విశిష్ట విమర్శకుడు: సంపత్కుమార

ప్రతిభా సముద్ర సాంయాత్రికులైన పూర్వులందించిన స్ఫూర్తితో, గురుచరణ సేవా సంలబ్ధమైన సంస్కార బలంతో, నిరంతర కావ్యానుశీలనంతో, సంప్రదాయ ప్రవణమైన ఆధునిక చైతన్యధారతో కావ్యవిద్యా స్నాతకులు కాగోరిన వారికి ఉపదేష్టలుగా వ్యవహరించి తెలుగులో సాహిత్య విమర్శను కొనసాగించిన ప్రముఖులలో కోవెల సంపత్కుమార ఒకరు. భారతీయ కావ్యశాస్త్ర పరంపరకు వారసులై నిలిచి తెలుగుసాహిత్య విమర్శలో నవ్య సంప్రదాయ ప్రవర్తకులైన సద్విమర్శకులలో గణించదగినవారు సంపత్కుమార. ఇంటిపేరు కోవెల, ఒంటిపేరు సంపత్కుమార. ఆ తీరు, సౌరు పేరులోనే కాక ఆయన జీవనశైలిలోనూ సృజనశైలిలోనూ మనకు దర్శనమిస్తుంది.


కోవెల సంపత్కుమారాచార్య
(26 జూన్ 1933 – 6 ఆగస్ట్ 2010)

తెలుగులో ప్రాచీన కవులు తమ కావ్యావతారికలలోను, సందర్భోచితమైన కావ్యమార్గంలోను ప్రత్యక్షంగాను, పరోక్షంగాను కొంత సాహిత్య విమర్శ చేసి ఉన్నారు. అది ఎక్కువ భాగం సంస్కృతాలంకార శాస్త్ర మార్గాన్ని అనుసరించి ఉంటుంది. దేశీయమైన పరిభాష, విమర్శమార్గం కొంత లేకపోలేదు. ఆయా కవులు వెలువరించిన సాహిత్యవిమర్శ సంబంధమైన అభిప్రాయాలను క్షోదక్షమంగా అధ్యయనం చేసి క్రోడీకరించి ఆధునికులు కొందరు గ్రంథ రూపంలో వెలువరించారు. దేశీయమైన సాహిత్య విమర్శకు సంబంధించి పూర్వులు కొనసాగించిన కృషిని సర్వసమర్థంగా విశదం చేయవలసిన బాధ్యత ఇప్పటికీ మన విమర్శకుల మీద నిలిచే ఉంది. ఇదిలా ఉండగా సపాదశతజయంతిని దాటిన మన తెలుగు విమర్శరంగంలో తొలి, మలి తరాలు రెండింటిలోను కూడా సంపూర్ణమయిన ఆరోగ్యకర వాతావరణం ఏర్పడలేదు. క్రోధ ద్వేషాలతో మొలకెత్తి, కూటసృష్టితో చిగురించి, కుల శాఖ వైమనస్యాలతో మొగ్గ తొడిగి, వర్గ కలహాలతో పుష్పించి, చెప్పుదెబ్బలతో కాయకాచి, మారణాయుధాలతో ఫలించిన ఘనత మన సాహిత్య విమర్శ చరిత్రకుంది. అది అంతో ఇంతో మన భావకవితా యుగానికి, అభ్యుదయ కవిత్వ విమర్శకు విస్తరించినట్లు కొన్ని కుట్రలు, కూహకాలు, కుసుంభరాగాలు సాక్ష్యం పలుకుతున్నాయి.

ఇటువంటి అవాంఛనీయ వాతావరణాన్ని తొలగించి సాహిత్య విమర్శరంగంలో పరస్పర అవగాహనతో కూడిన హేతుబద్ధమైన చర్చలకు స్థానం కల్పించి, విభిన్న లక్ష్యాలకోసం పోరాడే విమర్శకుల మధ్య సామరస్యపూర్వకమైన, ఆరోగ్యవంతమైన వాతావరణం ఏర్పడడానికి అవకాశం కల్పించే నూత్నశకానికి నాందీవాచకం పలికిన ఘనత సంపత్కుమారకు దక్కుతుంది. ఇది ఆయన చే.రా.తో కలిసి సంయుక్తంగా సాధించిన సరికొత్త సంస్కారం. తన లక్ష్యాలతో విభేదించే ఇతర విమర్శకులతో కూడా సంపత్కుమార వ్యవహారశైలి ఇదే విధంగా ఉంటుంది. ఆయనది విశ్వనాథ మార్గం, నాది గురజాడ మార్గం. ఇద్దరమూ ఆధునికులమే అయినా ఆధునికతకు ఆయన చెప్పుకొనే నిర్వచనం వేరు, నేను స్వీకరించే నిర్వచనం వేరు. అయినా విమర్శ విధానంలో అపరిహార్యమైన సమానాంశాలెన్నో మా ఇద్దరినీ ఏకం చేశాయి. ఆయనకు, నాకు విశ్వనాథ ఆరాధ్యుడు. ప్రాక్పశ్చిమ విమర్శ సిద్ధాంతాల సమన్వయం కోసం నేను కొనసాగిస్తోన్న అధ్యయనం వారికి ప్రీతిపాత్రమయింది. అందుకే ఏడేళ్ళ స్వల్ప కాలంలో మా యిద్దరి మధ్యా ఎంతో ఆత్మీయత పెరిగింది. ఆయన నాకు గురుస్థానీయుడు, నేను ఆయనకు ఆత్మీయమిత్రుణ్ణి. ఆయన విమర్శ గ్రంథాలన్నీ చదవడం వలన నా అధ్యయనం విస్తరించింది. అబోధపూర్వమైన అనుభవం ఇప్పటికీ నన్ను ఆవరించుకుంటునే ఉంది.

సంపత్కుమార ప్రతిభామందిరం సువిశాలము, సమున్నతము అయిన కవిత్వ, పాండిత్య, పరిశోధన, విమర్శ చతుశ్శాలా సౌందర్యబంధురమై ఉంటుంది. నిసర్గ మనోహరమైన లాక్షణిక గోపురమొకటి ఆ ప్రతిభామందిరానికి అదనపు అలంకారం. సంవాద-విసంవాదాల పట్ల సుభావంతో ప్రవర్తించి సత్యశోధనకు పూనుకోవడం ఆయన విమర్శ లక్షణం. భాషాచ్ఛందో వ్యాకరణ అలంకార సృజనాత్మక రీతులను గూర్చిన ఋజువైన శాస్త్రీయమైన ఆలోచనా విధానాన్ని ప్రకటించడానికీ, నిజాయితీని పాటించడానికి తెలుగు విమర్శ రంగంలో కృషి చేసిన విశిష్టుడు సంపత్కుమార. అంతస్తపన వారి విమర్శకు ప్రేరణ. సాహిత్య విమర్శకు పాఠకుని పక్షాన నిలిచి అతని కావ్యానుభవానికి ఉపయోగపడడమే చరమ లక్ష్యమనే అవగాహనతో తన విమర్శ ప్రస్థానాన్ని కొనసాగించారు సంపత్కుమార. భారతీయ సమాజ నిర్మాణం ధర్మ మూలమయిందనే విశ్వాసం ఆయన సాహిత్య సృష్టికి, విమర్శ మార్గానికి పునాది. రాతినుండి నార తీసే విమర్శ పద్ధతి ఒకటి. విచ్చుకున్న పువ్వునుండి వాసన పీల్చే విమర్శ పద్ధతి ఇంకొకటి. వికసిత కుసుమం నుండి అజ్ఞాత మధువును సేకరించి సహృదయాస్వాదం కోసం మధుకోశాన్ని నిర్మించే భ్రమరగాన సదృశమైన విమర్శమార్గం ఇంకొకటి. ఇది సంపత్కుమార విమర్శమార్గం. తెలుగు సాహిత్య విమర్శ చరిత్రలో ఇప్పటికి అయిదు తరాలు గడిచాయని సంపత్కుమార గణన చేశారు. ఆ గణనను నాలుగు తరాలుగా సరిపెట్టవచ్చునని నేను భావిస్తున్నాను. ఎలా లెక్కించినా మూడవ తరానికి చెందిన తెలుగు విమర్శకులలో ఆయన ప్రథమ శ్రేణిలో నిలుస్తారు.

‘తెలుగు సాహిత్య విమర్శ – తొలితరం ప్రవృత్తి’ అనే తమ వ్యాసంలో సంపత్కుమార కాశీభట్ల బ్రహ్మయ్యశాస్త్రిగారిని గూర్చి వ్రాస్తూ, “గ్రంథమందలి గుణదోషములు దానిపై ఖండనమును వ్రాయించిన గ్రంథ కర్త యందే విధమైన రాగద్వేషాలు లేవు – అని శాస్త్రిగారు ప్రకటించడం సాహిత్య విమర్శ విధానానికి ఒక దేశీయ సూత్రంగా గమనించవలసిన మౌలికాంశం” అంటారు. ఇది సంపత్కుమార విమర్శకు ప్రధాన సూత్రమయింది. భావోద్వేగానికి, వాక్పారుష్యానికి ఎడమీయని సమచిత్తంతో కూడిన ఈ విమర్శ సంస్కారం సంపత్కుమారకు ఎక్కడనుంచి వచ్చింది? నిబద్ధము, నిర్వ్యాజము, నిర్దుష్టము, నిష్పక్షపాతము అయిన విమర్శ సౌష్ఠవ సాధన కోసం ఒక జీవితకాలం అహరహం పరిశ్రమించిన పటుత్వం ఆయనకు ఎలా సంక్రమించింది? జన్మసిద్ధమా! వంశపరంపరాగతమా! పరిసర సంసర్గమా! అధ్యయన వైశాల్యమా! అంతస్తపనా! అనుభవ పరీపాతమా! దర్శన వైభవమా! – ఇలా మనల్ని మనం ప్రశ్నించుకుంటూ పోతే ఈ అన్నింటి సమాహారమే సంపత్కుమారను సద్విమర్శకుణ్ణిగా చేసిందని భావించవలసి ఉంటుంది.

