4. వచన పద్యం పద్యమే

వచన పద్యం యొక్క ఛందస్త్వాన్ని గూర్చి ప్రస్తుతం సాగుతున్న చర్చలో చేకూరి రామారావూ, నేనూ విభేదిస్తున్న అంశం ప్రధానంగా వచన పద్యం యొక్క పాదబద్ధత. వచన పద్యం ‘పద్యం’ కావటానికీ, గద్యం కాకపోవటానికీ నేను ప్రతిపాదించిన అంశాల్లోనూ, రామారావు నిరాకరిస్తున్న అంశాల్లోనూ – ఆయనే అన్నట్లుగా, “… వచన పద్యానికి ప్రతిపాదించిన పాదబద్ధత అనేది కేవలం ఒక అంశం మాత్రమే కాక చాలా కీలకమైనది” కూడా. అందుకే వచన పద్యాన్ని ‘పద్య’ మంటున్న నేనూ, ‘గద్య’ మంటున్న రామారావూ ఆ పాదబద్ధతను గూర్చే విశేషంగా చర్చించటం. అయితే, ఈ పాదబద్ధతను గూర్చి మళ్ళీ వివరించి, రామారావు నన్ను నిగ్గదీసిన అంశాలను పరిశీలించటానికి, కొన్ని అంశాల విషయంలో నాపై మోపిన బాధ్యతను నిర్వర్తించటానికి ముందు ‘పాదం’ యొక్క ‘అంతర్నిర్మాణం’ గూర్చి ఆయన చెప్పిన అంశాలను పరిశీలిస్తాను.

అసలు, పద్యం అనగానే ఆ పద్యపాదానికి అంతర్నిర్మాణమూ, బాహ్యపరిమితీ ఉండాలని రామారావు వాదం. ఆయన తన మొదటి వ్యాసంలోనే ప్రస్తావించిన ఈ రెండంశాల్లో బాహ్య పరిమితి విషయం అట్లా ఉండగా, అంతర్నిర్మాణం గూర్చి నా వ్యాసం (జులై 72) లో కొంత వివరించి ‘…గణాల దృష్ట్యా పాదానికి అంతర్నిర్మాణమంటూ ఏదీ ఉండదు’ అని తేల్చి చెప్పటం జరిగింది. ఇక్కడ ‘గణాల దృష్ట్యా’ అనటానికి కారణం రామారావు తన మొదటి వ్యాసంలో – ‘పాదం అక్షరసముదాయం కాదు. గణసముదాయం. అంటే, పాదానికి అంతర్నిర్మాణముందన్నమాట’ – అని గణాల దృష్ట్యా ఈ అంతర్నిర్మాణాన్ని ప్రతిపాదించటం. అయితే, రామారావు తన రెండవ వ్యాసంలో మళ్ళీ ఆ అంతర్నిర్మాణాన్ని గూర్చి విస్తారంగా రాసి ‘గణాల దృష్ట్యా పాదానికి అంతర్నిర్మాణమంటూ ఏమీ ఉండదు, అన్న సంపత్కుమార వాక్యం కేవలం వృత్తాలకు మాత్రమే అన్వయిస్తుంది’ అన్నారు. అంటే వృత్తాలకు సంబంధించినంతవరకు రామారావు నాతో ఏకీభవిస్తున్నారన్నమాట. కాగా, ‘జాతులకు, మాత్రాపద్యాలకు ఇది (గణనిర్మాణం) అవసరమని’ అంటున్నారాయన. కాని, వీటిక్కూడా అవసరం లేదు. అదే వివరిస్తాను.

రామారావు వివరించిన రీతినిబట్టి ‘అంతర్నిర్మాణం’ అంటే, ఒక పద్యపాదానికి విహితమయిన గణాలను, విహితమైన సంఖ్యతో, విహితమైన క్రమంలో కూర్చటం. అంటే, ఉదాహరణకు – గీత పాదానికి సూర్య-ఇంద్ర గణాలే ఉండటం, అవి కూడా సూర్యగణాలు మూడు, ఇంద్రగణాలు రెండు మాత్రమే ఉండటం, అవి కూడా 1సూ.+2ఇం.+2సూ. అన్న క్రమంలో కూర్చబడటం. ఇది గీతపాదపు అంతర్నిర్మాణమన్నమాట. మరి వృత్తాల విషయంలోనూ ఇంతే గదా! భ-ర-న-భ-భ-ర-లగ అన్న గణాలను (భగణాలు 3, రగణాలు 2, నగణం 1, లగం 1) ఆ క్రమంలో కూర్చటం ఉత్పలమాలా పద్యపాదపు ‘అంతర్నిర్మాణ’ మన్నమాట గదా! (వృత్తాలకు గణనిర్మాణం అక్కర లేదనటం తరువాతి మాట. ఉంటే, ఇంతే మరి!) కాని, గణపద్ధతి రాక పూర్వం ఉత్పలమాలా పద్యరచన సాగటం, దానికి అక్షరాల సాయంతో లక్షణం చెప్పటం (ఇక్కడ ఉత్పలమాల వృత్తాలన్నిటికీ ఉపలక్షకం) జరిగింది. భరతాదుల పద్ధతి ఇదే. కాగా, ఆనాడది గణ సముదాయం కాదు, అక్షర సముదాయమే. (ఈ అంశం నా జులై 72 వ్యాసంలో వివరించబడింది.) మరి, ఈ పద్ధతుల్లో జాతులకు లక్షణాలు చెప్పటం కుదురదా? కుదురదని రామారావు అభిప్రాయం. ఎందుకంటే, వృత్తాల్లోని పాదాలన్నిటిలోనూ (విషమ వృత్తాల్లో తప్ప) అక్షర సంఖ్య, గురు లఘు క్రమమూ సమంగా ఉంటుంది కాని,, జాత్యాదుల్లో ఉండటం నియతం కాదు. అందువల్ల – ‘జాతుల్లో పాదాల అంతర్నిర్మాణాన్ని, బాహ్య పరిమితిని అక్షరాల సాయంతో, ఏకైక పద్ధతిలో చెప్పలేము కాబట్టి, సూర్యేంద్ర చంద్రగణాలు జాతుల అంతర్నిర్మాణం’ … లక్షణం చెప్పటానికి తప్పని సరి. – ఇది రామారావు వాదం.

మరి, జాతుల్లో ఉపయోగానికని చెప్పబడుతున్న గణాల పరిస్థితి చూద్దాం. ఈ చెప్పబడుతున్నవి సూర్య-ఇంద్ర-చంద్ర గణాలు. వీటిని ‘మాత్రా గణాలు’ అంటారు. అంటే, వీటిలో గురు లఘు క్రమం నియతం కాదు. సూర్య-ఇంద్ర-చంద్ర అన్నవి మూడు గణ వర్గాలు. ఈ వర్గాల్లో వరుసగా 2-6-14 గణాలుంటయి. అయితే, ఆయా వర్గాల్లోని ఆయా గణాలన్నీ సమం కావు. ఉదాహరణకు ఇంద్రగణాలారింటిలో రెండు (నల, భ) చతుర్మాత్రా గణాలు కాగా, నాలుగు (నగ, సల, ర, త) పంచమాత్రాగణాలు. అట్లాగే, మూడు (భ, ర, త) మూడేసి అక్షరాల గణాలు కాగా, మిగిలిన మూడు (నగ, సల, నల) నాలుగేసి అక్షరాల గణాలు. అంటే, ఈ ఆరింటికీ మాత్రాసంఖ్యలో కానీ, అక్షరసంఖ్యలో గానీ సమత్వం లేదన్నమాట. మిగిలిన వర్గాల స్థితికూడా దీనికి భిన్నమేమీ కాదు.

మరి, ఈ గణాల స్వరూపస్వభావాల్ని బట్టి చూస్తే ఈ అసమగణాల కూర్పుతో అంతర్నిర్మాణం కలిగించుకొంటాయని చెప్పబడుతున్న ఈ పద్యాల ‘గతి’ ఏమిటో దురూహ్యం. ఎందుకంటే, ఉదాహరణకు గీతపాదంలో త్ర్యస్య, చతురస్ర, ఖండ గతులకు చెందిన మాత్రాగణాల కలగలుపు నిర్దేశింపబడింది. ఇదయినా ఒక వరుసలో గాక ఆద్యంతాల్లో త్ర్యస్రగతి (సూర్య) గణాలు, మధ్యలో చతురస్ర, ఖండగతి (ఇంద్రగణాల్లో రెండు గతుల గణాలు కలిసి ఉన్నయిగదా) గణాలు. కాగా, వీటిలో గతి గాని, లయ గాని నిర్దేశింపబడలేదని చెప్పవలసి ఉంటుంది. మరి ఈ నిర్దేశం లేనప్పుడు – (ఉన్నప్పుడు గణాల అవసరం గురించి రామారావు మాత్రా పద్యాల సందర్భంలో చెప్పినారు. అక్కడ ఆ విషయం పరిశీలిస్తాను. కాని, ఈ స్థితిలో) – ఈ గణాల ప్రయోజనమేమిటి? ఏమిటంటే – రామారావు మాటల్లో ‘అంతర్నిర్మాణ, బాహ్య పరిమితుల’ను ‘ఏకైక పద్ధతి’లో చెప్పటం మాత్రమే. మరి అంతర్నిర్మాణమంటే ఈ గణాల కూర్పే కదా! కాని, ఆ గణాల స్థితి అట్లా ఉంది. ఆలోచిస్తే, లక్షణ కథనంలోని సౌలభ్యం కోసం ఈ ‘గణ పద్ధతి’ అని స్పష్టమయితుంది. అయితే, ఈ గణాల సాయం లేకుండా లక్షణం చెప్పటానికి వీలయితే, అప్పుడీ గణాల ద్వారా అంతర్నిర్మాణం ప్రసక్తి ఉండదు గదా! గణసహాయ విరహితంగా లక్షణం చెప్పవచ్చు ననటానికి ఉదాహరణగా గీత పద్యానికి చూపిస్తున్నాను.

