు. ముత్తైదువుల పేరంటానికి ఈవిడొచ్చిందేమిటాని పంకజాన్ని చూసి అందరూ చెవులు కొరుక్కున్నారు.” సత్యవతికి ఇలాంటి విషయాలంటే ఆసక్తి ఎక్కువ.
ఆకాశం మేడ పంకజం అంటే అమలాపురమంతా తెలుసు. కూచిమంచి అగ్రహారంలో కలక్టారాఫీసు భవనం పక్కనే మేడలో ఉంటుందామె. పంకజం ఇంటి పేరు ఆకాశం. ఊరంతా ఆ మేడని ఆకాశం వారి మేడ అంటారు. అలా ఉత్తి పంకజం కాస్తా ఆకాశం వారి మేడ పంకజంగా మారిపోయింది. ఆ మేడకి అంత పేరు రావడానికి పంకజమే కారణం. పంకజానికి పెళ్ళి కాలేదు. ఒక్కతీ ఆ ఇంట్లో ఉంటుంది. ఉన్న ఒక్కన్నగారూ మద్రాసులో ఉంటాడు. పనివాళ్ళు చాలామందిని పెట్టుకొని పంకజం ఒక్కతే ఉంటుంది. తాత ముత్తాతలిచ్చిన ఆస్తుల్ని చూసుకోడానికి మద్రాసునుండి పన్నెండేళ్ళ క్రితం వచ్చింది. అప్పటికింకా పెళ్ళి కాలేదు. అప్పటికే కాదు, ఇప్పటికీ కాలేదు. పంకజం పొడవుగా, నాజూగ్గా, అందంగా ఉంటుంది. మరీ తెలుపు కాదు కానీ, చామనచాయ కన్నా కాస్త రంగెక్కువ. ఆమెలో ఆకర్షణ నల్లటి తాచుపాములాంటి జడ. ఆమె పొడవాటి జడని చూసి ఆడవాళ్ళే ఆశ్చర్యంగా చూస్తారు. చూడగానే ఇట్టే ఆకర్షించే ముఖం. అన్నింటిని మించి అందరితోనూ కలగోలుపుగా ఉంటుంది. ముఖ్యంగా మగాళ్ళతో.
వూళ్ళో డబ్బున్న మగాళ్ళు కొందరు ఆ ఇంటి చుట్టూనే తిరుగుతారు. డీలక్స్ ధియేటరు వాటాదారు గంగరాజూ, అంబాజీపేట మైనరూ, ఇలా చాలామంది ఆకాశం వారి మేడకి వచ్చి పోతూ ఉంటారు. అందరితోనూ కలిసి పంకజం పేకాడుతుందనీ అంటారు. ఇంతమంది మగాళ్ళ మధ్య పంకజం ఒక్కామే కలుగొలుపుగా ఉండడం ఊరంతా పుకార్లకి పురుడుపోసింది. కొంతమంది మైనరు ఉంచుకున్నాడంటే, ఇంకొందరు గంగరాజు రెండో పెళ్ళాంగా అంటారు. మరికొందరు కాదూ, పంకజానికి బుల్లెబ్బాయంటేనే ఇష్టం అనంటారు. బుల్లెబ్బాయి కూడా భారీ విగ్రహమే! మంచి పర్సనాలిటీ ఉన్నవాడే!
బుల్లెబ్బాయి పొలం పక్కనే ఆవిడ కొబ్బరితోటా ఉండండం వల్ల బుల్లెబ్బాయికి పరిచయం పెరిగింది. మామూలు పరిచయం కాస్తా రోజూ క్రమం తప్పకుండా కలుసుకునే స్థాయికి ఎదిగింది. అదెంతవరకూ వెళ్ళిందంటే బుల్లెబ్బాయి బట్టలకొట్లో ఉంటాడు లేదంటే ఆకాశం వారి మేడలో ఉంటాడని ఏ పసిపిల్లాన్నడిగినా చెప్పేస్తాడు. వీరి గురించి ఊరంతా చెవులు కొరుక్కుంటారు. ఊళ్ళో చాలా అరుగులమీద బాతాఖానీకి వీరే ముడిసరుకు. బుల్లెబ్బాయీ, పంకజాల వ్యవహారం అమలాపురంలో చెట్టుకీ, పుట్టకీ తెలిసినా అనసూయమ్మకి ఎలా తెలియకుండా ఉంటుందాని అందరికీ అనుమానం. ఈ వ్యవహారమంతా తెలిసినా తెలీయనట్లే నటిస్తుందని అందరూ చాటుగా చెప్పుకుంటారు. అనసూయమ్మ పాతకాలం మనిషి. చాందసురాలు. మనిషి మంచిదే కానీ తేడా వస్తే ఊరుకోదు. అలాని ఆవిడ దెబ్బలాటకోరు కాదు. అందుకని ఆడవాళ్ళందరూ ఆవిడ దగ్గర జాగ్రత్తగానే ఉంటారు. ఆవిడ ముందు ఎవరూ నోరు జారరు. ఏదైనా వెనకాలే నసుక్కుంటారు. సత్యవతీ ఆ గుంపులో వ్యక్తే! నా దగ్గర అంటుంది కానీ అనసూయమ్మ దగ్గర నోరిప్పదు. పంకజాన్ని బుల్లెబ్బాయి ఉంచుకున్నాడన్న నిర్ధారణకి సత్యవతెప్పుడో వచ్చేసిందని తరచు నాతో అన్న మాటలు బట్టే గ్రహించాను. కానీ మేమెవరమూ చూసిన పాపాన పోలేదు.
