నాదేన వ్యజ్యతే వర్ణః పదం వర్ణాత్పదాద్వచః
వచసో వ్యవహారోయం నాదాధీనమతో జగత్
నాదం తోటి వర్ణమూ, వర్ణముల వల్ల పదములూ, పదముల చేత వాక్కూ, వాక్కు వల్ల ప్రపంచ వ్యవహారమూ ఏర్పడింది. అటువంటి నాదానికి ప్రపంచం మొత్తమూ అధీనంలో ఉంటుందని సంగీత రత్నాకరంలోని పై శ్లోకం అర్థం. సంగీత శాస్త్రానికి సామవేదం మూలం. ఇందులో ఉపవేదం గాంధర్వం. ‘గాం’ అంటే వాక్కు. వాక్కుని ధరించింది కాబట్టి గాంధర్వమన్నారు. ఈ గాంధర్వం స్వర, తాళ, పద సాహిత్యాలని ఆశ్రయించి ఉంటుంది. ఇందులో నాదం నుండి స్వరం పుట్టింది.
శాస్త్రీయ సంగీతంలో ఉన్న సప్త స్వరాల గురించి అందరికీ తెలుసు. వీటి పేర్లు షడ్జమం, రిషభం, గాంధారం, మధ్యమం, పంచమం, దైవతం. వీటిల్లో ఒక్క షడ్జమ పంచమాలకి (స, ప) తప్పించి మిగతా అన్ని స్వరాలకీ రెండూ లేదా మూడు స్వరాంతరాలున్నాయి. వీటన్నిటినీ కలిపితే 16 ప్రధాన స్వరాలవుతాయి. అవి – స (షడ్జమం), రి1 (శుద్ధ రిషభం), రి2 (చతుశ్రుతి రిషభం), రి3 (షట్శ్రుతి రిషభం), గ1 (శుద్ధ గాంధారం), గ2 (సాధారణ గాంధారం), గ3 (అంతర గాంధారం), మ1 (శుద్ధ మధ్యమం), మ2 (ప్రతి మధ్యమం), ప (పంచమం), ద1 (శుద్ధ దైవతం), ద2 (చతుశ్రుతి దైవతం), ద3 (షట్శ్రుతి దైవతం), ని1 (శుద్ధ నిషాదం), ని2 (కైసికి నిషాదం), ని3 (కాకలి నిషాదం). ఈ పదహారు స్వరాలలో ఒక్కొక్క స్వరానికీ నిర్దిష్టమైన స్వరస్థానాలున్నాయి. ఈ స్వరాలన్నీ ఒక రీతిలో కూర్చి చెవులకింపుగా పాడడమే సంగీతం.
స్వరాలే కాక శ్రుతి, లయ అనేవి కూడా సంగీతంలో ప్రధానాంశాలు. శ్రుతి స్వర స్థానాల మీద ఆధారాపడి ఉంటే, లయకి మూలం తాళం. ఇవే కాకుండా శాస్త్రీయ సంగీతంలో ప్రతీ పాటా ఒక రాగంతో ముడిపడి ఉంటుంది. స, రి, గ, మ, ప, ద, ని వంటి ప్రత్యేక స్వరాల సంవిధానాన్ని రాగం అన్నారు. ‘స’ తో మొదలు పెట్టి ఒక్కో మెట్టూ ఎక్కుతున్నట్లుగా స్వర స్థాయిని మార్చి తిరిగి ‘స’ కి చేరడాన్ని ఆరోహణ అంటారు. అలాగే పై మెట్టు నుండి ఒక్కో మెట్టూ దిగుతున్నట్లుగా స్వరాలని వ్యతిరేక క్రమంలో దిగడాన్ని అవరోహణ అంటారు. పైన చెప్పినట్లుగా ప్రతీ రాగంలో స్వరాలున్నాయి కాబట్టి వాటికొక ఆరోహణా, అవరోహణా ఉంటుంది. దీన్నే మూర్ఛన (స్కేల్) అని కూడా వ్యవహరిస్తూ వుంటారు. ప్రతీ రాగానికీ ఖచ్చితమైన స్వరాల ఆరోహణా, అవరోహణా ఉంటాయి. ఇది రాగానికి మొదటి సూత్రం.