గీత పద్యపాదంలో 17 నుండి 19 దాకా మాత్రా సంఖ్య ఉంటుంది. అంటే, 17, 18, 19 మాత్రల సంఖ్యలతో ప్రస్తుతం ప్రచారంలో ఉన్న గీతపాదాలు మూడు విధాలుగా రూపొందుతాయన్నమాట. పాదానికుండే మూడు సూర్యగణాల మాత్రా సంఖ్య 3*3 = 9. రెండింద్ర గణాల మాత్రా సంఖ్య 4+4=8, లేదా 4+5=9, లేదా 5+5=10. ఈ మూడు విధాలు కావటానికి ఇంద్రగణాల మాత్రా సంఖ్యలోని వైవిధ్యం కారణం. (4+5కు బదులుగా 5+4గా కూడా ఉండవచ్చు.) ఈ కారణంగా గీతపాదాలు మూడు రకాల మాత్రా సంఖ్యలతో రూపొందుతున్నాయి. 18మాత్రల సంఖ్యతో ఏర్పడే గీతపాదం రెండు రకాలుగా ఉంటుంది. దీనికి కారణం – ఇందులోని ఇంద్ర గణాలు 4+5గా లేదా 5+4గా ఉండే వీలుండటం. కాగా మొత్తం నాల్గు రకాల గీత పాదాలు ఏర్పడుతున్నయి. అవి ఇట్లా ఉంటయి.

1వ విధం పాదం: 11+6 = 17 మాత్రలు
2వ విధం పాదం: 13+6 = 19 మాత్రలు
3వ విధం పాదం: 12+6 = 18మాత్రలు
4వ విధం పాదం: 12+6 = 18మాత్రలు

(11+6 అంటే 11వ మాత్ర తరువాత యతి చెల్లించవలసి ఉంటుందని. మరొకటి, 11వ మాత్ర దాని తరువాతి – అంటే 12వ మాత్రతో కలిసి గురువు కారాదు. 13+6, 12+6 అన్నప్పుడు గూడా ఇంతే.)

ఈ నాలుగు పాదాలకూ సామాన్య లక్షణాలు: i. పాదం ఎప్పుడూ గుర్వంతం కాకూడదు. ii. ఏ పాదంలోనూ 2+3, 3+4, 5+6 – ఈ మాత్రలు కలిసి గురువు కారాదు.

నాలుగు రకాల పాదాలకూ వాటి వాటి ప్రత్యేక లక్షణాలు:

1వ విధం పాదం: i. 7+8, 9+10, 13+14, 14+15 – ఈ మాత్రలు కలిసి గురువు కారాదు. ii. రెండు గురువులు వరుసగా ఉండగూడదు.

2వ విధం పాదం: i. 8+9, 10+11, 15+16, 16+17 – ఈమాత్రలు కలిసి గురువు కారాదు. ii. 4+5 కానీ 9+10 కానీ కలసి గురువయితే దాని తరువాత వరుసగా మూడు లఘువులుండరాదు. iii. నాలుగవ మాత్రనుంచి పదమూడు మాత్రలదాకా వరుసగా ఐదు లఘువులుండరాదు.

3వ విధం పాదం: i. 7+8, 9+10, 14+15, 15+16 ఈ మాత్రలు కలిసి గురువు కారాదు. ii. ఒకటో మాత్రనుంచి ఏడు మాత్రలదాకా ఎక్కడా రెండు గురువులుండరాదు.

4వ విధం పాదం: i. 8+9, 10+11, 14+15, 15+16 – ఈ మాత్రలు కలిసి గురువు కారాదు. ii. 9+10 కలిసి గురువయితే, 11+12 కలిసి గురువు కారాదు.

మాత్రల కలయిక నిషేధం కానిచోట్ల ఏ రెండేసి మాత్రలయినా కలిసి గురువు కావచ్చు,కాకపోనూ వచ్చు.

ఇది ఒక్కొక్క పాదం లక్షణమే. ఇట్లాంటివి ఒక్కొక్క విధం పాదాలు కలిసి ఒక పద్యం. అయితే, వ్యవహారంలో ఉన్న గీతపద్యాలిట్లా ఉండటం లేదు. ఈ నాల్గింటి, లేదా కొన్ని పాదాల కలగలుపుగా ఉంటున్నయి. ఈ విధమయిన కలగలుపు – మిశ్రరూపాన్ని గీతపద్యం అంటూ, కలగలుపు కానట్టి అమిశ్రరూపాలు నాలిగింటికి విడివిడిగా గుర్తింపు కోసం నాలుగు పేర్లు సంకేతించితే స్పష్టత నిష్పన్నమయితుంది. సుగీత, సంగీత.. ఇత్యాదిగానో మరో విధంగానో ఆ పేర్లు ఉండవచ్చు. కలగలుపు రూపానికి గీతమన్న పేరు ఉండనే ఉందిగదా! ఈ మిశ్ర+అమిశ్ర రూపాలు అయిదింటినీ కలిపి గీతవర్గం అనవచ్చు. అట్లాగే ఆటవెలది వర్గం, సీస వర్గం నిష్పన్నమయితయి. మిశ్రరూపాల పాదాలు కలగలుపు విధాలను గూడా పరిగణించితే, ఆయా వర్గాల్లోని పద్యాల సంఖ్య ఇంకా పెరుగుతుంది. వైవిధ్యం అధికమయితుంది.

పైన గీత విషయంలో నాలుగు విధాలకూ లక్షణం ఒకేచోట చెప్పటం వల్ల లక్షణం దీర్ఘంగా ఉన్నట్టు భాసించవచ్చు. కాని, గీత వర్గ సామాన్య లక్షణాలు కాక, రెండేసి నియమాలకన్నా (ఒక్క రెండో విధానికి మాత్రం మూడు) ఏ ఒక్క విధానికి కూడా ఎక్కువ నియమాలు లేవు.

వృత్తాల్లో గురు లఘువుల్ని ప్రధానీకరించటం వల్ల (గణ ప్రసక్తి లేకుండా) వాటిని పేర్కొని (ఇన్నో అక్షరం గురువు, లేదా ఇన్నో అక్షరం లఘువు కావాల్నంటూ) భరతాదులు లక్షణం చెప్పటం జరిగిందిమరి, ఈ జాతి పద్యాల్లో మాత్రల్ని ప్రధానీకరించటం వల్ల, ఫలానా ఫలానా మాత్రలు కలసి గురువు కాకపోవటం, కావటం అన్న రీతిలో లక్షణం చెప్పటం జరిగింది.

గణసహాయం లేకుండా ఈ పద్యాలకు కూడ లక్షణం చెప్పటానికి వీలున్నదని, ఈ పద్యపాదాలు గణబద్ధాలు అవనక్కరలేదని నిరూపించటానికే పయి పద్ధతి ఇక్కడ ప్రదర్శింపబడింది. మరి ఈ పద్ధతి సరికొత్తదేమీ కాదు. వైతాళీయ పద్యాలకు పింగళుడు ఈ ధోరణిలోనే లక్షణం చెప్పటం జరిగింది. వైతాళీయ పద్యాలు ఒక వర్గం. వైతాళీయ లక్షణం చెప్పిన పద్ధతి ఇది.

1. బేసిపాదాల్లో 14 మాత్రలు, సరిపాదాల్లో 16 మాత్రలు.
2. పాదాలు గుర్వంతం కావలసి ఉంటుంది.
3. సరిపాదాల్లో సరి+బేసి కలిసి గురువు కారాదు.
4. సరిపాదాల్లో ఆరు లఘువులు వరుసగా ఉండరాదు.
5. బేసి పాదాల్లో 6 మాత్రలు, సరిపాదాల్లో 8 మాత్రల తరువాత యతి చెల్లింపు.

కొన్ని మాత్రలు కలిసి గురువు కావటం అనే అంశంలో ఆయా మాత్రల సంఖ్యలోని వ్యత్యాసాన్ని బట్టి వైతాళీయ భేదాలు కొన్ని ఏర్పడ్డయి. అట్లాగే, ఈ ఈ భేదాల పాదాల కలగలుపుతో మరికొన్ని భేదాలు. ఈ భేదాలన్నిటికి ప్రాచ్యవృత్తి, ఉదీచ్యవృత్తి, చారుహాసిని.. ఇత్యాదిగా వేరు వేరు పేర్లు. పైన నేను గీత పద్య వర్గానికి చెప్పిన లక్షణం ఈ ధోరణి లోనిదే. భ-ర-త ఇత్యాది గణాలను రూపొందించిన పింగళుడే ఈ విధంగా గణసహాయం లేకుండా వైతాళియాలకు లక్షణం చెప్పినాడు. అందువల్ల, తెలుగులోని గీతాదులకీ పద్ధతిని అనువర్తింప జేయవచ్చు. చేస్తే, ప్రస్తుత వ్యవహారంలో ఉన్న గీతాదుల్లో, మిశ్ర, అమిశ్ర రూపాలేర్పడి వైవిధ్యం అధికమయితుంది.