సంపత్కుమార తండ్రిగారైన శ్రీమాన్ కోవెల రంగాచార్యులవారు వైష్ణవాగమాలలోనే కాక సంస్కృతాంధ్రాలలో పండితులు. ‘వారిపట్ల వారి శిష్యవర్గం పరమ పూజ్యభావంతో ప్రవర్తించటం మాకు సహజంగానే ఒక వినీతిని నేర్పింద’ని సంపత్కుమార సోదరుని కుమారులు, ఇంచుమించుగా సమవయస్కులు, జంటకవి అయిన సుప్రసన్న చెప్పేవారు. బాల్యంలోనే సంపత్కుమార తండ్రిగారి దగ్గర వైష్ణవాగమాలను నేర్చుకుంటూనే వరంగల్లులోని సంస్కృత పాఠశాలలో ప్రవేశించారు. పాఠశాల దశలోనే కవితారంగంలో ప్రవేశించి జాతీయ విద్యార్థి సంఘం పెట్టే పోటీలలో బహుమతులు పొందారు. కాంగ్రెస్ ఉద్యమం సంపత్కుమారలో అసంకల్పితంగా గాంధేయ ప్రభావాన్ని, ఆధునిక జీవన మూల్యాలను గూర్చిన ఆలోచనలను కలిగించింది. రజాకార్ల అల్లర్లలో కుటుంబం కకావికలైనప్పుడు స్వస్థలం నుంచి చెదిరిపోయిన సంపత్కుమార రేపల్లె ప్రాంతంలో కొన్నినాళ్ళు ఉన్నారు. 1949-53 సంవత్సరాల మధ్య చిట్టిగూడూరులోని ప్రాచ్యకళాశాలలో అధ్యయనం కొనసాగించారు. ఆ తొలిరోజుల్లోనే విశ్వనాథ కవిత్వంతో పరిచయమయింది. ఆ కాలంలోనే మల్లంపల్లి వీరేశ్వర శర్మ, మల్లంపల్లి శరభయ్య సోదరుల మార్గదర్శకత్వంలో సంపత్కుమార కవిత్వ సాధన రాటుదేలింది. ఆ కాలంలోనే సంస్కృతాలంకార శాస్త్రాన్ని లోతుగా అధ్యయనం చేశారు. తరువాతి కాలంలో హిందీలో ఎం. ఎ. పట్టాన్ని పొందారు. హిందీ చదవడం వల్ల సంపత్కుమారకు అఖిలభారతదృష్టి, దేశీయతాదృష్టి కలిగాయి. తులనాత్మక సాహిత్య అధ్యయనానికి, విమర్శకు కూడా ఈ అధ్యయనం ఉపయోగించింది. హిందూమహాసభ, సామ్యవాద శిబిరం, ఆర్యసమాజం, సనాతన ధర్మ ప్రచారిణీ సభల కార్యకలాపాలను పరిశీలిస్తూ ఉండేవారు. ఆ రోజుల్లో అన్ని మార్గాలకు చెందిన రచనలను, అన్ని కవిత్వ ధోరణులను సమబుద్ధితో అధ్యయనం చేసేవారు.

వరంగల్లు, హైదరాబాదు నగరాలలోని అనుభవజ్ఞులైన కవి, పండిత, పరిశోధక, విమర్శక ప్రముఖులందరితోనూ సంపత్కుమార పెద్ద-చిన్న అనే భేదం లేకుండా సఖ్యతతో ఆత్మీయంగా మెలిగేవారు. సాహిత్య సంబంధమైన వనరులేమీ లేని జగిత్యాల వంటి ప్రాంతాలలో తలమునకలుగా పనిచేస్తున్నప్పుడు కూడా సాహిత్య అధ్యయనాన్ని, పరిశోధన ప్రమాణతను, విమర్శ వ్యాపారాన్ని పట్టుదలతో కొనసాగించేవారు. రాను రాను, విశ్వనాథ సాహిత్యంతో పెనవేసుకున్న ప్రగాఢ బంధము, నూతనైతిహాసిక లక్షణాలకు నిబద్ధులైన నవ్యసాంప్రదాయవాదుల తోడి సంసర్గమూ బలపడుతూ వచ్చాయి. సంపత్కుమార సాహిత్యవిమర్శ సంస్కారాన్ని సమ్యగ్రీతితో అర్థం చేసుకోదలిచినవారు బహుముఖీనమైన ఈ నేపథ్యాన్నంతటినీ ఆకళించుకోవలసి ఉంటుంది.

సంపత్కుమారకు చిరకాలం నిత్యానుపాయిగా, శరీరాంతర్భాగంగా నడచుకొన్న ఆచార్య సుప్రసన్న ‘మాకు తొలిరోజులనుండి తొందరగా విజృంభించే గుణం లేదని, సంకుచితభావాలకు ఎప్పుడూ దూరంగానే ఉండేవార’మనీ పేర్కొన్నారు. సంపత్కుమార విమర్శ గ్రంథాలలో ఎక్కువపాలు ఈ అంశాన్ని నిరూపిస్తాయి. ఆయన బహుగ్రంథకర్త. సాహిత్యవిమర్శకు, ఛందోలక్షణ నిరూపణకు పరిమితమైన వారి ప్రచురిత గ్రంథాలివి: తెలుగు ఛందోవికాసము (1962); మన పండితులు, కవులు, రచయితలు (1970); వచనపద్యం – లక్షణచర్చ (1978); ఆధునిక తెలుగు సాహిత్య విమర్శ – సాంప్రదాయిక రీతి (1981); తెలుగు సాహిత్య చరిత్ర (1990); పూర్వకవుల కావ్యదృక్పథాలు (1990); తెలుగు ఛందస్సుపై కొన్ని వెలుగులు (1993); కావ్యం – కవిస్వామ్యం (1993); కిన్నెరసాని పాటలు: వస్తువిన్యాసం (1999); కన్యాశుల్కం: మరోవైపు (2000); ఛందోభూమికలు (2003). ఇవికాక, తెలుగు సాహిత్య విమర్శకు సంబంధించిన అప్రకటిత రచనలు ఇంకా తగుమాత్రంగా ఉన్నాయని వారి సన్నిహితులు చెప్తున్నారు. ఈ రచనలన్నిటినీ ఆమూలచూడంగా చదివిన వారికి సంపత్కుమార విమర్శమార్గం స్పష్టంగా తెలియగలదు.

సంస్కృత పాఠశాలలోను, కళాశాలలోను అధ్యయనం కొనసాగించిన కారణంగా సంపత్కుమారకు ఛందోవ్యాకరణాలంకారాది శాస్త్రవిషయాల పట్ల సదభిరుచి, సమ్యదవగాహన, సమీచీనమైన దర్శనము, సృజనాత్మకమైన విమర్శా వ్యాపారము పెంపొందాయి. ఆ కారణంగా సంపత్కుమారపై సాంప్రదాయ విమర్శకుడనే బలమైన ముద్ర పడింది. తెలుగు సాహిత్య విమర్శలో సాంప్రదాయిక రీతిని గూర్చి 1981నాటికి తన పరిశోధన పూర్తి చేసినా, అప్పటికి సుమారు ముప్ఫై సంవత్సరాల ముందునుండి సంప్రదాయ రీతిని గూర్చి సంపత్కుమార తన విమర్శలో రాస్తూనే ఉన్నారు. కావ్యాన్ని ఎలా చదవాలి? ఎలా అర్థం చేసుకోవాలి? అనే విషయాన్ని ఆయన సాంప్రదాయ మార్గాన్ననుసరించి విశదం చేశారు. కవి ఉద్దేశించిన భావం స్పష్టంగా దర్శింపబడనప్పుడు పదాలు అర్థమయ్యేవే వాడబడినా కూడా ఆ భావం స్పష్టంగా వ్యక్తం కాదు. అప్పుడే అది అర్థం కాకుండా పోతుంది. కవి ప్రౌఢ శబ్దాలను, మారుమూల శబ్దాలను వాడడం వల్ల కలిగే క్లేశం ఇంతకంటే చాలా స్వల్పమైనదని ఆయన వివరించారు. అంటే కావ్యాన్ని అర్థం చేసుకోలేక పోవడంలో శబ్దం వల్ల కలిగే క్లేశం కంటే అభివ్యక్తి వైకల్యం వలన, అస్పష్ట భావప్రతీతి వలన కలిగే క్లేశం ఎక్కువని వారు స్పష్టం చేశారు. పాఠకుడికి తాను చదివే రచన పట్ల సానుభూతి, సహమతి ఉన్నప్పుడే కవి ప్రతిపాదించిన అంశాలను పూర్తిగా ఋజుమార్గంలో తెలుసుకోగలడని, కవి పట్ల విముఖత గల పాఠకుడు ఆ కవిని అర్థం చేసుకోలేడని సంపత్కుమార స్పష్టం చేశారు. ఈ అంశాన్ని సంప్రదాయ రీతికి చెందిన శిల్పము, రసము, కావ్యానందము అనే క్రమవికాస దశలతో కూడిన సాహిత్యవిమర్శగా సంపత్కుమార గుర్తించారు. పాత్రల చిత్తవృత్తులు, గమనాలు, చర్యలు – ప్రతిచర్యలు, మానసిక సంఘర్షణలు మొదలైన వాటిననన్నింటినీ ప్రాచీనకవులు రసాభిముఖంగానే తీర్చిదిద్దడం లక్ష్యంగా ఎంచేవారని, భారతీయ కావ్యశాస్త్రంలో రసానికుండే ప్రాముఖ్యం పాత్రచిత్రణకు లేదని, పాత్రచిత్రణకు ప్రాధాన్యం కల్పించడం పూర్తిగా ఆధునికమైన పాశ్చాత్య విమర్శ ప్రభావంతో మొదలయిందని సంపత్కుమార పలు సందర్భాలలో వివరించారు.

ప్రాచీన కావ్యవిమర్శ విధానంలో రసానికి గల ప్రాధాన్యం కవి జీవితానికి, సమకాలీన పరిస్థితులకు లేదని; ఇతివృత్తము, భావనాశక్తి, కవితాశక్తి వంటివి రసమార్గాన్ని నిర్దేశించేవిగా ఉంటాయని సంపత్కుమార విశదం చేశారు. దేశీయమైన భావనలో కథకంటే కథానిర్వహణే ప్రాధాన్యమని సంపత్కుమార అనడంలో కథానిర్వహణమంటే రసపోషణమేనన్న అభిప్రాయం గర్భితంగా ఉంది. కావ్యంలో కనబడే శతాంశాలలో తొంభైపాళ్ళు కవి ప్రతిభతోనే ఉంటాయని, కథకంటే రసము వేయిరెట్లు గొప్పదని కుంతకుడు మొదలైన ప్రాచీనాలంకారికుల మార్గాన్ననుసరించి విశ్వనాథ ఒక సిద్ధాంతవాక్యంగా చెప్పిన అభిప్రాయాన్నే సంపత్కుమార పునఃప్రపంచనం చేసినట్లుగా ఆయన విమర్శ సాక్ష్యమిస్తుంది. తెలుగులో పాశ్చాత్య విమర్శ సంప్రదాయాన్ని అనుసరించిన విమర్శకులు భావ, చిత్త వృత్తులకు సంబంధించిన వివేచన చేయలేదని, తొలితరం విమర్శకులలో ఒకరైన దక్షిణామూర్తిగారి విమర్శరీతిని సమీక్షిస్తూ సంపత్కుమార తెలిపారు. ‘పాశ్చాత్యరీతిలో భావస్థాయి వరకే తప్ప రసస్థాయికి చెందిన భావన లేదు,’ అంటూ సంపత్కుమార స్పష్టంగా చెప్పిన మాట కొంత విమర్శ సాపేక్షమయినది. ఒక విధమైన విమర్శ పరిభాషకు కట్టుబడి ఉన్నప్పుడు స్థూలంగా ఇటువంటి అభిప్రాయం కలగడం సహజమే. పరిభాషను పక్కకు పెట్టి కేవలం విషయ వివేచనకు పూనుకుంటే గానీ దీనిని ఇదమిత్థమని నిర్ణయించడం సాధ్యం కాదు. రసానుభవానికి కావ్యసమగ్రదర్శనం ప్రధానమని, భారతీయ విచారణలో రసం ప్రధానంగా మానసిక వ్యాపారంగా ప్రతిపాదితమయిందని స్పష్టం చేయడంలో సంపత్కుమార తన అలంకారశాస్త్ర పరిజ్ఞానాన్నంతటీనీ నవ్యసాంప్రదాయ రీతిలో ప్రదర్శించారు. రాజశేఖరుడు చెప్పిన భావయిత్రి, కారయిత్రి అనే పరిభాషకు బదులుగా కొందరు ఆధునికులు భావనాశక్తి, రచనాశక్తి అనే పరిభాషను ఉపయోగించడంలో వారికి గల దేశీయ సంప్రదాయాభిజ్ఞత అభివ్యక్తమవుతుందని గుర్తించారు. కేవలం భావాలు, రసాలు, కథ వంటివే కాకుండా రచనారీతిని వ్యక్తీకరించే భాష, ఛందోవ్యాకరణాంశాలు కూడా సాహిత్య కావ్యవిమర్శలో భాగాలుగానే గుర్తించవలసి ఉంటుంది – అని సంపత్కుమార స్పష్టం చేశారు. అలంకార శాస్త్రంలో ప్రస్తావనకు వచ్చిన సంఘటన, పాకము, మార్గము వంటి విశేషాంశాలను, ఆ అంశాలకు రసంతో గల సంబంధాన్ని సంప్రదాయరీతిలో అవగాహన చేసుకొని తన విమర్శకు పాదులు కట్టుకున్న వ్యుత్పన్నుడు సంపత్కుమార.