ఆరోహణా, అవరోహణల్లో స,రి,గ,మ,ప,ద,ని ఖచ్చితంగా ఉండే రాగాలని మేళకర్త రాగాలన్నారు. ఇక్కడ స,రి,గ,మ,ప,ద,ని అని చెప్పిన స్వరాల్లో, రూపాంతర స్వరాలున్నా పరవాలేదు. ఉదాహరణకి రిషభ స్వరం ‘రి’ ని తీసుకుందాం. రిషభానికి రి1 (శుద్ధ రిషభం), రి2 (చతుశ్రుతి రిషభం), రి3 (షట్శ్రుతి రిషభం ) అని మూడు రూపాంతర స్వరాలున్నాయి. వీటిల్లో ఏ రిషభమైనా మూర్ఛనలో ఉండచ్చు. మొత్తం 16 ప్రధాన స్వరాల సమూహాన్ననుసరించి, వాటిలో స,రి,గ,మ,ప,ద,ని స్వరాలు మేళకర్త రాగాల మూర్ఛనలో ఉంటాయి (ఇందులో భాషాంగ రాగాలు, ఉపాంగ రాగాలు, జన్య రాగాలు, ఔడవ రాగాలు, షాడవ రాగాలు, సంపూర్ణ రాగాలనే వర్గాలున్నాయి).
అలాగే ప్రతీ రాగంలో సామాన్యంగా అయిదుకి తక్కువ కాకుండా స్వరాలుంటాయి. (అయిదుకి తక్కువ స్వరాలున్న రాగాలు కూడా ఉన్నా, ఒక స్వర స్థానం నుండి మరొక స్వరస్థానాన్ని చేరుతూ పాడడం చాలా కష్టం. అలా పాడగలిగే గాయకులు చాలా చాలా అరుదుగా కనిపిస్తారు. ప్రముఖ వాగ్గేయకారుడు బాలమురళీకృష్ణ కేవలం నాలుగు స్వరాలతోనే మహతి అనే ఒక రాగాన్ని కూర్చారు). ఉదాహరణకి మోహన రాగం ఆరోహణలో ‘స1 – రి2 – గ1 – ప1 – ద2’ స్వరాలు, అవరోహణలో ‘స – ద2 – ప – గ1 – రి2’ స్వరాలు ఉన్నాయి. అలాగే కళ్యాణి రాగానికి ‘స – రి2 – గ1 – మ2 – ప – ద2 – ని2’ ఆరోహణా, ‘స – ని2 – ద2 – ప – మ2 – గ1 – రి2’ అవరోహణగా స్వరాలున్నాయి. ఈ విధంగా ప్రతీ పాటకీ ఒక రాగం ఉంటుంది. ప్రతీ రాగానికీ కొన్ని జీవ స్వరాలుంటాయి. అంటే ఆయా రాగంలో ఆ స్వరాలు ప్రత్యేకంగా, ప్రస్ఫుటంగా వినిపిస్తాయి. ఉదాహరణకి మోహన రాగం తీసుకుంటే, రి2, ద2లు జీవ స్వరాలు. ప్రతీ రాగానికీ ఒక మూర్చన (స్కేల్) ఉంటుంది. ఒకే రాగాన్ని వివిధ తాళాల్లో పాడచ్చు. అంటే లయని బట్టి రాగం వూగు మారుతుంది. స్థూలంగా రాగ లక్షణాలివి. ఈ లక్షణాలను ప్రదర్శిస్తూ పాడే పద్ధతిని ‘రాగాలాపన’ అంటారు.