ఇక రామారావుగారంటున్న మాత్రా పద్యాలకు కూడా ఈ పద్ధతిని అన్వయింప జేయవచ్చు. గీతాదుల ఉపయోగానికి చెప్పబడ్డ వాటిని ‘మాత్రా గణా’లన్నట్టుగా, మాత్రా పద్యాల కుపయోగించే వాటిని ‘మాత్రాసంఖ్యా గణా’లంటారు. అంటే, మాత్రా గణాల్లోని మాత్రా సంఖ్యా వైషమ్యం మాత్రా సంఖ్యా గణాల్లో ఉండదు. 3, 4, 5, 7 మాత్రల సంఖ్యలతో ఈ గణాలు ఏర్పడుతయి. ఒకే పాదంలో ఉండే గణాలన్నీ సమమాత్రా సంఖ్యతో ఉంటయి. ఉదాహరణకు, మధురగతి రగడలో ఒక్కొక్క పాదంలో నాలుగేసి చతుర్మాత్రా గణాలుంటాయి. నాలుగు మాత్రలుండటమనేదే తప్ప వీటికి గురులఘు క్రమంతో నిమిత్తం లేదు. ఇట్లాగే అన్నీ. 7 మాత్రల గణమంటే 3+4 లేదా 4+3 మాత్రా సంఖ్యా గణాల – అంటే త్రస్య+చతురస్ర గతి గణాల సమ్మేళనం. అందుకని దీన్ని మిశ్రగతి అంటారు. కాని, మిశ్రత్వం మిగతా కొన్నింటిలోనూ కొంత ఉన్నది. ఉదాహరణకు పంచమాత్రా గణాల్లో 2+3 లేదా 3+2 గా కూడా ఉండవచ్చు. అయితే, మూటికన్న తక్కువగా మాత్రాసంఖ్య ఉన్నప్పుడు గణత్వ పరిగణనం లేకపోవటం వల్ల వీటిని మిశ్రగతులుగా భావించటం లేదు. అయితే, ఈ విధమయిన మిశ్రత్వం దృష్టితో చూస్తే పాదం మొత్తం మీద ఉండే మాత్రా సంఖ్య ప్రధానమయి, అవి అచ్చంగా ఏ సంఖ్యతోడి మాత్రలు గల పదాలుగా విరగాలన్నది పాక్షికమయితున్నది.

అయితే, ‘మాత్రాఛందస్సుల్లో లయ ప్రధానం. ఈ లయ మాత్రాగణానుసారి. లయననుసరించి మాత్రా పద్యాల అంతర్నిర్మాణాన్ని చెప్పాలంటే మాత్రాగణాలను గుర్తించక తప్పదు’ అంటారు రామారావు. అంతే కాదు. పాదం మొత్తానికైన మాత్రా సంఖ్యను బట్టి లక్షణాన్ని చెప్పినవారిని ప్రస్తావించి, – ‘ప్రాచీనులు కొందరు మాత్రా పద్యాలకు లయ విరహితంగా లక్షణం చెప్పారు, అంటె, మాత్రాపద్యాల్లో అంతర్నిర్మాణాన్ని గూర్చి వాళ్ళు పట్టించుకోలేదన్న మాట. ఆ మేరకు వాళ్ళ లక్షణం అసమగ్రం’ అని తీర్మానించినారు గూడా. ఈ తీర్మానాన్ననుసరించి గణసహాయం లేకుండా లక్షణం చెప్పటం మాత్రాపద్యాలకు ‘లయ విరహితంగా’ చెప్పటమయితుందన్నమాట. ఎందుకంటే- ‘లయ మాత్రాగణానుసారి’. అయితే, వెనుక చూపబడ్డ వైతాళీయాలు మాత్రాఛందస్సులే. వాటికి పింగళుడు గణసహాయంతో లక్షణం చెప్పలేదు కాబట్టి లయదృష్టి లేదనడం కుదురుతుందా మరి! లయ మీద దృష్టి లేకుంటే, ఫలానా మాత్రలు కలిసి గురువు కారాదు, వరుసగా ఇన్ని లఘువులుండరాదు… ఇత్యాదిగా చెప్పటమెందుకు? నిజానికి అట్లా చెప్పటం లయను ఉద్దేశించి మాత్రమే. మాత్రాగణాలను చెప్పనంత మాత్రాన ‘లయ విరహితంగా’ చెప్పటం కాదు. ఇంకో గమనించవలసిన అంశమేమిటంటే, మాత్రాగణాలను చెప్పటంవల్ల ఎదురు నడిచే – అంటే విలోమగతి గల గణాలను (లగ-జ-య) నిషేధించవలసి వచ్చింది. గణాల ప్రమేయం లేకుంటే ఈ విభేదింపు అవసరం లేదు. పాదగమనంలో విలోమగతి వెంటనే పట్టిస్తుంది. విలోమగతి అవసరమనుకుంటే కవి సాధిస్తాడు. కాదనుకుంటే వదిలేస్తాడు. గణాలను చెప్పినా కూడా, పాదంలోని ఆయా ప్రత్యేక సంఖ్యామాత్రలు కలిసి గురువులు కావటం వల్లనే విలోమగతి గానీ, అనులోమగతి గానీ వచ్చేది.గణాలను చెప్పటం వలన విలోమగతి సాధించాలనుకున్న కవి లక్షణాతిక్రమణం చేసిన వాడయితున్నాడు. ‘నేటి కవుల్లో శ్రీశ్రీ పద్యాల్లో ఇట్లాంటి వ్యతిక్రమణలు కనిపిస్త’యని గణాల దృష్టితో అనవలసి వచ్చింది తప్ప పాదమాత్రా సంఖ్యాదృష్టా అనవలసిన అవసరం రాదు. అందుకనే లాక్షణికుల గణాలెట్లా ఉన్నా, కవులు విలోమగతిని సాధిస్తూనే ఉన్నారు.

ఇదిట్లా ఉండగా అనులోమగతికమయిన ‘నల’మునకు, విలోమగతికమయిన ‘జ’గణ గమనం సాధించవచ్చునని, ఇట్లాంటి ‘నల’మును ‘జగణతుల్యనల’ మనవచ్చునని గిడుగు సీతాపతిగారు (సీతాపతి 1961. పే. 41) సూచించినారు. అంటే, పార్యంతికంగా గతిసాధన కవికి సంబంధించిందే గాని, గణాలకు సంబంధించినది కాదని స్పష్టమయితుంది.

మరొకటి. విలోమగతిని లాక్షణికులు పూర్తిగా నిరాకరించలేదు. దీనికి ప్రత్యక్ష సాక్ష్యం కందపద్యం. కందపద్యం గూడా మాత్రాఛందస్సే. ఒకవిధంగా కందం పూర్వార్థాన్ని 3/5 గణాలుగా కాక 4/4 గణాలుగా విభజించి, రెండు పాదాలనుకుంటే – మాత్రాఛందస్సే. ‘మధురగతి’ రగడ గీత ఉత్తరార్థం కూడ ఇంతే. గీతాదుల మాత్రాగణాల్లోని మాత్రాసంఖ్య వైషమ్యం కందగణాల్లో లేదు. కంద గణాలు చతుర్మాత్రకాలు. గగ-నల-భ-జ-స అనే వాటిని మించి చతుర్మాత్రాగణాలు లేవు. అన్నీ చతుర్మాత్రకాలు కావటం వలన కందం చతురస్రగతి పద్యమని స్పష్టం. అయితే, ఈ కందగణాల్లో విలోమగతికమయిన ‘జ’గణాన్ని లాక్షణికులు విధించినారు. ఆరవగణంగా నలమయినా, జగణమయినా తప్పక ఉండాల్నని నియమం చేసినారు కూడా. అంటే, నాలుగు లఘువుల్నయినా ఉపయోగించాలె, లేదా విలోమగతినయినా సాధించాలని స్పష్టం చేసినారన్నమాట. కందంలో సరిగణంగా జగణాన్ని అంగీకరించినారు. మరి నియమాలన్నీ దేన్ని బట్టి? కవి ప్రయోగాల్ని బట్టే.

ఇది ఇట్లా ఉండగా, చతురస్ర గతికమయిన కందపద్యాన్ని తదితరగతుల్లో నడిపిన కవులు బోలెడుమంది. చతురస్రేతర గతుల్లో నడిపిన కందపద్యాలకు ఉదాహరణలు సీతాపతిగారు కావలసినన్ని ప్రదర్శించినారు. మరి, ఈ అంశాలిట్లా స్పష్టమయితుండగా – ‘ఖండగతిలో యగణాన్ని మిగతా గణాలతోబాటు ప్రసిద్ధులయిన తెలుగు కవులెవరూ వాడిన ఉదాహరణలు లేవు’ అంటారు రామారావు. ఇక్కడ ఖండగతి యగణం అన్నది ప్రధానం కాదు. విలోమగతికమయిన గణాలను వాడలేదనటం ప్రధానం. ఖండగతి విషయం ఎట్లా ఉన్నా, చతురస్రగతిక మయిన ‘మధురగతి’ రగడలో పింగళి సూరన్న కళాపూర్ణోదయంలో –

అహంక్రి-యాత్మక-మగుశం-ఖంబును

అన్నచోట (8.238) ‘అహంక్రి’ అన్న జగణం ప్రయోగించినాడు. శ్రీనాధుని ప్రసిద్ధమయిన ‘మణికర్ణిక’ రగడ (కాశీ ఖండం 6-125)లో లాక్షణికుల గణాల దృష్ట్యా సరిపడని గణాలు గల పాదాలు చాలా ఉన్నయి. కానీ, అవన్నీ పాదానికి గల మాత్రాసంఖ్యా దృష్టితో సరిగానే ఉంటయి.

ఇది ఇట్లా ఉండగా, ‘ఆధునిక కవులు ఒకే గతి ఉండాల్సిన పద్యాల్లో భిన్నగతులు పాటించిన ఘట్టాలున్నై. ఉదాహరణకి పది మాత్రల బాహ్యపరిమితి గల పద్యాలలో కొన్ని చోట్ల ఖండగతిని, కొన్ని చోట్ల మిశ్రమగతిని పాటించారు. 12 మాత్రలు బాహ్యపరిమితి గల పద్యాలలో కొన్ని చోట్ల త్రిశ్రగతినీ, కొన్నిచోట్ల చతురస్రగతినీ పాటించారు. 16 మాత్రల బాహ్యపరిమితి గల పద్యాలల్లో కొని చోట్ల చతురస్రగతిని, కొన్ని చోట్లమిశ్రగతినీ పాటించారు. ముత్యాలసరాన్ని మాత్రం 3+4+3+4 క్రమంలోనే నడిపారు’ అన్నారు రామారావు. అయితే ఈ భిన్నగతులు పాటించిన ఘట్టాలు ప్రాచీనుల పద్యాల్లోనూ ఉన్నయి. రామకృష్ణుడు ఘటికాచల మహాత్మ్యంలో

బొండు – మల్లెలకె – పోలతిరో – ముచ్చట
మిండ – తుమ్మెదలు – మెలగెడు – నచ్చట

(2.114) అన్నచోట 3+5గా ప్రయోగించినాడు. ఇక 10, 12, 16 మాత్రల బాహ్య పరిమితి గల పద్యాల్లో వరసగా ఖండ, త్రస్య, చతురస్ర గతులుండటం సహజం. మిగిలిన గతులు, మిశ్రగతులు సాధ్యం మాత్రమే. మరి ఈ 3+4+3 అన్న కూర్పు లయావాచమే అయితే గీతపద్యంలోనూ 3+4+4+3+3 (4+4కి బదులు, 4+5 లేదా 5+4 లేదా 5+5 ఉండవచ్చు) ఉన్న పద్ధతిని మిశ్రగతిగా చెప్పవచ్చు. లయ సాధించవచ్చు. గీతాదులకు సూర్యేంద్రగణాలని చెప్పబడిన కారణంగా, మాత్రాసంఖ్యాగణాలు లేవన్న కారణంగా లయ నిర్దిష్టం కాదనటానికి పైపద్యంలో వీల్లేదు. కాని, వీటిలో లయ అప్రధానమని రామారావుగారు – ‘మాత్రా పద్యాల్లో లయ ప్రధానం’ అంటూ మాత్రా పద్యేతర వినివర్తకంగా చెప్పడం వల్ల స్పష్టమయితుంది.

