ఈ కానుకనివ్వలేను

ట్రింగ్‌ ట్రింగ్‌ ట్రింగ్‌ ట్రింగ్‌…

ఏదో స్వప్నలోకాల నుంచి వస్తున్నట్టున్న ధ్వని నెమ్మదిగా నన్నీ లోకంలోకి తీసుకొచ్చి పడేసింది. అతి కష్టమ్మీద కనురెప్పలు తెరిచి కాస్త తెలివి తెచ్చుకుని చూస్తే ఫోను మోగుతోంది. విసుగ్గా తల విదిలించి చూశాను. ఫోను మీదున్న ఎలక్ట్రానిక్‌ వాచీ వైపు. అర్థరాత్రి దాటి రెండవుతోంది. ఇప్పుడెవరీ ఫోను? కొంపదీసి ఇండియా నుంచి కాదుగదా? అందరూ క్షేమమేనా?

దెబ్బకి మత్తు వదిలింది. నంబరు చూస్తే ఇండియాది కాదు. హమ్మయ్య. ఇక్కడిదే. కానీ తెలిసినవాళ్ళెవరిదీ కాదు. అయినా తెలిసినవాళ్ళు ఇప్పుడెందుకు చేస్తారు? ఏదైనా రాంగ్‌ కాల్‌? ఫోను తీసుకుని చెవిదగ్గరానించుకున్నా.

“పూర్ణా, సారీ టు డిస్టర్బ్‌ యూ అట్‌ దిస్‌ టైమ్‌. శాండీ ఉన్నాడా? అతనితో మాట్లాడాలి, కొంచెం లేపుతావా?” ఓహ్‌. ఇది రాజు గొంతు. ఏదో హడావుడిలో ఉన్నట్టున్నాడు.

“వాట్‌ హేపెండ్‌ రాజూ? ఎనీథింగ్‌ రాంగ్‌…?” నా గొంతు వణకడం నాకే తెలుస్తోంది.

“ఏం లేదులే, డోంట్‌ వరీ, శాండీ ఉంటే ఫోనియ్యి”

కాస్త జరిగి, అటు తిరిగి పడుకున్న శాండీ భుజమ్మీద చెయ్యేశాను. నెమ్మదిగా కుదుపుతూ చెవి దగ్గరగా వెళ్ళి చెప్పాను.

“శాండీ, నీకే ఫోను. రాజు పిలుస్తున్నాడు… శాండీ…” ఊహూ… లేవలేదు. ఫోను మళ్ళీ దగ్గరిగా తీసుకున్నాను.

“రాజూ, అతన్ని నిద్రలేపి నీకు కాల్‌ చెయ్యమని చెప్తాలే. ఒన్‌ మినిట్‌… ఒకే…”

ఫోను పెట్టేశాను. ఏమయింది, రాజు ఈ వేళలో ఎందుకు కాల్‌ చేశాడు? అంత ఆతృతలోనూ నాకో ఒక విషయం అర్థమయింది. శాండిల్య మెలకువగానే ఉన్నాడనీ, కావాలనే లేవలేదనీ. నిద్రపోతున్నవాణ్ని లేపగలంగానీ, నిద్ర నటిస్తున్నవాడిని లేపడం ఎవరి తరం? అతన్ని నెమ్మదిగా ఇటు తిప్పుదామని ప్రయత్నించాను. తిరగలేదు. అర్థమయింది. అతను ఏదో ఆలోచిస్తున్నాడు. కావాలనే లేవలేదు. అసలేమయిందో తెలుసుకుందామని నేనే మళ్ళీ రాజుకు ఫోన్‌ చేద్దామా అనుకున్నాను. కానీ శాండీ గురించి ఏం చెప్పను? పక్కమీదే అస్తిమితంగా అటూఇటూ కదులుతున్నాను.