కొన్ని రాగాల మూర్ఛన చూస్తే ఒకేలా ఉంటుంది. అంటే ఆ రాగాల్లో ఆరోహణా అవరోహణల్లో ఒకే స్వరాలుంటాయి. వాటిని రెండు వేర్వేరు రాగాలుగా గుర్తించాలంటే ఆ రాగాల్లో జీవ స్వరాలు గుర్తించ గలగాలి. ఆయా రాగాల్లో స్వర సంచారం కూడా తెలుసుండాలి. ఉదాహరణకి ఆరభి, దేవగాంధారి రాగాల్లో మూర్ఛన ఒకేలా ఉంటుంది. కానీ ఇవి రెండూ వేర్వేరు రాగాలు. ఆ తేడాని స్వర సంచారంతో సులభంగా గుర్తించచ్చు. ఆరభి రాగానికి ‘స – రి2 – మ1 – ప – ద2’ ఆరోహణలో, ‘స – ని3 – ద2 – ప – మ1 – గ3 – రి2’ అవరోహణలో, స్వరాలుంటాయి. ఇవే స్వరాలతో దేవగాంధారి మూర్ఛన కూడా ఉంటుంది. కానీ వీటి మధ్య తేడా వుంది. ఆరభి రాగంలో రి, మ, ద లు రాగచ్ఛాయా స్వరాలు. దేవ గాంధారిలో రి,గ,ద లు రాగచ్ఛాయా స్వరాలు. అలాగే ఆరభి రాగంలో ‘దద – పప – మమ – గగ – రిరి – సస’ వంటి జంట ప్రయోగాలు కనిపిస్తాయి. గాంధారి రాగంలో గ స్వరం ఒక ప్రత్యేకమైన రీతిలో ఉంటుంది. ఇలాంటి చిన్న చిన్న తేడాల బట్టి ఈ కృతి ఆరభిలో ఉందీ, ఈ కీర్తన రాగం దేవగాంధారీ అన్నది చెప్పగలుగుతాం. త్యాగరాజు స్వరపరిచిన ‘సాధించినే మనసా‘ పంచరత్న కీర్తన ఆరభి రాగంలోనిదే. మరో కృతి ‘క్షీర సాగర‘ దేవగాంధారి రాగంలో రచింపబడింది. ఈ రెండూ వింటే ఒకేలా అనిపించినా, ఏ మాత్రం శ్రద్ధగా విన్నా తేడా కూడా పసిగట్టగలం.
అలాగే కొన్ని రాగాల్లో ప్రత్యేకమైన రసాలని చూపించడానికి ఆస్కారమెక్కువగా ఉంటుంది. దీన్ననుసరించే మన పూర్వీకులు ప్రత్యేక రసాలని కొన్ని రాగాలకాపాదించారు. ఉదాహరణకి ఖమాసు రాగం శృంగార రసానికీ, సారంగ రాగం వీర రసానికీ, ముఖారి రాగం కరుణ రసానికీ వాడడం కనిపిస్తుంది. అలాగే కొన్ని రాగాలు పాడే కాలాన్ని కూడా చెబుతారు. భూపాల రాగాన్ని ఉదయాన్నే పాడాలనీ, కొన్ని రాగాలు అన్ని వేళలా పనికొస్తాయనీ, కొన్ని సాయంత్రం లేదా రాత్రి మాత్రమే పాడాలనీ ఇలా కర్ణాటక సంగీతంలో నిర్వచించారు.
కర్ణాటక సంగీతంలో గీతాలూ, స్వరజతులూ, వర్ణాలూ, కీర్తనలూ, కృతులూ, జావళీలు ఇలా ఎన్నో రకాల రచనలు ఉన్నాయి. ఇవి చాలామటుకు ఒక్కొక్కటి ఒక్కొక్క రాగం మాత్రమే ఉపయోగించి స్వర పరచబడతాయి. ఇవి కాకుండా ‘రాగమాలిక’ అనే ఒక ప్రక్రియ కూడా ఉంది. రాగమాలిక అంటే వివిధ రాగాలనీ ఒక దండలా గుది గుచ్చడమన్నమాట. పాటలోని పల్లవీ, అనుపల్లవీ, చరణాలు వంటి ఒక్కొక్క అంగమూ ఒక్కొక్క రాగంలో స్వరపరిస్తే దాన్ని రాగమాలిక అంటారు. రచన యొక్క నడకగానీ, భావం గానీ చెడకుండా పాట యొక్క సౌందర్యాన్ని పెంపొందించడానికి ఉపయోగపడే ప్రక్రియే రాగమాలిక. కర్ణాటక సంగీతంలో రాగమాలికకు ఒక విశేషమైన ఆదరణ వున్నది.
రాగమాలిక అన్నది 15వ శతాబ్దం తరువాతనే విరివిగా ప్రాచుర్యంలోకి వచ్చింది. అంతకుముందు ‘రాగ కదంబం’ అనే ప్రక్రియ ఉంది. కానీ రాగమాలికకీ, రాగ కదంబానికీ కొంచెం తేడా ఉంది. రాగ కదంబంలో నాలుగు వృత్తాలుంటాయి. ఒక్కో వృత్తమూ ఒక్కో తాళంలో ఉంటుంది. అంటే మొత్తం రచన ఒక రాగంలోనే ఉన్నా, తాళం మాత్రం ప్రతీ వృత్తానికీ మారుతూ ఉంటుంది. ఈ రాగ కదంబం నిర్వచనంలో భిన్నాభిప్రాయాలున్నాయి. కొంతమంది ఇది వివిధ తాళాలతోనే రచించాలంటారు. రాగ కదంబం గురించి సంగీత రత్నాకరంలో చెప్పబడింది కానీ, రాగ కదంబంలో ఏ ఏ రచనలున్నాయో చెప్పబడలేదు. పలానా వాగ్గేయకారుడు రాగ కదంబంలో రచించాడని చెప్పడానికి ఆధారాలు లేవు.