కోవెల సంపత్కుమారాచార్యుని
సాహితీ ప్రస్థానం

ఒక కవి ఒక ప్రత్యేక మార్గానికి కట్టుబడి ఉన్నాడని విమర్శించడం సహేతుకం కాదు. అన్ని సన్నివేశాలలోనూ సరళమైన శైలిని గానీ, కఠినమైన శైలిని గానీ ఉపయోగించడానికి కవికి వీలుకాదు. కవి ప్రయోగించే ప్రతి అక్షరమూ, పదమూ అసమాస, మధ్యమ సమాస, దీర్ఘ సమాసాదులతో కూడిన సంఘటనము. ఆ సంఘటనను అనుసరించిన గుణ వృత్తి రీతిపాకాదులు రసానుగుణంగానే ఉంటాయి – అని గుర్తించి విమర్శకు పూనుకోడం సంపత్కుమార అలంకార శాస్త్ర పరిచయాన్ని తెలియజేస్తుంది. ఈ భూమికతోనే కావ్యంలో కథ ఉపలక్షణంగా ఉంటుందని, కావ్యం రసస్ఫురకంగా ఉంటుందని ఆయన నిర్ణయించారు. రామాయణంలోని రసాన్ని గూర్చి ఆనందవర్ధన, కుంతకాది అలంకారికులు కొనసాగించిన చర్చ సంపత్కుమార క్షుణ్ణంగా తెలుసుకున్నారు. రామాయణంలో ప్రధానరసం శాంతరసమనే అలంకారిక మతాన్ననుసరించి విశ్వనాథ రామాయణ కల్పవృక్షంలోని శిల్పాన్ని నిర్వహించారని; అలోకసామాన్య ప్రతిభ గల కవి మాత్రమే కథా పరమార్థాన్ని ముందుగా నిర్ణయించుకొని, ఆ విషయాన్ని రసోపస్కారకంగా నిర్ణయించగల వ్యూహరచన చేయగలడని సంపత్కుమార భావించారు. విమర్శ రసస్థాయి ననుసరించి, వస్తుస్థాయి ననుసరించి ఏ విధంగా ఉండాలో విశ్వనాథ విమర్శ మార్గాన్ననుసరించి సంపత్కుమార విశదీకరించారు. కేవలం ప్రాచీనాలంకార శాస్త్రమర్యాద ననుసరించి రస ప్రస్థాన మహాభిగమనం చేయడంతో తృప్తి పడని సంపత్కుమార ఈ విషయంలో ఆధునిక కవులు, కావ్యతత్వజ్ఞులు నూత్న శేముషీవైభవంతో చేసిన ప్రతిపాదనలను, అనుసరించిన మార్గాలను, స్థాపించిన సిద్ధాంతాలను గ్రహిస్తూ తన విమర్శ రీతికి ఒక సమగ్రతను, సంపూర్ణతను సంతరించుకోడానికి ఎప్పటికప్పుడు ప్రయత్నాన్ని కొనసాగిస్తూనే వచ్చారు.

సాహిత్యవిమర్శకు శబ్దశాస్త్ర పరిచయం తప్పనిసరిగా ఉండాలి. అది అరగొరగా ఉండకూడదు. నికషమైన పాండిత్యమై ఉండాలి. ప్రాచ్యకళాశాల విద్యార్థిగా సంస్కృత వ్యాకరణ శాస్త్రాధ్యయనం కొనసాగిస్తూనే సంపత్కుమార అవసరమైన మేరకు తన విమర్శలో శబ్దశాస్త్ర పరిజ్ఞానాన్ని ప్రకటించుకున్నారు. స్థాలీపులాకన్యాయంగా ఒకటి, రెండు సందర్భాలను ఇక్కడ ప్రస్తావిస్తాను.

  1. రామాయణంలో రాముడు లక్ష్మణునుద్దేశించి ‘అకృతదారః” అని పలకడంలోని ఔచిత్యాన్ని తన వ్యాకరణ పాండిత్యంతో సంపత్కుమార చేసిన విమర్శ.
  2. ‘రమ్‌’ అన్న ధాతువు నుంచి సుబంతం పుంలింగరూపంలో నిష్పన్నమయితే ‘రామ’ అనీ, స్త్రీలింగరూపంలో నిష్పన్నమయితే ‘రామా’ అని, ఒకే వెలుగు ద్విధా పరిణతమయినట్లు ఒకే మూలధాతువు ఈ రూపద్వయంగా పరిణతమయింది. ఒకటి పురుషరూపం, ఒకటి గరితరూపం. అందుకనే తత్త్వతః మూలతః అభేదం – అంటూ ‘రామ’ శబ్దప్రయోగంలోని విశేషాంశవివరణ. (సంస్కృత పదాలను ప్రకృతి ప్రత్యయ విభాగం చేసి మూలధాతువును, దాని అర్థాన్ని గ్రహించగల శబ్దశాస్త్ర పరిచయం గల వారు మాత్రమే ఈ విధమైన విమర్శ చేయగలరు.)
  3. విశ్వనాథ తన కిన్నెరసాని పాటలలోని మొదటి చరణాన్ని ‘ఓహో! కిన్నెరసానీ!’ అని ప్రారంభిస్తూ ‘జవరాలా’ అని ముగిస్తారు. కవి ఊహ ననుసరించి కిన్నెర యౌవనవతి యైన స్త్రీ. భౌతికంగా చూసినప్పుడు అది ఉరవడిగా ప్రవహించే ఒక వాగు. సంపత్కుమార ఇక్కడ ‘జవరాలా’ అనే ప్రయోగానికి యౌవ్వనవతి అనే సామాన్యార్థంతో పాటు ‘వేగరి యైన స్త్రీ’ అని విశెషార్థ కల్పన చేయదలిచారు. చిన్నయసూరి వ్యాకరణం ఇందుకు ఒప్పదు. ‘జవ’ అనే తత్సమపదం మీద ‘ఆలు’ అనే తెలుగుపదం చేర్చినప్పుడు ‘జవరాలు’ అనే రూపం ఏర్పడదని భావించిన చిన్నయసూరి, “జవ్వని శబ్దంబునకు జవాదేశంబగు” – అని ఒక ఆదేశకల్పన చేసి ‘జవరాలు’ అనే రూపాన్ని సాధించారు. ఈ రూపానికి ‘యౌవ్వనవతి’ అనే అర్థం వస్తుంది గానీ ‘వేగరి యైన స్త్రీ’ అనే అర్థం రాదు. తనకు ఇష్టమైన అర్థాన్ని సాధించడం కోసం సంపత్కుమార చిన్నయసూరిని పక్కకు నెట్టారు. ‘జవ’ అనేది ఆదేశంగా వచ్చినది కాక స్వతంత్రపదంగా భావించితే ‘జవ’ శబ్దానికి వేగమనీ అర్థం ఉన్నది. ‘ము’ వర్ణ విరహితంగా ‘జవ’ శబ్దం అర్థంలోని కొంత భేదంతో తెలుగు వ్యవహారంలో ఉన్నది కాబట్టి ‘జవరాలు’ అని కావచ్చు. దీనికి ఇప్పుడు ‘వేగరి యైన స్త్రీ’ అనే అర్థం చెప్పవచ్చు” – అంటూ ఒక వివరణ ఇచ్చారు.

ఇక్కడ సంపత్కుమార వ్యాకరణ మౌఢ్యాన్ని వదలి వ్యావహారిక చైతన్యంలోకి మళ్ళినట్లయింది. విమర్శలో ఇటువంటి తెగువను చూపించిన సంపత్కుమార ‘తా బట్టిన కుందేటికి మూడే కాళ్ళు’ అన్న పద్ధతికి చెందినవారు కాదు. తన భ్రమప్రమాదాలను గానీ, దోషాలను గానీ ఎదుటివారు ఎత్తి చూపించినప్పుడు సమచిత్తంతో ఆ విమర్శను స్వీకరించి తమను తాము సంస్కరించుకునే సౌమనస్యం వారి సొత్తు. ‘త్రినయన – త్రిణయన’ అనే రెండు రూపాల వివరణలోనూ, ‘అన్యోన్య’ ప్రయోగసాధుత్వ నిర్ణయంలోనూ సంపత్కుమార ప్రమాదపడినట్లు ఆచార్య బేతవోలు రామబ్రహ్మం ఎత్తి చూపించారు. అప్పుడు సంపత్కుమార “కొన్ని విషయాల చర్చలో, విచారణలో అసమగ్రతకూ, పొరపాట్లకూ అవకాశం తప్పలేదు” – అంటూ తన పొరపాటును అంగీకరించారు.

సంప్రదాయ విమర్శ మార్గాన్ని అనుసరించినా వ్యాకరణాన్ని గూర్చి సంప్రదాయ పండితులకంటే కొంత ఉదారము, ఆధునికము అయిన వైఖరిని సంపత్కుమార సమర్థించారనడానికి ఆ క్రింది అంశాలు నిరూపకంగా కనిపిస్తాయి.