“ఏం? ఆవిడ రాకూడదా?” చర్చకి తెర తీశాన్నేను.
“రాకూడదని కాదు. ముత్తైదువుల పేరంటానికి ఆవిడొచ్చిందేమిటానంతే! అన్నిటికన్నా ఆశ్చర్యం అనసూయమ్మీవిణ్ణి పిలవడం. ఇదే అందరూ అనుకున్నారు.”
“ఆవిడా ముత్తైదువే కదా? ఇందులో ఆశ్చర్యం ఏముంది?” సత్యవతితో వాదించడం నాకిష్టం.
“పంకజం ముత్తైదువెలా అవుతుంది? పెళ్ళా, పెటాకులా? పైగా బుల్లెబ్బాయి ఆవిణ్ణి..” ఇహ పొడిగించలేదు సత్యవతి.
“ఏమో? మనకేం తెలుసు. బుల్లెబ్బాయి ఆవిడకీ తాళి కట్టాడేమో? అందుకే మీ అనసూయమ్మగారూ ఈ పేరంటానికి పిలిచిందేమో?” అమాయకంగా నటిస్తూ సరదాకి అన్నాను.
“ఆ! మీకు తెలిసే ఉంటుంది. చెప్పండి? పెళ్ళి జరిగిందా? వెంకటరత్నం చెప్పాడా!?” పొరపాటున సత్యవతికి దొరికిపోయాననుకున్నాను. ఇలాంటి కబుర్లు సత్యవతి వదిలిపెట్టదు. ఎలాగో అదీ ఇదీ చెప్పి మొత్తానికి తప్పించుకున్నాను.
సత్యవతి మాత్రం నన్ను నమ్మలేదు. నాకు అన్నీ తెలిసి దాస్తున్నానని అనుకుంది. అలా ఆ రాత్రి మా ఇంట్లో ఆకాశంవారి మేడ గురించే చర్చ. నేను అబద్ధాలు చెబుతున్నానని దెప్పిపొడిచింది. నిజం నాకూ తెలీదు. వెంకటరత్నం దగ్గరా నేనెప్పుడూ ఈ ప్రసక్తి తీసుకు రాలేదు. అది వారి కుటుంబ విషయమని నేను వదిలేశాను.
ఆ మర్నాడు వెంకటరత్నం నన్ను కలవడానికి మా ఇంటికొస్తే మరలా ఇదే ప్రసక్తి తీసుకొచ్చింది సత్యవతి. దేవుడి దయవల్ల వెంకటరత్నం అవన్నీ పుకార్లంటూ కొట్టి పారేశాడు.
“ఊరందరికీ ఇలాంటి పుకార్లంటే భలే ఇష్టం. ఓ ఆడా, మగల మధ్య స్నేహానికి అందరూ ఇలాంటి సంబంధం కట్టడం అన్యాయం. పంకజానికి పొలం వ్యవహరాల్లో మా బావ సాయం చేస్తున్నాడు. అంతే! అందర్నీ పిలిచినట్లుగానే మా అక్క ఆవిణ్ణీ పిలిచింది. ఏం పిలవకూడదా?” ఎదురు ప్రశ్నించేసరికి సత్యవతి విస్తుబోయింది. ఇహ పొడిగించలేదు.