అకస్మాత్తుగా శాండిల్య చివ్వున లేచి ఫోనందుకున్నాడు. డయల్‌ చేసి “హలో రాజూ..” అంటూనే మూడంగల్లో గది బైటికెళ్ళిపోయాడు. వెళ్తూ డోర్‌ నాబ్‌ దగ్గరిగా లాగేసి వెళ్ళాడు. నేను వెనకాలే వెళ్ళి అవేం వినకూడదన్న గీత గియ్యడమన్న మాట అది. సరిగ్గా మూణ్నిమిషాల తర్వాత లోపలికొచ్చాడు. బెడ్‌లైట్‌ వెలుగులో అతని మొహంలోని రంగులయితే నాక్కనిపించలేదుగానీ, అశాంతిగా ఉన్నట్టు మాత్రం తెలిసింది. మరో రెండు నిమిషాల్లో రెడీ అయి “త్వరగా వచ్చేస్తాలే , టేక్కేర్” పొడిగా అనేసి బైటకెళ్ళిపోయాడు. ఇంకొక నిమిషంలో కారు డ్రైవ్‌వే దాటిన శబ్దం వినిపించింది.

ఈమధ్యనంతా ఇలాగే ఉంటున్నాడు శాండిల్య.

ఎందుకో ఏవిటో నేను కొంత ఊహించగలుగుతున్నాను. కొంత ఊహించలేకపోతున్నాను. శాండిల్య అశాంతికి నా ఊహలను మించిన కారణాలుండొచ్చన్న ఆలోచన నన్ను భయపెడుతోంది. అప్పటికీ ఇండియాకు ఫోను చేసి “అమ్మా, శాండిల్య ఎందుకో మూడీగా అయిపోతున్నాడమ్మా. ఇప్పుడోలా, ఇంకో క్షణం ఇంకోలా ఉంటున్నాడు. నాకేమిటో భయంగా ఉంది… ” అని చెప్పేశాను.

“ఊరుకో పూర్ణా, అన్నిటికీ నువ్విలాగే భయపడుతుంటావు. నలభైల్లో మగవాళ్ళు ఇలా కాస్త మూడీగా ఉండటం మామూలే. రకరకాల ఒత్తిళ్ళు వాళ్ళమీద పనిచేస్తుంటాయి. మనం కాస్త శాంతంగా మాట్లాడుతూ సపోర్ట్‌ నివ్వాలి. అంతేగానీ లేనిపోనివన్నీ ఊహించుకుంటూ నీ బుర్ర చెడగొట్టుకుని అతని బుర్ర కూడా చెడగొట్టకు. పిల్లలు జాగ్రత్త…” అంటూ బోలెడన్ని ఉపమానాలు, అనుభవాలు, జాగ్రత్తలూ చెప్పింది అమ్మ. అవును మరి, అమ్మల దగ్గర్నుంచి అమెరికాకు దిగుమతయ్యేది ఆవకాయే కాదు, అద్భుతమైన ప్రశాంతత, అంతకుమించిన ధైర్యమూనూ.

ఆరవుతూండగా తిరిగివచ్చాడు. ఒక్కసారి నా మొహంలోకి ఏదో వెతుకుతున్నట్టు చూశాడు. “ఆరేళ్ళ క్రితం ఇక్కడికొచ్చారు. నిన్నే కొత్త ఇంట్లో హౌస్‌ వామింగ్‌ కూడా చేశారట. ఏమయిందో తెలియదు, బావా బావమరిది గొడవపడి ఒకర్నొకరు కాల్చుకుని చచ్చిపోయారు. బావమరిది భార్య, ఇద్దరు పిల్లల్ని కూడా కాల్చేశాడా బావ. ఆస్తి గొడవలుండొచ్చంటున్నారు. పోలీస్‌, హడావుడీ… అందుకే రాజు ఫోను…” అలా పొడిపొడిగా చెప్పడంలోనే తెలుస్తోంది ఆ సంఘటన పట్ల శాండీకెంత అసహనంగా ఉందో.

అంతకుమించి అతను చెప్పడానికీ నేను వినడానికీ ఏమీలేదు. వివరంగా చర్చించుకోవడానికి మాత్రం ఏముంటుంది? ఏదో ఘనవిజయం సాధించినవాళ్ళ గురించి అయితే ఏం చేశారో, ఎలా సాధించారో అడిగి తెలుసుకోవచ్చు. ఇలాంటి విషయాల్లో అన్ని వివరాలూ తెలుసుకుని మాత్రం ఏం చేస్తాం… మరింత మనసు పాడవడం తప్ప. అతను స్నానానికెళ్ళిపోయాడు.

