ప్రజాస్వామ్యం – పత్రికాస్వాతంత్ర్యం

ప్రజాస్వామ్యం సురక్షితంగా, నిరవధికంగా నాలుగు కాలాలపాటు నడవటానికి పత్రికాస్వాతంత్ర్యం పట్టుకొమ్మ. అది సాధారణంగా నాగరీకులందరూ ఏకగ్రీవంగా ఒప్పుకొనే విషయం. స్వాతంత్ర్యం ఎప్పుడూ బాధ్యతాయుతమైన స్వాతంత్ర్యం అని మాత్రమే అర్థం చేసుకోవాలి. ఒకవేళ ఏ పాత్రికేయుడన్నా అబద్ధాలు రాసి, తిరగరాసి, బాధ్యతారహితంగా ప్రవర్తించి రాజ్యాగం తనకు ప్రసాదించిన ఈ స్వాతంత్ర్యాన్నితన అవమానకరమైన రచనలద్వారా దుర్వినియోగం చేస్తున్నాడని అనుమానం వస్తే, అటువంటి దుష్ప్రవర్తనని ఆపడానికి ప్రజాస్వామ్య రాజ్యాలలో చట్టాలున్నాయి; న్యాయస్థానాలున్నాయి. ఆ చట్టాలని అమలుపరచడం ప్రభుత్వం బాధ్యత.

వచ్చిన చిక్కల్లా ఇక్కడే!

పత్రికా స్వాతంత్ర్యానికి సంబంధించిన చట్టాలని అమలుపరచవలసిన ప్రభుత్వమే ఆ చట్టాలని ఉల్లంఘిస్తే, ప్రజాస్వామ్య రాజ్యాలకి, నిరంకుశ నియంతృత్వాలకీ తేడా లేదు. ప్రభుత్వం హద్దుమీరి ప్రవర్తించినపుడు, ఆ విషయం బట్టబయలు చేయడానికి పత్రికలే ప్రజలకున్న ఆధారం. అందుచేత, నిజాయితీఉన్న పత్రికా రచయితలు అటువంటి ఆకతాయి ప్రభుత్వాన్ని అదుపులో పెట్టడానికి ప్రజాస్వామ్య వ్యవస్థని నూరుకళ్ళతో కాపాడటానికి వెనుదీయకూడదు. వ్యక్తులకన్నా వ్యవస్థలు ముఖ్యం.

గత శతాబ్దంలో, యాభయ్యో దశాబ్దంలో, ఆంధ్రదేశంలో మూక ఉమ్మడిగా కమ్యూనిస్టులని ప్రభుత్వాధికారులు జైళ్ళలో పడేశారు. చెప్పాచెయ్యకండా జైలులో పెట్టడానికి ఆ రోజుల్లో పెద్దకారణాలు అక్కరలేదు కాబోలు. అప్పట్లో జైల్లో ఉన్న పుచ్చలపల్లి సుందరయ్య గారు ఆనాటి ఆంధ్రప్రభ సంపాదకులు నార్ల వెంకటేశ్వర రావు గారికి ఒక ఉత్తరం రాశారు. క్లుప్తంగా ఆ ఉత్తరం సారాంశం ఇది. — జైలులోకి విడుదలచేయబడ్డ ఆంధ్రప్రభ దినపత్రిక నానా కత్తిరింపులతో సెన్సారు చెయ్యబడి వస్తున్నదేమిటీ అని — నార్లవెంకటేశ్వర రావు గారికి, తన సంపాదకత్వంలో వస్తున్న పత్రికని ప్రభుత్వం కత్తిరింపులతో రాజకీయఖైదీలకు అందించడం సుతరామూ ఇష్టం లేదు. అందుకు నిరసనగా వెంకటేశ్వర రావుగారు, ఒక రోజు పత్రిక మొదటిపేజీ నిండా న ల్లగా తారుపూసి విడుదలచేసారు. అది పత్రికాప్రపంచంలో చాలా ఘాటైన నిరసన. దానితో, ప్రభుత్వం సెన్సారు చెయ్యడం మానుకున్నది. అది అప్పుడు!

పత్రికా రచయితలందరూ మడికట్టుకున్న మహానుభావులని, నిస్స్వార్థపరులనీ, దుడుకుగా, రుజువులు లేకుండా ఎప్పుడూ రాయరనీ అనుకోవడం వ్యామోహమే! పత్రికలన్నీ వర్గరాజకీయాలకి (ఆంధ్రదేశంలో అయితే కులమత రాజకీయాలకి కూడా!) అతీతం అని అమాయకుడు కూడా నమ్మడు. అక్కడేకాదు; ఇక్కడైనా, మరెక్కడైనా సరే! ఒక్క నియంతృత్వ రాజ్యాలలోనే పత్రికలు ఒకే రాజకీయ వర్గాన్ని సమర్థిస్తూ రాయాలి. అట్లా రాయకపోతే పత్రికారచయితల గతి ఏమవుతుందో వేరే చెప్పనక్కరలేదు. చరిత్ర నేర్పిన, ఇంకా నేర్పుతూవున్న పాఠాలు చాలు.

పోతే, ఉదాహరణకి ఒక పత్రికారచయిత రాసింది కేవలం – అభాండం – అని అనుకుందాము. ఒక వ్యక్తిపై ఆధారరహితమైన వ్యాఖ్య అనే అనుకుందాం. కక్షతో రాసిన రాత, దారుణమైన రాత అనే అభిప్రాయం సబబేననుకుందాం. ఆ రచయితరాసింది -యెల్లో జర్నలిజం – అనే అనుకుందాం. అటువంటి దుస్థితి వచ్చినప్పుడు, ముందుగా ఆ పత్రికాధికారులు తగు చర్యతీసుకోవాలి. చట్టబద్ధంగా ఆ రచయితపై, ఆ పత్రికపై అభియోగాలు తెచ్చి న్యాయబద్ధమయిన చర్య తీసుకోవడం ప్రజాస్వామ్య దేశాలలో అసాధ్యం కాదు.

అంతేకాని, అల్లరిమూకలు ఆ పత్రికా కార్యాలయం మీద దాడిచేసి, కిటికీ అద్దాలు పగలగొట్టి, ఫైళ్ళు తగలబెట్టి, అలాంటి రాతలు మానకపోతే మళ్ళీ ఇలాగే దాడులు చేస్తామని బెదిరించడమూ, ఆ విషయాన్ని ప్రభుత్వాధికార్లు చూసీచూడనట్టు ఊరుకోవడమూ ప్రజాస్వామ్యం అనిపించుకోదు. అలాగే, ఆ రచయిత రాసింది అభాండం అని దెప్పుతూ రుజువులు లేకుండా మరో పాత్రికేయుడు మరో అభాండం గిలికించడం కూడా పత్రికాస్వాతంత్ర్యానికి ముప్పేకాని మరొకటి కాదు.

ఆఖరిగా, పత్రికా స్వాతంత్ర్యం మేరకు ప్రభుత్వాధికారుల చర్యలు అతి రహస్యంగా గూడుపుఠాణీగా జరిగితే దానిని పోలీసు జులుం అనడం అతిశయోక్తి కాదు. రక్షణ ఇవ్వవలసినవాడే గుట్టుగా భక్షిస్తే ఇంక దిక్కేదీ?

లాటిన్‌ లో ఒక సామెత : timeo Danaos et dona ferentes (L) — I fear the Greeks even when they bring gifts — అని అర్థం!