ట్రాఫిక్ సిగ్నల్ – A Twenty first century love story

ఉదయాన్నే పరుగుల జీవితానికి తెరతీసాడు చెన్నై సూర్యుడు. రోజూలాగే, రోడ్డున పడ్డ జనంతో కిటకిటలాడుతోంది కోయంబేడు జంక్షన్. అంతటి రద్దీనీ అదుపుచేస్తూ రోడ్డు మధ్య నిటారుగా నుంచొనుంది ట్రాఫిక్ సిగ్నల్. అంతులేని ప్రయాణంలో అరనిమిషం తెరపు – ఆ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గరే దొరుకుతుంది కొందరికి. చాలామందికి మాత్రం అది ఒక జీవితకాల నిరీక్షణ.

“జగమే మారినది మధురముగా ఈ వేళా…”, తన సంగీత ప్రావీణ్యం తాను ఎరిగున్నవాడవడటం చేత లోపల్లోపలే హం చేసుకుంటున్నాడు రాజేష్. ఎదురుగా ఉన్న ట్రాఫిక్ సిగ్నల్ని చూస్తే మొన్న వీసాకోసం మొదటిసారి పట్నం వచ్చిన తన వేలు విడిచిన బామ్మ, దాన్ని చూసి, “పగడవూ, పచ్చా పొదిగిన పెద్ద మంత్రదండంలా ఉందిరా అబ్బీ” అని మురిసిపోవడం గుర్తుకు వచ్చింది. ఇప్పుడది వందంకె చూపిస్తోంది. అంటే ఇంకా నిమిషన్నర పైగానే ఆగాలి! వాచీ చూసుకున్నాడు. ఫరవాలేదు, ఎనిమిదింపావే అయ్యింది. మీటింగు తొమ్మిదింటికి. చాలా టైమే ఉంది. ఐనా ఆ మీటింగులో తను ఒరగబేట్టేదేవీ లేదు. తప్పని సరి తద్దినాలంటే ఏవిటో తను మేనేజరయ్యి ఇలాటి మీటింగులకి వెళ్ళాకే అర్థవయ్యింది…

ఆఫీసాలోచనల జలగలనుంచి కాస్సేపైనా తన బుర్రకి రక్షణ కల్పించాలన్న సదుద్దేశంతో పరిసరాల పరిశీలన మొదలుపెట్టాడు. పక్కనే ఒక బస్సు ఆగి ఉంది. బస్సే ఒక చిన్న సైజు మొబైల్ వరల్డ్ అనిపిస్తూ ఉంటుంది తనకెప్పుడూ. బస్సులో జనాలని, వాళ్ళ జీవితాల లోతుల్ని కళ్ళతోనే అంచనా వెయ్యడం రాజేష్ అనేకానేక హాబీలలో ఒకటి. ఆ బస్సులో చకచకా పరిగెత్తాయతని చూపులు. అంతలో రెడ్ సిగ్నల్ పడ్డట్టు హఠాత్తుగా ఒక దగ్గర ఆగిపోయాయవి. ఒక్క క్షణం తన కళ్ళని తనే నమ్మలేకపోయాడు. అది కలా నిజమా – అని తెలుసుకుందుకు గిల్లుకొనేవాడే, అంతలో కయ్యి మని హారన్ కొట్టుకొంటూ ఎదురుగా వెళ్ళిపోయిన లారీ తన శబ్దభేరిని భేదించినంత పని చేస్తే, తను చూస్తున్నది కలకాదని నిశ్చయించుకున్నాడు. ఆమె… ఆమేనా?! ఇది సాధ్యమేనా?! లేక తను భ్రమపడుతున్నాడా?! అతను పడుతున్న విచికిత్సకి చికిత్సా అన్నట్టుగా ఆమె కొద్దిగా ఇటు తిరగింది. ఇప్పుడు ముఖం స్పష్టంగా కనిపిస్తోంది.