– “ఒక భావం – అదెట్లాంటిదయినా భాషలో అభివ్యక్తం కావాల్నంటే, ఆ భాషాపదాలకు ఒకానొక విధమయిన కూర్పు అవసరం. ఆ కూర్పులోని స్థితిని, అంటే ఆ కూర్పులో ఒదిగిన పదాలకు కలిగిన పరస్పర సంబంధాలను వింగడించి చూపేది వ్యాకరణం. వ్యాకరణం వింగడిస్తున్నది కాబట్టి ఆ సంబంధాలను వ్యాకరణ సంబంధా లంటున్నాం.”

– “అర్థ(భావ)స్ఫూర్తికి వ్యాకరణ సంబంధాలు ముఖ్యమే. కాని ఆ స్ఫూర్తి కలిగిం తరువాత ఆ కలిగిన అర్థం ఆధారంగా ఏర్పడేవన్నీ ఆ అర్థం(భావం) బట్టి చెప్పబడుతాయే కాని వ్యాకరణాన్నిబట్టి కాదు.”

– “భావం అనేది భాషలో అభివ్యక్తమయినాక గాని ఇది భావం, లేదా ఇది భావంలోని ఒక అంశం అని చెప్పటానికి వీలుపడదు.”

– “భావస్ఫూర్తిని వదిలితే వ్యాకరణం యొక్క అవసరం లేదు. మరొక అంశ మేమిటంటే, భావస్ఫూర్తికి వ్యాకరణ సంబంధాల పరిజ్ఞానం తోడ్పడినంత మాత్రాన స్ఫురించే భావం ‘వ్యాకరణ భావం’ కాదు. భావస్ఫూర్తికి వ్యాకరణం సహాయకం. వచనపద్య పాదవిభజనకు భావస్ఫూర్తి సహాయకం.”

వ్యాకరణాల సంకెళ్ళు విడగొట్టడానికి సంపత్కుమార అనుసరించిన రీతి ఇది. సంప్రదాయంలో ఆధునికతను, ఆధునికతలో సంప్రదాయాన్నీ రంగరించి చూపడమే సంపత్కుమార నవ్యసంప్రదాయ మార్గంలోని విశిష్టత.


ఛందో భూమికలు
కోవెల సంపత్కుమారాచార్య
అభినవప్రచురణలు, 2003

పరిష్కర్తగా, పరిశోధకుడిగా, విమర్శకుడిగా మొట్టమొదట సంపత్కుమారను ఉత్పథంలో నిలిపినది ఛందశ్శాస్త్ర పరిశ్రమ. తెలుగు ఛందోవికాసము, తెలుగు ఛందస్సుపై కొన్ని వెలుగులు, ఛందోభూమికలు వంటి గ్రంథాలు, ఛందస్సంబంధమైన కొన్ని ఇతర వ్యాసాలు ప్రచురించి తన పరిష్కరణ దక్షతను, విమర్శ పాటవాన్ని చాటుకొని ఆధునిక లాక్షణికులలో ఒకరుగా పరిగణన పొందారు. విశ్వనాథ సృష్టించిన అనేక నూతన ఛందస్సుల అవసరాన్ని, ఔచిత్యాన్ని వివరించడంలోను, పద్యశిల్పాల మర్మాలను ఆవిష్కరించడంలోను ఒక వినూత్న మర్యాదను చూపి ఛందశ్శిల్ప రహస్యవేత్తగా గుర్తింపు పొందారు. విశ్వనాథ సృష్టించిన ‘శ్వేని’ అనే వృత్తానికీ, ఉత్సాహ వృత్తానికీ గల పోలికలను తెలియజేస్తూ ‘శ్వేని’ ఉత్సాహ కాని ఉత్సాహమని సంపత్కుమార వివరించారు. విశ్వనాథ ‘రామాయణ కల్పవృక్షం’ యుద్ధకాండలో అతికాయుణ్ణి, శ్రీరాముణ్ణి ఒకే సీసపద్యంలో వర్ణించారు. ఆ సీసపద్య పాదాల క్రమవిశేషాన్నీ, పదవిన్యాసాన్నీ, అక్షర సంయోజనాన్ని బట్టి వారిద్దరి గుణవిశేషాలు ఏ విధంగా వ్యంజిత మౌతున్నాయో సంపత్కుమార విమర్శించిన తీరు సహృదయ పాఠకులకు మనఃప్రహ్లాదకంగా ఉంటుంది. ఒక కవి తన రచనలో ఉపయోగించే సర్వసామాన్య పద్యప్రయోగానికీ, విశేషపద్య ప్రయోగానికీ గల తేడాను, విశేషపద్య ప్రయోగ అవసరాన్నీ సంపత్కుమార ఇలా వివరించారు.

“పద్యాలను సామాన్య – విశేష భేదంతో స్థూలంగా రెండు వర్గాలు చేయవచ్చు. ఏదో ఒక విశేషాంశ స్ఫూర్తి లేకుండా విశేషపద్యం ఉపయోగించటం జరుగదు. ఛందశ్శిల్ప విషయంలో ఇదొక సామాన్య సూత్రం. పద్యపు నడకను బట్టి, పేరును బట్టి లేదా స్వరూపాన్ని బట్టి, రచనారీతిని బట్టి ఏదో ఒక విశేషాన్ని విశేషపద్యం స్ఫురింపజేస్తుంది. కథాగమనంలో, భావప్రసారంలో వచ్చే మలుపులను సూచించేందుకు కూడా విశేషపద్యం ప్రయుక్తం కావచ్చు.”

ఈ విషయాన్ని సంపత్కుమారకు ముందు ఇంత సవిమర్శంగా, శ్రద్ధగా ఉపలక్షించిన వారు తక్కువ. ఛందో బందోబస్తులను నిరాకరించినవారిలో ఈ దృష్టి మరీ తక్కువ. ప్రాచీన కవుల ప్రయోగాల విషయంలో పూర్వలాక్షణికులు అనుసరించిన వైఖరిని విమర్శిస్తూ సంపత్కుమార కొన్ని అభిప్రాయాలను ప్రకటించారు. అందులో కొన్ని ఇక్కడ ఉదాహరిస్తున్నాను.

– “లక్షణకర్త లందరును అన్ని విషయములలో ఏకమతస్థులు కానక్కరలేదు. అభిప్రాయము భేదింపవచ్చును. ఈ భేదింపు నన్నయాధర్వణులలోనే కనిపించుచున్నది గాదా! కావున నన్నయాధర్వణులు సాధించిన రూపములను కేతన సాధించక పోవుట ఒక మతభేదముగా మాత్రమే పరిగణించవలసి యుండును.”

– “పూర్ణబిందుపూర్వకముగా మకారమును (నకారమును గూడ) వ్రాయు పద్ధతి నన్నయగారి కంటగట్టుటలో ఔచిత్యము కన్పించదు.”

– “శ-స లకు యతిప్రాసలు చెల్లుట అంగీకరించిన లాక్షణికులు ర-ఱ లకు అంగీకరించక పోవుటలోని యనౌచిత్య మింతకన్న వేరే కన్పించదు.”

ఈ విధంగా ప్రాచీన లాక్షణికుల మధ్యగల అభిప్రాయభేదాలు, చర్చకు ఆస్పదమైన విషయాలు సంపత్కుమార విమర్శలో ఎలా చోటు చేసుకున్నాయో పైన సూచించిన వాక్యాల వలన మనకు తెలుస్తుంది. ప్రయోగాల ననుసరించి, ప్రక్రియాభేదాల ననుసరించి లాక్షణికులు అవలంబించదగిన ఉదార వైఖరిని కూడా పలుసందర్భాలలో సంపత్కుమార తన విమర్శలో ప్రస్తావించారు. ‘కవి గజాంకుశము’ వంటి లక్షణగ్రంథ శీర్షికల మూలంగా కవులనే మదగజాలకు తాము అంకుశంవంటి వారమని పూర్వలాక్షణికులు వ్యవహరించిన తీరు ప్రాచీనసాహిత్య పాఠకులకు పరిచితమైనదే. ఈ అంకుశాలను, నిరంకుశులైన కవులను అదుపులో ఉంచి తమ ఆజ్ఞావశవర్తులను చేయగల స్తోమత లోకవ్యవహారానికుందని సంపత్కుమార గుర్తుచేస్తూ వచ్చారు. కవులు లోకవ్యవహారాన్నీ, లాక్షణికులు కవి ప్రయోగాలను మన్నించడమే మర్యాద అని వారు తీర్మానించారు. జీవద్భాషా ప్రవాహంలోని అనేక ప్రయోగ పరిణామరీతులను గుర్తించి లక్షణాన్ని నిరూపించవలసి ఉంటుంది. ఆ కారణంగా కాలం గడుస్తున్న కొద్దీ లక్షణగ్రంథాలలో అనేక మార్పులు చేసుకొని ప్రామాణికస్థితిని పొందుతాయని వారు నిర్ధారణ చేశారు. పద్యకవిత, గేయకవిత, వచనకవిత మొదలైన విభాగాలలో రూపానికే ప్రాధాన్యం గానీ కవిత్వ మౌలికతత్త్వంలో ఏ విధమైన భేదమూ ఉండదని వారు స్పష్టం చేశారు. వచనకవితలో కంటే గేయకవితలోను, గేయరచన కంటే పద్యరచనలోను అవరోధాలు, క్లేశాలు ఎక్కువగా ఉంటాయనే వాదనను ఆయన కొట్టిపారేశారు. ప్రాచీన చందస్సులతో పాటు గురజాడ సృష్టించిన ‘ముత్యాలసరం’ అనే నూతన చందస్సుకు సంబంధించిన పూర్వాపర లక్షణ వివేచనను, విమర్శను చేసే సందర్భంలో సంపత్కుమార తనకు గల జానపద ఛందోలక్షణ పరిజ్ఞానాన్ని వెల్లడించుకున్నారు. గురజాడ ముత్యాలసర నిర్మాణంలోని లోపాలను చూపించడంలో వారికి ఆసక్తి ఎక్కువని పాఠకులకు తోచకమానదు.

వచనపద్యం పరిపూర్ణంగా ఆధునికమైన ప్రక్రియ. పాశ్చాత్య కవిత్వ పఠనంతో తెలుగు కవులు సృష్టించుకున్న ప్రక్రియ ఇది. ఛందస్సు నుండి విముక్తిని సాధించడమే వచనపద్యానికి లక్షణమని అభ్యుదయవాద విమర్శకులందరూ గట్టిగా విశ్వసించారు. ఆ విశ్వాసం అప్రతిహతంగా కొనసాగుతున్న సమయంలో పద్యమనే భావన ఏర్పడిన ప్రతిచోటా తప్పనిసరిగా ఛంధస్సంభావనము ఉండి తీరుతుందని, ఆ కారణంగా వచనకవిత్వంలో కూడా ఒక ఛందఃప్రక్రియ ఉందని నిరూపించడం సాధ్యమని సంపతుకుమార సాహసోపేతంగా ప్రకటించారు. ‘అన్నీ వేదాలలో ఉన్నాయిష!’ అన్న సూత్రం ఆధారంగా ప్రాచీన మార్గానికి చెందిన ఛందోప్రక్రియలో వచన కవిత్వానికి కూడా గతి కల్పించటానికి సంకల్పించిన దురాశయమే కానీ, సంపత్కుమార వాదనలో సాహసమేమీ లేదని చేకూరి రామారావు ఆ ప్రతిపాదనను తిరస్కరించారు. ఆ ప్రతిపాదనలు, తిరస్కారాలతో తెలుగు విమర్శ చరిత్రలోనే ఒక వినూత్న మర్యాదతో కూడిన స్నేహపూరితమైన చర్చ కొనసాగింది. ఆ ఫలితంగా వెలువడిన ‘వచన పద్యము: లక్షణ చర్చ’ గ్రంథంలో సంపత్కుమార ప్రకటించిన అభిప్రాయాలలో కొన్నింటిని ఇక్కడ స్థూలంగా చూపిస్తున్నాను.