రాగమాలిక రాగ కదంబాన్ననుసరించి పుట్టిందే అయినా ఇది కాస్త భిన్నంగా ఉంటుంది. తాళం మాత్రం ఒకటే ఉన్నా, ప్రతీ అంగానికీ రాగం మారుతూ ఉంటుంది. ఇందులో కూడా నాలుగు రాగాలకంటే తక్కువ ఉండకూడదు. కానీ కొన్ని సంగీత రచనలు రెండూ, లేదా మూడు రాగాల్లో వింటూ ఉంటాం. కొన్ని రాగమాలికల్లో అనుపల్లవి కనిపించదు. సాధారణంగా రాగమాలికలో ఒక్కో చరణం ఒక్కో రాగంలో ఉంటుంది. ప్రతీ చరణానికి చివర చిట్టస్వరం (రాగం తీరుని చూపిస్తూ చేసే స్వరకల్పన) ఉండచ్చు, లేకపోవచ్చు. ఉంటే ఆ చిట్టస్వరంలో కొంతభాగం పల్లవి రాగాన్ని అనుసరించి ఉంటుంది. ఇది ఒక వంతెనలా పల్లవినీ, చరణాలనీ కలుపుతుంది. ఈ రాగమాలికలో పలానా రాగాలే ఉండాలన్న నియమేమీ లేదు. మేళ కర్త రాగాలూ ఉండచ్చు. జన్య రాగాలూ వాడచ్చు. కాకపోతే ఒక రాగం నుండి మరో రాగానికి మారేటప్పుడు అది సున్నితంగా వినసొంపుగా సాగాలి. హృద్యంగా ఉండాలి.
కొంతమంది వాగ్గేయకారుల రాగమాలికల్లో ప్రతీ చరణంలోనూ సాహిత్యమూ, భావమూ చెడకుండా అందులో వాడే రాగాల పేర్లు కూర్చినవున్నాయి. ఉదాహరణకి సీతారామయ్యర్ అనే వాగ్గేయకారుడు ఎనిమిది రాగాలతో ‘నిత్య కళ్యాణి నిగమాగమ సంచారిణీ’ అనే రాగమాలికని రచించాడు. ఈ రచనలో ఇంతకు ముందు చెప్పబడిన చిట్ట స్వర రచనా, ప్రతీ చరణంలోనూ వాడిన రాగాల పేర్లూ ఉంటాయి. ఇందులో కళ్యాణి, శంకారాభరణం, తోడి, కాంభోజి, నాయకి, భైరవి, మోహన, భూపాల రాగాల పేర్లు సాహిత్యంలో చొప్పించబడ్డాయి. రచన కొంత తెలుగులోనూ, కొంత సంస్కృతంలోనూ ఉంది.