సందేహం లేదు ఈమె ఆమే! అవే లోతైన కళ్ళు. ఆ లోతుల్లోకి లాక్కుపోయే అవే చురుకైన చూపులు! ఒక్కసారి ఒళ్ళంతా మునుపెన్నడూ ఎరగని గగుర్పాటు! డేజావూ!

ఆమె తనని చూడలేదు. చూస్తే మాత్రం గుర్తుపడుతుందా!

ఒకటా రెండా… ఐదారేళ్ళ కిందటి మాట!

గతం గుండ్రాలు గుండ్రాలుగా తిరుగుతూ తెరలు తెరలుగా రాజేష్ ముందు ప్రత్యక్షమయ్యింది.

ఆ రోజు…


కోయంబేడు ట్రాఫిక్ సిగ్నల్ అల్లంతదూరంలో పచ్చలైటు చూపిస్తోంది. అది ఎర్రగా మారడానికింకా మూడే మూడు క్షణాలు. ఈలోగా తనా సిగ్నల్ని దాటెయ్యాలి. ఆత్రంతో హోండా ఏక్సలరేటర్ పెంచాడు రాజేష్. వాయువేగ మనోవేగాలతో దాన్ని దాటాలని విశ్వ ప్రయత్నం చేసాడు. కానీ ప్రయోజనం లేకపోయింది. సరిగ్గా సిగ్నల్ దగ్గరకి వచ్చేసరికల్లా “నన్ను దాటి వెళ్తావా” అన్నట్టుగా అది కళ్ళెర్రజేస్తూ నిలుచుంది. ఎప్పుడూ ఇంతే! ఆగకుండా ట్రాఫిచ్ సిగ్నల్ని దాటిపోవడమన్నది ఒక గొప్ప ఘనకార్యం. అది సాధించినప్పుడు కలిగే ఆనందం ఓహ్! ఇంతా అంతానా!. ఆ ఆనందం ఇవాళ తృటిలో తప్పిపోయింది. తన పక్కనించే ఒక ఆటో, మరో సుజుకీ – అక్కడొక సిగ్నలు ఉందనికానీ అది ఆగమని మూగగా సైగచేస్తోందని కానీ పట్టించుకోకుండా దూసుకుపోయాయి. సిగ్నల్ని ఖాతరు చెయ్యకుండా బండిని పోనిచ్చే నైపుణ్యం, ధైర్యం కొంతమందికే ఉంటాయి. తనకా రెండూ లేవు. ఆ లోపానికి తనూ తనలాంటివారూ పెట్టుకున్న అందమైన పేరు సిన్సియారిటీ – నిబద్ధత! ఆత్మ పరిశీలన మొదలుపెట్టాడు రాజేష్. ఉదయం ఎనిమిదింటికే నెత్తెక్కుతానంటూ గుర్రుగా గుడ్లురిమి చూస్తున్నాడు వేసవి సూరీడు.

ట్రాఫిక్ భూతం ఊదే పొగతో గాలి మరింత వేడెక్కింది. ఈ కాలుష్యాన్ని భరిస్తూ బైక్ మీద, రెండు నిమిషాలే ఐనా, కూర్చోవడమంత పెద్ద పరీక్ష మరొకటి లేదు. నరకంలో శిక్షలు పెండింగున్న పుణ్యపురుషులకి మళ్ళీ భూమ్మీద పుట్టేటప్పుడు ఇలాటి శిక్షలు యముడు సిఫార్సుచేస్తే బ్రహ్మ నుదుటిపై రాస్తాడు కాబోలు. రాజేష్ ఆలోచనలుకూడా వేడెక్కుతున్నాయి.