– “వచన పద్యం పద్యం కావటానికీ, అందులో కవితా పదార్థం ఉండటానికీ, లేకపోవటానికీ ఏ సంబంధం లేదు. ఉండవచ్చు, ఉండకపోవచ్చు.”

– “వచన పద్యానికి ఛందస్సాంప్రదాయంలో నేనుగా చోటు కల్పించటానికి ప్రతత్నించలేదు. మాత్రాఛందస్సులను దాటి వచ్చి, తనంతట తనే వచన పద్యం ఛందస్సాంప్రదాయంలో చోటు చేసుకున్నది.”

– “ఛందస్సు, గణవిభజన ఉన్నంత మాత్రాన ఏ పద్యానికీ అదనపు గౌరవం రాదు. ఆ పద్యంలో శక్తి ఉంటే వస్తుంది.”

– “అత్యాధునికంగా పద్యకుటుంబానికి మాత్రమే కలిసివచ్చి విస్తరించిన ఆస్తి వచన పద్యం.”

– “ఆర్బిట్రరీగా రూపొందిన లక్ష్యాల్ని పరిశీలించి, వర్గీకరణాదులు చేసి, సామాన్య లక్షణాలను గమనించి, వీలయినంత అనువుగా పొసగే పాదవ్యవస్థాదులను నిరూపించే లక్షణాలను – సూత్రాలను నిష్పన్న పరచవలసి ఉంటుంది. అట్లా నిష్పన్న లక్షణాలననుసరించి లక్ష్యాలు మళ్ళీ విరివిగా వచ్చింతరువాత ఈ లక్షణాలకూ – లక్ష్యాలకూ అవినాభావ సంబంధం సుప్రతిష్ఠితమవుతుంది. అప్పుడు, సాంప్రదాయికంగా అనువర్తిస్తున్న పద్యాల గూర్చి మనకీనాడు కలుగుతున్న ప్రామాణ్యమూ, సులువూ వచన పద్యాల విషయంలో కలుగుతుంది. వచన పద్య ప్రయోక్తకూ – పరిశీలకునికీ సమాన ప్రమాణం ఉండటం వంటివి అప్పుడు కుదురుతయి.”

పై అభిప్రాయాలతోపాటు చేరా ప్రతిపాదించిన అంశాలను, చర్చించిన విశేషాలను జతకలిపి పరామర్శించడం వల్ల వచన పద్యంలో ఛందఃస్పర్శ ఉన్నదా? లేదా? అనే విషయంలో పాఠకులకు సమ్యక్‌జ్ఞానం కలుగుతుందనే ఉద్దేశంతో ఇద్దరి వ్యాసాలను అనుబంధ సహితంగా ఒకే పుస్తకంగా ప్రచురించడం చేరా, సంపత్కుమారల ఉత్తమ సంస్కారాన్ని వ్యక్తం చేస్తుంది. “వచన పద్యానికి నేను చెప్పిన లక్షణమే లక్షణం కావాల్నని గాని, కేవలం ఇది మాత్రమే నిర్దిష్టమయిందని కాని వాదించే అతిశయం నాకు లేదు. నాకు స్ఫురించిన ఒక పద్ధతిని సూచించటం మాత్రమే నా తాత్పర్యం.” – అని వినమ్రంగా ప్రకటించారు సంపత్కుమార. విమర్శలో పూర్వాపర సందర్భంతో కూడి హేతుబద్ధమైన తిరస్కారాన్ని కూడా పురస్కారంగా భావించే సౌమనస్యం సంపత్కుమార సొత్తు. ఎత్తుగీతి గణనిర్ణయంలో తన అభిప్రాయాలను సోపపత్తికంగా నిరాకరించిన సంగనభట్ల నరసయ్య విమర్శకు సాదరమైన స్వాగతాన్ని పలకడం ఇందుకు నిదర్శనం. వృణతేహి వినృశ్చ కారిణం గుణ లుబ్ధాః స్వయమేవ సంపదాః అన్న భారవి సూచనను విమర్శ సందర్భంలో తానెన్నడూ విస్మరించలేదు, విస్మరించిన వారిని హెచ్చరించక పోవనూ లేదు.

విమర్శకు పూనుకునే ముందు దానికి సంబంధించిన పరిభాషను తనదైన దృక్పథంతో నిర్వచించి, వివరించి విషయ స్థాపన చేయడం సంపత్కుమారకు అలవాటు. ఈ దృష్టితో చూసినప్పుడు, ఆధునికతకు ఆయన ఇచ్చిన నిర్వచనం, వివరణ అభ్యుదయవాద విమర్శకుల వాదానికి బాగా భిన్నంగా ఉంటాయి, ఇటీవలి కాలంలో సామాజిక విమర్శకులు ఆధునికతను; దేశీయమైన ఆధునికత, వలస పాలన కారణంగా ఏర్పడిన ఆధునికత, వలస పాలనాంతర ఆధునికత, ఉత్తరాధునికత, అని నాలుగు విధాలుగా విభజించి పరిశీలిస్తున్నారు. ఈ పరిశీలనలో ఎవరికి తోచిన నిర్వచనాలని వారు కల్పించుకొని, ఎవరి దృక్కోణాన్నసురించిన వివరణలను వారు చూపిస్తున్నారు. ఈ వింగడింపును పక్కన పెట్టి దేశీయమైన ఆధునికత, వలస పాలన వలన ఏర్పడిన ఆధునికత అనే విభజనను ఆశ్రయించి 19వ శతాబ్దం ఉత్తరార్ధం నుండి కొందరు 20వ శతాబ్దం పూర్వార్ధం వరకు గల కాలాన్ని కొందరు అధ్యయనం చేస్తున్నారు. వలస పాలన కారణంగా సంఘంలో అభ్యుదయకరమైన పరిణామాలెన్నో ఏర్పడ్డాయని ఆధునికులైన సంస్కరణవాదులు భావించడం కొందరకు మింగుడు పడలేదు. గురజాడ “వచ్చెనిదె బంగారు కాలము” అనడాన్ని, పాశ్చాత్య సంస్కృతిని ప్రశంసించడాన్ని జీర్ణించుకోలేనివారు ఆ మార్గాన్ని ఆత్మన్యూనతా మార్గంగా ఎంచారు. ఆ రకమైన భావనకు లోను కావడమే ఆధునికతగా సంపత్కుమార చెప్తారు.

“మన జీవితంలోని అన్ని రంగాలలోనూ పాశ్చాత్య సంపర్కం ఏర్పడిన నాటినుంచి మనకు ‘ఆధునికత’ మొదలయిందనేది ఒక స్థూలమైన అభిప్రాయం. కాని, జాగ్రత్తగా అనుశీలిస్తే పాలకులు పాలితులను సర్వాత్మనా ఆత్మన్యూనతా భావానికి గురిచేయటం, అది ఫలించటం ఆరంభమయిన నాటినుంచీ ఆధునికత అని చెప్పుకోవలసి ఉంటుంది.” – అని సంపత్కుమార పేర్కొనడం గురజాడ, గిడుగు, కందుకూరి వంటి సంస్కర్తలను, వారి అనుయూయులను ఉద్దేశించి చేసిన విమర్శ అని ఎవరికైనా బోధపడుతుంది. ఆయన తన మనోగతాన్ని ఇంకా విస్పష్టంగా ఇలా విప్పిచెప్పారు: “ఇటీవలి శతాబ్దాల్లోని బ్రిటీషు పాలన వల్ల ఈ దేశానికి ఆధునికత సంభవించిందనే అపోహ ఒకటి వ్యాప్తిలో ఉంది. నిజానికి ఆధునికత ఒకరి ద్వారా వచ్చేది కాదు. ఒక దేశం తన ప్రాచీనత, సంస్కృతుల పునాది మీద పెంపొందిన స్వతంత్రమయిన ఆలోచనా విధానంతో, అనుభవాల విశ్లేషణతో, ఇతరేతరమయిన ఆటుపోటులనుండి నిలవరించుకొని సాగించిన ఆచరణ విధానంతో ‘ఆధునికత’ ను ఎప్పటికప్పుడు సాధించుకుంటూ ఉంటుంది.” ఈ అభిప్రాయాన్ని వ్యాప్తి చేయడానికే విశ్వనాథ తన సర్వ సాహిత్యాన్నీ సృష్టించాడు. ఆ సాహిత్యాన్ని విశ్లేషిస్తూ ఆ భావాన్ని పరిపూణంగా వ్యాప్తి చేయడానికి సంపత్కుమార తన విమర్శ సర్వస్వాన్నీ ఒక సాధనంగా ప్రయోగించారు.

ఆధునికతను నిర్వచించినట్లే సంపత్కుమార ‘మహాకవి’ అనే పరిభాషను కూడా నిర్వచించారు. “ఎవరిని ప్రమాణీకరించి కవులు తమ స్థానాన్ని అంచనా వేసుకుంటారో, ఎవరిని ప్రమాణీకరించి ఇతర కవులను అంచనా వేసే స్థితి కలుగుతుందో ఆయన మహాకవి.” – అన్న సంపత్కుమార నిర్వచనాన్ని ఆశ్రయించి కొందరు గురజాడను ‘మహాకవి’ అని నిర్ణయిస్తే మరి కొందరు విశ్వనాథను ‘మహాకవి’ అని నిర్ణయించుకున్నారు. ఎవరి దృక్కోణం వారిది. కానీ ప్రాచీనుల నిర్వచనాలు ఈ విధంగా ఎటు పడితే అటు వంగవు. రాజశేఖరుడు మహాకవి అనేవాడికి ఎనిమిది లక్షణాలుండాలని స్పష్టంగా చెప్పాడు. ఆ లక్షణాలలో ఏ ఒక్క లక్షణం కొరవడినా ఒక కవి మహాకవి కాలేడు. సంపత్కుమార అభిప్రాయం ఇంత కట్టుదిట్టంగా కాక, కాలానుగుణమైన మార్పులను, వ్యాపకత్వాన్ని పొందినట్లు కనిపిస్తుంది. సమజము, సమాజము అనే రెండు పదాల మధ్య ఉండే చాలా ఆసక్తికరమైన తేడాను సంపత్కుమార ఒకచోట నిర్వచనప్రాయంగా విశదం చేశారు. పశువుల గుంపును ‘సమజం’ అంటారనీ; ఒక సువ్యవస్థతో, సమన్వయ భావంతో, పరస్పర సహకార విధానంతో, పరస్పర ప్రేమ భూమికగా త్యాగలక్షణంతో ఒకటిగా ఏర్పడ్డ మానవుల సమూహాన్నే ‘సమాజం’ అంటారని ఆయన అభిప్రాయపడ్డారు. మానవకోటి ‘సమజ’స్థాయి నుంచి ‘సమాజ’ స్థాయికి ఎదగాలన్నది ఆయన ఉదారాశయం. ఇటువంటి నిర్వచనాలూ, వివరణలూ ఇంకా చాలా సంపత్కుమార విమర్శలో కనిపిస్తుంటాయి. “భావాన్ని సమగ్రపరిచేదీ, పరిపుష్టం చేసేదీ భావాంశం” – అన్న వాక్యంలో సంపత్కుమార చెప్పినది నిర్వచనమా? లక్షణమా? అనే సందిగ్ధత ఏర్పడుతుంది. ఇలా ఎక్కడైనా సంపత్కుమార విమర్శలో కొన్ని వాక్యాలు సందిగ్ధతకు తావిచ్చినా అనిష్టార్థస్ఫూర్తికి మాత్రం అవకాశం కల్పించవు.