నిత్యకల్యాణి నిగమాగమ సంచారిణి అత్యానంద అభిరామ అమర సేవిత త్రిపురసుందరి (రాగం:కల్యాణి)
కరుణాకరి కంబుకంఠి కాత్యాయని కౌమారి శరణాగత రక్షకి శ్రీ శంకరాభరణ వేణి (రాగం: శంకరాభరణం)
పరమ ప్రీతి తోడితోను పాలింపు జాలమేల పరితాపములెల్ల ఇపుడు పరిహరింపుము పతితపావని (రాగం: తోడి)
గంభీర భాషణి కాలకంఠునిరాణి కాంభోజాధి పతులు కాంక్షతో కొనియాడుచున్నారు (రాగం: కాంభోజి)
దిక్కెవరు నీవే గదా దీనదయాపరి అంబ మక్కువతో బ్రోచే శ్రీ మంగళ నాయకి (రాగం: నాయకి)
మధుకైటభ భంజని అంబ మరాళ గమన భైరవి మధురాపుర వాసిని మహేశ్వరి మీనాక్షి (రాగం: భైరవి)
ఆది శక్తి శంకరి అఖిలాణ్డేశ్వరి నీదు పద సన్నుత భక్త పోషణి పార్వతి ముద్దు మోహనాంగి (రాగం: మోహన)
పాండ్య భూపాల పుత్రి పర్వత రాజకుమారి తాండవేశ్వరి రక్ష దాస సీతారామ పాలిని (రాగం: భూపాళ)
అలాగే, స్వాతి తిరునాళ్ రచించిన ‘సానంతం’ రాగమాలికలో నాలుగే రాగాలుంటాయి. ఇందులో కూడా రాగాల పేర్లు సాహిత్యంలో కనిపిస్తాయి. అలాగే శ్యామశాస్త్రి ‘అంబా నిను నెరనమ్మితి’ అనే రాగమాలికని ఎనిమిది రాగాలతో రచించాడు. పధ్నాలుగు రాగాలతో చతుర్దశ రాగమాలికని ముత్తుస్వామి దీక్షితార్ రచించాడు. ఇలాగే పక్షమాలికలూ, 72 మేళకర్త రాగమాలికలూ ఇలా పలు రకాలు రచింపబడ్డాయి. త్యాగరాజు కూడా నూరు రాగాలతో ‘శతరాగ రత్నమాలిక’ అనేది రచించాడనీ చెబుతారు. కానీ ఇది ఎవరికీ లభ్యం కాకపోయినా ఈ రచన ఆధారంగానే ‘రాగ రత్న మాలికచే’ అనే కృతి రాసాడని అంటారు.
ఈ రాగమాలిక రచనల్లో కొంతమంది గమ్మత్తైన ప్రయోగాలు చేసారు. తంజావూరు శంకరయ్యరనే సంగీతకారుడు రంజని రాగమాలికని స్వరపరిచారు. ఇందులో వాడిన రాగాలన్నీ రంజని పేరుతోనే ఉంటాయి. అవి రంజని, శ్రీరంజని, మేఘరంజని, జనరంజని. చాలా మంది వాగ్గేయకారులు ఈ రాగమాలికల్ని స్వరపరిచారు. సుబ్రహ్మణ్య భారతి రచించినవాటిని రాగమాలికల్లోనే స్వరపరిచారు. అలాగే గోపాలకృష్ణ భారతి కూడా రాగమాలికలు రచించారు. రాగమాలిక రచనలే కాకుండా రాగమాలికా వర్ణాలు కూడా ఉన్నాయి. పట్నం సుబ్రహ్మణ్యయ్యర్ స్వరపరిచిన ‘వలచి వచ్చిన‘ అనే రాగమాలికావర్ణం అత్యంత ప్రసిద్ధమైనది. ఈ రాగమాలికలో పల్లవి కేదారంలోనూ, అనుపల్లవి శంకరాభరణంలోనూ, ముక్తాయి స్వరం కళ్యాణి, బేగడలో, చరణం కాంభోజి రాగంలోనూ ఉంటాయి. మిగిలిన చిట్టస్వరాలు వరుసగా యదుకుల కాంభోజి, బిలహరి, మోహన, శ్రీ రాగాల్లో ఉంటాయి. పల్లవీ, అనుపల్లవీ, ముక్తాయి స్వరాల్లో వాడిన రాగాలని ప్రత్యేకంగా చూస్తే కాకలి నిషాదం(ని3) స్వరం అన్ని రాగాల్లోనూ వుంది. అలాగే చరణమూ, చిట్టస్వరాల్లో చతుశ్రుతి రిషభం (రి2) , పంచమం(ప) ఆధారంగా మిగతా రాగాలన్నీ కలిపారు. ఈ రాగమాలికలో పల్లవిలోంచి అనుపల్లవీ, అనుపల్లవిలోంచి ముక్తాయి స్వరాలూ ఒకదాంట్లోంచి ఇంకోటి సెలయేటి ప్రవాహంలా సాగుతాయి. అలాగే చరణమూ, మిగతా చిట్టస్వరాలు కూడా.