సాఫ్ట్‌వేర్‌ వైభవం మొదలవుతున్న తొలి రోజుల్లోనే ఇక్కడికి వచ్చాడు శాండిల్య. మరో నాలుగేళ్ళకు మా పెళ్ళి జరిగింది. యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్‌లో పని సంపాదించుకున్నాను నేను. అంతా బాగానే గడిచిపోతోందనిపిస్తోంది తల్చుకుంటే. గడిచిన ఆరేడు నెలల్లో ఇండియా వెళ్ళిపోతే ఎలా ఉంటుందని శాండీ పిల్లలను అడగడం ఒకట్రెండుసార్లు విన్నాను. సెలవులకు ఒకటీ రెండు నెలలు కాకుండా, అక్కడే ఉండిపోవడం ఎంత బావుంటుందో వాళ్ళకు అనునయంగా వివరిస్తున్నట్టు చెబుతుండడం కూడా నా చెవిన పడిందోసారి. కానీ తిరిగి వెళ్ళడం గురించి మేమెప్పుడూ ఆలోచించలేదు. శాండిల్యలో అలాంటి ఆలోచన ఉన్నట్టే ఇంతకుముందెప్పుడూ నాకు తెలీదు.

పిల్లలు టీనేజీలోకి వచ్చేసరికల్లా ఇండియా వెళ్ళిపోవాలనుకుంటారు చాలామంది ప్రవాస భారతీయులు. అనుకోవడమేగానీ, నిజంగా వెళ్ళలేరు. కాకపోతే ఎప్పుడో ఒకప్పుడు – ఓ రెండేళ్ళు గట్టిగా ఆలోచిస్తారు. ఆ రెండేళ్ళూ ఇంట్లో భారత దేశ సరిహద్దుల్లో ఉండేలాంటి వాతావరణం ఉంటుంది. భార్య వెళ్దామంటే భర్త వద్దనీ, భర్త చెబితే భార్య వద్దనీ, ఇద్దరూ సరేననుకుంటే పిల్లల గురించి ఆలోచించి వాదోపవాదాలు నడుస్తాయి. డబ్బుల్లెక్క వేసుకునీ, బంధాల లోతెంతో కొలుచుకునీ, ప్రయోజనాలు బేరీజు వేసుకునీ ఇలా గడిచిపోతుందా కాలం. చివరికి హార్దికం మీద ఆర్థికమే ఎక్కువగా నెగ్గుతుంది. అన్నేళ్ళు అలవాటు పడిన పరిస్థితులను వదిలి వెళ్ళే ప్రయాస పడటానికి ఎక్కువమంది ఇష్టపడరు. మొత్తానికి మళ్ళీ ఇక్కడే. ఇప్పుడు శాండిల్య ఆ దశలో ఉన్నట్టున్నాడు. నెమ్మదిగా చూసి నా దగ్గరా ప్రస్తావిస్తాడేమో. అందుకేనా ఇలా అస్తిమితంగా ఉన్నాడు?

శాండిల్య ఆఫీసుకు రెడీ అయిపోయి సిరియల్‌ తింటూ చెప్పాడు, “పూర్ణా, సాయంత్రం నీతో మాట్లాడాలి. కొంచెం ముందు రావడానికి ప్రయత్నిస్తావా”

“షూర్‌ ” అన్నాన్నేను.

కానీ ఆఫీసుకు వెళ్ళాలనిపించలేదు. రావటం లేదని మెసేజ్‌ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆలోచనలు ముసురుకున్నాయి. అకస్మాత్తుగా నాకో కారణం దొరికింది. ఆ దారిలో తీగ లాగుతుంటే అవి ఓ కొలిక్కి వస్తున్నాయి. ఆరు నెలల క్రితం నారాయణగార్ని రిసీవ్‌ చేసుకోవడానికి ఏర్‌ పోర్టుకు వెళ్ళొచ్చినప్పటి నుంచీ శాండిల్యలో ఈ అసహనం ఎక్కువయింది.