ప్రక్రియా పరిజ్ఞానము, విచక్షణ లేనిదే సాహిత్య విమర్శ సహేతుకంగా సాగదని సంపత్కుమార తలంపు. కావ్య జగత్సంబంధమైన సర్వసామాగ్రిని దానికై పరినిష్ఠితమైన ప్రక్రియాలక్షణంతో పర్యవేక్షించి, విమర్శ కొనసాగించవలసి ఉంటుంది. సంపత్కుమార ముందుగా ఒకానొక ప్రక్రియకు సంబంధించిన బహిరంతర స్వరూప నిర్ణయాన్ని మనసులో కుదుటపరచుకొని అవకాశ నిరవకాశాల కనుగుణమైన రీతిలో దానికొకపాటి వివరణ నిచ్చిన తరువాత, వస్తు గుణ రీతి రసాలంకారాది ఇతర గుణాలపై దృష్టి సారిస్తారు. ప్రక్రియాపరమైన విమర్శను గూర్చి సంపత్కుమార ప్రస్తావించిన అంశాలు ఆయన మాటల్లోనే:

“ఏ ప్రక్రియకు, ఏ భేదానికి చెందిన కావ్యాన్ని, రచనను ఆ ప్రక్రియ యొక్క మౌలికతత్వాన్ని భూమికగా చేసుకొని వివేచించవలసి ఉంటుంది. ఒక శతకాన్ని ఒక ప్రబంధంతో, ఒక ప్రబంధాన్ని ఒక ఇతిహాసంతో పోల్చి వాటి స్థాయిని, ప్రత్యేకతను బేరీజు వేయటానికి వీలులేదు. ఒక కవితాఖండికను ఒక కావ్యాన్ని సమస్థాయిలో ఉంచి పోల్చి చూడటానికి వీలు లేదు. కాగా సత్యనారాయణగారు ఈ విధమయిన ప్రక్రియాపరమైన వివేకం యొక్క అవసరాన్ని తొలిసారిగా సాహిత్యవిమర్శలో ప్రవేశపెట్టారు. అందుకని, ఆయన ‘ప్రక్రియాపర విమర్శా’ విధానానికి ఆద్యులు. ఆయన సాహిత్య విమర్శ ప్రధానంగా ప్రక్రియాపర వివేకంతోనే మొదలయిందని అనవచ్చు.”

సాహిత్యాన్ని ప్రక్రియాపరంగా విమర్శించడం అనే లక్షణం పాశ్చాత్య విమర్శ మార్గపరిచయంతోటే వికాసాన్ని పొందిందనవచ్చును. తెలుగు సాహిత్యవిమర్శలో విశ్వనాథ ఈ రీతిని ప్రారంభించారన్న విషయం కొంత సాపేక్షమైనదైనా, ప్రక్రియాపర విమర్శను గూర్చి సంపత్కుమార ఇక్కడ పొందుపరచిన వివరణ, సాహిత్య విమర్శ విద్యార్థులకు ఋజుమార్గ నిర్దేశకంగా ఉంది.

సమకాలీన జాతీయ చైతన్యాన్ని పొదువుకొని ఉండటం, కాల-దేశ పరిమితులను అధిగమించి సార్వకాలిక, సార్వదేశిక చైతన్యంతో విశ్వమే నేపథ్యంగా ఇతిహాస రచన జరుగుతుందని, ఇతిహాస ప్రక్రియకు గల ఒక విస్తృతమైన భూమికను మనకందించిన సంపత్కుమార ‘వేయి పడగలు’ నవల తన ఆకళింపుకు రాగానే “ఇతిహాసం మూడుతరాల కాలపరిధిని కథావస్తువుగా స్వీకరిస్తుంది” – అని నిర్ద్వందంగా తీర్మానిస్తారు. విమర్శకుడు ఇటువంటి తీర్మానాలు చేసే సందర్భంలొ పూర్వాపర సమన్వయబుద్ధితో ప్రవర్తించవలసిన అవసరాన్ని సంపత్కుమార ఇక్కడ గుర్తు చేస్తారు.

ముక్తక ప్రక్రియకు, కావ్యప్రక్రియకు నిర్వహణపరమైన భేదాన్ని స్పష్టంగా వివరించి తరతరాలుగా కొనసాగి వస్తున్న ఒక మొరను తొలగించడానికి ప్రయత్నించారు సంపత్కుమార. ముక్తకరచనకు అనుస్యూతమైన భావపరంపరతో పనిలేదు. కథాపరమైన బహువిషయ సమన్వయంతొ ఇక్కడ పనిలేదు. అయినా ప్రతి ముక్తకము ఒక ప్రబంధము వంటిదేనని, ప్రతి రసాత్మకమైన వాక్యము ఒక కావ్యమేననీ పూర్వులు పలికిన మాటలాధారంగా ఆధునికులు కొంత విపరీత ధోరణి నవలంబించడం చూసి కలత చెందిన సంపత్కుమార – “వట్టి భావాన్ని ముక్కలు ముక్కలుగా, అంటే ముక్తకాలుగా చెప్పడం కన్నా ఒక కథను నిర్మించి ఈ భావాలను ఆ కథ కనుసంధించి కూర్చి నిర్వహించడం ప్రతిభ గలవారి పని. అంత మాత్రాన ముక్తకాల స్థాయికేమీ లోపం లేదు. కాని, అవి కావ్యస్థాయికి మాత్రం చేరవనేది కావ్యమర్మజ్ఞులకు విదితమైన విషయం,” అంటూ ముక్తక పరిమితిని, కావ్యవైశాల్యాన్ని వీలైనంత సున్నితంగా తెలియజేశారు.

కథాప్రక్రియలో ప్రారంభానికి పెద్దపీట వేసిన సంపత్కుమార కథ తన జీవధాతువుతో మొదలవ్వాలని చెప్తారు. కథాశిల్పం వేరు, ఉపాఖ్యాన శిల్పం వేరు. ఉపాఖ్యానాలన్నీ ఒకేరకంగా ఉండవు. కవి తన కావ్యంలో సన్నివేశానుగుణంగా ఏ ప్రయోజనాన్ని సాధించదలచుకున్నాడో, దానిని బట్టి, ఏ పాత్రముఖంగా ఉపాఖ్యానాన్ని చెప్పించదలచుకున్నాడో, ఆ పాత్ర గుణశీలాదులే కాక ఆ సన్నివేశగతమైన వైఖరిని బట్టి ఉపాఖ్యానం ఉంటుందంటారు సంపత్కుమార. అందుకే ఉపాఖ్యానములు పలురీతులుగా ఉంటాయని సంపత్కుమార అంటారు. కావ్యశిల్ప సంబంధమైన అనేకాంశాలతో సంపత్కుమార విశ్వనాథ మార్గాన్ననుసరించా డనటానికి ఈ వివరణ ఒక నిదర్శనం. ఇది విశ్వనాథోపజ్ఞమైన విమర్శ మార్గం. ఈ మార్గంలోనే విమర్శ ప్రక్రియను కూడా భావన జేశారు సంపత్కుమార. ఆధునిక విమర్శలకు విమర్శ ప్రక్రియలో రెండు ప్రకృష్టమైన రీతులున్నాయి. ఒకటి సాంప్రదాయక విమర్శ రీతి, రెండవది పాశ్చాత్య విమర్శరీతి. దేశీయ సాహిత్యాన్ని దేశీయ విమర్శ విధాన భూమిక మీదనే వివేచించవలసి ఉంటుందని, విదేశీయ విమర్శ విధానాలలోని మేలిమిని దేశీయవిధానంతో సమన్వయ పరచుకొని పురోగమించవలసి ఉంటుందని ప్రబోధించిన విశ్వనాథ విమర్శ విధానము సంపత్కుమారకు శిరోధార్యమయింది.

విశ్వనాథను, గురజాడను గూర్చి విమర్శ చేసిన సందర్భాలలో నాటిక, నవలా ప్రక్రియల పరామర్శ చేశారు సంపత్కుమార. సర్వసాధారణంగా నవలకు, నాటకానికి మధ్యగల సామ్యభేధాలను సంపత్కుమార విశదీకరించారు.

– “మౌలికంగానూ, స్వాభావికంగానూ, ప్రయోజనపరంగానూ ఇవి విభిన్న ప్రక్రియలు. ఒకటి శ్రవ్యము, రెండవది దృశ్యము. నవల కథన ప్రధానమైనది. నాటకము సంభాషణ ప్రధానమైనది.”

– “నవలలో సంభాషణలుండవచ్చును గానీ నాటకంలో కవి కథనం ఉండదు. నవలలో నాటకీయతకు స్థానం ఉండవచ్చును గాని, నాటకంలో నవలా లక్షణానికి చోటు లేదు.”

– “ఇతివృత్తము, పరిమితి నవల, నాటకాలను పూర్తిగా వేరు చేస్తాయి.”

– “నవలకు, కావ్యానికి రూపంలో తప్ప వేరొక భేదం లేదు.”

– “నాటకంలో తప్పనిసరైన స్థల, కాల, ఇతివృత్త, ఐక్య సంపుటి నవలా ప్రక్రియలో అంత నియతమైనది కాదు.”

ఇలా ఈ ప్రక్రియల సామాన్య లక్షణాలు పునశ్చరణ చేశారు సంపత్కుమార. నవలకు, కావ్యానికి రూపంలో తప్ప వేరొక భేదం లేదన్నది స్థూలదృష్టితో అంగీకరించవలసిందే కానీ, సూక్ష్మదృష్టికి నిలిచే ప్రమాణము కాదు. నాటకం రచన, ప్రదర్శనల కాలం నాటి ప్రేక్షకుల మనోభావాల కనుకూలంగా ఉండాలన్న అభిప్రాయం కూడా చర్చించదగినది. నాటకంలో నావలీకత ఉండకూడదని గురజాడ కన్యాశుల్కాన్ని లక్ష్యం చేసుకుని సంపత్కుమార అన్నారు. గురజాడ సాధించదలిచిన నూతన సంవిధానం పట్ల సానుభూతిని, సహమతిని కలిగి వుంటే సంపత్కుమార సత్యసన్నిహితమైన తన విమర్శనాంశాన్ని ఇంకొక రీతిగా ప్రకటించగలిగి ఉండేవారు.