ఇవే కాకుండా, ప్రొఫెసర్ సాంబమూర్తి ‘దిన రాగ మాలిక’ అనే వర్ణాన్ని రచించాడు. ఇందులో “రక్తి రాగములైన బిలహరి, ధన్యాసి, మధ్యమావతి, కళ్యాణి, పూర్వకళ్యాణి, కేదారగౌళ, మోహన, భూపాళములు గల” అని అనుపల్లవుంటుంది. అలాగే పార్థసారధి ‘నక్షత్ర రాగ మాలిక’ అనే రాగమాలిక రచించారు. ఇందులో ఒక్కో ఆవర్తనానికీ ఒక్కో రాగం వాడారు. తాళం మాత్రం ఒకటే ఉంటుంది. సాంబమూర్తి వినూత్నంగా రాగమాలికలో స్వరాలన్నీ కర్ణాటక సంగీత పరంగా బాణీ మాత్రం వెస్ట్రన్ సంగీత పరంగా ఒక రాగమాలిక రచించారు. ఇలా అనేకమంది వాగ్గేయకారులు రాగమాలికలని రచించారు. సాధారణంగా కర్ణాటక సంగీత కచేరీల్లో ఈ రాగమాలికలు వింటూ ఉంటాం. స్వాతి తిరునాళ్ రచించిన ‘భావయామి రఘురామం‘ అనే ప్రసిద్ధి చెందిన రాగమాలిక తరచు కచేరీల్లో పాడుతూనే ఉంటారు. స్వాతి తిరునాళ్ ‘కళ్యాణి ఖలు యద్కథ త్రిజగదం’ అనే రాగమాలిక శ్లోకాన్ని రచించాడు. ఇందులో వాడిన రాగాల పేర్లు కళ్యాణి, మోహన, సారంగ, శంకరాభరణం శ్లోకం ప్రతీ పాదంలోనూ వస్తాయి.
ఇంతకు ముందు చెప్పినట్లు ఈ రాగమాలికల్లో రాగం మారుతుంది కానీ తాళం మాత్రం ఒకటే ఉంటుంది. అలాకాకుండా రాగం ఒకటే ఉండి తాళం మాత్రం ప్రతీ అంగానికీ మారడాన్ని తాళ మాలిక అంటారు. ఈ తాళమాలికలో ప్రత్యేకమైన రచనలేవీ కనిపించక పోయినా, మనోధర్మ సంగీతంలో తాళమాలిక కనిపిస్తుంది. తిరువత్తియూర్ త్యాగయ్యర్ అనే ఒకాయన ఒకే రాగంలో ప్రతీ చరణాన్నీ వేర్వేరు తాళాలతో పాడి కచేరీ చేసినట్లుగా చెబుతారు. ఇవే కాకుండా ప్రతీ అంగానికీ రాగమూ, తాళమూ మారే ప్రక్రియని రాగ తాళమాలిక అని వ్యవహరిస్తారు. ముత్తుస్వామి దీక్షితార్ తండ్రి రామస్వామి దీక్షితార్ 108 రాగతాళ మాలిక రచించారు. నాకు తెలిసినంతవరకు ఇదొక్కటే కర్ణాటక సంగీతంలో ఉన్న రాగతాళ మాలిక. ఇందులో ఉపయోగించిన ప్రతీ రాగం పేరూ సాహిత్యంలో కనిపిస్తుంది.
ఈ రాగమాలిక ప్రక్రియ నాయకరాజుల కాలంలో నృత్య నాటికలూ, యక్షగానాలతో మొదలయ్యింది. నృత్యనాటికల్లో సన్నివేశానికి తగ్గట్టుగా వివిధ రసాల్నీ పాటలో చూపడానికి ఎక్కువగా వాడేవారు. మధుర నాయకరాజుల కాలంలో వెంకట సోమయాజి గారి తిరుమలయ్య రచించిన చిత్రకూట మహత్మ్యం అనే యక్షగానంలో రాగమాలికని వాడినట్లుగా వుంది. మధుర నాయక రాజుల తరువాత వచ్చిన తంజావూరు మహారాష్ట్ర రాజుల కాలానికి ఈ రాగమాలిక నృత్యనాటికల్లో భాగమయ్యింది. ఆ కాలంలో ఈ రాగమాలిక ప్రక్రియని ప్రతీ ఒక్కరూ అనుసరించారు. కానీ త్యాగరాజు రచించిన నృత్యనాటికల్లో ఒక్కొక్క రాగం ఒక్కొక్క రసాన్ని చూపడానికి వాడినా రాగమాలిక రచన కనిపించదు. అన్నమాచార్య కీర్తనలనీ సాహిత్యాన్ని బట్టి రాగమాలికల్లా (ఉదా: ‘ఎంతమాత్రమున ఎవ్వరు తలచిన’ కీర్తన – బృందావని, మాయమాళవ గౌళ) స్వరపరిచారు.