మనసుని కంట్రోల్ చేయగలిగే ట్రాఫిక్ సిగ్నల్ని ఇంకా ఎవరూ కనిపెట్టలేదు కదా! ట్రాఫిక్ సిగ్నల్ని ఖాతరుచెయ్యని వాళ్ళని చూసి కొందరు కుళ్ళుకుంటూ ఉంటారు. రూల్సు పాటించని ప్రబుద్ధులని చూస్తూకూడా ఏమీ చెయ్యలేని ట్రాఫిక్ సిగ్నల్ మీద కోపం ప్రకటిస్తారు. ఈ ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థని సమూలంగా నాశనంచెయ్యాలని వీళ్ళ కోరిక. కొంతమంది మితవాదులూ లేకపోలేదు. సిగ్నల్ని పట్టించుకోనివాళ్ళని శిక్షించాలిగానీ, ఉరుమురిమి మంగలమ్మీద పడ్డట్టు ట్రాఫిక్ సిగ్నల్సునే పీకెయ్యమనడం ఏం సబబని వాళ్ళవాదన. అవికుడా లేకపోతే అసలు తాము రోడ్డుమీద తిరగనేలేమేమోనని వాళ్ళ భయం! తను మాత్రం ఇలాటి భావజాలాలు వేటికీ లొంగడు. సిగ్నల్ పచ్చరంగు చూపించిందా – తనకి తోవనిస్తూ ఇరువైపులా ఆగిన జనాన్ని చూసి ఒకింత గర్వం. ఇదిగో ఇలా తనే ఆగాల్సి వచ్చినప్పుడు మాత్రం గొప్ప చిరాకు. అంతే…

రాజేష్ ఆలోచనలకి బ్రేక్ వేస్తూ, సిటీ బస్సొకటి కీచుమంటూ పక్కగా వచ్చి ఆగింది. అసలే చిరాగ్గా ఉన్న రాజేష్ కి ఆ సిటీ బస్సు గోల మరింత చికాకు కలిగించింది. అసలీ సిటీ బస్సులే సగం రోడ్డునాక్రమిస్తాయి – మనసులో అక్కసంతా చూపుల్లోకి తెస్తూ విసుగ్గా చూసాడా బస్సుని. గబ్బిలాల్లా పట్టుకొని వేళాడే జనాలతో అటుపక్కకి ఒరిగిపోయి ఉందది. టిక్కట్టుకొనని గాలిని మాత్రం ఎందుకు లోపలకి రానిస్తావనట్టుగా జనం కిక్కిరిసి ఉన్నారు. ఆ జనాన్ని చూస్తూ చక చకా సాగిపోతున్న రాజేష్ చూపులు రెడ్ సిగ్నల్ పడ్డట్టు ఒకచోట ఆగిపోయాయి. మబ్బుల్లో మెరుపు తీగలా తళుక్కుమని అక్కడొక అమ్మాయి కనిపించింది. ఒద్దికగా తలదించుకుని కూర్చొని ఉంది. “అంత రద్దీలోనూ అలా కుదురుగా, ప్రశాంతంగా ఎలా కూర్చుందో!” ఆశ్చర్యపోయాడు రాజేష్. ఈ మధ్య బొంబాయి నుంచి దిగుమతై తెలుగు సినీ సామ్రాజ్యాన్ని ఏలేస్తున్న హీరోయిన్లంత అందంగా లేకపోయినా, మంచి కళగల రూపమే! అనుకున్నాడు. చూడ్డనికి కాలేజీ స్టూడెంట్లా లేదు. బహుశా ఏదో చిన్న కంపెనీలో చిన్న సైజు ఉద్యోగం చేస్తూ ఉండుంటుంది, పొట్టకూటి కోసం. పాపం బస్సులో ఇలా అవస్థ పడుతూ ప్రతి రోజూ ఆఫీసుకి వెళ్ళి వస్తుంది కాబోలు!