నాటకంలో పద్యరచన అవసరమా? కాదా? అనే అంశానికి సంబంధించి సంపత్కుమారకు పూర్వం ఆసక్తికరమైన చర్చలు, విమర్శలు జరిగాయి. విమర్శకుడుగా సంపత్కుమార ఈ విషయంలో చక్కటి సూచనలు చేశారు. పద్య కావ్యాలలోని పద్య ప్రయోగ రీతికీ, నాటకంలోని ప్రయోగ రీతికీ గల భేదాన్ని వారు క్లుప్తంగా సూచించారు. సంవాదరూపమైన వచనానికి మించి భావవ్యక్తీకరణ చేయవలసిన అవసరమున్నప్పుడు మాత్రమే పద్యం యొక్క అవసరం నాటకంలో కలుగుతుంది. అది కూడా ప్రధానపాత్రల విషయంలోనే అనుకూలంగా ఉంటుందన్నారు సంపత్కుమార. సంస్కృత నాటకాలలో పూర్వరంగంలోనే కాక ప్రవేశిక-విష్కంభకాదుల లోను, క్వాచిత్కంగా అంకంలోనూ కూడా అప్రధాన పాత్రలు సైతం అరుదుగానైనా శ్లోకపఠనం చేయటం పరిపాటి. నాటకకారుడు తన పద్యరచనా శక్తిని వ్యక్తం చేయడానికి కాక, పాత్రగత శీలప్రవృత్తులకు అనుగుణమైన రీతిలో ఔచిత్యబంధురంగా పద్యరచన చేయాలన్న ఆయన సూచన మేల్తరమైనది.

సంపత్కుమార సంస్కృతాంధ్రాంగ్ల హిందీ భాషలలో విశేషమైన పాండిత్యం గలవారు. ఆ కారణంగా తగిన సందర్భాల్లో ఆయన సముచితమైన తులనాత్మక విమర్శకు తలపడేవారు. రామాయణ కల్పవృక్షం ఆయన ప్రధాన కర్మక్షేత్రం. ఆ కారణంగా కల్పవృక్షాన్ని వాల్మీకి రామాయణంతోనూ, కంబరామాయణంతోనూ, రామచరితమానసంతోనూ, తెలుగులోని ఇతర రామాయణాలతోనూ తులనాత్మకంగా అధ్యయనం చేసి తగుపాటి విమర్శ చేశారు. ఆ విమర్శలో తేలిన అంశాలివి;

– “వాల్మీకంలో ఉన్న తార్కికబుద్ధి ఇతర రామాయణాలలో పూర్తిగా లోపించిందనే చెప్పవచ్చు.”

– “కంబరామాయణంలో విశిష్టాద్వైత నిబంధనంతో పాటు వర్ణనా ప్రాచుర్యం కనిపిస్తుంది.”

– “రామ పరబ్రహ్మత్వాన్ని స్థాపించడం లక్ష్యంగా తులసీదాసు రామచరితమానసాన్ని రాశాడు. ఇది శంకర, రామానుజ మతాలకు మధ్యేమార్గంగా సాగిన రచన.”

– “విశ్వనాథ అద్వైత సిద్ధాంత ప్రవచనం కోసం రామాయణ కల్పవృక్షాన్ని రాశాడు.”

ఇలా సాగిన పరిశీలన ఫలితంగా సంపత్కుమార విశ్వనాథ రామాయణ కల్పవృక్షం సర్వపూర్వ రామాయణాతిశాయిగా ఉందనే నిర్ణయానికి వచ్చారు. భారతీయ భాషలలోని రామాయణాలను తులనాత్మకంగా అధ్యయనం చేసిన విమర్శకులు సమర్ధించిన పక్షంలో ఈ నిర్ణయం ఇంకా రాణకు వస్తుంది.

అయితే, తెలుగు సాహిత్య విమర్శలో తులనాత్మక శాఖకు ప్రారంభకుడు సంపత్కుమార అని నిర్ణయానికి వచ్చేముందు మరికొంత పూర్వాపర విషయ సమాకలనం అవసర మనిపించక మానదు. కన్యాశుల్కం తొలి-మలి కూర్పుల విమర్శనం తులనాత్మక విమర్శ కాబోదు. తొలి రచన అసమగ్రమైనది. గురజాడ దానిని బుద్ధిపూర్వకంగా వదులుకున్నాడు. రచయిత వదిలిపెట్టిన రచనను విమర్శించడం యుక్తిసహం కాదు. గురజాడ విషయంలో సంపత్కుమారకు, నాకు షష్ఠాష్టకం. ‘కన్యాశుల్కం – మరోవైపు’ అనే పుస్తకంలో లొసుగులు నిర్ణయించడంలో సంపత్కుమార చూపిన ఉపపత్తులు తిరుగులేనివి – అన్న విమర్శకమిత్రుని అభిప్రాయంతో నేను స్పష్టంగా విభేదిస్తున్నాను. సంపత్కుమార ఆక్షేపణలకు, విలోమవిమర్శకు, ‘కన్యాశుల్కం – 17వ శతాబ్ద ఆధునిక భారతీయ నాటకము’ లన్న నా పుస్తకంలో తగిన పరిష్కారాలు చూపించడానికి ప్రయత్నించాను. విశ్వనాథ కారణంగా మేమిద్దరమూ ఏకమయ్యాము. గురజాడ కారణంగా మేమిద్దరమూ విడిపోలేదు. మరింత సన్నిహితులమయాము. ఇందుకు నాకు వారి పట్ల గల అత్యంత విధేయతే గాక ఆయన ఆదర-సంస్కారాలు కూడా కారణమని భావిస్తున్నాను.

వివిధ విమర్శ రీతుల అధ్యయనంతో పాటు తనకు ముందున్న నూటముప్ఫైనాలుగు సంవత్సరాల తెలుగు సాహిత్య విమర్శ చరిత్రను, అందులోనూ తొలి-మలి తరాల విమర్శ ధోరణులను మదింపు చేయడానికి సంపత్కుమార కృషిచేశారు. వీరేశలింగాన్ని తెలుగు విమర్శకు మొదటి కొండగుర్తుగా అంగీకరిస్తూ, అంతకుముందు విమర్శ రూపంలో కనిపించే అంశాలను కూడా సంపత్కుమార పరిగణన లోనికి తీసుకున్నారు. ఐదుతరాల తెలుగు సాహిత్య విమర్శకులలో పూర్వతరాల కన్నా ఉత్తరోత్తరతరాలు సంకీర్ణంగాను, సంక్లిష్టంగాను ఉండడం కూడా ఒక సహజమైన అంశంగా సంపత్కుమార తలచారు. అధ్యయన విధానాలనేవి ఆయా దేశాల సంస్కృతుల, భాషారీతుల వంటి వాటిని బట్టి భిన్నంగా ఉంటాయనే సంపత్కుమార అభిప్రాయానికి ‘ఆయా విమర్శకుల దృష్టికోణాన్ని బట్టి కూడా’ అని జతచేయవలసి ఉంటుంది. తొలితరం విమర్శకులు పాశ్చాత్య విమర్శ ప్రమాణాలనే అనుసరించారని సంపత్కుమార తెలిపారు.

ఆధునిక విమర్శకు పాశ్చాత్య సాహిత్య విమర్శ సూత్రాలు ప్రమాణాలని భావించిన పక్షంలో కందుకూరి విమర్శ ఆధునికకాలంలో వచ్చిన విమర్శనమే కానీ ఆధునిక విమర్శ మాత్రం కాదు. దక్షిణామూర్తి, వెన్నేటి రామచంద్రరావు, బుఱ్ఱా శేషగిరిరావు, కట్టమంచి రామలింగారెడ్డి వంటి వారు పాశ్చాత్య విమర్శ ధోరణి ననుసరించిన వర్గానికి; కాశీభట్ల బ్రహ్మయ్యశాస్త్రి, వింజమూరి రంగాచార్యులు, పనప్పాకం సుబ్రహ్మణ్య అయ్యరు వంటి వారు దేశీయ విమర్శ ధోరణి ననుసరించిన వర్గానికి ప్రాతినిధ్యం వహించిన ఆధునిక విమర్శకులుగా సంపత్కుమార సోపపత్తికంగా నిరూపణ చేశారు. “శాస్త్రిగారి కాలం నాటికే మన ప్రాచీన కావ్యాల్లోని వర్ణనా విధానం, అలంకార విధానం ఆంగ్లేయవిమర్శ విధాన ప్రభావం ద్వారా అప్రతిష్ట పాలయింది” – అన్న వాక్యం సంపత్కుమార దేశీయమైన విమర్శమార్గం పట్ల మొగ్గు చూపించినట్లు స్పష్టం చేస్తుంది.

1915లో కురుగంటి సీతారామయ్యగారి ‘అలంకారతత్త్వ విచారం’ వెలువడడంతో తెలుగు విమర్శలో మలితరం మొదలయిందని సంపత్కుమార భావించారు. తొలితరం భిన్నసంప్రదాయాల మధ్య సమన్వయసాధనకు కృషి చేస్తే మలితరం సంఘర్షణపథంలో పడి సంప్రదాయ విఛ్ఛేదానికి పూనుకుందని అంటూ సంపత్కుమార ఆ తరానికి చెందిన సామాన్య విమర్శరీతిని వివరించారు. వ్యాకరణాలంకారాదులను గూర్చి పాఠపరిష్కరణాదులకు సంబంధించి మానవల్లి, వేటూరి, వజ్ఝల, టేకుమళ్ళ రాజగోపాలరావు వంటివారు ఈ తరం విమర్శకుల సామాన్య లక్షణాలకు భిన్నమైన రీతిలో తమ విమర్శను కొనసాగించిన వైనాన్ని సంపత్కుమార విశదం చేశారు. తన తరంలో బలపడుతూన్న సంప్రదాయ విఛ్ఛేద ప్రవాహానికి ఎదురీది అడ్డుకట్ట వేయడానికి అవిఛ్ఛిన్న సంప్రదాయార్థిగా విశ్వనాథ ఆధునిక తెలుగుసాహిత్య విమర్శలోకంలో అవతరించారని సంపత్కుమార విశ్వసించారు.