“పంకజం ఇంట్లోనే రాత్రిళ్ళు గడుపుతున్నాడని మన పనిమనిషి చెప్పింది. ఈ మధ్యనే పంకజం ఇంట్లో ఫోను కూడా పెట్టించాడట. ఎవరైనా ఇంటికి ఫోను చేస్తే పంకజం నంబరిస్తున్నారనీ చెప్పింది. మీ ఫ్రెండు వెంకటరత్నం అన్నట్లు స్నేహమే అనుకుందాం. రాత్రిళ్ళు కూడా గడిపేంత స్నేహమా? అయినా ఇలాంటివి దాచుకుంటే దాగుతాయా? అయినా నాకెందుకులెండి ఈ వెధవ తలనొప్పి!” అంటూ ఆ రాత్రి పడుకోబోయే ముందు నన్నూ, వెంకటరత్నాన్నీ తిట్టిపోసింది.
పంకజం, బుల్లెబ్బాయిల వ్యవహారం ఊరందరికీ తెలుసు. అందరూ వారి గురించి అనుకుంటున్నారన్న సంగతి బుల్లెబ్బాయికీ, పంకజానికీ తెలుసో తెలీదో ఎవరికీ తెలీదు. ముఖ్యంగా – “అనసూయమ్మకి ఆ మాత్రం తెలియదా? ఆవిడకన్నీ తెలుసు. అదంతా నాటకం,” అంటుంది సత్యవతి.
రెండేళ్ళ తరువాత హఠాత్తుగా పంకజానికి జబ్బు చేసింది. బ్రెయిన్ హెమరేజొచ్చి హాస్పటల్లో జాయిన్ చేశారు. రాత్ర్రంబవళ్ళూ బుల్లెబ్బాయి ఆసుపత్రిలోనే గడిపాడనీ అందరూ అనుకున్నారు. కోలుకుంటోందీ, గండం గడిచిందనుకుంటూండగా పంకజం పోయింది. మద్రాసునుండి పంకజం అన్నగారు వచ్చీ వరకూ శవాన్ని అట్టే పెడతారని అందరూ అనుకున్నారు. కానీ అతను మర్నాటికీ రాకపోయేసరికి ఎవరు దహనం చేస్తారా? అన్న ప్రశ్న తలెత్తింది. శవాన్ని రోజుల తరబడి అలా ఉంచుకోడం మంచిది కాదని అన్నారు. అంబాజీపేట మైనరు చేస్తాడా? డీలక్సు ధియేటరు వాటాదారు గంగరాజు ముందుకొస్తాడా? లేదా బుల్లెబ్బాయి కానీ, వేరెవరైనా నడుం కడతారా? అని యధావిధి చెవులు కొరుక్కున్నారు. పంకజం పోయాక మైనరు ఓ సారి పరామర్శించి వెళ్ళాడంతే! మరలా అయిపూ పత్తా లేడు. గంగరాజూ అదే తీరు. బుల్లెబ్బాయి ఆసుపత్రిలో ఉండి చూసినా, మనిషి పోయాకా అనసూయమ్మ వెళ్ళనిస్తుందాని అనుకున్నారు. గాంధీబొమ్మ రిక్షా సెంటరు దగ్గర్నుండి, కాలేజీ మా స్టాఫ్ రూం వరకూ అందరికీ గత రెండ్రోజులుగా ఇదే చర్చ.
అందరి అనుమానాలకీ తెర దించుతూ చివరకి బుల్లెబ్బాయే పంకజానికి దహనం చేయడానికి ముందుకొచ్చాడు. అంతే ఊరంతా వేరే రకం పుకార్లు మొదలయ్యాయి. పంకజానికి దహనం చేస్తే ఇంటి గడప తొక్కడానికి వీళ్ళేదని అనసూయమ్మ అరిచిందనీ, పరువూ, ప్రతిష్టా మంట గలుస్తుందనీ, కూతురుకి సంబంధం ఇవ్వడానికి ఎవరూ ముందుకు రారనీ నానా రభసా చేసిందనీ ఎవరో చెప్పగా విన్నానని సత్యవతీ నాతో అంది.
ఎవర్నీ లక్ష్య పెట్టకుండా చివరికి బుల్లెబ్బాయే పంకజానికి దహన సంస్కారం చేసాడు. ఎందుకో అనసూయమ్మ మాత్రం పంకజాన్ని చూడ్డానికి వెళ్ళలేదని విన్నాను. దాంతో ఒక్క సారి బుల్లెబ్బాయి హీరో అయిపోయాడు.