ఇక ముత్యాలసరం విషయంలో 3+4+3+4 అన్న క్రమం నియతమేమీ కాదు. ఉదాహరణకు ఆరుద్ర రచించిన ‘ఎర్ర రోజా మొగ్గ’లో (ఎంచిన పద్యాలు – సంకలనం)

అతడు – తీసిన – బాట -లోనే
అడుగు – వేయుచు – సాగు – చున్నా
అజ్ఞా – తముగ – అతని – కెంద
రభి – మానులున్నారో

అన్న ‘ముత్యాలసరం’ చూడవచ్చు. మూడో పాదం 3+4+3+4గా కాక 4+3+4+3గా విరుగుతుంది. నాల్గవపాదం ఈ రెండింటిలో ఏ విధంగానూ విరుగదు. మూడవ నాల్గవ మాత్రలు కలిసి (మా) గురువయ్యింది. ఈ ఖండికలోని ముత్యాలసరాల్లో గగంతో ప్రారంభమయ్యే నాల్గవ పాదాలు చాలా ఉన్నయి.

‘మాత్రాపద్యాలకు మాత్రం లయ నిర్దేశం ఎందుకు చేయాలి?’ అని ప్రశ్నించుకొని, దానికి సమాధానంగా రామారావు – లయ నిర్దేశించకపోతే మాత్రా పద్యాల్లో అంతర్నిర్మాణం ఉండదు. అక్షర క్రమాన్ని నిర్దేశిస్తే ఇవి వృత్తాలతో సమానమవుతై. ఇంద్ర చంద్ర గణాలను నిర్దేశిస్తే, అవి జాతుల్లో భాగమవుతై. మాత్రా పద్యాలు ప్రత్యేక ఛందస్సుగా నిలబడలంటే, వాటి నిర్వచనం మాత్రాగణాల్లోనే జరగాలి అని నిశ్చయించినారు. ఈ సమాధానంలో ఒకటి రెండంశాలు గమనించవలసియున్నయి. అంతర్నిర్మాణం ఉండాలె కాబట్టి లయనిర్దేశం అన్న భావం పై సమాధానంలో ఉంది. కాగా, అంతర్నిర్మాణం ప్రధానమయి, లయ అప్రధానమయితున్నది. కానీ, లయ ప్రధానం కదా! మరి వీటి నిర్వచనం ‘మాత్రా గణాల్లో’ కాకుండా చెప్పటానికి వీలున్నదని ఇదివరకే వివరించటం జరిగింది. ఇక అంతర్నిర్మాణం ఎక్కడ? తరువాత, మాత్రాపద్యాలకు అక్షర క్రమాన్నీ, ఇంద్రచంద్ర గణాల్ని నిర్దేశించటానికి వీలున్నదనీ, అయినా గూడ అట్లా నిర్దేశిస్తే, మాత్రా పద్యాలు ప్రత్యేక ఛందస్సుగా నిలబడలేవనీ స్పష్టం చేసినారు. అంటే వీటి ప్రత్యేక ఛందస్త్వం కోసమే అట్లా నిర్దేశించగూడదన్నమాట. మాత్రాగణాల నాశ్రయించటమిందుకే మరి. లయానుసారిగా, మాత్రాగణవిరహితంగా లక్షణం చెప్పితే అవి అంతర్నిర్మాణ విరహితమయితయి. అదీగాక, వృత్తాలతోనో, జాతులతోనో ఈ మాత్రాపద్యాలు సమానమయితయి. అయితే మునిగిపోయేదేమిటి?

నిజానికి మాత్రాపద్యాల్లో పాదాలన్నింటిలోనూ మాత్రాసంఖ్య సమంగా ఉంటుంది. 3, 4, 5, 7 ఈ అంకెల్లో ఏ ఒక దానితోనో నిశ్శేషంగా విభజింపబడుతయి. వృత్తాల్లో గానీ, గీతాదుల్లో గానీ ఇట్లా కాదు. మాత్రాపద్యాల ప్రత్యేకత ఇదే. దీన్ని గమనించి లాక్షణికులు లక్షణ కథనంలో సౌకర్యం కోసం మాత్రాసంఖ్యాగణాలను కుదిరించుకున్నారు. ఉదాహరణలు ‘రగడ’లు. ఆధునికులు ఉపయోగిస్తున్న ‘మాత్రాఛందస్సు’లన్నీ ఈ ‘రగడ’ భేదాలే (సంపత్కుమార 1962). ఆ రగడల పద్ధతే వీటికీ అనువర్తిస్తుంది. కానీ కవులు ఈ గణాలను పట్టించుకోకుండా, స్వేచ్ఛగా, పాదపు మొత్తం మాత్రా సంఖ్యను మాత్రమే చాలా వరకు దృష్టిలో ఉంచుకొని, మాత్రలను రకరకాలుగా విభజించుకుంటూ రకరకాల గతుల్నీ, తద్వారా లయల్నీ సాధిస్తున్నారు. ప్రసిద్ధ గేయ కావ్యాల్లో వీటికి బోలెడు ఉదాహరణలు దొరుకుతయి. అందుకని ప్రత్యేకించి చూపటంలేదు.

అసలీ గొడవ అంతా పాదానికి ‘అంతర్నిర్మాణం’ ఉండాలన్న, లేదా ఉంటుందన్న ‘ప్రీ కన్సీవ్‌డ్ నోషన్’‌తో ముందుకు సాగటం వల్లా, ఆ అంతర్నిర్మాణం కూడా గణాల వల్లే అని ముందే నిర్ధారించుకోవడం వల్లా వస్తున్నది. చెప్పబడిన గణాలను ఉపయోగించినంత మాత్రాన గతి కలుగదు. వేంకట పార్వతీశ్వర కవుల ‘భావ సంకీర్తనం’లోని సీస పద్యాల్లో సీసగణాలే ఉపయోగించబడ్డా కూడా వాటికి సీసగతి కలుగలేదు (సంపత్కుమార 1962, పే. 116.) అట్లాగే లయ సర్వత్రా గణాల వల్ల సిద్ధిస్తుందనటానికి వీల్లేదు. ఇదిగాక, మిశ్రగతిని గూడా అంగీకరిస్తున్నప్పుడు ఇక పేచీ ఏమిటి? అందువల్ల ఏ విధమయిన పద్యపాదానికి గూడా ‘అంతర్నిర్మాణ’మంటూ ఏదీ ఉండదు. జులై 72 వ్యాసంలో నేను చేసిన ఈ నిర్ణయాన్ని మార్చుకోవలసిన అవసరాన్ని రామారావుగారు చేసిన అంతర్నిర్మాణ వివరణ కలిగించటం లేదు. ప్రస్తుతం అమలులో ఉన్న లాక్షణికుల ‘గణ పద్ధతి’నే పాదపు ‘అంతర్నిర్మాణం’గా రామారావు చెప్పుతున్నారు తప్ప వేరేమీ లేదు.

ఇక – ‘పద్యపాదాల సామాన్య లక్షణాలుగా నేను ప్రతిపాదించిన అంతర్నిర్మాణ, బాహ్య పరిమితులను సంపత్కుమార ఎక్కడా స్పష్టంగా నిరాకరించలేదు. అంతర్నిర్మాణం గణాల దృష్ట్యా మాత్రమే లేదన్నారు. పైగా ఆయన ‘అంతర్విభజన ‘ అనే మాట నేనుపయోగించిన అంతర్నిర్మాణం అనే మాటకు సమానార్థకంగానే కనిపిస్తున్నది. ఆయన ప్రతిపాదించిన భావగణాలకు ఇంతకన్నా వేరే ప్రయోజనం లేదు’ అంటారు రామారావు. బాహ్యపరిమితిని నేను నిరాకరించలేదు నిజమే. కాని, అంతర్నిర్మాణం గురించి స్పష్టంగానే చెప్పినాను. ‘గణాల దృష్ట్యా (మాత్రమే) లేదన్నా’నంటే ప్రతిపాదన ఏ దృష్ట్యా జరిగితే నిరాకరణం కూడా ఆ దృష్ట్యానే జరుగటం సమంజసం కాబట్టి. ఇక వారికనిపించినట్టుగా నేననే ‘అంతర్విభజన’ వారి ‘అంతర్నిర్మాణం’ సమానార్థకాలు కావు. ఈ అంతర్విభజన – భావగణాలను గూర్చి చెప్పటమెందుకంటే వచనపద్యపాద విభజనను క్రమబద్ధం చేయటానికి.- భావాంశాన్ని బట్టి పాద విభజన చేసేటప్పుడు భావగణం ఒక పదంగా కానీ, పద సమూహంగా గానీ ఉండేట్టయితే దాన్ని రెండు పదాల్లోకి వ్యాపింపజేయకూడదు అని – జులై 72 వ్యాసంలో స్పష్టం చేసినాను. ఒక భావాంశం ఉభయపాదాల్లోకి అభివ్యాప్తం కాకుండా చూడటానికి పాదంలోని భావాంశాల విభజన – అంటే అంతర్విభజన – సహకరిస్తుంది. కాగా, ఇది వచన పద్యపాద బాహ్యపరిమితికి సంబంధించింది. భావాంశంతో గానీ, భావాంశాలు లేని భావంతో గానీ పాదం ఏర్పడ్డప్పుడు ఈ అంతర్విభజనకు ఆస్కారం లేదు. ఎందుకంటే బాహ్యపరిమితి వీటిలో స్పష్టమే. మరొకటి. నేను ‘భావగణ’ మన్నది భావాంశాన్నే గాని పూర్తి భావాన్ని కాదు. ‘భావగణం’ లోని ‘గణ’ పదం ఔపచారికంగా ప్రయుక్తమన్న అంశం నా వ్యాసంలో స్పష్టపరచబడింది. ఇదిట్లా ఉండగా, భావం కానీ భావాంశం (భావాంశాలు) కానీ పూర్తికావటం వచన పద్యపాదం యొక్క బాహ్యపరిమితి అని, గరిష్ఠ-కనిష్ఠ పరిమితులంటూ గుర్తించి కూడా – ‘… నిర్దిష్టమయిన అంతర్విభజనని కానీ బాహ్యపరిమితిని కానీ ఆయన సూచించలేదు. … అంతర్నిర్మాణ – బాహ్య పరిమితులను స్పష్టంగా చెప్పలేదు. కాబట్టి వచన పద్య పాదాలకివి లేవని అనుకోవలసి వస్తున్నది’ అని రామారావుగారెందుకన్నారో నాకర్థం కావడం లేదు. అంతర్నిర్మాణం విషయం జులై 72 వ్యాసంలోనే స్పష్టం చేయటమయింది గదా. ఇక గరిష్ఠ-కనిష్ఠ పరిమితులు బాహ్యపరిమితికి భిన్నమేమీ కావు.