ఆమె గురించిన అంచనాలతో రాజేష్ ఆలోచనలు పరుగందుకున్నాయి. టెలీపతీ ఒక సూడో సైన్స్ అని కొట్టిపారేసే రాజేష్ కి అప్పుడు నమ్మాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ అమ్మాయి ఒక్కసారి ఇటు తలతిప్పింది. “తననే చూస్తోందా!” అనుకున్నాడు. ఇప్పుడు ముఖం స్పష్టంగా కనపడుతోంది. లోతైన పెద్ద కళ్ళు. ఆ లోతుల్లోకి లాక్కుపోయే చురుకైన చూపులు. నిజంగానే అవి తననెక్కడికో లాక్కుపోతున్నాయి…

కోయంబేడు జంక్షన్ హఠాత్తుగా గంధర్వ లోకంగా మారిపోయింది. అందులో ఒక మనోహరమైన ఉద్యానవనం. ఆ తోటలో… తను, ఆమె… “ఆమె కనులలో అనంతాంబరపు నీలినీడలు కలవు… ఎదియొ అపూర్వ మధుర రక్తి స్ఫురించుగాని అర్థమ్ము కాని భావగీతమ్ములవి…” వెనక తనకి ప్లేబేక్ పాడుతూ గిరజాల కవిరాజు!

అలా స్వప్నలోకాలలో తేలిపోతున్న రాజేష్ “సార్! సార్! ఇది ఒన్నే ఒన్ను ఎడ్తుకోంగ సార్!” అన్న దీనమైన పిలుపుతో అమాంతం ఈ లోకంలోకి వచ్చి పడ్డాడు. ఎదురుగా ఒక చిన్న కుర్రాడు. చేతిలో చిన్నగా రెప రెపలాడుతున్న మూడు రంగుల జండా! ఇదో రకం అడుక్కోవడం! ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర వీళ్ళ న్యూసెన్సు ఎక్కువైపోయింది. తన అందమైన కలని పాడుచేసిన వాడిమీద రాజేష్ కి సహజంగానే కోపం వచ్చింది. అంతలోనే ఆ అమ్మాయి గుర్తుకు వచ్చి అటుచూసాడు. ఆమె తననీ, ఆ కుర్రాడినీ చూస్తున్నట్టుంది. ఆ చూపుల్లో జాలి జాలువారుతోంది. తనకా మధ్య తరగతి అమ్మాయిమీద జాలైతే ఆ అమ్మాయికి ఈ పేద కుర్రాడి మీద జాలన్నమాట! తన జాలిగుండెను ఆ ఆమ్మాయి ముందు విప్పి పరచడానికి ఇదొక మంచి అవకాశం.

రేటెంతని అడిగాడా కుర్రాడిని. “అంజిరువా సార్” చెప్పాడు. “”అంజిరువాయా! ఎదుకు? రెంణ్రువాకి కుడు”. ఆ చిన్న కుర్రాడిని దబాయించడానికి రాజేష్ కి వచ్చిన ఆ మాత్రం తమిళం సరిపోయింది. వచ్చిందే బేరం అని ఆ కుర్రాడు రెండ్రూపాయలు తీసుకొని జెండా ఒకటి చేతిలో పెట్టిపోయాడు.

చేతిలో ఆ జెండా ఎగరేస్తూ అమ్మాయివైపు తిరిగిచూసాడు. ఆమె పెదవులు చిన్నగా విచ్చుకున్నాయి. మధ్య తరగతి మందహాసం ఇంతందంగా ఉంటుందని అప్పుడే తెలిసింది!

రాజేష్ గుండె కాస్తంత ఉబ్బింది.

మళ్ళీ తన మధురోహలని భగ్నం చేస్తూ ఒక వెండి హ్యుండై కారు వచ్చి పక్కనే ఆగింది. కొత్త కారేమో, సూర్య కాంతిలో మిలమిలా మెరుస్తూ ముచ్చటేసింది. దాన్నుంచి చూపు తిపూకోడం అంత సులువుకాలేదు. అయినా, శ్రమైకజీవన సౌందర్యానికి సమానమైనది లేనే లేదని గుర్తుకు వచ్చి, ఆ అమ్మాయి వైపు మళ్ళీ చూపు మరల్చాడు రాజేష్. ఒకవైపు హ్యుండై మరో వైపు బస్సు. మధ్యలో బైక్ మీద తను.