దహనం అయ్యాక పదిరోజులూ ఆకాశం వారి మేడలో ఉండి అక్కడే మిగతా కార్యక్రమాలు నిర్వహించాడని తెలిసింది.
కొంతమంది బుల్లెబ్బాయి తెగువకీ, మానవత్వానికీ మెచ్చుకుంటే మరికొందరు అనసూయమ్మని విలన్ని చేసేసారు. ఆవిడే ఇంటికొస్తే చచ్చి పోతానని బెదిరించిందనీ అందుకే గతిలేక ఆకాశం వారి మేడ లోనే ఉండిపోయాడనీ బుల్లెబ్బాయిపై సానుభూతి చూపించారు.
మంచో, చెడో బుల్లెబ్బాయి చేసిన పనికి మెచ్చుకోకుండా ఉండలేకపోయాను. పంకజానికీ, బుల్లెబ్బాయికి మధ్య సంబంధం పక్కన పెడితే, తోటి మనిషి పోయాకా ఆ మాత్రం సానుభూతి చూపించిన బుల్లెబ్బాయి తీరు నచ్చింది నాకు.
ఓ రోజు సత్యవతి ఇంకో పుకారు మోసుకొచ్చింది.
“ఏమండోయ్! మీకీ విషయం తెలుసా? పంకజానికి ఇంతకుముందే పెళ్ళయ్యిందట. ఆవిడకి ఓ కూతురు కూడా ఉందట. పంకజం పోయాకా చూడ్డానికని వస్తే అమలాపురం పొలిమేరల్లోనే అనసూయమ్మే వాళ్ళని వెనక్కి పంపించేసిందనీ అంటున్నారు.”
ఇదంతా విని ఒళ్ళు మండింది నాకు.
“నువ్వేమయినా ఆ పెళ్ళికెళ్ళి చూసావా? ఎందుకీ విషయాలంటే ఆసక్తి. బుల్లెబ్బాయీ, అనసూయమ్మా వాళ్ళ గొడవేదే వాళ్ళు ఏడుస్తారు? మనకెందుకు చెప్పు?” అంటూ నాలుగు చివాట్లు పెట్టాను. ‘మీరెప్పుడూ ఇంతే’నంటూ నన్ను తిట్టుకుంది సత్యవతి.
వాస్తవాలకీ, ఊహలకీ తేడా తెలీదు చాలామందికి. చూడని విషయలని నమ్మి వ్యక్తులకి లేని గుణగణాలని ఆపాదించేస్తాం. వ్యక్తిత్వాలని నిర్ణయించేస్తాం. పుకార్లకున్న చోటు నిజానికుండదు. ఈ విషయం సత్యవతికి చాలా సార్లు చెప్పి చూసాను. ఎక్కడా ఫలితం లేదు.
పంకజం పోయి ఏడాది తిరక్కుండానే బుల్లెబ్బాయి హార్టెటాకొచ్చి పోయాడు. ఆకాశం వారి మేడని ఎవరో కొనుక్కున్నారు. బుల్లెబ్బాయి బ్రతికున్నన్నాళ్ళూ ఎవరికీ అమ్మడానికి ఒప్పుకోలేదు. అలాని అతని దగ్గర డబ్బున్నా తనూ కొనలేదు. పంకజం గుర్తుగా అనుకున్నాడో ఏమో ఆ ఇంటిని అమ్మకం పెడదామని మద్రాసులో ఉన్న పంకజం అన్నగారు చాలా ప్రయత్నించి విఫలమయ్యాడు.
కొన్నేళ్ళ తర్వాత ఆకాశం వారి మేడని కోవట్లెవరో కొనుక్కున్నారు. ఆ మేడని కూలకొట్టేసి ఆ స్థలంలోనే కొత్తగా మరో రెండు చిన్న డాబా ఇళ్ళు కట్టారు. కొత్తగా ఇళ్ళుకట్టినా ఆ చోటు ఆకాశం వారి మేడగానే వాడుకలో ఉండేది. బుల్లెబ్బాయి పోవడంతో అనసూయమ్మ బట్టల వ్యాపారాన్ని అమ్మేసింది. పొలాలని కౌలుకిచ్చి ఉన్న ఆస్తిని కాపాడుకుంది.
ఓ పదేళ్ళు గిర్రున తిరిగాయి. చూస్తూండగా మా పిల్లలూ పెద్దవాళ్ళయ్యారు. మా అమ్మాయికి ఎవరో భీంవరం సంబంధం చెప్పారు. మా స్నేహితుడు వెంకటరత్నాన్ని కలిసి ఆ పిల్లాడి కుటుంబం గురించి వాకబు చేయమని ఉత్తరం రాసాను. ఈ లోగా ఓ రోజున వెంకటరత్నమే ఊడిపడ్డాడు.