ప్రముఖ సంగీత విద్వాంసుడు మంగళంపల్లి బాల మురళీకృష్ణ రాగమాలికను థిల్లానలో వాడి కొత్త ప్రయోగం చేసారు. ఇందులో అమృతవర్షిణి, మోహనం, కానడ, హిందోళ రాగాలున్నాయి. ఇదే కాకుండా శ్రుతి బేధం చూపుతూ తాయ థిల్లాన అనే మరో పద్ధతిలో రాగమాలిక రచించారు. అలాగే గతి భేదాన్ని చూపిస్తూ మరో రాగమాలిక, ‘అంబా మామవ’ అనే శుద్ధ రాగమాలికా కృతీ, తిరుపతి వేంకటేశ్వరునిపై ‘గాన లోల’ రాగమాలిక కృతినీ రచించారు.
ఈ రాగమాలిక ప్రయోగం కేవలం శాస్త్రీయ సంగీతానికే పరిమితం కాలేదు. భావగీతాల్లోనూ, జానపద గీతాల్లోనూ, సినిమా పాటల్లో కూడా ఈ రాగమాలికా ప్రయోగం తరచు వింటూనే ఉంటాం. కాకపోతే సినిమాల్లో చరణాలని బట్టి రాగాలు వాడడం కనిపిస్తుంది. కొన్ని పాటల్లో రెండూ లేదా మూడూ రాగాలు మాత్రమే కనిపిస్తాయి. పాత సినిమా పాటలు శాస్త్రీయ సంగీత రాగాలనుసరించి వరుసలు కట్టేవారు. అందువల్ల వివిధ రాగాల వాడకం పాటల్లో కనిపిస్తుంది. మునుపటి సంగీత దర్శకులు రాజేశ్వర రావు, పెండ్యాల, ఘంటసాల స్వరపరిచిన పాటల్లో ఈ రాగమాలిక ప్రయోగం కనిపిస్తుంది.
మల్లీశ్వరి సినిమాలో ఉషాపరిణయం యక్షగానంలో బిలహరి, మోహన, కేదారగౌళ, ముఖారి, హిందోళం వంటి రాగాలు కనిపిస్తాయి. రహస్యం సినిమాలో గిరిజా కళ్యాణం యక్ష గానంలో నాట, శ్రీ, కాంభోజి, అఠాణ, వసంత, రీతిగౌళ, బేగడ, సరస్వతి, హిందోళం, హంసధ్వని, సావేరి, సామ, సురటి, మధ్యమావతి రాగాలున్నాయి. సువర్ణ సుందరి సినిమాలో ‘హాయి హాయిగా ఆమని సాగే‘ పాటలో కూడా సోహిని, బహార్, జోన్‌పూరి, యమన్ వంటి రాగాలు కనిపిస్తాయి.
సినిమా పాటల్లో వాడే రాగమాలికలకీ, శాస్త్రీయ సంగీత రాగమాలికా కృతులకీ చాలా తేడా ఉంది. శాస్త్రీయ సంగీతంలో రాగ మాలికల్లో అన్య స్వర ప్రయోగాలు చేయకుండా రాగ లక్షణాలని పూర్తిగా పాటిస్తారు. సినిమా సంగీతంలో కొన్ని సార్లు అన్య స్వర ప్రయోగాలు చేస్తారు. అంటే, సినిమా పాటల్లో కేవలం రాగ మూర్ఛన (స్కేల్) ని మాత్రమే పాటిస్తారు తప్ప పూర్తి రాగాన్ని వాడరు. ఒక్కోసారి స్వర వర్జితాలు కూడా చేస్తూ ఉంటారు. ఫలానా సినిమా పాట ఈ రాగంలో ఉందీ అంటే ఆ పాట కేవలం రాగ మూర్ఛనని మాత్రమే పాటిస్తోందని అర్థం చేసుకోవాలి. సినిమా పాటలలో కూడా కొన్ని పాటలు పూర్తి రాగ లక్షణాలని పాటించి స్వరపరిచారు. కానీ, వాటి సంఖ్య చాలా తక్కువనే చెప్పచ్చు. కొన్ని సినిమా పాటల్లో రాగమాలికలు:
- అనార్కలి: రాజశేఖరా (చక్రవాకం, హిందోళం)
- అమెరికా అమ్మాయి: ఆనంద తాండవ మాడె (వసంత, అఠాణ)
- ఉండమ్మా బొట్టు పెడతా: రావమ్మ మహాలక్ష్మి (నీలాంబరి, మధ్యమావతి, మోహన)
- తూర్పు-పడమర: స్వరములు ఏడైనా (కామవర్ధిని, హిందోళం, సింధుభైరవి, చక్రవాకం)