ఇప్పుడు తనే ఓ మధ్యతరగతి వాడైపోయినట్టుగా అనిపించింది రాజేష్ కి!

“ఆ కారులో కూడా తనలాంటి నవ యువకుడే ఉన్నాడేమో? అతడు కూడా తనలాగే ఆ అమ్మాయిని చూస్తున్నాడేమో! ఆ అమ్మాయి కాని ఆ అబ్బాయిని చూడగలిగితే … ఎండలో చెవటోడుతున్న తన ముఖం ఇక చూస్తుందా! వామ్మో! అలా జరక్కుండా ఎలాగైనా సరే ఆపాలి.”

కారులో వాళ్ళకి ఆ అమ్మాయి కనపడకుండా బండి కాస్త ముందుకి పోనిచ్చి అడ్డంగా ఆపాడు. “అయినా… తనలాంటి అప్పర్ మిడిల్ క్లాసు వాళ్ళే కింద తరగతుల వాళ్ళని ఆదుకొని పైకి తీసుకురావాలి కానీ, కారులో వెళ్ళే మహారాజులు వీళ్ళ మొహాలైనా చూస్తారా!” లేని ధీమా తెచ్చుకున్నాడు రాజేష్.

అంతలో సిగ్నల్ పడే సూచనగా గుప్పుమని పొగవదుల్తూ బస్సు గేరు మార్చింది. ఆ పొగలోంచి పొగ పీలుస్తూనో వదుల్తూనో చేతిలో సిగరెట్టుతో ఒక వ్యక్తి చాయగా ప్రత్యక్షమయ్యాడు రాజేష్ కి. అతని గొంతులోంచి ఏవో మాటలు ఆవేశంగా వినిపించాయి…

“నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను.
నేను సైతం విశ్వ వీణకు తంత్రినై మూర్చనలు పోతాను!”

ఆ మాటలు రాజేష్ ని విపరీతంగా కదిలించేసాయి. అంతే! అప్పటికప్పుడే ఒక అమోఘమైన నిర్ణయం తీసేసుకున్నాడు. “ఎలాగైనా ఈ అమ్మాయిని పెళ్ళిచేసుకుంటాను. ఈ బస్సు జీవితం నుండి ఆమెకి శాశ్వతంగా విముక్తి కలిగిస్తాను”, దృఢంగా నిశ్చయించుకున్నాడు కామ్రేడ్ రాజేష్!

అంతలోనే “ఆమె తెలుగమ్మాయేనా?” అన్న అనుమానం ఒకటి పొటమరించింది! తనకి తెలుగుపై అభిమానం ఎక్కువ. ఈమె తమిళమ్మాయయైతే ఎలా? ఒక్క క్షణం డైలమాలో పడ్డాడు.

“ఐనా ఆ మొహం చూస్తే తెలుగు కళ ఉట్టిపడుతోంది.”, తనకి తాను సముదాయించుకున్నాడు.

ఇంతలో పుణ్యకాలం కాస్తా గడిచిపోయింది. అంత తొందరగా గ్రీన్ సిగ్నల్ పడ్డందుకు మొదటిసారిగా బాధపడ్డాడు రాజేష్. కానీ మనుషుల ఇష్టాయిష్టాలతో సంబంధంలేని నిష్ఠ ఆ ట్రాఫిక్ సిగ్నల్ ది.

పక్కనున్న హ్యుండై సాఫీగా కదిలి వెళ్ళిపోయింది.

ఆ వెంటనే బస్సుకుడా బయలుదేరి తిన్నగా వెళిపోయింది. తనా బస్సుని ఫాలో చేద్దామన్నంత ఆవేశం వచ్చింది కానీ – ఐదునిమిషాలు లేటైతేనే చూపుల్తో గుచ్చి గుచ్చి చంపేసే తన మేనేజరాక్షసుడు గుర్తుకు వచ్చి ఆ సాహసం చెయ్యలేకపోయాడు. పైగా ఈ రోజే తను పూర్తి చెయ్యాల్సిన సాఫ్టువేరు ప్రొగ్రాముకి చావుగీత (అదే dead line) కూడానూ.

