“ఏంట్రా! భోగి ఇంకా పది రోజులే వుంది. తెలుస్తోందా” అన్నాడు రామకృష్ణ ఎండు గడ్డి పుల్ల నించి పొగ పీలుస్తూ.
“థర్డ్ లైన్ వాళ్ళు ఆల్రెడీగా చాలా పోగేశారు” ఉప్పందించాడు హరిగాడు.
“ఏదో ఒకటి చెయ్యాలిరా! లేకపోతె ఇంక వేస్ట్ మనం” కొంచం విరక్తి గా అన్నాడు సాయి.
“మరేందిరా సతీష్‌గా, అలా ఏమ్మాట్లాడక పోతే ఏంటమ్మా”, రామకృష్ణ రెట్టించాడు ఈ సారి. వాడు మా అందరికంటే పెద్ద.
“చూద్దాం లేరా, ఇంకా టైం ఉంది కదా” అంటూ తొందరగా ఈ టాపిక్ అయిపోతే బావుండు అని లేవబోయాను నేను. నా ఇబ్బంది నాది మరి.
“నీ యబ్బ! నీకు పరిస్థితి అర్ధం కావడం లేదురా. లాస్ట్ భోగి మంటల్లో వాళ్ళే గెలిచారు. మన మంట కన్నా కనీసం ఒక గంట ఎక్కువ సేపు మండింది వాళ్ళది. మన సెకండ్ లైన్ పరువు పోతోందని తెలుస్తుందారా?” అని గట్టిగానే అన్నాడు సాయిగాడు.
“వాళ్ళ దగ్గర కాలనీ ఇన్స్పెక్టర్ ఆఫ్ వర్క్స్ ఆయన కొడుకు జయగాడు ఉన్నాడు. వాళ్ళ నాన్న మరి వాళ్ళ ఆఫీసు నించి చాలా వరకు విరిగి పోయిన గేట్లు, కాలనీలో పోగయిన చెక్క అంతా వాళ్ళకే ఇస్తాడు. పెద్ద మంట అయ్యింది అంటే అవ్వదా!” వివరించాడు హరి.
“పోయిన సంవత్సరం ట్రాక్ పక్కన తుమ్మలతో చాలానే పోగేసాం కదరా. లాస్ట్‌లో సతీష్ గాడు ఇప్పిస్తా అన్న స్లీపర్ కట్టె వచ్చుంటే మనదే సూపర్ అయ్యేది. సుడి లేదురా మనకి” అన్నాడు సాయిగాడు.
ఏదయితే ఎవ్వడూ మాట్లాడకూడదని అనుకొన్నానో అదే టాపిక్ మళ్ళీ మధ్యలోకి వచ్చి పడింది. నేను ఇబ్బందిగా “నేనేం చేసేదిరా. అప్పటికి ట్రై చేశాను కదరా,” అన్నాను.
“సర్లే రా, సాయంత్రం ఆలోచిద్దాం. అస్సలేమీ చెయ్యకుండా అయితే ఉండం కదా. ఏదో ఒక ప్లానేద్దాం లే!” సూరిగాడి మాటతో అక్కడ నించి అందరం కదిలాం.
విజయవాడ సత్యనారాయణపురం రైల్వే కాలనీలో భోగి మంటలు అంటే అది ఒక వరల్డ్ కప్ పోటీ అంత మరి. కాలనీలో ప్రతి లైన్ లో కనీసం ముప్ఫై పైదాకా క్వార్టర్లుంటాయి. లైనుకీ లైనుకీ మధ్య క్రికెట్ మ్యాచ్ పోటీలు, కొట్లాటలు, రాయబారాలు అన్నీ వీర లెవెల్ లో ఉండేవి. ఇంక భోగి పండగప్పుడు మా కాలనీలో ఒక లైన్ వాళ్ళు వేసిన భోగి మంట పక్క లైన్ వాళ్ళ మంట కంటే పెద్దగా ఎక్కువసేపు మండితే ఇక అంతే, ఆ లైనువాళ్ళు ఇక కాలర్ ఎగరేసి తిరగడానికి లైసెన్స్ వచ్చిందంతే! దీని కోసం జనం దగ్గర ఉన్న పాత చెక్క సామానులు, కాలనీలో పెరిగిన పిచ్చి చెట్లు, రైల్వే ట్రాక్ వెంబడే ఉన్న తుమ్మ పొదల కోసం చాలా డిమాండ్ ఉండేది. మా లైన్లో ఆడపిల్లలు భోగి మంట బాగా పెద్దగా వస్తే మమ్మల్ని చూసే అదోరకం చూపులతో మా జన్మ తరించేది.