ఇంతకీ, వచనపద్య పాదవిభజనకు పద్ధతి ఏమిటి? – ఇది రామారావు గారి ప్రధానమయిన ప్రశ్న. దీనికి భావం లేదా భావాంశం పూర్తి కావటమనేది వచన పద్య పాద విభజనకు ఉపయోగించే పద్ధతి – అని సమాధానం. ఈ పద్ధతిని మొదటినుంచీ ప్రతిపాదిస్తున్నాను. నా ప్రతిపాదనకు ప్రమాణంగా ఋక్కులలోని పాద వ్యవస్థకు సంబంధించిన-

తేషాంఋక్ యత్రార్థవశేన పాదవ్యవస్థా

అన్న జైమినీయ మీమాంసా న్యాయసూత్రం (2-1-35) కూడా ఉదాహరించటం జరిగింది. ఋక్కుల్లో పాదవ్యవస్థ అర్థాన్ని బట్టి కాగా, ఇక్కడ – వచన పద్యంలో భావాన్ని బట్టి. ఈ అంశాలను నా వ్యాసంలో వివరించినాక గూడా, మళ్ళీ ఈ ప్రశ్న రామారావు గారు వేయటం – ‘భావ, భావాంశాలను గుర్తు పట్టటానికి గాని, పరిగణించటానికి గాని, ప్రమాణీకరించటానికి గాని పద్ధతులేమీ లే’వనీ, ‘భావానికి గానీ, భావాంశానికి గానీ భాషలో అస్తిత్వం వ్యాకరణ సంబంధాలవల్లనే సాధ్యం’ అని చెప్పటానికే అనుకుంటాను. అంతే కాదు, ‘వ్యాకరణ నిమిత్తం లేకుండా భావ, భావాంశాలను ఎట్లా పరిగణిస్తారో నా ఊహకు అందటం లేదు. వ్యాకరణాతీతంగా భావ భావాంశాలను పరిగణించే సూత్రమేమిటి? అని ‘సూటిగా’ ప్రశ్నించటానికి కూడా.

ఇక్కడ స్పష్టం చేయవలసిన అంశం ఒకటున్నది. ఎక్కడ కూడా నేను భావ, భావాంశాల అభివ్యక్తి విషయంలో వ్యాకరణ ప్రాధాన్యాన్ని నిరాకరించలేదు. పైగా – ‘వచన పద్యంలో భావాన్ని ప్రధానంగా స్వీకరిస్తున్నాం కాబట్టి, భావస్ఫూర్తిని కలిగించే పదాల కూర్పు, వాక్య నిర్మాణ రీతి – వీటికిందులో ప్రవేశముండక తప్పదు ‘ అనీ, ‘వచన పద్య నిర్మాణంలో భావస్ఫూర్తి విషయికంగా వాక్యనిర్మాణరీతికీ ప్రవేశం ఉంది. కాబట్టి, వాక్య నిర్మాణానికి వ్యాకరణానికి సంబంధం ఉంది కాబట్టి వ్యాకరణ రూపైకత అక్కడక్కడా భావగణ విభజనలో కనిపించటం సహజమే’ అని కూడా నా వ్యాసంలో చెప్పటమయింది. అందువల్ల భావస్ఫూర్తి విషయంలో వ్యాకరణం యొక్క అవసరాన్ని నేనేమీ కాదనలేదన్నది స్పష్టమే. ఈ ‘కాదనలే’దన్న అంశాన్ని రామారావుగారు గమనించక పోలేదు. మరి, గమనించి కూడా, ‘వ్యాకరాణాంశాలకీ, వీరున్నయ్యంటున్న భావాంశాలకీ ఏకైక సంబంధం ఉంది కాబట్టి, వ్యాకరణ విరహితంగా భావగణ విభజన సాధ్యం కాదని నా నమ్మకం. సాధ్యమని నిరూపించాల్సిన బాధ్యత సంపత్కుమార మీదే ఉంది’ అనటంలో తాత్పర్యం ఏమిటో బోధపడటం లేదు.

ఇంతకూ, అసలు విషయమేమిటంటే ఒక భావం – అదెట్లాంటిదయినా, భాషలో అభివ్యక్తం కావాల్నంటే, ఆ భాషా పదాల ఒకానొక విధమయిన కూర్పు అవసరం. ఆ కూర్పులోని స్థితిని, అంటే ఆ కూర్పులో ఒదిగిన పదాలకు కలిగిన పరస్పర సంబంధాల్ని నిగ్గడించి చూపేది వ్యాకరణం. వ్యాకరణం వింగడిస్తున్నది కాబట్టి, ఆ సంబంధాలను వ్యాకరణ సంబంధాలంటున్నాం. మరి దీన్నే తిరగేసి చెప్పితే వ్యాకరణ సంబంధాలవల్ల భావస్ఫూర్తి కలుగుతుందనడం. భావస్ఫూర్తి అనేది ఎక్కడ ఉద్దిష్టమయినా అక్కడ ఈ వ్యాకరణ సంబంధాల ప్రసక్తి ఉండనే ఉంటుంది. రామారావుగారు నాపై మోపిన బాధ్యతలోని చమత్కారమేమిటంటే, ఈ ఉండేదాన్ని ఉండదు అని చెప్పమని నిగ్గదీయటం. అయితే, ఈ సందర్భంలో గమనించవలసిన అంశ మొకటి. భావం ఆధారంగా చెప్పే ప్రతి అంశాన్నీ, ఆ భావస్ఫూర్తి వ్యాకరణ సంబంధాల విషయకమేనని చెప్పనవసరం లేదు. ఉదాహరణకు అలంకారికులు అర్థాలంకారాలను పేర్కొన్నారు. అంటే, ఆ అలంకారాలు అర్థస్ఫూర్తిని ఆధారంగా చేసికొని చెప్పబడినయన్నమాట. మరి భాషలో అర్థస్ఫూర్తి ఎట్లా కలుగుతుంది! రామారావుగారి మాటల్లో చెప్పాలంటే ‘వ్యాకరణ సంబంధాలవల్లనే’. అయినప్పుడు ‘వ్యాకరణాతీతంగా అర్థస్ఫూర్తి కలుగటంలేదు’ కాబట్టి ఆయన దృష్ట్యా వాటిని ‘అర్థాలంకారాలు’ అనకుండా ‘వ్యాకరణాలంకారాలు’ అనవలసి ఉంటుంది. ఎందుకంటే ‘వ్యాకరణ విరహితంగా భావస్ఫూర్తి కలిగే పద్ధతి ఒకటుంటే, అది చూపించే వరకూ వారి భావగణాలను వ్యాకరణ గణాలనే అనాల్సి ఉంటుంది ‘ అన్నారు కదా ఆయన! కానీ, అలంకారికులందరూ వాటిని అర్థాలంకారాలనే అన్నారు తప్ప, వ్యాకరణ విరహితంగా అర్థస్ఫూర్తిని కలిగించే పద్ధతిని వారు దేన్ని చూపించలేదు. అసలు విషయమేమిటంటే అర్థ (భావ) స్ఫూర్తికి వ్యాకరణ సంబంధాలు ముఖ్యమే కాని, ఆ స్ఫూర్తి కలిగిన తరువాత ఆ కలిగిన అర్థం (భావం) ఆధారంగా ఏర్పడేవన్నీ, ఆ అర్థం (భావం) బట్టి చెప్పబడతాయే కాని వ్యాకరణాన్ని బట్టి కాదు. అందుకని నేను ఆధారపడ్డ భావస్ఫూర్తి కలిగిన తరువాత ఆ భావం యొక్క పరిమితులను బట్టి ఏర్పడే అంశాలు భావానికి సంబంధించిన వయితయి. భావం అనేది భాషలో అభివ్యక్తమయినాక గాని ఇది భావం, లేదా ఇది భావంలోని ఒక అంశం అని చెప్పడానికి వీలుపడదు.