ఆమెనే తలచుకుంటూ, వెళ్ళలేక వెళ్ళలేక, తన ఆఫీసు దిక్కుగా బైక్ పోనిచ్చాడు. ఐనా తననుకున్నది అంత సులువుగా వదిలిపెట్టే నైజం కాదతనిది. ఆ మర్నాడు సరిగ్గా ముందురోజు వచ్చిన సమయానికే ఆ సిగ్నల్ దగ్గరకి వచ్చాడు. మళ్ళీ ఆ బస్సు, బస్సులో ఆ అమ్మాయి కనపడకపోతారా అని. ఈ సారి సిగ్నల్ పచ్చ రంగు చూపించింది. మర్నాడూ అదే తంతు!

ఈ ట్రాఫిక్ సిగ్నల్ నామీద పగపట్టినట్టుందే అనుకున్నాడు. ఐనా “పట్టువదలని విక్రమార్కుడు చెట్టువద్దకు తిరిగి వచ్చి” అన్న రీతిలో అ తర్వాత రోజూ అలాగే వచ్చాడు. ఆ రోజు రెడ్ సిగ్నల్ పడింది, కానీ బస్సు రాలేదు. ఆ తర్వాత రోజు బస్సు వచ్చింది కాని ఆ అమ్మాయి లేదు.

అలా ఆ అమ్మాయికోసం ఒక రెండు వారాలు ఆ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గరే ఎండలో మాడుతూ ఎదురుచూసాడు. ఐనా పాపం! అతని ప్రేమ మీద ఆ బస్సుకి కానీ, ఆ బస్సు గమనాన్ని నియంత్రించే ట్రాఫిక్ సిగ్నల్ కి కానీ, మనుషుల జీవితాలనే నియంత్రించే ఆ పై దేవుడికి కానీ కనికరం కలగినట్టు లేదు! ఆమె మళ్ళీ కనపళ్ళేదు. తర్వాత మెల్లగా కాలం మాత్రం కనికరం చూపించి, ఆమె తలపులని అతని స్మృతి పథంలోంచి చెరిపేసింది. మళ్ళీ ఇక్కడ, ఇప్పుడు, ఇలా…


“It’s turning green. Let’s go Rajesh!” అన్న శ్రీదేవి పిలుపుతో గుండ్రాలు రివర్సులో తిరిగి తిరిగి వర్తమానంలోకి అడుగుపెట్టాడు రాజేష్. ఎదురుగా బస్సులో ఆమె ఇంకా అలాగే కూర్చుని ఉంది. అచ్చం ఆమె లాగే కుదురుగా ఆమె ఒళ్ళో కూర్చున్న నాలుగేళ్ళ బాబు.

“ఓహో, ఆమెకి పెళ్ళైపోయినట్టుంది. అవకపోతే మాత్రం తనిప్పుడు ఉద్ధరించగలిగిందేముంది కనక? తనకి కూడా రెండేళ్ళ క్రితమే, తన ఆఫీసులోనే పని చేస్తున్న తెలుగమ్మాయి, శ్రీదేవితో పెళ్ళి జరిగిపోయింది.”

సిగ్నల్ ఇవ్వడంతో బస్సు బయలుదేరి తిన్నగా వెళ్ళిపోయింది.

“ప్చ్చ్… కొందరి జీవితాలంతే…” మనసులోనే పెద్దగా నిట్టూరుస్తూ బయలుదేరాడు రాజేష్. అతని సరికొత్త వెండి హ్యుండై కారు వాళ్ళ ఆఫీసు దిక్కుగా సాఫీగా కదిలిపోయింది. ట్రాఫిక్ సిగ్నల్ ఎప్పటిలాగే తన పని తాను చేసుకుంటూ అక్కడే నిలబడిపోయింది!