మిగతా రోజుల్లో ఎలా వున్నా నాకు ఈ సీజన్లో మాత్రం ఒక స్పెషల్ స్టేటస్ ఉండేది. మా నాన్నగారు రైల్వేలో ట్రాక్ ఇన్స్పెక్టరు. ఆ మధ్య కాలంలో విజయవాడ డివిజన్లో బ్రిటిష్ వాళ్ళు వేయించిన రైల్వే ట్రాకులో చెక్క స్లీపర్లు తీసేసి సిమెంట్ స్లాబ్ స్లీపర్లు వేసే ప్రాజెక్ట్ వర్క్స్ జరిగేవి. దాంతో ఈ చెక్క స్లీపర్లు చాల వరకు అవతల పారేయడం లేదా వేలంపాటలో అమ్మేయడం చేసే వాళ్ళు. మా నాన్నగారు అడపా తడప కాలనీలో వాళ్ళు వాళ్ళ క్వార్టరుకి ఫెన్సింగో, ఇంటికి గేటో వేయించుకొంటామంటే లోపాయికారీగా వాళ్ళకి సహాయం చేసేవారు. ఒక రెండు భోగి పండగల క్రితం కాలనీలోకి మేము కొత్తగా రావడం, మా నాన్నగారు ఏదో మూడ్‌లో కుర్రాళ్ళు ముచ్చట పడటం చూసి ఒక స్లీపర్ కట్టె ఇవ్వడం, మా భోగి మంట కాలనీ మొత్తానికే పెద్దది అవ్వడంతో నా లెవెల్ చాలా విపరీతంగా పెరిగిపోయింది. కానీ తర్వాత ఇది ఏదో ఆయన ఉద్యోగానికే ఎసరు పెట్టేదని అనిపించిందో ఏమో, మా నాన్నగారు ససేమిరా అన్నారు.
ఆ పాత స్లీపర్ కట్టెలు చాలా సేపు మంచి మంటని ఇస్తూ కాలేవి. ప్రపంచంలో అందరకి స్లీపర్లు మా నాన్నగారు శాంక్షన్ చేసే వాళ్ళు కానీ మా లైన్ పరువు గురించి ఆయన ఏ మాత్రం ఖాతరు చేయలేదు. ఇప్పుడు మా టీం అంతా ట్రాక్ వెంబడి పడుతూ లేస్తూ తుమ్మ మొక్కలు, చెక్క సరుకు పోగు చేసినా కూడా థర్డ్ లైన్ వాళ్ళ కాలి గోటికి కూడా సరి పోలేదు. మా ఓటమికి మిగతా కారణాలు చాలానే ఉన్నాయి. కొంచం కండ పుష్టి ఉన్న సీనియర్లు ఇప్పుడు లేరు. కొంతమంది ఇంజనీరింగులో సీట్ వచ్చీ, కొందరేమో ట్రాన్స్‌ఫరయీ వేరే ఊరు వెళ్ళి పోవడం జరిగాయి. చివరి నిమిషంలో మా భోగి మంట సామాన్లు కొన్ని మా సెక్యూరిటీ లోపంతో మాయమైపోతుండేవి. సీనియర్లు లేరు కదా, భోగి మంటలో ఎప్పుడు ఏ చెక్క వేసి మంటను పెంచాలనే స్ట్రాటజీ కూడా మాకు సరిగ్గా లేకుండా పోయింది. వేరేవాళ్ళ సంగతే ఎందుకు మా టీములోనే ఇలా అంటే ఒప్పుకోరు. ఆ కారణాలన్నీ కాలువలోకి పోయి, సంవత్సరం పొడుగూతా సతీష్ గాడు తెస్తా అన్న స్లీపర్ తేకపోవడం వల్లే మా లైన్ పరువు గంగలో కలిసింది అన్న మాట మాత్రం నిలిచి పోయింది. ఈ సంవత్సరం ఎలా అయినా స్లీపర్ సంపాదించాలి, తప్పదు.
“నాన్న గారూ, భోగికి ఒక స్లీపర్ ఇప్పించరా, ప్లీజండీ. ఈ ఒక్కసారికే, ఇంకెప్పుడూ అడగను. నిజంగానండీ. ప్రామిస్సండీ!”
“వచ్చే సంవత్సరం పదో తరగతి. గుర్తుందిగా? ఈ వేషాలు మానేసి పుస్తకాలమీద శ్రద్ధ పెట్టు.”
తల గుండ్రంగా ఊపాను. “అలాగేనండీ. కానీ ఈ ఒక్క సారికీ…”
“సరే సరే. చూద్దాంలే. సతాయించకు.”