“ఒరే మా అబ్బాయి పెళ్ళిరా! నువ్వూ, మీ ఆవిడా, పిల్లలూ అందరూ రావాలి. మా అక్కయ్య కూతుర్నే చేసుకుంటున్నాం.” అంటూ కొడుకు పెళ్ళి శుభలేఖతో నన్నూ సత్యవతినీ ఆహ్వానించాడు.
“బావుందిరా! మొత్తానికి మీ అక్కయ్య కూతుర్నే కోడలుగా తెచ్చుకుంటున్నావన్నమాట. బుల్లెబ్బాయి కూతురు చదివేది మా కాలేజీనే! మంచి పిల్ల. బాగా చదువుతుంది.” అంటూ అభినందించాను.
“అనసూయమ్మని వారం క్రితం కలిసినప్పుడు ఈ విషయం చెప్పలేదే? ఏంటి హఠాత్తుగా అనుకున్నారా? అవున్లే, కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదంటారు!” సత్యవతి తనదైన ధోరణిలో అంది.
మా మాటలు విని నవ్వాడు వెంకటరత్నం.
“మా అనసూయక్కయ్య కూతురు కాదు.” మెల్లగా అన్నాడు.
“మరి?” నేనూ, సత్యవతీ ఒకేసారి అన్నాం.
“ఇంకో అక్కయ్య కూతురు.”
నాకు తెలిసీ వెంకటరత్నానికి అనసూయమ్మొక్కతే తోబుట్టువు. ఎవరీ కొత్త అక్కయ్యన్నట్లు కనుబొమ్మలు ముడేసి చూసాను.
“పంకజం కూతురు.”
విస్తుబోయాం. మా ఇద్దరికీ ఏమీ అర్థం కాలేదు. అసలు పంకజానికి కూతురున్నట్లే తెలీదు. ఊరంతా అనుకోడమే కానీ ఎవరూ చూళ్ళేదు కూడా. సత్యవతియితే నమ్మలేనట్లుగా చూసింది.
“మరి మీ అనసూయక్కకి ఈ విషయం తెలుసా? ఆవిడీ పెళ్ళికి ఒప్పుకుందా?” ప్రశ్నించాను.
“అసలీ పెళ్ళికి మా అనసూయక్కే కారణం! మీ కెవరికీ తెలీదు. పంకజం కూతుర్ని ఎవరికీ తెలీకుండా మద్రాసులో పెంచింది. చాలారోజుల వరకూ మాకీ విషయాలేవీ తెలీవు. మొదట్లో మా అక్కకీ తెలీదు. తెలిసాక బుల్లెబ్బాయిని నిలదీసింది. ఆ తరువాత మా బావతో దాదాపు ఆరేళ్ళు మాట్లాడ్డం మానేసింది. చిత్రం ఏమిటంటే బుల్లెబ్బాయిని తప్పు పట్టింది కానీ, ఇందులో పంకజం తప్పేమీ లేదనుకుంది. అందుకే తనెప్పుడూ పంకజాన్ని నిందించలేదు. ఈ విషయాలెవరికీ తెలీవు.” అని చెప్పాడు.
“మీ అక్కయ్యని అభినందించాలి. తోటి స్త్రీని గౌరవించడం నిజంగా గొప్ప విషయం.” మనసులో మాట పైకన్నాను. అనసూయమ్మని మనసులోనే అభినందించాను.
“మరామ్మాయిని ఈ వూళ్ళో చూసినట్లు లేదే?” మొదటి సారి ఈ కుతూహలం నా వైపునుండొచ్చింది.
“చెప్పానుగా మాకెవరికీ ఇదస్సలు తెలీదు. పదిమందికీ తెలిస్తే అనవసరంగా రాద్ధాంతమవుతుందని మద్రాసులోనే ఆ అమ్మాయిని పెంచింది. చూడాలన్నప్పుడల్లా పంకజమే వెళ్ళొచ్చేది. అలా ఆ అమ్మాయి అందరికీ దూరంగా మద్రాసులో పెరిగింది. మద్రాసు యూనివర్శిటీలో ఎం.ఎస్సీ చేసింది. ఇప్పుడామ్మాయి పెళ్ళికి మా అక్కే నడుంకట్టింది. మా అబ్బాయికి సంబంధాలు చూస్తున్నామని తెలిసి నన్ను అడిగింది. మా అబ్బాయి సరే నన్నాడు. అలా ఈ పెళ్ళి..” అంటూ జరిగినదంతా చెప్పాడు.