ఋక్కుల పాదవ్యవస్థ విషయంలో నేను ఉదాహరించిన అంశం కూడా ఇంతే. అర్థాన్ని బట్టి పాదవ్యవస్థ అంటే, ఆ అర్థం వ్యాకరణాతీతంగా ఉంటుందని కాదు. కాగా, పాద విభజనకు అర్థాన్ని ఆధారంగా తీసుకోవటమయిందన్నమాట. అక్కడ అర్థస్ఫూర్తి ఎలా కలుగుతున్నదని కాదు, కలుగుతున్న అర్థస్ఫూర్తిని బట్టి పాదాన్ని ఎట్లా విభజిస్తున్నారన్నది ప్రధానం. నేను చూపిన మాదిరాజు రంగారావుగారి వచన పద్యాన్ని (అనల తోరణం) రామారావు ‘మాటల కూర్పు’ అంటూ – పైన ఉదాహరించిన భాగంలో పాద విభజన, వాక్య – ఉపవాక్య విభజన జరిగే పద్ధతి ననుసరించి జరిగిందని స్పష్టం అన్నారు. ఈ లెక్కన ‘అర్థవశేన పాదవ్యవస్థా’ అన్న ఋక్పాద విభాజక లక్షణం ‘వాక్యవశేన…’ అని ఉండవలసి ఉండేది. కాని అర్థవశేన.. అని మాత్రమే ఆ సూత్రం. ఇంతకూ వాక్యోపవాక్య విభజనకు ఆధారం ఏమిటి? కలిగే భావస్ఫూర్తి మాత్రమే. అందువల్ల ప్రధానమయింది భావస్ఫూర్తి మాత్రమే. కాని ‘వాక్యోపవాక్య విభజన పద్ధతి’ కాదు. వ్యాకరణ విరహితంగా భావస్ఫూర్తిని గురించి ఇంతగా పట్టుబడుతున్న రామారావుగారు, భావస్ఫూర్తి విరహితంగా వ్యాకరణం యొక్క ఉనికిని నిర్థారించే సూత్రమేమిటో వివరించవలసి ఉంటుంది. నిజానికి భావస్ఫూర్తిని వదిలితే వ్యాకరణం యొక్క అవసరం లేదు. మరొక అంశమేమిటంటే, భావస్ఫూర్తికి వ్యాకరణ సంబంధాల పరిజ్ఞానం తోడ్పడినంత మాత్రాన. స్ఫురించే ‘భావం’ వ్యాకరణ భావం కాదు. భావస్ఫూర్తికి వ్యాకరణం సహాయకం – వచన పద్య పాద విభజనకు భావస్ఫూర్తి సహాయకం. భావగణ విభజనలో, పాద విభజనలో వ్యాకరణాంశాలు తోడ్పడినంత మాత్రాన అవీ భావగణాలూ, వచన పద్య పాదాలూ కావటంలో క్షతి ఏమీ లేదు. ఏకాక్షర వృత్తాంతర్నిర్మాణాన్ని సమర్థించేందుకు గణిత శాస్త్రంలోని ‘సెట్’ సిద్ధాంతం తోడ్పడినంత మాత్రాన రామారావుగారంటున్న అంతర్నిర్మాణం గణిత శాస్త్రీయమయితుందా?

ఇదిట్లా కాగా, ‘భావగణాలైన ఈ భావం, భావాంశాల స్వరూపాన్ని సంపత్కుమార ఇప్పటి వ్యాసంలోనైనా వివరించకపోవటం విచారకరం’ అంటున్నారు రామారావు. నేను వివరించకపోవట మేమిటి? ఉదాహరణ పూర్వకంగా (అనలతోరణం లోని వచన పద్యం) వివరించినాను. అయితే ‘విచారకరం’ ఏమిటంటే, నేను వివరించిన భావ, భావాంశాలను వ్యాకరణ సంబంధాల పరంగా అన్వయిస్తూ మరో రకమయిన వివరణ ఇయ్యటానికాయన ప్రయత్నించటం.

ఇక – ‘భిన్న భిన్న వచన పద్య పాదాల్లో అక్కడ భావాన్ని స్ఫురింపజేసే పదాలస్థితిని బట్టి భావగణ విభాజకరీతి ఉంటుంది అన్న సంపత్కుమార వివరణ చాలా అసంతృప్తికరంగా ఉంది. ఆ స్థితి ఏమిటో నిరూపించే వరకూ భావగణాల అస్తిత్వాన్ని నేను అంగీకరించలేను’ అన్నారు రామారావుగారు. నిరూపిస్తాను. భావగణం ఏకపదంగా ఉంటుందా? బహుపదంగా ఉంటుందా అన్నప్పుడు, అక్కడ ఉపయుక్తమయిన పదాల స్థితి అంటే, ఏకపదం భావాంశస్ఫోరకమయితే ఏకపదమే భావగణం. బహుపదాల సమష్టి భావాంశస్ఫోరకమయితే, ఆ సమష్టే భావగణం. భావాన్ని స్ఫురింపజేసే పదాలస్థితి అంతే ఇది. ఇక్కడి పదాలు పూర్తి భావాన్ని స్ఫురింప జేస్తున్నాయా? భావాంశాన్ని స్ఫురింప జేస్తున్నాయా? – ఇవన్నీ భావగణ స్వరూపంలో (ఏకపద – బహుపద స్వరుపంలో) భేదాన్ని కలిగించవచ్చు. అందుకే, రామారావుగారు ఉదాహరించిన పై వాక్యం తరువాత నా వ్యాసంలో – భావగణ స్వరూపంలో భేదం ఉండవచ్చు గాని, భావగణం మాత్రం ఉంటుంది. – అన్న వాక్యం ఉంది. అంతే కాదు. ‘భావాన్ని ఆధారంగా చేసుకుని పదాల స్వరూపంలో, వాటి కలయికల్లో ఎన్ని తేడాలున్నా గూడా అది భావగణమే. అది ఏకైకం’ అనికూడా వివరించబడింది. ఈ సందర్భంలో ‘భ’గణ స్వరూపాన్ని ఒక ఉదాహరణంగా చూపిస్తూ, భగణం ఆదిలో ఉండే గురువర్ణ స్వరూపంలో నాలుగు విధాల తేడాలు (దూరము, దుంపలు, దుఃఖము, దుర్గతి) ఉన్నా కూడా, అది భగణమే అయినట్టూ, ఈ తేడాలు కారణంగా ఆ గణానికి నాల్గు పేర్లు లేనట్టు, భావగణ స్వరూపంలోని తేడాలను బట్టి కూడా దానికి వేరు వేరు పరిగణనం లేదన్నాను. ఇక్కడ ఈ అంశం ఉదాహరించటంలో గమనించవలసింది తేడాలున్నా భగణానికి వేరు వేరు పేర్లు లేవనేదే కాని మరోటి కాదు. నేనుదాహరించిన గురువర్ణ స్వరూపంలో తేడా ఉన్నా ‘సామ్యం కూడా ఉందనీ’, ఆ ‘సామ్యాన్ని హేతుబద్ధంగా నిరూపించవచ్చనీ’ రామారావుగారన్నారు. నిజానికి ఆ తేడాల సామ్యాన్ని హేతుబద్ధంగా నిరూపించవచ్చునా, లేదా అన్నది ప్రస్తుతం కాదు. ప్రస్తుతం తేడా ఉన్నదా లేదా అని. పైగా గురుస్వరూప విషయంలో ‘హేతుబద్ధత’ కూడా నిజానికి లేదు. ఎందుకంటే, ఆయన నిరూపించిన పద్ధతిలో ‘పూర్వ వ్యంజనంతో సంబంధం లేకుండా దీర్ఘాచ్చు గానీ, పరవ్యంజనంతో మూతవడిన హ్రస్వాచ్చు గాని గురువు అవుతుంది’. కాని, అంతే కాదు. ఇంకా ఉన్నది. పూర్వ వ్యంజనంతో సంబంధం కల దీర్ఘాచ్చు కూడా గురువైతుందని C,V అన్న గుర్తులతో వారే తేల్చినారు. కాని, పరవ్యంజనంతో మూతపడిన దీర్ఘాచ్చు VC కూడా (ఆన్) గురువే అయితుంది. ఇంకా పూర్వ వ్యంజనంతో సంబంధం కలిగి పరవ్యంజనంతో మూతవడిన దీర్ఘాచ్చు CVC కూడా (కాన్) గురువయితుంది. ఆ-కా-కాన్ అనే ఈ మూడు గురువుల అక్షర పరిమాణం ఒకే విధంగా ఉన్నదనటానికి వీల్లేదు.

నిజానికి ఇక్కడ అచ్చంగా గురు లఘు క్రమంతో భావగణం నిరూపించటం ఉద్దిష్టం కాదు. గురు-లఘువులతో ఏర్పడే గణాల్లో తేడాలున్నట్టే ఈ భావగణాల్లోనూ ఉంటుందని సూచించటమే ఇక్కడ ప్రధానం.

ఇట్లాగే మరోచోట గూడా నేనుదాహరించిన అంశాన్ని రామారావు సాగదీసినారు. ఒక పద్యపాదాన్ని భిన్న లాక్షణికులు రెండు భిన్న లక్షణం గల పద్యాలకు చెందిన పాదాన్నిగా నిరూపించే వీలు ఒకప్పుడు కలుగవచ్చునన్న అంశాన్నీ చెప్పటానికి వీలుగా, సీసపాదం గానూ, ఆటవెలది పాదంగానూ, విభక్తమయ్యె విధంలో ఉన్న ఒక పాదాన్ని ఉదాహరణగా చూపి, ఇట్లాగే భిన్న లాక్షణికులు వచన పద్య పాదాన్ని గూడా వేరు వేరు పాదాలుగా విభజించే అవకాశమున్నదన్నాను. ఇక్కడ కూడా ఒక పాదాన్ని ఒకటికన్నా ఎక్కువ రకాలుగా విభజించే అవకాశం ఉన్నదని చెప్పటానికే ప్రాధాన్యం. అయితే, ‘కవి ఉద్దేశించిన పాద విభజన మనకు ఎందుకు ప్రమాణం కావాలి? నిజమే, అక్కరలేదు’, అంటూనే – ‘కవి ఉద్దేశించిన పాద విభజన, లాక్షణికుడు చేసిన పాద విభజన ఒకటే ఎందుకవుతున్నయి? ఇద్దరూ ఒకే సూత్రాన్ని అనుసరించటం వల్ల, అనుసరించడానికి ఒక సూత్రం ఉండటం వల్ల’ అన్నారు రామారావుగారు. కాని, నేను చూపిన ఉదాహరణలో కవి, లాక్షణికుడు ఆ పాదాన్ని ఒకే విధంగా విభజించలేదు. కవి ఆటవెలదిగా భావిస్తే, లాక్షణికుడు సీస పద్యంగా భావించినాడు. ఎవరికి వారికి ఆ విధంగా పాదం విభజించటంలో ‘సూత్రం’ ఉంది. అట్లాగే, వచన పద్యపాద విషయికంగా కూడా.