ఆనందంగా మా జనాల దగ్గర పని అయిపోయినంత బిల్డప్పిచ్చా. సాయి గాడి ఆనందం అంతా ఇంతా కాదు. ఉబ్బి తబ్బిబ్బు అయిపోయి స్పెషల్ షేక్ హ్యాండ్ ఇచ్చాడు. హరిగాడయితే ఇంక చెప్పక్కర్లేదు. రామకృష్ణ “ఒరేయ్, గ్యారంటీనా?” అంటూ డౌటు పడ్డాడు. “మదర్ ప్రామిస్ రా! ఇస్తానన్నారు” భరోసా ఇచ్చా.
“సరే అయితే. లాస్ట్ టైం ఒక్కసారి ట్రాక్ వెంబడి వెళ్ళొద్దాం పదండి” అన్నాడు రామకృష్ణ.
“వద్దురా బాబు. చచ్చి పోతాం. అసలు ఇప్పుడు రామవరప్పాడు వరకు ట్రాక్ అంతా శుభ్రం చేసారంట” అన్నాన్నేను.
“అవున్రా పోయినేడాది మా నాన్న చూసి వాయదీశారు. పట్టాలెంబడి మళ్ళీ కనపడ్డామో నాకు సూపరు బ్యాండు పడుతుందిరో” అన్నాడు హరి.
“అయినా కానీ మనం ఇంకా కొంచం సంపాదిద్దాంరా. మొన్న తుఫాన్లో సింగిల్ క్వార్టర్స్ పక్కన ఉన్న చెట్టు పడి పోయింది కదా. ఇంకా కొన్ని కొమ్మలు అలాగే ఉన్నాయి. జయగాడు వాళ్ళకంటే ముందే మనం వెళ్ళి ముక్కలు చేసి పట్టుకొద్దాం” ఉత్సాహంగా అన్నాడు సాయిగాడు.
“అరే! ఈ సారి భోగి ముందర రాత్రి ఎవ్వరు నిద్ర పోకూడదు. దొంగ నాయాళ్ళురా వాళ్ళు. మనం కాపలా కాయకపోతే ఇంక అంతే!” హెచ్చరించాడు హరి.
“సరే రా. మరి మనం కొమ్మలు కొట్టుకొద్దాం అయితే” అని సాయి తొందర పెట్టాడు.
మొత్తం మేము ఒక పది మంది చేరి వెళ్ళేసరికి జయగాడి బ్యాచ్ రక రకాల పరికరాలతో అక్కడ ప్రత్యక్షమయ్యారు. కొంత కిరాతార్జునీయం జరిగిన తర్వాత అందరం కలిసి మా కాలనీ జ్యూరీ దగ్గరికెళ్ళాం. మా కాలనీలో ఇలాంటి తగాదాలు తీర్చడానికి సెంటర్లో బాబా కూల్ డ్రింక్స్ షాప్ దగ్గర కష్టమర్ సర్వీసు అందిస్తూ కొంత మంది కూర్చుని ఉంటారు. వాళ్ళు మా గొడవంతా విన్నతర్వాత సగం సగం తీసుకోమని తీర్పు ఇచ్చారు.
భోగి ఇంకా నాలుగు రోజులు ఉంది అనగా ఒక మధ్యాన్నపు శుభ ఘడియల్లో ఇద్దరు గ్యాంగ్‌మన్లు మా ఇంటి దగ్గర ఒక శ్రేష్టమైన స్లీపర్ని మా ఇంటి దగ్గర పడేసి వెళ్ళేరు. మా బ్యాచ్ అంతా ఆ రోజు దాన్ని తాకి మురిసిపోతూ ఆనందపడ్డాం. ఇంక నా సంగతి చెప్పక్కర్లేదు. మా లైన్ క్రికెట్ టీం కాప్టెన్ సాయిగాడు మర్నాటి మ్యాచ్ లో ఓపెనింగ్ బాటింగ్‌కి నన్ను డిసైడ్ చేసేశాడు. ఇంతలో మా అన్నయ్య పెరట్లోకొచ్చాడు. తాడికొండలో చదివే మా అన్నయ్య సంక్రాంతి సెలవలకి ఇంటికి వచ్చాడు. వాడికి మా ఫ్రెండ్స్‌కి మధ్య అంతగా పడదు. “సరే రా! రేపు పొద్దున్నే గ్రౌండ్లో కలుద్దాం” అని వెళ్ళి పోయారు మా జనం అంతా. మా వాడు కాలనీలో ఉండక పోవడం వల్ల మా ప్రిస్టేజీ గురించి వాడికి పట్టదు. పైగా నీతులొకటి! “ఇలా రైల్వే సొమ్ము ఈ భోగి మంటల్లో తగల పెట్టడం చట్టవిరుద్ధం” అని మొదలు పెట్టాడు. వాడితో, ఇలాంటి విషయాల్లో అనవసరంగా తల దూర్చవద్దని వార్నింగ్ ఇచ్చి మా జనాలతో మ్యాచ్ గురించి మాట్లాడడానికి హడావుడిగా వెళ్ళి పోయాను. అసలే ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ని కదా!