1949-50 మధ్య విశ్వనాథ కవిత్వంతో పరిచయమైనది లగాయతు తుదిశ్వాస విడిచే పర్యంతం సంపత్కుమార తన సర్వప్రయత్నాలను విశ్వనాథ సాహిత్య ప్రచారం కోసం, సాహిత్య విమర్శ వ్యాప్తి కోసం మీదుకట్టి ఉంచారు. ‘కుడి ఎడమల డాల్‌ కత్తులు మెరయగ’ అన్నట్లుగా ఒకవంక ఆచార్య సుప్రసన్న, ఇంకొకవంక ఆచార్య కేతవరపు రామకోటిశాస్త్రి బాసటగా నిలువగా కాకతీయ విశ్వవిద్యాలయాన్ని విశ్వనాథ కంచుకోటగా మార్చారు సంపత్కుమార. ఉస్మానియా, కేంద్రీయ, కాకతీయ విశ్వవిద్యాలయాలలో చిరకాలంగా, బహుముఖీనంగా విశ్వనాథ సాహిత్య సంబంధమైన పరిశోధన కృషి జరగడానికి సంపత్కుమార స్ఫూర్తిదాయకులయారు. ‘సంపత్కుమారే విశ్వనాథకు ఒక వ్యాఖ్యానం’ అని భావించిన విమర్శక మిత్రులున్నారు. “కవిత్వమన్న పవిత్రాగ్నిలో నుండి ఆయన పుట్టినాడు. కల్పవృక్షంలో నన్నయగారి నుండి సాగివస్తున్న ఉత్తమకవితా సంప్రదాయాలన్నీ పరిస్ఫుటంగా ప్రత్యక్షమవుతాయి. కవిత్వమంటే సుకుమారమైన పదాలను ప్రోగుచేయడం, ధారాళంగా పద్యాన్ని నడిపించడం, ఎక్కడికక్కడ పద్యం విచ్చుకొని పోవడం ఇత్యాదులే అనే అభిప్రాయాలున్న సాహిత్యరంగంలో సత్యనారాయణగారు ఒక విధంగా విప్లవాన్ని తీసుకు వచ్చారు” – అన్నది సంపత్కుమార వ్యాఖ్యాన సారాంశం.

విశ్వనాథ సాహిత్యాన్ని గూర్చి, సాహిత్యవిమర్శను గూర్చి అనేక విషయాలను సంపత్కుమార ఆవిష్కరించారు. అద్వైతభావనాబంధురమైన విశ్వనాథ జీవుని వేదనను భారతీయాలంకార మహాధ్వంలో ఒక విశిష్ట ప్రస్థానంగా ప్రతిష్ఠించడానికి సంపత్కుమార చేసిన ప్రయత్నం ఆ ఆవిష్కరణకు శిఖరప్రాయమైనది. విశ్వనాథను మహాకవిగా, రామాయణ కల్పవృక్షాన్ని మహాకావ్యంగా నిరూపించే ప్రయత్నంలో ఆయన రాసిన వాక్యాలిలా ఉన్నాయి – “జీవుని వేదన సర్వకావ్య సమాజానికీ బీజభూతమైన అంశం. ఈ వేదనయొక్క జ్వలనశీలంలోని తీవ్రతయొక్క తరతమ భేదాలను బట్టి కావ్యపరంపరలోనూ తారతమ్యం అనంతంగా వస్తుంది. నిత్య ప్రజ్వలనశీలం ఈ వేదన తీవ్రతాస్థాయికి చేరినప్పుడు మహాకావ్యం అవతరిస్తుంది. మహాకవి మనకు దర్శనమిస్తాడు.” ఈ విషయమంతా అటు సాహిత్యనిర్మాణంలోను, ఇటు సాహిత్యవిమర్శలోను విశ్వనాథ వెలయించిన అప్రతిహత వైఖరిని స్థాపించేదిగా కనిపిస్తుంది.

రససముద్రగంభీరుడైన విశ్వనాథ సాంప్రదాయిక రసమార్గ నిర్వహణతో బాటు అందులో ఆధునికమైన పోకడలు పోయిన విధాలు కూడా సంపత్కుమార తన ‘నర్తనశాల’ నాటక విమర్శలో వెల్లడించారు. సుదీర్ఘ రసచర్చ కొనసాగించిన అనంతరం “నర్తనశాలలో కీచకుని నాయకత్వం పాశ్చాత్యదేశీయ విషాదాంత నాటకాల నాయకుడి నాయకత్వం వంటిది. విషాదాంత నాటకాలలో సాధారణంగా రసం – ఆ దృష్టి ఉంటే అభాసంగానే ఉంటుందనవచ్చు. ప్రాచ్యనాటకాలు సాధారణంగా విషాదాంతాలు కాకపోవటానికి ప్రధానహేతువు అవి రసభాసానికి కాక రసానికి అంగిత్వం నిర్వహించటమే కావచ్చు. అయితే రసాభాసం ఉన్నచోటనల్లా విషాదాంతత్వం ఉంటుందనటానికి వీలులేదు. ప్రహసనాదులు ఇందుకు అడ్డు తగులుతాయి” అని తీర్మానించారు. విశ్వనాథ ఎంత సాంప్రదాయికుడో అంత ఆధునికుడు అని సమకాలికులకు విశదం చేసే ప్రయత్నం ఇక్కడ కనిపిస్తుంది. కీచకమంటే వెదురని, దానికి మృదుత్వం లేకపోయినా దానిలోంచి పుట్టిన నిస్వనం మృదువు, మధురం కూడా – అంటూ కీచకపాత్ర స్వభావాన్ని విశదం చేసిన సంపత్కుమార వ్యాఖ్యానశైలిని అనుగమించిన వారికి విశ్వనాథశీలంలో కనుపించే ఒక పెళుసుతనంతో పాటు అంతర్నిహితమైన మృదుత్వం, మాధుర్యం కూడా నిండి ఉన్నాయని స్ఫురింపజేయడమే సంపత్కుమార లక్ష్యం. అది నిరూపించడానికే విశ్వనాథను గూర్చి వారనేక గ్రంథాలు రాశారు. ఆ గ్రంథరచన అంతా ఒక ఎత్తు, విశ్వనాథ సాహిత్య పరిశోధకులకు, విమర్శకులకు దుర్లభంగా ఉన్న విశ్వనాథ అసంకలిత సాహిత్యాన్ని తన స్వంతఖర్చుతో ఆరు సంపుటాలుగా ప్రకటించడం ఇంకొక ఎత్తు. నిస్వార్థబుద్ధితో, కేవలం సాహిత్య పక్షపాతంతో సమకాలీనుడైన సాహితీవిరాట్పురుషుని ఇంతగా సేవించిన వారెవరున్నారు? ఒక్క సంపత్కుమార తప్ప.

దేశీయత సంపత్కుమార జీవనశైలి. ఆయన జీవనశైలి, విమర్శశైలి ఒక్కటే. అది నూతనపథప్రవర్తకము, నిరాడంబరము, సంస్కారభూషితము, పరిణామరమణీయము. ఈ విశిష్ట లక్షణాలను పురస్కరించుకొని తెలుగు విశ్వవిద్యాలయంవారు తమ విజ్ఞానసర్వస్వ నిర్మాణంలో భాగంగా వెలువడనున్న విమర్శసంపుటానికి సంపత్కుమారను ప్రధానసంపాదకునిగా ఎన్నుకొని తమ గౌరవాన్ని పెంచుకున్నారు. ఆయన నిర్వహణలో బహువిషయ వ్యాపృతమైన ఆ విమర్శసంపుట నిర్మాణం పురోగమనపథంలో ఉంది. నాపై గల ఆదరభావం కారణంగా రెండు విడతలలో పదిహేను అంశాలను గూర్చిన వ్యాసాలను రాయవలసినదిగా వారు నన్ను నియోగించారు. ఆయా రంగాలలో నిష్ణాతులైన వారెందరినో వ్యాసాలు రాయవలసినదిగా ప్రోత్సహించి ఆ విమర్శసంపుటాన్ని సర్వాంగసుందరంగా తీర్చిదిద్దాలని చివరిక్షణం వరకు కృషిచేస్తూనే వచ్చారు. వారి జీవితకాలంలో ఆ సంపుటం వెలువడి ఉంటే ఆయనకు ఎంతో తృప్తి కలిగి ఉండేది.

ఆయన అముద్రిత రచనలలో సాహిత్యవిమర్శకు సంబంధించిన రచనలు ఇంకా మిగిలి ఉన్నాయని వారి సన్నిహితులు చెప్తున్నారు. ఆయన రాసిన లేఖలలో, పీఠికలలో విలువైన సాహిత్యవిమర్శ కనిపిస్తుంది. ఈ అన్నింటిని సేకరించి ప్రచురించడం తెలుగు సాహిత్యవిమర్శను అధ్యయనం చేయగోరేవారికి ఎంతో అవసరం. ఇప్పటికే విస్తరించిన ఈ నా వ్యాసంలో సంపత్కుమార సాహిత్యవిమర్శ మార్గాన్ని దిఙ్మాత్రంగా మాత్రమే చూపగలిగాను. దాని సమగ్రస్వరూపం తెలియాలంటే విస్తృత అధ్యయనశీలము, సాధికారప్రవృత్తి కలిగి ఉండి దేశీయతకు నిబద్ధమైన సంపత్కుమార విమర్శసంస్కారంతో సహమతి కలిగిఉన్న యువవిమర్శకులు అందుకు పూనుకొనవలసి ఉంటుంది. సంపత్కుమార కేవలం తన అభిరుచి మార్గాన్ననుసరించి విమర్శ చేయడం మాత్రమే కాక అంతకు మించి గురుతరమైన సామాజిక బాధ్యతను నిర్వహించే లక్ష్యంతో, ఒక నూత్న సంస్కారంతో తన కృషిని కొనసాగించారు. యువవిమర్శకులు ఆయన నుండి ఆ బాధ్యతను, ఆ సంస్కారాన్ని వినీతచిత్తంతో స్వీకరించి సాహితీకృషిని కొనసాగించవలసి ఉంది.


[డా. ఉపాధ్యాయుల అప్పల నరసింహమూర్తి తెలుగుశాఖాధ్యక్షులుగా విజయనగరం మహారాజ కళాశాలలో పనిచేసి పదవీ విరమణ చేశారు. చర్వణ, విశ్వనాథ సౌందర్య దర్శనము, కన్యాశుల్కం – ఆధునిక భారతీయ నాటకములు, ఔచిత్య ప్రస్థానము – సూరన కవిత్వము, నన్నెచోడుని కుమార సంభవము, కథాశిల్పి చాసో (2003లో తెలుగు విశ్వవిద్యాలయం వారి ఉత్తమ విమర్శన గ్రంథ పురస్కారం పొందినది), రాయప్రోలు సుబ్బారావు, శ్రీరంగం నారాయణబాబుల కవితా విమర్శ వీరు రచించిన కొన్ని గ్రంథాలు. ఈ వ్యాసం ప్రథమంగా నవంబర్ 2010 జయంతి పత్రికలో ప్రచురించబడింది. ఈమాట వ్యాస పరిష్కరణ నియమాలను గౌరవిస్తూ, ఈ సంచికలో ప్రత్యేకంగా పునర్ముద్రణకి అనుమతి ఇచ్చినందుకు వారికి; ఈ వ్యాసాన్ని మాకందించి, కూర్పులో ఎంతో సహాయపడిన భైరవభట్ల కామేశ్వరరావుగారికి మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. – సం.]