- జయభేరి: యమునా తీరమున (బేహాగ్, కాపి)
- పంతులమ్మ: మానస వీణా మధు గీతం (పంతువరాళి, రేవతి)
- పాండురంగమహత్మ్యం: జయ కృష్ణా ముకుందా మురారీ (మోహన, కళ్యాణి, ఆరభి, హిందోళం)
- బావామరదళ్ళు: ముక్కోటి దేవతలు ఒక్కటై నారు (కాంభోజి, యదుకుల కాంభోజి, కానడ, గౌరీ మనోహరి, మాయా మాళవ గౌళ, నాటకురంజి)
- భక్త ప్రహ్లాద: జీవము నీవేకదా (ఖరహరప్రియ, హిందోళం, మలయమారుతం)
- మల్లీశ్వరి: నెలరాజా వెన్నెల రాజా (శ్రీ, కానడ); ఆకాశవీధిలో హాయిగా యెగిరేవు (భీంపలాస్, కళంగద, కీరవాణి, హంసానంది); పోయి రావే తల్లి (పీలు, శహన, పున్నాగవరాళి)
- మంచిమనసులు: శిలలపై శిల్పాలు చెక్కినారు (ఉదయ రవి చంద్రిక, కాంభోజి, కీరవాణి)
- వాగ్దానం: శ్రీ నగజా తనయం (కానడ, శంకరాభరణం, మోహన, తోడి, కేదారగౌళ, శ్రీ, కళ్యాణి)
- విప్రనారాయణ: మేలుకో శ్రీరంగ (బౌళి, మలయమారుతం); ఎవ్వడే అతడెవ్వడే (భైరవి, మోహన, కాపి, వసంత)
- శంకరాభరణం: రాగం-తానం-పల్లవి (చారుకేశి, సారంగ, దేవగాంధారి, కాంభోజి)
- శివరంజని: అభినవ తారవో (శివరంజని, మలయమారుతం, సరస్వతి, కళ్యాణి)
- శ్రీ కృష్ణ తులాభారము: భలే మంచి చౌక బేరము (కాపి, భాగేశ్వరి, మోహన, భాగేశ్వరి, హంసానంది, గౌళ, కాపి)
- సప్తపది: అఖిలాండేశ్వరి (షణ్ముఖప్రియ, అఠాణ, సరస్వతి, దుర్గ(శుద్ధ సావేరి))
- సిరివెన్నెల: ఈ గాలి ఈ నేల (శివరంజని, అమృతవర్షిణి)
- లలితగీతాలు: పుష్ప విలాపము (శివరంజని కళ్యాణి, పంతువరాళి, పహాడి, మార్వా, బాగేశ్వరి)
పైనుదహరించిన పాటలే కాకుండా ఇంకా అనేక పాటల్లో రాగమాలిక ప్రయోగం కనిపిస్తుంది. పూర్వపు సినిమాల్లో ప్రతీ సంగీత దర్శకుడూ వివిధ రాగాల్లో రాగమాలికలా స్వరపరచడముంది. చాలామంది సంగీత ప్రియులు ఈ రాగమాలికల్ని ఇష్టపడతారు ఎందుకంటే వీటి వల్ల ఎక్కువ రాగాలని పాడిన అనుభూతి వస్తుంది. అన్ని రాగాలూ అందర్నీ అలరించినా అలరించకపోయినా రాగమాలిక మాత్రం ఎప్పటికీ జనరంజకమే.
ఆధార గ్రంథాలు:
- A Dictionary of South Indian Music and Musicians – Sambamoorthy, P. – Madras, Indian Pub. House, 1952.
- సమగ్రాంధ్ర సాహిత్యం – ఆరుద్ర – తెలుగు అకాడమీ – హైద్రాబాదు – 2004.
- గాంధర్వ వేదము – సంగీత రత్నాకరం – చర్ల గణపతి శాస్త్రి – ఆంధ్ర విశ్వవిద్యాలయం – విశాఖపట్టణం.
- గాన కళా బోధిని – పార్థ సారధి – బాలసరస్వతి బుక్ డిపో – మద్రాసు – 1965.
- సంగీత విద్యా దర్పణం – ఏకా సుబ్బారావు – మహలక్ష్మి బుక్ కార్పోరేషన్ – విజయవాడ.
- A history of British diplomacy in Tanjore – Rajayyan, K. – Madras University, 1969