మర్నాడు క్రికెట్ మ్యాచ్‌తో ఊపిరాడనంత బిజీ. అసలే బాల్ బేట్ మ్యాచ్. చివరకి వాళ్ళ లెగ్ అంపైర్ తొండి చెయ్యడంతో మ్యాచ్ కాన్సిల్ అయిపోయింది. గొడవలూ, చర్చలూ చాలా జరిగి చివరికి సాయంత్రం ఎప్పుడో ఈసురోమంటూ ఇంటికి చేరాను. మా వాడు తలుపు దగ్గరే వంకర నవ్వులు నవ్వుతూ స్వాగతం చెపుతూ ఎదురు వచ్చాడు. ఏదో తేడాగా అనిపించి ఒక్కసారిగా ఇంటి వెనక్కి వెళ్ళి స్లీపర్ కోసం చూసాను. ఇంకేముంది! గుండె గుభేల్మంది. అక్కడ స్లీపర్ లేదు.
“అమ్మా, అమ్మా! స్లీపర్ ఏది?” అంటూ గావు కేకలు పెట్టాను. మా వాడికి నవ్వులు ఆగట్లేదు.
“పాపం, కాలనీ ఆంజనేయస్వామి గుడి వాళ్ళు ఫెన్సింగ్ వేసుకోవాలని పట్టుకు పోయార్రా,” మిస్టరీ విడతీసింది మా అమ్మ నింపాదిగా.
“నాన్నగారే తీస్కెళ్ళమని చెప్పారు. గుడి వాళ్ళు అడిగితే కాదంటారేంటీ. ఇంకా పది పన్నెండు కట్టెల దాకా ఇప్పిస్తారట,” మా వాడు పరమ సంతోషంగా చెప్పాడు.
“అమ్మా! ఏంటమ్మా. ఇంక రెండు రోజుల్లో భోగి. ఎందుకు మీకెవరికీ అర్ధం కాడం లేదు?” అంటూ కన్నీళ్ళని అతి కష్టం మీద ఆపుకొంటూ అరిచాను.
“అసలు భోగి అంటే ఏమిటో తెలుసా? ముందరి సంవత్సరం లోని చెత్తని కాల్చేసి కొత్త వస్తువులు సంపాదించుకోవాలి అని. ఇట్లా మంటలు పందాలు వేసుకోమని కాదు,” మా వాడి నోటికి అడ్డు ఆపు లేకుండా పోతోంది. మా అక్కయ్య ఈ దుర్మార్గం చూడలేనట్టుగా అక్కడ నించి మౌనంగా వెళ్ళి పోయింది.
ఇలాంటి వార్తలు ఎంత వేగంగా పాకిపోతాయి అంటే, పావుగంట గడిచిందో లేదో మా జనాలు ఒక్కరు ఒక్కరుగా వచ్చి నన్ను పిలవడం మొదలు పెట్టారు. సాయిగాడి చెయ్యి పట్టుకొని మరీ సారీ చెప్పాను. భోగి మంట మీద ఆశలు ఇంక వదిలేశాం. జయగాడు సైకిల్ మీద మమ్మల్ని చూస్తూ వెకిలిగా నవ్వుతూవెళ్ళాడు. విషయం వాడికి తెలిసింది అన్నమాట.
“ఏం చేస్తాంలేరా. నువ్వు ట్రై చేశావు. కుదరలేదు అంతే”, అన్నాడు సాయి నిర్లిప్తంగా. వాడు అంత కూల్‌గా తీస్కుంటాడని నేను ఊహించలేదు.
“ఇంకా కాపలా ఎందుకు రా వేస్ట్” అన్నాను నేను నిరుత్సాహంగా.
“లేదురా నేను, బ్లడ్ శీను, జిమ్ మనోహర్, ఇంకో ఇద్దరు ఉంటాంలే. నువ్వెళ్ళి పడుకోపో” అన్నాడు సాయి. నాకు వాడు ఇంకా ఫ్రెండ్ గా ఉన్నందుకు మా కాలనీ ఆంజనేయస్వామికి థాంక్స్ చెప్పుకుంటూ, ఏమైనా నిన్న తప్పుగా మాట్లాడి ఉంటే క్షమించమని లెంపలు వేసుకొన్నాను.