“పంకజానికి కూతురుందని ఊరంతా ప్రచారం జరిగితే పుకారనుకున్నాను. నిజమే నన్నమాట. మరి పంకజం పోయినప్పుడు కూడా వచ్చినట్లు లేదు.” నా సందేహాన్ని నోరు జారి పైకనేశాను.
“అవును. ఆ అమ్మాయి ఎప్పుడూ అమలాపురం రాలేదు. పంకజం పోయిన తరువాత ఆమె అన్నయ్య పంకజం కూతుర్ని తీసుకొస్తానంటే వద్దని మా అక్కే ఆపింది. అనవసరంగా ఆ చిన్న పిల్ల మనసుని ఈ ఊళ్ళోవాళ్ళు ఎక్కడ గాయ పరుస్తారోననీ, చెడిన దానికి పుట్టిందనీ ముద్ర వేస్తారనీ అసలీవూరే రానీయలేదు. మీకో విషయం తెలుసా? పంకజం పోయినప్పుడు కూడా దహనం చేయడానికెవరూ ముందుకు రాకపోతే మా బావనే చెయ్యమని పంపింది కూడా మా అక్కే! అలా చెయ్యకపోతే తనురేసుకు చస్తానని బెదిరించిందనీ మా బావే నాతో స్వయంగా చెప్పాడు.”
ప్రతీసారి ప్రశ్నలతో విసిగించే సత్యవతి సంభ్రమాశ్చర్యాలతో గుడ్లప్పగించి వింది. అవును మరి ఇది పుకారు కాదు కదా? వాస్తవాలెప్పుడూ ఘాటుగానే ఉంటాయి.
అప్పట్లో పంకజానికి దహన సంస్కారాలు చేసి బుల్లెబ్బాయి అమలాపురంలో హీరో అయిపోయాడు. నిజానికి తెర వెనుక హీరో అనసూయమ్మ. చేతులెత్తి ఆమె సంస్కారానికి మనసులోనే నమస్కరించాను.
“ఇంతకీ ఆ అమ్మాయి తండ్రి అదే పంకజం భర్తెవరూ?” అంతవరకూ మౌనంగా ఉన్న సత్యవతి నోరిప్పి ఆత్రంగా అడిగింది.
బుల్లెబ్బాయా? అంబాజీపేట మైనరా? డీలక్స్ ధియేటరు వాటాదారు గంగరాజా? బహుశా సత్యవతి మనసులో ఇదే ఉందేమో? కాస్త లౌక్యంగానే ప్రశ్నించింది.
“చాలారోజుల వరకూ మాకెవ్వరికీ తెలీదు. మా అక్కకీ బుల్లెబ్బాయి పోయిన తరువాతే తెలిసింది.” మెల్లగా వెంకటరత్నం అన్నాడు.
“అదేవిటి? ఆ అమ్మాయి బుల్లెబ్బాయికీ, పంకజానికీ పుట్టినమ్మాయి కాదా?” మరింత ఆశ్చర్యబోతూ అడిగింది సత్యవతి. ఇలాంటి విషయాల్లో మొదట్నుండీ ఆసక్తి ఎక్కువ. ఫక్తు మధ్యతరగతి ఇల్లాలు.
“వద్దురా? చెప్పద్దు. అది నీలోనే దాచెయ్యి. ఆ అమ్మాయికి తండ్రెవరన్నది కాదు ముఖ్యం. కాబోయే భర్తే మిగిలిన జీవితం. కొన్ని వాస్తవాలు బయటకు తెలీకపోడమే మంచిది. దయచేసి ఎవరికీ చెప్పద్దు.” అంటూ చేతులెత్తి వెంకట రత్నానికి నమస్కరించాను.
సత్యవతి ఏదో అనబోతే కళ్ళెర్రజేసి వారించాను. వెంకటరత్నం నా మాటలు అర్థంచేసుకున్నాడులా వుంది. ఇహ పొడిగించలేదు. పెళ్ళికి రమ్మనమని మరోసారి చెబుతూ వెళ్ళొస్తానని సెలవు తీసుకున్నాడు.
వెంకటరత్నం అక్కయ్య కూతురు పెళ్ళికి తప్పకుండా వస్తానని మాటిచ్చాను.