నిజానికి ప్రస్తుత ప్రస్తావన కవి-లాక్షణికుల మధ్యది కాదు, ఇద్దరు లాక్షణికుల మధ్యది. ఇద్దరు లాక్షణికులు పద్యపాదాన్ని వేరువేరుగా విభజిస్తున్నారు. వచన పద్యపాదాన్ని కూడా ఇద్దరు లాక్షణికులు వేరువేరుగా విభజిస్తున్నారు. ఈ విభజనకు సూత్రం లేదంటారు రామారావుగారు. కాని, ఉంది. అది భావాంశాలను బట్టి విభజించటం. భావాంశాలంటే భావగణాలు కదా! ఈ భావగణాల స్వరూపంలో తేడాలుంటాయని వివరించినాను గూడా. ఈ తేడా ఇద్దరు లాక్షణికులు వచన పద్యపాదాన్ని వేరువేరుగా విభజించటానికి అవకాశం కలిగిస్తున్నది. ఒక వరుసగా ఉన్న గురులఘువులను వేరు వేరు గణాలుగా విభజించటానికి అవకాశం ఉండబట్టే కదా, ఆ వరుస వేరు వేరు పాదాలయితున్నది! అట్లాగే వచన పద్య పాదం కూడా. ఇక్కడ వేరు వేరుగా విభజించేందుకు గల ‘అవకాశం’ మాత్రమే ప్రధానం గాని, రెండు విధాలుగానా, మూడు విధాలుగానా అన్నది కాదు ప్రధానం.

ఇక ‘కవ్యుద్దిష్టంగా’ లాక్షణికుడు వచన పద్య పాదాన్ని విభజిస్తాడా అన్నది రామారావుగారి రెండో ప్రశ్న. అయితే, ఆ పాదాన్ని కవి ఎట్లా ఉద్దేశించినాడో తెలియనప్పుడే కదా, లాక్షణికుని కీవిధమయిన ప్రశ్న! ‘మధుర…’ ఉదాహరణలో కవి ఆ పాదాన్ని ఆటవెలదిగా ఉద్దేశించాడని తెలిసినాక, లాక్షణికుడు మరో విధంగా విభజించటానికి అవకాశం ఉన్నా పూనుకోడు. అది తెలియనప్పుడు సీసపద్య పాదంగా విభజించే అవకాశం అతనికుంది. అట్లాగే, వచన పద్య పాద విషయంలోనూ కవి ఉద్దేశించింది తెలియనప్పుడు లాక్షణికుడు వచనపద్యపాద విభాజకసూత్రాన్ని అనుసరించి మరో రకంగా కూడా విభజించే అవకాశం అతనికుంది, ఈ అంశాన్నే ప్రధానంగా ఇక్కడ గమనించవలసి ఉంటుంది.

ఈ సందర్భంలోనే, ‘ఈ పాదబద్ధతకు లొంగనివి కూడా ఆధునిక కవిత్వంలో కొన్ని ఉన్నై’ అంటూ రామారావుగారు తమ మొదటి వ్యాసంలో తిలక్, కె. వి. రమణారెడ్డిగారల రచనలను చూపి, తిలక్ రచనల విషయంలో – ‘ఇందులో పాదవిభజన కాధారాలేమిటో, ముఖ్యంగా మూడో పాదం ‘ఆకాశం’తో అంతం కావడానికి హేతువు ఎవరైనా చెప్తే సంతోషిస్తాను’ అనీ, రమణారెడ్డి రచన విషయంలో – ‘పైదాంట్లో రమణారెడ్డి అచ్చులో కూడా పాదబద్ధత పాటించలేదు’ అనీ అన్నారు. ఇచ్చిన ఉదాహరణలు పాదబద్ధతకు లొంగని ‘కొన్ని’ లోవి. ఆ కొన్ని వచన పద్యాలే గదా! అందుకని, ఉదాహరించిన రీతిలో ఆ రచనల్లో ఉన్న లోపాలను చూపించినాను. అవి ఏ విధంగా ఉండాల్నో కూడా ప్రదర్శించినాను. ఈ ప్రదర్శనకు వచనపద్యపాద విభాజకసూత్రాన్నే ఉపయోగించినాను. అయితే, ఈ విభజించిన రీతిని గురించి రామారావుగారేమీ అనలేదు. ఆ విభజన సరిగానే ఉందనుకోవాలె మరి. కాని, తమ రెండో వ్యాసంలో – “కె. వి. రమణారెడ్డిగారి ‘బాధాగాధము’ అనే ఖండికలోనుంచి నేనుదాహరించిన భాగాన్ని శ్రీ సంపత్కుమార మళ్ళీ ఉదాహరించి ‘కొంచెం లోపం ఉండవచ్చు గాక’ అందులో పాద విభజన జరిగినదని నిరూపించటానికి ప్రయత్నించినారు. రమణారెడ్డిగారి ‘అంగారివల్లరి ‘ అనే అచ్చు పుస్తకాన్ని సంపత్కుమార చూచి ఉండలేదనుకుంటాను. చూస్తే ‘బాధాగాధము’ లో పాదవిభజన జరిగిందని పొరపాటు పడే అవకాశం ఉండేది కాదు” అన్నారాయన. వారన్నట్టుగానే, ‘అంగారవల్లరి’ని నేను చూళ్ళేదు. రమణారెడ్డిగారు బాధాగాధములో పాదవిభజన నుద్దేశించలేదని, రామారావుదాహరించిన భాగం నాలుగు పాదాలుగా కనిపించటం ‘యాదృచ్ఛిక’మని నాకు తెలియదు. రమణారెడ్డిగారు తాను విభజన నుద్దేశించలేదని రామారావుగారికి రాసినారని కూడా నాకు తెలియదు. అయితే, ఈ చూడకపోవటం, తెలియకపోవడాలవల్ల నేను పొరపాటు పడే అవకాశం మాత్రం పొందలేదు. ఇది ముఖ్యంగా గమనించవలసిన అంశం. పరీక్షకు హాజరయ్యేవాడికి ప్రశ్నలిచ్చినట్టుగా రామారావుగారీ రెండు రచనలనిచ్చి పాదవిభజన చేయమన్నట్టు రాశారు. మరి, ఈ స్థితిలో నేను ‘అంగారవల్లరి’ని గానీ, ‘అమృతం కురిసిన రాత్రి’ని గానీ చూడనవసరం లేదు. ఒకవిధంగా చూడకూడదు కూడా. ఇక ఇక్కడ తిలక్, రమణారెడ్డి పాదవిభజనను ఉద్దేశించినారా? లేదా? అన్నది కాదు కావలసింది. అది వచనపద్యమయితే – అయింది కాబట్టి – పాదవిభజన జరిగిందా? జరిగితే ఏ సూత్రం ప్రకారం? ఆ ప్రకారాన్ని బట్టి అవి సరిగా ఉన్నాయా? లెకపోతే ఎట్లా ఉండాలె? అన్నది ముఖ్యం. (ఆ ‘భాగాలు’ వచన పద్యాలు అనే ఉదాహరింపబడ్దయి. వచన పద్యాలు కాకపోతే వాటి ప్రసక్తే ఇక్కడ ఉండేది కాదు.) పాదవిభజన అక్కడ ఉన్నదనీ, కానీ ఉదాహరించిన రీతిలో వచనపద్యపాద విభాజకసూత్రం ప్రకారం దోషం ఉన్నదనీ చూపించినాను.

‘అమృతం కురిసిన రాత్రి’ తిలక్ మరణించిన తర్వాత అచ్చయిందనీ, కవి అందులోని – ‘ఏ ఖండికలో పాదవిభజన ఉద్దేశించినాడో, ఎక్కడ ఉద్దేశించలేదో తెలుసుకోటానికి అచ్చయిన పుస్తకమే ఆధారం. ఈ ఆధారంతో చూస్తే ఇక్కడ కవి పాదవిభజన ఉద్దేశించినట్లు తోచదు. ఇప్పుడు కనిపించే పాదవిభజన తిలక్ పద్యాలు కాపీ చేసినవారో, అచ్చువేసినవారో చేసి ఉండవచ్చు’ అంటారు రామారావుగారు.

ఇక్కడ ఒక విషయం. నిర్దిష్ట ప్రతిపాదన లాధారంగా నేను తిలక్ రచనలో పాదవిభజన చేసినాను. మరొకటి ‘అమృతం కురిసిన రాత్రి’లోవి వచన పద్యాలేనా? వచన పద్యాలయితేనే ప్రస్తుత చర్చ. లేకపోతే వాటినుదాహరించవలసిన అవసరం లేదు. కవి పాదవిభజన ఉద్దేశించిందీ లేనిదీ నిర్ణయించటానికి అచ్చు పుస్తకమే గదా ఆధారం! దాన్ని వదిలి, ఉద్దేశించిందీ లేనిదీ, తిలక్ మరణించినాడు కాబట్టి, మరో ఆధారం లేదు. ఆయన బతికుండగా అచ్చయిన వచన పద్యాల్లో పాదవిభజన తిలక్ ఉద్దేశించిందేనని చెప్పవచ్చు గదా. ప్రస్తుతం అచ్చుపుస్తకంలో కనిపించే పాదవిభజనలో దోషం ఉంటే, అది తిలక్ పద్యాలు కాపీ చేసినవారి, అచ్చువేసినవారి వల్ల వచ్చిందే కాని తిలక్ వల్ల కాదని రామారావుగారంటూనే ఉన్నారు గదా! మరి, నేను కూడా తిలక్ రచనకు పాదవిభజన చేసి చూపింతరువాత, “ఆ పాదవిభజన అస్తవ్యస్తంగా జరిగింది. ఇది రాతలోనూ, అచ్చులోనూ జరిగే వీలుంది,” అని అననే అన్నాను, నా వ్యాసంలో. నిజానికి, తిలక్ వచన పద్య ప్రయోక్తల్లో చాలా ప్రముఖుడు. వచనపద్య పాదవిభజన విషయంలొ నా ప్రతిపాదనలను తిలక్ హర్షించిన సంగతి నా వ్యాసంలో రాసినాను కూడా.