పండగ రోజు పొద్దున్నే నాలిగింటికి భోగి మంట మొదలు పెట్టాం. థర్డ్ లైన్ వాళ్ళు ఆల్రెడీగా రెట్టించిన ఉత్సాహంతో అన్ని పేర్చుకోవడం మాకు కనిపిస్తూనే ఉంది. నాకెలాగూ తెలుసు మాది అయిదింటికల్లా అయిపోతుందని. సూరిగాడికి, హరిగాడికి అడిగినవందిస్తూ నిలబడ్డాను. ఉన్నవన్నీ ఐపోవచ్చాయి. ఇంతలో మా జనాలు ఎక్కడ నించో అప్పటివరకు ఉన్న దానికంటే రెండింతలు చెక్క తీసుకొచ్చారు. అప్పటిదాకా మెల్లిగా మా లైన్లో నడుచుకుంటూ వెల్తున్న థర్డు లైను వాళ్ళ గూఢచారి ఒక్కసారిగా పరిగెత్తాడు. నాకయితే ఆశ్చర్యం, మిస్టరీ అంతు చిక్కట్లేదు. సూరిగాడు అన్నీ తెలిసిన చిరునవ్వుతో పని కానిస్తున్నాడు. గెలుస్తున్న ఆనందంలో నేనూ ఇంకేమీ పట్టించుకోలేదు. థర్డ్ లైన్ వాళ్ళ మంట ఆరు గంటలకే అయిపోయింది. మేము దిగ్విజయంగా ఆరున్నర పైవరకు నడిపించాం. అందరం సంతోషంతో ఒకళ్ళనొకళ్ళు వాటేసుకున్నాం. చప్పట్లు, అరుపులు, కేరింతలు కొట్టుకొంటూ ఇళ్ళకి చేరాం.
మా అమ్మ, అన్నయ్య నేను ఇంటికెళ్ళేసరికి విపరీతమైన కోపంతో ఊగిపోతున్నారు. నెమ్మదిగా నాకు అసలు విషయం తెలిసింది ఒక గంట తర్వాత. మా ఇంటి వెనకాల ఫెన్సింగ్ లో కుడి పక్క భాగం, సాయి గాడి ఇంటి గేటు, హరి వాళ్ళ ఫెన్సింగ్ లో ఒక చెక్క దిమ్మ క్రితం రోజు రాత్రి ఎవరో కొట్టేశారట. ఇంతలో గుడికెళ్ళిన నాన్నగారు తిరిగొచ్చారు.
“రైల్వే పోలీసుకి కంప్లెయిన్ చెయ్యండి. రౌడీ వెధవలు బాగా చేరారు. కాలనీలో భోగి మంటల కోసం ఇలా ఇళ్ళ మీద పడి దోపిడీలు చేస్తే ఎలా అండీ” అంటూ తన కోపం అంతా కుంకుడుకాయ రసంతో రుద్దుతున్న నా తల మీద చూపించింది.
“హనుమంతుడు లంక తగలపెడితే కాలనీ సుగ్రీవులు సొంత ఇళ్ళే తగలబెట్టుకుంటున్నారటే! గుడిదగ్గర రావుగారూ, సత్యంగారూ మాట్లాడుకుంటున్నారు” అంటూ పెద్దగా నవ్వారు. సూరిగాడి నాన్నా, జయాగాడి నాన్నా మాట్లాడుకుంటున్నారా! నాకు కాళ్ళలో ఒణుకు మొదలైంది. కానీ నాన్నగారు నన్నేమీ అడగలేదు. మెల్లిగా నాకు భయం తగ్గి మామూలు మనిషైనాను.
(అయితే, కనుము పండగ కల్లా పూర్తి వివరాలు సూరిగాడి నోటినుంచి వాళ్ళ నాన్న కక్కించాడు. ఆ తుఫాను హరిగాడు, రామకృష్ణల ఇంటి మీదుగా వచ్చి కొంచెం బలహీనపడి మాఇంట్లో తీరం దాటింది. అయితే, ఈ విషయంలో మిస్టరీ ఏంటంటే మా అందరికంటే ఫుల్లు కోటింగ్ పడ్డది జయగాడికని మా లైను గూఢచారి తెచ్చిన వార్త. సూరిగాణ్ణడిగితే ఏమోరా నాకేమీ తెలీదురా అంటూ మళ్ళీ ఒక తెలిసిన చిరునవ్వు నవ్వాడు.)