ఇదిట్లా ఉండగా – ‘భావ స్ఫూర్తి ఆధారంగా విభక్తమవుతయ్యని సంపత్కుమార అంటున్న భావగణాలు అన్ని రకాల భాషా వ్యవహారాల్లోనూ ఉంటై. అయినప్పుడు ఆయన పద్ధతి ననుసరించి ఒక వ్యాసంలోని వాక్యాలను గూడ భావ, భావాంశాల పద్ధతిలో పాద విభజన చేసి వచన పద్యంగా నిరూపించవచ్చు. అచ్చులో గాని, రాతలో గాని కవి పాదవిభజనని సూచించటం ప్రమాణంగా తీసుకుంటే, ఆ పని వ్యాసకర్త కూడా చేయ్యవచ్చు. ఇకపోతే, వచన పద్యంలో ఉండే కవితా పదార్థం దాన్ని వ్యాసాల నుంచి, ప్రకటనల నుంచి వేరు చేస్తుంది కదా అంటే, కవిత్వానికి గద్యంలో స్థానం లేదని అనాల్సి ఉంటుంది. రసహీనమైన పద్యాలు, రసవంతమైన గద్యం ఉంటయ్యని అందరూ ఒప్పుకుంటారు. కవిత్వం ఉన్నదల్లా ఛందో విభాగం అని, ఛందస్సులో ఉన్నదల్లా కవిత్వం అవుతుందని సంపత్కుమార అంటారనుకోను.’ అన్నారు రామారావు గారు. నేను అనను, అనుకోను గూడా. కాని, ఇక్కడ కవితా పదార్థం ప్రసక్తి ఎందుకు? వచన పద్యం పద్యం కావటానికి,అందులో కవితాపదార్థం ఉండటానికి, లేకపోవటానికి సంబంధం లేదు. ఉండవచ్చు, ఉండకపోవచ్చు. రసహీనమయిన పద్యాలు ఉంటాయని వారూ అంటూనే ఉన్నారు. వచన పద్యం అందుకు భిన్నమేమీ కాదు. గణితం, వైద్యం పద్యాల్లో రాసినవారున్నారు. వ్యాసాలను కూడా పద్యాల్లో రాసినవారూ ఉన్నారు. ‘పోప్’ అట్లా రాసినవాడంటారు. అందువల్ల వ్యాసకర్త తన వ్యాసం వచనపద్యంలో రాస్తే మునిగిపోయేదేమీ లేదు. ప్రకటనల్ని మాత్రం సాంప్రదాయిక పద్యాల్లో మాత్రం రాయడానికి వీల్లేదా? ఎందరు రాయరు! వచన పద్యం ‘పద్యం’. పద్యం బాహ్యస్వరూపం. కవితా పదార్థం, రసం మొదలయిన వన్నీ ఆంతరికాలు. ఇవి లేని సాంప్రదాయ పద్యాలున్నట్టే, వచన పద్యాలూ ఉండవచ్చు. అందువల్ల కవితా పదార్థం ఉన్నా, లేకున్నా వచన పద్యం వచన పద్యమే. అయితే అది వచనపద్యపాద విభాజకసూత్రానికి ఒదిగితేనే వచన పద్యం. కాకపోతే కాదు. వచన పద్యం ఈ విధంగా ఒక విధమయిన ఛందో రూపం. అంతే.

‘సంపత్కుమార ఇప్పటి వ్యాసంలోనైనా వచన పద్యాన్ని అంతర్నిర్మాణమూ, బాహ్యపరిమితీ ఉన్న పాదాలుగా విభజించటానికి స్పష్టమయిన ప్రతిపాదన ఏదీ చెయ్యలేదు. ఆయన ఉన్నయ్యంటున్న భావగణాలు వ్యాకరణాంశాల మీదనే ఆధారపడ్డయి గనుక అవి వ్యాకరణ గణాలే అవుతై. ఆయన భావగణ పద్ధతికి వచన పద్యాన్ని గద్యం నుంచి వేరు చేసే శక్తి లేదు’ అన్నారు రామారావు. దీనికి సమాధానాలు నా పూర్వవ్యాసంలోనూ ఉన్నయి. ఈ వ్యాసంలో ఇంకా స్పష్టపరచటమయింది. అంతర్నిర్మాణం గూర్చి నా అభిప్రాయం మొదటినుంచీ స్పష్టమే. బాహ్య పరిమితి విషయం గరిష్ఠ-కనిష్ఠ పరిమితి అన్న ధోరణిలో వారూ గమనించినారు. నేనూ స్పష్టీకరించినాను. నిజానికి బాహ్య పరిమితి కాదిది. పాద పరిమితి, భావగణా (భావాంశా)లను వ్యాకరణ గణాలనగూడదనీ, భావగణాలే అనాలని కూడా ఈ వ్యాసంలో స్పష్టపరచబడింది. -’ఒక వ్యాసంలోని వాక్యాలను గూడ భావ భావాంశాల పద్ధతిలో పద విభజనం చేసి వచన పద్యంగా నిరూపించవచ్చు’నని వారే అంటున్నారు. మరి ‘భావ-భావాంశాల పద్ధతిలో పాద విభజన’ చేసినప్పుడు అది గద్యం నుండి వేరు కాక మరేమయితుంది? గద్యానికి పాదవిభజన ఉండదు. ఉంటే అది గద్యం కాదు, పద్యం అయితుంది. పాద విభజన ఉండేది పద్యానికే. ఇక్కడ ఒక చిన్న విషయం. వ్యాసాల్ని, ‘వచన పద్యంగా’ నిరూపించవచ్చు నన్నారాయన. మరి సాంప్రదాయిక ఛందస్సుల ననుసరించి, వ్యాసాన్ని ఇరవయ్యారేసి అక్షరాలుగా (అంతకు తక్కువగా కూడా) విభజించి విషమ వృత్తాలుగా నిరూపించవచ్చు. ఈ విధంగా ఈనాటి వచన పద్యాన్ని ‘విషమ వృత్తం’గా పరిగణించవచ్చునని ఒక మిత్రుడు సూచించినాడు. మరి దీనికేమనాలె! కానీ ఈ రెండూ వాదానికనేవే. కాబట్టి వ్యవహారంలోని పద్యాలకు అనువయిన పద్ధతిని నిష్పన్నం చేయటం అవసరమయింది – చేయటమూ అయింది.

తమ వ్యాసాంతంలో రామారావుగారు వచన పద్య పాదబద్ధతను వివరించటంలో నేను పడ్డ చిక్కులన్నిటికీ (నిజానికి అవి చిక్కులయితే) – ‘కారణం మనకు ప్రసిద్ధంగా ఉన్న ఛందస్సాంప్రదాయంలో ఎక్కడోచోట ఈ వచన పద్యానికి చోటు కల్పించటం కోసం ప్రయత్నించటం. ఏదో రకమైన ఛందస్సూ, గణ విభజన ఉన్నయ్యంటే, వచన పద్యానికి అదనంగా ఏదో గౌరవం వస్తుందనుకోవటం.’ అన్నారు. వచన పద్య పాదబద్ధత నిరూపించటానికి ఋజువయిన మార్గాన్నే అనుసరించినాను తప్ప, నేను చిక్కులేమీ పడలేదు. గమనించవలసిన అంశమేమిటంటే, వచన పద్యానికి ఛందస్సాంప్రదాయంలో నేనుగా చోటు కల్పించటానికి ప్రయత్నించలేదు. మాత్రాఛందస్సులను దాటివచ్చి, తనంతట తానే వచన పద్యం ఛందస్సాంప్రదాయంలో చోటు చేసుకున్నది. ఛందఃప్రయోక్తలే దాన్ని ప్రయోగించి, ఛందస్స్వరూపంగా దానికి వ్యాప్తి తెచ్చినారు తప్ప, గద్యప్రయోక్తలు కాదు. కాగా, నేను చేసింది ఛందస్సాంప్రదాయంలో వచన పద్యం తానుగా చేసుకున్న చోటు యొక్క స్వరూపాన్ని స్పష్టం చేయటమే. ఇకపోతే, ఛందస్సూ, గణ విభజనా ఉన్నంత మాత్రాన ఏ ‘పద్యా’నికీ అదనపు ‘గౌరవం’ రాదు. ఆ పద్యంలో శక్తి ఉంటే వస్తుంది. ఇక వచన పద్యం యొక్క ఛందస్స్వరూపాన్ని నేను స్పష్టం చేయటంవల్ల దానికి ‘అదనంగా’ గౌరవం వస్తే, దానికి అభ్యంతరం ఎందుకుండాలె?

కాగా, నేను వచన పద్యానికి నిరూపించిన లక్షణం, చూపిన పాదబద్ధతా, పాద విభజనరీతీ – వీటిననుసరించి వచన పద్యం ‘పద్య’మే అయితుందని, పాదబద్ధత లేని గద్యవిభాగంలొ చేరదనీ వచన పద్య పరిశీలకులకు మనవి చేస్తున్నాను.

(భారతి, మార్చి 1973. పే. 15-27)


వచన పద్యం: లక్షణ చర్చ – ఉపయుక్త గ్రంథ, వ్యాస సూచి.

(ఈ వ్యాస పరంపరలో అయిదవ వ్యాసం చేకూరి రామారావు రాసిన పద్యం, గద్యం, వచనపద్యం వగైరా.)